• facebook
  • whatsapp
  • telegram

బ్రిటిష్ పాలనలో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలు

వ్యాపారం కోసం వచ్చిన ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుని, క్రమంగా పరిపాలనాధికారాన్ని హస్తగతం చేసుకుంది. భారతీయుల అనైక్యత, స్వార్థపరత్వం, పరస్పర ఈర్ష్యాద్వేషాల వల్ల ప్లాసీ, బక్సార్ యుద్ధాల్లో విజయం సాధించిన ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య విస్తరణకు పూనుకొంది. అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించింది. దీన్ని అదుపు చేయడానికి, బ్రిటన్ అవసరాలకు అనుగుణంగా మలచుకోవడానికి బ్రిటన్ అనేక రాజ్యాంగ సంస్కరణలు చేపట్టింది. బ్రిటన్ చేపట్టిన రాజ్యాంగ సంస్కరణల గురించి వివరంగా తెలుసుకుందాం.
         ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరిగిన మొదటి రాజ్యాంగ సంస్కరణ - 1773 రెగ్యులేటింగ్ చట్టం.

1773 రెగ్యులేటింగ్ చట్టం రావడానికి కారణాలు
ఈస్టిండియా కంపెనీ లోపాలు: క్రీ.శ. 1600లో భారతదేశంలో వ్యాపారం కోసం బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో ఈస్టిండియా వ్యాపార కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీ ఉద్యోగులకు స్వల్పజీతాలు ఉండటంతో బహుమతులు, లంచాలకు పాల్పడేవారు. కరవు కాలంలో ప్రజలను హింసించి, పీడించి పన్నులు వసూలు చేసేవారు. కంపెనీ ఉద్యోగులు అవినీతిపరులు కావడం, దురహంకారం, స్వార్థపరత్వం వల్ల కంపెనీ

దివాలా తీసే పరిస్థితికి చేరడంతో బ్రిటిష్ ప్రభుత్వాన్నే రుణం కావాలని అభ్యర్థించింది. 
*  ఈస్టిండియా కంపెనీ వ్యాపారం చేయడానికి మాత్రమే అనుమతి పొందింది. మరి ఆ కంపెనీ రాజ్యాధికారం చేపట్టవచ్చా? లేదా? అనే అంశంపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చలు జరిగాయి.
*  ఈస్టిండియా కంపెనీ, భారతదేశంలో స్వదేశీ రాజులతో యుద్ధాలు చేసేటప్పడు ఆ కంపెనీ పాలనలో ఉన్న మద్రాస్, బొంబాయి, బెంగాల్ రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించింది. 
*  పై కారణాలతో భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనను క్రమబద్ధం చేసేందుకు, కంపెనీ వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వ అజమాయిషీ కిందకు తెచ్చేందుకు 1773 లో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టమే రెగ్యులేటింగ్ చట్టం.
రెగ్యులేటింగ్‌చట్టం ముఖ్యాంశాలు: భారతదేశంలో బెంగాల్ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. నలుగురు సభ్యులున్న గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంటుంది. కంపెనీ పాలన సక్రమంగా జరగడంకోసం, నియమ నిబంధనలు చేయడానికి గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్‌కు అధికారం ఉంటుంది. 
*  శాంతి, యుద్ధం విషయాలకు సంబంధించి బొంబాయి, మద్రాస్ రాష్ట్రాలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి బెంగాల్ గవర్నర్ జనరల్‌కు అధికారం ఉంటుంది. 
*  యూరోపియన్లకు, వాళ్ల కింద పనిచేసే ఉద్యోగులకు, కలకత్తా పౌరులకు సంబంధించి న్యాయనిర్వహణ కోసం కలకత్తాలో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు.

సమీక్ష: గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్-సభ్యులు గవర్నర్ జనరల్‌కు సహకరించలేదు.
*  బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను బొంబాయి, మద్రాస్ గవర్నర్లు పాటించలేదు.
*  రెగ్యులేటింగ్ చట్టం చేసినా, ఈస్టిండియా కంపెనీ పరిపాలన అవినీతిపుట్టగా, ప్రజాకంటకంగా మారింది. 
*  రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలుండటం వల్ల, వాటిని సరిదిద్దేందుకు బ్రిటన్ ప్రధాని పిట్ ది యాంగర్ 1784 లో మరో చట్టం రూపొందించాడు. దీనినే పిట్ ఇండియా చట్టం అంటారు.

పిట్ఇండియా చట్టం (1784) ముఖ్యాంశాలు
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్థాపన: ఈ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలకు ఆరుగురు సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను లండన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సభ్యులలో ఇద్దరు బ్రిటిష్ మంత్రివర్గంలోని క్యాబినెట్ మంత్రులు.
          బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంపెనీ రికార్డులను తనిఖీ చేయవచ్చు. భారతదేశం నుంచి ఈస్టిండియా కంపెనీకి వచ్చిపోయే ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కు తెలియజేయాలి. 
* గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు. 
* మద్రాస్, బొంబాయి రాష్ట్రాలు యుద్ధం, దౌత్యం, రెవెన్యూ విషయంలో కచ్చితంగా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను పాటించాలి. 
*  భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల నియామకాలు మాత్రం కంపెనీ డైరెక్టర్లు మాత్రమే చేపడతారు.
పిట్ ఇండియా చట్టం - సమీక్ష: బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో క్యాబినెట్ మంత్రులు ఇద్దరు ఉండటం వల్ల కంపెనీ పరిపాలనపై బ్రిటిష్ పార్లమెంట్ అదుపు పెరిగింది. 
*  వ్యాపార విషయాలను కంపెనీ డైరెక్టర్లకు, రాజకీయాధికారాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కు దత్తత చేశారని చెప్పవచ్చు. 
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా కంపెనీ పాలనా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు నియంత్రణ, పర్యవేక్షణ బ్రిటన్‌కు సులభతరమైంది.
1793 చార్టర్ చట్టం: ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్‌కు, తన కౌన్సిల్ (సలహామండలి) ఇచ్చే నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం ఉండేది.

1813 చార్టర్ చట్టం: బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టం చేయడానికి కారణాలు: యూరప్‌లో ఎక్కువభాగం ఫ్రెంచి అధీనంలోకి రావడంతో ఇంగ్లండ్ వ్యాపారులు, యూరప్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు పెట్టుకోకూడదని ఫ్రెంచి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 
*  ఇంగ్లండ్‌లో స్వేచ్ఛా విధానం ప్రబలింది. దీంతో తూర్పు ఇండియా సంఘానికి మాత్రమే వ్యాపారంలో ఏకస్వామ్య హక్కులు కల్పించడాన్ని ఇంగ్లండ్ ప్రజలు, వ్యాపారులు నిరసించారు.
*¤  క్రైస్తవ మత ప్రచారానికి అనుమతి ఇవ్వాలని క్రైస్తవ మతాధికారులు బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.పై కారణాలతో 1813 లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టం తెచ్చింది.
1813 చార్టర్ చట్టం - ముఖ్యాంశాలు: భారత్‌లో ఈస్టిండియా కంపెనీకి ఉండే వ్యాపార ఏకస్వామ్య హక్కులను (గుత్తాధికారాన్ని) రద్దు చేశారు. బ్రిటిష్ పౌరులందరూ భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. అయితే భారత్‌తో తేయాకు వ్యాపారం, చైనాతో అన్నిరకాల వ్యాపారాలు చేసుకునే గుత్తాధికారం ఈస్టిండియా కంపెనీకి మాత్రమే ఇచ్చారు.
*  మొదటిసారిగా పాక్షికంగా స్వేచ్ఛాయుత వ్యాపారం ప్రారంభమైంది. 
*  భారతదేశంలో క్రైస్తవ మతప్రచారం కోసం అనుమతినిచ్చారు. 
*  భారత్‌లో విద్యాభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం ఒక లక్షరూపాయలు కేటాయించింది. 
* ఈస్టిండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, ఉద్యోగంలో చేరటానికి ముందు తప్పనిసరిగా శిక్షణను పొందాలనే నిబంధన విధించారు.

సమీక్ష: ఈ చట్టం ఆంగ్లేయులకు లాభదాయకంగా, భారతీయులకు నష్టంగా పరిణమించింది. ఈ చట్టం ద్వారా ఇంగ్లిష్ వ్యాపారులందరూ భారతదేశాన్ని దోపిడీ చేశారు. దేశం నుంచి కారుచౌకగా ముడి పదార్థాలు కొని, ఇంగ్లండ్‌లో యంత్రాల ద్వారా వస్తువులుగా చేసి, స్వల్ప దిగుమతి సుంకాలుండటంతో భారతదేశంలో సరసమైన ధరలకు వస్తువులనమ్మి, భారతీయ పరిశ్రమలను దెబ్బతీశారు. ఈ చట్టం ద్వారా భారతదేశాన్ని రాజకీయ బానిసత్వంతో పాటు, ఆర్థిక బానిసత్వంలో ఉంచారు. 
*  క్రైస్తవ మత ప్రచారకులు ఇతర మత సిద్ధాంతాలను విమర్శిస్తూ, క్రైస్తవ మతాన్ని అవలంబించాలని బలవంతం చేశారు. దీంతో ఆంగ్లేయుల పట్ల భారతీయులకు ద్వేషం పెరిగింది. ఈ విధంగా ఆర్థిక, మత ద్వేషాలు 1813 చార్టర్ చట్టంతో ప్రారంభమై 1857 నాటి తిరుగుబాటుకు దారితీశాయి.
1833 చార్టర్ చట్టంముఖ్యాంశాలు: ఈ చట్టం కింద ఈస్టిండియా కంపెనీకి ఉండే ఏకస్వామ్య వ్యాపార హక్కులు పూర్తిగా రద్దయ్యాయి. అంటే భారత్‌తో తేయాకు వ్యాపారం, చైనాతో అన్ని రకాల వ్యాపారాల్లోనూ కంపెనీ గుత్తాధిపత్యాన్ని పూర్తిగా తొలగించారు. 
* సంపూర్ణ స్వేచ్ఛాయుత వ్యాపారం ప్రారంభమయింది. 
* భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థ మరింత పటిష్ఠమైంది. 
* రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బెంగాల్ కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాల శాసన నిర్మాణ అధికారం రద్దయింది. 
* బెంగాల్ గవర్నర్ జనరల్‌ను బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. 
*  గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్‌లో నాలుగో సభ్యుడిని చేర్చారు. ఈయనకు న్యాయశాస్త్రంలో సమర్థత, అనుభవం ఉండాలి. మొదటి న్యాయసభ్యుడు లార్డ్ మెకాలే. 
*  గవర్నర్ జనరల్, నలుగురు సభ్యులు ఉన్న గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ శాసనసభగా వ్యవహరిస్తుంది. ఇది భారతదేశంలో ఆంగ్లేయుల స్వాధీనంలో ఉండే రాజ్య భాగాలన్నింటిపై శాసనాలు చేస్తుంది. 
*  బానిసత్వాన్ని నిషేధించారు. * భారతదేశంలో ఉద్యోగావకాశాల్లో కులమత భేదాలు పాటించకూడదనే నిబంధన విధించారు. 
*  దేశంలో ఉన్న విభిన్న శాసనాలను క్రోడీకరించేందుకు ఒక న్యాయసంఘాన్ని లార్డ్ మెకాలే నేతృత్వంలో ఏర్పాటు చేశారు.

సమీక్ష: సంపూర్ణ కేంద్రీకృత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేసే అధికారాన్ని కోల్పోయాయి. 
*  గవర్నర్-జనరల్ పదవిని పటిష్ఠం చేశారు. బెంగాల్ గవర్నర్ జనరల్‌ను బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్‌గా మార్చారు. 
వీరినే భారత రాజ్య కార్యదర్శి అంటారు (సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా). ఈయన బ్రిటన్ పార్లమెంట్‌కు బాధ్యతలు వహిస్తారు. భారత రాజ్య కార్యదర్శికి సహాయం చేసేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఇండియన్ కౌన్సిల్ ఉండేది.
మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ ఉడ్స్. ఆయన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చివరి అధ్యక్షుడిగా పనిచేశారు. 
గవర్నర్ జనరల్‌ను వైశ్రాయ్ అని కూడా పిలవవచ్చని చట్టంలో పేర్కొన్నారు. బ్రిటిషర్ల అధీనంలోని రాష్ట్రప్రభుత్వాలపై అజమాయిషీ చేసేటప్పుడు గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాలపై అధికారం చెలాయించేటప్పుడు వైశ్రాయ్ లేదా బ్రిటిష్ రాజప్రతినిధిగా వ్యవహరిస్తాడు. మొట్టమొదటి వైశ్రాయ్ లార్డ్‌కానింగ్.

సమీక్ష: ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పూర్తిగా అంతమైంది. 
* భారత ప్రభుత్వంపై అధికారాలను భారత రాజ్య కార్యదర్శికి అప్పజెప్పడంతో, గవర్నర్ జనరల్ ఆయనకు విధేయుడై ఉండాల్సి వచ్చింది. 
* భారతీయ పరిపాలనంతా బ్రిటన్ రాణి చేతుల్లోకి వెళ్లడంతో భారత పరిపాలనా వ్యవస్థ మరింత కేంద్రీకృతం అయింది.

రాజ్యాంగ సంస్కరణలు - ఈస్టిండియా కంపెనీ
ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల అవినీతిని, పరిపాలనను నియంత్రించడానికి 1773 లో రెగ్యులేటింగ్ చట్టం తెచ్చారు. అందులో లోపాలు ఉండటంతో కంపెనీని సమర్థంగా నియంత్రించేందుకు 1784 లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 1813 చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ ఏకస్వామ్య వ్యాపార హక్కులను పాక్షికంగా రద్దు చేశారు. 1833 చట్టం ద్వారా ఏకస్వామ్య హక్కులు పూర్తిగా రద్దయ్యాయి. చివరికి కంపెనీ ఉద్యోగ నియామకాన్ని కూడా 1853 చట్టం ద్వారా పోగొట్టుకుంది. 1857 సిపాయిల తిరుగుబాటువల్ల భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన అంతమైంది.

గవర్నర్ జనరల్స్
1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్, బెంగాల్ గవర్నర్ జనరల్‌గా అయ్యాడు. అదీ 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని బ్రిటిష్ ఇండియా గవర్నర్‌గా మార్చారు. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్‌ను, వైశ్రాయ్‌గా కూడా పిలిచారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటింక్, మొదటి బ్రిటిష్ ఇండియా వైశ్రాయ్ లార్డ్ కానింగ్. 
*  1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ - ఇన్ - కౌన్సిల్‌లో నలుగురు సభ్యులుండేవారు. ఎలాంటి నిర్ణయాలు అమలుచేయాలన్నా ముగ్గురి మాటే చెల్లుబాటవుతుంది (గవర్నర్ జనరల్‌తోసహా). 1784 పిట్ ఇండియా చట్టం ద్వారా కౌన్సిల్ సభ్యుల సంఖ్య 3 కు తగ్గించారు. దీంతో గవర్నర్ జనరల్‌కు ఒక సభ్యుడి మద్దతుతో నిర్ణయాలు అమలు చేసే అధికారం వచ్చింది. 1793 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్‌కు అతడి కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారాన్ని ఇచ్చారు. 1833 చార్టర్ చట్టం ద్వారా 4వ సభ్యుడిని తిరిగి చేర్చుకున్నారు. అయితే 4వ సభ్యుడు న్యాయ పరిజ్ఞానం కలిగినవాడై ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వాలు

1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బాంబే, మద్రాస్ రాష్ట్రాలు యుద్ధం, శాంతి విషయాల్లో బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలు పాటించాలి. 1784 పిట్ ఇండియా చట్టం ద్వారా తప్పనిసరిగా పాటించాలనే ఆదేశాలు జారీ చేశారు. 1833 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం (బెంగాల్) అధీనంలోకి వచ్చాయి. దీంతో శాసనాలు చేసే అధికారాన్ని కూడా కోల్పోయాయి.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌