• facebook
  • whatsapp
  • telegram

భారత ద్వీపకల్ప నదీ వ్యవస్థ

తూర్పుగా ప్రవహించే నదులు 

ద్వీపకల్ప నదీవ్యవస్థలో తూర్పుగా ప్రవహించే ప్రధాన నదులు - గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్న

గోదావరి

 ఇది ద్వీపకల్ప నదుల్లోకెల్లా అతి పెద్దది, దక్షిణ భారతదేశ నదుల్లోకెల్లా అత్యంత పొడవైంది.

 దీన్నే ఇండియన్‌ రైన్, దక్షిణ గంగ, వృద్ధ గంగ అని పిలుస్తారు.

 ఇది పశ్చిమ కనుమల్లో, మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఉన్న త్రయంబకం వద్ద జన్మిస్తుంది.

 దీని మొత్తం పొడవు 1465 కి.మీ.

 దీని పరివాహక ప్రాంతం ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.

 గోదావరి నదికి ఎడమవైపు ఉన్న ఉపనదులు - ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, మచ్‌కుండ్, వార్ధా, పెన్‌గంగా మొదలైనవి.

 గోదావరికి కుడివైపు ఉన్న ఉపనదులు - మంజీర, మానేరు, ప్రవర, కిన్నెరసాని మొదలైనవి.

 గోదావరి నది పాపికొండల మధ్య బైసన్‌ గార్జ్‌ను ఏర్పరుస్తుంది.

 చివరిగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. సముద్రంలో కలవడానికి ముందు ఇది గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనే 7 శాఖలుగా (సప్త గోదావరిగా) చీలిపోతుంది.

 గౌతమి, వశిష్ట పాయల మధ్య ఏర్పడిన దీవిని లేదా డెల్టాను కోనసీమగా పిలుస్తారు.

 గోదావరి నదిపై నిర్మించిన ప్రధాన ఆనకట్టలు - గంగాపూర్, జయక్వాడి (మహారాష్ట్ర); కాళేశ్వరం (తెలంగాణ); పోలవరం (ఆంధ్రప్రదేశ్‌).

 గోదావరి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు - నాసిక్‌ (మహారాష్ట్ర), రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్‌).

 గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు - బాసర, భద్రాచలం


ప్రాణహిత


 గోదావరి ఉపనదుల్లోకెల్లా పెద్దది.

 వార్ధా, వైన్‌గంగ, పెన్‌గంగ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది.

 మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తుంది.

మంజీర నది

 మహారాష్ట్రలోని బాలాఘాట్‌ కొండల్లో జన్మిస్తుంది.

 కర్ణాటక, తెలంగాణ మీదుగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తుంది.

కృష్ణా నది

 ద్వీపకల్ప నదుల్లో రెండో పెద్దనది.

 ఇది పశ్చిమ కనుమల్లో, మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది.

 కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా ప్రవహించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

 ఇది శ్రీశైలం సమీపంలో పాతాళ గంగ గార్జ్‌ను ఏర్పరుస్తుంది.

 దీని మొత్తం పొడవు దాదాపు 1400 కి.మీ.

 ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడకు దిగువన పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, కొంతదూరం ప్రవహించాక మళ్లీ ఒకటిగా కలిసిపోతుంది. ఈ రెండు పాయల మధ్య ఉన్న దీవినే ‘దివిసీమ’ అంటారు.

 ఆల్మట్టి ఆనకట్ట (కర్ణాటక), బసవసాగర్‌ డ్యాం లేదా నారాయణపూర్‌ (కర్ణాటక), నాగార్జునసాగర్‌ (తెలంగాణ), శ్రీశైలం డ్యాం (ఆంధ్రప్రదేశ్‌)లను కృష్ణా నదిపై నిర్మించారు.

 కృష్ణానది ముఖ్య ఉపనదులు - తుంగభద్ర, దిండి, భీమ, కొయన, వర్ణ, ఘటప్రభ, మలప్రభ, మూసీ మొదలైనవి.

కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రధాన పట్టణం - విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌).

తుంగభద్ర

 ఇది కృష్ణా నదికి ముఖ్యమైన, అతిపెద్ద ఉపనది.

 పశ్చిమ కనుమల్లో ఉన్న వరాహ పర్వతాల్లో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ నది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి సంగంవద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

 తుంగభద్ర ప్రధాన ఉపనదులు - వేదవతి, కుముదవతి, హంద్రి, హగరి. ఈ ఉపనదుల్లో పెద్దది హగరి నది.

 తుంగభద్ర ఒడ్డున్న ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రం - మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయం.

 తుంగభద్ర నదిపై కర్ణాటకలోని హోస్పేట వద్ద ఆనకట్టను నిర్మించారు. దీన్ని నీటిపారుదలకు, జలవిద్యుత్‌శక్తికి ఉపయోగిస్తున్నారు.

మహానది

 ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌ జిల్లాలో సిహావ వద్ద జన్మించి, ఒడిశా మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది.

 దీని మొత్తం పొడవు దాదాపు 858 కి.మీ.

 ప్రధాన ఉపనదులు - ఇబ్, జోంగ్, తెన్‌ మొదలైనవి.

 ఒడిశాలోని కటక్‌ జిల్లాలో విశాలమైన డెల్టాను ఏర్పరుస్తుంది. 

 మహానదిపై ఉన్న ప్రముఖ ఆనకట్ట - హీరాకుడ్‌.

 మహానది, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ‘కళింగ’ అంటారు.

కావేరి నది

 ఇది పశ్చిమ కనుమల్లో, కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లా బ్రహ్మగిరి కొండల్లో ఉన్న తలకావేరి వద్ద జన్మిస్తుంది.

 ఇది తమిళనాడు మీదుగా ప్రయాణిచి చివరకు కావేరి పట్టణం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

 కావేరి నదిపై ఉన్న ప్రముఖ జలపాతాలు - శివసముద్ర, హోగైనికల్‌.

 ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే వర్షపాతం ఆధారంగా కావేరి నది ప్రవహిస్తుంది.

 దీని ప్రధాన ఉపనదులు - హేరంగి, హేమావతి, ఆర్కావటి, కుందా, భవాని, లక్ష్మణతీర్థ మొదలైనవి.  

 దీనిపై నిర్మించిన ప్రధాన ఆనకట్ట - కృష్ణరాజసాగర్‌

 కావేరి నది ఒడ్డున ఉన్న ప్రముఖ పట్టణాలు - శ్రీరంగపట్నం (కర్ణాటక), తిరుచునాపల్లి (తమిళనాడు).

పెన్నా నది

 దీన్ని పినాకిని అని కూడా పిలుస్తారు.

​​​​​​​ ఈ నది కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో  ఉన్న చెన్నకేశ్వర కొండ వద్ద జన్మిస్తుంది.

​​​​​​​ ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తూ నెల్లూరు జిల్లా ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

​​​​​​​ పెన్నా నదిని ‘రాయలసీమ జీవనాడి’ అని అంటారు.

​​​​​​​ దీని ప్రధాన ఉపనదులు - జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, చిత్రావతి, పాపాఘ్ని.

​​​​​​​ పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ పట్టణం - నెల్లూరు (ఆంధ్రప్రదేశ్‌) 

ద్వీపకల్ప నదీ వ్యవస్థ హిమాలయ నదీ వ్యవస్థ కంటే పురాతనమైంది. ద్వీపకల్ప నదీ వ్యవస్థలో ఉన్నవి జీవ నదులు కావు. వీటి ప్రవాహాలకు రుతుపవన వర్షాలే ప్రధాన ఆధారం. కాబట్టి వీటిని రుతుపవన నదులు అని కూడా అంటారు.

భారత ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పునకు వాలి ఉంటుంది. ఈ నదీ వ్యవస్థలోని దాదాపు 90 శాతం నదులు తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మిగిలినవి  అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి.

పడమరగా ప్రవహించే నదులు

పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ముఖ్యనదులు నర్మద, తపతి, మహి, సబర్మతి మొదలైనవి.

నర్మదా నది

 పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్దది.

 దీన్నే రేవా నది, మార్బుల్‌ రివర్, గ్రాబెన్‌ రివర్‌ అని కూడా పిలుస్తారు.

 ఇది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌ వద్ద జన్మించి, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా ప్రవహించి, గుజరాత్‌లోని బారుచ్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.

 ఇది వింధ్య, సాత్పుర పర్వతాల మధ్య ఉన్న పగులులోయ లేదా విదీర్ణదరి మీదుగా ప్రవహిస్తుంది.

 ఈ నదిపై కపిలధార, ధువన్‌ధార, సహస్రధార, మార్బుల్‌ లాంటి జలపాతాలు ఉన్నాయి.

 ధువన్‌ధార జలపాతాన్ని ‘క్లౌడ్‌ ఆఫ్‌ మిస్ట్‌’ అని కూడా అంటారు.

 ఈ నది వల్ల గుజరాత్‌ తీర ప్రాంతంలో ‘అలియా బెట్‌’ అనే ద్వీపం ఏర్పడింది.

 దీని ప్రధాన ఉపనదులు - తావా, హిరన్, షేర్, ఓర్సంగ్, కోలార్‌ మొదలైనవి.

 నర్మదా నదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులు - ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, సర్దార్‌ సరోవర్‌

 నర్మదా నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరం - జబల్‌పుర్‌ (మధ్యప్రదేశ్‌)

తపతి నది

 పశ్చిమంగా ప్రవహించేవాటిలో రెండో పెద్ద నది.

 ఇది మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో ఉన్న ముల్తాయి వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా ప్రవహించి, గుజరాత్‌లోని గల్ఫ్‌ ఆఫ్‌ కాంబాట్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.

 ఇది సాత్పూరా, అజంతా కొండల మధ్య నర్మదా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. అందుకే ఈ రెండు నదులను కవల నదులు అంటారు.

 దీని ప్రధాన ఉపనదులు - పూర్ణ, కాప్రా, గిర్నా, గంజాల్, బోరి మొదలైనవి.

 తపతి నదిపై నిర్మించిన ప్రధాన ఆనకట్ట ఉకాయ్‌.

 ఈ నది ఒడ్డున ఉన్న ప్రధాన నగరం - సూరత్‌ (గుజరాత్‌)

మహి నది

​​​​​​​ ఇది మధ్యప్రదేశ్‌లోని వింధ్యపర్వతాల పశ్చిమ భాగంలో జన్మిస్తుంది. అక్కడి నుంచి వాయవ్య దిశగా ప్రవహించి రాజస్థాన్‌లోకి ప్రవేశించాక నైరుతివైపు తిరిగి గుజరాత్‌లోని గల్ఫ్‌ ఆఫ్‌ కాంబాట్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.

​​​​​​​ దీని ప్రధాన ఉపనదులు - అనాస్, పనమ్‌.

సబర్మతి 

 దీన్ని పూర్వం గిరికర్ణిక అని పిలిచేవారు.

 ఇది రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లాలో ఉన్న ఆరావళి పర్వతాల్లో మేవార్‌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. జయ సముద్రం (జయ్‌సమంద్‌) సరస్సును తాకుతూ గుజరాత్‌లోకి ప్రవేశించి గల్ఫ్‌ ఆఫ్‌ కాంబాట్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.

 సబర్మతి నది ఒడ్డున మహాత్మాగాంధీ ఆశ్రమం ఉంది.

 ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరం - అహ్మదాబాద్‌.


హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల మధ్య ప్రధాన భేదాలు

హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు
జీవనదులు జీవనదులు కావు. రుతుపవనాలపై ఆధారపడతాయి.
ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి ఏటవాలుగా ప్రవహించటం వల్ల  వేగంగా ప్రయాణిస్తూ లోతైన ముఖ ద్వారాలను ఏర్పరుస్తాయి. ఇవి ప్రవహించే మార్గంలో కఠిన శిలలు ఉంటాయి. ఈ నదులు వాటిని తొలచుకుంటూ, విశాలమైన లోయలను ఏర్పర్చి, నెమ్మదిగా ప్రవహిస్తాయి.
తక్కువ వయసు ఉంటుంది. వీటికి వయసు ఎక్కువ.
ఇవి ప్రవహించే ప్రాంతంలో ఒండ్రు నేలలు అధికంగా ఉండటం వల్ల కాలువలు తవ్వడం సులభం. హిమాలయ నదీ మైదానాలతో పోలిస్తే ఇక్కడ కాలువలు తవ్వటం కొద్దిగా కష్టం.

Posted Date : 26-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌