• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మా ప్రయత్నం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

'ఆలోచించండి - చెప్పండి' సమాధానాలు

1. 'కాలాన్ని పరామర్శించడం' అంటే ఏమిటి?
జ: కాలాన్ని పరామర్శించడం అంటే జరిగిపోయిన సమయంలోని విషయాలను చక్కగా విచారించుకోవడం. కాలక్రమంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అప్పటి కాలంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఆ కాలాన్ని విచారించుకోవాలి. దీనివల్ల పరిస్థితులు ఎలా ఉండేవో తెలుస్తుంది. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు అవగతం అవుతాయి.

 

2. గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు?
జ: గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దం అని చెప్పవచ్చు. ఎందుకంటే భిన్న రంగాల్లో, కీలక స్థానాల్లో, కీలక సమయాల్లో పనిచేసి వారు తమదైన ముద్ర వేసుకున్నారు. స్త్రీలు చేసిన పోరాటాలు ఉన్నాయి. వారు ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామ్యం వహించారు. రాణించిన రంగాలు ఉన్నాయి. గడిచిన శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలు ఉన్నారు. మొదటి వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన మహిళలు ఉన్నారు. ఉద్యమాల్లో చేరి జైలుకి వెళ్లేందుకు తెగించిన స్త్రీలు; నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు ఉన్నారు. స్త్రీలు మొదటి తరపు డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, కళాకారిణులుగా, విద్యాధికులుగా గడిచిన శతాబ్దంలో ఉన్నారు. గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చు.

3. చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది?
జ: సమాజంలోని సంఘటనలు, పలు రంగాల్లోని ప్రగతి, ప్రాతినిధ్యం వహించిన పనితీరు, సామూహికమైన ఉనికి, చైతన్యం, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక వికాసాలపై చరిత్ర రూపుదిద్దుకుంటుంది. చరిత్ర వర్తమానాన్ని నడిపిస్తూ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది.

 

4. 'మూల్యం చెల్లించడం' అంటే ఏమిటి?
జ: 'మూల్యం చెల్లించడం' అంటే డబ్బును చెల్లించడం అనే సాధారణ అర్థాన్ని తీసుకోవచ్చు. ఏదైనా సాధించాలంటే తీవ్రమైన పట్టుదలతో పనిచేస్తూ, అనేక అవరోధాలు ఎదుర్కొని విజయం సాధిస్తారు. కష్టనష్టాలను ఎదుర్కొని జీవితంలో చాలా కోల్పోయిన సందర్భంలో ఈ పదాలను వాడతారు. స్త్రీలు చరిత్రను నిర్మించేందుకు చెల్లించిన మూల్యం తలచుకుంటే గుండెలు బరువెక్కుతాయి.

 

5. 'సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది' అని రచయిత్రులు అనడానికి కారణాలు ఏమిటి?
జ: గడిచిన శతాబ్దాన్ని స్త్రీ శతాబ్దంగా మార్చారన్న విషయంలో స్త్రీలు ఎంత కష్టపడ్డారో గమనిస్తే .... వారు వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలను కనుక్కోడానికి ఎన్నో పరీక్షలకు గురయ్యారు. అయినా ఆనాటి శతాబ్దంలో స్త్రీలు సామాన్యులే. అలాంటి సామాన్యులు చేసిన సాహసం సామాన్యం కాదని అనిపించింది.

 

6. 'ముద్ర వేయడం' అంటే ఏమిటి?
జ: ఏదైనా అంశంపై తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురావడం. చాలామంది వివిధ రంగాల్లో కృషి చేసి ఆయా రంగానికి తమదైన ముద్ర వేశారు. ముద్రవేసిన వారు ఆ రంగాన్ని వర్తమానంలో నడిపిస్తూ భవిష్యత్‌కు బాటలు వేస్తారు. కీర్తి పొందినవారుగా మిగిలిపోతారు.

 

7. సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే ఏమిటి?
జ: సమాజంలో   పేరుకుపోయిన  మూఢాచారాలను, అపనమ్మకాలను  తుంచేందుకు   ప్రయత్నం    చేసిన సంస్కర్తలు ఎందరో ఉన్నారు. సంస్కరణ కోసం ఉద్యమించారు. దానిలో భాగంగా అవమానాలకు గురయ్యారు. ఉన్నదంతా కోల్పోయారు. ప్రాణాలు సైతం అర్పించారు. సంస్కరణోద్యమం అనేది రథం లాంటిది. ఆ రథం కింద పడి (సంస్కరణోద్యమంలో దిగడం) నలిగిపోయారు (ప్రాణాలను సైతం అర్పించడం).

 

8. ''ప్రతివాళ్లూ ప్రశ్నించారు చరిత్రను మార్చడానికి" అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకన్నారు?
జ: ''అప్పుడు మా కులం వారిని ఆడవద్దని అన్నారు. తర్వాత అన్ని కులాల వారినీ ఆడవచ్చు అన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్లు బతుకుతున్నారు" అని సరిదె మాణిక్యాంబ అన్నారు. ఇలా స్త్రీలు ఏమనుకుంటున్నారో వినకుండా, స్త్రీలేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా ఉన్నారు. అయినా కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలు ఉన్నారు. చరిత్ర సాగిన తీరును ప్రతివాళ్లు ప్రశ్నించారు. చరిత్రను మార్చడానికి ప్రతివాళ్లు ప్రయత్నించారని రచయిత్రులు అన్నారు.

 

9. కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది?
జ: స్త్రీలు అన్ని రంగాల్లో స్థానం పొందాలి. దానికోసం కష్టపడి పనిచేసి మార్పులు తీసుకురావాలి. అందరూ ఆ మార్పులను అంగీకరించేలా ఉండాలి. అప్పుడే అవి చిరస్థాయిగా నిలుస్తాయి, ఆదరణ పొందుతాయి. ఆచరణకు నోచుకుంటాయి. స్త్రీలు తమ జీవితంలో ఎలాంటి సమస్యకైనా ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడాలి. తద్వారా సామాజిక జీవనరంగంలో కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి సాధ్యమవుతుంది.
ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన

1. పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
అ. ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చా? చర్చించండి.
జ: ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీలు చరిత్ర నిర్మాతలుగా తిరుగులేని స్థానాన్ని పొందారు. సామాజిక అభివృద్ధిలో, సామాజిక మార్పుల్లో వీరు విశేషంగా కృషి చేశారు. భిన్నమైన రంగాల్లో, కీలక స్థానాల్లో కీలక సమయాల్లో పనిచేసి తమదైన ముద్ర వేశారు.
ఇరవయ్యో శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలు, మొదటిసారి వితంతు వివాహం చేసుకున్న సాహస స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమం చేసిన స్త్రీలు ఉన్నారు. మొదటిసారిగా జైలుకు వెళ్లినవారు; నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లో అడుగుపెట్టిన స్త్రీలూ ఉన్నారు. మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు ఉన్నారు. అందువల్ల ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చు.

 

ఆ. మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కిందివాటిలో ఏ అంశంపై ఏమేం మాట్లాడతారు?
1) బాలికా విద్య - ఆవశ్యకత                      2) నీకు నచ్చిన మహిళ - గుణగణాలు
3) మహిళల సాధికారత - స్వావలంబన      4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?

 

బాలికా విద్య - ఆవశ్యకత
జ:
సమాజంలో బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం. గడిచిన కాలంలో వారు చదువులేని స్థితిలో, అజ్ఞానంతో ఉండేవారు. సంఘసంస్కర్తల మూలంగా 'బాలికా విద్య' వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాలు, తల్లిదండ్రులు బాలికా విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
'బాలికా విద్య' వల్ల సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు తొలగిపోతాయి. విద్యను అభ్యసించడం వల్ల అన్ని రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. 'బాలికా విద్య' వల్ల వారికి సమాజ స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుంది. ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో అవగతం అవుతుంది. వచ్చే తరాలకు మన సంస్కృతిని వారసత్వంగా అందించినవారవుతారు. అందుకే బాలికలందరూ బడిలో ఉండేలా చూడాలి. తల్లిదండ్రులకు అవగాహన కలిగించి బాలికలు బడికి వచ్చే మార్గాలను సూచించాలి. బాలికలు విద్యనభ్యసించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలి.

 

నీకు నచ్చిన మహిళ - గుణగణాలు
జ:
నాకు వచ్చిన మహిళ - కనుపర్తి వరలక్ష్మమ్మ
కనుపర్తి వరలక్ష్మమ్మ 1896 అక్టోబరు 6న బాపట్లలో జన్మించారు. స్త్రీలు గడపదాటి వెళ్లకూడదు అనే ఆ రోజుల్లో తన అన్న నరసింహం సహాయంతో చదవడం, రాయడం నేర్చుకుంది. బాల్య, కౌమార దశల్లోనే డిగ్రీలు లేని పాండిత్యాన్ని సంపాదించింది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. భర్త అనుమతితో 1921లో గాంధీజీకి తాను వడికిన నూలును, ఒక ఉంగరాన్ని సమర్పించింది. వరలక్ష్మమ్మ గారు లక్కబరిణి, ప్రేమలత, కనకవల్లి, మృతజీవులతో సంభాషణ, సుధ, దీర్ఘసుమంగళీభవ, రెండు కోర్కెలు, నేనే అపరాధిని అనే కథలను రాసింది. ఆమె రాసిన శారదా లేఖలు చాలా ముఖ్యమైనవి.
మూఢవిశ్వాసాలను ఖండించడం, వరకట్నాలను వ్యతిరేకించడం, బాల వితంతువుల బాధలు మొదలైనవి వాటి ఇతివృత్తాలు. అనేక సభలకు అధ్యక్షురాలిగా ఉండి, విశేషమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు. 'స్త్రీ హితైషిణి మండలి' స్థాపించారు. ఇందులో స్త్రీలకు కుట్లు, అల్లికలు, గృహపరిశ్రమలు; పిల్లలకు వినోద కార్యక్రమాలు, పత్రికా పఠనం, రామాయణ కాలక్షేపాలు జరిగేవి.
స్త్రీల విద్యా విజ్ఞానాలను పెంపొందించడానికి గ్రంథాలయం అవసరమని గుర్తించారు. అనేక గ్రంథాలు, పుస్తకాలు సేకరించి 'సీతాపుస్తక సదనం' పేరుతో ఒక గ్రంథాలయాన్ని నడిపారు. స్త్రీలకు ఓటు హక్కు రాగానే ఇల్లిళ్లూ తిరిగి స్త్రీలను ఓటర్లుగా చేర్పించారు. బీహార్ భూకంపాలు, బెంగాల్ క్షామాలు, ఆంధ్రలో వరదలు వచ్చినప్పుడు స్త్రీ హితైషిణి మండలి ద్వారా ధనం, వస్త్రాలు సేకరించి పంపించారు.

 

మహిళల సాధికారత - స్వావలంబన
జ:
మహిళలు ప్రాచీన కాలం నుంచి విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వివిధ రకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. సమాజంలోని అన్ని రకాల మూఢవిశ్వాసాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. సాధికారతను సాధించారు. విద్య, వైజ్ఞానిక, కళ, ఐటీ రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. పరిశ్రమల స్థాపనలో ముందడుగు వేశారు.
కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వావలంబన సాధించారు. సాటి స్త్రీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. కుట్లు, అల్లికలు, చేనేత వస్త్రాల తయారీ, బీడీల తయారీ లాంటి పనులు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా ప్రయోజనాలు అందుకుంటున్నారు.

 

4. పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
జ: పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమే. ఎందుకంటే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ కాలంలో స్త్రీ విద్య పురోగాభివృద్ధి సాధించింది. అన్ని రకాల చదువులను అభ్యసిస్తున్నారు. మగ పిల్లలతో సమానంగా చదువుతున్నారు. రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైతం మహిళలు పనిచేస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా చట్ట సభల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.
విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతికపరంగా తమ శక్తియుక్తులను చాటుతున్నారు. పరిశ్రమలు స్థాపిస్తున్నారు. కుటుంబంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎవరెస్టు శిఖరాలు ఎక్కే సాహసం చేసి విజయం పొందినవారూ ఉన్నారు. క్రీడారంగంలో అంతర్జాతీయ వేదికలపై మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు.
మహిళలకు మరింత చేయూతనిస్తే సమాజాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. 'మహిళల చేయూత - మహికే వెలుగు' అనే మాటకు సార్థకత ఏర్పడుతుంది.

 

2. కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాలను వివరించండి.
 

అ. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు.
జ: 'మహిళావరణం' అనే పుస్తకానికి 'పీఠిక' ఉంది. ఆ పీఠికలో రచయిత్రులు ఈ వాక్యాన్ని ఉపయోగించారు. ఒక పుస్తకంలో పట్టలేనంత మంది స్త్రీలు ఈ రచయిత్రులకు గుర్తుకు వచ్చారు. 'చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధాన పాత్ర పోషించారు' అనే భావన వారికి ఎంతో బలాన్ని ఇచ్చింది. సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు అని తెలుపుతున్న సందర్భంలో పై వాక్యాన్ని వాడారు. స్త్రీల గురించి సంప్రదాయ చరిత్రకారులు ఎక్కువగా స్త్రీలు చేసిన పనులు ఉన్నా వారి వివరాలు, విజయాలను నమోదు చేయలేరని, ముఖానికి అక్కడక్కడా పౌడర్ పెట్టుకున్నట్లు అద్దారని రచయిత్రులు తెలియజేశారు.

 

ఆ. ''ఊహలకూ, ఆలోచనలకూ లేని పరిమితులు పనిలో ఉన్నాయి"
జ: రచయిత్రులు 'మహిళావరణం' అనే పుస్తకానికి పీఠిక రాశారు. అందులోనిదే ఈ వాక్యం.
వివిధ రంగాల్లో రాణించిన స్త్రీల జీవితాలను వెలుగులోకి తెచ్చేందుకు 'మహిళావరణం' అనే పుస్తకం తీసుకురావాలి అనుకున్నారు. రచయిత్రులు ఆనాటి కాలంలోని స్త్రీలు ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త జీవిత విధానాలను కనుక్కోవడానికి ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. అందరినీ పుస్తకంలో ఉంచాలనుకున్నారు. రచయిత్రులు ప్రేరణతో, ఉత్సాహంతో పనిని మొదలుపెట్టారు. ఊహించుకున్న వాటికి, ఆలోచించిన వాటికి పరిమితులు లేవు కానీ పని మొదలుపెట్టగానే ముందుగా వారికి స్థల, కాలాలకు, సంఖ్యకు ఎన్నో పరిధులూ, పరిమితులూ వచ్చాయి.
ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి అవరోధాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. పై వాక్యం రచయిత్రులు పని మొదలుపెట్టిన సందర్భంలో వాడారు.

 

ఇ. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే ... ఇదీ మన సమాజ విధానం
జ: షావుకారు జానకి ఒక ఇంటర్వ్యూలో 'మహిళావరణం' పుస్తక పీఠిక రాసిన రచయిత్రులతో అన్నారు.
షావుకారు జానకి సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లలో 'హీరో'లకే శాల్యూట్ పెట్టేవారని, వారి తర్వాతే హీరోయిన్లకు గౌరవం దక్కేదని చెప్పారు. అంటే సినిమా పరిశ్రమలో కూడా స్త్రీ, పురుష ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఇలా తయారైంది మన సమాజం.
రచయిత్రులు 'మహిళావరణం' పుస్తక పీఠికలో స్త్రీకి గౌరవం తక్కువగా ఉందనే విషయాలను తెలిపే సందర్భంలో పై వాక్యాన్ని ఉపయోగించారు.

 

3. కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 

50వ దశకపు రెండో భాగం నుంచీ డెబ్బయ్యో దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీచందూర్, లత, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం, డి. కామేశ్వరి, బీనాదేవి మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి. రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యో దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వం, కథల్లో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలుకొట్టారు. కవిత్వం రాయడమే కాదు. అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. ఈ శతాబ్దంలో వచ్చిన రెండో ఉత్తమ కవితా సంకలనం 'నీలిమేఘాలు'. ఇది స్త్రీవాద కవితా సంకలనం. ఓల్గా 'రాజకీయ కథలు', 'స్వేచ్ఛ' నవల స్త్రీల శరీర రాజకీయాలనూ, కుటుంబ అణచివేతనూ కొత్త పద్ధతిలో పరిచయం చేశాయి. జయప్రభ, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, పి.సత్యవతి, సి.సుజాత, మృణాళిని, కె.వరలక్ష్మి, కె.గీత, కుప్పిలి పద్మ, జానకీబాల, జయ వంటి స్త్రీవాద రచయిత్రులు తెలుగు సాహిత్యంలో స్త్రీవాదాన్ని స్థిరపరిచారు.
 

ప్రశ్నలు

అ. తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు?
జ: తెలుగు సాహిత్యంలో 50వ దశకపు రెండో భాగం నుంచి డెబ్బయ్యో దశాబ్దం వరకు రచయిత్రులు వెల్లువలా వచ్చారు.

 

ఆ. 80వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు?
జ: 80వ దశకంలో రచయిత్రులు కవిత్వం, కథల్లో ప్రత్యేక ముద్ర వేశారు. రచయిత్రుల నవలలకు విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలు ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల 80వ దశకం స్త్రీల దశాబ్దమని చెప్పవచ్చు.

 

ఇ. స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు ఏమిటి?
జ: అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. కవిత్వం తమదనుకున్న పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు.

 

ఈ. స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి?
జ: స్త్రీవాద సాహిత్యంలో అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలు, కుటుంబ అణచివేత ప్రాధాన్యం వహించాయి.

 

ఉ. పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జ: పై పేరాకు ''స్త్రీవాద రచయిత్రుల వికాసం" అనే శీర్షికను పెట్టవచ్చు.

 

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 

అ. సంపాదకులు మహిళావరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు?
జ: గడిచిన శతాబ్దంలో పోరాటం చేసిన స్త్రీలు, ఉద్యమాలు చేసిన స్త్రీలు, వివిధ రంగాల్లో రాణించిన స్త్రీలు ఉన్నారు. ఈ శతాబ్దపు సామాజిక అభివృద్ధిలో, సామాజిక మార్పుల్లో స్త్రీల భాగస్వామ్యం గురించి ఆలోచించారు సంపాదకులు. గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించారు. స్త్రీలే చరిత్ర నిర్మాతలుగా తిరుగులేని స్థానంలో ఉన్నారు. అయితే దీన్ని సాధికారంగా, సోదాహరణంగా నిరూపించాలంటే ఎంతో అధ్యయనం, మరెంతో సమయం పడుతుంది. ఆ పని చేయాలనుకుంటూనే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాల్లో, కీలక స్థానాల్లో, కీలక సమయాల్లో పనిచేసి తమదైన ముద్ర వేసుకున్న వారందరినీ 'మహిళావరణం' అనే పుస్తకంలోకి తీసుకురావాలనుకున్నారు.

 

ఆ. మహిళావరణం రచయిత్రులు ఏయే రంగాలకు చెందిన స్త్రీల వివరాలు సేకరించాలనుకున్నారు?
జ: 'మహిళావరణం' అనే  పుస్తకంలోకి  రచయిత్రులు  కింది  రంగాలకు చెందిన   స్త్రీల   వివరాలు సేకరించాలనుకున్నారు.
 మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలు
 మొదటిగా వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలు
 స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు
 ఉద్యమంలో చేరి జైలుకు వెళ్లేందుకు సిద్ధపడ్డ స్త్రీలు
 నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు
 మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులుగా ఉన్న స్త్రీలు

ఇ. మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు పొందిన అనుభూతులు ఏమిటి?
జ: మహోన్నుతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులకు కొంతకాలంగా స్త్రీలకు చరిత్రలో స్థానం లేదని, ప్రాతినిధ్యం లేకుండా స్త్రీలు ఉన్నారంటున్నా వీరికి ఇంతమంది స్త్రీలను ఒక వరసలో చూడటం గొప్ప కనువిప్పు కలిగింది. రాష్ట్ర చరిత్ర అంతా కొత్తగా తెలిసినట్లు అనిపించింది. ఒక చైతన్య సమూహ ప్రవాహంగా స్త్రీలను చూడగలిగారు. సంపాదకులకు గొప్ప గొప్ప స్త్రీల గురించి చదవినప్పుడు కలిగిన అనుభూతికీ, పలు రంగాల్లో పనిచేసిన వందల మంది స్త్రీలను, వారు సాధించిన విజయాలతో సహా చూడటం వల్ల కలిగిన అనుభూతికీ పోలిక లేదని అర్థమైంది.
స్త్రీల చైతన్య ప్రవాహపు వేగం, జీవం, ఆ ప్రవాహ క్రమంలోని మార్పులన్నీ ఒక కొత్త విషయాన్ని చెప్పినట్లు సంపాదకులకు అనిపించింది. సామూహికమైన ఉనికి, చైతన్యమే చరిత్రను రూపుదిద్దుతాయని స్పష్టమైంది. ఇంత మంచి సాంఘిక, రాజకీయ సాంస్కృతిక వారసత్వం మనకు ఉందని పొంగిపోయారు.
ఈ స్త్రీలందరూ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో గుర్తుచేసుకున్నారు. వారు కొత్త జీవిత విధానాలను కనుక్కోవడానికి ఎన్ని కఠిన పరీక్షలకు గురయ్యారో గుర్తించారు. సామాన్యుల సాహసం అసామాన్యం అనిపించింది.

 

ఈ. మహిళావరణం పుస్తకంలోకి ఎంతోమంది స్త్రీలను తీసుకోవాలని ఉన్నా కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి కారణాలు ఏమిటి?
జ: మహిళావరణం పుస్తకంలో భిన్నరంగాల్లో, కీలకస్థానాల్లో, కీలక సమయాల్లో పనిచేసి అక్కడ తమ ముద్ర వేసిన వంద మందిని తీసుకోవాలనుకున్నారు. కానీ పరిశీలిస్తే చాలా వందల మంది స్త్రీలు వెలుగులోకి వచ్చారు. పరిమితుల రీత్యా ఈ పుస్తకంలో నూట పద్దెనిమిది మంది స్త్రీలకు స్థానం కల్పించారు. ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల ఇంతే ప్రాముఖ్యత ఉండే మరో రెండు మూడు వందల మంది ఈ పుస్తకంలో ఉండేవారు. అందులో ఇది మొదటి పుస్తకమే.
తర్వాతి పుస్తకాల్లో వారిని పరిచయం చేయగలుగుతారు. ఆ నూట పద్దెనిమిది మందిని సంపాదకులే ఎంపిక చేశారు.

 

ఉ. మహిళావరణం పుస్తక ప్రచురణలో సంపాదకులకు సహాయపడినవారు ఎవరు?
జ: 1) భరత్‌భూషణ్: ఫొటోలు తీయడానికి తన అనారోగ్యాన్ని పక్కనపెట్టి పనిచేశారు.
2) ఎస్.ఆర్.శంకరన్, అక్కినేని కుటుంబరావు: 'మహిళావరణం పుస్తకం సంపాదకులు. ఈ పుస్తకం తీసుకొస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆలోచించి, ఎంపిక విషయంలో సహకరించి ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు.
3) నాగార్జున: 'మహిళావరణం' పుస్తకానికి 'గ్లోసరీ' తయారుచేసే బాధ్యత తీసుకున్నారు.
4) చేకూరి రామారావు: పుస్తకానికి సంబంధించి భాషా విషయంలో అమూల్యమైన సలహాలు ఇచ్చారు.
5) రాజ్‌మోహన్ తేళ్ల : ఈ పుస్తకం ఎలా ఉండాలి? లోపలి విషయానికి తగినట్లుగా ఎంత అందంగా, హుందాగా, గంభీరంగా, అదే సమయంలో ఆకర్షణీయంగా పుస్తకాన్ని తీర్చిదిద్దాలని తపనపడి, చక్కటి రూపంలో పుస్తకాన్ని అందించారు. డిజైన్, ఆర్ట్ వర్కులో పరిపూర్ణత సాధించడానికి శ్రమపడ్డారు.
6) నీనా జాదవ్, కంచ రమాదేవి: 'అస్మిత'లో ప్రధాన బాధ్యత తీసుకున్నారు. భరత్‌భూషణ్‌తో వెళ్లి జీవిత విశేషాలు సేకరించడం, అన్నింటినీ ఒక పద్ధతిలో భద్రపరచడం చేశారు.
7) పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి: 'మహిళావరణం' పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో కంప్యూటర్‌పై కంపోజ్ చేశారు.


II. వ్యక్తీకరణ - సృజనాత్మకత


1. కింది ప్రశ్నలకు ఆలోచించి అయిదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ. ''సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు" దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జ: గడిచిన కాలాన్ని గమనిస్తే స్త్రీలు అనేకమంది విభిన్న రంగాల్లో, ఉద్యమాల్లో, పోరాటాల్లో ఉన్నారు. వారందరి విషయాలను మన సంప్రదాయ చరిత్రకారులు గుర్తించలేకపోయారు. కొద్దిమంది గురించి మాత్రమే రాయగలిగారు. పురుషాధిక్యత కారణంగా వారిని గుర్తించలేదు. స్త్రీల గురించి మన 'మహిళావరణం' సంపాదకులు, చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్టు అద్దుతున్నారన్నారు.
చరిత్రకారులుగా స్త్రీలు ఆనాడు లేకపోవడం వల్ల చరిత్ర నిర్మాతలుగా స్త్రీలను గుర్తించలేకపోయారు. దేశం కోసం, తమ కోసం, ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాల మూలంగా వారి వివరాలు దొరక్కపోవచ్చు. అందుకే నేను 'సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు' అనే దాంతో ఏకీభవిస్తాను.

 

ఆ. రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి 'మహిళావరణం' అనే పేరు సరిపోయిందని భావిస్తున్నారా? ఎందుకు?
జ: రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి 'మహిళావరణం' పేరు సరిపోయింది. విభిన్న రంగాల్లో, కీలక సమయాల్లో పనిచేసిన మహిళలను ఒక చోట చేర్చడం జరిగింది. మొదటి తరపు డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు, ఉద్యమించిన స్త్రీలు, చదువుకున్న సామాన్య స్త్రీలు, స్త్రీ విద్య కోసం పనిచేసినవారు, నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లోకి మొదటిసారి అడుగిడిన స్త్రీలు... ఇలా చాలా గొప్పవారిని ఎంపిక చేసుకుని వారి వివరాలను ఫొటోలతో సహా ఆ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. చాలా మంది ఉన్నప్పటికీ ప్రాధాన్యతను బట్టి (118) నూట పద్దెనిమిది మంది గురించి వివరించారు. మహిళల వివరాలు ఉన్నాయి కాబట్టి 'మహిళావరణం' పేరు సరిపోయింది.

 

ఇ. ''ప్రతివాళ్లు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ!" అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకు పేర్కొన్నారు?
జ: చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకలేదు. సంప్రదాయ చరిత్రకారులు అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దారు. దేశం కోసం, తమ కోసం, ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకూ, పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకలేదు. అందుకే రచయిత్రులు స్త్రీలలో ఒక చైతన్య సమూహ ప్రవాహం చూశారు. సరిదె మాణిక్యాంబగారు ''అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు. తర్వాత అన్ని కులాల వారినీ ఆడవచ్చన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం, అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాలవాళ్లు బతుకుతున్నారు" అని వారి వేశ్యాకులం గురించి అన్నప్పుడు రచయిత్రులకు సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు కళ్ల ముందుకు వచ్చారు. చరిత్ర సృష్టించిన స్త్రీలందరూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ అని రచయిత్రులు తెలియజేస్తున్నారు.

 

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ. చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలు వివరించండి.
జ: సంపాదకులు కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టే సందర్భంలో గడిచిన కాలాన్ని పరామర్శించారు. ఆ అనుభవాలను స్మరించారు. భవిష్యత్‌పై ఒక అంచనాతో ఆశను పెంచుకున్నారు. ఆ పనిచేస్తూ ఈ శతాబ్దంలో సామాజిక అభివృద్ధిలో, సామాజిక మార్పుల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని ఆలోచించారు. అప్పుడు వారికి అనేక విషయాలు తెలిశాయి.
గడిచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాల్గొన్న ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారి చదువుకున్న స్త్రీలు, మొదటిగా వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్లేందుకు తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లోకి మొదటిసారిగా అడుగుపెట్టిన స్త్రీలు, మొదటితరం డాక్టర్లూ శాస్త్రవేత్తలూ, కళాకారిణులు, విద్యాధికులు... ఇలాంటి సాహసమూర్తులు ఎందరో కనిపించారు. వాళ్లందరినీ ఒకచోట పెట్టడమనే ఆలోచన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఏ ఒక్క పుస్తకంలోనూ ఇమడలేనంతమంది సంపాదకులకు గుర్తుకువచ్చారు. అందుకే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

 

ఆ. 'ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి' అనడంలో పీఠికా కర్తల ఆంతర్యం ఏమిటి?
జ: గడిచిన శతాబ్దంలోని స్త్రీలను గురించి తెలుసుకున్నప్పుడు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారు అనే భావన పీఠికా కర్తలకు కలిగింది. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దారు. దాన్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తూనే ఉంది. స్త్రీలు దేశం కోసం, తమకోసం ఒక సమూహంగా చేసిన పోరాటాలకూ, పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకలేదు. చరిత్ర అనే జగన్నాథ రథ చక్రాల కింద వాళ్ల సామూహిక ఉనికి తునాతునకలై పోయింది. ఇలాంటి స్త్రీలు కూడా వేళ్లపై లెక్కపెట్టేంతమంది కూడా మన చరిత్ర పుస్తకాల్లో కనిపించరు.
ఇంతమంది స్త్రీలను ఒక వరసలో చూడటం గొప్ప కనువిప్పు కలిగింది. స్త్రీలను చైతన్య సమూహ ప్రవాహంగా చూడగలిగారు. చదివినప్పుడు కలిగిన అనుభూతికి, చూడటం వల్ల కలిగిన అనుభూతికి పోలిక లేదని గ్రహించారు. స్త్రీల చైతన్య ప్రవాహ వేగం, జీవం, ఆ ప్రవాహ క్రమంలోని మార్పులన్నీ ఒక కొత్త విషయాన్ని చెప్పినట్లు అనిపించింది. చరిత్రను సామూహికమైన ఉనికి, చైతన్యం రూపుదిద్దుతాయనేది స్పష్టమైంది. ఇంత మంచి సాంఘిక, రాజకీయ సాంస్కృతిక వారసత్వం మనకు ఉందని గ్రహించారు. ఈ స్త్రీలందరూ ఎంతో కష్టనష్టాలకు గురై, ప్రతికూల పరిస్థితులతో తలపడ్డారు. చరిత్రను నిర్మించేందుకు ఎంతో మూల్యం చెల్లించారు. ఈ క్లిష్ట పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే గుండెలు బరువెక్కుతున్నాయని పీఠికా కర్తలు తెలియజేస్తున్నారు.
ఈ వాక్యంలో ఆంతర్యం ఏమిటంటే స్త్రీలు అన్ని రకాలుగా కష్టనష్టాలను ఎదుర్కొని చరిత్రను నిర్మించారని, వారికి గుర్తింపు లేదనే విషయం అర్థమవుతుంది.

 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
 

అ. ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
జ: మా పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్త్రీవాద రచయిత్రిని అడిగే ప్రశ్నల జాబితా:
1) స్త్రీవాదం అంటే ఏమిటి?
2) మీరు ఎవరు రాసిన స్త్రీవాద రచనలతో ప్రేరణ పొందారు?
3) మీరు రాసిన స్త్రీవాద రచనలు ఏమిటి?
4) మీరు రాసిన స్త్రీవాద రచనల్లోని కొన్ని పంక్తులను చెప్పండి.
5) స్త్రీవాద రచనలవల్ల స్త్రీలలో ఏయే మార్పులు వచ్చాయి?
6) స్త్రీలను చైతన్యపరచడం కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏమిటి?
7) స్త్రీలపై జరుగుతున్న దాడులపై మీ ప్రతిస్పందన ఏమిటి?
8) కొత్తగా రచనలు చేస్తున్న స్త్రీవాద రచయిత్రులకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
9) స్త్రీవాద కవిత్వం ద్వారా సమాజంలో వచ్చే మార్పులు ఏమిటి?
10) స్త్రీవాద రచయిత్రుల పట్ల ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
11) ప్రస్తుతం స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు కదా! వాళ్లందరినీ ఒకే వేదిక పైకి తెచ్చే కార్యక్రమాల గురించి చెప్పండి.
12) మా తోటి విద్యార్థినులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

 

ఆ. మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి. 
జ:

 

మహిళ... మహికే వెలుగు
 

యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః అంటే స్త్రీలను పూజించే చోటనే దేవతలు ఆనందిస్తారు. స్త్రీ.. దేవత ప్రతిరూపం. గొప్ప గౌరవం ఉన్న స్త్రీని కొందరు చులకన భావంతో చూస్తున్నారు. కానీ స్త్రీలను గౌరవించని చోట జరిగే సర్వక్రియలు జరగవని గమనించండి. అమ్మతనాన్ని మరచి కొందరు ఆడపిల్ల పుట్టిన వెంటనే పారవేస్తున్నారు. అది చాలా తప్పు అని గ్రహించండి. సృష్టికి మూలం స్త్రీ అని తెలుసుకోండి.
మరికొందరు మహిళలపై అకృత్యాలు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి స్త్రీ మన సోదరి లాంటిదని గుర్తుంచుకోవాలి. దాడులు చేసేవారిని ఎదురించండి. అవమానిస్తే నిర్భయంగా ఎదుర్కోండి. ధైర్యంతో నిలబడండి. సమస్యలు వస్తే కుంగిపోకండి. ఆడపిల్ల అన్నీ చేయగలదని నిరూపించండి. తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. భయాన్ని విడనాడండి.
సాహస మహిళల జీవితాలను చదవండి. వారి నుంచి ప్రేరణ పొందండి. మహిళా సంఘాలతో మమేకం కండి. మహిళే మహికి వెలుగు అని చాటండి.
                                  మహిళలు మేలుకునే విధంగా శతధా ప్రయత్నిస్తూ...
                                                      మీ పాపన్నపేట విద్యార్థినులు

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌