• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధన్యుడు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు


I) అవగాహన - ప్రతిస్పందన
1.
చూడాకర్ణుడి మాటలను బట్టి మీకర్థమైన విషయాలేమిటి? దానిపై మీ అభిప్రాయమేమిటో చెప్పండి.
జ: చూడాకర్ణుడి మాటను బట్టి అర్థమైన విషయాలు
* ధనవంతుడే బలవంతుడు, పండితుడు.
* ధనం లేని కారణంగా దుఖం, దుఖం వల్ల బుద్దిహీనత, బుద్దిహీనత వల్ల ఏ పనులూ జరగవు.
* దారిద్య్రం బతికి ఉన్నంత కాలం ఎక్కువ వేదనను ఇస్తుంది.
* ధనం పోయిన తర్వాత పూర్వపు ఉత్సాహాం, గౌరవం ఉండవు.
 ధనంపై నా అభిప్రాయం: జీవించడానికి ధనం కావాలి. ఆ ధనాన్ని న్యాయంగా, కష్టపడి సంపాదించాలి. అక్రమంగా సంపాదించరాదు. ఉన్నదాంతో తృప్తి పడాలి. ఉన్నధనాన్ని పరిమితంగా ఖర్చుచేస్తూ లేనివారిని ఆదుకోవాలి.

2. 'ఆహా! ధనలోభం సర్వయాపదలకు మూలం కదా!' ఈ విషయాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి.
జ: 'డబ్బుపై అత్యాశ అనేక ఆపదలకు మూలం'
సమర్థిస్తూ
* డబ్బుపై అత్యాశ ఉంటే అవినీతి మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆపదలు వస్తాయి.
* కనీసం తినకుండా దాస్తే అనారోగ్యం పాలవుతాం.
* దొంగలు దోచుకునే అవకాశం ఉంటుంది.
* అందరూ దూరమై, ఏకాకిగా మిగులుతారు.
* కష్టకాలంలో మిత్రుల సహకారం ఉండదు.
* మానసిక ప్రశాంతత కరవవుతుంది.
వ్యతిరేకిస్తూ
       * డబ్బు ఉంటే కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.
       * ధనంపై అత్యాశతో కష్టపడి సన్మార్గంలో సంపాదిస్తే అందరూ గౌరవిస్తారు.
       * ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది.
       * ఈ కాలంలో అత్యాశ ఉండాలి కానీ అది అన్యాయంగా ఉండరాదు.
       * ధనలోభం ఉన్న వ్యక్తి మారే అవకాశం ఉండొచ్చు. ఇతరులను ఆపదల్లో ఆదుకోవచ్చు.

3. ఈ పాఠానికి పెట్టిన శీర్షికను విశ్లేషిస్తూ చెప్పండి.
జ: ఈ పాఠానికి పెట్టిన శీర్షిక - 'ధన్యుడు'. ధన లోభానికి లోనుకాకుండా సక్రమమైన మార్గంలో సంపాదించి తాను సుఖపడి, ఇతరులకు పంచాలి. సజ్జనులతో సాంగత్యం మనిషిని మంచి వైపు పయనింపజేస్తుంది. హిరణ్యకుడు తనలోని లోపాలను తెలుసుకుని కృతార్థుడైనాడు. (ధన్యుడయ్యాడు) అందువల్ల మంచి సందేశం ఉన్న ఈ పాఠానికి 'ధన్యుడు' శీర్షిక తగిన విధంగా ఉంది.

 

4. కింది వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో గుర్తించి రాయండి.
అ) అనృత మాడుట కంటే మౌనము మేలు
జ: చూడాకర్ణుడి మాటలు విని, హిరణ్యకుడు (ఎలుక) తనలో తాను ఈ మాటలు అనుకున్నాడు.
పై వాక్యానికి అర్థం:  అబద్ధం చెప్పడం కంటే మౌనంగా ఉండటం మంచిది.

 

ఆ) దీని కేమైనను నిమిత్తము లేక మానదు
జ: పై వాక్యాన్ని వీణాకర్ణుడు చూడాకర్ణుడితో అన్నాడు
పై వాక్యానికి అర్థం: ఎలుక ఎత్తయిన చిలుక కొయ్య మీదికి ఎగరడానికి దీనికి ఏమైనా కారణం లేకపోలేదు.

 

ఇ) సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు
జ: పై వాక్యం హిరణ్యకుడు (ఎలుక) మంథరుడి (తాబేలు) తో అన్నాడు.
పై వాక్యానికి అర్థం: మంచివారితో స్నేహం కంటే లోకంలో మంచిది మరొకటిలేదు.

5. కింది పద్యాన్ని చదివి భావాన్ని పూరించండి.
           ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుఁడెంతటి కార్యమైనదాఁ
           జక్కనొనర్చుఁ గౌరవుల సంఖ్యులు పట్టిన ధేనుకోటులం
           జిక్కగ నీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
           మొక్కవడంగ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!
జ: భావం: స్థిరమైన బలం ఉన్న వాడు ఎంతటి పనైనా తానొక్కడే చక్కగా చేస్తాడు. కౌరవులు చాలామంది ఆవుల మందను తీసుకుని వెళుతుండగా ఎదురించి తన బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని ఓడించింది ఒక్క అర్జునుడే కదా!

 

6. చూడాకర్ణుడికి, వీణాకర్ణుడికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జ: చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి మధ్య జరిగిన సంభాషణ:
    చూడాకర్ణుడి ఇంటికి తన స్నేహితుడైన వీణాకర్ణుడు వచ్చాడు. ఆ సమయంలో చూడాకర్ణుడు గిలుక కర్రతో నేలమీద కొడుతూ ఎలుకను భయపెడుతున్నాడు. అప్పుడు వీణాకర్ణుడు ఎందుకు పైకి చూస్తూ కొడుతున్నావన్నాడు. అందుకు చూడాకర్ణుడు 'ఒక ఎలుక ప్రతిదినం చిలుక కొయ్యమీద ఉన్న అన్నం తిని పోతోంది. దీని వల్ల ఆపద పెద్దగా ఉంది' అన్నాడు. 
     ఈ మాటలు విని వీణాకర్ణుడు 'ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? తక్కువ బలం ఉన్న జంతువు పైకి ఎగరడానికి కారణం లేకపోలేదు' అన్నాడు.  అప్పుడు చూడాకర్ణుడు 'ఆ ఎలుక ఉండే కన్నాన్ని తవ్వుతాను' అన్నాడు వీణాకర్ణుడితో.

 

II) వ్యక్తీకరణ సృజనాత్మకత
 

1. ''సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృతతుల్యములు". పాఠాన్ని ఆధారంగా చేసుకుని దీని గురించి వివరించండి.
జ: సంసారం ఒక విష వృక్షం. ఆ విష వృక్షానికి రెండు ఫలాలు అమృతంతో కూడినవి ఉన్నాయి. సంసారమనే విష వృక్షానికి ఉన్న రెండు ఫలాలు మనం తింటే జీవనం సుఖసంతోషాలతో, బాధలకు దూరంగా బతకవచ్చు. సంసారంలో సుఖాల కంటే కష్టాలే అధికంగా వస్తాయి. ఆ సందర్భాల్లో రెండు ఫలాలను స్వీకరించాలి. వాటిలో మొదటిది కావ్యామృతరసపానము. అంటే కావ్యాల్లోని అమృతం లాంటి రసాన్ని తాగడం (అంటే వాటిని చదవడం, వినడం). రెండోది సజ్జన సాంగత్యం అంటే మంచివారితో కలసి ఉండటం. ఈ రెండింటి వల్ల సంసారంలోని బాధలు పోయి సుఖాలు వస్తాయి.
    హిరణ్యకుడు ధనాన్ని బాగా కూడబెట్టి అత్యాశకు గురై ఆ ధనాన్ని పొగొట్టుకోవాల్సి వచ్చింది. హిరణ్యకుడు కావ్యామృతాన్ని సేవించడంవల్ల, సజ్జనులతో స్నేహం చేయడం వల్ల నానా ధర్మాలు, తెలుసుకుని, మంచి గుణాలు అలవరుచుకుని మిక్కిలి సంతోషాన్ని పొందాడు

 

2. అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచన, పరాభవం - ఈ పదాల గురించి మీరు ఏరకంగా అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
జ: అర్థనాశం: సంపద తొలగిపోవడమే 'అర్థనాశం'. ఇది జరిగితే మనిషికి సమాజంలో విలువ తగ్గుతుంది. అన్ని పనులకు ఆధారం సంపద. చాలా మంది ధనాన్ని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టి నష్టాల బారినపడి సంపద కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఉదాహరణకు చాలామంది రైతులు పంట పండించేందుకు 'బోర్లు' వేయించి నీళ్లు పడకపోయేసరికి ఉన్నదంతా కోల్పోయి పొలంలో చల్లే పురుగుల మందు తాగి చనిపోతున్నారు.

 

మనస్తాపం: మనస్తాపం అంటే మనోవేదనకు గురికావడం. ఇతరులు చేసిన అవమానాలు, కుటుంబంలోని వారు పెట్టే తీవ్ర ఇబ్బందులతో మనసు దుఖంతో నిండిపోయి ఉంటుంది. మనం ఎవ్వరినీ (మన కుటుంబీకులనైనా, ఇతరులనైనా) మనస్తాపానికి గురి చేయకూడదు. జరిగిన కొన్ని సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. (మన దుఖాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మనసుకు కొంత ఊరట లభిస్తుంది. )
 

ఉదా: 1) వ్యాపారంలో నష్టపోయి మనస్తాపానికి గురైన వ్యాపారి.
     2) పరీక్షలో ఫెయిలై మనస్తాపానికి గురైన విద్యార్ధి .

 

గృహంలో దుశ్చరితం: గృహంలో దుశ్చరితం అంటే ఇంట్లో ఎవరైనా చెడ్డ ఆలోచనతో పనిచేయడం. ఇది కుటుంబం మొత్తానికి నష్టం కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు తగిన విధంగా అలాంటి వారికి మార్గదర్శనం చేస్తుండాలి. కుటుంబ గౌరవానికి సమాజంలో ఉన్న ప్రాధాన్యాన్ని అందరూ తెలుసుకోవాలి.
ఉదా: ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛినం చేయడానికి చెడు తలంపుతో ప్రయత్నం చేయడం.

 

వంచన: వంచన అంటే మోసగించడం. మోసపోయిన వారు తీవ్రమైన బాధలకు గురవుతారు. మోసం చేయడం చాలా తప్పు. ఎవరిని మోసం చేయకూడదు అలా చేస్తే దానికి పదింతల వంచనకు మనం గురవుతాం.
ఉదా: నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి మోసం చేసే మోసగాళ్లు చివరకు తాము అతి ఘోరంగా మోసపోతారు.

పరాభవం: పరాభవం అంటే అవమానం. దీంతో బాధ ఎక్కువ అవుతుంది. జరిగిన పరాభవం మనిషిలో లేని ప్రతీకారాన్ని పెంచుతుంది. సున్నిత మనస్కులు పరాభావానికి గురైతే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. అవమానం జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుండాలి.
ఉదా: కొంతమంది ఎన్నికల్లో ఓడిపోవడం పరాభవంగా భావిస్తారు.
     అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచన, పరాభవం.. వీటి వల్ల మనిషి తీవ్రమనోవేదనకు గురై సమతౌల్య స్థితిని కోల్పోతాడు. ఎవరూ వీటి బారిన పడకూడదు. వీటిని ఇతరులకు కలిగించకూడదు. ఇవి జరిగినప్పటికీ ఇతరులకు చెప్పకూడదు. వీటిని మనసులోకి రానివ్వకూడదు. ఇవి జరిగేలా వ్యతిరేక పనులు చేయకూడదు.

 

3. ''వివేక హీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమం" దీని ఔచిత్యాన్ని గురించి చర్చించండి.
జ: తెలివి తక్కువ, మంచి చెడులను గ్రహించని రాజు దగ్గర ఉండి సేవలు చేస్తూ ఇబ్బందులు పడటం కంటే అడవిలోకి వెళ్లడం మంచిది.
   ప్రభువు ఆస్థానంలో ఉండటం గౌరవాన్ని ఇస్తుంది. తెలివైన రాజు దగ్గర పనిచేస్తే మన పనితనం అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ వివేకంలేని ప్రభువు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తాడు. ఆయన రాజ్యంలో అన్ని కలహాలే కలగుతాయి.
   వివేకహీనుడైన ప్రభువు తన తెలియనితనం వల్ల రాజ్యసంపదను కోల్పోవాల్సి వస్తుంది. చివరకు అమాయకపు ప్రజలకు న్యాయం చేయలేడు. రాజ్యం ఇతరులు ఆధీనంలోకి వెళుతుంది. అలాంటి రాజు దగ్గర ఉండటం కంటే అడవిలోకి వెళ్లి బతకడం మంచిది అనే అర్థాన్ని తెలియజేస్తుంది పైవాక్యం.

వివేకం అనే దీపం విజ్ఞానం అనే కాంతిరేఖలను వెదజల్లుతుంది. విధి వచించినప్పటికీ వివేకం మేలుకోల్పుతుంది.
 

4. 'ధన్యుడు' పాఠంలోని కథన విధానాన్ని రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జ: 'ధన్యుడు' పాఠంలో కథన విధానం: రచయిత కథను తక్కువ పాత్రల ద్వారా అర్థమయ్యేలా వివరించారు. హిరణ్యకుడి పాత్ర ద్వారా జీవిత సత్యాలను తెలుసుకోవడం బావుంది. నీతి వాక్యాల ప్రయోగం వల్ల కథ బాగా రక్తి కట్టింది. మాటల వల్ల మనిషిలో మార్పు వస్తుంది. మాటల ప్రవాహం వల్ల 'ధన్యుడు'గా మారి ధర్మాన్ని ఆచరించేలా కథను నడపడం కొత్తగా ఉంది. 'ధనము లేనివాని జీవనమేల'? అనే వాక్యం చూడాకర్ణుడితో చెప్పించడం, ఖేదం వల్ల బుద్ధిహీనత, బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు ఎండాకాలం నదీ ప్రవాహంలా ఎండిపోతాయి అని చెప్పడం వల్ల 'దుఖం' మనిషిని నశింపజేస్తుంది అని తెలుస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు మధురమైన, సజ్జనుల సాంగత్యలో ఉన్నట్లు ఉంటుంది. కథనంలో మంథరుడి మాటలు సర్వదా ఆచరనీయం అని అనిపిస్తుంది. ఉదాహరణకు "అర్థములు నిత్యములుగావు. యౌవనము ఝరీవేగతుల్యము. జీవనము బుద్బుదప్రాయము. కాబట్టి బుద్దిమంతుడు సత్వరంగా ధర్మాలను ఆచరించాలి".
కథనంలో నీతులు చెప్పడం బాగుంది. ఉదాహరణకు
       1) దారిద్య్రము యావజ్జీవన తీవ్ర వేదనాకరము
       2) పరధనాపహరణము కంటె దిరియుట మంచిది
       3) అనృతమాడుట కంటె మౌనము మేలు
       4) ఉదరముకయి పరులగోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.

 

రచయిత రచనా విధానం: ధన్యుడు పాఠ్యాంశ రచయిత పరవస్తు చిన్నయసూరి. హితోపదేశం ఆధారంగా నీతి చంద్రికను తెలుగులో రచించారు. ఇది గ్రాథిక వచనంలో సాగుతుంది. నీతిచంద్రిక 'మిత్రలాభం' నుంచి దీన్ని గ్రహించడమైంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా చేసి లోకరీతిని, నీతిని ప్రభోదించడం సూరి ప్రత్యేకత. ఈయన రచనాశైలి పాఠకుడిని ఆకట్టుకునేలా ప్రాచీన కావ్యభాషలో ఉంటుంది. నీతిచంద్రిక - బాలవ్యాకరణం ఈయన కలం నుంచి జాలు వారినవే. అవి లక్ష్య - లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి.
      కథను కమనీయంగా నడపడం, పద ప్రయోగం, వాక్య నిర్మాణం, సంభాషణలను రక్తి కట్టించడం... ఇవన్నీ ఆయన రచనలోని విశిష్టతలు. ఒక్కో పాత్ర ద్వారా ఒక్కో నీతిని పలికింపజేస్తాడు. కథా రచనలో వివిధ రసాలను పరికించి కథను పక్వానికి తేవడంలో దిట్ట. సమాజంలోని పరిస్థితులను ప్రబోధాత్మకంగా రాస్తాడు. ప్రస్తుత పాఠ్యాంశాన్ని చదివితే 'ధనలోభం' గురించి తెలియపరుస్తూ కావ్యామృతరసపానము, సజ్జన సంగతి మరచిపోని మణిదీపాలుగా గోచరిస్తాయి.
      చిన్నచిన్న వాక్యాలతో నాటకీయతను పండించాడు. ఇతడి రచనలు యావత్ జాతికి ప్రయోజనాన్ని సమకూర్చుతాయి. అపార పాండిత్యం ఉన్న చిన్నయసూరి రచనా విధానం భావి రచయితలకు బాటగా మరింది.

 

5. 'ధన్యుడు' కథను ఓ చిన్న నాటికగా మలచండి.
జ: 'ధన్యుడు' అనే కథను నాటికగా మలిస్తే ఇలా ఉంటుంది.
నాటికలోని పాత్రలు:
          1) హిరణ్యకుడు (ఎలుక)
          2) చూడాకర్ణుడు (సన్యాసి)
          3) వీణాకర్ణుడు (సన్యాసి)
          4) మంథరుడు (తాబేలు)

 

మొదటి రంగం

మంథరుడు: హిరణ్యకా! నువ్వు అడవిలో ఉండటానికి కారణమేంటి? చెప్పు.
హిరణ్యకుడు: చంపకవతి అనే నగరంలో సన్యాసులు ఉండేవారు. వారిలో చూడకర్ణుడు అనే సన్యాసి ఒకడు. అతడు తాను తినగా మిగిలిన అన్నాన్ని పాత్రలో పెట్టి చిలుక కొయ్యకు తగిలించే వాడు.
మంథరుడు: పాత్రలో పెట్టి చిలుక కొయ్యకు తగిలిస్తే దానికి నీకేం సంబంధం.
హిరణ్యకుడు: నేనా! దానిపై ఎక్కి అన్నాన్ని తినేసేదాన్ని.
మంథరుడు: ఓహో! అలాగా! ఏమైంది మరి.
హిరణ్యకుడు: అతడు ఒక కర్రతో నేల మీదకొట్టి నన్ను భయపెట్టేవాడు. ఇలా కొన్నిరోజులు జరిగింది.
మంథరుడు: తర్వాత.
హిరణ్యకుడు: ఒకరోజు అతడి మిత్రుడు వీణాకర్ణుడు వచ్చి 'పైకి చూస్తూ కర్రను నేలమీద ఎందుకు కొడుతున్నావు' అని అడిగాడు.

 

రెండో రంగం

చూడాకర్ణుడు: మిత్రమా! ప్రతిరోజూ నేను తినగా మిగిలిన అన్నాన్ని చిలుక కొయ్య మీద పెడతాను. దాన్ని ఎలుక తింటుంది. అందుకే కర్రతో నేలను కొడుతున్నాను.
వీణాకర్ణుడు: ఎలుక చిలుక కొయ్య మీదికి ఎగరడానికి కారణం ఉంటుంది. అంత ఎత్తుకు ఎలా ఎగిరింది ఆలోచించు.
చూడాకర్ణుడు: ఎలుక కన్నం చేసుకుని ఉన్నట్టుంది. తవ్విచూస్తా.
వీణాకర్ణుడు: సరే తవ్వు మిత్రమా!
చూడాకర్ణుడు: (తవ్వి ధనాన్ని తీసుకుని) మిత్రమా చూశావా! ధనం దొరికింది దీంతో దాని బలం అంతా అణిగిపోతుంది.

 

మూడో రంగం

చూడాకర్ణుడు: (ఎలుకను చూసి) ధనం లేని జీవితం ఎందుకు? దారిద్య్రం జీవితాంతం తీవ్ర బాధను కలిగిస్తుంది.
హిరణ్యకుడు: (తనలో తాను) యాచన చేయడం మంచిది కాదు. పౌరుషం చెడినప్పుడు వనవాసం కంటే సుఖం లేదు.
మంథరుడు: ఏమిటి మిత్రమా! నీలో నువ్వే అనుకుంటున్నావు.
హిరణ్యకుడు: ధనం లేకుండా ఎలా జీవించాలి మిత్రమా! మళ్లీ ఒకరోజు బిక్షపాత్రపైకి ఎగిరాను. అతడు కర్రను నాపై విసిరాడు.
మంథరుడు: అయ్యో! అలాగా!
హిరణ్యకుడు: అవును. తప్పించుకుని బయటపడ్డాను. ప్రాణాలు పోయేవి.
మంథరుడు: ఆ తర్వాత ఏమైంది?
హిరణ్యకుడు: అడవిదారి పట్టాను. నీ ఆశ్రయం నాకు స్వర్గంలా దొరికింది. సజ్జన సాంగత్యం కంటే లోకంలో మరేది లేదు కదా!
మంథరుడు: డబ్బు నిత్యం కాదు. యవ్వనం ప్రవాహం లాంటిది. జీవితం నీటిబుడగ లాంటిది. నీవు అతిగా కూడబెట్టావు. దానివల్లే ఇదంతా జరిగింది.
హిరణ్యకుడు: నీ మాటలు అంతులేని బాధను నివారించాయి. నేను ధన్యుడి అయ్యాను.

 

6. మంథరుడి మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జ: 'జీవితం నీటి బుడగ లాంటిది. ధనం నిత్యం కాదు. యవ్వనం నీటి ప్రవాహంతో సమానమైంది. ధర్మాన్ని ఆచరించాలి. అతిగా కూడబెట్టడం మంచిదికాదు. ఉన్నదానిలో తాను తిని, కొంత ఇతరులకు పంచాలి. కూడ బెట్టిన డబ్బు చనిపోయిన తర్వాత వెంటరాదు. దొరికినంతలో కాలం గడిపి సుఖంగా జీవిద్దాం' అని మంథరుడు పలికిన మాటలను నేను గట్టిగా సమర్థిస్తాను.
ఎందుకంటే డబ్బు శాశ్వతమైంది కాదు. సంపాదించినంత దానిలో కొంత ఇతరులకు పెడితేనే పుణ్యం వస్తుంది. ధర్మంగా బతకడం మంచిది. ధర్మం లేని జీవితంలో అనర్థాలు సంభవిస్తాయి. సంతృప్తి పడటం జీవితానికి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మంథరుడి మాటలు తప్పక పాటిస్తూ సమర్థిస్తాను.

      ఎందుకంటే డబ్బు శాశ్వతమైంది కాదు. సంపాదించినంత దానిలో కొంత ఇతరులకు పెడితేనే పుణ్యం వస్తుంది. ధర్మంగా బతకడం మంచిది. ధర్మం లేని జీవితంలో అనర్థాలు సంభవిస్తాయి. సంతృప్తి పడటం జీవితానికి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మంథరుడి మాటలు తప్పక పాటిస్తూ సమర్థిస్తాను.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌