• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెన్నెల

కవి పరిచయం: 'వెన్నెల' పాఠ్యభాగ కవి ఎఱ్ఱన (ఎఱ్ఱాప్రెగడ)
* ఎఱ్ఱన 14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించాడు.
* కవిత్రయంలో మూడోవాడు.
* ఎఱ్ఱన తల్లి పోతమాంబిక, తండ్రి సూరనార్యుడు, గురువు శంకరస్వామి.
* ఎఱ్ఱన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
* ఎఱ్ఱన ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని పూర్తిచేసి, రాజరాజనరేంద్రుడికి అంకితం ఇచ్చాడు. హరివంశం, రామాయణం గ్రంథాలను ప్రోలయ వేమారెడ్డికి, 'నృసింహ పురాణం' ను అహోబిల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఎఱ్ఱన రాసిన 'రామాయణం' అలభ్యం.
* ఎఱ్ఱన రచనల్లో వర్ణనలు అధికంగా ఉంటాయి. తర్వాత కాలంలో వచ్చిన కవులకు ఇవి ప్రేరణగా నిలిచాయి. నృసింహ పురాణంలో ప్రబంధ లక్షణమైన 'అష్టాదశ' వర్ణనలు కనిపిస్తాయి. అందువల్ల ఎఱ్ఱనను 'ప్రబంధ పరమేశ్వరుడు' అని అంటారు.
* ఎఱ్ఱన శివభక్తి పారమ్యాన్ని అనుసరించి 'శంభుదాసుడు'గా పేరుగాంచారు.
* పోతనపై ఎఱ్ఱన రచనా ప్రభావం ఉంది.

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం:

హిరణ్యకశిపుడు వన విహారం చేస్తాడు. ఆ సందర్భంలో వసంత రుతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి ఎఱ్ఱన వర్ణించాడు. రోజంతా ఎక్కువ ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు, ఎండ తీవ్రతను ఇంకా పెంచితే రాక్షస నాయకుడైన హిరణ్యకశిపుడు సహించడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. సూర్యుడు అస్తమించాక ప్రకృతిలో వచ్చిన మార్పులను, చంద్రుడి 'వెన్నెల'ను రమణీయంగా వర్ణించిన రీతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
 

పాఠ్యభాగ వివరాలు:
* పాఠం ప్రక్రియ - కావ్యం
* కావ్యంలో 'వర్ణన' ప్రధానంగా సాగుతుంది.
* ప్రస్తుత పాఠ్యాంశం 'వెన్నెల'ను ఎఱ్ఱన రాసిన నృసింహ పురాణం 'తృతీయాశ్వాసం' నుంచి గ్రహించారు.
ప్రవేశిక: చందమామ అందరికీ ఆత్మీయ బంధువు. చందమామ ప్రసరించే అమృతం 'వెన్నెల'. అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు 'చందమామ రావే! జాబిల్లి రావే!' అనే పాటను వినిపిస్తుంది. ఇది మనందరి అనుభవంలోని విషయం.
ముఖ్యంగా చిన్న పిల్లలకు 'వెన్నెల' అంటే ఎంతో ఇష్టం. శ్రీరాముడు బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడు. చందమామ అంత ఆకర్షణీయం మరి!
చందమామ వెలుగు అయిన వెన్నెలను మన కవులు కావ్యాల్లో అద్భుతంగా వర్ణించారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. 'నృసింహ పురాణం'లో ఎఱ్ఱన 'వెన్నెల'ను వర్ణించాడు.

పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు:

* పద్యం:
            చ. ఇను నసమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
                 జన దొరు నల్పతేజు నను చాడ్పునఁ జంచలభృంగతారకా
                 ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁ బ
                 ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుఱి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం:

అసమానతేజు = ఎదురు లేని కాంతిగల
దివసేంద్రున్ (దివస + ఇంద్రున్) = పగటికి రాజైన
ఇనున్ = సూర్యుడి
కనుంగొనుమాడ్కి = చూసినట్లుగా
అల్పతేజు = తక్కువ కాంతిగల
ఒరున్ = ఇతరులను
చూడగాజనడు = చూడలేడు
అను = అనే
చాడ్పున = విధంగా
పద్మిని = తామరపువ్వు
పతిభక్తి = భర్తపై భక్తి యొక్క
సత్త్వమున = బలమునందు
మేలిమికి = గొప్పదనానికి
గుఱి = నిదర్శనంగా
తానపొమ్మనన్ = తానే అయ్యే విధంగా
చంచల = కదులుతున్న
భృంగ = తుమ్మెద అనే
తారక = నక్షత్రం
ఘన = విశాలమైన
వనజాతలోచనము = తామర లాంటి కన్నులను
గ్రక్కున = ఆలస్యం చేయకుండా
మీలనము = కళ్లు మూయడం
ఒందజేసె = చేసింది.

                                     
తాత్పర్యం: ఎదురులేని కాంతి ఉన్న, పగటికి రాజైన సూర్యుడిని చూసినట్లు తక్కువ కాంతితో ప్రకాశించే ఇతరులను చూడలేను అనే విధంగా తామరపువ్వు పతిభక్తికి నిదర్శనంగా, కదులుతున్న తుమ్మెద కనుగుడ్డుగా ఆలస్యం చేయకుండా కళ్లు మూసుకుంది. (తామరపువ్వు సూర్యాస్తమయం కాగానే ముడుచుకుంది)
* పై పద్యంలో తామరపువ్వులకు, సూర్యుడికి మధ్య ఉండే సంబంధాన్ని భార్యాభర్తల అనుబంధంగా ఎఱ్ఱన వర్ణించాడు.

* పద్యం (కంఠస్థం చేయాల్సింది)
              చ. సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
                   న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
                   సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
                   దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం:

సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (తో)
శోభి = అలంకరించిన
నభోంగణభూమిన్ (నభ + అంగణభూమిన్) = ఆకాశమనే రంగస్థలంపై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్న పూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా
నటింపఁగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికి = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమదిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని
సాంధ్య = సంధ్యకు సంబంధించిన
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది.

                                                             
తాత్పర్యం: చాలా అందమైన చుక్కల పూలతో అలంకరించిన ఆకాశమనే రంగస్థలంపై కాలం అనే గొప్ప సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల ముందు నాట్యం చేయడానికి రాత్రి అనే స్త్రీ సిద్ధపడింది. ఆ సమయంలో పడమటి తీరంలోని కొత్త వెలుగు ఆమెకు అడ్డంగా ఎర్రటి పెద్ద తెరలా ప్రకాశించింది.

* పద్యం:
               తే. పొదలి యొండొండ దివియును భువియు దిశలుఁ
                   బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన
                   మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
                   కరవటంబన జగదండఖండ మమరె.
ప్రతిపదార్థం:

చీఁకటిప్రోవు వలన = ఎక్కువ చీకటి వల్ల
దివియును = ఆకాశం
భువియు = భూమి
దిశలు = దిక్కులు
ఒండొండ = ఒకదానితో మరొకటి
పొదలి = చీకటితో పెరిగి
పొదివికొనియుండు = వ్యాపించాయి
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుక = కాటుక
క్రుక్కినట్టి = పెట్టినటువంటి
కరవటంబన్ = బరిణెలా
జగదండ = విశ్వమంతా
ఖండము = భాగంగా
అమరె = అమరింది (అలుముకుంది)

                                                  
తాత్పర్యం: ఎక్కువ చీకటి వల్ల ఆకాశం, భూమి, దిక్కులు అన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి బాగా కాటుక పెట్టిన 'బరిణె'లా విశ్వమంతా చీకటి అలుముకుంది.

* పద్యం: (కంఠస్థం చేయాల్సింది)
         చ. దెసలను కొమ్మ లొయ్య నతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
              బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
              కస మను పేరి భూరుహము కాంతనిరంతర తారకా లస
              త్కుసుమ చయంబు గోయుటకొకో యనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్థం:
 

దెసలను = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = నెమ్మదిగా
అతి దీర్ఘములైన = ఎక్కువ పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణాలతో)
ప్రియంబు + ఎసగగన్ = ప్రేమ పెరగ్గా
నూది = ప్రయత్నించి
నిక్కి = పైకి లేచి
రజనీశ్వరుడు (రజని + ఈశ్వరుడు) = చంద్రుడు
ఉన్నతలీలన్ = ఉన్నతంతో
పేర్చు = పేర్చునట్లుగా
ఆకసమను = ఆకాశమనే
పేరి = పేరు గల
భూరుహము = చెట్టుపై
కాంత = చక్కనైన కాంతి
నిరంతరం = ఎల్లప్పుడూ
తారకా = నక్షత్రాలతో
లసత్ = ప్రకాశించే
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకొకో + అన = కోసేందుకేనా అన్నట్లు
సముత్సుకత = మిక్కిలి ఉత్సాహంతో కూడిన
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = వ్యాపించాడు.

                                     
తాత్పర్యం: దిక్కులు అనే కొమ్మలు, నక్షత్రాలు అనే పువ్వులతో ఆకాశం పెద్ద చెట్టులా ఉంది. తన పొడవైన చేతులతో పుష్ప సముహాన్ని కోయడం కోసమా అన్నట్లు చంద్రుడు ఉత్సాహంతో కూడిన ఆకృతితో వ్యాపించాడు.

* పద్యం:
            ఉ. వెన్నెలవెల్లి పాల్కడలి వ్రేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
                మిన్నును ముంప నందు రజనీకరబింబము కుండలీ భవ
                త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చెఁ దదంతరంబునన్
                వెన్నునిభంగిఁ జూడ్కులకు వేడ్కయొనర్చెఁ గలంక మత్తఱిన్.
ప్రతిపదార్థం:

వెన్నెలవెల్లి = వెన్నెల ప్రవాహం
పాల్కడలి = పాల సముద్రం నుంచి
వ్రేకదనంబునన్ = అతిశయమైన ఉప్పెనలా
పేర్చి = పెరిగి
దిక్కులున్ = దిక్కులను
మిన్నును = ఆకాశాన్ని
ముంపన్ = నింపివేయగా
అందు = ఆ పాల సముద్రంలో
రజనీకరబింబము = చంద్ర బింబం
కుండలీ = గుండ్రంగా
భవత్ = గొప్పదైన
పన్నగతల్ప = ఆదిశేషువు శయ్యలా
కల్పనము భంగిన్ = తయారుచేసిన విధంగా
తనర్చెన్ = కనిపించింది
తదంతరంబునన్ = శయ్య లోపల ఉండే
కలంకము = మచ్చ
అత్తఱిన్ = ఆ సమయంలో
వెన్నునిభంగిఁ = మహావిష్ణువులా
చూడ్కులకు = కళ్ల చూపునకు (చూసే కళ్లకు/చూసే వారికి)
వేడ్కన్ = పండగను
ఒనర్చె = తీసుకొచ్చింది.

                                                       
తాత్పర్యం: వెన్నెల ప్రవాహం పాల సముద్రం నుంచి పుట్టి, ఉప్పెనలా విజృంభించి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషువు పాన్పులా కనిపించింది. అందులోని మచ్చ కళ్లకు మహావిష్ణువులా కనిపిస్తూ అలరిస్తోంది. (కవి భావనా విస్తృతి ఎంత గొప్పదో ఈ పద్యం తెలియజేస్తుంది)
 

* పద్యం (కంఠస్థం చేయాల్సింది)
                చ. వడిగొని ఱేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్బఁ బు
                     ప్పొడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జెలంగి పైఁ
                     బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు
                     గ్గడువుగ నుల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం:

ఘనకైరవషండము = కీర్తించదగ్గ కలువల సముదాయం
నిండు వెన్నెలన్ = నిండు వెన్నెలతో
వడిగొని = వేగంగా
ఱేకులు = పూల రెక్కలు
ఉప్పతిల = విచ్చుకోగా
వాలిన = వాడిపోయిన
కేసరముల్ = పూవులోని పుప్పొడి ఉండే భాగాలు
దలిర్పఁ = చిగురించగా
పుప్పొడి = పుప్పొడి
తలమెక్కి = పైభాగంలో
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = అలలుగా
చెలంగి = చెలరేగి
పైబడు = తమ పైకి వచ్చే
ఎలదేటి = తుమ్మెదల
దాటులకున్ = సమూహానికి
పండువులై = పండగ చేస్తూ
నవసౌరభంబులు = కొత్త సువాసనలు
ఉగ్గడువుగా = ఎక్కువగా
ఉల్లసిల్లె = వెల్లివిరిశాయి.

                                         
తాత్పర్యం: నిండు వెన్నెలతో ఆ కలువ పూల సమూహం యొక్క రేకులు వేగంగా విచ్చుకున్నాయి. వాడిపోయిన పుప్పొడి భాగాలు చిగురించాయి. పుప్పొడిపై మకరందాలు పొంగి తరంగాల్లా విజృంభించి, తమపైకి వస్తున్న తుమ్మెదల బృందానికి పండగ చేశాయి. కలువలు కొత్త పరిమళాలతో పరిసరాలను సంతోషభరితం చేశాయి.
 

* పద్యం:
                సీ. కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
                     తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
                     జటుల చకోరసంచయముల యెఱకల
                     గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
                     విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
                     దీవ్రంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
                     గామినీజనముల కమనీయవిభ్రమ
                     స్మితకాంతిలహరుల మెండుకొనుచుఁ
           ఆ.వె. బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
                     మించి మించి దిశలు ముంచిముంచి
                     యభినుతేందు చంద్రికాంబోధి యఖిలంబు
                     నీట నిట్టలముగ నిట్టవొడిచె.
ప్రతిపదార్థం:

కరఁగెడు = కరిగిపోయే
నవ = మెత్తని
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంత శిలల యొక్క
తఱచు = ఎక్కువైన
సోనలన్ = వెన్నెల వర్షంతో
కడు = మిక్కిలి
తలముకొనుచు = అధికమవుతూ
చటుల = విహరిస్తున్న
చకోర సంచయముల = చకోర పక్షుల సముహం
ఎఱకల = రెక్కల యొక్క
గర్వంపు దాటులన్ = గర్వం లేని విధంగా
కడలు కొనుచు = స్పృశిస్తూ (తాకుతూ)
విరియు = విచ్చుకుంటున్న
కైరముల = కలువ పూల
విపుల = విస్తారమైన
రంధ్రములపై = రంధ్రాల యందు
తీవ్రముగా = ఎక్కువగా
క్రమ్మి = నిండి
త్రిప్పుకొనుచున్ = తమవైపు తిప్పుకుంటూ
కామినీజనముల = ఆడవారి
కమనీయ విభ్రమ = సొగసైన
స్మిత కాంతిలహరుల = చిరునవ్వులు అనే కాంతి ప్రవాహాలను
మెండుకొనుచు = దాటుతూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
పొంగారి పొంగారి = పొంగి పొంగి
మించి మించి = ఎక్కువై, ఎక్కువై
దిశలు = దిక్కులను
ముంచి ముంచి = ముంచెత్తి, ముంచెత్తి
అభినుత = కీర్తించదగ్గ
ఇందు = చంద్రుడి
చంద్రికాంబోధి = వెన్నెల అనే సముద్రం
నీటన్ = నీటితో
నిట్టలముగా = నిండుగా నింపుతూ
నిట్టవొడిచె = పుట్టాడు.

                          
తాత్పర్యం: ప్రశంస సమానుడైన చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగిస్తూ; విహరిస్తున్న చకోర పక్షుల రెక్కలను స్పృశిస్తూ; విచ్చుకుంటున్న కలువ పూల రంధ్రాలను నింపి, తన వైపు తిప్పుకుంటూ; అందమైన స్త్రీల అద్భుతమైన చిరునవ్వుల తెల్లని కాంతి తరంగాలను పెంచుతూ; అంతకంతకూ అధికమవుతూ, పొంగి పొంగి, దిశలన్నీ ముంచెత్తుతూ, సమస్తాన్నీ ఆ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతూ నిండుగా ఆవిర్భవించాడు.
 

* పద్యం:
వ. ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకరకాంతిపూరంబు రాత్రి యను తలంపు దోఁపనీక తమంబను నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక లోచనంబులకు నమృతసేచనంబును, శరీరంబునకుఁ జందనా సారంబును, నంతరంగంబునకు నానందతరంగబును నగుచువిజృంభించిన సమయంబున.
ప్రతిపదార్థం:

ఇట్లు = ఈ తీరుగా
అతి = ఎక్కువ
మనోహర = అందంగా
గంభీర = గంభీరంగా
ధీరంబైన = నిండుగా
సుధాకర = చంద్రుడు
కాంతిపూరంబు = వెన్నెల సముదాయంతో
రాత్రి + అను = రాత్రి అనే
తలంపు = ఆలోచన
తోపనీక = రానీయకుండా
తమంబు = చీకటి
అనునామంబును = అనే పేరును
విననీక = వినబడకుండా
అవ్యక్తయను = స్పష్టంగా లేనిది అనే
శంక = అనుమానాన్ని
అంకురింపనీయక = కలగనివ్వకుండా
లోచనంబులకు = కళ్లకు
అమృత సేచనంబును = అమృత జల్లును
శరీరంబునకున్ = శరీరానికి
జందనా = మంచి గంధం
ఆసారంబును = జడివానను
అంతరంగంబునకు = మనసుకు
ఆనంద తరంగంబును = సంతోష కెరటంగా
అగుచు = అవుతూ
విజృంభించిన = దట్టంగా పెరిగిన
సమయమున = సమయంలో.

తాత్పర్యం: ఈ విధంగా ఎక్కువ అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుడి వెన్నెల విస్తరించింది . అది రాత్రి అనే ఆలోచన రానీయకుండా, చీకటి అనే పేరు వినిపించకుండా అవ్యక్తం అనే అనుమానాన్ని తలెత్తనీయకుండా, కళ్లకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధం జడివానలా, మనసుకు ఆనంద తరంగంలా విజృంభించింది.


(రచయిత: జి. అంజాగౌడ్)

Posted Date : 19-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌