• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెన్నెల

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన

1. పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చర్చించండి.
జ: పాఠంలో కవి వెన్నెలను వర్ణించాడు. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశంలో ఇంద్రధనుస్సు, నదీప్రవాహం, రుతువులు, పక్షుల సవ్వడి, విచ్చుకుంటున్న పుష్పాలు, సుడిగాలి తీరు, కొండలు, జలపాతాలు, చెట్లు, జంతువుల జీవనం... ఇలా ప్రకృతిలో వివిధ సందర్భాలను వర్ణించవచ్చు. అనుభూతుల విషయానికి వస్తే మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ వర్ణన వినసొంపుగా, పరవశించేలా, కళ్లకు కట్టినట్లు, అద్భుతంగా అనిపిస్తుంది.

2. మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జ: మంజీరా నది 'ఏడుపాయలు'గా చీలి ప్రవహించే మధ్యభాగంలో దుర్గమ్మ దేవాలయం ఉంది. నది ఏడుపాయలుగా ప్రవహిస్తున్న సందర్భంలో ఇరువైపులా పచ్చని కొండలు కళ్లకు మధురానుభూతిని నింపాయి.
వివిధ రకాల పక్షులు, జంతువులకు నిలయం ఆ అడవి ప్రాంతం. గలగల మంజీర సవ్వడులు ఆనందపరిచాయి. అక్కడి ఘనపురం ఆనకట్ట (మద్రేవు) నుంచి వదిలిన నీరు జాలువారి ప్రవహిస్తున్న సందర్భంలో చేపలు ఎదురెక్కి దూకడం గొప్ప విన్యాసంగా కనిపించింది. ఔషధ మొక్కలతో కూడిన ఆ ప్రాంతంలోని గాలి కొత్త శక్తిని ఇచ్చింది.

 

3. ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.

   
      (నృసింహ పురాణం - పంచమాశ్వాసం - 78)
అ) పై పద్యంలో చాలాసార్లు పునరుక్తమైన పదం ఏది?
జ: పై పద్యంలో 'కలడు' అనే పదం చాలాసార్లు పునరుక్తమైంది.
ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని చెప్పండి.
జ: పునరుక్తమైన పదం 'కలడు'ను పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ శబ్దంలో ఏదో మహిమ ఉన్నట్లు అనిపించింది. భగవంతుడు అన్నింట్లో ఉన్నాడనే సత్యం కళ్ల ముందు కనిపించింది. ప్రతి పదార్థంలో భగవంతుడు ఉన్నాడు అనడం వల్ల అన్నింటినీ గౌరవించాలనే భావన కలిగింది. చెవులకు వినసొంపుగా అనిపించింది. మరిచిపోలేని అనుభూతిని కలిగించింది.
ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జ:  మేదిని = భూమి; ఉదకంబు = నీరు; వాయువునందు = గాలియందు;
      వహ్ని = అగ్ని; భానుని = సూర్యుడి; సోముని = చంద్రుడి;
      అంబరంబు = ఆకాశంలో; దిశల = దిక్కుల; చరంబు = కదిలేవి;
      అచరంబు = కదలలేనివి; బాహ్యంబు = పైన; లోన = లోపల;
      సారంబుల = మేలైన; కాలంబుల = కాలంలో; ధర్మంబుల = ధర్మంలో;
      క్రియల = పనిలో; కలవాని = డబ్బు ఉన్నవాడు; లేనివాని = లేనివాడు;
      నీయందు = నీలో; నాయందు = నాలో.
      ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.
           మ. కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్
                 గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
                 గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
                 గలఁ డీశుండు గలండు తండ్రి! వెదకంగా నేల నీయాయెడన్.
     (శ్రీమదాంధ్ర మహాభాగవతం - సప్తమ స్కంధం - 78)
అ) ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జ: ఎఱ్ఱన పద్యం, పోతన పద్యాల్లో సమానార్థక పదాలు
                    ఎఱ్ఱన పద్యం                               పోతన పద్యం
                    కలండు                       -                కలండు
                    వహ్ని                         -                అగ్ని
                    వాయువు                   -                గాలి
                    భానుని                       -               ఖద్యోత
                    సోముని                      -               చంద్రుని
                    అంబరం                      -               ఆకాశం
                    దిశల                          -               దిశల
ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జ: రెండు పద్యాలను పోల్చి చూస్తే ఎఱ్ఱన, పోతన ఇద్దరూ 'కలడు' అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రెండు పద్యాల్లోని పదాలు దాదాపు సమానార్థకాలుగా ఉన్నాయి. 'భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు' అనే భావాన్ని ఇద్దరు కవులూ వ్యక్తీకరించారు. రెండు పద్యాలను నిశితంగా గమనిస్తే పోతనపై ఎఱ్ఱన ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.

 

4. పువ్వు గుర్తు ఉన్న పద్యాలను భావస్ఫోరకంగా చదవండి.
జ: 'వెన్నెల' పాఠంలోని 2, 5, 7వ పద్యాలు పువ్వు గుర్తు ఉన్న పద్యాలు. ఇవి కంఠస్థం చేయాల్సినవి. భావస్ఫోరకంగా చదవండి. ప్రతిపదార్థాలను గుర్తుంచుకోవాలి.
2వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
            చ. సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
                 న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
                 సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
                 దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం:

 

సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (తో)
శోభి = అలంకరించిన
నభోంగణభూమిన్ (నభ + అంగణభూమిన్) = ఆకాశమనే రంగస్థలంపై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్న పూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా
నటింపఁగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికి = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమదిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని
సాంధ్య = సంధ్యకు సంబంధించిన
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది.

                           
తాత్పర్యం: చాలా అందమైన చుక్కల పూలతో అలంకరించిన ఆకాశమనే రంగస్థలంపై కాలం అనే గొప్ప సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల ముందు నాట్యం చేయడానికి రాత్రి అనే స్త్రీ సిద్ధపడింది. ఆ సమయంలో పడమటి తీరంలోని కొత్త వెలుగు ఆమెకు అడ్డంగా ఎర్రటి పెద్ద తెరలా ప్రకాశించింది.

5వ పద్యం: (కంఠస్థం చేయాల్సింది)
        చ. దెసలను కొమ్మ లొయ్య నతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
               బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
               కస మను పేరి భూరుహము కాంతనిరంతర తారకా లస
               త్కుసుమ చయంబు గోయుటకొకో యనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్థం:
 

దెసలను = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = నెమ్మదిగా
అతి దీర్ఘములైన = ఎక్కువ పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణాలతో)
ప్రియంబు + ఎసగగన్ = ప్రేమ పెరగ్గా
నూది = ప్రయత్నించి
నిక్కి = పైకి లేచి
రజనీశ్వరుడు (రజని + ఈశ్వరుడు) = చంద్రుడు
ఉన్నతలీలన్ = ఉన్నతంతో
పేర్చు = పేర్చునట్లుగా
ఆకసమను = ఆకాశమనే
పేరి = పేరు గల
భూరుహము = చెట్టుపై
కాంత = చక్కనైన కాంతి
నిరంతరం = ఎల్లప్పుడూ
తారకా = నక్షత్రాలతో
లసత్ = ప్రకాశించే
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకొకో + అన = కోసేందుకేనా అన్నట్లు
సముత్సుకత = మిక్కిలి ఉత్సాహంతో కూడిన
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = వ్యాపించాడు.

                            
తాత్పర్యం: దిక్కులు అనే కొమ్మలు, నక్షత్రాలు అనే పువ్వులతో ఆకాశం పెద్ద చెట్టులా ఉంది. తన పొడవైన చేతులతో పుష్ప సముహాన్ని కోయడం కోసమా అన్నట్లు చంద్రుడు ఉత్సాహంతో కూడిన ఆకృతితో వ్యాపించాడు.

 

7వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
             చ. వడిగొని ఱేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్బఁ బు
                  ప్పొడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జెలంగి పైఁ
                  బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు
                  గ్గడువుగ నుల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం:

 

ఘనకైరవషండము = కీర్తించదగ్గ కలువల సముదాయం
నిండు వెన్నెలన్ = నిండు వెన్నెలతో
వడిగొని = వేగంగా
ఱేకులు = పూల రెక్కలు
ఉప్పతిల = విచ్చుకోగా
వాలిన = వాడిపోయిన
కేసరముల్ = పూవులోని పుప్పొడి ఉండే భాగాలు
దలిర్పఁ = చిగురించగా
పుప్పొడి = పుప్పొడి
తలమెక్కి = పైభాగంలో
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = అలలుగా
చెలంగి = చెలరేగి
పైబడు = తమ పైకి వచ్చే
ఎలదేటి = తుమ్మెదల
దాటులకున్ = సమూహానికి
పండువులై = పండగ చేస్తూ
నవసౌరభంబులు = కొత్త సువాసనలు
ఉగ్గడువుగా = ఎక్కువగా
ఉల్లసిల్లె = వెల్లివిరిశాయి

 తాత్పర్యం: నిండు వెన్నెలతో ఆ కలువ పూల సమూహం యొక్క రేకులు వేగంగా విచ్చుకున్నాయి. వాడిపోయిన పుప్పొడి భాగాలు చిగురించాయి. పుప్పొడిపై మకరందాలు పొంగి తరంగాల్లా విజృంభించి, తమపైకి వస్తున్న తుమ్మెదల బృందానికి పండగ చేశాయి. కలువలు కొత్త పరిమళాలతో పరిసరాలను సంతోషభరితం చేశాయి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) ''కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె" ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జ: ఈ పాఠంలో సూర్యుడు అస్తమించాక అధికమైన చీకటి నిండిన సందర్భంలో ఎఱ్ఱన పై విధంగా పేర్కొన్నాడు.
      చీకటి కారణంగా ఆకాశం, భూమి, దిక్కులు ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. సకల జగత్తు అంతా కాటుక నింపిన బరిణెలా అమరిపోయింది. విశ్వమంతా నిండిన చీకటిని కవి కాటుక నిండి ఉండే బరిణెతో పోల్చాడు.
ఆ) ఈ పాఠంలో వెన్నెలను వర్ణించడానికి కవి ఏయే అంశాలను ఎన్నుకున్నాడో తెలపండి.
జ: కవి 'వెన్నెల'ను వర్ణించడానికి తీసుకున్న అంశాలు:
            1. పతిభక్తికి పద్మమే ఆదర్శం
            2. నాటక ప్రదర్శనలోని సంప్రదాయాలు
            3. కాటుక నింపిన బరిణె
            4. పెద్దచెట్టుకు ఉన్న కొమ్మలు, పూవులు
            5. ఉప్పెనలా వెన్నెల విజృంభించినప్పుడు చంద్రబింబం ఆదిశేషువు పాన్పు
            6. చంద్రబింబంలోని మచ్చ మహావిష్ణువులా గోచరించడం
            7. వెన్నెల అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంగా ఉండటం.

 

ఇ) పాఠం ఆధారంగా ఆకాశంలోని రంగులు ఏయే సమయాల్లో ఎలా మార్పు చెందాయో తెలపండి.
జ: ' వెన్నెల' పాఠం ఆధారంగా ఆకాశంలోని రంగులు ఇలా మార్పుచెందాయి. సూర్యుడి కిరణాలతో పద్మాలు విచ్చుకున్న సమయంలో ఆకాశంలోని రంగు వేరే రకంగా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలోకి వచ్చే ముందు 'నలుపు' రంగులో ఉంటుంది. ఆకాశమనే రంగస్థలంపై నిశాసతి సరసంగా నటిస్తున్న సమయంలో పశ్చిమ తీరంలోని కొత్త కాంతి ఆమెకు అడ్డుగా ఎత్తిన ఒక విధమైన 'ఎర్రని' తెరలా అలరారుతూ ఉంటుంది. చంద్రోదయం కాగానే 'తెల్లని' కాంతి పెరుగుతూ కళ్లకు అమృతపు జల్లులా విజృంభించింది.

 

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) పద్య భావాలను ఆధారంగా చేసుకుని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జ: వెన్నెల పాఠ్యభాగ సారాంశం:
     అసమానమైన కాంతితో ప్రకాశించే సూర్యుడిని చూసిన పద్మం తక్కువ కాంతితో ఉండే చుక్కలను చూడలేక  చటుక్కున కళ్లు మూసుకుంది.
     ప్రకాశించే చుక్కల (నక్షత్రాలు) పూలతో అలంకరించిన ఆకాశమనే రంగస్థలంపై కాలమనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలక సమూహంలో నిశాసతి సరసంగా నటిస్తోంది. ఆ సమయంలో పశ్చిమ తీరంలోని కొత్త కాంతి ఆమెకు అడ్డంగా ఎత్తిన ఒక విధమైన ఎర్రని తెరలా అలరారుతూ ఉంది.
     చీకటి ఎక్కువ కావడంతో దిక్కులు, ఆకాశం, భూమి కలసిపోయి బాగా కాటుక నింపిన బరిణెలా విశ్వమంతా నల్లగా కనిపించింది.
     ఆకాశం పెద్ద చెట్టులా కనిపించింది. చంద్రుడు తన పొడవైన చేతులతో ఆ చెట్టుకుండే చుక్కలనే పువ్వులను అందుకునేందుకా అన్నట్లు విజృంభించాడు.
     వెన్నెల ఉప్పెనలా విజృంభించి దిక్కులను ముంచెత్తినప్పుడు చంద్రబింబం ఆదిశేషువు పాన్పులా, అందులోని మచ్చ మహావిష్ణువులా కనిపించింది.
నిండు వెన్నెలతో కలువపూల రేకులు వేగంగా విచ్చుకున్నాయి. కేసరాలు చిగురించాయి. పుప్పొడిపై మకరందాలు పొంగాయి. అవి తుమ్మెదలకు పండగ చేశాయి.
     చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగించాడు. చకోర పక్షుల రెక్కలను స్పృశిస్తూ, కలువపూల రంధ్రాలను నింపి, తనవైపు తిప్పుకుంటూ, అందమైన స్త్రీ చిరునవ్వుల తెల్లని కాంతిని పెంచుతూ నిండుగా ఆవిర్భవించాడు.
     అందంగా, గంభీరంగా విస్తరించిన వెన్నెల 'రాత్రి 'అనే ఆలోచన రానీయకుండా, 'చీకటి' అనే పేరు విననీయకుండా కళ్లకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా తాకింది.

 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యం లేదా సన్నివేశం లేదా సమయాన్ని వర్ణిస్తూ రాయండి.
ఉదా: సూర్యోదయం/ సూర్యాస్తమయం
జ: శీతాకాలంలో సూర్యోదయం
     శీతాకాలంలో చలి ఎక్కువ. నేను ఉదయం లేచి బయటకు వచ్చాను. చలికి గజగజ వణికిపోయాను. రెండు నిమిషాల తర్వాత ఇదిగో 'నేనున్నాను' అన్నట్లు వస్తున్నాడు తూర్పు దిక్కు నుంచి సూర్యుడు. ఎర్రని కాంతి ఛాయలు ఆకాశానికి తాకడం కళ్లకు కమనీయంగా కనిపించింది. పక్షుల సవ్వడి మొదలైంది. ఆ కాంతి రేఖలు (వెచ్చని స్పర్శ) చలి నుంచి బయటపడేలా చేశాయి.
సూర్యకాంతికి చెట్ల ఆకులపై ఉన్న మంచు బిందువులు నీటి ముత్యాల్లా జాలువారుతున్నాయి. విచ్చుకున్న పువ్వులోని నీటి బిందువులు ముత్యంలా కనిపించాయి. చలికి వణికిన నేలతల్లి సూర్యకిరణాలతో తన్మయత్వం పొందినట్లుంది. పగటికి రాజైన సూర్యుడు మనకు పనులు చేసుకునే శక్తిని ఇవ్వాలని నమస్కరించి ఇంట్లోకి వెళ్లాను.

 

ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జ: 'వెన్నెల' పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి:
* ఎఱ్ఱన 'వర్ణన'లకు పెట్టింది పేరు. అందుకే ఆయనను 'ప్రబంధ పరమేశ్వరుడు' అంటారు.
* రచనలో తేలికైన, కఠినమైన పదాలు రెండూ కనిపిస్తాయి. అవి కనువిందు చేస్తాయి.
* పదప్రయోగంలో నేర్పరి.
* 'వెన్నెల' పాఠంలో ఉత్ప్రేక్ష, ఉపమ లాంటి అలంకారాలను ప్రయోగించాడు.
* 'బొదలి పొదలి చదల బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి' అనే పాదాల్లో అనుప్రాసతో అలరించాడు.
* రూపక సమాస పదాల ప్రయోగం చేశాడు. ఉదా: నిశాసతి.
* అనుకున్న భావం అర్థం అయ్యేలా రాయడంలో దిట్ట.
* ఎఱ్ఱన 'భావనా విస్తృతి' గొప్పదనం 'వెన్నెలవెల్లి పాల్కడలి' అనే పద్యం ద్వారా తెలుస్తుంది.
* ప్రబంధ కవులకు ఆదర్శనీయుడు అనడానికి నిదర్శనం ఈ 'వెన్నెల'.
* ఎఱ్ఱనది ధారణ శక్తిని పెంచే రచనా శైలి.

 

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంత వాక్యాల్లో ఉపయోగించండి.
అ) భరతమాత మంద  స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జ: స్మితకాంతి = చిరునవ్వు వెలుగు
     ఇంట్లో పాపాయి స్మితకాంతి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.
ఆ) మేఘం దివి నుంచి భువికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం.
జ: దివి = ఆకాశం
   ఇంద్రధనుస్సు దివిలో వెలిసి కనువిందు చేసింది.
ఇ) కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జ: మిక్కుటమై = ఎక్కువై
     పదోతరగతిలో ఉత్తమ గ్రేడును సంపాదించాలన్న కోరిక నాకు మిక్కుటంగా ఉంది.
ఈ)  రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జ: రజనీకరబింబం = చంద్రబింబం
పౌర్ణమి నాటి రజనీకరబింబం చూడముచ్చటగా ఉంటుంది.

 

2. నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.
     అ) వెల్లి: ప్రవాహం, పరంపర, ఆంక్ష
     ఆ) కుండలి: పాము, నెమలి, చారల దుప్పి
     ఇ) నిట్టవొడుచు: ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితమగు

 

3. కింది మాటలకు పర్యాయ పదాలు రాయండి.
     అ) చాడ్పు: విధం, భంగి, తీరు
     ఆ) వెల్లి: ప్రవాహం, సరిత, నది
     ఇ) కైరవం: కలువ, కల్హారం, కుముదం
     ఈ) కౌముది: వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న
     ఉ) చంద్రుడు: ఇందుడు, శశాంకుడు, నిశాకరుడు
     ఊ) తమస్సు/ తమం: చీకటి, ఆంధ్యం, ఇరులు

 

4. కింది ప్రకృతి పదాలకు 'వికృతి' పదాలు రాయండి.
     అ) సంధ్య: సందె
     ఆ) దిశ: దెస
    ఇ) ధర్మము: దమ్మము
     ఈ) రాత్రి: రాతిరి
     ఉ) నిశ: నిసి

 

5. కింది వికృతి పదాలకు 'ప్రకృతి' పదాలు రాయండి.
     అ) గరువము: గర్వము
     ఆ) జతనము: యత్నము
     ఇ) దెస: దిశ
     ఈ) చందురుడు: చంద్రుడు

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌