• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాణిక్య వీణ   

 ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఆలోచించండి - చెప్పండి 

1. కింది కవితలో ప్రాస పదాలు ఏమున్నాయి?
జ: కవితలోని ప్రాస పదాలు:

 
     
2. 'అంటే అనవచ్చు, ఔనని కొందఱతో అనిపించనూవచ్చు' అనే వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జ: వేరేవాళ్లు అన్న మాటలను ఒప్పుకుని ఆ మాటలనే అనవచ్చు. చెప్పిన మాటలను విన్నవారితో అవి సరైనవే అని అనిపించేలా వారితోనూ బయటకి చెప్పించవచ్చు అని గ్రహించాను.

 

3. సమాజ రుగ్మతలు అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జ: సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోగాలను 'సమాజ రుగ్మత'లు అంటారు.
సమాజ రుగ్మతలు
       1) అంటరాని తనం
       2) మూఢ నమ్మకాలు
       3) వరకట్నం
       4) బాల్య వివాహాలు
       5) ధనిక, పేద అనే తారతమ్యం
       6) లంచగొండితనం

 

4. 'పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కళవళపడిపోవడం' అంటే ఏమిటి?
జ: పొట్టలోని పుట్టకురుపు అంటే కడుపులోని రాచపుండు (క్యాన్సర్ వ్రణం). అలాగే సమాజంలోని అసమానతలు అనే రోగం సమాజాన్ని పట్టి కళ్లముందు పీడిస్తూ ఉంది.
  క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధిలా సమాజంలోని వివిధ రకాల అసమానతలనే రోగాలు కలవర పెడుతున్నాయి.

 

5. ప్రకృతికి, మనిషికి ఉండే సంబంధం ఏమిటి?
జ: ప్రకృతికి మనిషికి ఉండే సంబంధం చాలా గొప్పది. మనిషి పుట్టగానే తనచుట్టూ ఉన్న ప్రకృతి అందాలని చూసి పరవశించిపోయాడు. అప్పటి నుంచి ప్రకృతి తన పరిధిలో ఉండేలా ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని అన్నిరకాల రంగులను, రకరకాల ధ్వనులను అనుకరించే ప్రయత్నం చేశాడు. మనిషి ప్రకృతితో తాదాత్మ్యం చెందాడు.

 

6. మాణిక్య వీణ శీర్షిక ఉన్నకింది కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్న పదాలు ఏవి?
జ:  * అందచందాలు
      * రంగులనూ, రవళినీ
      * అనుకరించడానికీ ఆయత్తమయినాడు
      * మోడులు చివురించేలా
      * గులకఱాల ములుకుమీదే
      * గొబ్బున కాలికి గజ్జె కట్టినాడు
      * దిక్కులు పిక్కటిల్లేలా
      * మొక్కలు నిక్కి చూచేలా
      * చక్కని నొక్కులతో చిక్కని పదాలు
      * విరచించిన రోజు

 

7.  చక్రాన్ని, నిప్పును కనుక్కోవడం చరిత్రలో అతి ముఖ్యమైనవి అని ఎందుకంటారు?
జ: చక్రాన్ని కనుక్కున్న తర్వాత మానవుడు దాన్ని వివిధ రకాలుగా ఉపయోగించాడు. యంత్ర శక్తికి అనుసంధానం చేశాడు. అభివృద్ధిలో చక్రం భాగమైంది. మానవుడు నిప్పును కనుక్కున్న తర్వాత చీకటి వేళలో వెలుగును చూశాడు. పచ్చి మాంసం తినేవాడు, నిప్పుతో ఉండికించుకుని తినడం ద్వారా నాగరికతలో మార్పులు చోటు చేసుకున్నాయి.

 

8. ''తప్పటడుగులు మాని తాండవం చేసిననాడు శుభదినం" అంటే ఏమిటి?
జ: అడుగులు తడబడతూ చిందులు వేసే విధానం నుంచి ఉన్నతస్థాయి నృత్యం చేసిన రోజుకు ఎదగడం గొప్ప దినంగా భావించవచ్చు. మానవుడు చిన్నస్థాయి నుంచి.. అంటే రాతియుగపు చీకటిని చీల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుగులోకి ప్రవేశించిన గొప్ప రోజులుగా కవి చెప్పాడు.

 

9. కవి వేటిని గొప్ప రోజులన్నాడు? ఎందుకు?
జ: అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపదాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు, మానసికోల్లాసం కలిగించే కళ ఆవిష్కరణ జరిగిన రోజులను కవి గొప్ప రోజులు అన్నాడు. ఎందుకుంటే వాటి ఆధారంగా ఆదిమ దశలో ఉన్న జీవితాన్ని మానవుడు ఆధునిక దిశవైపు మలుచుకున్నాడు. తన అభివృద్ధికి కారకాలుగా వాటిని వినియోగించుకున్నాడు, స్మరించుకున్నాడు.

 

10. మీ దృష్టిలో ఏవి గొప్పరోజులు? ఎందుకు?
జ: నా దృష్టిలో గొప్ప రోజులు:
     * పేదవాడికి కూడు, గుడ్డ, వసతి కలిగిన రోజు
     * అందరూ ఉపాధి పొంది సంతోషించిన రోజు
     * నిరక్షరాస్యులు లేని రోజు
     * పర్యావరణం పరవశించిన రోజు
     * అవినీతి రహిత సమాజం నెలకొన్న రోజు
     * శాస్త్ర సాంకేతికతలో మన దేశానికి తిరుగులేదనిపించిన రోజు
 పైన తెలిపిన గొప్ప రోజులు వస్తే సమాజంలో కష్టనష్టాలు ఎవరికీ ఉండవు. అందరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధిలో ప్రయాణిస్తారు. సమాజం అభివృద్ధిలో పయణిస్తుంటే దేశం కూడా అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుంది.

 

11. ''కళలూ, కవితలూ పెనవేసుకోవడం" అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జ: కళలూ, కవితలూ కలగలసిపోయి మానవ జీవితంతో పెనవేసుకుని, వదలనివిగా ఉన్నాయి. వాటి ఆధారంతోనే తన జీవన యానంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేయడానికి ప్రయత్నించాడు. కళలు, కవితలు రెండూ మనిషి అభివృద్ధికి దోహదం చేశాయి. మనిషి సాధించిన విజయాల్లో వాటి పాత్ర కీలకమైంది.

 

12. ''మిన్నందుకుంటున్న చిన్నవాడు" అని ఎందుకన్నాడు కవి?
జ: చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాడు చిన్నవాడైన మనిషి. ఆదిమకాలంలో ఏమి తెలియని మానవుడు తన జీవన ప్రయాణంలో కళలూ, కవిత్వం, విజ్ఞానం, ప్రజ్ఞానం నడిపిస్తుండగా ఆధునిక దశ వరకూ చేరాడు. చిన్నవాడైన మానవుడు తన తెలివి, మిగతా వాటి ఆధారంతో ఉన్నతస్థితికి చేరాడని కవి అన్నాడు.

 

13. 'కళా, కవితాజ్ఞానం, విజ్ఞానం' అంటే ఏమిటి?
జ: మానసిక ఉల్లాసం కలిగించేవి కళలు. ఇవి జీవన ప్రయాణంలో ఎంతో ఉపయుక్తమైనవి. కవితలను తనకు వచ్చే మాటలతో కూర్చాలి. అందుకు తగిన కవితా జ్ఞానం తప్పనిసరిగా ఉంటేనే రాయగలుగుతాడు. వాటిని తేలికగా అర్థం చేసుకుంటాడు. విజ్ఞానం అంటే శాస్త్ర సంబంధమైన విషయాలు. ఇవన్నీ మానవ జీవనయానంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేస్తాయి.

 

ఇవి చేయండి 

I. అవగాహన - ప్రతిస్పందన
 

1. 'మాణిక్య వీణ' శీర్షికతో ఉన్న కవిత విన్న తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పండి?
జ: 'మాణిక్యవీణ' శీర్షికతో ఉన్న కవిత విన్న తర్వాత వాస్తవమైన కార్యచరణ, నిబద్ధత, అంకితభావంతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయనే అనుభూతి కలిగింది. సగటుజీవి జీవనం ఇంకా కిందిస్థాయిలోనే ఉందని తెలుస్తుంది. ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచి పొందిన అనుభూతిని పొందగలిగాను. కళలు, కవితలు, విజ్ఞానం మనకు అలసటను దూరం చేస్తాయనే గొప్ప అనుభూతి ఏర్పడింది. అవి దిశానిర్దేశం చేస్తాయని అర్థమైంది. మనలను నడిపించేవాటిని కాపాడుకోవాలని అనిపించింది. శుభ దినాలను పాలుపంచుకున్న అనుభూతి పొందాను. మానవుడు ఎదిగిన క్రమాన్ని చూసి ఏమైనా సాధించవచ్చు అనే సంకల్పం కలిగింది. మానవుడు నిత్యం కొత్త ఆవిష్కరణలకోసం ఆలోచిస్తున్నాడనే అనుభూతిని పొందాను.

 

2. 'మాణిక్య వీణ' వచన కవితను భావయుక్తంగా చదవండి. దీని భావాన్ని సొంత మాటల్లో చెప్పండి.
జ: 'మాణిక్య వీణ' వచన కవిత - భావం
   మంత్రాలకు చింతకాయలు రాలనట్టు పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో వ్యాధులు తగ్గనట్లు మాయ మాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు.  కడుపులోని క్యాన్సర్‌లా, అసమానతలు అనే రోగాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. మనిషి పుట్టగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించి, ఆ ప్రకృతిని తన పరిధిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు.  మానవుడు చిత్రలేఖన నైపుణ్యం మెరుగుపరుచుకున్నాడు. తన గాన మాధుర్యంతో ఎండిన చెట్లను చిగురించేలా చేశాడు. తన గానానికి తగ్గట్లుగా గజ్జెకట్టి చిందులు వేశాడు. కళలను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు.  చక్రం, లిపిని కనుక్కున్న రోజు; ఉన్నత నృత్యాలు చేసిన రోజులను నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్పరోజులుగా కవి భావించాడు.  మానవుడు తన అరుపుల నుంచి మాటలు నేర్చిన రోజు, చిన్న మాటలతో జానపదాలను అల్లిన రోజు, భూమి నుంచి ధాన్యం పండించిన రోజు, 'కళ' ఆవిష్కరణ జరిగిన రోజు ఇవన్నీ గొప్పరోజులే. కవితలు, కళలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసిపోయి మానవ జీవితంతో పెనవేసుకున్నాయి. ఇప్పటి వరకు మనిషి చేసిన ప్రయాణంలో ప్రతి అంశం చాలా అపురూపమైంది. ఇవి మానవుడిని ఎప్పటికీ వదలనివి. మనిషి జీవనయానంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేసుకోవడానికి కళలను, కవితలను వినియోగించాడు. అవి సకల మానవాళికి దిశానిర్దేశం చేసి, మానవుడిని శాశ్వతుడిని చేస్తున్నాయి.

 

3. పొట్లపల్లి రామారావు రాసిన కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
      ఎన్ని దినములు నీవు
      ఇల గడిపినను ఏమి?
      ఎన్ని జన్మాలింక
      ఎదిరి చూచిన ఏమి?
      ఎన్నాళ్లకైన నీ
      ఔన్నత్యమును నీవె
      సాధించ వలెనోయి
      శోధించ వలెనోయి!
      నీలోన వెలుగొందు
      నీ స్వశక్తిని మరచి
      పరుల పంచల జూడ
      ఫలమేమి కలదోయి!

 

ప్రశ్నలు 

అ) పై కవితకు పేరు పెట్టండి.
జ: పై కవితకు పేరు 'సాధించు'.

 

ఆ) ఔన్నత్యాన్ని పొందడానికి కవి ఏం చేయాలన్నాడు?
జ: రోజులు వృథా చేయకుండా ఉండాలి. శోధించాలి, స్వశక్తిని నమ్మాలి. అప్పుడే ఔన్నత్యాన్ని పొందుతాం.

 

ఇ) స్వశక్తికి, ఇతరులపై ఆధారపడటానికి మధ్య తేడా ఏమిటి?
జ: స్వశక్తి అంటే తన సొంత శక్తితో సాధించడం. ఇతరులపై ఆధారపడితే ఫలమేమీ దక్కదు.

 

ఈ) 'పరుల పంచ' అనే పదంతో సొంత వాక్యాన్ని రాయండి.
జ: పరుల పంచన ఉండటం వల్ల సోమరితనం అలవాటు అవుతుంది.

 

4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
 

అ) 'మంత్రాలతో చింతకాయలు...' అని కవి వేటితో పోల్చాడు?
జ: *మంత్రాలకు చింతకాయలు రాలనట్టుగా పద్యం దాటికి చింతలు దూరం కావని పోల్చాడు. మంత్రాలు - పద్యాలు, చింతకాయలు - చింతలతో పోల్చాడు.
 * యంత్రాలతో జబ్బులు నయం కానట్టుగా మాయ మాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవన్నాడు.  యంత్రాలను మాయమాటలతో, జబ్బులను సామాజిక సమస్యలతో పోల్చాడు.

 

ఆ) కవి వేటిని శుభ దినాలని వర్ణించాడు?
జ: చక్రాన్ని కనుక్కున్న రోజు, నాలుగు గీతలతో లిపిని కనుక్కున్న రోజు, తప్పటడుగుల నుంచి తాండవం చేసిన రోజు, అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, చిన్న మాటలతో జానపదాలు అల్లిన రోజు, భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు, కళ ఆవిష్కరణ జరిగిన రోజు వీటన్నింటినీ శుభదినాలని కవి వర్ణించాడు. అంతేకాదు మానవ జీవ పరిణామ చరిత్రలో అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిదినమూ శుభదినమేనని చెప్పాడు.

 

ఇ) మానవుడిని శాశ్వతంగా నిలిపేవి ఏవి?
జ: కవితలు, కళలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి మానవ జీవితంతో పెనవేసుకున్నాయి. అవి అనంతమైన కాలం దారిలో అలుపు లేకుండా సాగుతున్న మానవుడిని వదలకుండా ఉన్నాయి. వాటితో మనిషి నడిచాడు, నడిపించాడు. తనకు ఎదురయ్యే అలసట, యాంత్రికతను దూరం చేసుకోవడానికి కళలు, కవితలను ఆశ్రయించాడు. మనిషి అంతరించినా అతడిలో పుట్టిన కళ, కవిత్వం, విజ్ఞానాలు అందరికీ దిశా నిర్దేశం చేస్తాయి. అవే మానవుడిని శాశ్వతంగా నిలుపుతున్నాయి.

 

ఈ) విద్వాన్ విశ్వం గురించి, ఆయన కవితా శైలిని తెలుపుతూ అయిదు వాక్యాలు రాయండి.
జ: * విద్వాన్ విశ్వం సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు.
   * అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు 1915లో జన్మించారు.
   * 'ప్రేమించాను' (నవల); 'ఒకనాడు', 'పెన్నేటి పాట' (కావ్యాలు) ఆయన రచనలు.
   * సరళమైన పదాలు, సహజ వాడుక భాషలో సూటిగా భావాన్ని వ్యక్తం చేసే వచన కవితలను అందించారు.
   *  మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధనా సంపత్తిని, తాత్వికతను హృద్యంగా చెప్పారు.
   * విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడని 'మాణిక్య వీణ' ద్వారా తెలియజేశాడు.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత
 

1. కింది ప్రశ్నలకు అయిదు వాక్యాల్లో జవాబులు రాయండి.
 

అ) చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన అంశాలేవి? ఇవి దేనికి ప్రతీకగా భావిస్తున్నారు?
జ: చక్రాన్ని మానవుడు కనుక్కున్న రోజు, నాలుగు గీతలతో లిపిని ఆవిష్కరించిన రోజు, నిప్పును సృష్టించిన రోజు, తప్పటడుగుల చిందుల నుంచి ఉన్నత నృత్యాలు చేసిన రోజు, మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపదాలు అల్లిన రోజు, పంట పండించుకున్న రోజు, మానసిక ఉల్లాసం కలిగించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు.... ఇవన్నీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన అంశాలని చెప్పవచ్చు.
   ఇవన్నీ రాతియుగపు చీకటిని చీల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించేందుకు ప్రతీకలు. సకల మానవాళికీ సృజనాత్మకతను చూపించాయి. మానవ అభివృద్ధికి దోహదపడ్డాయి.

 

ఆ) ''మిన్నులు పడ్డ చోటి నుంచి... తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు" అని కవి వర్ణించాడు. ఈ వాక్యాల మీద మీ అభిప్రాయమేమిటి?
జ: చిన్నవాడైన మానవుడు ఆకాశం నేలను తాకేచోటు నుంచి మెల్లిగా పెరిగి ఆకాశాన్ని అందుకున్నాడు అని కవి చెప్పాడు. దీనిపై నా అభిప్రాయం ఏమిటంటే మానవుడు మొదట ఆదిమ దశలో ఉండేవాడు. కళలు, విజ్ఞానం, కవిత్వం, ప్రజ్ఞానం ద్వారా అన్నీ తెలుసుకుని ఆధునిక దశకు చేరుకున్నాడు. బతుకుతో ముడివేసుకున్నాడు. వాటి ద్వారా అభివృద్ధిని సాధించాడు. విజ్ఞానమార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తే మనిషి శాశ్వతుడు అవుతాడు. మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అన్నది నా అభిప్రాయం.

 

ఇ) మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ: మానవుడు చక్రాన్ని, లిపిని కనుక్కున్న రోజు; మాటలు, పాటలను నేర్చిన రోజు, పంట పండించిన రోజు, కళలను ఆవిష్కరించిన రోజు .....ఇలా ప్రతిరోజూ శుభదినమే. ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు మానవుడు చేసిన ప్రయాణంలో ప్రతి అంశం ఎంతో అపురూపమైంది. కళలు, కవిత్వం, విజ్ఞానం అతడి వెంట ఉన్నాయి. వాటితో నడిచాడు, నడిపించాడు. అంటే ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా విజ్ఞానమార్గంలో నడిచి ప్రతిరోజు ఏదో సృజనాత్మకతను చూపుతూనే ఉన్నాడు. అందువల్ల మానవ చరిత్రలో మాములు రోజు అనేది లేదు. అన్నీ అసాధారణ శుభదినాలే ఉన్నాయని కవి అభిప్రాయం.

 

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
 

అ) మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
జ: అనంత మానవ ప్రస్థానంలో అలుపెరుగక సాగుతున్న మానవుడిని వదలకుండా నడిపించినవి - కళ, కవిత, విజ్ఞానం. మానవుడు కళ్లు తెరవగానే తన చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. దాన్ని తన కనుసన్నల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగులు, ధ్వనులను అనుకరించాడు. చిత్రలేఖన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు అనుగుణంగా కాలికి గజ్జెకట్టి పాటలు పాడి ఆనందిస్తూ ప్రకృతిని ఆరాధించాడు. మానవుడు అన్నింటిని కనుక్కున్నాడు. మానవ జీవపరిణామ చరిత్రలో ప్రతిరోజును కళ, కవిత, విజ్ఞానం ప్రభావితం చేశాయి. మానవుడికి జీవనయానంలో ఎదురయ్యే అలసట, యాంత్రికతను ఇవి దూరం చేశాయి. మానవుడి నడిపించాయి. బతుకుతో ముడివేసుకున్నాయి. చిన్న మానవుడిని కళలు, విజ్ఞానం కాంతులతో శాశ్వతుడిని చేశాయి. 
    కళలు, కవితలు, విజ్ఞానం మానవుడిని విజ్ఞానమార్గంలో పయనింపజేశాయి. కళలు నేడు వికసించాయి. కవిత్వం జనాల్లో నాటుకుపోయింది. విజ్ఞానంలో మానవుడు ఆధునాతనను సాధించాడు. అవే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. మానవాళికి దిశానిర్దేశం చేస్తున్నాయి. మనిషి కాలగర్భంలో కలిసినా అతడి మేధోబలంతో ఆవిష్కృతమైన కళ, కవిత, విజ్ఞానం వచ్చే తరాలకు బాటలు వేస్తున్నాయి. అందుకే మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించిన తీరును సమర్థిస్తాను.

 

ఆ) 'మాణిక్యవీణ' కవితా సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జ: మంత్రాలతో చింతకాయలు రాలనట్టే పద్యాలు పాడితే బాధలు దూరంకావు. యంత్రాలతో రోగాలు తగ్గనట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు తొలిగిపోవు. కడుపులోని క్యాన్సర్‌లా సామాజిక అసమానతలనే రోగాలు కళ్ల ముందు కనిపిస్తూ కలవర పెడుతున్నాయి. మనిషి పుట్టగానే ప్రకృతి అందాలు చూసి పరవశించాడు. దాన్ని తన కనుసన్నల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు. గుహల్లో జీవించిన ఆదిమానవుడు చిత్రలేఖన నైపుణ్యం పెంచుకున్నాడు. తన గానంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు అనుగుణంగా గజ్జెకట్టి చిందులేశాడు. హత్తుకునే పాటలు పాడాడు. కళలను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు.
    చక్రాన్ని కనుక్కున్న రోజు ఎంత ప్రముఖమైందో, లిపి కనుక్కున్న రోజు అంతకంటే విశేషమైంది. నిప్పును కనిపెట్టిన రోజు ఎంత గొప్పదో ఉన్నత నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. మాటలు నేర్చిన రోజు, జానపదాలు అల్లిన రోజు, పంట పండించిన రోజు, కళ ఆవిష్కరణ జరిగిన రోజు... ఇలా అన్నీ గొప్ప రోజులే.
    మానవ జీవితంలో కవితలూ, కళలూ, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసి పెనవేసుకున్నాయి. ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రతి అంశం ఎంతో అపూరూపమైంది.
    చిన్నవాడైన మానవుడిని కళలు, విజ్ఞాన కాంతులు నేల నుంచి ఆకాశానికి చేర్చి శాశ్వతుడిని చేశాయి. మానవ జీవన ప్రస్థానంలో కళలు, కవితలు విజ్ఞానం మానవుడిని విడిచిపెట్టలేవు. కళలు, కవితలను తన అలసట, యాంత్రికతను దూరం చేయడానికి అతడు ఆసరాగా చేసుకున్నాడు. కళలు, కవిత్వం, విజ్ఞానం వీటన్నింటిని మనిషే నడిపించాడు. వాటితోనే నడిచాడు. అవి మనిషి కాలగర్భంలో కలిసినా సకల మానవాళికి దారి చూపుతాయి. అవి మనిషిని శాశ్వతుడుగా చేస్తున్నాయి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
 

అ) నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో మానవ జీవితంలోని మార్పులను, అభివృద్ధిని వర్ణిస్తూ పది పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవితను రాయండి.
జ: మనిషే మహనీయుడు
      పచ్చని చెట్లు పైరగాలి హొయలు
      ఆప్యాయతానురాగాలు
      అందించును పరిసరం
      చిందింపజేసేను మానవుడు
      ఆహారపు అలవాట్లను
      కొత్తవైన రుచులతో
      స్వీకరించె నైజాన్ని
      కలగజేయు కృషీవలుడు
      వేషభాషలలోని సౌందర్యాన్ని
      వెదజల్లిన మహామనిషి
      శాస్త్రసాంకేతికతను
      సకలజనులు మెచ్చేలా
      నడిపించిన మేధావి
      అధునాతన వైద్యాన్ని
      మారుతున్న కాలానికి
      మైమరచే తీరుగా
      మదినిండా అందించే ఆప్యాయుడు
      ప్రకృతినే పరమావధిగా
      కళాభిరుచినే కళాత్మకంగా
      కొనసాగించిన సాత్వికుడు
      వేవేల మార్పులను
      విరచించి ఒదిగించిన
      మహామహుడు
      కలగలపిన కొత్తతనం
      నీవిచ్చిన నిండుతనం
      మేటియైన చిక్కుముడులను
      విడమరిచిన తీరుతో
      అందించిన విశాలుడు
      సంవృద్ధే ధ్యేయంగా
      అధునాతనను కలగలిపి
      అభివృద్ధి బాటలై
      అందించి సిరులను
      పూయించిన మానవుడే
      మహామనిషి.

 

3. ఆ) విద్వాన్ విశ్వం కవితా శిల్పాన్ని ప్రశంసిస్తూ మిత్రుడికి లేఖ రాయండి.
జ:

మిత్రుడికి లేఖ
 

మెదక్, 

తేది: 24.3.2015 

ప్రియమైన స్నేహితుడు భాస్కర్‌కు,
     నీ ప్రియమిత్రుడు శ్రీధర్ రాయునది. నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావని తలచుచున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. విద్వాన్ విశ్వం కవితా శిల్పం గురించి అడిగావు. ఆయనకు సంబంధించిన వివరాలు పంపుతున్నాను.
విద్వాన్ విశ్వం సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు. ఆయన వివిధ పత్రికల్లో పనిచేశారు. పత్రికా సంపాదకుడిగా 'అవి-ఇవి' 'తెలుపు-నలుపు' 'మాణిక్యవీణ' లాంటి శీర్షికలతో రచనలు చేశారు. అనేక అవార్డులు పొందారు. సరళమైన పదాలను ఉపయోగించి వాడుక భాషలో సూటిగా భావాన్ని వ్యక్తం చేసే గొప్పకవి.
     విద్వాన్ విశ్వం రాసిన 'మాణిక్యవీణ' కవితల్లో ఆయన స్వీకరించని అంశంలేదు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయని, మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. ఈ కవిత చారిత్రక ఘట్టాలను తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. ఈ కవిత నాకు చాలా నచ్చింది. నేను లేఖతోపాటు ఈ కవితను జతచేసి పంపుతున్నాను. చదవగలవు.

 

ఇట్లు

నీ ప్రియమిత్రుడు, 

ఆర్. శ్రీధర్. 

 

చిరునామా:
జి. భాస్కర్, 
S/o అంజి రెడ్డి,
ఖాజీపూర్,
వరంగల్ జిల్లా.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌