• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోరంత దీపాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఆలోచించండి - చెప్పండి

1. తల్లిప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జ: తల్లి ప్రేమను నిర్వచించలేం. ఆమె ప్రేమ కమనీయమైంది. బిడ్డలను లాలిస్తుంది. బుజ్జగిస్తుంది. మాటలు నేర్పుతుంది. మంచి నడవడి నేర్పిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. తాను తినకుండా దాచి బిడ్డలకు పెడుతుంది. సేవలు చేయడంలో తల్లిని మించినవారు ఎవరూ ఉండరు. కావాల్సినవి సమకూర్చిపెడుతుంది. అన్నివేళలా, అన్నివిధాల ప్రోత్సహిస్తుంది.

 

2. వినయంతో నిలబడటం, వేషంలో సంస్కారం అంటే మీకేం అర్థమైంది?
జ: గౌరవం, భక్తిభావం ఉండి హృదయపూర్వకమైన లొంగుబాటుతో నిలబడి ఉండే దాన్ని 'వినయంతో నిలబడటం' అని అర్థమైంది. మన దుస్తులు, అలంకరణ మన స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. మన సరైన వేషధారణ వల్లే ఎదుటివారిలో మనపట్ల మంచి భావం ఏర్పడుతుంది. మన వేషధారణ మన నడవడికకు ప్రతీక.

 

3. అనిర్వచనీయమైన కృతజ్ఞతా భావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జ: మాటలతో చెప్పలేని  కృతజ్ఞతా భావాన్ని మనకు ఎవరైనా  జీవితంలో మరచిపోలేని  సాయం చేసిన వారిపట్ల ప్రదర్శిస్తాం. ఎందుకంటే ఆ సాయాన్ని పొందిన భావాన్ని మరవకూడదనే ఉద్దేశంతో అలా చేస్తాం. కృతజ్ఞతాభావం ఉండటం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.

4. మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
జ: బడి, ఇల్లు ప్రశాంతతకు  మారుపేరుగా  ఉండాలంటే అల్లరి  పనులు  చేయరాదు. అందరినీ  గౌరవించాలి. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు చెప్పిన పనులు వెంటనే చేయాలి.
 బడిలో తోటి విద్యార్థులకు సహాయం చేయాలి. క్రమశిక్షణతో ఉండాలి. సమయాన్ని వృథా చేయరాదు. అబద్ధాలు చెప్పవద్దు. ప్రతి చిన్న విషయానికి ఏడవటం, అరవడం చేయకూడదు. మంచి పనులు చేయాలి.

5. విద్యాలయం ఆవరణం కనుల పండువగా ఉంది కదా? మీ కంటికి కనుల పండువగా ఏమేం గోచరిస్తాయి?
జ: నా కంటికి కన్నుల పండువగా గోచరించేవి...
 ఆకాశంలో విహరిస్తున్న పక్షుల గుంపు
 పువ్వులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన గుడి
 నదుల పరవళ్లు
 ఏకరూప దుస్తులతో నాట్యం చేస్తున్న సందర్భం
 బతుకమ్మ పండగ సందర్భంగా బతుకమ్మలు పెట్టి వాటి చుట్టూ ఆడటం
 ఆకాశంలో వెలువడే ఇంద్రధనస్సు
 దేవాలయంలో దేవుడికి జరిగే పూజ

6. 'పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షర సత్యాలు' ఎందుకో వివరించండి.
జ: పెద్దల మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే వారు జీవితం నుంచి గ్రహించిన మాటలే మనకు చెబుతారు. ఎలా బతకాలి, ఏయే సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి. సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి మొదలైన విషయాలు చెబుతారు. అవన్నీ సత్యమైన విషయాలు. గడిచిన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక అనుభవం. అనుభవంలోని ప్రతి అక్షరం భవిష్యత్తుకు మార్గాన్ని సూచిస్తుంది. అనుభవంలోని మంచిని, చెడును, కష్టసుఖాలను అర్థం చేసుకుని బతకవచ్చు. సంతోషాలను పొందవచ్చు. అందుకే పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షర సత్యాలు.

 

7. సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జ: మనం చేయాలనుకున్న పని అనుకోకుండా అకస్మాత్తుగా జరిగితే దాన్ని సమయం కలిసి రావడం అంటాం. ఒక పనిని - మాట్లాడుతున్న మాటల సందర్భంలో చెప్పి చేయించుకోవచ్చు. వేరే పని జరుగుతున్న సందర్భంలో చేయించుకోవచ్చు. ఇలాంటి వాటిని సందర్భం కలిసి రావడం అంటారు.
ఉదాహరణకు
 నాకు 9వ తరగతి వార్షిక పరీక్షల సమయంలో పరీక్షలు వరుసగా ఖాళీ లేకుండా వచ్చాయి. కానీ గణితానికి ముందురోజు ఆదివారం వచ్చింది. నేను ఊపిరి పీల్చుకుని సమయం కలిసి వచ్చిందని సంతోషపడి ఆ రోజంతా చదివి సోమవారం గణితం పరీక్ష చక్కగా రాశాను.
 నాకు హైదరాబాద్‌లో ఉన్న బిర్లా మందిర్ అంటే చాలా ఇష్టం. కానీ చూడలేకపోతున్నాను అనుకున్నాను. ఇటీవల మా సోదరుడి వివాహం నిమిత్తం బిర్లా మందిర్ పక్కన ఉండే వీధికి వెళ్లాను. ఆ సందర్భం కలిసిరావడం వల్ల బిర్లామందిర్ చూడగలిగాను.
 నాకు పాటలు పాడటం చాలా ఇష్టం. జిల్లాస్థాయి పాటల పోటీ జరిగింది. పాటల పోటీకి ఎవరు వస్తారని మమ్మల్ని మా ఉపాధ్యాయులు అడిగారు. సమయ సందర్భాలు కలిసి వచ్చాయని భావించి 'నేను వస్తాను' అని అన్నాను. అలాగే వెళ్లాను. జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది.

8. 'తెలుగువారికి తెలుగు అంటే బోలెడంత అభిమానం'. దీని గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జ: తెలుగువారికి తెలుగంటే బోలెడు అభిమానం. ఇది నిజమే. మన తెలుగు ప్రాంతం వదలి ఇతర ప్రాంతంలో ఉన్నవారు 'తెలుగు భాష' ప్రాతిపదికగా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉండేవారు తెలుగు సినిమాలే ఎక్కువగా చూస్తారు. మన మాతృభాష తెలుగు. మన అమ్మ అంటే ఎంత అభిమానం ఉంటుందో   తెలుగు అంటే కూడా అంత అభిమానం ఉండాలి. పై వాక్యాన్ని సార్థకత చేసే విధంగా అందరూ  ప్రయత్నించాలి. ప్రభుత్వం తెలుగు ప్రాధాన్యాన్ని గుర్తించాలి. తెలుగువారికి ఇంకా అభిమానం పెరగాలంటే విభిన్న కార్యక్రమాల రూపకల్పన జరగాలి.

 

9. పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జ: పిల్లలు తమకు కావాల్సిన అవసరాల కోసం అంటే పుస్తకాలు కావాలనో వచ్చి ఉంటారు లేదా ఆడుకోవడానికి అనుమతి కోసమో వచ్చి ఉంటారు. ఆయన వారికి లాలిస్తున్నట్టు నవ్వుతూ మీ అవసరాలు తీరుస్తానని మాట్లాడి ఉంటారు. ఆడుకోవడానికి అనుమతి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి ఉంటారు. అమాయకులైన పిల్లలు ఆనందంగా పరిగెత్తడాన్ని ఆయన అలానే చూస్తూ వారి గురించి మనసులో పరిపరి విధాల ఆలోచిస్తూ నవ్వుకున్నారు.

 

10. కథల పుస్తకాలు/ ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జ: కథల పుస్తకాలు/ ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారంటే కథకు అనుగుణంగా బొమ్మలు ఉంటే ఆ కథ తొందరగా అర్థమవుతుంది. ఆకర్షణీయమైన బొమ్మలు ఉంటే పుస్తకాలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. పాత్రలకు తగ్గట్టుగా బొమ్మలు ఉంటాయి కాబట్టి ఆ బొమ్మలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలుగుతాం. కథల్లో లేదా ఇతర పుస్తకాల్లోని బొమ్మలు గొప్ప అనుభూతులను మనసులో మెదిలింపజేస్తాయి. బొమ్మలు మనలో ఆనందాన్ని కలిగిస్తాయి.

 

11. వృద్ధుడిని ఆకట్టుకున్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఆయన ఎలాంటి అనుభూతిని పొందాడు?
జ: వృద్ధుడిని ఆకట్టుకున్న బొమ్మ - 'రైలు పెట్టెలో అడుక్కునే ఓ కుర్రవాడు చేయి చాపి నిలబడిన తీరు... వాడి చూపుల్లో కొట్టొచ్చినట్లున్న జోరు'.
ఆ బొమ్మను చూసి వృద్ధుడికి ఆ కథను చదవాలన్న అనుభూతి మనసులో మెదిలింది. ఆయన కాసేపు అరమోడ్పు కన్నులతో అలానే ఉండిపోయారు.

 

12. వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జ: వారపత్రికలో వృద్ధుడు రైలు ప్రయాణంలో అడుక్కు తినే, అనాథ కుర్రవాళ్ల గురించి కథ చదివి ఉంటాడు. చిన్నతనంలోనే తమ జీవితంలో అనుభవింపదగిన వాటన్నింటికి దూరమైన బాలల కథను వృద్ధుడు చదివి ఉంటాడు.

 

13. రైలుపెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, 'ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో' అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జ: రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, 'ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో' అని వృద్ధుడు భావించడం సరైందే. ఎందుకంటే చిన్నారులు అమ్మా నాన్నలను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. పొట్ట కూటి కోసం వివిధ రకాలైన పనులు చేస్తున్నారు. చక్కటి బాల్యాన్ని అనుభవించలేకపోతున్నారు. చదువుకోవాల్సిన వయసులో రైలుపెట్టెల్లో పని చేస్తున్నారు.

 

14. 'ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగుతుంది'. ఈ వాక్యంతో మీరు ఏకీభవిస్తారా?
జ: ప్రయత్నం చేసి  ఫలితాలు సాధిస్తే  ఆనందం  కలుగుతుంది. ఎందుకంటే  ఆ  ప్రయత్నంలో  ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటికి ఎదురు నిలిచి ప్రయత్నం విఫలమైనా మళ్లీ ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తారు. ఆ ఫలితం సాధించిన ఆనందం గొప్పగా ఉంటుంది. దీంతో నేను ఏకీభవిస్తాను.

 

15. అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్లి చదువుకోవాలి కదా! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జ: అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్లి చదువుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో అలా జరగడం లేదు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తమ పేదరికం వల్ల పిల్లలను బడికి పంపక పనులకు వినియోగిస్తున్నారు. అందుకే చిన్నారులు బడికి వెళ్లలేకపోతున్నారు.

 

16. 'గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం' అంటే మీకేం అర్థమైంది? ఇది ఏయే సందర్భాల్లో జరుగుతుంది? మీ అనుభవాలు తెలపండి.
జ: 'గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం' అంటే మనకు ఏదైనా సంతోషం కలిగినప్పుడు కన్నీళ్లు అనుకోకుండా వస్తాయి. అమితమైన సంతోషంతో ఆనంద భాష్పాలు రాలతాయి. ఇది ప్రతిఫలం దక్కిన సందర్భంలో, ఆనందం ఎక్కువైనప్పుడు, కాలగర్భంలో కలిసిన విలువైన విషయాలు గుర్తుకు వచ్చినప్పుడు జరుగుతుంది.
అనుభవాలు
 నేను ఎనిమిదో తరగతిలో జాతీయ ఉపకార వేతనానికి అర్హత సాధించినప్పుడు గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో బయటికొచ్చింది.
 నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు జీవన నైపుణ్యాలపై పాటల పోటీ జిల్లా స్థాయిలో జరిగింది. చాలా శిక్షణతో కష్టపడి వెళ్లాం. బహుమతుల ప్రకటనలో మాకే ప్రథమ బహుమతి అని ప్రకటన చేయగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.

17. 'ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో?' అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జ: ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించాలి. తనకు తోచినంత సహాయం చేయాలి. వ్యక్తులు మారాలి. తన స్వార్థాన్ని విడిచిపెట్టాలి. గొప్పగా ఎదిగిన వ్యక్తులు సమాజంలోని సమస్యలను బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలి. సమాజం ఆనందంగా ఉంటుంది. సమాజం వ్యక్తుల సముదాయం. అది వ్యక్తులు బాధ్యతలను స్వీకరించే స్థితికి చేరాలి. అప్పుడే సుఖసంతోషాల లోగిళ్లు విలసిల్లుతాయి.

 

ఇవి చేయండి

I) అవగాహన - ప్రతిస్పందన
 

1. 'గోరంత దీపాలు' అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జ: 'గోరంత దీపాలు' అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉంది. ఎందుకంటే ఈ పాఠంలో వృద్ధుడు అనాథ బాలలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించాడు. చీకటి నిండిన వారి జీవితాల్లో వెలుగు నింపాడు. ఆ వెలుగును వారిలో ప్రసరింపజేశాడు. ఆ గోరంత దీపాలు కొండంత వెలుగును ఇచ్చాయి. స్ఫూర్తి నింపిన ఆ వృద్ధుడు, స్ఫూర్తి పొందిన కుర్రవాళ్లు సాధన చేసి గొప్ప వ్యక్తులుగా తయారు అయ్యారు. దీన్ని బట్టి 'గోరంత దీపాలు' శీర్షిక ఈ పాఠానికి సరిపోయింది. దీపం వెలుగు ఇచ్చినట్లుగా ఆ వృద్ధుడు అనాథ జీవితాలకు వెలుగునిచ్చాడు.

 

2. పాఠం చదివి 'వేపచెట్టు' గురించి వర్ణించిన వాక్యాలు ఏమేం ఉన్నాయి? వాటిని గుర్తించి రాయండి.
జ: పాఠంలో వేపచెట్టు గురించి వర్ణించిన వాక్యాలు -
 తల్లిప్రేమ లాంటి చల్లటి నీడనిచ్చేది వేపచెట్టు.
 దరిద్రుడి గుండెల్లో నుంచి పుట్టిన అంతులేని ఆశల్లా ఆ చెట్టు బోదె నుంచి పుట్టిన కొమ్మలు నాలుగు దిక్కులా వ్యాపించగలిగినంత మేర వ్యాపించాయి.
 కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా, పిందెలతో నిండుగా ఉన్నాయి.
 సహజంగా 'వేపచెట్టు' అని చెవిన పడటంతో 'చేదు' అనే భావన మనసులో మెదులుతుంది.
 రోజూ ఓ కాయ నమిలి మింగితే దీర్ఘవ్యాధులను నయం చేస్తుంది.
 పళ్లు తోముకునే పుల్లగా నోటి జబ్బులను పోగొడుతుంది.

3. పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాల్లో వేటి గురించి వివరించారో తెలపండి. ఆ పేరాల్లోని వివరణ/ వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.

జ:
 

4. కింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?
 

అ) అవును బాబూ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జ: పై వాక్యాన్ని విద్యానగరంలో మకుటం లేని మహారాజు, అందరినీ చేరదీసి దారి చూయిస్తున్న వృద్ధుడు, రచయితతో అన్నాడు. రచయిత విద్యానగరానికి వెళ్లినప్పుడు ఆ కుర్రవాడు తాను ఆ విద్యానగరంలోకి వచ్చిన రోజును (ఆ వృద్ధుడు రైలు పెట్టెలో పనిచేసి బతికే అనాథ కుర్రవాడిని చేరదీసి ఉన్నతుడిగా తయారుచేశాడు.) గుర్తుగా ఆ వృద్ధుడిని కలిసి తన ఆత్మీయతను పంచుకుంటున్నాడు. అప్పుడు ఆ వృద్ధుడి కన్నీళ్లు ఆ కుర్రవాడి పైపడి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంది. ఈ సందర్భంలో వృద్ధుడు ఆ కుర్రవాడి గురించి పైవిధంగా అన్నాడు.

 

ఆ) 'పెట్టమన్నచోటంతా కళ్లు మూసుకుని సంతకాలు పెడుతున్నాను. అనాథలైన పిల్లలు, వాళ్ల అథోగతికి దారి తీస్తే పుట్టగతులుండవు' ఇవి మాత్రం మనసులో పెట్టుకోండి!
జ: వృద్ధుడు, చిట్టా పుస్తకం తీసుకుని వచ్చిన వ్యక్తితో పై విధంగా అన్నాడు. రచయితతో వృద్ధుడు రైలుకు సంబంధించిన కథను చెబుతున్నాడు. అంతలో ఒక వ్యక్తి లావుపాటి పుస్తకాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆ వ్యక్తిని చూసి వృద్ధుడు 'రావయ్యా! రా?' అని పిలిచి అతడు చూపిన చోట సంతకాలు పెడుతూ వృద్ధుడు మాట్లాడిన మాటలివి.

 

ఇ) 'అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!'
జ: పై వాక్యాన్ని రచయిత వృద్ధుడితో అన్నాడు. వృద్ధుడు ఒక కుర్రవాడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించాడు. ఆ కుర్రవాడు పట్టుదలతో చదువుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. తాను ఆ వృద్ధుడి విద్యానగరంలో అడుగుపెట్టిన రోజున ప్రతిసారి వస్తుంటాడు. అలా వచ్చి వృద్ధుడి కాళ్లకు నమస్కరించేవాడు. అలా ఒకసారి నమస్కరించి ఆనందానుభూతిలో వృద్ధుడు, తాను ఉన్న సమయంలో రచయిత అక్కడికి వచ్చాడు. అది చూసి వృద్ధుడు 'ఎప్పుడొచ్చావు బాబూ!' అని అడిగిన సందర్భంలో రచయిత పైవిధంగా అన్నాడు.

 

ఈ) మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను.
జ: పై వాక్యాన్ని కుర్రవాడు వృద్ధుడితో అన్నాడు. వృద్ధుడు చేరదీసిన కుర్రవాడు ప్రయోజకుడయ్యాడు. ఆ విషయాన్ని వృద్ధుడు రచయితకు చెప్పాడు. 'ఏముంది బాబూ? పదిమందిలో ఒక్కడయ్యాడు. పట్టుదలతో చదువుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. ఓ ఇంటివాడిని చేశాను' అన్నాడు. ఉద్యోగంతో ఊరొదిలి వెళుతున్న కుర్రవాడు వృద్ధుడితో అన్న సందర్భంలోనిది ఈ వాక్యం.

 

ఉ) అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి అవి కొండంత వెలుగును ఇస్తాయి.
జ: పై వాక్యాలను వృద్ధుడు రచయితతో అన్నాడు. వృద్ధుడు కుర్రవాడిని చేరదీసి చదివించి ప్రయోజకుడిని చేశాడు. ఆ కుర్రవాడు వృద్ధుడి విద్యానగరంలోకి ప్రవేశించిన రోజునే పుట్టినరోజుగా భావించాడు. అడుక్కు తినేవాళ్లు అని పట్టించుకోకుండా ఉంటే అనామకులు అవుతారు. ఒకవిధంగా చెప్పాలంటే వాళ్లు కొడిగట్టిన దీపాలు. కాసంత సానుభూతి, ఓపికను రంగరించి కొడినలా తట్టేసి తగినంత చమురు పోసి ఒత్తిని ఎగదోయాలని చెప్పిన సందర్భంలో ఈ వాక్యాలను వృద్ధుడు రచయితతో అన్నాడు.

 

5. పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు... లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్లకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయమూర్తి.
వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్లయింది. వీరి జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు - గత పదేళ్లుగా ఆప్యాయాతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధిబాలల (స్ట్రీట్‌చిల్డ్రన్)కు అమ్మగా అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధిబాలలనే ఎక్కువగా చూసుకుంది.

 

ప్రశ్నలు 
 

అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జ: పోడూరి లక్ష్మీకాంతం విశాఖలో అనాథలను చేరదీసిన విషయం గురించి తెలియజేస్తుంది.

 

ఆ) పై పేరాలోని కీలక పదాలను ఏరి రాయండి?
జ: పై పేరాలోని కీలక పదాలు: జీవితానికి అర్థం, కన్నీరు తుడవడం, మానవత్వం, మానవీయమూర్తి, అమృతహస్తం, కన్నతల్లి ఒడి, పదేళ్లు, ఆప్యాయతానురాగాలు, వీధి బాలలు, అమ్మ.

 

ఇ) 'అమృతహస్తం' అనే పదానికి అర్థం ఏమిటి?
జ: అమృతం ప్రాణం పోస్తుంది. అనాథలకు ప్రాణం పోసే చేయి. అంటే సేవ చేసే చేయిని అమృతహస్తం అంటారు.

 

6. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. రచయిత ఈ కథానిక ప్రారంభంలో వేటిని గురించి, ఏమని వర్ణించాడు?
జ: రచయిత కథానిక ప్రారంభంలో తల్లిప్రేమ లాంటి చల్లటి నీడను ఇచ్చేది వేపచెట్టు అని ప్రారంభించారు. ఆ వేపచెట్టు గుండెల్లో నుంచి పుట్టిన అంతులేని ఆశల్లా వాటి కొమ్మలు వ్యాపించాయి అని వర్ణించారు.
వేపచెట్టు కొమ్మకు వేలాడదీసిన నాలుగు ఇనుప గొలుసులు, ఆ ఇనుప గొలుసులకు తగిలించిన ఓ పెద్ద పీట... అది ఉయ్యాల పీట అని వర్ణించాడు.
ఉయ్యాల పీట మీద కూర్చున్న వ్యక్తి గతాన్ని నెమరేస్తూ వర్తమానాన్ని తలపోస్తూ భవిష్యత్‌ను ఊహిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఓ కుర్రవాడు అతడి ముందు నిలబడి ఉన్నాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండటంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతడి ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది.

 

2. వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడి ప్రవర్తనా తీరు ఎలా ఉంది? రచయిత అతడి ప్రవర్తనను ఏ వాక్యాలతో వివరించాడు?
జ: వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉండటంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతడి ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. కుర్రవాడి కనుకొలకుల్లో నిలచిన నీళ్లు సంజ వెలుగులో ముత్యాల్లా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతా భావం కుర్రవాడి ముఖంలో దోబూచులాడుతూ ఉంది. అనుభూతిలో తడుస్తూ మూగబోయాడు.
      'ఆ కుర్రవాడు తనివిదీరనట్లు వృద్ధుడి పాదాలను ఒడిసి పట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతడి పాదాలను కడుగుతున్నాడేమో మరి! అప్పుడు వృద్ధుడి కన్నీళ్లు కుర్రవాడి తలమీద పడుతున్నాయి. కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం అందుకుంటున్న ఆ కుర్రవాడు ఎంత ధన్యుడో' అని రచయిత కుర్రవాడి ప్రవర్తనను వివరించాడు.

 

3. విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జ: విద్యానగరం ఒక విద్యాలయం. దానిలో దాదాపు రెండు మూడు చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఆవరణ ఉంది. రాగి, మర్రి, జువ్వి చెట్లు ఉన్నాయి. పూల మొక్కలు, కూరల తోటలు కూడా ఉన్నాయి.
ఆ విద్యానగర  ఆవరణలో  బాలబాలికలకు  వసతి గృహాలు, అతిథులకు  ప్రత్యేక  సదుపాయాలతో గదులు, వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. పఠనానికి గ్రంథాలయం, పూజకు ప్రార్థనాలయం కూడా ఉన్నాయి. ఆ విద్యానగరం ప్రశాంతతకు మారుపేరు. ఆ వాతావరణంలో ఎవరి పని వారు చేసుకుంటారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గంట కొడతారు. ఆ శబ్దం చెవిన పడటంతో పిల్లలందరూ బిలబిలా వచ్చి గుమిగూడుతారు. ఒక్కొక్కరి చేతిలో ఓ కంచం, మంచినీళ్లకు లోటా ఉంటుంది. అందరూ కలిసి గొంతెత్తి పాడుకుంటూ ముందుకు కదులుతారు. ఒక్కొక్కరు ముందుకు నడుస్తూ ఉంటే ఓ చోట అన్నం వేస్తారు. మరోచోట పులుసు పోస్తారు. ఇంకోచోట మజ్జిగ అన్నం వడ్డిస్తారు. చెవులకు ఇంపైనట్లుగా పాడుకుంటున్న దృశ్యం కనులపండువగా ఉంటుంది.

 

4. వృద్ధుడు చేస్తున్న సేవా కార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జ: వృద్ధుడు చేస్తున్న సేవా కార్యక్రమం గురించి లోకం పరహితార్థం పేరుతో స్వార్థం పెంచుకుంటున్న మనిషి అని, నోరులేని పిల్లలను అర్ధకడుపులతో నోళ్లు గొడుతున్న మనిషి అని అనుకునేది. దానికి వృద్ధుడి ప్రతిస్పందన ''ఉప్పు లేదా కారంపొడిని ఓ మనిషి మీద చల్లి చూడు. అతడి ఒంటి మీద గాయం ఉంటేనే మండుతుంది. లేకపోతే రాలిపోతుంది. అలాగే మనిషిలో కూడా తప్పులుంటేనే అన్నమాటలు తగులుతాయి. లేకపోతే గాలిలో కలిసిపోతాయి. ఈ మాత్రం అవగాహన శక్తి లేకుండా ధ్యేయాన్ని వదిలిపెడితే అది పిచ్చితనం లేదంటే చేతగానితనం" అని అనేవారు.

 

5. వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జ: వారపత్రికలో చదివిన కథ: రైలులో పదేళ్ల  వయసున్న  కుర్రవాడు  పెట్టెను ఈ చివరి  నుంచి ఆ చివరి దాకా తుడుస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరి ముందు చేయిచాపి డబ్బులు అడుక్కుంటాడు. ఇచ్చినవారికి నమస్కరిస్తాడు. 'లేదు' అన్నవారిని దీనంగా చూస్తాడు. ఓ వ్యక్తి ముందు నిలబడి చేయి చాపి అడుగుతాడు. ఆ వ్యక్తి కుర్రవాడిని దగ్గరకు పిలుస్తాడు. ఆ కుర్రవాడు ఆశతో దగ్గరికి వెళ్లాడు. నీ పేరేమిటి అని అడిగి పైసలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఉన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు నిర్లక్ష్యమైన చూపు విసిరి 'నాపేరు దొరైరాజ్'! అని అంటూ చేతిలోని పైసలను అలా ఎగరేస్తూ దర్జాగా వెళ్లిపోతాడు. కుర్రవాడిని చూసి ఆ వ్యక్తి మొదట ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఆలోచనలో పడ్డాడు.

 

6. రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జ: రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని చూసి పడుకుని ఉన్న వృద్ధుడు అయిదు రూపాయల నోటును విడిచిపెట్టాడు. దాన్ని చూసిన బాలుడు నోటును తిరగేసి చూశాడు. వృద్ధుడిని లేపడానికి ప్రయత్నించాడు. అప్పుడు వృద్ధుడు ఎక్కువ నిద్రపోయి లేచిన వ్యక్తిగా ఆవలించి, ఒళ్లు విరుచుకున్నట్లుగా నటించి, కుర్రవాడిని చూశాడు. ఆ కుర్రవాడు వినయంగా నిలబడి ఆ అయిదు రూపాయల నోటును వృద్ధుడి చేతికి ఇచ్చాడు. వృద్ధుడు ఆ కుర్రవాడికి పావలా కాసు ఇచ్చాడు. ఆ పావలా తీసుకుని రెండు చేతులు జోడించి నమస్కరించాడు.

 

II వ్యక్తీకరణ - సృజనాత్మకత 
 

1. కింది ప్రశ్నలకు ఆలోచించి అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ) 'గోరంత దీపం' కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన అయిదు విషయాలు రాయండి.
జ: 'గోరంత దీపం' కథానిక ద్వారా గ్రహించిన ముఖ్యమైన విషయాలు:
 అనాథలు, బిక్షమెత్తుకునేవారిని ఆత్మీయతా చూపుతో చూడాలి.
 అనాథలను చేరదీసి, మంచి జీవితాన్ని ఇవ్వాలి.
 అందరూ చదువుకోవాలి. అందరూ ఎదగాలి.
 మంచి ఆలోచనలు చేసి ఆచరణగా రూపుదిద్దుకోవాలి.
  సహాయం పొందినవారు కృతజ్ఞులై ఉంటారు.
 ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించే స్థితికి సమాజం ఎదగాలి.

ఆ) 'ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను' అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జ: ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాడు వృద్ధుడు. రైలు పెట్టెలో ఊడుస్తున్న కుర్రవాడి ముందు అయిదు రూపాయల నోటును పడేశాడు. ఆ నోటును తిప్పి తిప్పి చూసి ఆ కుర్రవాడు వృద్ధుడిని లేపాడు. నిద్రలో నుంచి లేస్తున్నట్లుగా కళ్లు తెరిచి చూశాడు. కుర్రాడు వినయంగా ఆ నోటును వృద్ధుడికి అందించాడు.
వృద్ధుడు పావలా ఇచ్చాడు. కుర్రవాడు నమస్కరించి తన పనిలో లీనమయ్యాడు. అప్పుడు వృద్ధుడు అతడిని పిలిచి 'నువ్వు ఇప్పుడు చిన్నవాడివి. ఈ పని చేసుకుని బతుకుతావు. పెద్దవాడివి అయ్యాక అప్పుడు ఈ పని చేయలేవు. అందరూ నిన్ను తప్పు పడతారు. అప్పుడు ఎలా బతుకుతావు. ఈ వయస్సులో చదువుకుంటే, పెద్దయ్యాక సంపాదించుకోవచ్చు. అందుకే నాతో వచ్చేస్తే చదువు చెప్పిస్తాను' అని అన్నాడు. ఆ కుర్రవాడు వచ్చాడు. వృద్ధుడి ప్రయత్నం ఫలించింది. ఆ కుర్రవాడు పట్టుదలతో చదువుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు.

 

ఇ) 'బాబూ! ఈ వయసులో చదువుకుంటే, ఆ వయసులో సంపాదించుకోవచ్చు' ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాలను రాయండి.
జ: రైలు పెట్టెలో ఊడుస్తున్న కుర్రవాడిని చూసి వృద్ధుడు 'బాబూ! ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు' అని అన్నాడు. ఈ వాక్యంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే చిన్నవయసులో బడికి వెళ్లి చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. విజ్ఞానం అందుతుంది. మనం చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఆ అర్హతతో ఏదైనా పనిచేయడానికి అవకాశాలు దొరుకుతాయి. చిన్నవయసులో పనిచేస్తే శరీరం కృంగిపోతుంది. అదే చదువుకున్నట్లయితే పెరిగి పెద్దాయ్యాక డబ్బు సంపాదించుకోవచ్చు. జీవిత విలువలు, క్రమశిక్షణ, పద్ధతులు అన్నీ చదువు వల్ల లభిస్తాయి. చదువు జీవిత నిర్మాణంలో సరైన క్రమాన్ని అందిస్తుంది. అందుకే చిన్న వయసు నుంచే చదువుకోవాలి. ఆ వయసులో సంపాదన కోసం ఆరాటపడకూడదు.

 

ఈ) 'ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు' - అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జ: 'ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు' అనే వాక్యంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. ఎవరూ లేని సమయంలో 'ఒంటరినని చింతించకు నీ తోడై నేనున్నాను' అని పుస్తకం జతకడుతుంది. అనేక విషయాలు తెలియజేస్తుంది. ఎవరూ లేరనే లోటును తీరుస్తుంది. పుస్తకాలు చదువుతుంటే సంతోషం కలుగుతుంది. అవి మనకు సరైనదోవను చూపిస్తాయి. అందుకే పుస్తకాలే... స్నేహితులు. అవి మనలో జ్ఞానాన్ని పెంచుకునేందుకు దోహదపడతాయి.

 

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ) కథానికలోని వృద్ధుడి పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జ: కథానికలోని వృద్ధుడి పాత్ర స్వభావం, గొప్పదనం:
'గోరంత దీపాలు' కథానికలో వృద్ధుడు అనాథలను చేరదీసి వారి ఆకలిని తీర్చి, విద్యాబుద్ధులు చెప్పించి వారిని మాణిక్యాలుగా తయారు చేశాడు. సమాజానికి సేవచేయాలనే గొప్ప మనసు ఉన్న వ్యక్తి అతడు. అనాథల జీవితాల్లో కొండంత వెలుగులను నింపాడు.
     విద్యానగరంలో బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయోవృద్ధులకు వసతులు, గ్రంథాలయం, సాయంకాలంలో పూజకు ప్రార్థనాలయం ఏర్పాటు చేశాడు. తెగిన గాలిపటాలను, తాడు విడిచిన బొంగరాలను ఒకచోట చేర్చి గోరంత దీపాలకు కొండంత వెలుగు చేకూర్చాలని కృషిచేశాడు. కష్టాలను భరించాడు.
చాలామంది అతడిని స్వార్థపరుడు, నోరులేని పిల్లలను అర్ధకడుపుతో మాడుస్తున్నాడని అంటుంటే 'మనిషిలో తప్పు ఉంటే తగులుతుందని' అనేవాడు. వారి మాటలను లెక్కచేసేవాడు కాదు. వృద్ధుడి చేతి చలవతో అనేకమంది జీవించేవారు. ఎంతోమంది దురదృష్టవంతులను అదృష్టవంతులుగా చేసేవాడు. అనాథను పదిమందిలో ఒకడిని చేశాడు. ఉద్యోగం వచ్చేలా తీర్చిదిద్దాడు. అనుభూతికి పరాకాష్ఠ తృప్తి అనే స్వభావం గలవాడు. గతాన్ని నెమరేసుకుంటూ భవిష్యత్ సందర్శనంతో అనుభూతి పొందుతాడు. తెలుగు అంటే బోలెడంత అభిమానం ఉన్నవాడు. పుస్తకాలను స్నేహితులుగా భావించేవాడు. అడక్కుతినేవాళ్లను పట్టించుకోకపోతే వారి బతుకు బరువెక్కుతుందని, వారిని ఆదుకోవాలనేవాడు. సానుభూతి, ఓపిక ఉన్నవాడు.

 

ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుడి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంత మాటల్లో వివరించండి.
జ: వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుడి మధ్య ఉన్న సంబంధం గొప్పది. వృద్ధుడు నెలకొల్పిన విద్యానగరంలో కుర్రవాడు చదివి, ప్రయోజకుడై ఉద్యోగం పొందాడు. వృద్ధుడు తండ్రిలా చేరదీసి, తల్లిలా అన్నంపెట్టి, గురువులా దారి చూపించాడు.
    ప్రయోజకుడైన యువకుడు తాను విద్యానగరంలో అడుగుపెట్టిన రోజునే పుట్టినరోజుగా భావించి వృద్ధుడి ఆశీర్వాదం కోసం వచ్చాడు. వినయంగా, సంస్కారంతో కాళ్లకు నమస్కరించాడు. వృద్ధుడు తన కన్నీళ్లతో ఆశీర్వదించాడు. వాళ్లిద్దరూ అనుభూతితో తడిసి ముద్దయ్యారు.
వారిరువురి సంబంధం ఎలాంటిదంటే కొడుకు వెళ్లిపోతుంటే తండ్రి అలాగే చూస్తున్నట్లుగా, కుర్రవాడు వెళుతుంటే వృద్ధుడు తదేకంగా చూశాడు. ఆప్యాయంగా ఆనందాన్ని ఇరువురు పంచుకున్నారు. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం ఆ యువకుడి ముఖంలో కనిపించింది. కుర్రవాడు, వృద్ధుడి మధ్యలో మరచిపోలేని అనుబంధం పెనవేసుకుంది. అందుకే కుర్రవాడు తాను ఎదిగిన తర్వాత కూడా వృద్ధుడి దగ్గరకు వచ్చాడు. వారి సంబంధం ఆప్యాయతా, అనురాగాలతో కూడుకుని ఉంది. ఆప్యాయతానురాగాలకు వారిరువురు కొత్తనిర్వచనం చెప్పినట్లుగా ఉన్నారు.

 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
 

అ) 'విద్యాలయం' ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జ: మా పాఠశాల:
సంస్థానాధీశుల పాలనకు ప్రతీక మా పాఠశాల. ఇది చాలా పురాతనమైంది. మా పాఠశాలలో మొత్తం 16 గదులు ఉన్నాయి. కొత్తవి 7. కొబ్బరిచెట్లతో మా పాఠశాల ఆవరణ చాలా రమణీయంగా ఉంటుంది. అంతేకాదు బాదం చెట్టు నీడను పరచుకుని ఉంటుంది. ఆ చెట్లపై పక్షుల సందడి, కొమ్మల విన్యాసం కమనీయంగా ఉంటుంది. క్రీడామైదానం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడే విద్యార్థులు అందరూ తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.
పాఠశాలలో రెండువేల పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. దానిలో మన తెలుగు సాహిత్యం తొణికిసలాడుతుంది. గ్రంథాలయం లోపల గోడలపై తెలుగు సాహిత్యకారులు దర్శనమిస్తారు.
పాఠశాలలో సైన్సు ల్యాబ్, కంప్యూటర్ గది ఉన్నాయి. విద్యార్థులు అంతా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. ఉపాధ్యాయులు సృజనాత్మక అంశాలను ఎక్కువగా నేర్పిస్తుంటారు. పాఠశాల ఆవరణ నిండైన చెట్లతో అమరి ఉంటుంది. తరగతి గదుల్లో వివిధ విషయాల చార్ట్‌లు ఉంటాయి. అవి విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. పాఠశాల ఆవరణలో నృత్య శిక్షణ జరుగుతుంది. ఆ సన్నివేశం తనువు పులకరింపజేస్తుంది. వివిధ రకాల ఉత్సవాలు మా పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహిస్తాం. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంటుంది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఉంది. మా పాఠశాల నుంచి జిల్లాస్థాయి ఉపన్యాస, పాటల పోటీల్లో విద్యార్థులు విజయం సాధించారు. ప్రతి సంవత్సరం ట్రిపుల్ఐటీలో సీట్లు సాధిస్తున్నారు.

 

ఆ) పాఠంలో 'దాదాపు రెండు మూడు... పరవశంతో పాడుతున్నారు' పేరా చదవండి. దీనికి సంబంధించిన  కవిత రాయండి.
జ: అదృష్ట వనం
     విద్యానగర ఆవరణ విహరించే ఆనంద డోలిక
     రంజింపజేసే రాగిచెట్లు
     మురిపింపజేసే మర్రిమానులు
     జాలువారి వెలిసిన జువ్వి చెట్లు
     పరవశింపజేసే పూలవనాలు
     కుదురుగ నిలిచిన కూరల తోటలు
     చెరిగిపోలేని చెట్లు చేమలు
     ఆ ఆనంద పల్లకిలో కుర్రవాడు వృద్ధుడు కుదిరిపోయి,
     ఆత్మీయ అనుభూతి జడిలో తడిసి మురిపెంగా మద్దయినారు.
     పాలనురుగుల పాలపిట్టలు
     పాటలన్నీ పాడుతుంటే
     అమ్మతనాన్ని అందిపుచ్చుకుంది
     ఆ అదృష్టవనం
     అదే అదే 'విద్యానగరం'

 

ఇ) వృద్ధుడి రైలు ప్రయాణంలోని వారపత్రిక పఠనం విషయం ఆధారంగా వృద్ధుడు, పెద్దమనిషి మధ్య హాస్య సంభాషణ రాయండి.
జ: రైలులో వృద్ధుడు, పెద్దమనిషి మధ్య సంభాషణ
వృద్ధుడు: అయ్యా మీరు తెలుగువారా?
పెద్దమనిషి: అవును, తమరు?
వృద్ధుడు: తెలుగువాడినే
(కొద్దిసేపటి తర్వాత పెద్దమనిషి తన బ్యాగు నుంచి వారపత్రిక తీసి చదవడం మొదలుపెట్టాడు)
వృద్ధుడు: ఏ పత్రిక చదువుతున్నారు?
పెద్దమనిషి: తెలుగు వారపత్రిక
(వృద్ధుడు తొంగి చూస్తున్నాడు)
పెద్దమనిషి: అయ్యా! ఏమిటిది? మీద పడతారా ఏం?
వృద్ధుడు: ఆ పత్రిక చూసేసరికి తెలుగుపై ఉన్న ఉబలాటం ఎక్కువైంది. అందుకే ఏమీ తోచక తొంగైనా చదవాలనిపించింది.
పెద్దమనిషి: ఇంతకుముందు స్టేషనులో కొనకపోయారా?
వృద్ధుడు: మరచిపోయాను.
(పెద్దమనిషి పత్రిక చదవడంలో మునిపోయాడు. వృద్ధుడు తదేకంగా పత్రికవైపే చూస్తున్నాడు)
పెద్దమనిషి: ఏమయ్యా! మన తెలుగు వాళ్లంతా ఇంతేనా? పక్కవారి పత్రికలో తలపెట్టడమేనా?
వృద్ధుడు: అంతమాట అంటారేంటి?
పెద్దమనిషి: అనకుంటే... ఈ బాధ ఉంటుందనే చాలా దూరం ప్రయాణించాక పత్రికను బయటకు తీశాను. అయినా బాధ తప్పింది కాదు.
వృద్ధుడు: తెలుగు అన్నా; తెలుగు పత్రిక అన్నా ప్రేమండి.
పెద్దమనిషి: మీరలా చూస్తుంటే చదివింది బుర్రకు ఎక్కడం లేదు.
వృద్ధుడు: అయితే నేను చదివాక మీరు చదవండి.
పెద్దమనిషి: ఇవ్వకుండా ఛస్తనా! తీసుకో అయ్యా. పొల్లుపోకుండా చదివి ఇవ్వు. మిగిలింది నేను చదువుతా!
వృద్ధుడు: ధన్యవాదాలు

రచయిత: అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌