• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోరంత దీపాలు

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

1. మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి లేదా ఏదైనా పత్రిక నుంచి సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దానిలోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి?
జ: కథ: మానవ సంబంధాలు గొప్పవి
సుధాకర్, నాగరాజు, బాలకిషన్, ఆనంద్ నలుగురూ అన్నదమ్ములు. వారిది చాలా పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. వృద్ధులైన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ బతుకుతున్నారు. అందరూ చదువుకుంటే పూట గడవటం కష్టమని చిన్న తమ్ముడైన ఆనంద్‌ను చదివించారు. సుధాకర్, నాగరాజు, బాలకిషన్ తలో పని చేస్తూ డబ్బులు కూడబెట్టి ఆనంద్‌ను బాగా చదివించారు. ఆనంద్‌పైనే అన్నల ఆశ. తమ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళతాడని పస్తులు ఉండి పనిచేసి మరీ కార్పొరేటు విద్యను అందించారు. బాగా చదివిన ఆనంద్‌కు ఉన్నత ఉద్యోగం లభించింది.
     ఆనంద్‌కు ఉద్యోగం రావడంతో అన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతకాలం తర్వాత ఆనంద్‌కు పెళ్లి చేశారు. ఉద్యోగ నిమిత్తం ఆనంద్ బొంబాయి వెళ్లాడు. సంవత్సరాలు గడిచాయి. తాను, తన భార్య, తన పిల్లలే ముఖ్యం అనే స్వార్థ ఆలోచనతో అన్నలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎదురు చూస్తున్న అన్నల ఆశలు ఆవిరి అయ్యాయి. కన్న తల్లిదండ్రులు చనిపోయినా రాలేదు.
ఒక మొక్క ఎదిగి చెట్టుగా మారేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు ఆనంద్‌ విషయంలో అన్నలు తీసుకున్నారు. అయినా అది గ్రహించని ఆనంద్ సంబంధాలను తెంచేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆనంద్‌కు తీవ్రగాయాలయ్యాయి. భార్యా పిల్లలు అతడికి సేవలు చేయలేకపోయారు. వారు ఛీత్కరించిన ప్రతిసారి ఆనంద్‌కు తమ అన్నలు గుర్తుకు వచ్చేవారు. తన అన్నలకు ఉత్తరం రాశాడు. ప్రేమ ఉన్న అన్నలు తమ తమ్ముడిని చేరదీశారు. సేవలు చేసి తమ్ముడిని మామూలు మనిషిని చేశారు. ఆనంద్‌కు సంబంధాల గొప్పతనం అర్థమైంది. లోకంతో సంబంధాలు కలిగి ఉండాలని, 'మనం' అనే భావనను మరవరాదని తెలుసుకున్నాడు. ఇన్నాళ్ల తన స్వార్థ ఆలోచనలకు సిగ్గుపడి తలదించుకున్నాడు. పేదరికంలో ఉన్న అన్నలను బొంబాయి తీసుకెళ్లి పని కల్పించాడు. వారితో హాయిగా జీవించసాగాడు.

 

'కథ'పై నివేదిక
* కథలో అన్నల త్యాగంతో తమ్ముడు చదువుకున్నాడు.
* స్వార్థపూరిత ఆలోచనలతో తమ్ముడు పూర్తిగా మారిపోయాడు.
* కన్నతల్లిదండ్రులు మరణిస్తే రాలేని కసాయి కొడుకు ఆనంద్.
* తమ్ముడు అన్నలను పట్టించుకోకపోవడంతో అన్నల బాధ వర్ణనాతీతం.
* తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న తమ్ముడిని చేరదీసి సేవలు చేయడం అన్నల గొప్పతనం.
* మానవ సంబంధాలు గొప్పవి అని తమ్ముడు తెలుసుకోవడం, 'మనం' అనే భావనను పెంపొందించుకోవడం.
* మానవ సంబంధాలు మనిషిని ఉన్నతుడిగా తయారు చేస్తాయి.
* అందరూ కలిసి పేదరికాన్ని పారదోలవచ్చు.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం