• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు 

1. దైవాన్ని పూజించే విధానాలు ఎలా ఉండాలి? ఎందుకు?

జ: దైవాన్ని పూజించే విధానం శాస్త్రోక్తంగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రం దైవాన్ని ఎలా పూజించాలో వివరించింది. దైవానికి షోడశోపచారాలు చేసినట్లయితే పుణ్యఫలాలు అందుతాయి. భక్తియోగా విధానాన్ని అనుసరించాలి. పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండో పుష్పం దయ, మూడో పుష్పం ఏకాగ్రతలను కలిగి ఉండాలి.

2. ప్రజలు రాజులను ఆశ్రయించవచ్చా? ఎందుకు?

జ: ప్రజలు రాజులను ఆశ్రయించకూడదు. ఎందుకంటే తినడానికి అడిగితే ఎవరైనా తిండి పెడతారు. నివసించడానికి ఇళ్లు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లటి అమృతం లాంటి స్వచ్చమైన నీరు దొరుకుతుంది. కాపాడటానికి దేవుడు ఉన్నాడు.

3. సిరి లేకున్నా పండితుడు ఏయే గుణాల వల్ల శోభిస్తాడు?

జ: తలవంచి గురువు పాదాలకు నమస్కరించే గుణం, దాన గుణం, చెప్పే విషయాలను శ్రద్ధగా వినే గుణం, సత్యవ్రతమైన గుణం, భుజబలంతో విజయాలను పొందే గుణం, మనసు నిండా మంచితనం అనే గుణాల వల్ల సిరి లేకపోయినా పండితుడు శోభిస్తాడు.

4. రాముడి గొప్పదనాన్ని ఏవిధంగా చాటి చెప్పవచ్చు?

జ: రాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు. కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండాలను ఉపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండవం చూపేవాడు. కీర్తి పొందినవాడు. ఆయనకు సాటివచ్చే దైవం ఎవరూ లేరు. అందువల్ల మదించిన ఏనుగును ఎక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా వినిపించేలా రామచంద్రుడి గొప్పదనాన్ని చాటి చెప్పవచ్చు.

5. సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి?

జ: అనేక గ్రంథాలు చదివిన జ్ఞానం, దానం చేసిన ఫలితం, బహుమానం ఇస్తే వచ్చే ఫలితం, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కడితే వచ్చే ఫలితం, సత్రాలు కట్టించకున్నా లభించే మోక్షం.... ఇవన్నీ సత్ప్రవర్తన వల్ల వస్తాయి.
 

6. మోసం ఎందుకు చేయకూడదు?

జ: మోసం చేయడం మంచి గుణం కాదు. అలా చేసినట్లయితే మన వల్ల మోసపోయినవారు చాలా బాధపడతారు. మోసం చేయడం అనేది భయంకరమైన పాపం. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతి ఇచ్చినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అంత లాభాలు పొందినట్లు. మోసం వల్ల ఆనందాన్ని కోల్పోతాం. తప్పు చేశామన్న భావన మనసును బాధిస్తుంది.

7. కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు?

జ: కవి దృష్టిలో త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని ఎవరైతే రూపుమాపుతారో, అందరికీ ఆనందకర జీవితాన్ని, సుఖాన్ని పంచుతారో; అంతేకాకుండా మాతృదేశ గొప్పదనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే నిజమైన ఘనులు. అలాంటి నిజమైన ఘనులు అపూర్వమైన కీర్తి పొందుతారు.

8. మిత్రుడి సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది?

జ: మిత్రుడి సహాయం పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తుంది. కార్య సఫలతలో విలువైన ధనంలా ఉపకరిస్తుంది. శత్రునాశనంలో స్వాధీనమైన కత్తిలా సహాయపడుతుంది. చివరకు మిత్రుడి సహాయం నిండు మనసై సుఖసంతోషాలను ఇస్తుంది.

9. నరరూప రాక్షసులంటే ఎవరు?

జ: నరరూప రాక్షసులంటే కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివారు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవారు, కులగర్వంతో పేదల ఇళ్లను నాశనం చేసేవారు, లంచాలకు విలువను పెంచేవారు, చెడుప్రవర్తనతో తిరిగేవారు, వావివరసలు పాటించనివారు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివారిని నాశనం చేయాలనుకునేవారు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్లగొట్టేవారు.

ఇవి చేయండి 

I. అవగాహన - ప్రతిస్పందన 

1. శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. పాఠంలోని శతక పద్యాలు, భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతున్నాయని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి.

జ: శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. పాఠంలోని శతక పద్యాలు, భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయి. ఎందుకంటే శతక పద్యాల్లో నీతి, నిజాయతీ, విలువలు, ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ విలువలు మానవ జాతి ఉన్నంత కాలం అవసరం. వాటిని అనుసరించి మంచి విలువలను పెంపొందించుకుంటారు. అవి జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఈ శతక మధురిమ పద్యాల్లోని భావాలు గమనిస్తే

* సర్వేశ్వర శతకంలో పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని ఉంది. అది అన్ని కాలాల వారికి శ్రేష్ఠమైంది.

* ప్రకృతిలోనూ, సమాజపరంగానూ అన్నీ దొరికినప్పుడు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారని శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉంది.

* మనసు నిండా మంచితనం ఉండాలని మల్లభూపాలీయ శతకం లోని పద్యంలో ఉంది.

* సత్ప్రవర్తన వల్ల కలిగే లాభాలు దాశరథీ శతకం లోని పద్యంలో కనిపిస్తాయి.

* కీర్తిమంతులు ఎలా ఉంటారో విశ్వనాథేశ్వర శతకం తెలుపుతుంది.

* శ్రీలొంకరామేశ్వర శతకం మిత్రుడు మనకు ఎలా సహాయపడతాడో తెలియజేస్తుంది.

* మానవ రూపంలో ఉండే రాక్షసులు, వారి గుణాలను వేణుగోపాల శతకం వివరిస్తుంది.

   పైన తెలిపిన శతక పద్యాల భావాలను గమనిస్తే అవి తరాలు మారినా తరగని ఆణిముత్యాలుగా కనిపిస్తాయి. శతక పద్యాలు జీవితాన్ని మార్చే మేలిమి బంగారాలు.

2. కింది భావం ఉన్న పద్యపాదాలను గుర్తించండి.

అ. త్యాగధనులకు మచ్చ కలిగిస్తుంది.

జ: ''భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ

   జేముట్టి దానంబు చేసినట్లు"

ఆ. మిత్రుడు యుద్ధరంగంలో కత్తిలా ఉపయోగపడతాడు.

జ: 'స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు'

ఇ. రాముడి మించిన దైవం లేడని చాటుతాను.

జ: ''రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేఁడనుచున్ చాటెదను"
 

3. విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదవండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి. పద్యానికి తగిన శీర్షికను పెట్టండి. పద్యం

   అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు

   తండ్రివలె కాపు నిచ్చును తాను ముందు

   పడిన కష్టాలచే గుణపాఠమయ్యి

   తగిన ప్రేరణ - కాపాడు తల్లివోలె

భావం: అనుభవంతో నేర్చుకున్న చదువు తండ్రిలా కాపాడుతుంది. ముందుపడిన కష్టాలే గుణపాఠాలై తగిన ప్రేరణతో తల్లిలా కాపాడతాయి.

శీర్షిక: 'అనుభవాల చదువు'

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత 

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎలా ఉండాలి?

జ: అపూర్వ కీర్తిమంతుడంటే త్యాగగుణం కలిగి ఉండాలి. దీనుల స్థితి గమనించి వారికి సహాయ సహకారాలతోపాటు ఆనందకర జీవితాన్ని అందించాలి. తన తల్లిదండ్రులను దేవతల మాదిరి నిత్యం కొలిచి తగిన విధంగా సపర్యలు చేయాలి.

   ఏ విషయాలనుంచైనా మంచిని మాత్రమే స్వీకరిస్తూ మంచి పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. మాతృదేశ గొప్పదనాన్ని విశదపరచగలగాలి. నిస్వార్థంతో ఉండాలి. శిబిచక్రవర్తి, బలిచక్రవర్తిలా త్యాగదీక్షను; సత్యహరిశ్చంద్రుడిలా సత్య గుణాన్ని, శ్రీరాముడిలా పితృవాక్య పరిపాలనను కలిగి ఉండాలి.

ఆ. నిజమైన త్యాగి ఎవరు? అతడి లక్షణాలు ఎలా ఉంటాయి?

జ: దేశ సౌభాగ్యం కోసం, తనను నమ్మిన వారి కోసం ఎంతటి పనినైనా చేస్తూ; తన లక్ష్యం కోసం అన్నింటిని వదిలి కార్యసాధకుడై ఎవరైతే ముందుకు వెళతారో వారే నిజమైన త్యాగి. నిజమైన త్యాగికి స్వార్థం ఉండదు. తన స్వప్రయోజనాల కోసం మోసం చేయడు. తాను చేయదలచుకున్న పని పైనే ధ్యాస ఉంటుంది. తన పనిద్వారా ఇతరులకు మేలు జరగాలని కోరుకుంటాడు.

నిజమైన త్యాగి త్యాగం చేస్తున్నట్లు నటించడు. తన ప్రాణాలను కూడా లెక్కచేయడు. తన ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా వాటి గురించి ఆలోచించడు. తన సమయమంతా ఇతరుల కోసం కేటాయిస్తాడు. త్యాగ భావన ఉన్నవారికి అసత్యభావనలు ఉండవు. మన చరిత్రను గమనిస్తే స్వాతంత్య్రం కోసం పోరాడిన వారంతా త్యాగధనులే. త్యాగమనే పునాది, కీర్తి అనే భవంతిపై విజయం అనే జెండాను ఆవిష్కరించారు.

ఇ. మిత్రుడు పుస్తకంలా మంచిదారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు?

జ: మిత్రుడు పుస్తకంలా మంచిదారి చూపుతాడు. పుస్తకాల్లో ఉండే శతక పద్యాలు, కథలు, విజ్ఞాన అంశాలు మొదలైనవన్నీ జీవిత నిర్దేశాలను సూచిస్తాయి. విలువలను తెలియజేస్తాయి. ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయాలను అవగతం చేస్తాయి. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే ఇంగిత జ్ఞానాన్ని బోధిస్తాయి. అలాగే మిత్రుడు కూడా అన్ని విషయాలను మనతో చర్చిస్తాడు. ఎలా ఉండాలో, ఏది చేయకూడదో తెలియజేస్తాడు. పుస్తకంలోని వాక్యాలు మనల్ని ఎలా ఉత్తేజపరుస్తాయో అదేవిధంగా మనం ఆపదలో ఉన్నప్పుడు మిత్రుడు కూడా మన వెన్నుతట్టి ధైర్యాన్ని నింపుతాడు.
   పుస్తకంలోని ఒక పాత్ర తప్పుచేసి నష్టపోయినప్పుడు మరోపాత్ర అది తప్పు అని హెచ్చరించినట్లు మిత్రుడు మన తప్పులను గుర్తిస్తాడు. వాటిని చేయవద్దని హెచ్చరిస్తాడు. ఆలోచనలను మార్చేవాడిగా, జ్ఞానాన్ని అందించే గురువుగా ఉంటాడు. ఎవరికీ చెప్పలేని విషయాలను పంచుకునేవాడు మిత్రుడు మాత్రమే.

ఈ. పాఠంలో పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరం అని తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏమేం అవసరం అనుకుంటున్నారు?
జ: పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత ఎలా అవసరమో చదువు విషయంలో చదవాలన్న కోరిక, పట్టుదల, ఏకాగ్రత, పుస్తకాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమవుతాయి. చదువు విషయంలో విద్యార్థులకు చదువుకోవాలనే కోరిక, దాని విశిష్టతను తెలుసుకోవాలనే ఆరాటం అవసరం. చదివి గొప్పగా ఎదుగుతాను అనే పట్టుదల ఉండాలి. చదువుకునేటప్పుడు ఏకాగ్రతను కలిగి ఉండాలి. విజ్ఞానాన్ని, విలువలను పెంచే పుస్తకాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. ఆ విజ్ఞానాన్ని తమ విశేషమైన పాండిత్యంతో బోధించే ఉపాధ్యాయులు మరింత అవసరం. వారు అనేక విషయాలు తెలియజేస్తూ మార్గదర్శనం చేస్తారు.
   చదువుకు పుస్తకాలు, ఏకాగ్రత, ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అంతే ముఖ్యం. వారు చదువు ఆవశ్యకతను గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం లేకుండా ఇతరత్రా పనుల్లో ఉంచితే చదువు కుంటుపడుతుంది. ప్రోత్సాహం చదువుకు ఆయువు లాంటిది.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. శతక పద్యాల్లోని నీతులు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి.
జ: శతక పద్యాల్లోని నీతులు నిత్యజీవితంలో ఉపయోగపడతాయి. శతక పద్యాలు ఎక్కువగా నీతిని బోధిస్తాయి.శతకంలోని ప్రతి పద్యం ఏదో ఒక రకమైన నీతిని తెలియజేస్తుంది. ఈ పద్యాలు విలువలను ప్రభోధిస్తాయి. ఎలా జీవించాలో విశదపరుస్తాయి. జీవన విధానం ఎలా ఉండాలో తెలుపుతాయి. సత్ప్రవర్తన కలిగి ఉంటే చేకూరే లాభాలను వివరిస్తాయి. ఉదాహరణకు సంపద లేకపోయినా తలవంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం ఉన్నవాడు, చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, మనసునిండా మంచితనం ఉన్న పండితుడు ప్రకాశిస్తాడు. దీనర్థం ఏమిటంటే మంచి గుణాల ఉండటం వల్ల సంపద లేకపోయినా ప్రకాశించవచ్చు అని.
   ప్రతి పద్యంలోని నీతిని మనం ఆచరిస్తే జీవితం ఆనందదాయకం అవుతుంది. ప్రతి పద్యం గొప్పది. అది దిశా నిర్దేశం చేస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాన్ని పెంచుతుంది. ఇవే కాకుండా ఎలాంటి గుణాలు ఉంటే మోక్షం ప్రాపిస్తుందో కూడా మనం ఈ శతక పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. సన్మార్గంలో నడిపేందుకు సహాయకారిగా శతక పద్యాలు పని చేస్తాయి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకునే స్నేహితుడిలాగా శతక పద్యం పని చేస్తుంది.
   ఆమూలాగ్రం మనిషిని అచేతన స్థితి నుంచి చేతన స్థితికి ఈ పద్యాలు తెస్తాయి.
శతక పద్యాలు జీవితానికి దిక్సూచిలా ఉపయోగపడతాయి. ఏ మార్గం సుగమం? ఏ మార్గం సరికాదు? అనే విషయాన్ని ఈ పద్యాలు తెలియజేస్తాయి. శతకంలోని పద్యాలు కేవలం ఒకే పార్వ్శంలో కాకుండా అన్ని మానవ గుణాలు, విలువలు, జీవిత విధానాలపై స్పష్టతను ఇస్తాయి.
   శతక పద్యాలు ఆలోచనలను పెంచుతాయి. ఆలోచింపజేస్తాయి. జీవితానికి ఏవి అవసరం, ఏవి అనవసరమో తెలియజేస్తాయి.

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి
అ. ఈ పాఠం ఆధారంగా మనం అలవరచుకోవాల్సిన మంచి గుణాలు, ఉండకూడని గుణాలను వివరిస్తూ మిత్రుడికి ఒక లేఖ రాయండి.

మిత్రురాలికి లేఖ

మెదక్,
8 - 08 - 2015.

       ప్రియమైన స్నేహితురాలు శ్వేతకు రాయునది
        నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నీవు అక్కడ బాగానే ఉన్నావని అనుకుంటున్నాను. మొన్న మా తెలుగు మాష్టారు శతక మధురిమ అనే పాఠాన్ని చెప్పారు. మనం అలవరచుకోవాల్సిన మంచి గుణాలు, ఉండకూడని చెడ్డ గుణాల గురించి ఆ పాఠంలో ఉంది. అవి ఏమిటంటే

     మంచి గుణాలు          ఉండకూడని గుణాలు
 1) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు. 1) విష్ణుభక్తులను నిందించరాదు.
 2) దాన గుణం, శ్రద్ధగా వినడం, సత్యవ్రతం, మనసు నిండా మంచితనం.  2) సజ్జనులను మోసం చేయరాదు.
 3) త్యాగం ద్వారా ఆనందాన్ని పంచడం.  3) దేవతా మాన్యాలను ఆక్రమించరాదు.
 4) మాతృదేశ గొప్పదనాన్ని తెలపడం.  4) అబద్ధం చెప్పకూడదు.
 5) మంచి స్నేహం చేయాలి.  5) మాయమాటలు చెప్పకూడదు.
 6) లంచాలకు విలువ ఇవ్వొదు.  6) కులగర్వంతో పేదవారిని నాశనం చేయొద్దు.
 7) వావివరుసలను పాటించాలి.  7) చెడు ప్రవర్తనతో తిరగరాదు.
 8) తల్లి దండ్రులను మంచిగా చూసుకోవాలి.  8) నవ్వుతూ మాట్లాడుతూ ఎదుటివారిని నాశనం చేయకూడదు.

     శ్వేతా! పై గుణాల్లో పాటించదగినవి, పాటించదగనివి రెండూ ఉన్నాయి. కాబట్టి మంచి గుణాలను అలవాటు చేసుకునేలా అందరిని ప్రోత్సహించగలవు. నీకు తెలిసిన మంచి గుణాలను తెలియజేస్తావని కోరుకుంటున్నాను.

నీ
ప్రియ మిత్రురాలు 
సుహాసిని 

 
చిరునామా 
పి. శ్వేత 
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 
సిరిపుర 
మెదక్ జిల్లా 

 

ఆ. ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జ: నంబి శ్రీధరరావు రాసిన 'శ్రీలొంకరామేశ్వర శతకం' లోని ''పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు" అనే పద్య భావం ఆధారంగా నీతికథ.

మంచి స్నేహితుడు

   రాము, రాజు మంచి మిత్రులు. చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదివారు. ఆటల్లోనూ చురుకైన వారు. పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పదోతరగతి వరకు ఇద్దరూ మొదటి, రెండో ర్యాంకులతో పోటీపడి చదివేవారు. పదోతరగతి తర్వాత వేర్వేరు కళాశాలల్లో చేరారు.
   రాజు క్రమంగా రాము స్నేహాన్ని వదిలి కొత్త స్నేహితులతో ఉండటం మొదలు పెట్టాడు. దాంతో రాజు చదువు వెనుకబడిపోయింది. ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. రాము ఎన్నోసార్లు నచ్చజెప్పినా వినలేదు. చదువును అశ్రద్ధ చేశాడు. మొదటి సంవత్సర వార్షిక పరీక్షలో అనుత్తీర్ణుడయ్యాడు. ఇది తెలిసిన రాజు వాళ్ల నాన్న అతడిని బాగా తిట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రాము రాజు దగ్గరకు వెళ్లి అనేక మంచి విషయాలు చెప్పి అతడిని మార్చి వేశాడు. రాము చదివే కళాశాలలోనే రాజు చేరాడు. మన చదువు మన కష్టాలను తీర్చుతుందని, జరిగినదంతా గొప్ప గుణపాఠం అని చెప్పిన రాము రాజు చదివేలా ప్రోత్సహించాడు. ప్రతిరోజు తనతోపాటు రాజు చదివేలా చూశాడు. మంచి కోరే మిత్రుడి వల్ల కష్టపడి చదివి రాజు ఉత్తీర్ణుడయ్యాడు.                     
   కార్యసఫలతతో విలువైన ధనంలా రాము వ్యవహరించాడు.
   రాము, రాజు ఇద్దరూ ఆ తర్వాత డిగ్రీ పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగం పొందారు. 'నిండు మనసుతో మంచి కోరే 'రాము' లాంటి స్నేహితుడు ఉండటం వల్లే తాను ఈ గొప్ప స్థాయికి వచ్చాను' అని రాజు భావించాడు.


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 03-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌