• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన వాయువులు: ధర్మాలు, ఆవర్తనాలు

ఫ్లోరిన్ వాయువు

* ఫ్లోరిన్‌ వాయువు రసాయన ఫార్ములా: F2

* ఇది పసుపు రంగులో ఉంటుంది.

*ఇది నీటిలో కరుగుతుంది.

* ఫ్లోరిన్‌ వాయువు గాలి కంటే బరువైంది. ఇది  విష స్వభావం కలిగి ఉంటుంది.

* నీటిలో ఫ్లోరిన్‌ చురుగ్గా చర్య జరిపి హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌ (HF), ఆక్సిజన్‌ (O2), ఓజోన్‌ (O3) మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.

ఇతర హాలోజన్‌లతో పోలిస్తే ఫ్లోరిన్‌ అనేక ధర్మాలలో అసంగత ప్రవర్తనను ప్రదర్శిస్తుంది.

ఉదా: 1) ఇతర హాలోజన్‌లు ప్రదర్శించే విలువల కంటే అయనీకరణ ఎంథాల్పీ, రుణవిద్యుదాత్మక విలువలు ఫ్లోరిన్‌కు ఎక్కువగా ఉంటాయి.

2) సంయోజనీయ వ్యాసార్ధాలు, ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, బంధ విఘటన ఎంథాల్పీ విలువలు ఫ్లోరిన్‌కు తక్కువగా ఉంటాయి. 


ఫ్లోరిన్‌ అసంగత ప్రవర్తనకు కారణాలు

*చిన్న పరిమాణం

* అత్యధిక రుణవిద్యుదాత్మకత

* కనిష్ఠ F-F బంధ విఘటన ఎంథాల్పీ.

* బాహ్య కర్పరంలో  d - ఆర్బిటాళ్లు లేకపోవడం

* ఫ్లోరిన్‌ వాయువు హైడ్రోజన్‌తో చర్య జరిపి హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌ను ఏర్పరుస్తుంది.

* పొటాషియం హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌ (KHF2)ని విద్యుద్విశ్లేషణ చెందించి ఫ్లోరిన్‌ను తయారు చేస్తారు.


క్లోరిన్‌ వాయువు

* క్లోరిన్‌ వాయువు రసాయన ఫార్ములా: Cl2

*క్లోరిన్‌ పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

* ఇది ఘాటైన వాసన గల వాయువు. దీనికి విష స్వభావం ఉంటుంది.


* బ్రైన్‌ ద్రావణాన్ని(Brine solution)విద్యుద్విశ్లేషణ చేసి క్లోరిన్‌ వాయువును తయారు చేయవచ్చు.

* క్లోరిన్‌ నీటిలో సులభంగా కరిగి ‘క్లోరిన్‌ జలం’ అనే ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడే తయారు చేసిన క్లోరిన్‌ జలంలో ‘హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (HCl),హైపోక్లోరస్‌ ఆమ్లం(HOCl) ఉంటాయి.

* క్లోరిన్‌ హైడ్రోజన్‌ ఉన్న సమ్మేళనాలతో చర్య జరిపి HCl ను ఏర్పరుస్తుంది.

* కోర్లిన్‌ చల్లటి, విలీన క్షార ద్రావణాలతో చర్య జరిపి క్లోరైడ్, హైపోక్లోరైట్‌ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.

* క్లోరిన్‌ వేడి, గాఢ క్షార ద్రావణాలతో చర్య జరిపి క్లోరైడ్, క్లోరేట్‌ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.

* క్లోరిన్‌ బలమైన విరంజనకారి(Bleaching agent). తేమ ఉన్న వృక్ష జనిత వర్ణ పదార్థాలను ఆక్సీకరణం చేసి విరంజనం చేస్తుంది. క్లోరిన్‌ విరంజన ప్రభావం శాశ్వతంగా ఉంటుంది.

* కలప గుజ్జు, రేయాన్, నూలు, లెనిన్‌ మొదలైన వాటిని విరంజనం చేయడానికి క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.

* క్లోరిన్‌ను స్లేక్‌డ్‌లైమ్‌తో చర్య జరిపి విరంజన చూర్ణం తయారు  చేస్తారు.

* క్లోరిన్‌ నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే దీన్ని నీటిని శుద్ధి చేయడానికి వాడతారు. ఈ ప్రక్రియను ‘క్లోరినేషన్‌’ అంటారు.

* ఫాస్జీన్, బాష్పవాయువు, మస్టర్డ్‌ వాయువు లాంటి విష వాయువుల తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.

* DDT లాంటి కీటక నాశినులు, క్లోరోఫాం లాంటి మత్తుమందుల తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.


ఉత్కృష్ట వాయువులు

హీలియం (He) నియాన్‌ (Ne) ఆర్గాన్‌ (Ar)క్రిప్టాన్‌ (Kr), గ్జినాన్‌ (Xe) రేడాన్‌ (Rn)మొదలైనవి ఉత్కృష్ట వాయువులు.

*వాతావరణంలో అత్యధికంగా లభించే జడవాయువు - ఆర్గాన్‌. హీలియం మినహా మిగిలిన ఉత్కృష్ట వాయువుల బాహ్య కర్పర ఎలక్ట్రాన్‌ విన్యాసం - ns2np6

* స్థిరమైన అష్టక విన్యాసాన్ని కలిగి ఉండటం వల్ల జడవాయువులు రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.

* హైడ్రోజన్‌ తర్వాత అత్యంత తేలికైన వాయువు హీలియం.

* సూర్యగోళంలో కేంద్రక సంలీన చర్య (Nuclear fusion) ద్వారా హీలియం ఏర్పడుతుంది.

* హీలియం మండే స్వభావం లేని వాయువు. అందుకే దీన్ని వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్లను నింపడానికి వాడతారు. 

*హీలియం గాలి కంటే తేలికైనది కావడంతో దీన్ని విమానాల టైర్లు, ఎయిర్‌షిప్‌ల్లో (Airship) వాడతారు. 

* హీలియం (He), ఆక్సిజన్‌ (O2) వాయువుల మిశ్రమాన్ని హీలియోక్స్‌ (Heliox)అంటారు. గజ ఈతగాళ్లు కృత్రిమ శ్వాస కోసం హీలియోక్స్‌ను ఉపయోగిస్తారు.

* ఆస్తమా బాధితులు ఉపశమనం కోసం హీలియం, ఆక్సిజన్‌ మిశ్రమాన్ని వాడతారు.

* ద్రవ హీలియంను అల్ప ఉష్ణోగ్రతలను సాధించే క్రయోజనిక్‌ (Cryogenic) కారకంగా ఉపయోగిస్తారు.

*ద్రవ హీలియంను అణురియాక్టర్‌లో శీతలీకరణిగా వాడతారు.

* MRI స్కానింగ్‌ వ్యవస్థలో కూడా ద్రవ హీలియాన్ని ఉపయోగిస్తారు.

* లోహ సంగ్రహణంలో జడ వాతావరణాన్ని కల్పించేందుకు హీలియంను ఉపయోగిస్తారు.

నియాన్‌ బల్బులు నారింజ - ఎరుపు రంగు కాంతిని ఇస్తాయి. నియాన్‌ బల్బులను ప్రకటన దీపాలుగా, సిగ్నల్‌ లైట్లలో, ఓడరేవులు, విమానాశ్రయాల్లో దారి చూపే దీపాలుగా వాడతారు.

* సాధారణ టంగ్‌స్టన్‌ ఫిలమెంట్‌ బల్బుల్లో జడవాతావరణం కోసం ఆర్గాన్‌ వాయువును ఉపయోగిస్తారు.

* గనుల్లో పనిచేసే కార్మికులు క్రిప్టాన్‌ టోపీ లైట్లను వాడతారు. క్రిప్టాన్‌ లైట్లు తెలుపు రంగు కాంతిని ఇస్తాయి.

గ్జినాన్‌ వాయువును ఫోటోగ్రాఫిక్‌ ఫ్లాష్‌లైట్లలో ఉపయోగిస్తారు.

ఉత్కృష్ట వాయువులు కనిష్ఠ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి.  తెలిసిన పదార్థాలన్నింటిలో హీలియంకు కనిష్ఠ బాష్పీభవన స్థానం ఉంది. ఉత్కృష్ట వాయువుల పరమాణుల మధ్య చాలా బలహీనమైన విక్షేపణ బలాలు (Dispersion forces) తప్ప ఏ ఇతర అంతరపరమాణుక బలాలు ఉండవు.


హైడ్రోజన్‌ క్లోరైడ్‌

* హైడ్రోజన్‌ క్లోరైడ్‌ ఫార్ములా:HCl

* ఇది రంగులేని ఘాటైన వాసన గల వాయువు.

* ఇది నీటిలో సులభంగా కరిగి, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.

*ఎముకల బొగ్గును శుద్ధి చేయడానికి HCl ను ఉపయోగిస్తారు.

* ఔషధాల్లో, ప్రయోగశాలల్లో హైడ్రోజన్‌ క్లోరైడ్‌ను కారకంగా వాడతారు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌