• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష పరిజ్ఞానం

* భూమి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని 'అంతరిక్షం' లేదా 'ఖగోళం' లేదా 'రోదసి' అని అంటారు.
* అంతరిక్షం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం అంటారు.


రాకెట్:
న్యూటన్ మూడో గమన నియమం లేదా రేఖీయ ద్రవ్యవేగ నియమం ఆధారంగా రాకెట్ పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపుతారు.
* ఇది పేలోడ్‌కు కావాల్సిన కనీస వేగం 11.2 కి.మీ./సె. (పలాయన వేగం) అందిస్తుంది.
* ప్రస్తుతం పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీ అందుబాటులో లేదు.


పేలోడ్
రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపే ఏ వస్తువునైనా 'పేలోడ్' అంటారు.
ఉదా: ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, వ్యోమగాములు.
* 1926లో అమెరికాకు చెందిన 'రాబర్ట్ గొడ్డార్ట్' రాకెట్‌లను రూపొందించారు (ఒకటో దశ రాకెట్).
* 4 దశల రాకెట్‌ను 1950లో రష్యాకు చెందిన 'థ్సియోల్కవ్‌స్కీ' నిర్మించారు.
క్యాప్సుల్ లేదా మాడ్యూల్
* అంతరిక్షంలో వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమించిన తర్వాత సురక్షితంగా భూమిని చేరడానికి ఉపయోగించే పరికరాన్ని క్యాప్సుల్ లేదా మాడ్యూల్ అంటారు. దీని కక్ష్యా వేగాన్ని తగ్గించవచ్చు.
స్పేస్ షటిల్:
* అంతరిక్షంలోకి మానవుడిని తీసుకెళ్లే వాహనం స్పేస్ షటిల్.
స్పేస్ ప్రోగ్:
* ఇతర గ్రహాలపైకి ప్రయోగించే వాటిని స్పేస్‌ప్రోగ్ అంటారు.
భారత్ ప్రయోగించిన ప్రోగ్‌లు రెండు. అవి:
1) ఎంఐపీ: మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
* దీన్ని 2008, అక్టోబరు 22న చంద్రయాన్ - I పేరుతో ప్రయోగించారు. ఎంఐపీ 2008, నవంబరు 14న చంద్రుడిపై దిగింది.
* చంద్రయాన్ - Iను తీసుకెళ్లే రాకెట్ పీఎస్ఎల్వీ - సీ11
2) ఎంవోఎం (మామ్): మాస్ ఆర్బిటాల్ మిషన్
* దీన్ని 2013, నవంబరు 5న పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్-సీ25 రాకెట్ ద్వారా అంగారకుడిపైకి పంపారు.
* మామ్ అంగారక కక్ష్యలోకి 2014, సెప్టెంబరు 24న ప్రవేశించింది.
రోవర్:
* రోబ్ రూపంలో నిర్మించే ప్రోబ్‌ను 'రోవర్' అంటారు. 2012లో అమెరికా 'క్యూరియాసిటీ' అనే రోవర్‌ను ప్రయోగించింది.
* అంతరిక్షంలో ఏవైనా రెండు వస్తువుల అనుసంధానాన్ని 'డాకింగ్' అంటారు.
      ఈ ప్రక్రియ విజయవంతంగా అమలు చేసిన దేశాలు
   1) అమెరికా              2) రష్యా              3) చైనా


అంతరిక్ష విజ్ఞానంలో తొలిసారి జరిగిన సంఘటనలు
* మొదటిసారిగా రష్యా 1957, అక్టోబరు 4న స్పుత్నిక్ - I అనే తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. దీంతో అంతరిక్ష యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు.
* స్పుత్నిక్ - I వ్యాసం 23 అంగుళాలు, బరువు - 184 పౌండ్లు.
* ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించి 1958, జనవరి 4న భూ వాతావరణంలోని ప్రవేశించి పేలిపోయింది.
* రష్యా 1957, నవంబరు 3న స్పుత్నిక్ - II ద్వారా 'లైకా' అనే కుక్కను అంతరిక్షంలోకి పంపింది.
* 'లైకా' అంతరిక్షంలోకి వెళ్లిన తొలిజీవిగా ప్రసిద్ధి చెందింది.
* అమెరికా తన తొలి కృత్రిమ ఉపగ్రహమైన ఎక్స్‌ప్లోరల్ - Iను 1958, జనవరి 31న అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీని ద్వారా అంతరిక్షం వయసు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేశారు.
* అమెరికా 1959లో శామ్ (SHAM )అనే కోతిని అంతరిక్షంలోకి పంపింది.
* 1961, ఏప్రిల్ 12న రష్యా దేశస్థుడు కల్నల్ యూరిగగారిన్ వస్తోల్ - 1 అనే అంతరిక్ష నౌక ద్వారా, భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించి ప్రథమ అంతరిక్ష వ్యోమగామిగా ప్రసిద్ధి చెందారు.
*  2011 నుంచి ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 12ను 'ఇంటర్నేషనల్ డే ఫర్ హ్యూమన్ అండ్ స్పేస్ రిలేషన్‌'గా నిర్వచిస్తోంది.
*  అంతరిక్షయానం చేసిన తొలి మహిళా వ్యోమగామి రష్యాకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వాలెంటీనా తెరిష్కోవ(1963).
*  ఈమె 1963, జూన్ 16న వస్తోల్-16 అనే అంతరిక్షనౌకలో ఇతర వ్యోమగాములతో కలసి రెండు రోజుల 22 గంటల 42 నిమిషాల్లో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణం చేసింది.
*  అమెరికాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి స్యాలిరైడ్ 1983, జూన్ 18న అంతరిక్షయానం చేశారు. ఈమె ఛాలెంజర్ అంతరిక్షనౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. 2012, జులై 23న క్యాన్సర్ వ్యాధితో మరణించారు.
 అలెక్సిలియొనోవ్ 1965 మార్చిలో వస్తోక్ - 2 రోదసి నౌకలో ప్రయాణించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.
*  1965, జూన్ 3న జెమిని - 4 అంతరిక్షనౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్.హెచ్ వైట్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడాడు.

1969, జులై 21న అపోలో వాహక నౌక ద్వారా చంద్రుడిపై కాలు పెట్టినవారు
   1. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
   2. ఎడ్విన్ అల్డ్రిన్
   3. మైఖేల్ కొల్లిన్స్


భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానం

* 'భారత అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర పితామహుడు' డాక్టర్ విక్రం అంబాలాల్ సారాభాయ్. ఆయన నేతృత్వంలో అంతరిక్ష విజ్ఞానం వివిధ దశల్లో అభివృద్ధి చెందింది.
* 1962లో భారత ప్రభుత్వం భారత అంతరిక్ష పర్యవేక్షణ కమిటీని సారాభాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది.
* 1963లో కేరళలోని త్రివేండ్రంకు దగ్గరగా ఉన్న 'తుంబా'లో మొదటి సౌండ్ రాకెట్ రేంజ్‌ను ఏర్పాటు చేశారు.
* 1963, నవంబరు 21న అమెరికా సహకారంతో అపాచీని (APAACHI)విజయవంతంగా ప్రయోగించారు.
* 1965లో త్రివేండ్రం దగ్గర స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను (SSTC)ను ఏర్పాటు చేశారు. దీన్ని విక్రం సారాభాయ్ మరణానంతరం 'విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్' (VSSC)గా పేరు మార్చారు.
* 1967 నవంబరులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'సెంటారి' అనే రాకెట్‌ను తుంబా నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
* 1969, ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO - Indian Space Research Organisation)ను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
* ఇస్రో భవనం పేరు అంతరిక్ష భవన్.
* భారత అంతరిక్ష విభాగంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఆర్యభట్ట.

ఇస్రో ఛైర్మన్‌లు
 

ఇస్రో ఛైర్మన్ పదవీకాలం
1. విక్రం సారాభాయ్ 1963 నుంచి 1972 ( 9 సంవత్సరాలు)
2. M. G. K. మీనన్ జనవరి 1972 నుండి సెప్టెంబర్ 1972 వరకు (9 నెలలు)
3. సతీష్ ధావన్ 1972 నుండి 1984 వరకు (12 సంవత్సరాలు)
4. ప్రొఫెసర్ యు.ఆర్. రావు 1984 నుండి 1994 వరకు (10 సంవత్సరాలు)
5. కె. కస్తూరిరంగన్ 1994 నుండి 2003 వరకు (9 సంవత్సరాలు)
6. జి. మాధవన్ నాయర్ 2003 నుండి 2009 వరకు (6 సంవత్సరాలు)
7. కె. రాధాకృష్ణన్  2009 నుండి 2014 వరకు (5 సంవత్సరాలు)
8. శైలేష్ నాయక్  1 జనవరి 2015 నుండి 12 జనవరి 2015 వరకు (12 రోజులు)
9. ఎ.ఎస్.కిరణ్ కుమార్ 2015 నుండి 2018 వరకు (3 సంవత్సరాలు)
10. కె.శివన్ జనవరి 2018 నుండి ప్ర‌స్తుతం

ఇస్రో ముఖ్య విభాగాలు
1. విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)
* దీన్ని కేరళలోని త్రివేండ్రంలో ఏర్పాటు చేశారు.
* ఇది అన్ని రకాల రాకెట్‌లను తయారు చేస్తుంది.
ఉదా: i) SLV (Satellite Launching Vehical)
         ii) ASLV (Agumented Satellite Launching Vehical)
        iii) PSLV (Polar Synchronous Satellite Launching Vehical)
        iv) GSLV (Geo Synchronous Satellite Launching Vehical)


2. ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ (ISAC)లేదా ఇస్రో శాటిలైట్ సెంటర్ (ISC)
* దీన్ని కర్ణాటకలో బెంగళూరుకు సమీపంలో పీన్యాలో ఏర్పాటు చేశారు.
* ఇక్కడ అన్ని రకాలైన ఉపగ్రహాలను తయారు చేస్తారు.
ఉదా: ఆర్యభట్ట, భాస్కర, ఐఆర్ఎస్, ఇన్‌శాట్ (INSAT) .


3. లిక్విడ్ ప్రప‌ల్షన్ సిస్టమ్ సెంటర్ (LPSC)
* ఇక్కడ రాకెట్లలో ఉపయోగించే ఇంధనాన్ని తయారు చేస్తారు. 
దీని ఉపకేంద్రాలు:
   1) త్రివేండ్రం
   2) బెంగళూరు
   3) మహేంద్రగిరి కొండలు
* మహేంద్రగిరి కొండలు తమిళనాడులో ఉంది. ఈ కేంద్రంలో జీఎస్ఎల్వీ రాకెట్‌లో ఉపయోగించే ద్రవ H2, O2 ను తయారు చేస్తారు.
* జీఎస్ఎల్వీ రాకెట్‌లోని చివరి దశలో క్రయోజనిక్ ఇంజన్‌ను వాడతారు.
* రాకెట్‌లలో ఘన ఇంధనంగా హైడ్రాక్సీ టర్మినేటడ్ పాలీ బ్యూటా డైఈన్ (HTPB)ను, ఆక్సిడైజర్‌గా నైట్రోజన్ టెట్రాక్సైడ్‌ను ఉపయోగిస్తారు.
* దీన్ని మొలాసిస్ నుంచి తయారు చేస్తారు.
* ఈ ద్రవ ఇంధనాలను ఉత్పత్తి చేసే ప్లాంటును 2012 మార్చిలో తణుకులోని ఆంధ్రా షుగర్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేశారు.
* క్రయోజనిక్ ఇంధనంగా ద్రవ హైడ్రోజన్ (-253ºC), ద్రవ ఆక్సిజన్ (-183ºC)లను ఉపయోగిస్తారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద ఉత్పత్తి చేస్తున్నారు.


4. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేజింగ్ (SHAR)
*  దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) అంటారు.
*  ఇది చెన్నైకి ఉత్తరంగా 85 కి.మీ. దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట సమీపంలోఉంది.
*  దీన్ని 1971, అక్టోబరు 9న ఏర్పాటు చేశారు. 2002లో షార్‌ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌గా మార్చారు.
*  శ్రీహరికోట ప్రపంచంలో అత్యుత్తమ రాకెట్ ప్రయోగశాలల్లో రెండోదిగా పేరు పొందింది.
*  శ్రీహరికోట 43360 (175 చ.కిమీ.) ఎకరాల్లో ఉంది. తూర్పున బంగాళాఖాతం, పడమర పులికాట్ సరస్సు ఉండటం వల్ల రాకెట్ ప్రయోగ కేంద్రానికి ఇవి సహజ సిద్ధ కవచాలు అయ్యాయి.
*  రాకెట్ ప్రయోగ సమయంలో ప్రయోగం విఫలమైతే వాటి శకలాలు సముద్రంలో పడిపోతాయి.
*  ప్రస్తుతం షార్‌లో రెండు లాంచింగ్ పాడ్‌లు ఉన్నాయి.
*  ఈ కేంద్రం నుంచి అన్నిరకాలైన రాకెట్‌లను ప్రయోగించవచ్చు.
*  ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ రాకెట్ ప్రయోగ కేంద్రం కౌరు (ఫ్రెంచ్ గయానా).


5. శాటిలైట్ ట్రాకింగ్ అండ్ రేజింగ్ సిస్టమ్ (STARS)
*  దీన్ని తమిళనాడులోని కడలూరులో ఏర్పాటు చేశారు.
*  ఈ కేంద్రం నుంచి లేజర్ కిరణాలు పంపి, ప్రయోగించిన ఉపగ్రహం కక్ష్యను భూమి ఉపరితలం నుంచి ఎత్తు కనుక్కోవచ్చు.

 

6. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF)
* దీన్ని కర్ణాటకలోని హసన్‌లో ఏర్పాటు చేశారు.
* ఉపగ్రహం ప్రయోగించిన తర్వాత అది పంపించే సంకేతాలను మొదట ఈ ఎంసీఎఫ్ అందుకుంటుంది. 
* ఉపగ్రహాలను ఎప్పటికపుడు ఈ కేంద్రం నుంచి నియంత్రిస్తారు.
* రెండో ఎంసీఎఫ్‌ను భోపాల్‌లో 2005 ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు.


7. స్పేస్ అప్లికేషన్ సెంటర్ (SAC)
* దీన్ని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు.
* ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలను రక్షణ, పరిశోధన, పరిపాలన, సమాచార వాణిజ్య, వ్యవసాయ, ఇతర రంగాల్లో వినియోగించడానికి శాస్త్రవేత్తలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు.


8. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)
* ఈ కేంద్రం ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల వ్యవస్థను పర్యవేక్షిస్తారు.
* ఉపగ్రహం నుంచి వచ్చే ఫోటోలను విశ్లేషించి తగిన వివరణను ఈ కేంద్రం అందజేస్తుంది.
దీని విభాగాలు:
1) పరిపాలనా విభాగం : బాలానగర్ (రంగారెడ్డి)
2) ప్రయోగ శాలలు : పటాన్‌చెరువు (మెదక్)
3) గ్రౌండ్ రిసీవింగ్ స్టేషన్ : షాద్‌నగర్ (మహబూబ్ నగర్)
దీని ప్రాంతీయ కేంద్రాలు
1) డెహ్రాడూన్
2) కోల్‌కతా
3) జోధ్‌పూర్
4) నాగ్‌పూర్
5) బెంగళూరు


9. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (PRL)
* దీన్ని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు.
* కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేయడానికి డాక్టర్ విక్రం సారాభాయ్ ఏర్పాటు చేశారు.
* ఇస్రో ఏర్పడిన తర్వాత ఇది అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటుంది.
* చంద్రుడిపై నీటి జాడను గుర్తించిన మొదటి విభాగంగా (ప్రపంచంలో) పీఆర్ఎల్‌ను గౌరవించారు.


10. ఆంట్రిక్స్ (Antrix)
*  ఇస్రో వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడానికి 1992 సెప్టెంబర్‌లో దీన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు.
*  2008లో మినిరత్న హోదా పొందింది.
*  ఇస్రో సేవలను దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే అమ్మకాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.


11. ఆక్సిలరీ ప్రొపల్షన్ సిస్టమ్ యూనిట్ (APSU)
*  దీన్ని బెంగళూరు, తివేండ్రంలో ఏర్పాటు చేశారు.


12. డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యూనిట్ (DECU)
*  దీన్ని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు.
*  దేశంలో అక్షరాస్యతను పెంచడానికి టీవీ, రేడియోల ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతుంది.


13. నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చి ల్యాబొరేటరీ (NARL)
*  ఇది వాతావరణ, అంతరిక్ష శాస్త్రాల్లో పరిశోధన చేస్తుంది.
*  ప్రస్తుతం GIRI అని పిలుస్తున్నారు. GIRI అంటే 'గాదంకి ఇంటర్‌ఫెరోమీటర్ రాడార్ ఆఫ్ ఐనోస్ఫియరిక్ అబ్జర్వేషన్'. దీని పూర్వనామం నేషనల్ మీసో స్ఫియర్, స్ట్రాటో స్ఫియర్, ట్రోపోస్ఫియర్ రాడార్ ఫెసిలిటీ.
*  ప్రధాన కార్యాలయం గాదంకి (తిరుపతి).

 

14. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
* సహజవనరులు, పర్యావరణ విపత్తు నిర్వహణలపై పరిశోధన చేస్తుంది. ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్‌లో ఉంది.
* ఇస్రో ఛైర్మన్ దీని ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
భారతదేశంలో అయిదు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రాలు ఉన్నాయి
  1) తూర్పు ప్రాంతం - కోల్‌కతా (పశ్చిమ్ బంగా)
  2) పశ్చిమ ప్రాంతం - జోద్‌పూర్ (రాజస్థాన్)
  3) ఉత్తర ప్రాంతం - డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)
  4) దక్షిణ ప్రాంతం - బెంగళూరు (కర్ణాటక)
  5) మధ్య ప్రాంతం - నాగ్‌పూర్ (మహారాష్ట్ర)


15. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్
* దీన్ని 1972లో బెంగళూరులో ఏర్పాటు చేశారు.
* ఇస్రోలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
* దీని కార్యదర్శిగా ఇస్రో ఛైర్మన్ వ్యవహరిస్తారు.


16. స్పేస్ కమిషన్
* దీన్ని 1972లో బెంగళూరులో ఏర్పాటు చేశారు.
* మనదేశ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలను ఈ కమిషన్ రూపొందిస్తుంది.
* దీని ఛైర్మన్‌గా ఇస్రో ఛైర్మన్ వ్యవహరిస్తారు.


17. శాటిలైట్ డేటా సెంటర్
* దీన్ని హైదరాబాద్‌లోని ఎన్ఆర్ఎస్సీలో ఏర్పాటు చేశారు.
* ఉపగ్రహం నుంచి వచ్చే డేటా (సమాచారం)ను దీనిలో నిల్వ చేస్తారు.


ఉపగ్రహాల కక్ష్యలు
* ఉపగ్రహం సంచరించే మార్గాన్ని కక్ష్య అంటారు.
వీటి రకాలు
1. లో ఎర్త్ ఆర్బిట్స్ (LEO)
* ఇది భూమికి 200 - 500 కి.మీ. ఎత్తులో ఉంటుంది.
ఈ కక్ష్యలోనికి సౌండింగ్ రాకెట్స్, ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.
2. సన్ సింక్రోనస్ ఆర్బిట్ (SSO)
* ఇది భూమికి 500 - 1000 కి.మీ. ఎత్తులో ఉంటుంది.
* ఈ కక్ష్యలోనికి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (IRS) ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.
3. మీడియం ఎర్త్ ఆర్బిట్స్ (MEO)
* ఇది భూమికి 10,000 - 20,000 కి.మీ. ఎత్తులో ఉంటుంది.
* ఈ కక్ష్యలోనికి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (GPS)కు సహకరించే ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.
4. జియో స్టేషనరీ ఆర్బిట్స్ (GSO)
* దీన్ని భూ స్థిర కక్ష్య, భూమికి 36,000 కి.మీ.ఎత్తులో ప్రవేశపెడతారు.
* ఈ ఉపగ్రహాల కక్ష్యావర్తన కాలం 24 గంటలు లేదా ఒక రోజు.


ఉపగ్రహాలు(Satellites)
* భారతదేశ మొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను 1975, ఏప్రిల్ 19న రష్యా నుంచి 'కాస్పోస్' రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు.
* 360 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ప్రొఫెసర్ యు.ఆర్. రావు నిర్మించారు. ఆ సమయంలో ఇస్రో ఛైర్మన్ సతీస్ ధావన్.
* మన దేశంలోని శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం 'రోహిణి'. దీన్ని 1979, ఆగస్టు 10న అంతరిక్షంలోకి ప్రయోగించారు.
మన దేశం నిర్మించిన ఉపగ్రహాలు రెండు రకాలు
1. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (IRS)
2. ఇన్‌శాట్ ఉపగ్రహాలు (INSAT)


1. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (IRS)
* ఈ ఉపగ్రహాల వల్ల ఒక ప్రాంతంలోని వాతావరణ స్థితి, భూ పరిశీలన, సముద్రంలో కలిగే మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు.
* ఈ ఉపగ్రహాలను 500 - 1000 కి.మీ. కక్ష్య అయిన సన్ సింక్రోనస్ ఆర్బిట్ (SSO)లో ప్రవేశపెడతారు.
 *ఈ ఉపగ్రహ ప్రయోగానికి ఎక్కువగా ఉపయోగించే రాకెట్ పీఎస్ఎల్వీ.
రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ఉపయోగాలు:
* పర్వతాలు, పీఠభూములు లాంటి బృహత్తర భౌగోళిక లక్షణాలను గుర్తించడానికి
* తరచూ మార్పుకు లోనయ్యే నీరు, వ్యవసాయం పర్యవేక్షణకు
* చొరబాటుకు వీలుకాని ప్రదేశాలకు సంబంధించిన సమాచార సేకరణకు
* వివిధ ఎత్తున్న ప్రదేశాలకు సంబంధించిన సమాచార సేకరణకు
* రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని విశ్లేషించి విభిన్న రంగాలకు అనువర్తింపజేయడం
సరళ్ (SARAL)
* దీన్ని 2013 ఫిబ్రవరిలో పీఎస్ఎల్వీ రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించారు. భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.
* దీన్ని ఉపయోగించి సముద్ర ఉపరితల స్వరూప స్వభావాలను తెలుసుకోవచ్చు.
* రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయంలో ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్‌ల తర్వాత మనదేశం అయిదో స్థానంలో ఉంది.
* రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల వినియోగంలో మనదేశం మొదటి స్థానంలో ఉంది.


2. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ (INSAT)
* ఈ వ్యవస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
* ఇవి ప్రత్యేకంగా సమాచార వ్యవస్థకు ఉద్దేశించినవి.
* వీటిని జీఎస్ఎల్వీ ద్వారా భూ స్థిర కక్ష్యలో 36,000 కి.మీ. ఎత్తులో ప్రవేశపెడతారు.
* వీటి బరువు అధికంగా ఉంటుంది.
* మనదేశం మొదటి సమాచార ఉపగ్రహం ఆపిల్ (APPLE  - Arien Passanger Pay Load Experiments).
* దీన్ని 1981 ఫ్రెంచ్ గయానాలోని 'కౌరు' నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 'ఏరియన్ వాహక' నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపారు.
ఇన్‌శాట్ ఉపగ్రహాల ఉపయోగాలు:
* మొబైల్, టెలిఫోన్ సర్వీసులు; దూర ప్రాంత టెలిఫోన్ కాల్స్.
* టీవీ కార్యక్రమాల టెలికాస్టింగ్
* వాతావరణ సూచన
* కోస్తా గ్రామాలకు ముందస్తు తుఫాను హెచ్చరిక
* నౌకల నుంచి వచ్చే సిగ్నల్ భీమింగ్‌లో
* కింది స్థాయిలో ప్రజలకు, అధికారులకు మధ్య సమన్వయం కోసం
* ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయ దూరవిద్య కార్యక్రమాలకు వీలు కల్పించడం
 టెలి మెడిసిన్
* శాటిలైట్ నావిగేషన్‌లో ఉపయోగిస్తారు.


మనదేశంలో రూపొందించిన ఇన్‌శాట్ ఉపగ్రహాలు
ఇన్‌శాట్ - 1ఏ
* దీన్ని 1982లో ప్రయోగించారు. కొన్ని లోపాల కారణంగా దీన్ని తొలగించారు.
ఇన్‌శాట్ - 1బీ
* ఇది రెండో బహుళార్థ ప్రయోజనాల జియో స్టేషనరీ ఉపగ్రహం. దీన్ని 1983, ఆగస్టు 30న కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
* 'గుయియాస్ బ్లూఫోర్' అనే మొదటి నల్లజాతి వ్యోమగామి ద్వారా 'ఛాలెంజర్' వాహక నౌక కార్గొబే సహాయంతో ప్రయోగించారు.
ఇన్‌శాట్ - 2ఏ
* ఇస్రో నిర్మించిన ఉపగ్రహ శ్రేణుల్లో ఇన్‌శాట్ - 2ఏ మొదటిది. దీన్ని 1992, జులై 10న ఫ్రెంచ్ గయానాలోని 'కౌరు' అంతరిక్షం కేంద్రం నుంచి ప్రయోగించారు.
* ఇన్‌శాట్ - 1 ఉపగ్రహాల కంటే ఇన్‌శాట్ - 2 సామ‌ర్థ్యం 50% అధికం. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ఇన్‌శాట్ - 2బీ
* 1993, జులై 23న ప్రయోగించడం ద్వారా నమాచార రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలికింది. కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.
* రాబోయే విపత్తులను తెలియజేయడం, అన్వేషణ, రక్షణ పద్ధతుల్లో అద్భుతంగా పని చేసింది.
మెట్‌శాట్ (కల్పన - 1)
* 2002, సెప్టెంబరు 12న ఇస్రో పీఎస్ఎల్వీ-సీ4 ద్వారా ప్రయోగించారు.
* ఇది భారతదేశ మొదటి వాతావరణ పరిశోధనా ఉపగ్రహం.
ఎడ్యుశాట్ (EDUSAT)
* విద్యా సర్వీసుల కోసం ప్రయోగించింది. 2004, సెప్టెంబరు 20న ఇస్రో జీఎల్ఎల్వీ-ఎఫ్01 ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది.
* 5 కె.యు. బాండ్ ట్రాన్స్ పాండర్లను తీసుకెళ్లింది.
ఇన్‌శాట్ - 4సీ
* జీఎస్ఎల్వీ - ఎఫ్02 నౌక 2006 జులైలో విఫలం చెందడం వల్ల ఇన్‌శాట్ - 4సీ వాహక నౌక కూలిపోయింది.
ఇన్‌శాట్ - 4సీఆర్
* ఇది డైరెక్టు టూ హోమ్ (DTH) సర్వీసుల కోసం ఉద్దేశించింది.
GSAT - 14: ఇది టెలి మెడిసిన్, ఇతర కమ్యూనికేషన్ సేవలకు ఉద్దేశించింది
GSAT - 6: దీన్ని 2015, ఆగస్టు 27న జీఎస్ఎల్వీ - డీ6 రాకెట్ సహాయంతో శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.దీని బరువు 2117 కిలోలు. దీని సేవలను సమాచార రంగంలో ఉపయోగిస్తారు.
GSAT - 7: దీన్ని 2013 ఆగస్టులో కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. దీని సేవలను రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు. దీన్ని 'రుక్మిణి' అని కూడా పిలుస్తారు.


ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS)
* ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ను పోలిన ఒక నావిగేషన్ వ్యవస్థ.
* దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.
* ఈ ఉపగ్రహాల వ్యవస్థను ఉపయోగించి 'గగన్' వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇస్రో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.


లక్ష్యం: 2015 డిసెంబరు నాటికి 7 ఉపగ్రహాల్లో 3 భూస్థిర కక్ష్యలో, 4 భూ అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
* దీనిలో భాగంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఏ 2013 జులై
ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1బీ 2014 ఏప్రిల్
ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సీ 2014 అక్టోబరులో ప్రవేశపెట్టారు.
* వీటిని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ - డీ, ఈ, ఎఫ్, జీ లను విజయవంతంగా ప్రయోగించారు.
* ఈ 7 ఉపగ్రహాలను 'నావిక్' పేరుతో జాతికి ప్రధానమంత్రి అంకితం చేశారు.
ఉద్దేశం:
* విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడం
* యాత్రికులకు దిక్సూచి సాధనంగా
* భద్రతా బలగాలకు ఉపయోగించడం
* విపత్తుల సమయంలో భాదితులకు సహాయకంగా ఉండటం


నావిగేషన్ వ్యవస్థ:

GPS: Global Positioning System
NAVIC: Navigation With Indian Constellation
IRNSS: Indian Regional Navigation Satillite System (OR) NAVIC


భారత నావిగేషన్ - NAVIC దాని ఉపగ్రహాలు


గగన్
(GAGAN - GPS Aided GEO Agumented Navigation)
* ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ఉపగ్రహ అధారిత నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి పరిచాయి.
* నావిగేషన్, విమాన రాకపోకలు, నియంత్రణ, సమన్వయం కోసం ఈ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
* రష్యా సహకారంతో భారత్ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి గగన్ సహకారం తీసుకుంటుంది.
* గగన్ ద్వారా గ్రౌండ్ ఆధారిత విమాన నావిగేషన్‌లోని లోపాలను సరిదిద్దవచ్చు.


రాకెట్లు - రకాలు

   మనదేశంలో ఇప్పటి వరకు 4 తరాల రాకెట్లను రూపొందించారు. వీటిని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించింది.
శాటిలైట్ లాంచింగ్‌ వెహికల్ (SLV)
*  ఇది మొదటి తరానికి చెందింది.
*  వీటన్నింటినీ శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
*  ఎస్ఎల్‌వీ శ్రేణి ప్రధాన లక్ష్యం ఉపగ్రహం ప్రయోగ సామర్థ్యాన్ని పరీక్షించడం. మొత్తం 5 ప్రయోగాలు చేశారు.
*  ఎస్ఎల్‌వీ - 3 ద్వారా 35 కిలోల బరువున్న రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపారు.
*  5 ప్రయోగాల్లో 2 విజయాలు, 3 అపజయాలు పొందాయి.


అగ్యుమెంటడ్ శాటిలైట్ లాంచింగ్‌ వెహికల్ (ASLV)
* ఇవి రెండో తరానికి చెందిన వాహక నౌకలు.
* స్ట్రాప్ ఆన్ బూస్టర్ల సాయంతో 150 కిలోలకు మించి బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
* 1987లో ఏఎస్ఎల్‌వీడీ - 1, 1988లో ఏఎస్ఎల్‌వీడీ - 2లను ప్రయోగించగా అవి విఫలం చెందాయి.
* మొత్తం 5 ప్రయోగాల్లో 3 విజయాలు, 2 అపజయాలు పొందాయి.


పోలార్ సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్‌ వెహికల్ (PSLV)
* ఇది మూడో తరానికి చెందిన వాహకనౌక.
* ఈ రాకెట్ సగటు ఎత్తు 44 మీ., సగటు బరువు 295 మెట్రిక్ టన్నులు. దీనిలో 4 దశలు ఉంటాయి.
* మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాలు; రెండో, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాలు ఉపయోగిస్తారు.
* దీని రెండో దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'వికాస్' అనే రాకెట్ ఇంజన్‌ను వాడతారు.
* మొదటి ప్రయోగంలో భాగంగా 1993, సెప్టెంబరులో పీఎస్ఎల్వీ - డీ1ను ప్రయోగించారు. ఇది వైఫల్యం చెందింది.
* 1994, అక్టోబరు 15న ప్రయోగించిన పీఎస్ఎల్వీ - డీ2 విజయవంతమైంది.
* ఇప్పటి వరకు 3 ప్రయోగాలు చేశారు.
* పీఎస్ఎల్వీలో మొదటి, మూడో దశల్లో ఘన ఇందనాన్ని; రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని మండిస్తారు.
* రెండో దశ ఇంజన్‌ను 'వికాస్' అని అంటారు.

దశ ఇంధ‌నం
మొదటి దశ హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్ (HTPB)
రెండో దశ అన్‌సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రజీన్ + N2O4
మూడో దశ హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్
 నాలుగో దశ మోనో మిథైల్ హైడ్రోజీన్ (MMH)+ నత్రజని ఆక్సైడ్‌లను ఇంధనాలుగా ఉపయోగిస్తారు.

* ప్రపంచంలో విజయవంతమైన రాకెట్లలో పీఎస్ఎల్వీ ఒకటి.
* 1982లో పీఎస్ఎల్వీ కార్యక్రమం ప్రారంభమైంది.
* ఇప్పటి వరకు ప్రయోగించిన 39 ప్రయోగాల్లో 38 ప్రయోగాలు విజయవంతమయ్యాయి.


పీఎస్ఎల్వీ - సీ27
* 2015, మార్చి 28న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. దీని ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1డీను ప్రయోగించారు. దీని బరువు 1425 కిలోలు.
* ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది 'గగన్' ప్రాజెక్టులో భాగం.
* భూగోళం మొత్తాన్ని సమాచార వ్యవస్థలో నిలిపేందుకు 5 దేశాలు వివిధ ప్రాజెక్టులు ప్రారంభించాయి.

* అమెరికా జీపీఎస్ (Global Positioning System)
* రష్యా GLONASS (Global Navigation System)
* యూరప్ గెలిలీయో (GELELIO)
* చైనా Compass Network
* భారతదేశం గగన్


పీఎస్ఎల్వీ - సీ28
* 2015, జులై 10న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. దీని ద్వారా 5 యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటి మొత్తం బరువు 1440 కిలోలు.
* వీటిలో 2 బుల్లి ఉపగ్రహాలు; 3 డీఎంసీ ఉపగ్రహాలు (Earth Observations Satellites) ఉన్నాయి.


పీఎస్ఎల్వీ - సీ30
* 2015, సెప్టెంబరు 28న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
* దీని ద్వారా భారత్ 'ఆస్ట్రోశాట్' అనే ఖగోళ అధ్యయన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని బరువు1650కిలోలు.   
* ASTROSAT - Astronomical Satellite
* ఇది భారతదేశ తొలి మల్టీవేవ్ లెన్త్ స్పేస్ అబ్జర్వేటరీ
* భారత మొదటి బహుళ తరంగదైర్ఘ్య ఖగోళదర్శిని.


పీఎస్ఎల్వీ - సీ29
* 2015, డిసెంబరు 16న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
* వీటి ద్వారా 6 సింగపూర్ ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటి మొత్తం బరువు 624 కిలోలు.


పీఎస్ఎల్వీ - సీ31
* 2016, జనవరి 20న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
* ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఈ ద్వారా పంపారు. దీని బరువు 1425 కిలోలు.


పీఎస్ఎల్వీ - సీ32
* షార్ నుంచి 2016, మార్చి 10న ప్రయోగించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ నౌక ద్వారా పంపారు. బరువు 1425 కిలోలు.


పీఎస్ఎల్వీ - సీ33
* 2016, ఏప్రిల్ 28న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1జీ నౌక ద్వారా పంపారు. బరువు 1425 కిలోలు.
* ఐఆర్ఎన్ఎస్ఎస్‌లోని 7 ఉపగ్రహాల పరంపరను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'నావిక్' పేరు మీద జాతికి అంకితం చేశారు.


పీఎస్ఎల్వీ - సీ34
* 2016, జూన్ 22న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. దీని ద్వారా 20 ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటి మొత్తం బరువు 1288 కిలోలు.
* వీటిలో భారత ఉపగ్రహాలు మూడు ఉన్నాయి.
i) కార్టోశాట్ - 2సీ
* మాప్‌ల అధ్యయనం కోసం పంపారు. దీని బరువు 727.5 కిలోలు.
ii) సత్యభామ శాట్
* బరువు 1.5 కిలోలు. దీన్ని చెన్నైలోని సత్యభామ వర్సిటీ విద్యార్థులు తయారు చేశారు.
iii) స్వయంశాట్
* దీని బరువు ఒక కిలో. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుణె విద్యార్థులు తయారు చేశారు.

పీఎస్ఎల్వీ - సీ34 ద్వారా
* అమెరికా 13 ఉపగ్రహాల్లో FLOCK  -2P, స్కెశాట్ జన్ 2 - 1, డవ్ ఉపగ్రహాలు
* కెనడా ఉపగ్రహాలు M3M శాట్, GHC శాట్ D
* జర్మనీ ఉపగ్రహం BIRDS
* ఇండోనేషియా ఉపగ్రహం LAPAN  - 3
* పై ఉపగ్రహాలను సూర్య అనువర్తిత కక్ష్య (SSO)లో ప్రవేశపెట్టారు.


కార్టోశాట్ - 2సీ
* దీన్ని సన్ సింక్రోనలైజేషన్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు.
* కార్టోశాట్ శ్రేణిలో ఇది అయిదవది.
* భూ పరిశీలన, భూ పటాల తయారీలో, సైన్యం నిగా కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది.
సత్యభామ శాట్
* హరితగృహం వాయువుల వివరాలను స్వీకరిస్తుంది.
స్వయం శాట్
* సిగ్నల్‌లు లేని ప్రాంతం నుంచి సమాచారాన్ని సేకరించి ఆమెచ్యూర్ రెడియోకు అందిస్తాయి.
* ఇస్రో ఇంతవరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో అతిచిన్నది.
* స్టడీశాట్ (950 గ్రాములు)
పీఎస్ఎల్వీ - సీ35 (స్కాట్ శాట్ - 1)
* 2016, సెప్టెంబరు 26న దీని ద్వారా 8 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ - సీ35 ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు
* భారత ఉపగ్రహాలు - 3 (స్కాట్‌శాట్, ప్రథమ్‌శాట్, పైశాట్)
* అల్జీరియా ఉపగ్రహాలు - 3 (Alsat 1B, Alsat 2B, Alsat - 1N)
* కెనడా ఉపగ్రహం - 1 (NLS - 19)
* అమెరికా ఉపగ్రహం - 1 (పాత్‌ఫైండర్ - 1)
* భారతదేశంలో మొదటి సారిగా ఒకే వాహక నౌక ద్వారా రెండు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.
* పీఎస్ఎల్వీ - సీ35 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల మొత్తం బరువు 671.25 కిలోలు.
* ప్రథమ్ శాట్ (10 కిలోలు) - భూపరిశోధన ఉపగ్రహం
* పైశాట్ (5.25 కిలోలు) - రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
Alsat 1B (103 కిలోలు) - వ్యవసాయ, విపత్తులను పరిశీలిస్తుంది.
Alsat 2B (117 కిలోలు) - సహజ వనరులను అంచనా వేస్తుంది.
Alsat 1N (7 కిలోలు) - టెక్నాలజీ ఉపగ్రహం
* పాత్‌ఫైండర్ - 1 (44 కిలోలు) - భూమి ఛాయా చిత్రాలు తీసేందుకు ఉపయోగపడుతుంది.
NSL - 19 (8 కిలోలు) - టెక్నాలజీ ఉపగ్రహం
* స్కాట్‌శాట్ - 1 (377 కిలోలు) నిరంతరం వాతావరణ పరిస్థితులు, తుపాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది.
పీఎస్ఎల్వీ - సీ36
* 2016, డిసెంబరు 7న ఇస్రో దీని ద్వారా రిసోర్సుశాట్ - 2ఎ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహ బరువు 1,235 కిలోలు.
* జీవితకాలం 5 సంవత్సరాలు.
* ఉపగ్రహం వ్యవసాయ రంగానికి సంబంధించిన పంటల విస్తీర్ణం, దిగుబడి, కరవు ప్రభావం, జలవనరులు, పట్టణప్రణాళిక లాంటి అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది.
* ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థతో తొలిసారి రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించారు.
పీఎస్ఎల్వీ - సీ37
* ఈ వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపి ఇస్రో చరిత్ర సృష్టించింది.
* భారతదేశం నుంచి 3 ఉపగ్రహాలు

అమెరికా 96
 ఇజ్రాయెల్ 1
కజకిస్థాన్ 1
నెదర్లాండ్స్ 1
స్విట్జర్లాండ్ 1
యూఏఈ ఉపగ్రహాలను పంపారు.

 ఇస్రో ఇప్పటి వరకు 226 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటిలో 179 విదేశాలకు చెందిన ఉపగ్రహాలు.
* ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
     రష్యా        -    37 ఉపగ్రహాలు
    అమెరికా  -     29 ఉపగ్రహాలను పంపాయి


భారత ఉపగ్రహాలు:
1. కార్టోశాట్ - 2
*  దీని బరువు 714 కిలోలు. జీవితకాలం అయిదు సంవత్సరాలు.
*  భూ చిత్రీకరణకు ఉపయోగించిన అధునాతన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.
2. ఇన్‌శాట్-1ఎ, ఇన్‌శాట్-1బి బుల్లి ఉపగ్రహాలు, నానో శాటిలైట్లు. వీటిని స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించింది.


విదేశీ ఉపగ్రహాలు:
*  అమెరికాకు చెందిన డౌ ప్లాక్ 3పి నానో శాటిలైట్లను భూపరిశోధనల కోసం ప్లానెట్ అనే సంస్థ అంతరిక్షంలోకి పంపింది.
*  లెమర్ అనే ఉపగ్రహాలను 'స్పైర్' గ్లోబల్ సంస్థ రూపకల్పన చేసింది. వీటి ద్వారా వాతావరణాన్ని అంచనా వేస్తుంది. ఇది ఏఐఎస్ పద్ధతిలో పని చేస్తుంది.
*  నెదర్లాండ్స్‌కు చెందిన PS ఉపగ్రహాన్ని 'ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇన్ స్పేస్' అనే సంస్థ రూపొందించింది.
*  స్విట్జర్లాండ్ ఉపగ్రహాన్ని 'స్పేస్ ఫార్మా' రూపొందించింది. మైక్రో గ్రావిటీ పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది.
* ఇజ్రాయెల్‌కు చెందిన "BGU SAT" ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ 'బెన్ గురియన్ విశ్వవిద్యాలయం' సాయంతో రూపొందించారు.
* కజకిస్థాన్‌కు చెందిన ఆల్‌ఫరాబీ - 1 ఉపగ్రహాన్ని ఆల్‌ఫరాబీ నేషనల్ యూనివర్సిటీ రూపొందించింది.
* యుఏఈకి సంబంధించిన 'నాయిఫ్ - 1' మహ్మద్‌బిన్ రషీద్ స్పేస్ సెంటర్ రూపొందించింది.
* 2011లో పీఎస్ఎల్వీ - సీ18 ప్రయోగం ద్వారా ఐఐటీ కాన్పూర్ జుగ్ను అనే నానో టెక్నాలజీకి చెందిన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
* ఇది వాటర్‌షెడ్‌ల నిర్వహణ, జలాశయాలను, జల లభ్యతను అధ్యయనం చేస్తుంది.
* 2012లో పీఎస్ఎల్వీ - సీ20 ప్రయోగం ద్వారా సరళ్ [Satellite Agros and Attica]ను ప్రయోగించారు.
* ఇస్రో వందో ప్రయోగం పీఎస్ఎల్వీ - సీ21 మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టింది.
* ఇవి భూ వాతావరణ పరిశోధనకు ఉద్దేశించినవి.
    1) మినిరెడిన్ (ఇండియా)
    2) ప్రొయిటెరస్ (జపాన్)
    3) స్పాట్ - 6 (ఫ్రాన్స్)


పీఎస్ఎల్వీ రజతోత్సవం:
* 2013, నవంబరు 5న పీఎస్ఎల్వీ - సీ25 వాహక నౌక ద్వారా మామ్ (MOM) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు.
జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (GSLV)
* ఇది 4వ తరానికి చెందిన భారీ రాకెట్.
* దీని సగటు ఎత్తు 49 నుంచి 51 మీటర్లుగా ఉంటుంది. సగటు బరువు 410 మెట్రిక్ టన్నులు.
* దీని వ్యాసం 2.8 మీటర్లు. ఈ రాకెట్‌లో మూడు దశలు ఉంటాయి.
* మొదటి దశలో ఘన ఇంధనాలు, రెండో దశలో ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు. మూడో దశలో క్రయోజనిక్ దశలో క్రయోజనిక్ ఇంధనాలు ఉంటాయి.
* ఈ ఇంధనాల ఉత్పత్తిని మహేంద్రగిరి కొండల్లోని (తమిళనాడు) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (LPSC) వారు తయారు చేస్తున్నారు.
* క్రయోజనిక్ టెక్నాలజీని అందించడానికి ఉద్దేశించిన ఒప్పందం 1991లో రష్యా - భారత్ మధ్య కుదిరింది. తర్వాత అమెరికా ఆంక్షల వల్ల రష్యా ఒప్పందం నుంచి తప్పుకుంది.
* 2001 నుంచి క్రయోజనిక్ టెక్నాలజీపై అత్యంత ఎక్కువ మొత్తంలో పరిశోధనలు జరుపగా, 2014, జనవరి 5న ప్రయోగించిన జీఎస్ఎల్వీ - ఎఫ్05 ద్వారా సాధ్యమైంది.
జీఎస్ఎల్వీ రాకెట్‌లో
* లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో ప్రవేశపెట్టిన పేలోడ్ బరువు 5000 కిలోల వరకు ఉంటుంది.
* జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే పేలోడ్ బరువు 2500 కిలోల వరకు ఉంటుంది.
* క్రయోజనిక్ ఇంజన్‌లో వాయువులను ద్రవాలుగా మార్చి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు.
* సాధారణంగా క్రయోజనిక్ ఇంజన్‌లో
    ద్రవ హైడ్రోజన్ (-253ºC)
    ద్రవ ఆక్సిజన్ (-183ºC) ను ఉపయోగిస్తారు.

* 1990లో జీఎస్ఎల్వీ ప్రాజెక్టు ప్రారంభమైంది.
* జీఎస్ఎల్వీ టెక్నాలజీ ఉన్న 6వ దేశం భారత్.
* ఈ టెక్నాలజీ ఉన్న మొదటి 5 దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా.
* 2001, మార్చి 23న మొదటి జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతంకాగా 2015, ఆగస్టు 27 వరకు పది జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయగా 7 విజయవంతమయ్యాయి.
జీఎస్ఎల్వీ - ఎల్‌వీఎమ్3 ప్రయోగం:
* జీఎస్ఎల్వీ - మార్క్3 ఎత్తు 43.43 మీటర్లు. బరువు 630.58 టన్నులు. కేర్ బరువు 3735 కిలోలు. వ్యాసం 3.1 మీటర్లు. వ్యోమగామి గదిని ధృడమైన అల్యూమినియంతో తయారు చేస్తారు.
* అంతరిక్షంలోకి మానవుడిని పంపే ప్రయత్నంలో భాగంగా వ్యోమగామి మాడ్యూల్‌ను భారత్ 2014, డిసెంబరు 18న విజయవంతంగా పరీక్షించింది.
క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్ (CARE)
* ప్రయోగించిన 5.4 నిమిషాలకు భూమికి 126.5 కి.మీ. ఎత్తులో ఉండగా రాకెట్ నుంచి కేర్ మాడ్యూల్ విడిపోయింది. సముద్ర మట్టానికి 80 కి.మీ. ఎత్తులో ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రయాణించింది. ఈ క్రమంలో 1600ºC వరకు ఉష్ణోగ్రతను దీని ఉష్ణరక్షణ వ్యవస్థ తట్టుకుంది.
* బాలిస్టిక్‌మోడ్‌లో కిందికి దిగింది. దీని వేగాన్ని అదుపు చేసేందుకు పారాచూట్‌లు విచ్చుకున్నాయి.
* ఈ పారాచూట్‌లను డీఆర్‌డీవోకు చెందిన ఏరియల్ డెలివరి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఆగ్రా) రూపొందించింది.
* ప్రధాన పారాచూట్ వ్యాసం 31 మీటర్లు. ఇది దేశంలోనే అతిపెద్ద పారాచూట్.
* ఇది మాడ్యూల్ వేగాన్ని సెకనుకు 7 కి.మీ.కు తగ్గించింది.
* మొత్తం మీద 20 నిమిషాలకు కేర్ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్‌కు 180 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో పడింది.
* ఈ ప్రయోగం విజయవంతమైనా మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోకు మరో పదేళ్లు పడుతుంది.
* మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారత ప్రభుత్వం ఇంకా లాంచన ఆమోదం తెలియజేయలేదు.
* జీఎస్ఎల్వీ - డి3, జీఎస్ఎల్వీ - డి5 లలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజన్‌లను ఉపయోగించారు
జీఎస్ఎల్వీ ప్రయోగాలు
* జీఎస్ఎల్వీ ప్రయోగాలన్నింటినీ జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో ప్రవేశపెట్టారు.


ఇస్రో సాధించిన ఇతర విజయాలు
చంద్రయాన్ I:
* ఈ ప్రాజెక్టు డైరెక్టర్ డా. మలయస్వామి అన్నాదురై. దీనికి అయిన వ్యయం రూ.386 కోట్లు.
* ఈ యాత్ర చేపట్టిన మొదటి దేశం అమెరికా, ఆరో దేశం భారత్.
ముఖ్య ఉద్దేశం:
1) చంద్రుడి ఆవిర్భావ అధ్యయనం
2) చంద్రుడిపై నీటి జాడ, ఖనిజ వనరుల గుర్తింపు
* చంద్రయాన్ - Iలో 11 పేలోడ్‌లను పొందుపరచి పీఎస్ఎల్వీ - సీ11 రాకెట్ సహాయంతో 2008, అక్టోబరు 22న శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
* దీన్ని మొదట భూకక్ష్యలో పరిభ్రమింపజేసిన తర్వాత చంద్రుడిని 100 కి.మీ. కక్ష్యలోకి బదిలీ చేశారు.
* దీనిలో అమర్చిన పేలోడ్‌లు
     
* ఇది 312 రోజులు పనిచేసి 60% పనిని పూర్తి చేసింది. 70,000 ఫోటోలను పంపింది. దీన్ని పరిశీలించి చంద్రుడిపై నీటి జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. 2009, ఆగస్టు 29న దీని స్టార్ సెన్సన్ విఫలం చెందడం వల్ల సంకేతాలు నిలిచిపోయాయి.
* చంద్రయాన్ - I పంపిన సంకేతాలను రీసివ్ చేసుకునే కేంద్రాన్ని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ అంటారు.
*ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్
* ఇది దేశంలో అతిపెద్ద ఆంటెన్నా. దీన్ని బెంగళూరుకు సమీపంలో 'బైలాలు' అనే గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.
* ఇది 32 మీటర్ల వ్యాసం, 60 టన్నుల బరువుతో ఉంటుంది.
చంద్రయాన్ - II
* ఈ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ మలయస్వామి అన్నాదురై. అంచనా వ్యయం రూ.426 కోట్లు.
* దీనిలో భాగంగా స్మార్ట్ నవ్ అనే రోవర్‌ను చంద్రుడిపైకి పంపుతారు.
* స్మార్ట్ నవ్ రోవర్‌ను రష్యా సహకారంతో రూపొందించారు.
మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)
* దీని ప్రాజెక్టు డైరెక్టరు మలయస్వామి అన్నాదురై.
* అరుణగ్రహం లేదా కుజగ్రహ యాత్రకు భారత్‌పెట్టిన పేరు మంగళ్‌యాన్ లేదా మామ్ (MOM)
* దీన్ని 2013, నవంబరు 5న ప్రయోగించారు.
* ప్రాజెక్టు వ్యయం రూ.450 కోట్లు.
* మామ్ బరువు 1337 కిలోలు, ఖర్చయిన ఇంధనం 852 కిలోలు.
* ఉపయోగించిన రాకెట్ పీఎస్ఎల్వీ - సీ25.
* పీఎస్ఎల్వీ - సీ25 ఈ ప్రయోగం ద్వారా సిల్వర్ జూబ్లీ రాకెట్‌గా పేరుపొందింది.
* ప్రయోగ కేంద్రం షార్ (SHAR).
* మామ్ భూకక్ష్యను 2013, డిసెంబరు 1న వీడింది. 78 కోట్ల కి.మీ. ప్రయాణించి కుజగ్రహ కక్ష్యలోనికి 2014, సెప్టెంబరు 24న ప్రవేశించింది.
* తొలి సంకేతాలు అందించిన కేంద్రం డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కాంపెక్ల్స్, కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా).
* ఇక్కడి నుంచి సమాచారం అందే ప్రదేశం ISTRAC.
(ISRO Telemetry Tracking & Command Network) - Bangalore
* అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ 2015కు గాను మామ్ (MOM) ప్రోగ్రాంకు 'స్పేస్ సైన్స్ పయోనీర్' అవార్డును పొందింది.
మిషన్ లక్ష్యాలు:
* ఇది ఇస్రో మొదటి ప్రయత్నంలోనే సాధించిన విజయం
* కుజుడు ఉపరితల సహజ స్వరూపాలు తెలుసుకోవడం
* జీవ ఉనికికి సంబంధించిన మిథేన్ వాయువు ఉనికిని గుర్తించడం
* ఏ రకమైన వాతావరణం ఉందో తెలుసుకోవడం
వాడిన పరికరాలు
* ఈ పరికరాల ఏర్పాటును సూచించిన సలహా సంఘం అధ్యక్షుడు ప్రొ. యు.ఆర్. రావు.
మార్స్ కలర్ కెమెరా (MCC)
* దీని బరువు 1.27 కిలోలు. ఇది అంగారక ఉపరితల స్వరూప స్వభావాలను ఫొటో తీస్తుంది.
థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్టర్ మీటర్ (TIIS)
* దీని బరువు 3.2 కిలోలు. ఇది ఖనిజాలను, మట్టి రకాలను పరిశీలిస్తుంది.
మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్ (MSM)
* దీని బరువు 2.94 కిలోలు. మీథేన్ వాయువు ఉనికిని తెలియజేస్తుంది.
ఇప్పటి వరకు అంగారకుడిపై ప్రయోగాలు నిర్వహించిన దేశాలు
  1. సోవియట్ యూనియన్ (విఫలమైంది)
  2. అమెరికా
  3. జపాన్ (విఫలమైంది)
  4. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
  5. చైనా (విఫలమైంది)
  6. భారతదేశం

* అంగారకుడిపైకి అమెరికా ప్రయోగించిన ముఖ్య ఉపగ్రహాలు క్యూరియాసిటీ, మావెన్.
* అమెరికా క్యూరియాసిటీని 2011, మావెన్‌ను 2013 నవంబరులో అంగారకుడిపైకి ప్రయోగించింది.
మార్స్ ఇన్‌స్ఫెరిక్ న్యాచురల్ కాంపోజిషన్ అనలైజర్స్ (MINCA)
* దీని బరువు 3.56 కిలోలు. ఇది ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది.
లైమ్స్ ఆల్ఫా ఫోటో మీటర్ (LAP)
* దీని బరువు 1.97 కిలోలు. ఉపరితలంలోని హైడ్రోజన్, డ్యూటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.
మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోల్టాయిక్ ఎవల్యూషన్ మిషన్ (MAVEN)
* అమెరికా ప్రయోగించిన మిషన్ మావెన్.
* దీన్ని నాసా 2013, నవంబరు 18న ప్రయోగించింది.
* 307 రోజుల్లో 71.2 కోట్ల కిలో మీటర్లు ప్రయాణించి 2014, సెప్టెంబరు 21న కుజ కక్ష్యలోకి ప్రవేశించింది. దీని ఖర్చు రూ.4000 కోట్లు.
* నాసాకు చెందిన 'క్యూరియాసిటీ' అనే రోవర్ 2012, ఆగస్టు 6న అంగారకుడిని చేరింది. 2011 నవంబరులో కేప్‌కెనరావల్ నుంచి పంపారు. ఇది అంగారకుడి 'గేల్' క్రేటర్‌పై దిగింది.
రీ యూసబుల్ లాంచింగ్ వెహికల్ - టెక్నాలజీ డీమానిస్త్ట్రెజేషన్ (RLV - TD)
* 2016, మే 23న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
* ఇది అంతరిక్షంలోని 65 కి.మీ.ల ఎత్తుకు వెళ్లి గ్రేట్ నికోబార్ దీవుల సముదాయంలో బంగాళాఖాతంలో పడింది.
* దీని ద్వారా భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయోగాలు చేయవచ్చు.
* దీనిలో HS - 9 రాకెట్ క్లస్టర్‌ను ఉపయోగించారు.
* దీని బరువు 1500 కిలోలు.
అనురాధ (ANURADHA)
* తక్కువ శక్తి ఉన్న కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రీయ పరికరం. ఇది టీఐఎఫ్ఆర్ (బాంబే), ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (అహ్మాదాబాద్), బార్క్‌ల సంయుక్త సంస్థ.
* 1985, ఏప్రిల్ 29న అంతరిక్షంలోకి అమెరికా అంతరిక్ష నౌక 'ఛాలెంజర్' ద్వారా పంపారు.


భారతదేశానికి చెందిన వ్యోమగాములు
రాకేష్ శర్మ
* ఇతడు 1949, జనవరి 13న పంజాబ్‌లోని 'పాటియాలా'లో జన్మించారు.
* మొదటి భారత వ్యోమగామి. స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ 1984, ఏప్రిల్ 3న యూరిమలైషన్, గెన్నాడి స్ట్రెకలోవ్ రష్యా వ్యోమగాములతో కలసి 'సోయజ్ T - 11' రోదసీ నౌక ద్వారా అంతరిక్షయానం చేశారు.
* ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలసి అంతరిక్షంలో సుమారు 7 రోజుల 21 గంటల 40 నిమిషాలపాటు గడిపి తిరిగి సురక్షితంగా సెల్యూట్ 7 నుంచి 1984, ఏప్రిల్ 11న భూమిని చేరారు.
* అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో అంతరిక్షం నుంచి సంభాషించారు.
కల్పనాచావ్లా
* భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి.
* ఈమె హరియాణాలోని కర్నాల్‌లో 1962, మార్చి 17న జన్మించారు.
* ఈమె రెండుసార్లు అంతరిక్షయానం చేసి, అక్కడ 31 రోజుల 14 గంటల 54 నిమిషాలపాటు గడిపారు.
* 2003 జనవరిలో 'కొలంబియా' అనే స్పేస్‌షటిల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. ఇది 2003, ఫిబ్రవరి 1న భూమిపైకి వచ్చేటపుడు కూలిపోయింది. ఈ సంఘటనలో ఆమె మరణించింది.
సునీతా విలియమ్స్
* భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్. అమెరికాలోని ఓషియోనా రాష్ట్రంలో 'యూక్లిడ్' పట్టణంలో 1965, సెప్టెంబరు 19న జన్మించారు.
* ఇప్పటి వరకు మూడుసార్లు అంతరిక్షయానం చేశారు.
* ఈమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 321 రోజుల 17 గంటల 15 నిమిషాలపాటు గడిపారు.
* అంతరిక్షంలో చేసిన మొత్తం స్పేస్‌వాక్ సమయం 50 గంటల 40 నిమిషాలు. మూడోసారి 2012, జులై 15న అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి 2012, నవంబర్ 19న భూమిని చేరారు.
* భవిష్యత్తులో అమెరికా చేపట్టే అంగారకుడి యాత్రకు సునీతా విలియమ్స్ సెలెక్ట్ అయ్యారు.


అంతర్జాతీయ అంతరిక్ష విజ్ఞానం
* ప్రపంచంలో కొన్ని దేశాలు అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా అంతరిక్ష సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.
* అమెరికా - నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మిస్ట్రేషన్ (NASA). దీన్ని 1958, జులై 29న వాషింగ్టన్‌లో స్థాపించారు.
* రష్యా - రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ (ROSCOSMOS) 1992లో మాస్కోలో ఏర్పాటు చేశారు.
* యూరోపియన్ యూనియన్ - యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA).దీన్ని 1975లో పారిస్ (ఫ్రాన్స్)లో ఏర్పాటు చేశారు.
* ఫ్రాన్స్ - సెంటర్ నేషనల్ ఎట్యూడ్స్ స్ఫాటిలెట్స్ (CNES) 1961లో పారిస్‌లో ఏర్పాటు చేశారు.
* భారతదేశం - ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO). 1969లో బెంగళూరులో ఏర్పాటు చేశారు.
* చైనా - చైనా నేషనల్ స్పేస్ అడ్మిస్ట్రేషన్ (CNSA). దీన్ని 1993లో బీజింగ్‌లో ఏర్పాటు చేశారు.
* జపాన్ - జపాన్ ఏరోస్పేస్ ఎక్సోప్లోరేషన్ ఏజెన్సీ (JAXA), (2003 టోక్యో)
* కెనడా - కెనడా స్పేస్ ఏజెన్సీ (CSA), (1989 క్యూబెక్)
* దక్షిణకొరియా - కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (KARI) (డీజాన్ కొరియా)
* ఉత్తరకొరియా - నేషనల్ ఏరోస్పేస్ డెవలప్‌మెంట్ అడ్మిస్ట్రేషన్, (NADA)
* ఇరాన్ - ఇరాన్ స్పేస్ ఏజెన్సీ (ISA)


స్పేస్ షటిల్స్
* ఈ ప్రోగ్రాంను స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (STS)అనే కార్యక్రమంలో భాగంగా అమెరికా ప్రారంభించింది. వీటి సహాయంతో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, వ్యోమగాములు, ఆహార పదార్థాలు లాంటి వాటిని అంతరిక్షంలోకి సరఫరా చేయడానికి అమెరికా ఉపయోగించింది. వీటిని కాలిఫోర్నియాలోని 'రాక్‌వెల్ ఇంటర్‌నేషనల్' అనే సంస్థ నిర్మించింది.
కొలంబియా
* కొలంబియా మొదటి ప్రయోగం 1981, ఏప్రిల్ 12న జరిగింది. అంతరిక్షం నుంచి తిరిగివస్తూ భూమి ఉపరితలానికి 61 కి.మీ. దూరంలో ఉండగా 2003, ఫిబ్రవరి 1న ఏడుగురు వ్యోమగాములున్న అమెరికా స్పేస్‌షటిల్ పేలిపోయింది.
* దీనిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణించారు.
ఛాలెంజర్
* ఇది అమెరికన్ స్పేస్ షటిల్. దీన్ని 1983 ఏప్రిల్‌లో మొదటిసారి ప్రయోగించారు. 1986, జనవరి 28న రెండోసారి అంతరిక్షంలోకి ప్రయోగించినప్పుడు ఇందులో ఉన్న ఏడుగురు వ్యోమగాములతో సహా పేలిపోయింది.
* మొదటగా పేలిపోయిన తొలి అమెరికన్ స్పేన్‌షటిల్ ఛాలెంజర్.
అట్లాంటిస్
* దీన్ని 1985 అక్టోబరులో మొదటిసారి పంపారు. చివరిసారిగా 2011 జులైలో అంతరిక్షయానం చేసింది. మొత్తంగా ఇది 33 సార్లు అంతరిక్షయానం చేసింది.
డిస్కవరీ
* దీన్ని 1984, ఆగస్టు 30న తొలిసారిగా అంతరిక్షంలోకి పంపారు.
* 1995లో రష్యా అంతరిక్ష పరిశోధనశాల 'మిర్‌'తో అనుసంధానమైన మొదటి స్పేస్‌షటిల్.
* 39 సార్లు అంతరిక్షయానం చేసింది.
* చివరిసారిగా 2011, మార్చి 9న ప్రయోగించారు.
ఎండీవర్
* దీన్ని 1992, మే 7న మొదటిసారి ఛాలెంజర్‌కు బదులుగా అంతరిక్షంలోకి పంపారు. చివరిసారి 2011 మేలో ప్రయోగించారు.
* ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా సైన్స్ సెంటర్‌లో ఉంది.
* పై అన్ని స్పేస్‌షటిల్లలో ఎక్కువ దూరం ప్రయాణించి, ఎక్కువ మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది డిస్కవరీ.
* భవిష్యత్తులో అమెరికా తన అంతరిక్ష కార్యకలాపాలకోసం రూపొందించనున్న కొత్తరకం స్పేస్‌షటిల్ 'వొరియన్' (Vorian).


అంతరిక్ష ప్రయోగశాలలు
* విశ్వాంతరాళంలో భారరహిత స్థితిలో వివిధ ప్రయోగాలను నిర్వహించడానికి అంతరిక్ష ప్రయోగశాలలను ఉపయోగిస్తారు.
సెల్యూట్
* దీన్ని 1971లో రష్యా ఏర్పాటు చేసింది. దీని శ్రేణిలో భాగమైన సెల్యూట్ 7లో భారత మొదటి వ్యోమగామి రాకేష్ శర్మ వారం రోజుల పాటు గడిపి అనేక ప్రయోగాలు చేశారు.
స్కైలాబ్
* ఇది అమెరికా మొదటి అంతరిక్ష ప్రయోగశాల. దీన్ని 1973, మే 14న ఏర్పాటు చేశారు. 1979 జులై 11న భూమిపై కూలిపోయింది.
మిర్
*  ఇది రష్యా అంతరిక్ష ప్రయోగశాల.
*  'మిర్' అంటే శాంతి, ప్రపంచం అని అర్థం.
*  1986 ఫిబ్రవరిలో రష్యా 'మిర్‌'ను ఏర్పాటు చేసింది.
*  మిర్ మల్టీ మాడ్యులర్ స్టేషన్ ఆరు స్పేస్‌క్రాప్ట్‌లను ఒకేసారి తన వద్ద ఉంచుకోగలదు.
*  దీని సౌరఫలకలు పనిచేయకపోవడంతో 2001, మార్చి 23న దక్షిణ ఫసిఫిక్ సముద్రంలో కూల్చివేశారు.
*  ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.
*  దీన్ని 16 దేశాలు కలసి సంయుక్తంగా నిర్మించాయి.
దీని నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు: NASA, RASCOSMOS, JAXA, ESA, CSA.
తియాంగ్ గాంగ్ 1
* దీని నిర్మాణం 1998లో ప్రారంభించారు.
* ఇది చైనా మొదటి అంతరిక్ష ప్రయోగకేంద్రం.
* 2011, సెప్టెంబరు 29న ప్రారంభించారు. 2020కి పూర్తికావచ్చని భావిస్తున్నారు.
* అంతరిక్ష ప్రయోగశాల ఏర్పరుచుకున్న మొదటి ఆసియా దేశం చైనా.
తియాంగ్ గాంగ్ 2
* దీన్ని చైనా 2016, సెప్టెంబరు 15న ప్రారంభించింది.
అంతరిక్ష నౌకలు
* భూమి నుంచి ప్రయోగించినప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ఇతర గ్రహాల గురించి అధ్యయనం చేస్తాయి.
* ఇప్పటి వరకు అనేక అంతరిక్ష నౌకలను పంపారు.
వాయజేర్ 1
 దీన్ని 1977, సెప్టెంబరు 5న నాసా ప్రయోగించింది. ఇది సౌరకుటుంబం అంచులను దాటి అవతలికి వెళ్లిన తొలి మానవ నిర్మిత అంతరిక్ష నౌక.
 దీని బరువు 722 కిలోలు.
 2012 ఆగస్టు నాటికి 1900 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
 2025 వరకు పనిచేస్తుంది.
 ఇది తన ప్రయాణమార్గంలో గురుగ్రహం, శనిగ్రహం, టైటాన్‌లను సందర్శించింది.
వాయజేర్ 2
* 722 కిలోల బరువున్న దీన్ని 1977, ఆగస్టు 20న ప్రయోగించారు. ఇది 2025 వరకు పని చేస్తుంది.
న్యూ హోరిజన్
* 2006, జనవరి 20న నాసా ప్లూటో గ్రహం అధ్యయనం కోసం దీన్ని ప్రయోగించింది.
* ఇది 9 సంవత్సరాల 6 నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించి 2015, జులై 14 నాటికి ప్లూటోను సమీపించి, దాని ఫోటోలను గ్రౌండ్ స్టేషన్‌కు పంపింది.
జునో (Juno)
* ఇది సౌరశక్తితో పనిచేసే అంతరిక్ష నౌక. నాసా 2011, ఆగస్టు 5న అంతరిక్షంలోకి ప్రయోగించింది.
* దీని ద్వారా బృహస్పతిపై ప్రయోగాలు జరిపారు.
* ఇది 5 ఏళ్లపాటు బృహస్పతి చుట్టూ 33 పరిభ్రమణాలు చేస్తుంది.
రోవర్‌లు
* ఇవి గ్రహంపైకి దిగి తమంతటతాము కదులుతూ వాటికి అమర్చిన శక్తిమంతమైన కెమెరాలతో ఫోటోలు తీసి భూమిపైకి పంపుతాయి.
* అంగారకుడిపై పంపిన రోవర్లలో ముఖ్యమైనవి పాత్ ఫైండర్, మార్స్ ఒడిస్సీ, స్పిరిట్ రోవర్, ఆపర్చునిటీస్ రోవర్, మార్స్ ఫినిక్స్.
* అంగారకుడిపై ఎక్కువ దూరం ప్రయాణించిన రోవర్ అపర్చునిటీస్. ఇది 43 కి.మీ. దూరం ప్రయాణించింది.
క్యూరియాసిటి
* 990 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఈ రోవర్ పొడవు 2.9 మీటర్లు, వెడల్పు 2.7 మీటర్లు, ఎత్తు 2.2 మీటర్లు.
* దీన్ని 2011, నవంబరు 26న అట్లాంటిస్ సహాయంతో పంపారు.
* 2012, ఆగస్టు 6న కుజగ్రహంపై విజయవంతంగా దిగింది.
* నాసా క్యూరియాసిటీ రోవర్ పురాతన అగ్నిపర్వతం నుంచి మొదటి ఫొటోను పంపింది.

 

ప్రపంచంలో వివిధ దేశాల్లోని రాకెట్ ప్రయోగ కేంద్రాలు

1. భారత్ సతీష్ ధావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం
2. కజకిస్థాన్ బైకనూర్
3. ఫ్రెంచ్ గయానా కౌరు
4. అమెరికా కెనడీ రాకెట్ ప్రయోగ కేంద్రం (ఫ్లోరిడా)
5. చైనా జ్యూక్వాన్ రాకెట్ ప్రయోగ కేంద్రం
6. అమెరికా వాండెన్ బెర్గ్ రాకెట్ ప్రయోగ కేంద్రం (కాలిఫోర్నియా)
7. బ్రెజిల్ ఆల్ కంటారా రాకెట్ ప్రయోగ కేంద్రం
8. జపాన్ కాగోషియా అండ్ టానేషియా రాకెట్ ప్రయోగ కేంద్రం
9. రష్యా కపూస్టీన్‌యార్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం
10. ఇటలీ సాన్ మార్కో రాకెట్ ప్రయోగ కేంద్రం


అంతరిక్ష పర్యటకులు
మొదటి అంతరిక్ష పర్యటకుడు: డెన్రిస్‌టిట్. 2001లో పర్యటించారు. (అమెరికా)
రెండో పర్యటకుడు: దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ షటిల్ వర్త్ (2002).
మూడో పర్యటకుడు: గ్రెగరీ ఓల్సన్ (అమెరికా). 2005లో పర్యటించాడు.
నాలుగో పర్యటకుడు: ఇరాన్ సంతతికి చెందిన 'అనౌషె అన్సారీ'
అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళ అన్సారీ (2006).
అయిదో పర్యటకుడు: 'చార్లెస్ సిమోని' (అమెరికా). 2007 ఏప్రిల్‌లో పర్యటించారు.

 

ఖగోళ పరిశోధన నౌకలు

చంద్రుడి యాత్ర:
* అమెరికా 'అపోలో', రష్యా 'లూనా' అనే ప్రోగ్రాంను ప్రారంభించాయి.
* 2003, సెప్టెంబరు 27న 287 కిలోల ద్రవ్యరాశి ఉన్న స్మార్ట్ - 1ను యూరోపియన్ ఏజెన్సీ ప్రయోగించింది. (స్మాల్ మిషన్ ఫర్ అడ్వాన్సుడ్ రీసెర్చ్ టెక్నాలజీ - SMART)
* జపాన్ 'హితెన్' (Hiten) అనే అంతరిక్ష నౌకను 1990, జనవరి 24న; సీలెన్ లేదా కగూయాను 2007, సెప్టెంబరు 14న ప్రయోగించింది.
* చైనా చంద్రుడిపైకి చాంగ్ - 1 (2007, అక్టోబరు 24)
* చాంగ్ - 2 (2010, అక్టోబరు 2)
* చాంగ్ - 3 (2013, డిసెంబరు 1) న ప్రయోగించింది.
* భారత్ చంద్రయాన్ - 1ను 2008, అక్టోబరు 22న పంపింది.
* అమెరికా ముగ్గురు వ్యోమగాములతో కూడిన అపోలో - II అంతరిక్ష నౌకను 1969, జులై 16న ప్రయోగించగా, అది తిరిగి 1969, జులై 20న చంద్రుడిపై దిగింది. మళ్లీ జులై 24న భూమిని చేరింది.
* చంద్రుడిపై కాలు మోపిన మొదటి వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.
* 12 మంది అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపారు.
* 12వ వ్యోమగామి యూజిన్ సెర్నర్ 1972, డిసెంబరు 11న చంద్రుని యాత్ర చేశారు. ఇతడే చివరి వ్యోమగామి.
* వీరు చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టి 380 కిలోలు.
* చంద్రుడి ఇసుక, మట్టి, రాళ్లను, 'ఆర్మాకాలైట్' అంటారు.


అంతరిక్ష ప్రమాదాలు
 i) 1967లో అపోలో - 1 ప్రమాదం - ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
 ii) 1967లో సోయెజ్ - 1లో ఒక వ్యోమగామి చనిపోయారు.
 iii) 1971లో సోయెజ్ - 2లో ముగ్గురు వ్యోమగాములు చనిపోయారు.
 iv) 1986లో ఛాలెంజర్‌లో ఏడుగురు వ్యోమగాములు చనిపోయారు.
 v) 2003లో కొలంబియాలో ఏడుగురు వ్యోమగాములు మరణించారు.


చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ
1999, జులై 23న కొలంబియా అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్‌లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగికెగసింది. ఈ వ్యోమనౌక నుంచి 'చంద్ర' ఎక్స్‌రే అబ్జర్వేటరీని అంతరిక్షంలోకి వదిలారు. 46 అడుగుల పొడవు, 6 టన్నుల బరువున్న ఈ అంతరిక్ష టెలిస్కోప్ ఇప్పటి వరకు ప్రయోగించిన టెలిస్కోప్‌లన్నింటిలో అత్యంత శక్తిమంతమైంది.
* భారత సంతతికి చెందిన ఎస్. చంద్రశేఖర్ జ్ఞాపకార్థం దీనికి ఆయన పేరు పెట్టారు.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌