• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధన్యుడు

 భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలకు అర్థాన్ని మీ సొంత పదాల్లో రాయండి.
 

అ) బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీ పూరములట్లు వినాశము నొందును.
జ: దుఖం వల్ల బుద్దిహీనత కలుగుతుంది. బుద్ది క్షీణించడం వల్ల అన్ని పనులు ఎండాకాలంలో నదీ ప్రవాహం నశించినట్లు అవి కూడా వినాశనాన్ని పొందుతాయి.


ఆ) ధనమును బాసిన క్షణముననే లాతివాడగును.
జ: డబ్బు ఉన్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు. మర్యాదగా ప్రవర్తిస్తారు. ఏదైనా కారణం వల్ల ధనాన్ని కోల్పోతే పరాయివాడిగా చూస్తారు.

ఇ) పరధనాపహరణము కంటే దిరియుట మంచిది.
జ: డబ్బును న్యాయమార్గంలో సంపాదించాలి. ఇతరుల డబ్బును దొంగిలించరాదు. అలా చేయడం కంటే బిచ్చమెత్తుకోవడం మంచిది.

ఈ) ఉదరమునకయి పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.
జ: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి. పొట్టకూటికి ఇతరులను అడగరాదు. స్వశక్తిని నమ్ముకోవాలి. మన కష్టానికి లభించిన దాంతోనే సంతోషపడేవాడు ఈ లోకంలో ధన్యుడు (పుణ్యవంతుడు).

 

2. కింది పదాలకు ప్రకృతి - వికృతులను పాఠం నుంచి వెతికి ఆ వాక్యాలను రాయండి.
 

అ) బోనం
జ: 'బోనం'కు ప్రకృతి పదం భోజనం
పాఠంలోని వాక్యం: అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకం బిక్షాపాత్రలో బెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును.

 

ఆ) శబ్దం
జ: 'శబ్దం' అనే పదానికి వికృతి రూపం 'సద్దు'.
పాఠంలోని వాక్యం: నేను సద్దు చేయక దాని మీదికెగిరి ప్రతిదిన మా వంటకము భక్షించి పోవుచుందును.

 

ఇ) కర్జం
జ: 'కర్జం' అనే పదానికి ప్రకృతి రూపం 'కార్యం'.
పాఠంలోని వాక్యం: బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీపూరములట్లు వినాశము నొందును.

 

ఈ) గీము
జ: 'గీము' అనే పదానికి ప్రకృతి రూపం 'గృహం'.
పాఠంలోని వాక్యం: పుత్రమిత్ర విరహితుని గృహమును, మూర్ఖుని చిత్తమును శూన్యములు.

 

ఉ) గారవం
జ: 'గారవం' అనే పదానికి ప్రకృతి రూపం 'గౌరవం'.
పాఠంలోని వాక్యం: యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము, సేవా వృత్తి మానమును వలె, యాచనవృత్తి సమస్త గౌరవమును హరించును.

 

ఊ) చట్టం
జ: చట్టం అనే పదానికి ప్రకృతి రూపం 'శాస్త్రం'.
పాఠంలోని వాక్యం: వాడే సర్వశాస్త్రములు చదివినవాడు.

 

ఋ) దమ్మము
జ: దమ్మము అనే పదానికి ప్రకృతి రూపం 'ధర్మము'.
పాఠంలోని వాక్యం: వాడే సర్వ ధర్మములాచరించినవాడు.

 

ౠ) సంతసం
జ: సంతసం అనే పదానికి ప్రకృతి రూపం 'సంతోషం'.
పాఠంలోని వాక్యం: ఉదరముకయి పరులగోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.

 

3. కింది వాక్యాలు చదవండి. వ్యుత్పత్త్యులకు తగిన పదాలు రాయండి.


                                   
వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి వాటిని విడదీయండి. అవి ఏ సంధులో సూత్రయుక్తంగా తెలపండి.
అ) అందుఁజూడాకర్ణుఁడను పరివ్రాజకుఁడు గలడు.

 

1. అందుఁజూడాకర్ణుఁడను = అందున్ + చూడాకర్ణుడను   సరళాదేశ సంధి
సూత్రం: ద్రుతం మీది పరుషాలు (క చ ట త ప) సరళాలుగా (గ జ డ ద బ) మారతాయి.

2. అందుఁజూడాకర్ణుఁడను = అందుఁజూడాకర్ణుడు + అను  ఉత్వ సంధి
సూత్రం: ఉత్తునకు (ఉత్తు అంటే 'ఉ' అని అర్థం) అచ్చు పరమైతే సంధి నిత్యం.

3. పరివ్రాజకుఁడుగలడు = పరివ్రాజకుడు + కలడు   గసడదవాదేశ సంధి
ఆ) తడవులఁబట్టి ఈ యెలుక విడువక వాసము చేయుచున్నది.

1. తడవులఁబట్టి = తడవులన్ + పట్టి    సరళాదేశ సంధి
సూత్రం: ద్రుతం మీది పరుషాలు సరళాలుగా మారతాయి.

2. ఈయెలుక = ఈ + ఎలుక   యడాగమ సంధి
సూత్రం: సంధిలేని చోట అచ్చుల మధ్య 'య్' ఆగమంగా వస్తుంది.

3. చేయుచున్నది = చేయుచు + ఉన్నది   ఉత్వ సంధి
సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.

 పాఠంలోని మరికొన్ని 'సరళాదేశ సంధి' పదాలు:
             1. వెంటరాఁబోదు
  వెంటరాన్ + పోదు
             2. చూచెదఁగాక
  చూచెదన్ + కాక
             3. పాత్రలోఁబెట్టి
  పాత్రలోన్ + పెట్టి
             4. నన్నుఁగఱ్ఱతో
  నన్నున్ + కఱ్ఱతో
             5. నిప్పులోఁబడి
  నిప్పులోన్ + పడి
             6. వసింపఁదగదు
  వసింపన్ + తగదు
             7. పరులతోఁజెప్పి
  పరులతోన్ + చెప్పి
             8. నన్నుఁగాపాడుకుండునా
  నన్నున్ + కాపాడుకుండునా
             9. దొరికినంతటితోఁగాలము
  దొరికినంతటితోన్ + కాలము
 

పాఠంలోని మరికొన్ని 'గసడదవాదేశ సంధి' పదాలు:
             1. ధనముగలవాడె
  ధనము + కలవాడె
             2. పెట్టువోతలు
  పెట్టు + పోతలు
             3. కాయగసురులు
  కాయ + కసురులు
             4. నిత్యములుగావు
  నిత్యములు + కావు
             5. నేనొకడనుగాము
  నేనొకడను + కాము
             6. ప్రాణములుగోలుపోనేల
  ప్రాణములు + కోలుపోనేల

2. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసాలు పేర్కొనండి.
 

అ) చంపకవతి పట్టణం
     చంపకవతి అనే పేరు గల పట్టణం - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ఆ) మహాభాగ్యం
     గొప్పదైన భాగ్యం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) సేవావృత్తి
     సేవ కొరకు వృత్తి - చతుర్థీ తత్పురుష సమాసం

ఈ) పదాబ్జములు
     అబ్జముల లాంటి పదాలు - ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

ఉ) కలువ కన్నులు
     కలువ లాంటి కన్నులు - ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం

ఊ) మామిడిగున్న
     గున్నయైన మామిడి - విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
ఎ) మృదుమధురము
     మృదువైనవి, మధురమైనవి - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

 

3. పుంప్వాదేశ సంధి
 కింది పదాలు విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా: అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట
         అ) నీలపు గండ్లు = నీలము + గండ్లు
         ఆ) ముత్తెపు సరులు = ముత్తెము + సరులు
         ఇ) సరసపు మాట = సరసము + మాట
  పైన పేర్కొన వాటిలో రెండు మార్పులు గమనించవచ్చు.
  అ) మొదటి పదాల చివరన 'ము వర్ణం లోపించింది. 'ము' వర్ణం స్థానంలో 'పు' వర్ణం వచ్చింది.
  ఆ) ప్రతి సంధిలోనూ మొదటి పదం గుణాలను తెలుపుతుంది. ఇవి విశేషణాలు.
 మొదటి పదం విశేషణం అయితే ఆ సమాసాలను 'విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం' అంటారు. అంటే ఈ సంధి కర్మధారయ సమాసాల్లో ఏర్పడుతుంది.
 కర్మధారయ సమాసాల్లో 'ము' వర్ణానికి బదులు పు, లు ఆదేశంగా వస్తే దానిని పుంప్వాదేశ సంధి అంటారు. ('ము' వర్ణ స్థానాన్ని 'పు, ' వర్ణం ఆక్రమిస్తుంది. దీన్నే వ్యాకరణ పరిభాషలో 'ఆదేశం' అంటారు)

 కింది పదాలను విడదీసి సంధి సూత్రాన్ని సరిచూడండి.
         అ) సింగపుకొదమ = సింగము + కొదమ
         ఆ) ముత్యపు చిప్ప = ముత్యము + చిప్ప
         ఇ) కొంచెపునరుడు = కొంచెము + నరుడు
 పై పదాల కలయికను గమనిస్తే 'ము' వర్ణస్థానంలో 'పు' వచ్చింది.

 

4. వచనంలో శైలీ భేదం
 కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.
అ) ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
ఇ) ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది.
 పైవాటిలో మొదటి వాక్యం ప్రాచీన శైలిని తెలుపుతుంది.
         రెండో వాక్యం శిష్టవ్యవహార శైలిని అనుసరించి ఉంది.
         మూడో వాక్యం మాండలిక పద్ధతికి లోబడి ఉంది.
 కాలం, ప్రాంతాలను అనుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఇది భాషలో వైవిధ్యమే తప్ప ఎక్కువ, తక్కువ అనే సంకుచిత దృష్టి ఉండకూడదు.
 

కింది వాక్యాలను ఆధునిక వ్యవహారశైలిలోకి, స్థానిక మాండలిక శైలిలోకి మార్చండి.
     (ఈ మార్పులు చేసేటప్పుడు 'ము' వర్ణాలు, బిందు పూర్వక 'బు' కారాలు (), యడాగమాలు, క్రియారూపాలు (చేయును, జరుగును, చూడుము... లాంటివి) మారడాన్ని గమనించండి.)

 

అ) వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటే వనవాసముత్తమము.
జ: ఆధునిక వ్యవహార శైలిలో: వివేకహీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.
     స్థానిక మాండలిక శైలిలో: బుద్దిలేని రాజును కొలవడం కంటే అడవిలో ఉండటం మంచిది.

 

ఆ) ఎలుక ప్రతి దినము చిలుక కొయ్య మీది కెగిరి పాత్రమునందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
జ: ఆధునిక వ్యవహార శైలిలో: ఎలుక ప్రతిదినం చిలుక్కొయ్య మీదికి ఎగిరి పాత్రలో ఉన్న అన్నం తిని వెళుతోంది.
     స్థానిక మాండలిక శైలిలో:  ఎల్క దినాము చిలుక్కొయ్య మీద దుంకి గిన్నెలున్న అన్నం తిని పోయేది.

 

ఇ) బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును.
జ: ఆధునిక వ్యవహార శైలిలో: బుద్దిహీనత వల్ల అన్ని కార్యాలు వేసవి కాలం నదీ జలప్రవాహంలా వినాశనాన్ని పొందుతాయి.
     స్థానిక మాండలిక శైలిలో:  తెలివి లేకపోవడం వల్ల అన్ని పన్లు ఎండాకాలం నదిలోని దారలెక్క ఎండుతాయి.

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.

కొంగ - ఎండ్రి

బదరికావనంలో సారోదం అనే సరస్సు ఉండేది. అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చి తపస్సు చేస్తుండేది. దాన్ని ఒక ఎండ్రి చూసి 'నువ్వు ఎందుకిలా తపస్సు చేస్తున్నావు' అని అడిగింది. దానికి కొంగ బదులిస్తూ 'నేను గంగోత్తర తీరంలో ఒక మఱ్ఱి వృక్షం మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక ముని తన శిష్యులకు అనేక రకాలుగా ఉపదేశించాడు. అది విని నేను మారాను' అని అంది.
కొంగ, ఎండ్రి మాటలను చేపలు విని మిక్కిలి బుద్ధిమంతుడు అని కొంగతో స్నేహం చేశాయి. కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చేపలతో ఇలా అంది. 'ఇప్పుడే కొంతమంది చేపలు పట్టేవారు వచ్చి కొంచెం నీరు ఇంకిన తర్వాత వస్తామని వెళ్లారు' అంది. 'నీవే మమ్మల్ని రక్షించాలి' అని చేపలు కొంగను వేడుకున్నాయి.
కొంగ తనకు తెలిసిన 'నిత్యాపంబు' అనే చెరువుకు తీసుకువెళతానంది. ప్రతిరోజు కొన్ని చేపలను తీసుకువెళ్లి తినడం మొదలు పెట్టింది. ఇలా కొంతకాలంలోనే చెరువులోని చేపలను ఖాళీ చేసింది.
ఇది గ్రహించిన ఎండ్రి ఎలాగైనా కొంగను మోసంతోనే జయించాలని అనుకుని కొంగ దగ్గరకు వెళ్లి తనను కూడా రక్షించమంది. 'నీ కంఠాన్ని పట్టుకుంటాను. నన్ను కూడా సురక్షిత ప్రాంతానికి చేర్చు' అనివేడుకుంది. సరేనంది కొంగ. ఎండ్రికాయ తన కాళ్లతో కొంగ కంఠాన్ని పట్టుకుంది. కొంగ కొండ బండ మీద కాళ్లు పెట్టె సమయంలో ఎండ్రి తన పదునైన కాళ్లతో కొంగ కంఠాన్ని కత్తిరించింది.
నీతి - వంచకులను వంచనతోనే జయించాలి.

 

చదవండి - తెలుసుకోండి
కందుకూరి వీరేశలింగం (1848 - 1919)

    భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధి పొందింది. ప్రాచీన కాలం నుంచే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథ రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు. ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రబేధం, కాకోలుకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షిత కారకం (అసంప్రేక్ష్య కారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించిన వారిలో ముఖ్యులు చిన్నయ సూరితోపాటు కందుకూరి వీరేశలింగం పంతులు. సంధి, విగ్రహం అనే భాగాలను కందుకూరి తెలుగులోకి అనువదించారు. వీటితోపాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర, అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలు, శతకాలు, నాటకాలను రాసి గద్యతిక్కనగా ప్రసిద్ధికెక్కారు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘ సంస్కర్తగా పేరు పొందారు.
సూక్తి: న్యాయంగా సంపాదించిన ధనంతోనే తనను పోషించుకోవాలి. అన్యాయంగా సంపాదించిన ధనంతో ఎవరు జీవిస్తుంటారో వారు సర్వ కర్మ బహిష్కృతులు అవుతున్నారు.              -పరాశరస్మృతి

 

(రచయిత: జి. అంజాగౌడ్)

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం