• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఓడించేయ్‌... ఒత్తిడిని!

ఆకలి లేదు.. నిద్ర రాదు.. సిలబస్‌ తరగదు!
మెలకువలు పాటిస్తే సజావుగా సన్నద్ధత
టెన్త్‌, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సూచనలు

ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి పోతూ ఉంటుంది. ఇది పరిమితుల్లో ఉంటే అనుకూల ఫలితాన్నే ఇస్తుంది. లక్ష్యం దిశగా ముందుకు వెళ్లడానికి సహకరిస్తుంది. కానీ మితిమీరితే మాత్రం దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్యంతోపాటు మార్కులపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. అందుకే పరీక్షల సన్నద్ధత సమయంలో కొన్ని మెలకువలు పాటించటంతో పాటు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి!

సిద్ధార్థ్‌.. మంచి విద్యార్థి. తరగతిలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు ఠక్కున సమాధానమిస్తాడు. కానీ పరీక్షల తేదీలు సమీపిస్తున్నకొద్దీ స్థ్థిమితంగా ఉండలేడు. చెమటలు కక్కేస్తుంటాడు. నీరసపడిపోతాడు. ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలిఉందనే భయం. చదివింది పరీక్షలో గుర్తుంటుందో లేదోనన్న కంగారు. కడుపునిండా అన్నం తినటం లేదు. సరిగా నిద్ర పోవటం లేదు. అతడిని చూసి తల్లిదండ్రులూ ఆందోళన పడుతున్నారు.

ఈ ఒత్తిడి సాధారణంగా పరీక్షల ముందు విద్యార్థులంతా ఎదుర్కొనేదే! కొందరు విద్యార్థులకు ఇది పెద్ద విషయం కాదు. వీరు దాన్ని ముందుకు సాగడానికి తోడ్పడే సాధనంగా మలుచుకుంటారు. పట్టుదలగా చదవడం, పునశ్చరణలపై దృష్టిపెట్టడం వంటివి చేస్తుంటారు. అందరి విషయంలోనూ ఇలాగే ఉంటుందని భావించలేం. ఎందుకంటే ఎక్కువమందిలో ఇది వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఎప్పుడూ తరగతి గదిలో ముందుండే విద్యార్థులూ పరీక్షల దగ్గరకొచ్చేసరికి బోల్తా పడుతుండటానికి కారణమిదే. దీని వల్ల ఒక్కోసారి విద్యార్థులకు చదవడమూ భారంగా అనిపిస్తుంది. ఈ ప్రభావం పరీక్షలు రాయటంపై పడుతుంది. ఒత్తిడి తీవ్రంగా ఉంటే విద్యార్థులు తమకు బాగా తెలిసిన జవాబులనూ గుర్తుతెచ్చుకోలేక ఇబ్బందిపడతారు. నిరాశతో సహజసిద్ధమైన ప్రతిభను ప్రదర్శించలేక మార్కులు కోల్పోతారు.

లక్షణాలివీ!
పరీక్షల ఒత్తిడికి గురైన విద్యార్థులను కొన్ని శారీరక, మానసిక లక్షణాల సాయంతో గుర్తించవచ్ఛు అన్నీ అందరిలో కనిపించకపోయినా కొన్నింటి ఆధారంగా ఒత్తిడిని కనుక్కోవచ్చు.

మానసికం:
చిరాకు, కోపం, నిరాశ, నిస్పృహ
విశ్రాంతికి దూరమవడం
మానసికంగా అలసిపోవడం
ఉదాసీనంగా ఉండటం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం
దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం

శారీరకం:
కండరాలు పట్టేయడం
అతిగా చెమటలు పట్టడం
ఆకలిలో మార్పులు, జీర్ణశక్తి తగ్గిపోవడం
నిద్ర పట్టకపోవడం
హృదయ స్పందనలో అనుకోని మార్పులు
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించడం
ఛాతిలో అసౌకర్యంగా ఉండటం
మలబద్ధకం/ విరేచనాలు
వెన్నునొప్పి

ఒత్తిడికి కారణాలేంటి?
సన్నద్ధతకు తగినంత సమయం లేకపోవడం
చదువుతున్నది సరిగా అర్థం కాకపోవడం
అనుకున్న మార్కులు సాధించాలన్న ఆరాటం
పరీక్షల్లో మార్కులు సరిగా రావేమోనన్న భయం.
సరిగా సిద్ధంకాలేదేమో అన్న సందేహం.
తోటివారు తమకన్నా ఎక్కువగా చదివేస్తున్నారన్న భయం.
తల్లిదండ్రులను మెప్పించాలన్న తపన
పోటీ ఎక్కువగా ఉందని భావించడం.

ఇలా చేస్తే.. సరి!
అవసరమైనవి అందుబాటులో: ‘చిందర వందరగా ఉండే విద్యార్థి డెస్క్‌ అతడి ఆలోచనలను సూచిస్తుంది’ అనే నానుడిని విన్నారా? శాస్త్రీయంగానూ ఇది నిజమే. చదువుకునే ప్రదేశం ఎంత ఎక్కువ సామాను, పుస్తకాలతో ఉంటే విద్యార్థిని అంతగా దృష్టికేంద్రీకరించకుండా చేస్తుంది. పరధ్యానాన్ని కలిగిస్తుంది. ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి, అనవసర వస్తువులను తొలగించాలి. ప్రేరణ కలిగించేవాటిని ఉంచుకోవచ్ఛు సన్నద్ధతలో అవసరమైనవి అందుబాటులో ఉండాలి. తగిన వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి.
ప్రాధాన్య క్రమంలో: సమయాన్ని సరిగా విభజించుకోవడలోనే సగం విజయం ఉంది. ఉన్న సమయం ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టులు, టాపిక్‌లను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలి.

చిన్న విరామాలు: చాలామంది పరీక్షలు దగ్గరకు వస్తున్నాయనగానే అదేపనిగా పుస్తకాలముందే కూర్చుంటారు. అలా కూర్చున్నా ఒక్కోసారి ఒకే అంశానికి గంటల సమయం కేటాయించాల్సి వస్తుంది. మెదడు అలసిపోయిందనడానికి సూచన అది. అప్పుడు 10- 15 నిమిషాలు విరామం తీసుకుంటే తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు. త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ విరామ సమయాన్ని కచ్చితంగా నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండాలి.
ఆహారం, నిద్ర, వ్యాయామం: పరీక్షలనగానే చాలామంది నైట్‌-అవుట్లు చేసేస్తారు. హడావుడిగా నాలుగు ముద్దలు తినడం, ఫ్లాస్కులకొద్దీ టీలను తాగేయడం చేస్తుంటారు. మెదడు సరిగా పనిచేయాలంటే తగిన పోషణ కావాలి. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. మెదడు ఆరోగ్యానికి నిద్ర ముఖ్యం. తగినంత సమయం నిద్రకు కేటాయించాలి. కొంత వ్యాయామమూ చేయాలి. చల్లగాలిలో నడవడం, మొక్కల మధ్య పచార్లు చేయడం, కొంతసేపు సూర్యరశ్మిలో ఉండటం లాంటివి చేయవచ్ఛు చిన్నచిన్న విరామాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు.

వీటికి దూరం: ఇప్పుడు విద్యార్థులందరి చేతిలోనూ మొబైల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి. ప్రతి విషయాన్నీ అందులో పంచుకోవడం సర్వసాధారణమైంది. ఇవీ ఒకరకంగా ఒత్తిడికి కారణమని ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. పదులు, వందల సంఖ్యలో ఉండే స్నేహితుల తాజా విషయాలు ఎప్పటికప్పుడు వాల్‌పై ప్రత్యక్షమవుతుంటాయి. వాటిపై మొదలయ్యే చర్చలు, చాటింగ్‌లతో సమయమంతా వృథా అవుతుంది. తెలియని ఆత్రుతకు దారి తీస్తుంది. పరీక్షలు ముగిసే వరకూ వీటికి దూరంగా ఉండటం మంచిది.

పోల్చుకోవద్దు: ఏ ఇద్దరూ ఒక విధంగా ఉండరు, ఆలోచించలేరు. ఒకరు ఒక పాఠాన్ని గంటలో పూర్తిచేయగలిగితే, ఇంకొకరికి రెండు గంటలు.. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ పట్టొచ్ఛు ముందుగా నేర్చుకున్నవారు గొప్ప కాదు, ఆలస్యంగా వచ్చినవారిది తక్కువ స్థాయి కాదు. కాబట్టి, ఇతరులకు ముందుగా వచ్చేసిందని కంగారుపడొద్ధు ఎవరికివారు సొంతంగా ప్రణాళిక వేసుకుని, ఆ మేరకు సిద్ధం కావాలి. పోల్చుకున్న ప్రతిసారీ వెనకబడిపోయామన్న భావన పెరిగి, ఒత్తిడికి దారితీస్తుంది.

పంచుకోండి: బాగా చదివినా, ఆందోళనగా ఉన్నా, చదవడంలో ఇబ్బందిగా అనిపించినా పక్కవారితో పంచుకోవాలి. తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఇలా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనిపించిన వారికి మనసులోని విషయాలను తెలియజేయాలి. వారి సూచనలు సాయపడతాయి. కనీసం మనసులోని భారం తగ్గుతుంది. ఒకరితో పంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే పేపర్‌పై రాయండి. అదీ మనసులోని ఆందోళనను తగ్గిస్తుంది.
పరీక్షకు సంబంధించిన టాపిక్‌లు, వాటిలో ముఖ్యమైనవీ, వచ్చినవీ, రానివీ జాబితా రాసుకోవాలి. పూర్తిచేసినవాటిని ఎప్పటికప్పుడు టిక్‌ చేసుకోవాలి. ఇలా ఒక్కో అంశం పూర్తవుతుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Posted Date : 09-10-2020

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని