• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధన్యుడు

రచయిత పరిచయం: పరవస్తు చిన్నయసూరి (1809 - 1862)
* పరవస్తు చిన్నయసూరి తమిళనాడు రాష్ట్రం, చెంగల్‌పట్టు జిల్లా, శ్రీపెరంబుదూరులో జన్మించారు.
* పచ్చయ్యప్ప కళాశాల (మద్రాసు)లో తెలుగు పండితుడిగా పనిచేశారు.
* తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో మంచి పండితులు.
 

ఆయన రచనలు:
            1) అక్షర గుచ్ఛము
            2) ఆంధ్ర కాదంబరి
            3) పద్యాంధ్ర వ్యాకరణము
            4) సూత్రాంధ్ర వ్యాకరణము
            5) శబ్ద లక్షణ సంగ్రహము
            6) బాల వ్యాకరణము
            7) నీతి చంద్రిక
* పై రచనలను వాటి మొదటి పదాలతో కింది విధంగా రాసి గుర్తుంచుకోవచ్చు.

* చిన్నయసూరి పేరులో 'సూరి' అనేది బిరుదు (సూరి = పండితుడు).
* ఈయన రచన ప్రాచీన కావ్యభాషలో ఉండి పాఠకుడిని ఆకట్టుకుంటుంది.
* చిన్నయసూరి రచనల్లో బాల వ్యాకరణాన్ని నేటికీ ప్రామాణిక గ్రంథంగా చెప్పొచ్చు.
* నీతి చంద్రిక, బాల వ్యాకరణం లక్ష్య - లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధికెక్కాయి.

పాఠ్యాంశ ఉద్దేశం

     మన జీవితాలను మలుపు తిప్పేది మంచి మిత్రుల కలయిక. అందుకే మంచివారిని మిత్రులుగా పొందాలని మన పెద్దలు చెబుతారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
 

పాఠ్యభాగ వివరాలు
* ఈ పాఠ్యాంశం ప్రక్రియ - కథ
* విష్ణుశర్మ సంస్కృతంలో 'పంచతంత్రం' రాశారు. ఇది విశ్వవిఖ్యాతి గాంచింది.
* పంచతంత్రంను అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితులు రాసిన 'హితోపదేశం' ఒకటి.
హితోపదేశం ఆధారంగా చిన్నయసూరి 'నీతిచంద్రిక' ను తెలుగులో రాశారు. ఇది గ్రాంథిక వచనంలో సాగుతుంది.
* పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి.
* 'ధన్యుడు' అనే ఈ పాఠాన్ని నీతిచంద్రికలోని 'మిత్రలాభం' నుంచి గ్రహించారు.

ప్రవేశిక

* 'నీతి' అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. సంపాదన ఎంత ముఖ్యమో మనిషికి పరోపకారం కూడా అంతే ముఖ్యం. లోభం అనేది ఉండకూడదు. లోభత్వం వల్ల తనకు, ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. లోభిని దృష్టిలో పెట్టుకుని 'పిల్లికి బిచ్చం పెట్టనివాడు' అనే సామెత వచ్చింది. మనం లోభం లేకుండా మిత్రులకు సహాయం చేయాలి. దీనికి సంబంధించిన కథను చదువుదాం. ఈ కథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

పాఠ్యభాగ సారాంశం

పాఠ్యాంశమైన 'ధన్యుడు' కథలోని పాత్రలు:
                   1) హిరణ్యకుడు (ఎలుక)
                   2) మంథరుడు (తాబేలు)
                   3) చూడాకర్ణుడు (సన్యాసి)
                   4) వీణాకర్ణుడు (సన్యాసి)

కథ ప్రారంభానికి ముందు:

లఘుపతనకం అనే కాకి మంథరుడి (తాబేలు)తో హిరణ్యకుడిని సన్మానించమంది. 'హిరణ్యకుడి గుణాలను శేషుడు సహితం వర్ణింపలేడు' అని పలికి లఘుపతనకం హిరణ్యకుడి వృత్తాంతం చెప్పింది. అది విని మంథరుడు హిరణ్యకుడిని సన్మానించి ఇలా అంది 'హిరణ్యకా! నీవు నిర్జనవంలో నివసించడానికి కారణం ఏమిటి' అని అడిగింది. దానికి జవాబుగా హిరణ్యకుడు తన జీవితంలో జరిగిన విషయాలు చెప్పాడు.

హిరణ్యకుడి పూర్వ వృత్తాంతం (పాఠ్యాంశ కథ)

    చంపకవతి అనే పట్టణం ఉండేది. అక్కడ చాలా మంది సన్యాసులు నివసించేవారు. అందులో 'చూడాకర్ణుడు' అనే సన్యాసి ఉండేవాడు. అతడు తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని బిక్ష స్వీకరించే పాత్రలో పెట్టి చిలుక కొయ్య (చిలుక ఆకారంగా చెక్కిన కొయ్య) మీద పెట్టి నిద్రపోయేవాడు. దాన్ని హిరణ్యకుడు (ఎలుక) ప్రతిదినం తిని వెళ్లేది. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడైన వీణాకర్ణుడితో మాట్లాడుతున్నప్పుడు పైన ఉన్న ఎలుకను భయపెట్టేందుకు గిలుక కర్రతో నేలను కొట్టాడు. దాన్ని చూసిన వీణాకర్ణుడు 'ఎందుకు కొడుతున్నావు' అని అడిగాడు. అప్పుడు చూడాకర్ణుడు ఇలా అన్నాడు 'ఒక ఎలుక ప్రతిదినం చిలుక కొయ్యమీద ఉండే అన్నం తినిపోతోంది నాకు దీని వల్ల ఆపద పెద్దగా ఉంది' అని అన్నాడు. అది విన్న వీణాకర్ణుడు 'ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అంత తక్కువ బలం ఉన్న జంతువు ఇంత ఎత్తునకు ఎలా ఎగురుతుందన్న దానికి కారణం లేకపోలేదు' అన్నాడు. అది విని చూడాకర్ణుడు 'ఎలుక ఉండే కన్నాన్ని (రంధ్రాన్ని) తవ్వుతాను' అని అన్నాడు. తవ్వి ఎలుక సంపాదించిన ధనాన్ని తీసుకున్నాడు.
    ఎలుక దిగులుపడి మెల్లగా తిరగడం చూసిన చూడాకర్ణుడు ఇలా అన్నాడు 'ధనం గలవాడే బలవంతుడు, పండితుడు. ధనం లేని జీవనం ఎలా? ధనం లేనివాడికి దుఖం కలుగుతుంది. దానివల్ల బుద్దిహీనత వస్తుంది. అన్ని పనులు ఎండాకాలంలో నదీ ప్రవాహం నశించినట్లు జరగవు. దారిద్య్రం కంటే మరణమే మేలు. మరణ వేదన మరణించేటప్పుడు మాత్రమే కలిగేది. దారిద్య్రం బతికి ఉన్నంత కాలం ఎక్కువ వేదన ఇచ్చేది. ధనం పోయిన తర్వాత పురుషుడు తన పూర్వ గుణాలను కోల్పోతాడు ఇది మహా చిత్రం' అని అనగానే హిరణ్యకుడు దుఖించి ఇలా చింతించాడు.
    'ఇక్కడ నివసించడం తగదు. అర్థనాశం (ధనం పోవడం), మనస్తాపం, ఇంటిలో చెడ్డ నడవడి, మోసం, అవమానం పైకి చెప్పవద్దు. దేవుడు మనకు అనుకూలంగా లేనప్పుడు, పని చెడిపోయినప్పుడు వనవాసం కంటే సుఖం లేదు. అబద్దం ఆడటం కంటే మౌనమే మేలు. ఇతరుల ధనాన్ని అపహరించడం కంటే బిచ్చమెత్తడం మంచిది. వివేకం లేని ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం. యాచన వల్ల సమస్త గౌరవం నశిస్తుంది.' అని విచారించి అత్యాశకు పోయి ధనం సంపాదించుకోవాలని అక్కడే నిలిచి ఉంది ఎలుక.
    అది చూసి చూడాకర్ణుడు కర్రతో విసిరాడు. ధనంపై అత్యాశ సర్వ ఆపదలకు మూలం. పొందిన దాంతో సంతోషించేవాడు లోకంలో ధన్యుడు. మన కర్మానుసారంగా ప్రతీది కలుగుతుంది. ఇక్కడ ఉండటం ఎందుకు అని ఈశ్వరుడు కాపాడతాడని, ధనంలేని వాడిగా నలుగురిలో ఉండరాదని, సంసార విషవృక్షానికి రెండు ఫలాలు
అవి 1) కావ్యామృతరసపానం (చదవడం) 2) సజ్జనసంగతి (మంచివారితో జీవనం) అన్న మాటలు విన్న మంథరుడు (తాబేలు) ఇలా అన్నాడు.
    ధనం శాశ్వతమైందికాదు. వయసు సెలయేరు ప్రవాహంతో సమానం. జీవితం నీటిబుడగ లాంటిది. బుద్ధిమంతులు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించనివాడు దుఖంతో బాధపడతాడు. నువ్వు ఎక్కువ కూడబెట్టడం వల్ల దోషం కలిగింది. ఇతరులకు ఇవ్వక, తాను తినక దాచిన ధనం చనిపోయిన తర్వాత వెంటరాదు. అని చెప్పి మళ్లీ మంథరుడు (తాబేలు) ఇలా అన్నాడు.
    జీవనం కోసం ఎక్కువ శ్రమ చేయడం వ్యర్థమే. నువ్వు సకల ధర్మాలు తెలిసినదానివి, నువ్వు, నేను, లఘపతనకం (కాకి) మన ముగ్గురిని దేవుడు ఒక్కచోట చేర్చాడు. దొరికినంతలో కాలం గడిపి సుఖంగా జీవిద్దాం అనగానే హిరణ్యకుడు సంతోషించి ఇలా అన్నాడు.
మంథరా! నీ మాటలు అమృతంలా వినిపించి నాలో అంతులేని బాధను పోగొట్టాయి. నేను పుణ్యవంతుడిని అయ్యాను. 'మిత్రుడి వల్ల లాభం లాభాలను ఇచ్చేది' అనే వాక్యం నేడు లక్ష్య సమన్వితం అయ్యింది.'

(రచయిత: జి. అంజాగౌడ్)

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌