• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాణిక్య వీణ

- విద్వాన్‌ విశ్వం

రచయిత పరిచయం:
 విద్వాన్ విశ్వం 1915లో అనంతపురం జిల్లా 'తరిమెల' గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సంస్కృత భాషలోని పలు గ్రంథాను తెలుగులోకి అనువదించారు. పత్రికా సంపాదకుడిగా 'అవి - ఇవి', 'తెలుపు - నలుపు', 'మాణిక్యవీణ' లాంటి శీర్షికలు పెట్టి ఎంతో పేరు పొందారు. భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు రాశారు. 'ప్రేమించాను' అనే నవల,  'ఒకనాడు', 'పెన్నేటి పాట' అనే కావ్యాలు రాశారు.
 ''ఇంతమంచి పెన్నతల్లి
 ఎందుకిట్లు మారెనో?
 ఇంతమంది కన్నతల్లి
   ఎందుకెండిపోయెనో?" అని ఆవేదనతో 'పెన్నేటిపాట'ను సృజించిన మానవీయ కవి.
* కళాప్రపూర్ణ, డి.లిట్ పట్టాలను అందుకున్నారు. విద్వాన్ విశ్వం రాయలసీమ జీవన గతికి అద్దం పట్టారు. 1987లో మరణించారు.
 

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం
   'ఆంధ్రప్రభ' వార పత్రికలో విద్వాన్ విశ్వం 'మాణిక్యవీణ' శీర్షికతో వ్యాసాలు, కవితలు రాశారు. 'మాణిక్యవీణ'లో విద్వాన్ విశ్వం అనేక అంశాలను పొందుపరిచారు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయనీ, మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాలను పలికించింది ఈ కవిత. చారిత్రక ఘట్టాలను తరచి చూపి మనిషి శాశ్వత తత్వాన్ని తెలుపుతుంది.
  నేటి తరం సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటోంది. కళలను, సాహిత్యాన్ని ఉపేక్షిస్తోంది. మానవ జీవితంతో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ, విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడని తెలపడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
* మాణిక్యవీణ పాఠ్యభాగం 'వచన కవిత' అనే సాహిత్య ప్రక్రియకు చెందింది.
* వచన కవిత అంటే పద్యాలు, గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవిత.
* చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండేదే వచన కవిత.

ప్రవేశిక
  ఆధునిక యుగంలో వచన కవిత ఒక ముఖ్యమైన సాహిత్య ప్రక్రియ. ఇది ఛందోబద్ధత లేని కవితా ప్రక్రియ. సరళమైన పదాలు, సహజమైన వాడుక భాష, సూటిగా భావాన్ని వ్యక్తంచేసే వచన కవిత ద్వారా ఎందరో కవులు లోతైన భావాలను తేలికగా అందించారు.

పద్యాలు - అర్థాలు
 

1. మంత్రాలతో చింతకాయలు
   రాలనప్పుడు పద్య
   సంత్రాసంతో చింతలు
   పారిపోతాయా?
      యంత్రాలతో జబ్బులు
      నయం కానప్పుడు
      తంత్రాలతో సమాజ రుగ్మతలు
      దారికి వస్తాయా?
      అంటే అనవచ్చు,
      ఔనని కొందఱతో
      అనిపించనూ వచ్చు

అర్థాలు

మంత్రాలతో చింతకాయలు =           మంత్రం వేస్తే చింతచెట్టు మీద ఉన్న చింతకాయలు
రాలనప్పుడు =    రాలనట్లు
పద్య సంత్రాసంతో =    పద్యాలు పాడటమనే మిక్కిలి భయంతో (పద్యాలు పాడితే)
చింతలు =    కష్టాలు
పారిపోతాయా =    దూరం అవుతాయా?
యంత్రాలతో =    యంత్రములతో
జబ్బులు =    రోగాలు
నయం కానప్పుడు =    తగ్గనప్పుడు
తంత్రాలతో =    ఉపాయాలతో (మాయ మాటలతో)
సమాజ రుగ్మతలు =    సామాజిక సమస్యలు
దారికి వస్తాయా? =    తీరుతాయా? (తొలగిపోవా?)
అంటే అనవచ్చు =    చెప్తే చెప్పవచ్చు
ఔనని  =      ఈ మాటలు సరైనవి
కొందఱతో =      కొందరితో
అనిపించనూ వచ్చు =      ఔను అని చెప్పించవచ్చు

  
భావం: మంత్రాలతో చింతకాయలు రాలనట్టే పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయ మాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు. ఈ మాటను కొందరు ఆమోదిస్తారు, కొందరు ఆమోదించినట్లు నటిస్తారు. (చింతలు, సామాజిక సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవమైన కార్యాచరణ, నిబద్ధత, అంకితభావం ఉండాలి.)

2. పొట్టలోని పుట్టకురుపుతో సంఘం
   అనిపించనూ వచ్చుకట్టెదుట కళవళపడి పోతుంటే
   నిట్టనిలువున రోదసిలోనికి
   కట్టలు కట్టుకొని దూసుకొనిపోయి
   కట్టుకొని పోయేదేమిటని
      అంటే అననూవచ్చు
      ఔనని కొందఱతో
      అనిపించనూ వచ్చు

అర్థాలు

పొట్టలోని =         కడుపులోని
పుట్టకురుపుతో =     రాచపుండుతో
సంఘం =     సమాజం
కట్టెదుట =     కళ్ల ముందు
కళవళపడిపోతుంటే =     తొట్రుపాటు పెడుతుంటే (కలవరం)
నిట్టనిలువున =     సరైన నిలుచున్న మార్గం
రోదసిలోనికి =       అంతరిక్ష ప్రయాణంలోనికి
కట్టలు కట్టుకొని =     అనేకం తీసుకుని 
దూసుకొనిపోయి =     పైకి పోయి
కట్టుకొని పోయేది =      సాధించడం వల్ల వెళ్లేది
ఏమిటని =     ఏమిటి అని
అంటే అనవచ్చు =     ఆ విధంగా అనవచ్చు 
ఔనని =     నిజమే అని
కొందఱతో =       కొంతమందితో
అనిపించనూవచ్చు =     చెప్పించవచ్చు


భావం: ఒకవైపు కడుపులోని భయంకరమైన వ్యాధి (వ్రణం) లా సామాజిక అసమానతలనే రోగాలు కళ్లముందు కనిపిస్తూ కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతరిక్ష ప్రయాణాల్లో అభివృద్ధిని సాధించడం వల్ల ఒరిగిందేమని కొందరు అనవచ్చు. ఇంకొందరితో ఒప్పించనూవచ్చు. శాస్త్రసాంకేతిక ప్రగతితో సమానంగా సామాజిక జీవనశైలి ఎదగడంలేదని, సగటు జీవి జీవనం ఇంకా పాతాళంలోనే ఉందని కవి భావన.

3. మనిషి కనువిచ్చినప్పుడే
   వాని అందచందాలు చవిగొన్నాడు.
 

అర్థాలు

మనిషి =          మానవుడు
కనువిచ్చినప్పుడే =     కనులు తెరిచినప్పుడే (పుట్టిన వెంటనే)
వాని =     తన చుట్టూ ఉన్న
అందచందాలు =     ఆ ప్రకృతి అందాలను
చవిగొన్నాడు =     చూసి పరవశించాడు

  
భావం: మనిషి కళ్లు తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు.

4. ఆనాడే ప్రకృతిని
   అధీనం చేసుకోవడానికి
   అందలి రంగులనూ రవళినీ
    అనుకరించడానికీ కూడా ఆయత్తమయినాడు.
 

అర్థాలు

ఆనాడే =         అప్పుడే (ఆ ప్రకృతిని చూసినప్పుడే)
ప్రకృతిని =      ప్రకృతిని
అధీనం =     తన కనుసన్నల్లోకి
చేసుకోవడానికి  =    తీసుకోవడానికి
అందలి రంగులనూ =    ప్రకృతిలోని అన్ని రంగులను
రవళినీ  =    చప్పుడులను
అనుకరించడానికీ =    తాను అలాగే చేయడానికి
కూడా   =    కూడా
ఆయత్తమయినాడు =    ప్రయత్నం చేశాడు


భావం: ఆ ప్రకృతిని చూసి పరవశించినప్పటి నుంచి దాన్ని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగులన్నింటినీ, రకరకాల ధ్వనులను అనుకరించే ప్రయత్నం చేశాడు. (పూర్తిగా ప్రకృతితో తాదాత్మ్యం చెందాడు).

5. గుహలలో నివసించేవాడే
   గోడలపై గుర్రాలూ, జింకలూ గీసుకున్నాడు...

అర్థాలు

గుహలలో =      గుహల్లో
నివసించేవాడే  =    జీవించిన ఆదిమానవుడే
గోడలపై =    గోడల మీద
గుర్రాలూ =    గుర్రాలను
జింకలూ =    జింకలను
గీసుకున్నాడు  =    చిత్రించాడు


భావం: గుహల్లో జీవించిన ఆదిమానవుడే గుర్రాలు, జింకలను ఆ గుహల గోడల మీద గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు.

6. కాడు వీడనప్పుడే
   మోడులు చివురించేలా
   పాడడం ఆరంభించినాడు
   గులకఱాల ములుకుమీదే
   గొబ్బున కాలికి గజ్జె కట్టినాడు
అర్థాలు

కాడు వీడనప్పుడే =      ఆటవిక జీవనంలో ఉన్నప్పుడే
మోడులు =    ఆకురాలిన వృక్షం
చివురించేలా =    చిగురించేలా
పాడడం =    పాటలు పాడటం
ఆరంభించినాడు =    మొదలు పెట్టినాడు
గులకఱాల  =    గులక రాతి
ములుకు మీదే =    కొన భాగంపై
గొబ్బున   =    వెంటనే
కాలికి =    కాలికి
గజ్జె కట్టినాడు  =    గజ్జెకట్టి ఆడినాడు


భావం: ఆటవిక జీవన దశలోనే తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు అనుగుణంగా కఠినమైన రాతి నేలపై కాలికి గజ్జెకట్టి చిందులేశాడు.

7. దిక్కులు పిక్కటిల్లేలా
   ఘీంకరించుటే కాదు
   మొక్కలు నిక్కి చూచేలా
   చక్కని నొక్కులతో
   చిక్కని పదాలు పాడుకొన్నాడు.
 

అర్థాలు

దిక్కులు =         నలువైపుల ఉన్న దిక్కులన్నీ
పిక్కటిల్లేలా =     గర్జించేలా
ఘీంకరించుటేకాదు =     అరవడమే కాదు
మొక్కలు  =     చెట్లు
నిక్కి చూచేలా =     పైకి చూసేలా
చక్కని నొక్కులతో  =     అందమైన స్వరాలతో
చిక్కని పదాలు =     ఒత్తయిన పదాల సమాహారంగా
పాడుకొన్నాడు  =     పాటలు పాడుకున్నాడు


భావం: నలువైపులుగా ఉన్న దిక్కులన్నీ అన్ని ప్రతిధ్వనించేలా గర్జించడమే కాదు, చెట్లు పైకెత్తి చూసేలా స్వరాల సుకుమారపు నొక్కులతో హత్తుకునే పాటలు పాడాడు మనిషి.

8. చక్రం కనుక్కున్న రోజెంత
   చరిత్రలో ప్రముఖ దినమో
   చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం
   విరచించిన రోజు అంతే ప్రముఖం
   నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో
   తప్పటడుగులు మాని
   తాండవం చేసిన నాడు అంతే శుభదినం.
 

అర్థాలు

చక్రం కనుక్కున్న = చక్రాన్ని కనుక్కున్న
రోజెంత = ఆ రోజు ఎంత
చరిత్రలో = చరిత్రలో
ప్రముఖ దినమో = గొప్ప రోజో
చరచరా = చకచకా
నాలుగు గీతలు = నాలుగు గీతలు గీసి
ఓ ఆకారం = ఒక రూపంగా (అంటే లిపి)
 విరచించిన రోజు = రాసిన రోజు
అంతే ప్రముఖం = అంతే గొప్ప
నిప్పును = అగ్గిని
కనుక్కున్న = కనుగొన్న 
నాడెంత (నాడు + ఎంత) = ఆనాడు ఎంత
శుభదినమో = గొప్ప రోజో 
తప్పటడుగులు = సరిగా నడవని పాదాలు
మాని =         చక్కగా ఉండి
తాండవం =     నృత్యాలు
చేసిననాడు =     చేసిన రోజు
అంతే శుభదినం  =     అంతే గొప్ప సుదినం

 
భావం: చక్రాన్ని కనుక్కున్న రోజు చరిత్రలో ఎంత ప్రముఖమైందో, చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కున్న రోజు అంతకంటే విశేషమైంది. చక్రం మానవ చలనానికి దోహదపడితే, లిపి భావ సంచలనానికి వేదికై సృజనాత్మక ప్రపంచంలోకి దారి చూపింది. నిప్పును కనుక్కున్న రోజెంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుంచి ఉన్నత నృత్యాలు చేసిన రోజూ అంతే గొప్పది.

9. కిలకిలలు మాని కలభాషలు నేర్చుకున్నరోజు
   అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు
   కలమ ధాన్యం పండించుకున్న రోజు
   కళలను పండించుకున్న రోజు
   అన్నీ గొప్ప రోజులే
   మానవ చరిత్రలో
   అన్నీ అసాధారణ పర్వదినాలే

అర్థాలు

కిలకిలలు మాని =       మనిషి అరుపులు మాని
కలభాషలు =     అర్థవంతమైన మాటలు
నేర్చుకున్న రోజు =    నేర్చిన రోజు
అలతి మాటలతో =    చిన్న చిన్న మాటలతో
పదాలల్లుకున్న రోజు =    జానపదాలు అల్లిన దినం
కలమ ధాన్యం =    వరి పంట
పండించుకున్న రోజు =    పండించిన దినం
కళలను =    కళలన్నింటినీ
పండించుకున్న రోజు =    ఆవిష్కరించుకున్న దినం
అన్నీ గొప్ప రోజులే =    అవన్నీ గొప్ప రోజులే
మానవ చరిత్రలో =    మానవ జీవన పరిణామ చరిత్రలో
అన్నీ  =    అన్నీ
అసాధారణ =    గొప్ప
పర్వదినాలే  =    శుభదినాలే!

 
భావం: అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపదాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు, మానసిక ఉల్లాసం కలిగించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు... ఇలా ఒకటేమిటి, అన్నీ గొప్ప రోజులే! మానవ జీవిత పరిణామ చరిత్రలో నిలిచిన అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిరోజూ శుభదినమే!

10. అలా అలా కలగలిపి
   పెనవేసుకొని
   కళలూ కవితలూ
   విజ్ఞానం ప్రజ్ఞానం
   తళతళలతో తన్ను నడిపింపగా
 

అర్థాలు

అలా అలా కలగలిపి =          అన్నీ కలిసిపోయి
పెనవేసుకుని =      చుట్టుకుని
కళలూ, కవితలూ  =    కళలన్నీ, కవితలన్నీ
విజ్ఞానం =    విజ్ఞానం
ప్రజ్ఞానం =    విశేష ప్రతిభతో కూడిన జ్ఞానం
తళతళలతో =    మెరుపులతో
తన్ను నడిపింపగా =    మనిషిని తీర్చిదిద్దగా


భావం: కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసిపోయి మానవ జీవితంతో పెన వేసుకున్నాయి. ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రయాణంలో ప్రతి అంశం మనిషిని తీర్చిదిద్దింది.

11. మిన్నులు పడ్డ చోటునుండి
    తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న
    చిన్నవాడు మానవుడు
    చిరంజీవి మానవుడు
    చిరంతనుడు మానవుడు

అర్థాలు

మిన్నులు =    ఆకాశం
పడ్డ చోటు నుండి =    నేలకు దిగిన స్థలం నుంచి
తిన్నగా =    నెమ్మదిగా
ఎదిగి =    పెరిగి
మిన్నందుకుంటున్న =    ఆకాశాన్ని అందుకున్న
చిన్నవాడు మానవుడు =    చిన్న మానవుడు
చిరంజీవి  =       చిరకాలం జీవించే
మానవుడు =    మనిషి
చిరంతనుడు =    శాశ్వతుడు
మానవుడు =      ఈ మనిషి

  
భావం: ఆకాశం నేలకు దిగిన స్థలం నుంచి నెమ్మదిగా పెరిగి కళలు, విజ్ఞాన కాంతులతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన చిన్న మానవుడే శాశ్వతుడయ్యాడు.

12. అనాదిగా నడుస్తున్న ఈ
    మహాప్రస్థానంలో
    అతగానిని వదలని
    జతలు కళా కవితా
    జ్ఞానం విజ్ఞానం
       వానితో నడిచేవీ
       వానిని నడిపించేవీ అవే-
       అవే కళా కవితా
       జ్ఞానం విజ్ఞానం
       ప్రజ్ఞానం.

అర్థాలు

అనాదిగా =      అనంతమైనకాలం దారిలో
నడుస్తున్న =     సాగుతున్న
మహాప్రస్థానంలో =    దీర్ఘ ప్రయాణంలో
అతగానిని =    మానవుడిని
వదలని =    వదిలి పెట్టని
కళా కవితా =    కళలు - కవితలు
జ్ఞానం =    తెలివిని పెంచేవి
విజ్ఞానం =    శాస్త్రాలు
వానితో నడిచేవి =    మనిషితోనే ఉండేవి
వానిని నడిపించేవీ అవే =    ఆ మనిషిని సక్రమంగా ఉంచేవి పైవన్నీ
అవే =    అన్నీ
కళా కవితా =    కళలు - కవితలు
జ్ఞానం =    తెలివి
విజ్ఞానం =    శాస్త్రం
ప్రజ్ఞానం  =    విశేష ప్రతిభతో కూడిన జ్ఞానం

 
భావం: అనంతమైన కాలం దారిలో అలుపెరగక సాగుతున్న జీవన ప్రస్థానంలో మానవుడిని వదలనివి కళలు, కవితలు. జ్ఞాన విజ్ఞానాలు. తన జీవన యానంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేయడానికి కళలను, కవితలని ఆలంబనగా చేసుకున్నాడు. విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు. వీటితోనే నడిచాడు, నడిపించాడు కూడా. మనిషి కాలగర్భంలో కలిసినా అతడి మేధలోంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికీ దిశానిర్దేశం చేశాయి. మానవుడిని శాశ్వతుడిని చేస్తున్నాయి.

రచయిత: అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌