• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోరంత దీపాలు

భాషాంశాలు
పదజాలం

1. కింద ఇచ్చిన రెండేసి పదాలు కలిపి సొంత వాక్యాలు రాయండి.
 

అ) వినయం - విధేయత
జ: తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారిపట్ల వినయ విధేయతలు ఉండాలి. అవి మంచి జీవితానికి దిక్సూచీలు.

 

ఆ) రాజు - మకుటం
జ: సినిమారంగంలో ఎన్.టి.ఆర్ మకుటంలేని రాజుగా నిలిచారు.

 

ఇ) ప్రదేశం - ప్రశాంతత
జ: అడవిలో వెలసిన ఏడుపాయల పుణ్యప్రదేశం - ఇది ప్రశాంతతకు నిలయం.

 

ఈ) గుడిసె - దీపం
జ: నా స్నేహితుడు నాగరాజు తన గుడిసెలోని దీపం వెలుగుకు చదివి ఉద్యోగం సంపాదించాడు.

 

ఉ) ప్రయాణం - సౌకర్యం
జ: మా పాఠశాలకు వెళ్లడానికి కనీస ప్రయాణ సౌకర్యాలు లేవు. దాంతో నడిచి వెళుతున్నాను.

 

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

జ: సంజవెలుగు = సంధ్యాసమయంలో వెలువడే కాంతి.

జ: ఆశీర్వాదం = దీవించడం

జ: తదేకంగా = అదే పనిగా

జ: కాలక్షేపం = కాలాన్ని గడపడం

జ: పులుము = పూసుకోవడం

జ: ఆకళింపు = అవగాహన
 

3. కిందివాటిని చదవండి. ఇచ్చిన ఖాళీలో వాటికి సంబంధించిన పదాన్ని రాయండి.
   

 అ) హాస్య సంఘటన చూసినప్పుడు ............. వస్తుంది. (నవ్వు)
 ఆ) చదువు వల్ల ............. వస్తుంది. (జ్ఞానం)
 ఇ) బాధ వల్ల ............. వస్తుంది. (దుఃఖం)
 ఈ) శ్రమ వల్ల ............. వస్తుంది. (ఫలితం)
 ఉ) వ్యాయామం వల్ల ............. వస్తుంది. (ఆరోగ్యం)

 

4. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.
     అ) పక్షులను రక్షించే సంస్థ ............. (పక్షుల సంరక్షణా కేంద్రం)
     ఆ) జంతువులను రక్షించే సంస్థ ............. (వన్యప్రాణి సంరక్షణా కేంద్రం)
     ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ ............. (వృద్ధాశ్రమం)
     ఈ) మనోవైకల్యం ఉన్నవారికి చేయూతనిచ్చే సంస్థ ............. (మనో వైకల్య వికాస కేంద్రం)
     ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం ............. (కుష్ఠురోగుల పునరావాస నిలయం)

 

వ్యాకరణాంశాలు 
 

1. కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యాల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య.
జ: 1) పుంప్వాదేశ సంధి - పదాలు
         సరసంపుమాట - సరసము + మాట
        మధురంపుకావ్యం - మధురము + కావ్యం
సూత్రం: కర్మధారయ సమాసాల్లో 'ము' వర్ణానికి బదులు పు, oపులు ఆదేశంగా వస్తాయి.
     

  2) టుగాగమ సంధి - పదాలు
          తూగుటుయ్యాల - తూగు + ఉయ్యాల
          ముద్దుటుంగరం - ముద్దు + ఉంగరం
          పల్లెటూరు - పల్లె + ఊరు
సూత్రం: కర్మధారయంలోని ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు 'ట్' ఆగమంగా వస్తే టుగాగమ సంధి.

 

 3) అత్వ సంధి - పదాలు
          చింతాకు - చింత + ఆకు
          రామయ్య - రామ + అయ్య
సూత్రం: అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళంగా వస్తుంది.
     

  4) ద్విరుక్తటకార సంధి - పదాలు
          కట్టెదుట - కడు + ఎదుట
          నట్టడవి - నడు + అడవి
సూత్రం: కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాల్లోని ఱ, డ లకు అచ్చుపరమైతే ద్విరుక్తటకారం వస్తుంది.
ద్విరుక్తటకారం = 'ట్ట'

 

శ్చుత్వ సంధి
 

కింది ఉదాహరణలను పరిశీలించండి.
       నిస్ + చింత = నిశ్చింత = (స్ + చి = శ్చి)
       సత్ + ఛాత్రుడు = సచ్ఛాత్రుడు = (త్ + ఛా = చ్ఛా)
       శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు = (త్ + చ = చ్చ)
       జగత్ + జనని = జగజ్జనని = (త్ + జ = జ్జ)
       శార్ఙ్గిన్ + జయ: = శార్ఙ్గిఞ్జయ: = (న్ + జ = ఞ్జ)
* పై పదాలను గమనిస్తే పూర్వపదంలో 'స' కారం, త వర్గం (త, థ, ద, ధ, న) అక్షరాలే వచ్చాయి. పరపదంలో 'శ' కారం లేదా 'చ' వర్గం (చ ఛ జ ఝ ఙ) అక్షరాలే వచ్చాయి. అలా వచ్చినప్పుడు 'శ' కార, చ వర్గాలే (చ ఛ జ ఝ ఙ) కలిపి రాసిన పదంలో వచ్చాయి.

శ్చుత్వ సంధి సూత్రం: 'స' కార 'త' వర్గా (త థ ద ధ న) లకు వరుసగా 'శ' కార 'చ' వర్గా (చ ఛ జ ఝ ఙ)లు పరమైతే 'శ' కార, 'చ' వర్గాలే ఆదేశంగా వస్తాయి.


* పైన చెప్పిన ఏ అక్షరానికైనా ఆదేశం చెల్లుతుంది.

కింది సంధులు విడదీయండి. సూత్రంతో సరిచూడండి.
1.
సజ్జనుడు  సత్ + జనుడు (త్ + జ  జ్జ)
పూర్వపదంలో 'త' వర్గంలోని 'త' వచ్చింది, పరపదంలో 'ఛ' వర్గంలోని 'జ' పరమైంది. అప్పుడు 'ఛ' వర్గంలోని 'జ్జ' వచ్చింది (పైన పట్టికలో చూడండి)

2. సచ్చరిత్రం  సత్ + చరిత్రం (త్ + చ  చ్చ)
పూర్వపదంలో 'త' వర్గంలోని 'త్' వచ్చింది. పరపదంలో 'చ' వర్గంలోని 'చ' పరమైంది. అప్పుడు 'చ' వర్గంలోని 'చ్చ' వచ్చింది. (పైన పట్టికలో చూడండి)

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌