• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భిక్ష 

కవిపరిచయం 
* శ్రీనాథుడు 1380 - 1470 మధ్యకాలం వాడు.
* ఈయన మారయ, భీమాంబల కుమారుడు.
* కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు.
* విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో 'గౌడడిండిమభట్టు'ను కవిత్వంలో ఓడించి కనకాభిషేకాన్ని పొందాడు. కవి సార్వభౌముడు ఆయన బిరుదు.
 

రచనలు:
     1) మరుత్తరాట్చరిత్ర
     2) శాలివాహన సప్తశతి
     3) పండితారాధ్య చరిత్ర
     4) శృంగార నైషధం
     5) భీమఖండం
     6) కాశీఖండం
     7) హరవిలాసం
     8) ధనంజయ విజయం
     9) క్రీడాభిరామం
     10) శివరాత్రి మహాత్మ్యం
     11) పల్నాటి వీరచరిత్ర
     12) నందనందన చరిత్ర
* చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు రాశాడు.
 

కవితా లక్షణాలు:
     1) ఉద్ధండలీల
     2) ఉభయవాక్ప్రౌడి
     3) రసాభ్యుచిత బంధం
     4) సూక్తివైచిత్రి
* శ్రీనాథుడు సీసపద్యాలకు ప్రసిద్ధి
* శ్రీనాథుడి జీవితచరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశచరిత్రగా భావిస్తారు.

పాఠ్యాంశ నేపథ్యం
* వేదవ్యాసుడు వేదాలను విభజన చేశాడు. పంచమ వేదంగా పేరున్న మహాభారతాన్ని రచించాడు. అష్టాదశ పురాణాలను రచించాడు. అత్యంత పవిత్రమైన, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన 'కాశీ'లో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. వ్యాసుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతో 'కాశీ' నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు, తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలింది భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం.

పాఠ్యభాగ వివరాలు
ఈ 'భిక్ష' అనే పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది 'కాశీఖండం' సప్తమాశ్వాసంలోనిది.

ప్రవేశిక
   నేడు 'భిక్షం' అనే మాట కేవలం 'అడుక్కు తినడం' అనే తక్కువస్థాయి అర్థానికి పరిమితమైంది. ఒకప్పుడు 'భిక్ష' అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు భిక్షేశ్వరుడుగా ప్రసిద్ధిపొందాడు. గురువులు శిష్యులకు 'జ్ఞానభిక్ష' పెట్టేవాళ్లు. బుద్ధుడు భిక్షావృత్తితోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్షపెట్టేవాళ్లు కూడా అది మహాపుణ్యకారంగా భావించేవారు. తమ ఇంటికి వచ్చినవారిని 'అతిథి దేవోభవ!' అని నమస్కరించి, పూజించి, భిక్ష సమర్పించేవారు. అలాంటి భిక్షావ్రతంతో జీవించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన ఒక అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

పాఠ్యాంశ పద్య ప్రతిపదార్థ భావాలు

1. తే.గే. నెట్టుకొని కాయ బీఱెండ పట్టపగలు
         తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
         గాశీకా విప్రగృహ వాటికల నొనర్చు
         నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు
ప్రతిపదార్థం

నెట్టుకొని =     పెరుగుతూ
కాయ =     విజృంభిస్తున్న
బీఱెండ =     ఎక్కువైన ఎండ
పట్టపగలు (పగలు + పగలు) =     మిట్టమధ్యాహ్న సమయంలో
తాను =     వ్యాసుడు
శిష్యులున్ =     వ్యాసుడి శిష్యులు
ఇల్లిల్లు =     ప్రతిఇంటినీ
దప్పకుండన్ =     తప్పకుండా (విడిచిపెట్టకుండా) 
గాశీకా =     కాశీ నగరంలోని
విప్ర =     బ్రాహ్మణ
గృహ =     ఇళ్లున్న
వాటికలన్ =    వాడలను
భిక్షాటనంబు =    భిక్ష
నఖిల =    అనేకమైన
విద్యాగురుండు =    విద్యలకు గురువైనవాడు (వ్యాసుడు)
ఒనర్చు =    చేస్తాడు

  
భావం: విద్యాగురువైన వ్యాసమహర్షి తన శిష్యులతో కలసి పట్టపగలు, అంతకంతకూ పెరిగి విజృంభిస్తున్న ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణుల ఇళ్లున్న వాడల్లో భిక్ష కోసం ప్రతి ఇల్లూ తిరుగసాగాడు.

2. తే.గే. వండుచున్నారమను నొక్క వనజనేత్ర
         తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
         దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
         ద్వాః కవాటంబుఁ దెఱవదు వనిత యొకతె
ప్రతిపదార్థం

ఒక్క వనజనేత్ర =     పద్మం లాంటి కళ్లున్న ఒక స్త్రీ
వండుచున్నారమనును =     వండుతున్నాం అంది
తిరిగిరమ్మనును =     మళ్లీ రమ్మని అంది
నొక్క లేఁదీఁగె బోఁడి =     ఒక లేత తీగ లాంటి శరీరం ఉన్న స్త్రీ
నేడను =     నేడు (ఈరోజు)
దేవకార్యంబు =     దైవకార్యం (వ్రతం)
దెఱవ యోర్తు =     ఒక ఇల్లాలు 
వనిత యొకతె =     ఒక స్త్రీ
ద్వాః =     ద్వారం యొక్క
కవాటంబున్ =     తలుపును
దెఱవదు =     తెరవలేదు


భావం: ఒక ఇల్లాలు 'వండుతున్నాం' అంటోంది, మరొక స్త్రీ 'మళ్లీ రండి' అంటోంది. ఇంకొక ఆవిడ ఈరోజు దైవకార్యం అని చెబుతోంది. వేరొక ఆవిడ అయితే అసలు తలుపులే తెరవడం లేదు.

3. సీ. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
         కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
         యతిథి నచ్చోనిల్పి యర్ఘ్యపాద్యము లిచ్చి
         పుష్ప గంధంబులఁ బూజసేసి,
         ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువమున
         నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
         ఫలపాయసాపూప బహుపదార్థములతో
         భక్తివిశ్వాస తాత్పర్యగరిమఁ
తే.గీ. బెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకుఁ
        గంకణంబులతో సూడిగములు రాయఁ
        గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
        నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు
ప్రతిపదార్థం

ముంగిటన్ = ఇంటి ముందు
గోమయంబున = ఆవు పేడతో 
గోముఖము తీర్చి = అలికి
కడలు = అంచులు
నాల్గుగన్ = నాలుగు వచ్చేలా
మ్రుగ్గుకఱ్ఱ = ముగ్గులు
వెట్టి = పెట్టి
అతిథిన్ = వచ్చిన అతిథిని
అచ్చోటన్ = నాలుగు అంచులు కలిసే ముగ్గు మధ్యలో
నిల్పి = ఉంచి
అర్ఘ్యపాద్యములు = చేతులు, కాళ్లు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు
ఇచ్చి =     ఇచ్చి
పుష్పగంధంబులన్ =     పువ్వులు, గంధంతో
బూజసేసి =     అర్చించి (పూజ చేసి)
ప్రక్షాళితంబైన =     కడిగినదైన
పసిఁడి =     బంగారు
చట్టువమున్ =     గరిటెతో
అన్నంబుమీదన్ =     అన్నంపైన
నెయ్యిభిఘరించి  =     నెయ్యివేసి
ఫల =     పండ్లు
పాయస =     పరమాన్నం
అపూప =    పిండివంటలు
బహుపదార్థములతో =     అనేక పదార్థాలతో
భక్తి విశ్వాస =    భక్తి నమ్మకం
తాత్పర్య =     భావం యొక్క
గరిమన్ =     గొప్ప, శ్రేష్ఠమైన
బెట్టుదురు =     పెడతారు
మాధుకర భిక్ష =     మధుకరమైన భిక్ష
భిక్షకులకు =     భిక్ష అడిగే వాళ్లకు
కంకణంబులతో =     చేతికి పెట్టుకునే ఆభరణాలు 
సూడిగములు =     గాజులు
రాయన్ =     సందడి చేయగా
కమ్రకరముల =     ఇంపైన చేతులతో
బ్రాహ్మణాంగనలు =     బ్రాహ్మణ స్త్రీలు 
కాశీ =     కాశీనగరంలో
అన్నపూర్ణభవాని =     అన్నపూర్ణ అనే పేరున్న పార్వతికి
కట్టనుగు =     మిక్కిలి ప్రియమైన
జెలులు =     చెలులు


భావం: కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు ఇంటిముందు ఆవుపేడతో అలికి, నాలుగు అంచులూ కలిసేలా ముగ్గుపెట్టి దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్లు చేతులూ కడుక్కోవడానికి నీళ్లిచ్చి; పువ్వులతో, గంధంతో వారిని అర్చించి, బంగారు గరిటెతో అన్నంపైన నెయ్యివేసి పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి భక్తి విశ్వాసాలతో, కంకణాలు ధరించిన చేతులతో పెడతారు. వారు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు.

4. కం. ఆ పరమ పురంద్రులయం
          దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!
          రేపాడి మేలుకని యే
          నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో?
ప్రతిపదార్థం

ఆ పరమ =     అలాంటి గొప్పనైన 
పురంద్రులయందు =     కుటుంబ స్త్రీలలో
ఏ పుణ్యాంగనయు =    ఏ పుణ్యస్త్రీ అయినా
భిక్ష =     భిక్షాన్ని
యిడదయ్యే =     సమర్పించడం లేదు
గటా =     అయ్యో
రేపాడి =     ఉదయం లేచి 
మేలుకని =    మేల్కొని
ఏ పాపాత్ముని =     ఏ పాపిష్టివాడిని
ముఖంబు =     ముఖాన్ని
నీక్షించితినో =     చూశానో?


భావం: 'అలాంటి గొప్పనైన కుటుంబ స్త్రీలలో ఏ పుణ్యస్త్రీ అయినా భిక్షను సమర్పించడం లేదు. ఈరోజు ఉదయం లేచి, ఏం పాపిష్టివాడి ముఖం చూశానో' అనుకున్నాడు వ్యాసుడు.

5వ పద్యం:
తే.గీ. ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి
        యస్తమించుచు నున్నవాఁ డహిమ భానుఁ
        డెల్లి పారణకైన లేదెట్లు మనకు?
        మాధుకరభిక్ష బ్రాహ్మణ మందిరముల
ప్రతిపదార్థం

ఉపవసింతుముగాక =     ఉపవాసం ఉంటాం గాక! 
నేడు =     ఈరోజు
ఉడిగి =     బిక్ష అడగడం మాని 
మడిగి =     ఓపికతో ఆగి 
అహిమభానుడు =     వేడి కిరణాలున్న సూర్యుడు
అస్తమించుచునున్నవాడు =     అస్తమిస్తున్నాడు
ఎల్లి =     రేపు
పారణకైన =     ఉపవాసం ఉన్న తర్వాతి రోజుకైనా భోజనం
గటా = అయ్యో 
రేపాడి = ఉదయం లేచి
మేలుకని = మేల్కొని
ఏ పాపాత్ముని = ఏ పాపిష్టివాడిని
లేదెట్లు =     దొరకకుండా ఉంటుందా? 
మనకున్ =    మనకు 
మాధుకరభిక్ష =    మధుకరమైన భిక్ష
బ్రాహ్మణ మందిరముల =    బ్రాహ్మణ ఇళ్లలో

   
భావం: ఈరోజు బిక్ష అడగడం మాని ఓపికతో ఉండి ఉపవాసం చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ ఇళ్లలో ఉపవాసాంత భోజనానికి సరిపడా భిక్ష దొరక్కపోదు.

6. వచనం:
     అని యారాత్రి గడపి మఱునాఁడు మధ్యాహ్నకాలంబున శిష్యులుం దాను 
     వేఱువేఱు విప్రభవన వాటికల భిక్షాటనంబొనర్పంబోయి, 
     తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నే మచ్చెకంటియు వంటకంబు 
     పెట్టకున్నఁ గటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగులవైచి కోపావేశంబున
ప్రతిపదార్థం

అని =     అలాచెప్పి
యారాత్రి =     ఉపవాసంతో ఆ రాత్రి
గడపి =     కాలం వెళ్లిబుచ్చి
మఱునాడు =     తర్వాత రోజు
మధ్యాహ్నకాలంబున =     మధ్యాహ్న సమయంలో
శిష్యులుం తానున్ =     శిష్యులు, తాను (వ్యాసుడు) 
వేఱువేఱు =     వేర్వేరుగా 
విప్రభవన =     బ్రాహ్మణ ఇళ్లున్న
వాటికల =     వాడల్లో
భిక్షాటనంబు =    భిక్షం కోసం వెళ్లారు
ఒనర్పంబోయి =     చేస్తూ వెళ్లి
తొలునాటి యట్ల =     ముందురోజులాగానే
ముక్కంటి మాయ =     విశ్వనాథుడి మాయవల్ల
ఏ మచ్చెకంటి =     ఏ చేపల లాంటి కన్నుల్ను స్త్రీ అయినా
వంటకంబు =     వంటకాలు
పెట్టకున్నన్ =     పెట్టకపోగా
కటకటంబడి =     బాధపడుతూ
భిక్షాపాత్రంబు =     భిక్షం అడిగే పాత్రను 
నట్టనడుఁవీథిం =     వీధి మధ్యలో 
పగులవైచి =     పగలకొట్టాడు
కోపావేశంబున =     కోపం, ఆవేశంతో


భావం: అని, వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేర్వేరుగా విప్ర వాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కానీ మొదటిరోజు లాగానే విశ్వనాథుడు మాయవల్ల ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలయ్యేలా నట్టనడి వీధిలో ఆవేశంతో విసిరికొట్టాడు.

7. తే.గీ. ధనము లేకుండెదరు మూఁడు తరములందు
            మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
            విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ
            బంచజనులకుఁ గాశికాపట్టణమున
ప్రతిపదార్థం

కాశికా పట్టణమునన్ =     కాశీ పట్టణంలో 
పంచజనులకు =     పాంచ భౌతిక శరీరం కలవారైన మనుషులకు
మూడుతరములన్ =     మూడు తరాల దాకా
మోక్షలక్ష్మి =     మోక్షమనే లక్ష్మి (ముక్తి) 
జెడుఁగాక =     చెడిపోవునుగాక 
మూడుఁతరములన్ =     మూడు తరాల దాకా
విద్యయును =     విద్య కూడా
వెడలవలయు =     నశించిపోవాలి
మూడు తరములందు =     మూడు తరాలపాటు
ధనములేకుండెదరు =     ధనం లేక ఉంటారు


భావం: కాశీ పట్టణంలో మూడు తరాల దాకా నివసించే మనుషులకు ధనం, విద్య, మోక్షం లేకుండా ఉండుగాక! అని వ్యాసుడు శపించడానికి సిద్ధపడ్డాడు.

8. వచనం
    అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపం దలంచు నవసరంబున నొక్క విప్రభవనంబు
    వాఁకిటం బార్వతి ప్రాకృత వేషంబున
ప్రతిపదార్థం:

అని =     అని 
పారాశర్యుండు =     పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడు
క్షుత్పిపాసా =     ఆకలి, దప్పికతో (ఆకలి దప్పులు) 
పరవశుండై =     బాధపడుతున్నవాడై
శపియింపం =     శాపం పెట్టెందుకు
తలంచు =     సిద్ధమవగా
నవసరంబున =     ఆ సమయంలో
నొక్క =     ఒక 
విప్రభవనంబు =     బ్రాహ్మణ మందిరపు 
వాకిటన్ =     వాకిలిలో 
పార్వతి =     పార్వతీదేవి
ప్రాకృతవేషంబున =     సామాన్య స్త్రీ వేషంలో 


భావం: అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది.

9. పద్యం (కంఠస్తం చేయాల్సిన పద్యం)
ఉ. వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
     త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
     య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మనిపిల్చెహస్తసం
     జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
ప్రతిపదార్థం:

వేద =     వేదాలు
పురాణ =     పురాణాలు
శాస్త్ర =     శాస్త్రాలు
పదవీ =     జ్ఞానములకు 
నదవీయసియైన =     ఎక్కువ దూరంలేని
పెద్దముత్తైదువ =     పెద్దకుటుంబ స్త్రీ 
కాశికానగర =     కాశీనగరం అనే
హాటక పీఠ =     స్వర్ణపీఠ 
శిఖా =    శిఖరాన్ని
అదిరూఢ =     అధిరోహించి
అయ్యాదిమశక్తి =     ఆ స్వరూపిణి
సంయమివరా =     ఓ మునివర్యా! (సంయమనంలేని వ్యక్తి) 
యిటురమ్మని =     ఇలా 'రా' అని 
పిల్చె =     పిలిచింది 
హస్త సంజ్ఞా =     చేతి గుర్తుతో (ఊపుతూ)
అదర లీల =     అధరంతో కూడిన విలాసంతో 
రత్నఖచితా =     రత్నాలతో చేసిన
ఆభరణంబు =     కంకణాలు
ఘల్లు ఘల్లనన్ =     ఘల్లు ఘల్లుమని ధ్వని చేస్తున్నాయి.


భావం: వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి అయిన ఆ ముత్తైదువ, కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె, తన చేత ధరించిన రత్న కంకణాలు ఘల్లు ఘల్లుమనేలా చెయ్యి ఊపుతూ 'ఓ సంయమివరా! ఇటురా' అని పిలిచింది.

10వ పద్యం (కంఠస్తం చేయాల్సిన పద్యం)
శా. ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
      లేకున్నం గడు నంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!
      నీ కంటెన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్
      శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్!
ప్రతిపదార్థం

ఆ కంఠంబుగ =     గొంతుదాకా
నిప్డు =     ఇప్పుడు
మాధుకర భిక్షాన్నంబు =     ఇల్లిల్లూ తిరిగి అన్నం సేకరించుకోవడం
భక్షింపగా =     తినేందుకు
లేకున్నన్ =     లేకపోయేసరికి
కడున్ =     ఎక్కువ
అంగలార్చెదవు =     దుఃఖించెదవు
మేలే =     నీకు మంచిదా? 
లెస్స =     బాగున్నది
శాంతుండవే =     నీవు శాంత స్వభావుడవా?
నీ కంటెన్ =     నీకన్నా 
మతిహీనులే =     బుద్ధి లేనివారా? 
కటకటా =     అయ్యయ్యో 
నీవార ముష్టింపచుల్ =     సహజంగా పండే వడ్లను పిడికెడు తీసుకుని ఆకలి తీర్చుకునేవాళ్లు
శాకాహారులు =     కూరగాయలు మాత్రమే తినేవారు 
గందభోజులు =     దుంపలు తినేవారు
శిలోంఛప్రక్రముల్:
శిల 
= శిలప్రకములు (పొలాల్లో రాలిన కంకుల (గింజల)ను ఏరుకుని బతికేవాళ్లు)
ఉంచప్రక్రముల్ =     రోళ్ల దగ్గర చెదిరపడిన బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించేవారు.
తాపసులు =     తపస్సు చేసుకునేవారు (మునులు) 


భావం: గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావుకదా! ఇది నీకు మంచిదా? బాగుంది. నిజంగా నువ్వు శాంత స్వభావుడవా? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్లబుచ్చేవారు, శాకాహారంతో దుంపలు తిని బతికేవాళ్లు, రోళ్ల వద్ద చెదిరిపడిన బియ్యం ఏరుకుని జీవం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువవాళ్లా?

11వ పద్యం (కంఠస్తం చేయాల్సిన పద్యం)
తే.గీ. ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
        గన్నతల్లియు నొక్క రూపన్న రీతి
        యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
        కాశి; యివ్వీటి మీఁద నాగ్రహము దగునే?
ప్రతిపదార్థం

ఓ మునీశ్వరా =     ఓ మునీశ్వరా! (ఓ వ్యాసుడా!) 
వినవయ్య =     నీవు విని ఉంటివా?
ఉన్నయూరున్ =     ఉన్న ఊరు
గన్నతల్లియున్ =     కన్నతల్లి
ఒక్క రూపన్న =     ఒకే తీరు అన్న
రీతి =     పద్ధతి (నీతి)
అటు విశేషించి =     అంతకన్న గొప్పనైన
శివుని =     శివుడి 
యర్ధాంగలక్ష్మి =     శరీరంలో సగ భాగమైన లక్ష్మీ సమానురాలు (భార్య) 
కాశీ =     కాశీనగరి 
యివ్వీటిమీద =     వీటిపైన
నాగ్రహము దగునే =     కోపం చూపించడం తగునా? 

భావం: 'ఓ మునీశ్వరా! ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా? అంతకంటే గొప్పనైన శివుడి అర్ధాంగలక్ష్మియైన ఈ కాశీనగరి మీద నువ్వు ఇంత కోపం చూపించడం తగునా? అని పార్వతి దేవి వ్యాసుడిని మందలించింది.

12. వచనం.
   ఇట్టి కాశికానగరంబుమీద భిక్షలేకుండుట కారణంబుగా నీయంత వాడు కటకటంబడి 
   శపియింపదలంచునే? విశేషించి యాఁకొన్న వాఁడవు గావున నీ యవసరంబున నిన్ను హెచ్చు
   గుందాడుట మము బోఁటి గృహిణులకు మెచ్చుగాదు. మా యింటికిం గుడువ రమ్ము! కుడిచి 
   కూర్చున్న పిమ్మటం గొన్ని మాటలు నీతో నాడఁగలననిన నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె
ప్రతిపదార్థం:

ఇట్టి =     ఇలాంటి
కాశీకానగరంబుమీద =     కాశీ నగరంలో
భిక్షలేకుండుట  =     భిక్ష దొరకలేదని
కారణంబుగా =     కారణంతో 
నీయంతవాడు =     నీలాంటి ఉత్తముడు
కటకటంబడి =     బాధపడి
శపియింపందలంచునే =     శాపంపెట్టాలని అనుకుంటాడా!
విశేషించి =     అందులో విశేషమైన
యాకొన్నవాడవు =     ఆకలితో ఉన్నవాడివి
కావునన్ =     కాబట్టి
నీయవసరంబున =     ఇలాంటి అవసరంలో
నిన్నున్ =     నిన్ను
హెచ్చుగుందాడుట =     ఎక్కువగా బాధపెట్టడం
మముబోటి =     మా లాంటి
గృహిణులకు =     ఇల్లాళ్లకు
మెచ్చుగాదు =     మంచిది కాదు
మాయింటికిన్ =     మా ఇంటికి 
గుడువన్ =     భోజనానికి
రమ్ము =     రావాలి 
కుడిచి =     తిని
కూర్చున్న పిమ్మటం =     కూర్చున్న తర్వాత 
గొన్ని మాటలు =     కొన్ని మాటలు
నీతోన్ =     నీతో
ఆడగలను =     పలుకగలను
అనిన =     అన్నట్టి
అమ్మహాసాధ్విన్ =     ఆ గొప్ప కుటుంబ స్త్రీని
కని =     చూసి
పారాశర్యుండు =     పరాశరుడి కుమారుడైన వేదవ్యాసుడు
ఇట్టులనియె =     ఇలా అన్నాడు

     
భావం: ''ఇలాంటి కాశీ నగరంలో భిక్ష దొరకలేదనే కారణంతో నీలాంటి ఉత్తముడు బాధపడి శాపం పెట్టాలని అనుకుంటాడా? చాలా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మాలాంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడతాను" అన్న ఆ పతివ్రతను చూసి, వ్యాసుడు ఇలా అన్నాడు.

13. తే.గీ. అస్తమింపగఁ జేసినాఁడహిమకరుడు
              శిష్యులేఁగాక యయుతంబు చిగురుబోఁడి
              వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు
              నేఁడు నిన్నటి మరునాఁడు నిక్కువంబు
ప్రతిపదార్థం

అస్తమింపగ =     అస్తమించడానికి
జేసినాడు =     చేరుకున్నాడు
హిమకరుడు =     సూర్యుడు
శిష్యులేఁగాక =     నేను, నాతో శిష్యులు
అయుతంబు =     పదివేలమంది ఉన్నారు
చిగురుబోఁడి =     చిగురుటాకు లాంటి శరీరం ఉన్న స్త్రీ
వ్రతముతప్పి =     వ్రతాన్ని విడిచిపెట్టి
భుజింపంగ =     తినడానికి
వలనుగాదు =     సరికాదు
నేడు =     ఈ రోజు
నిన్నటి =     గడచిన రోజునకు
మరునాడు =     తర్వాతిరోజే (నిన్నటిలాగే నేడూ ఉపవాసం ఉండటం)
నిక్కువంబు =     వాస్తవం

భావం: వ్యాసుడు పార్వతీదేవితో తల్లీ! సూర్యుడు అస్తమించడానికి చేరుకున్నాడు. నాతోపాటు పదివేల మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భోజనం చేయాలనేది నా వ్రతం. దాన్ని విడిచిపెట్టి మీ ఇంటి నేనొక్కడినే భుజించలేను. ఈ రోజు నిన్నటికి మరునాడే కదా! (అంటే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం)

14వ పద్యం (కంఠస్తం చేయాల్సింది)
చ. అనవుడు నల్లనవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
     మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
     థునికృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
     బని గొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్
ప్రతిపదార్థం

అనవుడు =     అన్నప్పుడు (వ్యాసుడు అన్నప్పుడు) 
నల్లనవ్వి =     చిన్నగా నవ్వి
కమలానన =    కమలం లాంటి ముఖం ఉన్న పతివ్రత 
యిట్లను =     ఇలా అంది 
లెస్సగాక  =     బాగుకాక! 
యో మునివర! =     ఓ మునీంద్రా
నీవు శిష్యగణమున్ =     నీవు శిష్యులను అందరిని
గొని =     వెంట తీసుకుని
చయ్యన =     వెంటనే
రమ్ము =     రావాలి
విశ్వనాథుని =     విశ్వనాథుడి (శివుడి) 
కృప పేర్మిన్ =     ఎక్కువ దయతో
ఎందఱతిథుల్ =     ఎంత మంది అతిథులు
చనుదెంచిన =     వచ్చినా
కామధేనువున్ =     కామధేనువులా
పనిగొనునట్లు =     వశం చేసుకున్నట్లుగా
పెట్టుదు =     పెడతాను
నపారములైన   =     అనంతమైన
అభీప్సితాన్నముల్ =     కోరిన పదార్థాలను


భావం: అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి కమలం లాంటి ముఖం ఉన్న ఆ ఇల్లాలు ''సరేలే! మునీంద్రా! విశ్వనాథుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువులా కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్య గణాన్ని తీసుకుని వెంటనే రా!" అంది.

15. వచనం
     అనిన నట్లకాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు 
     శిష్యులంగూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శంబాచరించి 
     యేతెంచిన
ప్రతిపదార్థం

అనిన =     ఆ ఇల్లాలు చెప్పగానే
అట్లకాక =     అలాగే అని
మహాప్రసాదంబని =     మహాప్రసాదం అని
వేదవ్యాసుండు =     వేదవ్యాసుడు
శిష్యులన్ గూర్చుకుని =     శిష్యులను తీసుకుని
భాగీరథికింజని =     గంగానదికి వెళ్లి
ఉపస్పర్శంబు =     స్నాన, ఆచమనాదికాలు
ఆచరించి =     చేసుకుని
యేతెంచిన =     రాగా 


భావం: ఆ ఇల్లాలు చెప్పగానే ''అలాగే మహాప్రసాదం అని" భావించిన వేదవ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్లి స్నాన ఆచమనాదికాలు పూర్తిగావించుకుని రాగా.

16. తే.గీ. గొడుగు పాగల గిలకలు గులకరింప
       నిందుబింబాస్య యెదురుగా నేగు దెంచి
       ఛాత్ర సహితంబుగాఁ బరాశరతనూజు
       బంతిసాగించె భుక్తి శాలాంతరమున
ప్రతిపదార్థం

గొడుగు పాగల =     గొడుగు ఆకారంలో ఉన్న బుడిపెలున్న పావుకోళ్లు 
గిలకలు =     గిలకలు
గులకరింపన్ =     మోగుతుండగా
ఇందుబింబాస్య =     చంద్రబింబం లాంటి ముఖం ఉన్న (చంద్రముఖి) ఆ స్త్రీ
ఎదురుగాన్ =     ఎదురుగా (వ్యాసుడికి)
ఏగుదెంచి =     వెళ్లి
ఛాత్ర సహితంబుగాన్ =     శిష్యులందరితో
పరాశరతనూజు =     పరాశరుడి కొడుకు వ్యాసుడు
బంతి =     కూర్చున్న వరసకు వెళ్లి
సాగించెన్ =    వడ్డన చేసింది 
భుక్తి శాలాంతరమున =     భోజనశాలలో


భావం: గొడుగు ఆకారంలో ఉన్న బుడిపెలున్న పావుకోళ్ల గిలకలు మోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వారికి ఎదురువెళ్లి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె వడ్డన సాగించింది.

పాఠ్యభాగ సారాంశం

  విద్యాగురువైన వ్యాసుడు ఒకరోజు శిష్యులతో కాశీనగరంలో పట్టపగలు, మండే ఎండలో బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లూ తిరిగాడు. కానీ ఇళ్లల్లోకి వెళితే ఒక ఇల్లాలు 'వండుతున్నా' అంది. మరొక స్త్రీ 'మళ్లీ రండి' అంది. ఇంకొక ఆవిడ 'ఈ రోజు వ్రతం' అని చెప్పింది మరొక ఇల్లాలు అసలు తలుపులే తెరవలేదు.
   కాశీ నగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. భిక్ష కోసం వచ్చినవారిని ఈ స్త్రీలు శివుడిగా భావించి ఆదరిస్తారు. ఇంటికి వస్తే బంగారు పళ్లెంలో అన్నంపెట్టి భక్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి పుణ్యస్త్రీలు అన్నం పెట్టడం లేదని ''ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశానో" అని వ్యాసుడు అనుకున్నాడు.
   వ్యాసుడు భిక్ష దొరకదని గ్రహించి భిక్షాటనం మాని ఉపవాసం చేద్దామని భావించాడు. మరుసటి రోజైనా భోజనానికి సరిపడే భిక్ష దొరక్కపోతుందా అని రాత్రి మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, వ్యాసుడు ఆ బ్రాహ్మణవాడల్లో భిక్షాటనం చేయసాగారు. కానీ ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో వ్యాసుడు భిక్షపాత్రను నడివీధిలో విసిరికొట్టాడు. అంతేకాకుండా ''ఈ కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడు తరాలదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక!" అని శపించబోయే సమయంలో ఒక బ్రాహ్మణ ఇంటిముందు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చి ''ఓ సంయమివరా! గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావుకదా! ఇది నీకు మంచిదా? బాగుంది. నిజంగా నువ్వు శాంత స్వభావుడవా? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్లబుచ్చేవారు, శాకాహారంతో దుంపలు తిని బతికేవాళ్లు, రోళ్ల వద్ద చెదిరిపడిన బియ్యం ఏరుకుని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువవాళ్లా? శివుడి అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా!" అంది.
   అన్న తర్వాత ''చాలా ఆకలితో ఉన్నావు. మా ఇంటికి భోజనానికి రా! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతాను" అంది.
   అప్పుడు వ్యాసుడు ''తల్లీ సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాతోపాటు శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భోజనం చేయాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. నిన్నటి లాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదు" అని అన్నాడు.
   వ్యాసుడి పలుకులు విని ఆ ఇల్లాలు (పార్వతీదేవి) ''సరేలే! మునీంద్రా! విశ్వనాథుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువులా కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్య గణాన్ని తీసుకుని వెంటనే రా! అంది అనగానే వ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్లి స్నాన, ఆచమనాదులు పూర్తి చేసుకుని వచ్చాడు. వారిని చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు ఎదురువెళ్లి ఆహ్వానించింది. వ్యాసుడు శిష్యులతో భోజనశాలలో కూర్చున్నాడు. సామాన్య స్త్రీ వేషంలో వచ్చిన పార్వతీదేవి అందరికి వడ్డన చేసింది.

రచయిత: అంజా గౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌