• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మా ప్రయత్నం

రచయిత్రుల పరిచయం

ఓల్గా:

 * ప్రముఖ రచయిత్రి.

* ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.

* అనేక పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు.

* ఆమె రచించిన 'స్వేచ్ఛ' నవల ప్రసిద్ధి పొందింది.

వసంత కన్నబిరాన్

* మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నారు.

* స్త్రీ సమానత్వం కోసం పోరాడుతున్నారు.

* నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు.

కల్పన కన్నబిరాన్

* 'సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్' (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్నారు.

* జెండర్ స్టడీస్, క్రిమినల్ లా విభాగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు.

పాఠ్యాంశ ఉద్దేశం

* ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాలను, శ్రమను తెలియజేసేదే ముందుమాట.

* 'ముందుమాట' వల్ల పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది.

* మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో 'ముందుమాట' వల్ల తెలుస్తుంది.

* 'ముందుమాట'ను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఒక గ్రంథాన్ని, దాని నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా మరో రచయిత లేదా విమర్శకుడు రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను 'పీఠిక' అంటారు. పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం లాంటి పేర్లెన్నో ఉన్నాయి. ప్రస్తుత పాఠ్యాంశం 'మహిళావరణం' అనే పుస్తకంలోని ముందుమాట.

ప్రవేశిక

'' వారి అనుభవాలు వింటుంటే ఉద్వేగం కలిగేది. చరిత్రను మా కళ్ల ముందు నిలిపిన వారి జీవితాలను వినడం మాకు అన్నింటి కంటే ఆనందాన్ని ఇచ్చిన విషయం. సంస్కరణోద్యమ రథ చక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ల ముందు మెదిలి కన్నీరు కార్చారు. స్త్రీలు ఏమంటున్నారో వినకుండా, వారేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణ పడి నిగ్గుదేలి కొత్త చరిత్ర సృష్టించిన స్త్రీలూ.... వీళ్లందరి అనుభవాలతో చరిత్ర కొత్తగా పరిచయం అయినట్లు అనిపించింది".ఈ వివరాల గురించి తెలుసుకోవడానికి 'మా ప్రయత్నం' పాఠం చదవండి.

* 'మా ప్రయత్నం' అనే పాఠం 'మహిళావరణం' అనే పుస్తకానికి 'ముందుమాట'.

* రచయిత్రులు ఈ 'ముందుమాట'లో ఏయే విషయాలు రాశారో తెలుసుకుందాం.

పాఠంలోని విషయాలు - సారాంశం

కొత్త సహస్రాబ్దం (సహస్రాబ్దం అంటే వేయి సంవత్సరాలు. ఇది మూడో సహస్రాబ్దం - 2000 నుంచి 3000 మధ్య కాలం)లోకి, శతాబ్దం (శతాబ్దం అంటే నూరు సంవత్సరాలు - 21వ శతాబ్దం)లోకి అడుగుపెడుతున్న సందర్భంలో గడిచిపోయిన కాలాన్ని తిరిగి చూసుకోవడం, అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం, భవిష్యత్ మీద ఒక అంచనాతో ఆశను పెంచుకోవడం ఎవరైనా సామాన్యంగా చేయాలనుకునేపనే. ఆ పని చేస్తూ.... అంటే గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటుంటే రచయిత్రులకు సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పుల్లో స్త్రీల భాగస్వామ్యం గురించి ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు ముందుకు వచ్చాయి. గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చు అనిపిస్తుంది. గత శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానం అనిపించింది. అయితే దీన్ని అధికారసహితంగా, ఉదాహరణ సహితంగా నిరూపించడానికి ఎంతో అధ్యయనం, మరెంతో సమయం పడుతుంది. ఆ పని చేయాలనుకుంటూనే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాల్లో, కీలక స్థానాల్లో, కీలక సమయాల్లో పనిచేసి అక్కడ తమ ముద్ర వేసిన వందమంది స్త్రీల ఫొటోలతో, ముఖ్య వివరాలతో ఒక పుస్తకం తీసుకురావాలని అనుకున్నారు. కొత్త శతాబ్దంలో స్త్రీలందరూ కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలని అనుకున్నారు. ఈతరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనసులపై తమదైన ముద్ర వేయడానికి ఫొటోలు అవసరమని, ఆ రకంగా వారి జ్ఞాపకాలు మనలో ఎక్కువ కాలం ఉంటాయని రచయిత్రులు వాటిని పెట్టారు. వంద సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే విజయోత్సవంగా ఉంటుంది ఈ పుస్తకం. గడిచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, భాగస్వామ్యం వహించిన ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి.

మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలు, మొదటిగా వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ప్రయత్నించిన స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకి వెళ్లేందుకు సిద్ధపడిన స్త్రీలు; నాటకం, సినిమా, రేడియో లాంటి రంగాల్లో మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు; మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు ఇలాంటి ఎందరో సాహసమూర్తులు. వాళ్లందరినీ ఒకచోట చేర్చడమనే ఆలోచన ఉత్సాహాన్ని ఇచ్చింది రచయిత్రులకు. ఒకరి తర్వాత ఒకరు ఏ ఒక్క పుస్తకంలోనూ పట్టలేనంత మంది గుర్తుకువచ్చారు. దాంతో 'చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ముఖ్య పాత్ర పోషించారు' అనే భావన మరోసారి బలంగా ఏర్పడి ఎంతో గర్వమనిపించింది.

సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు. దాన్ని మహిళోద్యమం ప్రశ్నిస్తూనే ఉంది. దేశం కోసం, తమకోసం ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకూ, పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వాళ్ల సామూహిక ఉనికి తునాతునకలైపోతుంది. దాంతో కొన్ని విజయాలు సాధించిన స్త్రీలను ఒక్కొక్కరిగా తలచుకుని వాళ్ల శక్తికి ఆశ్చర్యపడతారు. అలాంటి శక్తిమంతులు అరుదుగా ఉంటారని, వారిని అసామాన్య ఉదాహరణలుగా మాత్రమే గుర్తుంచుకుంటారు. మొత్తం సామాజికాభివృద్ధి క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చదువుతారు. వేళ్లపై లెక్కపెట్టేంతమంది స్త్రీలు కూడా మన చరిత్ర పుస్తకాల్లో కనిపించరు. ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదనీ, చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించేలా లేదని స్త్రీ ఉద్యమం విమర్శిస్తోంది. ఈ విషయాన్ని మేము ఎంత అర్థం చేసుకున్నా, ఇంతమంది స్త్రీలను ఒక వరసలో చూడటం గొప్ప కనువిప్పు. మనరాష్ట్ర చరిత్ర అంతా కొత్తగా తెలిసినట్లు అనిపించింది.

ఒక చైతన్య సమూహ ప్రవాహంగా స్త్రీలను చూడగలిగారు. ఇంతకు ముందు విడిగా ఏ ఒక్క ఉద్యమంలోనో, రంగంలోనో పనిచేసిన స్త్రీల గురించి చదివినప్పుడు కలిగిన అనుభూతికి పలురంగాల్లో పనిచేసిన వందల మంది స్త్రీలను, వారు సాధించిన విజయాలతో సహా చూడటం వల్ల కలిగిన అనుభూతికి పోలికే లేదు.

స్త్రీల చైతన్య ప్రవాహపు వేగం, జీవం, ఆ ప్రవాహ క్రమంలోని మార్పులన్నీ ఒక కొత్త విషయాన్ని చెబుతున్నట్లు అనిపించింది. సామూహికమైన ఉనికి, చైతన్యం చరిత్రను రూపుదిద్దుతామనే విషయం స్పష్టమైంది. ఇంత మంచి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వం మనకు ఉందని పొంగిపోయారు. ఈ స్త్రీలందరూ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే గుండెలు బరువెక్కుతాయి. వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ వారు కొత్త కలలు కనడానికీ, కొత్త జీవిత విధానాలను కనుక్కోవడానికీ ఎన్ని కఠిన పరీక్షలకు గురయ్యారో తలచుకుంటే వారి సాహసం అసామాన్యం అనిపించింది. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి సమాయత్తమైన స్త్రీ సమూహం రచయిత్రులకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. ఆ ప్రేరణతో, ఉత్సాహంతో ఈ పని ('మహిళావరణం' అనే పుస్తకం తేవడం) మొదలుపెట్టారు. ఊహలకు, ఆలోచనలకు లేని పరిమితులు పనిలో ఎన్నో ఉన్నాయి. ముందు స్థల కాలాలకూ, సంఖ్యకూ ఎన్నో పరిధులూ, పరిమితులూ ఏర్పడి ఉన్నాయి. ఆంధ్రదేశానికి చెందిన స్త్రీలు అన్నప్పుడు ఆంధ్రదేశం గతంలో ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లా లేదు. భవిష్యత్‌లో ఇలానే ఉంటుందనీ లేదు. మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాం రాజ్యం, ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో కొన్ని ప్రాంతాలు ఆంధ్రుల సాంస్కృతిక రాజకీయ చరిత్రలో ఉన్నాయి. వాటిని కూడా పరిధిలోకి తీసుకున్నారు. సాంస్కృతిక రాజకీయ చరిత్రలో ఉన్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 'తెలుగు' అనే పదం వాడకుండా 'ఆంధ్ర' అని వాడారు. దానికి కారణం 'ఆంధ్ర' అనే పేరుతో ఏ రాజకీయ పార్టీ లేదు. అందువల్ల పందొమ్మిదో శతాబ్దంలో తెలుగు ప్రజల రాజకీయ సాంస్కృతిక జీవనానికి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ను, రెండింటినీ దృష్టిలో పెట్టుకోవాలి.

కాలానికి సంబంధించి ఆలోచించినప్పుడు సామాజికంగా స్త్రీలు తెచ్చిన పెద్ద మార్పులు ఈ శతాబ్దంలో ప్రముఖంగా ఉన్నాయి కాబట్టి ఈ శతాబ్దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అన్ని రంగాలను ఇందులో చేర్చారు. ఇక సంఖ్య విషయానికి వస్తే ఏదో ఒక సంఖ్యకు కట్టుబడక తప్పదు. పుస్తక ప్రచురణలో ఉండే ఆర్థిక పరిమితుల దృష్ట్యా వంద మందిని ఈ పుస్తకంలో ఉంచాలని అనుకున్నారు. కానీ వారికి ఆ సంఖ్య ఏమీ తృప్తినివ్వలేదు. ఆర్థికంగా కష్టమనిపించినా మరికొంతమందిని చేర్చక తప్పలేదు. ఎంపిక చాలా కష్టమనడంలో సందేహం లేదు. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్రవేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగాల్లో నిష్ణాతులైన ఇప్పటి వారిని సంప్రదించాలి. కాలధర్మం చెందిన వారి వివరాలు సేకరించాలి. వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి, మాట్లాడాలి. వాళ్ల గురించి ఎలా రాయాలో ఎంతో ఆలోచించాలి. ఇంటర్వ్యూలు తీసుకుని రాయడం కంటే వారి జీవిత విశేషాలను, వాళ్లు చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను క్లుప్తంగా చెప్పడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అది కొంత నిరాశ కలిగించినా ఒక సమూహంగా సాగివచ్చే స్త్రీమూర్తులు మా ఉత్సాహాన్ని ఏ మాత్రం నీరుకారనివ్వలేదు. ఈ పనిలో ఎందరో స్త్రీలను కలిశారు. వాళ్లతో మాట్లాడటం పెద్ద ఉత్సాహంగా ఉండేది. వాళ్ల అనుభవాలు వింటే ఉద్వేగం కలిగేది. చరిత్రను రచయిత్రుల కళ్లముందు నిలిపిన వారి జీవితాలను వినడం ఈ పనిలో అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన విషయం. సరిదె మాణిక్యాంబ గారు ''అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు. తర్వాత అన్ని కులాలవారినీ ఆడవచ్చన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు  ఇదే  జీవనోపాధిగా  అన్ని  కులాల  వాళ్లు  బతుకుతున్నారు   అన్నప్పుడు సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు వాళ్ల కళ్ల ముందు మెదిలి కన్నీరు కార్చారు. స్త్రీలు ఏమంటున్నారో వినకుండా, వారేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణపడి నిగ్గుదేలి కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలూ - వీళ్లందరి అనుభవాలతో చరిత్ర కొత్తగా పరిచయమైనట్లు అనిపించింది.  ప్రతివాళ్లు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని. ప్రతివాళ్లు ప్రయత్నించారు చరిత్రను మార్చడానికి. అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి నుంచి మేకప్ రంగంలో ఆడవాళ్లకు ఎందుకు స్థానం లేదని పోరాడిన శోభాలత వరకూ ప్రతి ఒక్కరూ మార్పును తీసుకురావడానికి ప్రయత్నించినవారే. తమ జీవితాల్లో, సామాజిక జీవన రంగంలో కొత్త అర్థాలను, వెలుగులనూ సృష్టించాలని తాపత్రయ పడినవారే.

''నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు - మేమంతా కుటుంబ స్త్రీలం కామా - ఆమాట ఎవరు మాట్లాడినా నాకు కోపం వస్తుంది. ఏ స్త్రీ అయినా కుటుంబంలోంచి రాకుండా ఎక్కడి నుంచి వస్తుంది" అని పావలా శ్యామలగారు కోపంగా అడిగిన ప్రశ్నలతో ఈ పితృస్వామ్య సమాజం స్త్రీలను శాశ్వతంగా విడదీసి, మర్యాద - అమర్యాద పరిధుల్లో వాళ్లను కదలకుండా బంధించి తనకు అనుకూలంగా మాత్రమే వాళ్ల కదలికలను నియంత్రించే విధానమంతా కళ్లకు కట్టింది.

షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు ''శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే .... ఇదీ మన సమాజ విధానం. చివరకు మిగిలేది హీరో గొప్పతనమే" చరిత్రలో కూడా అంతే. ఈ విధానాన్ని మార్చడం తేలిక కాదు గానీ ప్రయత్నాలు ప్రారంభించడానికీ, స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరిగి రాయడానికీ ఇది అనువైన సమయమనిపిస్తోంది. పరిమితుల రీత్యా ఈ పుస్తకంలో నూట పద్దెనిమిది మందిని మాత్రమే ఎంచుకున్నారు. మరింత ఆర్థిక వెసులుబాటు ఉంటే ఇంతే ప్రాముఖ్యత గల మరో రెండు మూడు వందల మంది ఈ పుస్తకంలో ఉండేవారు. ఇది మొదటి పుస్తకం. తర్వాతి పుస్తకాల్లో వాళ్లూ ఒక క్రమంలో పరిచయమవుతారు.

వారిని ఎంచుకునేందుకు ఆయా రంగాల్లో వారు చేసిన కృషి, వారు వేసిన ముద్ర, మొదట ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్లు ఎదుర్కొనే సంక్లిష్ట సందర్భాలు, ప్రజల్లో వారికున్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ స్త్రీలను ఏ వరుసలో ఉంచాలనే ప్రశ్నకు కాలక్రమమే సరైందని అనిపించింది. ఒకే సమయంలో పలు రంగాల్లో పనిచేసిన స్త్రీలను ఒక వరుసలో ఉంచడం వల్ల ఒక సమగ్రత వస్తుందని అనిపించింది. ఒకే కాలంలో భిన్న రంగాల్లో అంటే మొత్తం సమాజంలో జరిగిన మార్పులకు స్త్రీలు చేసిందేమిటి?వారి భాగస్వామ్యం ఏమిటి? అనేది చూడాలనుకున్నప్పుడు, కాలక్రమం పాటించడమే సరైందని అనుకున్నారు. ముందుమాట గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం మొదటిది కాబట్టి పుస్తకం ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించింది కాబట్టి తెలుగులో వివరమైన 'ముందుమాట' ఉంచారు. ఇంగ్లిష్‌లో దాన్ని (ముందుమాట) సంక్షిప్తం చేశారు.

ఈ పుస్తకానికి స్త్రీలను ఎంపిక చేయడానికి ఎందరో సహకరించారు. ఎందరినో సంప్రదించారు. వారందరికీ రచయిత్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఫొటోలు తీయడానికి భరత్‌భూషణ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఈ పని గురించి ఎంతో ఉత్సాహం చూపించారు. అనారోగ్యాన్ని పక్కనపెట్టి ఈ పని చేశారు. ఈ పనిలో ఆయన పొందిన సంతోషం కూడా తృప్తినిచ్చింది. ఇప్పుడు జీవించి లేనివారి ఫొటోలు సేకరించడంలో ఎందరో సహాయపడ్డారు. వారందరికీ రచయిత్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎస్.ఆర్.శంకరన్, అక్కినేని కుటుంబరావు ఈ ప్రయత్నానికి ప్రోత్సహించారు. ప్రతి సందర్భంలో తరచి తరచి ప్రశ్నించారు. రచయిత్రులు ఎంపిక చేసినవారి గురించి ఎందుకు ఎంచుకున్నారనీ, ఎంచుకుని వదిలేసినవారిని ఎందుకు వదిలారనీ, ప్రశ్నించి ఎంతో విలువైన సలహాలను ఇచ్చారు. నాగార్జున ఈ పుస్తకానికి గ్లోసరీ (పదాలకు అర్థాలు) తయారుచేసే బాధ్యత తీసుకుని సహాయపడ్డారు.
చేకూరి రామారావు ఈ పుస్తకానికి సంబంధించిన భాషా విషయంలో తమ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. రాజ్‌మోహన్ తేళ్ల ఈ పుస్తకం ఎలా ఉండాలి, లోపలి విషయానికి తగినట్లుగా ఎంత అందంగా, హుందాగా, గంభీరంగా అదే సమయంలో ఆకర్షణీయంగా ఎలా పుస్తకాన్ని తీర్చిదిద్దాలని తపనపడి చక్కని రూపంలో అందించాడు. డిజైన్, ఆర్ట్‌వర్కుల్లో ఒక పరిపూర్ణత సాధించడానికి చాలా శ్రమపడ్డాడు. పుస్తకం అనుకున్న సమయంలో రావడానికి ఎక్కువ కష్టపడ్డారు.

అస్మిత, నీనాజాదవ్, కంచ రమాదేవి - భరత్‌భూషణ్‌తో వెళ్లి జీవిత విశేషాలు సేకరించడం, అన్నింటినీ భద్రపరచడం మొదలైన పనుల బాధ్యతను తీసుకున్నారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి - ఇంగ్లిష్‌లో పుస్తకాన్నంతా కంప్యూటర్‌పై రూపకల్పన చేశారు. 'బీనా' గారు కూడా ఆ పనిని చేయడంవల్ల పని తేలికైంది. ఈ పుస్తకం (మహిళావరణం) ప్రచురణకు సహకరించిన అందరికీ రచయిత్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

రచయిత: అంజాగౌడ్ 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం