• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెన్నెల

వ్యాకరణాంశాలు


1. 'వెన్నెల' పాఠంలో కింది సంధులకు సంబంధించిన పదాలను గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.
అ) సవర్ణదీర్ఘ సంధి
      'వెన్నెల' పాఠంలో సవర్ణదీర్ఘ సంధి పదాలు:
      రజనీశ్వరుడు = రజని + ఈశ్వరుడు
      సముత్సుకాకృతి = సముత్సుక + ఆకృతి
      చంద్రికాంబోధి = చంద్రిక + అంబోధి
      సుధాకర = సుధ + ఆకర
      చందనాసారం = చందన + ఆసారం
సవర్ణదీర్ఘ సంధి సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
ఆ) గుణసంధి
      'వెన్నెల' పాఠంలో గుణసంధి పదాలు:
      దివసేంద్రు = దివస + ఇంద్రు
      కాంతోపలంబు = కాంత + ఉపలంబు
      అభినుతేందు = అభినుత + ఇందు
గుణసంధి సూత్రం: అకారానికి ఇ, ఉ, ఋ పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్ ఆదేశంగా వస్తాయి.
ఇ) ఉత్వసంధి 
      'వెన్నెల' పాఠంలో ఉత్వసంధి పదాలు:
      కరవటంబన = కరవటంబు + అన
      ఖండమమరె = ఖండము + అమరె
      ధీరంబైన = ధీరంబు + ఐన
      తలమెక్కి = తలము + ఎక్కి
      రేకులుప్పతిల్ల = రేకులు + ఉప్పతిల్ల
      ప్రియంబెసగగ = ప్రియంబు + ఎసగగ
      పండువులై = పండువులు + ఐ
ఉత్వసంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.

 

2. కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి సూత్రాలు రాయండి.
అ) అత్యంత = అతి + అంత - యణాదేశ సంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు సమానం కాని అచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఆ) వంటాముదము = వంట + ఆముదము - అత్వసంధి
సూత్రం: అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళం.
ఇ) ఏమనిరి = ఏమి + అనిరి - ఇత్వసంధి
సూత్రం: ఏమ్యాదుల ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికం.
ఈ) అవ్విధంబున = ఆ + విధంబున - త్రికసంధి
సూత్రం: 1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికాలు అంటారు.
           2) త్రికంబు మీది అసంయుక్త హల్లుకు ద్విత్వంబు బహుళంబు.
           3) ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.

 

3. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.
అ) నలుదెసలు - నాలుగు సంఖ్యగల దిశలు - ద్విగు సమాసం
ఆ) సూర్యచంద్రులు - సూర్యుడును, చంద్రుడును - ద్వంద్వ సమాసం

 

4. కింది పద్య పాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి. సమన్వయం చేయండి.
అ) కుముదినీరాగ రసబద్ద గుళికయనగఁ
     జంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు.
జ: పై పద్య పాదాల్లో 'ఉత్ప్రేక్ష' అలంకారం ఉంది.
ఉత్ప్రేక్ష అలంకారం: ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం.
సమన్వయం: కునికిపాటు లేనివాడిగా కాంతినిచ్చే చంద్రుడి (ఉపమేయం)ను 'తెల్ల కలువ రాగ రసబద్ద గుళిక' (ఉపమానం)గా ఊహించి చెప్పారు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం.

 

5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి, లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జ: పాఠంలో మూడో పద్యం 'తేటగీతి'.
'తేటగీతి' పద్యం లక్షణాలు:
       1. నాలుగు పాదాలు ఉంటాయి.
       2. ప్రతి పాదంలో వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
       3. మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.
       4. ప్రాస నియమం ఉండదు.
       5. యతి కుదరనప్పుడు ప్రాస యతి వేసుకోవచ్చు.
సమన్వయం: 'వెన్నెల' పాఠంలోని మూడో పద్యం తేటగీతి.

* పై పాదంలో ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వచ్చాయి.
* యతి పొ - భు అక్షరాలకు చెల్లింది. మొదటి గణం మొదటి అక్షరం (పొ), నాలుగో గణం మొదటి అక్షరం (భు).
ఆటవెలది పద్య లక్షణాలు:
1. ఇది ఉపజాతి పద్యం. నాలుగు పాదాలు ఉంటాయి.
2. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు ఉంటాయి.
3. 2, 4 పాదాల్లో అయిదూ సూర్య గణాలే వస్తాయి.
4. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు ప్రాస యతి చెల్లుతుంది.
5. ప్రాస నియమం పాటించనవసరం లేదు.
* బొదలి పొదలి ..... అనే పద్యంలోని రెండు పాదాలను పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
  
పై పద్య పాదాల్లో ప్రతి పాదానికి అయిదు గణాలు ఉంటాయి. కానీ
        1వ పాదంలో 5 గణాలు (3 సూర్య గణాలు + 2 ఇంద్ర గణాలు)
        2వ పాదంలో 5 గణాలు (5 సూర్య గణాలు)
       ('వ' గణాన్ని 'లగం' అన్నట్లు, వాడుకలో 'హ' గణాన్ని 'గలం' అంటారు)

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

* 'నరసింహస్వామి కథ' నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను కింది పట్టికలో రాయండి.

   
పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు (Bullet Points):
* ప్రకాశించే సూర్యుడిని చూసే పద్మం తక్కువ కాంతి ఉండే చుక్కలను చూడలేక కళ్లు మూసుకుంది.
* ఆకాశమనే రంగస్థలంపై నిశాసతి నటిస్తున్నప్పుడు పశ్చిమదిశా తీరంలో కొత్తకాంతి ఎర్రని తెరలా అలరారింది.
* చీకటి ఎక్కువై విశ్వమంతా బాగా కాటుక నింపిన బరిణెలా కనిపించింది.
* ఆకాశం చెట్టు అయితే దానికుండే చుక్కలనే పువ్వులను అందుకునేందుకు అన్నట్లుగా చంద్రుడు తన వెన్నెలతో విజృంభించాడు .
* వెన్నెల ఉప్పెనలా దిక్కులను ముంచెత్తినప్పుడు చంద్రబింబం ఆదిశేషువు పాన్పులా, అందులోని మచ్చ మహావిష్ణువులా కనిపించింది.
* వెన్నెలలో కలువ పూలు విచ్చుకుని పుప్పొడిపై మకరందాలు పొంగి తుమ్మెదలకు పండగ చేశాయి.
* వెన్నెల 'రాత్రి' అనే ఆలోచన రాకుండా, కళ్లకు అమృతపు జల్లులా, శరీరానికి మంచిగంధంలా, మనసుకు ఆనందమిచ్చేలా విస్తరించింది.

'వెన్నెల' పాఠం నుంచి పరీక్షలో రాదగిన ప్రశ్నలు

¤ పువ్వు గుర్తు ఉన్న పద్యాలను పూరించమని అడగవచ్చు.
       1. సురుచిరతారకా..... పశ్చిమదిక్తటంబునన్ అనే పద్యాన్ని పూరించి ప్రతిపదార్థ భావం రాయండి.
       2. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యం, సన్నివేశం లేదా సమయం గురించి వర్ణించండి.
       3. ఎఱ్ఱన రచనా శైలిని వివరించండి.
       4. కవి 'వెన్నెల' ను వర్ణిస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభూతులను వివరించండి.
       5. 'చంద్రికాంబోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్టవొడిచే' అని కవి ఏ సందర్భంలో అన్నాడు?
       6. 'వెన్నెల'ను వర్ణిస్తూ 6 - 8 పంక్తుల 'కవిత' ను రాయండి.
       7. 'వెన్నెల' పాఠ్యాంశాన్ని సొంతమాటల్లో వివరించండి.
       8. కవి సూర్యుడు, కమలం మధ్య అనుబంధాన్ని భార్యాభర్తల బంధంగా పోల్చాడు. 'అనుబంధాల' గురించి మీ అభిప్రాయం తెలపండి.

పరీక్షలో రాదగిన భాషాంశాలు (పదజాలం, వ్యాకరణాంశాలు)

అర్థాలు: 1) స్మితకాంతి 2) దీధితి 3) రజనీకరబింబం 4) కరవటంబు 5) షండం
నానార్థాలు: 1) వెల్లి  2) కుండలి  3) నిట్టవొడుచు
పర్యాయపదాలు: 1) చాడ్పు  2) కైరవం  3) కౌముది  4) రాత్రి
ప్రకృతి - వికృతులు: 1) సంధ్య  2) ధర్మము  3) గరువము  4) రాత్రి  5) దిశ
సంధిని విడదీసి, సూత్రాలు రాసే పదాలు: 1) అత్యంత  2) వంటాముదం  3) అవ్విధంబున
విగ్రహ వాక్యాలు రాసి, సమాసం గుర్తించడం: 1) నిండువెన్నెల  2) వెన్నెలవెల్లి   3) నలుదెసలు    4) సూర్యచంద్రులు
ఛందస్సు: ఆటవెలది

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌