• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ ప్రవేశిక - మూలతత్వం

   భారత రాజ్యాంగం ప్రవేశిక (Preamble)తో ప్రారంభమవుతుంది. దీన్ని రాజ్యాంగానికి మూలతత్వం, ఉపోద్ఘాతం, ఆత్మ, పీఠికగా పేర్కొంటారు. 1946, డిసెంబరు 13న రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన చారిత్రక లక్ష్యాలు, ఆశయాల తీర్మానం మన రాజ్యాంగ ప్రవేశికకు మూలంగా చెప్పవచ్చు.


   మనదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. ప్రవేశిక భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి దిక్సూచిలా ఉపయోగపడటమే కాకుండా, రాజ్యాంగ తాత్విక పునాదులను వెల్లడిస్తుంది.

 

ప్రవేశికకు ప్రేరణను అందించిన అంశాలు
* అమెరికా విప్లవం - రాజ్యాంగ ప్రవేశికను అమెరికా నుంచి గ్రహించాం.
* ప్రవేశికకు మూలాధారమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే భావనలను ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకున్నాం.

* సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను రష్యా విప్లవం నుంచి సంగ్రహించాం.
* జవహర్‌లాల్ నెహ్రూ అందించిన 'చారిత్రక లక్ష్యాల, ఆశయాల తీర్మానం' రాజ్యాంగ రూపకర్తలకు ప్రవేశికను రూపొందించడంలో దిక్సూచిలా పనిచేసింది.

 

ప్రవేశికలోని సారాంశం
  భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వాసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనల్లో స్వాతంత్య్రాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని 26 నవంబరు, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.

 

ప్రవేశిక - అర్థ వివరణ
  భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రొఫెసర్ జె.ఆర్. శివాక్ 'నాలుగు' విభాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి:

 

1. అధికారానికి మూలం:
  భారత ప్రజలమైన మేము చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించి, అంగీకరించి, చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం. దీని ప్రకారం భారత రాజ్యాంగం ప్రజలకు బాధ్యత వహించే వ్యవస్థను రూపొందించింది. అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారానికి మూలం 'ప్రజలు'.

 

2. ప్రభుత్వ స్వరూపం: 'సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర'గా పేర్కొన్నారు.

సార్వభౌమాధికారం:
   భారతదేశం 1947, ఆగస్టు 15న సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. దీని ప్రకారం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదు. మనదేశం కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం పొందినప్పటికీ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఆ కూటమి నుంచి స్వచ్ఛందంగా మనం బయటకు వచ్చేయొచ్చు. ప్రపంచ దేశాలతో స్నేహం, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఐక్యరాజ్యసమితి (UNO)లో మనం సభ్యత్వం తీసుకున్నాం. అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశం సభ్యత్వం తీసుకున్నప్పటికీ భారతదేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదు.

 

సామ్యవాదం
   1955లో మద్రాసు సమీపంలోని ఆవడి వద్ద జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తమ లక్ష్యం అని మన తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికను సవరించి 'సామ్యవాద' అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు. 'సామ్యవాదం' అంటే ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించి, వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించడం.
1982లో సుప్రీంకోర్టు డి.ఎస్.నకార Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిస్తూ, ఆర్థిక, సాంఘిక, జీవన ప్రమాణాల అసమానతలను రూపుమాపడం, కార్మికులందరికీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు సరైన జీవన ప్రమాణాన్ని సమకూర్చడమే 'సామ్యవాద లక్ష్యం' అని పేర్కొంది.

లౌకికతత్వం:
   ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక (Secular) అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. దీని ప్రకారం రాజ్యానికి అధికార మతం ఉండదు. మత వ్యవహారాల్లో రాజ్యం తటస్థంగా ఉంటుంది. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ ధనసహాయం పొందే విద్యాలయాల్లో మతబోధన నిషేధం. మనదేశం అనాదికాలం నుంచి మతసామరస్యాన్ని అనుసరిస్తుంది. భారతదేశం బౌద్ధ, జైన మతాలకు పుట్టినిల్లు. విభిన్న మతాలు మనదేశంలో వర్థిల్లుతున్నాయి.
   ఎస్.ఆర్.బొమ్మైVs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణమని పేర్కొంది.

 

ప్రజాస్వామ్యం
  అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యం అంటే 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం'. ఆర్టికల్ 326 ప్రకారం మనదేశంలో 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షతో సంబంధం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రజల విశ్వాసం మేరకే ప్రభుత్వాల మనుగడ కొనసాగుతుంది. దీనిలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రజలు పౌరులుగా ఎదుగుతారు.

  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 1952లో జరిగిన తొలి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో 17.32 కోట్లమంది ఓటర్లు ఉండగా, 2014 నాటి 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి వారి సంఖ్య 83 కోట్లకు చేరింది.
 

గణతంత్ర రాజ్యం:
భారతదేశం 1950, జనవరి 26న గణతంత్ర రాజ్యంగా (Republic) అవతరించింది. దీని ప్రకారం సర్వోన్నతాధికారం ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు ఉంటుంది. రాజ్యాధినేత వారసత్వంగా కాకుండా, నిర్ణీత పదవీకాలానికి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్థతిలో ఎన్నిక అవుతాడు.
ఉదా: భారత రాజ్యాధినేత రాష్ట్రపతిని నిర్ణీత పదవీ కాలానికి ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

 

3. రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు:
    ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సంఘ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం వీటి లక్ష్యం.
    సామాజిక న్యాయాన్ని సాధించే అంశాలను - ప్రాథమిక హక్కుల్లోనూ
    ఆర్థిక న్యాయాన్ని సాధించే అంశాలను - ఆదేశిక సూత్రాల్లోనూ
    రాజకీయ న్యాయాన్ని సాధించే అంశాలను - ఎన్నికల ప్రక్రియలోనూ పొందుపరిచారు.

 

4. చట్టం అమల్లోకి వచ్చిన తేది:
1949 నవంబరు, 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది.

కీలకమైన ఆదర్శాలు

స్వేచ్ఛ (Liberty)
   ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో స్వేచ్ఛ కీలకమైంది. ప్రతి పౌరుడికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో 6 రకాల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పొందుపరిచారు.

 

సమానత్వం (Equality)
 పుట్టుకతో మానవులంతా సమానమే. అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి ప్రతి వ్యక్తి తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడమే సమానత్వం.

 

సౌభ్రాతృత్వం ((Fraternity)
 సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర సోదర భావం, గౌరవ భావం ఉండాలి. 1948, డిసెంబరు 10న ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పేర్కొన్న సౌభ్రాతృత్వ భావన ఆధారంగా సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరిచాలని ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 51 ప్రకారం ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని, స్నేహ భావాన్ని పెంపొందించడానికి కృషి జరుగుతుంది.

జాతీయ ఐక్యత, సమగ్రత (Unity and Integrity)
  దేశంలోని ప్రజలందరూ కలిసి ఉండటానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, జాతీయ ఐక్యత తప్పనిసరి.
  సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికలో పొందుపరిచింది. సమగ్రత ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది.
  మన దేశంలో 1970వ దశకంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. వీటి ఫలితంగా సమగ్రత అనే పదాన్ని ప్రవేశికకు చేర్చారు. దీని ప్రకారం భారత సమాఖ్య నుంచి ఏ ఒక్క ప్రాంతం లేదా రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు. ఐక్యత, సమగ్రతల ప్రధాన లక్ష్యం వేర్పాటువాదాన్ని ఖండించడం.
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా?

 

బెరుబారి కేసు - 1960
  బెరుబారి అనేది భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ భాగాన్ని భారత్ - పాకిస్థాన్ మధ్య మార్పిడి విషయంలో వచ్చిన విభేదాల విషయమై అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 

కేశవానంద భారతి కేసు Vs కేరళ రాష్ట్రం - 1973
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చునని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదని పేర్కొంది. న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని మౌలిక అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు - 1995
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

 

ప్రవేశికపై సమీక్ష
  రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ లేదు. ప్రవేశికలో పొందుపరిచిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటి అమలు కోసం పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. అయితే రాజ్యాంగాన్ని సక్రమంగా వాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి.

 

రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు:
 ''ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణం, రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది" - పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ.
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది" - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
* ''ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం" - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది" - జె.డయ్యర్
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక (key note) లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను" - ఎర్నెస్ట్ బార్కర్
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు" - మహావీర్ త్యాగి
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం" - డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది" - ఎమ్.ఎ.నానీ పాల్కీవా
* ''భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వంతంత్ర ప్రకటనలా రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ, స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు" - జస్టిస్ హిదయతుల్లా
* ''రాజ్యాంగ ప్రధానాంశాల లక్షణ సారం" - ముధోల్కర్
* ''అమెరికా స్వతంత్ర ప్రకటనకు, అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది" - కె.ఆర్. బాంజ్‌వాలా
* ''ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ" - జవహర్‌లాల్ నెహ్రూ


 

ప్రవేశికలోని ప్రధాన పదాలకు వర్తించే భాగాలు, ప్రకరణలు
* సంక్షేమ స్వభావం - 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలు
* లౌకికతత్వం - 3వ భాగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ప్రకరణలు మత స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా, లౌకిక భావనలను పెంపొందించడానికి వీలుగా హామీ ఇస్తున్నాయి.
* ప్రజాస్వామికత - 15వ భాగంలోని ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కును, నిర్ణీత కాలానికి ఎన్నికలను జరపడాన్ని తెలియజేస్తుంది.
* గణతంత్ర - 5వ భాగంలోని ఆర్టికల్ 54 ప్రకారం ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి దేశాధినేతగా ఉంటారు.
* భావ ప్రకటనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రాలను కల్పించారు.
* విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 25లోని మత స్వాంతంత్య్రాపు హక్కు వీటిని కల్పిస్తుంది.
* హోదా, అవకాశాల్లో సమానత్వం - ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే.
* ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా రక్షణ
* ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు
* ఆర్టికల్ 39 ప్రకారం సమాన పనికి సమాన వేతనం
* ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు
* వ్యక్తి గౌరవం - సౌభ్రాతృత్వం - 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి గౌరవానికి హామీ ఇస్తున్నాయి.
* 4వ భాగంలోని ఆర్టికల్ 51 (ఇ) - భారత ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించి సోదర భావాన్ని కల్పిస్తుంది.
* ఆర్టికల్ 42 - పనిచేసేచోట సరైన పని పరిస్థితులు కల్పించడం.
* ఆర్టికల్ 43 - గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి.

ప్రవేశికను సవరించగలమా?
  1973 నాటి కేశవానంద భారతి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది. ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
ప్రవేశికకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, వాటి సారాంశం

 

ఎ.కె.గోపాలన్ కేసు - 1950
* ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది.

 

బెరుబారి యూనియన్ కేసు - 1960:
* ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగం కాదు.

 

గోలక్‌నాథ్ కేసు: 1967
* ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలు, ఆశయాలకు సూక్ష్మరూపం.

కేశవానందభారతి కేసు: 1973
* ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ఇది మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది.

 

ఎక్సెల్‌వేర్ కేసు: 1979
* ప్రవేశికలోని సామ్యవాద పదానికి నిర్వచనాన్ని ఇచ్చింది.

 

మినర్వా మిల్స్ కేసు : 1980
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

 

డి.ఎస్. నకారా కేసు: 1983
* సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజంల కలయిక.

 

ఎస్.ఆర్. బొమ్మై కేసు: 1994
* లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం

 

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు: 1995
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

 

అశోక్ కుమార్ గుప్తా కేసు: 1997
* సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు.
* అన్ని మతాల పట్ట సమాన దృక్పధాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ కేసు: 1975
* ప్రవేశికలోని చట్ట సమానత్వం మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా ఉంటుంది.

 

పాల్ Vs కొచ్చిన్ యూనివర్సిటీ కేసు
ప్రవేశికలో పొందుపరిచిన అంశాలన్నీ మనకు మార్గదర్శకాలే అయినందున ప్రవేశికను మన రాజ్యాంగానికి మార్గదర్శకంగా భావించవచ్చు.

చరణ్ లాల్ సాహు Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ప్రత్యక్షంగా అమలుపరచడం సాధ్యం కాదు. వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి అమలు చేయాలి.

ఎస్.లింగప్ప Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
సామాజిక న్యాయం అనే అంశం సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. మన దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలి.

అరుణారాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* భారతదేశం అనుసరించే లౌకిక విధానం సకారాత్మకమైంది. వివిధ మత ప్రవక్తలకు సంబంధించిన భావాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం తప్పేమీ కాదు.

వాసుదేవ్ Vs వామన్‌జీ కేసు
* మన రాజ్యాంగంలోని లౌకికవాదం అనే భావన సకారాత్మకమైంది. అంటే అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:
 దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా, ప్రైవేటీకరణ కారణంగా సామ్యవాద పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదు.

సహజ న్యాయ సిద్ధాంతం
* సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని జస్టిస్ పి.డి.దినకర్ Vs జడ్జస్ ఎంక్వైరీ కమిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో 2011లో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
''భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక అనే వెలుగులో పరిష్కరించుకోవాలి" - జస్టిస్ హిదయతుల్లా

 

రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం
1967 నాటి గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, వాటిని సవరించాలంటే ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు. ఈ తీర్పును అధిగమించడానికి పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణను చేసింది.

1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు:
1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. ఈ తీర్పునే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రవచించిన కేసుగా ప్రస్తావిస్తారు. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.సిక్రి.

 

ఈ కేసు సందర్భంగా మౌలిక స్వరూప లక్షణాలను కింది విధంగా పేర్కొన్నారు:
* రాజ్యాంగ ఆధిక్యం
* ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రభుత్వం
* రాజ్యాంగ పరంగా లౌకిక స్వభావం
* శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య అధికార పృథక్కరణ
* సమాఖ్య లక్షణం
* వైయక్తిక స్వేచ్ఛ
* భారతదేశ సార్వభౌమాధికారం, ఏకత్వం
* ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ వ్యవస్థను కలిగి ఉండటం.
* రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి 1980 నాటి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కింది అంశాలను మౌలిక స్వరూప లక్షణాలుగా పేర్కొన్నారు.
* పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణాధికారం
* న్యాయసమీక్ష
* ప్రాథమిక హక్కులు, ఆదేశసూత్రాలు మధ్య సమతౌల్యం
* రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టింది సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు (1965) లో జస్టిస్ జనార్ధన్ రఘునాథ్ ముధోల్కర్.
* ఐ.ఆర్.కొయల్హో Vs తమిళనాడు కేసు (2007)లో కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడిన తర్వాత IXవ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల రాజ్యాంగ బద్ధతను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చునని పేర్కొంది.
* 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు సుప్రీంకోర్టు ఉన్న న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 1980లో మినర్వా మిల్స్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు లేదని 42వ రాజ్యాంగ సవరణలోని ఆ అంశాన్ని కొట్టివేసింది. న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది.
* వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా కింది అంశాలను అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
* జాతి ఐక్యత, సమగ్రత
* న్యాయసమీక్ష
* రాజ్యాంగ సంక్షేమ స్వభావం
* రాజ్యాంగ లౌకికత్వం
* రాజ్యాంగ ఆధిక్యం
* నిష్పక్షపాత ఎన్నికలు
* సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థ
* పార్లమెంటరీ వ్యవస్
* రాజ్యాంగ సమాఖ్య స్వరూపం
* సామాజిక, ఆర్థిక న్యాయం
* స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
* హేతుబద్ధత
* శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అధికార పృథక్కరణ
* వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవం
* న్యాయాన్ని పొందే హక్కు
* ప్రాథమిక హక్కులు, నిర్ధేశిత నియమాల మధ్య సమన్వయం
* సమానహోదా, సమాన అవకాశాలు
* వైయక్తిక స్వేచ్ఛ
* ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసు (1975)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయస్థానం ముందుకు వచ్చిన కేసును బట్టి రాజ్యాంగ మౌలిక లక్షణం నిర్ణయించబడుతుందని పేర్కొంది.

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌