• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

కవయిత్రి / కవుల పరిచయం:

1. మల్లభూపాలీయం నీతి శతక కర్త - ఎలకూచి బాలసరస్వతి:
 ఎలకూచి బాలసరస్వతి క్రీ.శ. 1600 కాలానికి చెందినవారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా 'జటప్రోలు' సంస్థానంలో సురభిమాధవ రాయల ఆస్థాన కవిగా ఉండేవారు. 'ఆంధ్రశబ్దచింతామణి' కి వ్యాఖ్యాత. తెలుగులో తొలి త్య్రర్థి కావ్యం ''రాఘవ యాదవ పాండవీయం' రచించారు. భర్తృహరి 'సుభాషిత త్రిశతి' ని తెలుగులోకి అనువదించిన వారిలో ఈయన మొదటివారు. దాదాపు పన్నెండు గ్రంథాలు రచించారు. పాండిత్య స్ఫోరకంగా, ధారాళమైన శైలిలో ఈయన రచన సాగుతుంది.

2. చిత్తశతక కర్త - శ్రీపతి భాస్కర కవి
   శ్రీపతి భాస్కర కవి 17వ శతాబ్దానికి చెందినవారు. శైవ పండిత త్రయంలోని శ్రీపతి పండితుని వంశీయులని పరిశోధకుల భావన.

3. తరిగొండ నృసింహ శతక కర్త్రి - తరిగొండ వెంగమాంబ
  తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే భక్తురాలు. తరిగొండ నృసింహ శతకం, శివ నాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలు ఈమె రచనలు. 'రాజయోగామృతం' అనే ద్విపద కావ్యం కూడా రచించారు. శ్రీ వేంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్టరామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కారు.

4. భక్త చింతామణి శతకం - వడ్డాది సుబ్బరాయ కవి 
  వడ్డాది సుబ్బరాయ కవి 20వ శతాబ్దానికి చెందినవారు. 'వసురాయకవి'గా ఈయన ప్రసిద్ధి పొందారు. రాజమహేంద్రవరంలోని 'ఫస్ట్‌గ్రేడ్' కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. 'హిందూజనసంస్కారిణి' అనే పత్రికలో 'భక్త చింతామణి' పేరుతో 80 పద్యాలు రాశారు. తర్వాత దాన్ని 'భక్త చింతామణి శతకం'గా పూర్తిచేశారు. ఈయన రాసిన 'వేణీసంహారం' అనే నాటకం చాలా ప్రసిద్ధి పొందింది. ప్రబోధ చంద్రోదయం, నందనందన శతకం, భగవత్కీర్తనలు అనేవి ఇతర రచనలు.

5. ఉత్పలమాల శతక కర్త - ఉత్పల సత్యనారాయణాచార్యులు
   ఉత్పల సత్యనారాయణచార్యులు 1923 -2007 మధ్యకాలానికి చెందినవారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా 'చింతకాని' ప్రాంతానికి చెందినవారు. రసధ్వని, ఈ జంటనగరాలు - హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం ఈయన రచనలు. 2003లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈయన శైలి లలితమధురంగా, సరళంగా, సున్నితమైన హాస్యంతో కూడి ఉంటుంది.

6. విశ్వనాథేశ్వర శతక కర్త - గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ
  ఈయన 1934 -2011 మధ్యకాలానికి చెందినవారు. తెలంగాణలోని మెదక్ జిల్లా పోతారెడ్డి పేటలో జన్మించారు. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగేశ్వరస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము ఈయన రాసిన గ్రంథాలు. 300లకు పైగా అవధానాలు చేసి 'అవధాన శశాంక', 'ఆశుకవి శేఖర' అనే బిరుదులు పొందారు.

7. నింబగిరి నరసింహ శతక కర్త - అందె వేంకటరాజం
  ఈయన 1933 - 2006 మధ్యకాలం వారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించారు. మణిమంజూష, కళాతపిస్వని అనే పద్యకావ్యాలు రాశారు. 'భారతరాణి' అనే నాటికల సంపుటిని రాశారు. నింబగిరి శతకం, ఈశ్వర శతకం - అనే శతకాలు రాశారు. ''వానమామలై వరదాచార్యుల కృతులు - అనుశీలన' అనే గ్రంథాన్ని రచించారు. 'కవి శిరోమణి', 'అవధాన యువకేసరి', 'అవధాన చతురానన' అనేవి బిరుదులు.

8. శ్రీలొంక రామేశ్వర శతక కర్త - నంబి శ్రీధర్ రావు
   ఈయన 1934 - 2000 మధ్యకాలానికి చెందినవారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా 'భీంగల్' నివాసి. శ్రీమన్నింబాచల మహత్మ్యం, శ్రీమన్నింబగిరి నరసింహశతకం, శారదాగణితం ఇతర రచనలు.

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం 

    శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. భావి జీవితాన్ని తీర్చి దిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.
 

పాఠ్య భాగ వివరాలు
* శతక పద్యాల్లో మకుటం ప్రధానమైంది.
* ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది.
* ఇవి ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
* ప్రస్తుత పాఠంలోని పద్యాలు మల్లభూపాలీయం, చిత్త శతకం, తరిగొండ నృసింహ శతకం, భక్తచింతామణి శతకం, ఉత్పలమాల, విశ్వనాథేశ్వర శతకం, నింబగిరి నరసింహ శతకం, లొంకరామేశ్వర శతకం అనే శతకాల్లోనివి.

ప్రవేశిక

   విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో పద్యం ఒకటి. పద్యం ఛందోబద్దమైంది. లయాత్మకంగా, గానయోగ్యంగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్రవిషయాలు నైతిక విషయాలను పద్యాల్లో చొప్పించి అందించారు. పద్య ప్రక్రియలో 'శతకం' ఒక విభాగం. మేలి ముత్యాల లాంటి శతక పద్యాల నుంచి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం! పద్య రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువలను పెంపొందించుకుందాం...

1వ పద్యం (ఎలకూచి బాలసరస్వతి - మల్లభూపాలీయం అనే నీతి శతకం లోనిది) (కంఠస్థ పద్యం)
      మ. సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
           గురు పాదానతి కేలనేనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
           స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
           హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతి వాచస్పతీ!
ప్రతి పదార్థం:

సురభిమల్లా = సురభిమల్లుడా!
నీతి వాచస్పతీ = నీతిలో బృహస్పతి అంతటి వాడా!
ఔదలన్ = తల వంచి
గురుపాదానతి (గురుపాద + ఆనతి) = గురువుల పాదాలకు నమస్కరించడం
కేలన్ = చేతులకు
ఈగి = దానము ఇచ్చే గుణం
చెవులందు = చెవుల యందు
విన్కి = చెప్పే విషయాలు వినడం
వక్త్రంబునన్ = నోటికి
స్థిర = నిశ్చలమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) = సత్యవాక్కు
భుజంబులన్ = భుజ బలంతో
విజయమున్ = విజయాలను
చిత్తంబునన్ = మనసులో
సన్మనోహర = చాలా ఇంపైన
సౌజన్యము = దయ
కల్గిన = కలిగి ఉండటం
సిరి = ధనం
లేకైన (లేక + ఐన) = లేకున్నా
బుధుండు = పండితుడు
విభూషితుండె యయి = శోభితుడై
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు.

తాత్పర్యం: 
   నీతిలో బృహస్పతి అంతటి వాడైన ఓ సురభిమల్లా! శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాలను శ్రద్ధగా వినగలిగేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా దయగలవాడైన పండితుడు సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు.

2వ పద్యం (శ్రీపతి భాస్కర కవి - చిత్త శతకం లోనిది)         (కంఠస్థ పద్యం)
          ఉ. బీదలకన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
              సంపాదనకై యబద్దముల బల్కకు, వాదములాడబోకు, మ
              ర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రి మెలంగు, మిట్టివౌ
              వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ము చిత్తమా!
ప్రతి పదార్థం:

చిత్తమా! = మనసా
బీదలకు = పేదవారికి
అన్నవస్త్రములు = అన్నము, దుస్తులు
పేర్మిన్ = ప్రీతితో
ఒసంగుము = ఇవ్వు
తుచ్చ = నీచమైన
సౌఖ్య = సుఖాలను
సంపాదనకై = పొందేందుకు
అబద్దములు = అబద్దాలు
పల్కకు = మాట్లాడకు
వాదములు = అనవసరమైన వాదనకు
ఆడబోకు = దిగకు
మర్యాదను = మర్యాదను
అతిక్రమింపకు = హద్దు దాటనివ్వకు
పరస్పర మైత్రి = అందరితో స్నేహంగా
మెలంగుము = ఉండుము
ఇట్టి = ఇలాంటి వాటిని
వేదములంచున్ = వేదాలుగా
ఎరుంగుము భావించు
ఇది = ఈ లక్షణాలు
వివేక ధనంబు = వివేకులకు సంపదగా
నమ్ము = నమ్ముము.


తాత్పర్యం: 
  చిత్తమా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకు. మర్యాద మీరి, హద్దులు మీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యతతో మెలగు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.

3వ పద్యం - (తరిగొండ వెంగమాంబ - తరిగొండ నృసింహ శతకం లోనిది)   (కంఠస్థ పద్యం)
          ఉ. పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
              దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
              పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
              గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!
ప్రతిపదార్థం:

దయాపయోనిధీ = దయా సముద్రుడా!
తరిగొండనృసింహ = తరిగొండలో వెలసిన నృసింహాస్వామి
పట్టుగన్ = బలంగా
ఈశ్వరుండు = భగవంతుడు
తన పాలిట నుండి = తనతో ఉండి
ఇప్పుడు = ఈవేళ
ఇచ్చినంతలోన్ = ఇచ్చినదానిలో
దిట్టక = తిట్టకుండా
దీన దేహులను = అనాథలను, నిరుపేదలను
తేటగా = ఆప్యాయతతో 
లాలనజేసి = లాలిస్తూ
అన్నమున్ = అన్నం 
పెట్టు = పెడతాడు
వివేకి = వివేకి (మంచి, చెడు ఆలోచించేవాడు)
మానసమున్ = మనసులో
పెంపు + ఒనరించుచు = పెంచుకోవడం
నూరకుండినన్ = ఊరుకున్నప్పటికీ
గుట్టుగ = ఎవరికీ తెలియకుండా
లక్ష్మి = సంపదకు ఆది దేవత లక్ష్మి (సంపద)
పొందు = వచ్చి వరిస్తుంది.

తాత్పర్యం: 
     దయా సముద్రుడా! తరిగొండ నృసింహదేవా! వివేకి అయినవాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో అనాథలను, నిరుపేదలను కసురుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. అలాంటి సహృదయుడిని సంపదకు ఆది దేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది.

4వ పద్యం - (వడ్డాది సుబ్బరాయ కవి - భక్త చింతామణి శతకం లోనిది)  (కంఠస్థ పద్యం)
          మ. తనదేశంబు స్వభాష నైజ మతమున్ అస్మత్సదాచారముల్
               తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి, త
               ద్ఘనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
               అనువౌబుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!
ప్రతి పదార్థం:

చింతామణీ = భక్తులపాలిట చింతామణియైన
దేవా = ఓ స్వామీ
తన దేహ = తన శరీరాన్ని
ఆత్మలన్ = ఆత్మను
ఎత్తెఱంగునన్ = ఎలా అభిమానిస్తాడో
తన దేశంబు = తన దేశాన్ని
స్వభాషన్ = తన భాషను
నైజమతమున్ = తన మతాన్ని
అస్మత్ = తాను పాటించే
సత్ + ఆచారముల్ = మేలైన ఆచారాలను
సదా = ఎప్పుడూ
తాను = తాను
అట్లు = ఆ విధంగా
ప్రేమించి = ప్రేమించేలా
తద్ఘనతా (తత్ + ఘనతా) = వాటి యొక్క గొప్పతనం
అవాప్తికిన్ = పొందేందుకు
సాధనంబులగు = సాధనాలైన
సత్కార్యములన్ = మంచి పనులను
చేయగాన్ = చేయడానికి
అనువౌ = తగ్గ
బుద్ధి = బుద్ధిని
ప్రజకున్ = ప్రజలకు
ఒసగుము = ప్రసాదించు

తాత్పర్యం: 
     భక్తుల పాలిట చింతామణివైన ఓ స్వామీ! ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మను ఎలా అభిమానిస్తారో, అలాగే తనదేశాన్ని, తన భాషను, మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించే విధంగా వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులు చేయడానికి తగిన బుద్దిని ప్రజలకు ప్రసాదించు.

5వ పద్యం (ఉత్పల సత్యనారాయణాచార్య - ఉత్పలమాల శతకం లోనిది)  (కంఠస్థ పద్యం)
          చ. అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టి యా
              జనుని కొగిన్ గుణగ్రహణశక్తి నశించును; మంచి మాత్రమే
              జనములలోన చూడగల చక్కని చూపులు పల్కునాల్క నా
              కెనయగనిమ్ము వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!
పత్రిపదార్థం:

అఖిలాండపతీ (అఖిల + అండపతీ) = జగత్తు అంతటినీ ఏలే నాయకా
శ్రియఃపతీ = లక్ష్మీ వల్లభా!
వేంకటాపతీ = వేంకటేశ్వేరుడా
అనయము = ఎల్లప్పుడూ
దోషము + ఏ = తప్పునే
పరులయందు = ఇతరుల్లో
కనుంగొని = వెతికి
పల్కునట్టి = పలికె
యాజనునికిన్ = ఆ మనిషికి
ఒగిన్ = క్రమంగా
గుణగ్రహణశక్తి = గుణాలను గ్రహించే శక్తి
నశించును = సన్నగిల్లుతుంది
మంచి మాత్రమే = మంచితనాన్ని మాత్రమే
జనములలోన = అందరిలోన
చూడగల = చూసే
చక్కని = చక్కని
చూపులు = చూపులను
పల్కు = మంచి మాట్లాడే
నాల్క = నాలుక
నాకున్ = నాకు
ఎనయగన్ = సరిపోయే విధంగా
ఇమ్ము = ఇవ్వు

తాత్పర్యం: 
     అఖిలాండనాయకా! లక్ష్మీ వల్లభా! వేంకటపతీ! ఇతరుల్లో ఎల్లప్పుడూ తప్పులు వెతికేవాడికి మంచిని గ్రహించే శక్తి సన్నగిల్లుతుంది. అందరిలోనూ మంచిని దర్శించే చూపులు, అందరితో మంచిగా మాట్లాడే నాలుక నాకు ఇవ్వు. (వ్యక్తిత్వ వికాస సూత్రం ఇందులో దాగి ఉంది. సకారాత్మక ఆలోచన, సమ్యక్ దృష్టి అనే శ్రేష్ఠ భావన అత్యంతావశ్యకం.)

6వ పద్యం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ - విశ్వనాథేశ్వర శతకం లోనిది)            (కంఠస్థ పద్యం)
          మ. ఇతిహాసామృత రుక్ప్రభా ధవళితంబీ భారతం బార్షసం
                స్కృతి జీవత్సరిదంబు సేవితము; సాహిత్యస్వరానంద దీ
                పితమున్ పావన భావనావహమహావేశంబె జాతీయతా
                వ్రతమౌ ధర్మపరాయణర్షి పరివారా! విశ్వనాథేశ్వరా!
ప్రతి పదార్థం:

ధర్మపరాయణ = ధర్మమును ఆచరించే
ఋషి = మహర్షులను
పరివారా = పరివారంగాగల
విశ్వనాథ + ఈశ్వరా = ఓ విశ్వనాథేశ్వరా!
ఈ భారతంబు = ఈ భారతదేశం
ఇతిహాస + అమృత = ఇతిహాసాలనే అమృతంతో
రుక్ + ప్రభా = వేదాల శోభతో
ధవళితంబు = అలరారుతుంది
అర్ష = మహర్షుల (సనాతనమైన)
సంస్కృతి = సంస్కృతి (జీవనవిధానం) అనే
జీవత్సరిత్ = జీవనది
అంబు = నీటిచే
సేవితము = సేవితమౌతున్నది
సాహిత్య = సాహిత్యం యొక్క
స్వరానంద = పలుకుల ఆనందంచే
దీపితమున్ = శోభిల్లుతోంది
పావన = పవిత్రమైన
భావనా = ఆలోచనలను
ఆవహ = కలగడం
మహా = ఎక్కువగా
ఆవేశంబు + ఎ = చేసుకోవడమే
జాతీయతావ్రతము = జాతీయ వ్రతం
ఔను = అవుతుంది.

 
తాత్పర్యం:
    ధర్మపరాయణులైన మహర్షులను పరివారంగా కలిగిన ఓ విశ్వనాథేశ్వరా! భారతదేశం వేదాల శోభతో, ఇతిహాసాలనే అమృతంతో అలరారుతోంది. అర్ష సంస్కృతి అనే జీవనది నీటితో సేవితమవుతోంది. సాహిత్య స్వరానందం శోభిల్లుతోంది. పవిత్రమైన ఆలోచనలను తీవ్రంగా ఆవాహన చేసుకోవడమే భారతదేశానికి జాతీయవ్రతం అవుతుంది.

7వ పద్యం (అందె వేంకటరాజం- నింబగిరి నరసింహ శతకంలోనిది)
         సీ. గుణమింత కుదురక గుళ్ళు తిరుగుటయేల?
            సంస్కారమబ్బని చదువులేల?
            చిత్తంబు నిలువని శివపూజలవియేల?
            శాంతి గూర్చని యోగ సాధనేల?
            మంచిని పెంచని మలినమతములేల?
            హిత బుద్ధి గలుగని వ్రతములేల?
            అభ్యుదయముగాని ఆచారతతియేల?
            తగురక్షసేయని ధర్మమేల?
    తేటగీతి. దమము శమము కూడని జపతపములేల?
             స్వామి! నీ భక్తి కలుగని జన్మమేల?
             వరశుభ విలాస! శ్రీ నింబగిరి నివాస!
             భవ్యగుణధామ! నరసింహ! దివ్యనామ!!
ప్రతి పదార్థం

శ్రీ నింబగిరి నివాస = నింబగిరిలో వెలసినదేవా?
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారేవాడా
భవ్యగుణధామ = అత్యుత్తమ గుణాలు కలవాడా!
దివ్యనామ = దివ్యమైన పేరున్న
నరసింహ = ఓ నరసింహదేవా!
గుణము + ఇంత = గుణము కొంచమైన
కుదురక = లేకుండా
గుళ్ళు = ఆలయాలు
తిరుగుటయేల = దర్శించడం వల్ల ఏం లాభం
సంస్కారం = సంస్కారం
మబ్బని = నేర్పని
చదువులు + ఏల = చదువు ఎందుకు
చిత్తంబు నిలువని = చాంచల్య మనసుతో
శివపూజలు = శివుని పూజ
ఏల = వ్యర్థమే
మంచిని పెంచని = మంచితనాన్ని పెంచని
మలిన మతములు = కలుషితమైన మతాలు
హిత బుద్ధి = మేలు కోరని బుద్ధి
గలుగని = పుట్టని
వ్రతములేల = వ్రతాలు ఎందుకు?
అభ్యుదయముగాని = చైతన్యం కాని
ఆచారాతతి = ఆచారాల సముహం
ఏల = ఎందుకు
తగురక్ష = తగిన రక్షణ
సేయని = చేయని
ధర్మం = ధర్మం
ఏల = ఎందుకు
దమము = బాహ్య ఇంద్రియ నిగ్రహం
శమము = అంతరింద్రియ నిగ్రహం
కూడని = లేని
జపతపము = జపతపాలు
ఏల = ఎందుకు
స్వామి = ఓ స్వామి
నీ భక్తి = నీ మీద భక్తి
కలుగని = లేని
జన్మము = పుట్టుక
ఏల = ఎందుకు

 
తాత్పర్యం:
  నింబగిరిలో వెలసినదేవా! శ్రేష్ఠమైన శుభాలతో అలరారే వాడా! అత్యత్తుమ గుణాలు కలవాడా! నరసింహదేవా! మంచి స్వభావం లేకుండా ఎన్ని కార్యాలు చేసినా ఏం లాభం? సత్ప్రవర్తన లేకుండా ఆలయాలు తిరగడం వృథా. సంస్కారం నేర్పవి చదువు, చాంచల్య మనసుతో చేసే శివపూజ కూడా వ్యర్థమే! శాంతినివ్వని యోగ సాధన, మంచిని పెంచని మతం, మేలు కోరని వ్రతం, చైతన్యం కల్గించని ఆచారాలు, లోకరక్షణ చేయని ధర్మం వల్ల ప్రయోజం శూన్యం. ఓ స్వామీ! బాహ్య అంతరింద్రియ నిగ్రహం లేని జపతాపాలు, నీ మీద భక్తిలేని జన్మ వ్యర్థమే కదా!

8వ పద్యం (నంబి శ్రీధరరావు - శ్రీలొంకరామేశ్వర శతకంలోనిది)
         శా. ఇల్లాలింటికి దీపమౌననగా హీహీయంచు మందుల్ 
         మహా భల్లూకాకృతి దోప నవ్వుదురు, దీవ్యద్వ్యోమగంగన్ జటా
         వల్లిన్ నీవు ధరించటన్ వినరో, యెవ్వారైనా మర్యాద వ
         ర్ధిల్లన్ కాంతల జూడకున్న హితమా? శ్రీలొంక రామేశ్వరా!
పత్రిపదార్థం:

శ్రీలొంక రామేశ్వరా! = ఓ శ్రీలొంక రామేశ్వరుడా!
ఇల్లాలు = భార్య
ఇంటికి = ఇంటికి
దీపమౌను = దీపం అవుతుంది
అనగన్ = అంటే
హీహీయంచు = హీహీ అని
మందుల్ = అల్పజ్ఞానులు
మహా = పెద్ద
భల్లూక + ఆకృతి = ఎలుగుబంటి రూపంలా
దోప = కనిపించి
నవ్వుదురు = నవ్వుతారు
దీవ్యత్ = పవిత్రమైన
వ్యోమగంగన్ = ఆకాశగంగను
జటావల్లిన్ = తలపై
నీవు = నీవు
ధరించుటన్ = దాల్చిన విషయం
వినరో = వినలేదా!
ఎవ్వారైన = ఎవరైనా
మర్యాద = మర్యాద
వర్ధిల్లన్ = కలిగేలా
కాంతలన్ = భార్యలను
చూడకున్న = చూడకపోతే
హితమా = మేలు కలుగుతుందా? (కలగదు)


తాత్పర్యం: 
 ఓ రామేశ్వరా! 'ఇల్లాలే ఇంటికి దీపం' అనే మాట వింటేనే అల్పజ్ఞానులు ఎలుగుబంట్లలాగా విరగబడి నవ్వుతారు. కాని పవిత్రమైన ఆకాశగంగను నీవు తలపై దాల్చిన విషయం వారికి తెలియదేమో! ఎవరైనాసరే స్త్రీని గౌరవించకపోతే మంచిది కాదు కదా!

రచయిత: అంజాగౌడ్ 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం