• facebook
  • whatsapp
  • telegram

శాస్త్రసాంకేతికతల నవీనాభివృద్ధి

రుథీనియం అయస్కాంతత్వం
* అమెరికాకు చెందిన మినెసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రుథీనియంను గది ఉష్ణోగ్రత వద్ద అయస్కాంతత్వాన్ని ప్రదర్శించే నాలుగో మూలకంగా ప్రకటించారు.
* ఇప్పటివరకూ ఆవర్తన పట్టికలో కేవలం ఐరన్, కోబాల్ట్, నికెల్ మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ఫెర్రోమాగ్నటిక్ లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు.

APSTAR - 6C
* చైనా ఇటీవల కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సమాచార కృత్రిమ ఉపగ్రహం ''APSTAR - 6C''.
* దీన్ని లాంగ్ మార్చ్ 3B అంతరిక్ష వాహక నౌక సహాయంతో జిచాంగ్ కృత్రిమ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు.
* లాంగ్ మార్చ్ వాహక నౌక సహాయంతో ప్రయోగించిన 273వ మిషన్‌గా ఈ ప్రయోగం విజయవంతమైంది.
* ఈ కృత్రిమ ఉపగ్రహం, దాని వాహకనౌక రెండింటినీ చైనాకు చెందిన ఏరోస్పేస్ సైన్స్, టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.
* ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని APSTAR - 6 స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయోగించారు.

Gravity RAT
పాకిస్థానీ హ్యాకర్లు రూపొందించిన మాల్‌వేర్‌గా భావిస్తున్న 'గ్రావిటీ రాట్' ఈ మధ్యకాలంలో మరింత శక్తిమంతంగా తయారైనట్లు మహారాష్ట్ర సైబర్‌క్రైమ్ విభాగ అధికారులు ప్రకటించారు.
* ఈ మాల్‌వేర్‌ను మొదట ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT - In) 2017లో మన దేశంలో గుర్తించింది.
* RAT అంటే Remote Access Trojan. ఈ ప్రోగ్రామ్‌ను రిమోట్ సహాయంతో నియంత్రించడం వల్ల గుర్తించడం చాలా కష్టం.

బంగా బంధు కృత్రిమ ఉపగ్రహం
* ఇది బంగ్లాదేశ్ మొదటి సమాచార కృత్రిమ ఉపగ్రహం.
* దీన్ని స్పేస్ X కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.
* విస్తృత పరిధిలో బంగ్లాదేశ్ మొత్తానికి సమాచార సేవలు అందించే క్రమంలో ఈ కృత్రిమ ఉపగ్రహం రూపుదిద్దుకుంది.
* దీన్ని థేల్స్ ఎలీనియాస్పేస్ అనే కంపెనీ రూపొందించింది.
* బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమన్ పేరును ఈ కృత్రిమ ఉపగ్రహానికి నామకరణం చేశారు.

జాతీయ సాంకేతికశాస్త్ర దినోత్సవం
* మన దేశంలో 2018, మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహించారు.
* 1998లో ప్రోక్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున ఏటా జాతీయ సాంకేతికశాస్త్ర దినోత్సవాన్ని (National Technology Day) నిర్వహిస్తున్నారు.
* 2018 సంవత్సరానికి ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ''స్థిరమైన భవిష్యత్ కోసం శాస్త్రం'', సాంకేతిక శాస్త్రం (Science and Technology for a Sustainable Future)
* ఏటా ఈ దినోత్సవాన్ని విజ్ఞానశాస్త్ర, సాంకేతిక శాస్త్ర కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
* నిజానికి భారత్ మొదటి అణుపరీక్షలను 'స్మైలింగ్ బుద్ధా' అనే రహస్య నామంతో 1974 మే లోనే విజయవంతంగా నిర్వహించింది.
* అయితే 1998, మే 11న మనదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, ప్రోక్రాన్ నుంచి ఎ.పి.జె. అబ్దుల్ కలాం నేతృత్వంలో నిర్వహించిన శక్తి -1 అణు మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. మే 11న మూడు, మే 13న రెండు ప్రయోగాలు సఫలమయ్యాయి.
* అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మన దేశాన్ని ఒక అణుశక్తి దేశంగా అధికారికంగా ప్రకటించారు. దీంతో భారతదేశానికి న్యూక్లియర్ క్లబ్‌లో ఆరో దేశంగా స్థానం లభించింది.
* అదే సమయంలో HANSA - 3 అనే దేశీయ ఎయిర్‌క్రాఫ్ట్ బెంగళూరులో ఆకాశయానం చేసింది. డీఆర్‌డీవో త్రిశూల్ మిసైల్‌ను ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సేవల నిమిత్తం పరీక్షించింది.
* వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మే 11న జాతీయ విజ్ఞానశాస్త్ర, సాంకేతికశాస్త్ర దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది.

నిఫా వైరస్
మన దేశంలోని కేరళలో ఇద్దరు వ్యక్తుల నుంచి సేకరించిన శరీర ద్రవాల్లో నిఫా వైరస్ ( Niv - Nipah Virus) ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించారు.
* ఈ వైరల్ వ్యాధి జూనోటిక్ వ్యాధి (జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి). ఇది మానవులు, జంతువుల్లో కూడా వ్యాధి కారకతను ప్రేరేపిస్తుంది. టీరోపస్ ప్రజాతికి చెందిన గబ్బిలాల ద్వారా ఇవి మానవుడికి వ్యాపిస్తాయి.
* మొదటగా నిఫా వైరస్‌ను 1998లో మలేసియాలోని కంపంగ్ సుంగై నిఫా అనే ప్రాంతంలో కనుక్కున్నారు. ఆ ప్రాంతం పేరుమీదుగానే ఈ వైరస్‌కు నిఫా వైరస్ అనే పేరు వచ్చింది.
* వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది.
* శ్వాస సంబంధ సమస్యలతో పాటు మెదడు వాపు లాంటి ప్రాణాంతక లక్షణాలతో వ్యాధి సోకిన 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్లే పరిస్థితి ఈ వ్యాధి తీవ్రతను తెలియజేస్తుంది. దీని ఇంక్యుబేషన్ సమయం 5 నుంచి 14 రోజులు.
* ఈ వ్యాధి సోకినవారిలో సుమారు 70% మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
* ఇప్పటివరకూ ఈ వ్యాధికి తగిన వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు.

GRACE - FO కృత్రిమ ఉపగ్రహాలు
* నాసాకు చెందిన జంట కృత్రిమ ఉపగ్రహాలను Space X విజయవంతంగా ప్రయోగించింది.
* GRACE - FO అనేది ఇంతకు పూర్వం ప్రయోగించిన GRACE మిషన్‌కు కొనసాగింపు ప్రయోగం.
* GRACE - FO అంటే Gravity Recovery and Climate Experiment Follow - On.
* భూమిపై జలచక్రాన్ని అధ్యయనం చేయడానికి ఈ జంట కృత్రిమ ఉపగ్రహాలు ఉపకరిస్తాయి.
* ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఈ జంట కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించారు.
* భూమిపై జల చలనాలు, మంచు కరగడం వల్ల కలిగే మార్పులు లాంటి వాటిని కూలంకషంగా విశ్లేషించడానికి GRACE - FO శాటిలైట్ల దత్తాంశం ఉపయోగపడుతుంది.

ప్రపంచ అవటుగ్రంథి అవగాహనా దినోత్సవం
థైరాయిడ్ గ్రంథి (అవటు గ్రంథి) ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ దినోత్సవాన్ని (World Thyroid Awareness Day) ప్రతి సంవత్సరం మే 25న నిర్వహిస్తున్నారు.
* 2008లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్, అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ వ్యాధులపై అవగాహన కల్పించడానికి పూనుకున్నాయి. అయితే 2009లో మొదటిసారిగా ప్రపంచ థైరాయిడ్ అవగాహనా దినోత్సవం నిర్వహించారు.
* థైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో ఉన్న, అంతస్రావ్య గ్రంథుల్లో ఒకటి. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. శరీరంలో జీవక్రియలను నియంత్రించగలిగే సామర్థ్యం ఉన్న ఈ హార్మోన్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. థైరాయిడ్ గ్రంథికి వచ్చే వ్యాధుల్లో గాయిటర్ చాలా సామాన్యమైంది. హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, థైరాయిడ్ క్యాన్సర్ లాంటివి థైరాయిడ్ గ్రంథికి సాధారణంగా వచ్చే ఇతర వ్యాధులు.

ప్రపంచ టెలీకమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
* 2018లో ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ''అందరికీ కృత్రిమ మేధస్సుతో ప్రయోజనాత్మక వినియోగాన్ని సశక్తత చేయడం'' (Enabling the Positive use of Artificial Intelligence For All).
* అంతర్జాతీయ టెలిగ్రాఫ్ (కన్వెన్షన్) ఒప్పందం వార్షికోత్సవం సందర్భంగా 1969 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ITU) రూపొందించింది.

సౌరవ్యవస్థలో కొత్త అన్యగ్రహ శకలం
*  ఔముఆమూవా (Oumuamua) అనే ఒక కొత్త అన్యగ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కున్నారు.
*  ఇది వేరే నక్షత్ర వ్యవస్థ నుంచి ప్రస్తుతం జూపిటర్ కక్ష్యలోకి ప్రవేశించింది.
*  2014లోనే శాస్త్రవేత్తలు దీన్ని గమనించినప్పటికీ తాజాగా అన్యగ్రహ శకలంగా గుర్తించారు.

InSight అంతరిక్ష నౌక
* InSight అంటే Interior Exploration Using Seismic Investigations, Geodesy and HeatTransport.
*  నాసా దీన్ని 2018, మే 5న ప్రయోగించింది.
*  అంగారక గ్రహం అంతర్భాగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయడానికి ఈ అంతరిక్ష నౌకను పంపారు.
*  దీన్ని కాలిఫోర్నియాలో యునైటెడ్ లాంచ్ అలియన్స్ (ULA) కంపెనీ అట్లాస్ V రాకెట్ సహాయంతో ప్రయోగించారు.
* అమెరికా పశ్చిమ తీరం నుంచి నాసా ప్రయోగించిన మొదటి అంతరగ్రహ ప్రయోగంగా InSight చరిత్రలో స్థానం సంపాదించుకుంది.
* ఈ వాహక నౌక 2018, నవంబరు 26 నాటికి సుమారు 300 మిలియన్ మైళ్లు ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అకడమిక్ లొమోనోసోవ్
* ప్రపంచంలోనే మొదటి తేలియాడే అణుశక్తి కేంద్రాన్ని రష్యా ముర్‌మాన్స్క్ (Murmansk) పోర్ట్‌లో ఆవిష్కరించింది.
* దీని పేరు అకడమిక్ లొమోనోసోవ్ (Akademic Lomonosov). దీనికి రష్యా దేశపు విద్యావేత్త మైకేల్ లొమోనోసోవ్ పేరును నామకరణం చేశారు.
* అయితే పర్యావరణవేత్తలు దీన్నే 'న్యూక్లియర్ టైటానిక్' అని, 'చెర్నోబియల్ ఆన్ ఐస్' అని పిలుస్తున్నారు.
* పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని భర్తీ చేయడానికి రష్యా నీటిపై తేలియాడే ఈ అణుశక్తి కేంద్రాన్ని ప్రారంభించింది.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌