• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు

మానవ పేదరిక సూచీ (HPI)


మానవ పేదరిక సూచీ అనే భావనను 1997లో మానవ అభివృద్ధి నివేదిక (హెచ్‌డీఆర్‌) ప్రవేశపెట్టింది.

ఇది మానవ జీవనానికి అవసరమైన దీర్ఘాయువు (Longevity), ఉన్నత జీవన ప్రమాణాలు (Decent Living Standards), మానవులు కోల్పోయినవి లేదా పొందలేనివి (Deprivation) అనే అంశాలను ఆధారంగా చేసుకుని సూచీని తయారు చేస్తుంది.

మానవ పేదరిక సూచీని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రకంగా, ఎక్కువ ఆదాయం కలిగిన (OCED) దేశాలకు మరో రకంగా లెక్కిస్తారు.

మానవ పేదరిక సూచీని లెక్కించడానికి మానవ అభివృద్ధి రిపోర్ట్‌ - 2009లో కింది చలన రాశులను ఉపయోగించారు.

1) 40 ఏళ్ల వయసు కంటే ముందే చనిపోయినవారి శాతం.

2) వయోజనుల్లో నిరక్షరాస్యుల శాతం.

3) ఆరోగ్య సేవలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉన్న ప్రజల శాతం.

4) పౌష్టికాహార లోపం ఉన్న అయిదేళ్లలోపు పిల్లల శాతం.


అమర్త్యకుమార్‌సేన్‌ ప్రతిపాదించిన సామర్థ్యాల అప్రోచ్‌


1999లో అమర్త్యసేన్‌ ‘డెవలప్‌మెంట్‌ యాజ్‌ ఫ్రీడం’ అనే గ్రంథాన్ని రాశారు. ఈయన ప్రజలు కొనసాగించే జీవనాన్ని, వారు అనుభవించే స్వేచ్ఛను పెంపొందించే విధంగా అభివృద్ధి ఉండాలని అందులో పేర్కొన్నారు.

ప్రజలకు, సమాజానికి సంతృప్తికరంగా లేని జీవనం నుంచి సంతృప్తికరమైన స్థితికి మార్పు చేసేదే అభివృద్ధి అని ఆయన తెలిపారు.

విద్య, ఆరోగ్యం అనేవి ప్రజలు కోరుకునే సంతృప్తికర జీవనాన్ని పొందడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించి, వారి స్వేచ్ఛను విస్తృతం చేస్తాయి. కాబట్టి ఆదాయంతో పాటు ప్రజలందరికీ విద్య, ఆరోగ్యాన్ని సమకూర్చడమే ప్రభుత్వాల ప్రథమ విధి అని అమర్త్యసేన్‌ వెల్లడించారు.

బహుళకోణ పేదరిక సూచీ (MPI)

బీ 2010లో OXFORD Poverty and Human Development Initiative (OPHI), UNDP సంయుక్తంగా ప్రపంచ బహుళకోణ పేదరిక సూచీని ప్రవేశపెట్టాయి.

బీ ప్రతి పేదవాడు పొందలేని కనీస అవసరాలను, పేదరికం స్వభావాన్ని, దాని తీవ్రతను ఈ సూచీతో కొలుస్తారు.

బీ ఎంపీఐ మూడు అంశాలను, 12 సూచికలను కలిగి ఉంది. అవి:

ఆరోగ్యం: 1. పోషకాహారం   2. పిల్లల మరణాలు 

3. తల్లుల ఆరోగ్యం (maternal health)

విద్య: 4. ఇయర్స్‌ ఆఫ్‌ స్కూలింగ్‌  

5. పాఠశాల హాజరు  

జీవన ప్రమాణాలు: 6. వంట ఇంధనం 7. తాగునీరు

8. పారిశుద్ధ్యం 9. విద్యుత్‌ 10. ఇల్లు 11. ఆస్తులు
12. బ్యాంక్‌ ఖాతా

ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీ (GGEI)

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి 2010లో ప్రైవేట్‌ సంస్థల సహకారంతో ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీని ప్రవేశపెట్టింది.

 పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 80 దేశాల పనితీరును ఈ నివేదికలో పొందుపరుస్తారు.

సామాజిక ప్రగతి సూచిక (SPI)

ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది.

 ఇందులో కనీస మానవ అవసరాలు, సంక్షేమం, అభివృద్ధి మొదలైన అంశాలకు చెందిన 54 సూచికలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాల పనితీరును అంచనా వేస్తారు.

అమర్త్యసేన్, డగ్లస్‌ నార్త్, జోసెఫ్, స్టిగ్లిడ్జ్‌ల రచనల ఆధారంగా ఎస్‌పీఐకి రూపకల్పన చేశారు.

అమెరికాకు చెందిన Social Progress Imperative   అనే సంస్థ ఎస్‌పీఐని అంచనా వేసి, ప్రచురిస్తుంది. సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణకు ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ సంస్థ సమాజ సంక్షేమాన్ని అంచనా వేస్తుంది.


SPI లో ఈ కింది అంశాలు ఉంటాయి:


కనీస మానవ అవసరాలు (Basic human needs):


* పోషకాహారం, ప్రాథమిక ఆరోగ్య రక్షణ

* నీరు, పరిశుభ్రత  * ఇల్లు  * వ్యక్తిగత భద్రత

సంక్షేమ పునాదులు (Foundations of well-being)

* కనీస విజ్ఞానం

* సమాచారం, ప్రసార మాధ్యమాలు

* ఆరోగ్యం, కులాసా    * పర్యావరణ రక్షణ

అవకాశాలు (Opportunities)

* వ్యక్తిగత హక్కులు    *  వ్యక్తిగత స్వేచ్ఛ

* సహనం, సమ్మిళిత దృష్టి

* విద్యలో పురోగతి సాధించడం

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

వివిధ అంతర్జాతీయ సంస్థల వర్గీకరణలన్నీ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే గుర్తించాయి.

భారతదేశలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది.'

స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలన్నీ దశలవారీగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడ్డాయి. మొదట వ్యవసాయరంగం, తర్వాతి దశల్లో పారిశ్రామిక - సేవా రంగాలు అభివృద్ధిని సాధించాయి.

అభివృద్ధి చెందుతున్న  ఆర్థిక వ్యవస్థల లక్షణాలు

కాలానుగుణంగా ఆర్థిక వ్యవస్థల్లో వచ్చిన మార్పుల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కింది లక్షణాలను గమనించవచ్చు.

స్వల్పరేటులో జాతీయాదాయం పెరగడం.

వ్యవసాయరంగానికి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించడం.

స్థూల పొదుపు రేటు తక్కువగా ఉండి, మూలధన కల్పన స్థాయి తక్కువగా ఉండటం.

 పారిశ్రామికీకరణ రేటు అల్పంగా ఉండి, పారిశ్రామికరంగ వృద్ధి స్వల్పంగా ఉండటం.

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడి ఎక్కువగా ఉండి, ఉత్పత్తి రేటు తక్కువగా ఉండటం.

రవాణా, సమాచారం, బ్యాంకింగ్, బీమా సేవలు లాంటి అవస్థాపన సౌకర్యాల కొరత ఎక్కువగా ఉండటం.

అక్షరాస్యత రేటు తక్కువగా ఉండి,  నిరుద్యోగిత ఎక్కువగా ఉండటం.

మానవ వనరుల సామర్థ్యం తక్కువగా ఉండి, ఉత్పత్తి రేటు అల్పంగా ఉండటం.

ఎగుమతుల పరిమాణం, విలువ తక్కువగా ఉండటం. 

పేదరికం పెద్ద సమస్యగా మారి, విషవలయ ప్రభావాలను చూపడం.

ప్రపంచ దేశాలు - అంతర్జాతీయ  సంస్థల వర్గీకరణ 

ప్రపంచ బ్యాంకు

2020లో ప్రపంచ బ్యాంకు అట్లాస్‌ పద్ధతి ద్వారా 2019 తలసరి స్థూల జాతీయాదాయం (per capita GNI)  ఆధారంగా దేశాలను కింది విధంగా వర్గీకరించింది. 

1) అల్ప ఆదాయ దేశాలు: < 1036 డాలర్లు

2) మధ్యమ ఆదాయ దేశాలు (నిమ్న మధ్య ఆదాయ దేశాలు): 1036  4045 డాలర్లు

3) ఉన్నత మధ్య ఆదాయ దేశాలు:  4046  12,535 డాలర్లు

4) అధిక ఆదాయ దేశాలు: > 12,535 డాలర్లు 

ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని మధ్యమ ఆదాయ దేశాల జాబితాలో ఉంచింది.

ఐక్యరాజ్య సమితి

యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (UNC-TAD) సహకారంతో యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌ (UNDESA) ప్రపంచ ఆర్థిక స్థితి, భవితవ్యం నివేదికను (World Economic Situation and prospects(WESP) report) ఏటా ప్రచురిస్తోంది. 

గీవిదీనిళీతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కింది విధంగా వర్గీకరించింది.

1) అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు (Developed Economies)

2) పరివర్తనలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు (Economies in Transition)

3) అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు (Developing Economies)

 ఈ వర్గీకరణను 1964 నుంచి అనుసరిస్తున్నారు. దీనికి కచ్చితమైన స్థూల, ఆర్థిక, సాంఘిక సూచికల ప్రాతిపదిక లేదు. WESP రిపోర్ట్‌ 2020 ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది.

సాధారణంగా ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం అల్ప ఆదాయ, మధ్య ఆదాయ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF)

IMF దేశాల ఆర్థిక వ్యవస్థలను కింది విధంగా వర్గీకరిస్తుంది.

1) అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు (Advancd Economies)

2) ఉద్భవిస్తున్న - అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు (Emerging and Developing Economies)

  తలసరి ఆదాయం, ఎగుమతులు, ప్రపంచ విత్త వ్యవస్థలో అనుసంధాన స్థాయి ఆధారంగా ఈ వర్గీకరణ జరుగుతుంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్గీకరణ ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.

Posted Date : 26-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌