• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోరంత దీపాలు

రచయిత పరిచయం:

'గోరంత దీపాలు' పాఠ్యాంశ రచయిత శ్రీ పులికంటి కృష్ణారెడ్డి.

1931లో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామంలో పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డిలకు జన్మించారు.

వ్యవసాయమే ప్రధాన వృత్తి అయిన ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు.

కథా రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్ర కథకుడిగా ప్రసిద్ధి చెందారు.

బెల్లంకొండ రామదాసు రచించిన 'పునర్జన్మ' నాటకంలో వృద్ధుడి పాత్ర ధరించారు. దాంతో ఆయన నటజీవితం ప్రారంభమైంది.

నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.

రచనా వ్యాసంగం పట్ల అమితమైన ఆసక్తి ఉండేది.

ప్రత్యేకంగా 'కథా సాహిత్యం'పై దృష్టి సారించిన ఘనుడు.

ఆయన రాసిన మొదటి కథ 'గూడుకోసం గువ్వలు'. ఇది 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది.

సుమారు 150 కథలు రాశారు.

ఆయన రాసిన మరో రచన - 'నాలుగ్గాళ్ల మండపం'

కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు - అంశాల మీద సుమారు 'వంద' బుర్రకథలు రచించి ప్రదర్శనలు ఇచ్చారు.

పులికంటి కృష్ణారెడ్డి 2007లో మరణించారు.

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం

సమాజంలో ఎంతోమంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పిల్లలు కనీస అవసరాలైన తిండి, బట్ట, గూడు లేకుండానే జీవిస్తుంటారు. వారిని చేరదీసి ఆకలి తీర్చి, విద్యాబుద్ధులు చెప్పిస్తే మట్టిలో మాణిక్యాల్లా వెలుగొందుతారు. గొప్ప మనసున్న వ్యక్తులు సమాజానికి సేవ చేయాలని, తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు. అలాంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కథ. రైలు ప్రయాణంలో తటస్థపడిన ఓ బాలుడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే, ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం, వాళ్ల మధ్య ఉండే మానవ సంబంధాలను తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

'గోరంత దీపాలు' కథా ప్రక్రియకు చెందింది.

ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో ఉంటుంది.

ఈ కథాంశం కళ్లకుకట్టినట్లుగా మనోభావాలను పలికించేలా ఉంటుంది.

ఈ పాఠం రచయిత పులికంటి కృష్ణారెడ్డి రచించిన 'కథావాహిని' లోనిది.

ప్రవేశిక

ప్రయత్నించి ఫలితాన్ని సాధించడంలో కొందరికి ఆనందం కలుగుతుంది.

అసలు ప్రయత్నాల ప్రమేయమే లేకుండా జీవితాన్ని కొనసాగించాలనే కోరిక కొందరికి ఉంటుంది.

'నా జీవితమంతా ఇలాంటి ప్రయాత్నాలతోనే కొనసాగుతూ ఉంది. అందుకే ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను'. అంటూ కాసేపు ఆగారు.

ఆ కుర్రవాడిని పరీక్షించడానికి నా ప్రయత్నంగా నేను జారవిడిచిన కాగితమిది.

ఇంతకూ ఆ కుర్రవాడు ఎవరు? కుర్రవాడికి సాయం చేసిన అతడు ఎవరు? అతడు చేసిన ప్రయత్నమేమిటి? ఈ పాఠం చదివి తెలుసుకోండి.

పాఠ్యభాగ సారాంశం

తల్లి ప్రేమలా చల్లటి నీడను ఇచ్చే చెట్టు వేపచెట్టు. దరిద్రుడి గుండెల్లో నుంచి పుట్టిన అంతులేని ఆశల్లా ఆ చెట్టు కొమ్మలు నాలుగు దిక్కులా వ్యాపించాయి. ఆ కొమ్మలు పూతా, పిందెలతో నిండుగా ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మకు ఉయ్యాల పీట ఉంది. దాని మీద ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతడు ఒక మహాయోగిలా కనిపిస్తున్నాడు. అతడి ముందు ఓ కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతడి వేషంలో సంస్కారం ఉంది. ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.

ఆ వృద్ధుడు కళ్లు మూసుకుని చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఇద్దరి కళ్లలో నీళ్లు నిలిచాయి. అవి ముత్యాల్లా మెరుస్తున్నాయి. చెప్పలేని కృతజ్ఞాతా భావం ఇద్దరి ముఖాల్లో దోబూచులాడుతోంది. ఆ అనుభూతిలో తడుస్తూ వాళ్లు మూగబోయారు. అది చూసిన రచయిత దూరంలోనే ఉండిపోయాడు. మళ్లీ ఒకసారి ఆ కుర్రవాడు అతడి పాదాలను తృప్తితీరా పట్టుకున్నాడు. తలను పాదాలపై ఆనించాడు. ఆ దృశ్యం కన్నీటితో పాదాలను కడుగుతున్నట్లుగా ఉంది. ఆ వృద్ధుడు ఎటో చూస్తున్నాడు. ఆశీర్వదించడానికి ఎత్తిన చేయి ఎత్తినట్లుగానే ఉంది. అతడి కన్నీళ్లు ముత్యాల్లా ఆ కుర్రవాడి తలమీద పడుతున్నాయి.

కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం అందుకుంటున్న ధన్యుడు ఆ కుర్రవాడు. 'ఎవరీ కుర్రవాడు?.. ఏమిటీ వీళ్లిద్దరి మధ్య సంబంధం? మహా మేరువు లాంటి ఆ మనిషిని కదిలించిన ఆ కుర్రవాడు ఎంతటి అదృష్టవంతుడు?' అని రచయిత ఆలోచిస్తూ నిలబడ్డాడు.
రెండు మూడు చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న ఆవరణలో ఈ వేపచెట్టుతోపాటు పెద్దవైన రాగి, మర్రి, జువ్వి చెట్లు కూడా ఉన్నాయి. రకరకాల పూల మొక్కలు, కూరల తోటలు ఉన్నాయి. అక్కడి చెట్లు, చేమలు బంగారం కరిగించి పోసినట్లున్న ఆ సంధ్య వెలుగులో తడిసిముద్దవుతున్నాయి. వాటితో పోటీ పడుతున్నట్లుగా వీళ్లిద్దరూ (వృద్ధుడు, కుర్రవాడు) అనుభూతితో తడిసిముద్దవుతున్నారు. ఆ అనుభూతిని గ్రహించినట్లుగా చెట్లమీది పాల పిట్టలు పరవశంతో పాడుతున్నాయి.

ఆ కుర్రవాడు పైకి లేచాడు. కన్నీళ్లను జేబురుమాలుతో అద్దుకున్నాడు. తిరిగి చేతులు జోడించి నాలుగు అడుగులు వెనక్కు వేసి మళ్లీ తలను వంచి నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ ఉయ్యాలలో కూర్చున్న మహామనిషి వెళుతున్న కుర్రవాడిని చూస్తూ ఉన్నాడు.

ఆ విద్యానగరంలో బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులు, వయోవృద్ధులకు వసతులు... ఇలా అన్నీ ఉన్నాయి. గ్రంథాలయం, పూజకు ప్రార్థనాలయం కూడా ఉన్నాయి.

ఆ నగరంలో ఆ వృద్ధుడే మకుటంలేని మహారాజు. ప్రతిరోజు అదే సమయానికి అక్కడికి వచ్చి, ఆ ఉయ్యాలపీట మీద కూర్చుంటాడు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పనుల్లో వారు ఉంటారు. బాలబాలికలు చదువుకుంటూ, రాసుకుంటూ తమ పనుల్లో లీనమై ఉంటారు. వారిని చూస్తూ....    ఆ గోరంతదీపాలు కొండంత వెలుగులు ఇవ్వాలని ఆశిస్తూ, ఆ వృద్ధుడు ఆనందానుభూతితో తేలిపోతుంటాడు.

ఆ విద్యానగరంలో ఏడుగంటల ప్రాంతంలో గంట కొడతారు. గంట విని పిల్లలు అందరూ గుమిగూడుతారు. అందరి చేతిలో గిన్నె, మంచినీళ్ల చెంబు ఉంటాయి. ఆ వృద్ధుడు లేచి నిల్చోగానే అందరూ వరసగా నిల్చుంటారు. పాట పాడుతూ ముందుకు కదులుతూ ఉంటే ఒకచోట అన్నం పెడతారు, మరొక చోట పులుసు పోస్తారు. ఇంకొకచోట మజ్జిగ అన్నం వడ్డిస్తారు. అలా అన్నం వడ్డించే దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది.

తెగిన గాలి పటాలను, తాడు విడిచిన బొంగరాలను ఒకచోట చేర్చి గోరంత దీపాలకు కొండంత వెలుగు చేకూర్చాలని కృషి చేస్తున్న ఆ మహామనిషిని చూస్తే నమస్కరించాలని అనిపిస్తుంది.

అందుకే రచయిత ఆయనతో కాలక్షేపం చేయడానికి ఇష్టపడతాడు. ఆ వృద్ధుడు మాట్లాడే మాటలు జీవితానుభవం నుంచి వెలువడిన అక్షర సత్యాలు. ఆయన అప్పుడప్పుడు గతాన్ని తలచుకుని నవ్వుతాడు. అది నవ్వు కాదు. జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు. అయినా వాడిపోలేదు. ఆయన కష్టాలను భరించాడు. ఓర్పు, నేర్పు గలవాడు. ఫలితంగా గుడిసెలో బుడ్డిదీపం గుడ్డి వెలుతురులో ఓ కుర్రవాడు ఓనమాలు దిద్దుకున్నాడు. ఇది ముప్ఫైఏళ్లనాటి మాట. ఇప్పుడు వేలాదిమంది విద్యార్థులు, వందలమంది ఉపాధ్యాయులు... వీళ్లందరూ ఆయన దగ్గర బతుకుతున్నవాళ్లే.

ఎవరైనా ఆయనను స్వార్థమనిషి, పిల్లలను అర్ధాకలితో నోళ్లు కొడుతున్న మనిషి అని రకరకాలుగా అంటున్నారంటే ఆయన ఇలా అనేవారు. 'బాబూ! ఉప్పునో, కారంపొడినో ఓ మనిషి మీద చల్లిచూడు. అతడి ఒంటిమీద గాయలుంటేనే మండుతుంది. లేకపోతే రాలిపోతుంది. అంతేబాబూ! మనిషిలో కూడా తప్పులుంటేనే ఎవరైన అన్నమాట తగులుతుంది. లేకుంటే గాలిలో కలిసిపోతుంది. ఈ మాత్రం అవగాహన శక్తి లేకుండా ధ్యేయాన్ని వదిలిపెడితే అది పిచ్చితనం బాబూ! అదీకాకపోతే చేతగానితనం!' అని నవ్వేవారు.

ఆ వృద్ధుడి దగ్గరికి రచయిత అప్పుడప్పుడు వెళ్లేవాడు. ఆ ఉయ్యాల పీట మీద ఆయనకు ఎదురుగా కూర్చుంటే ఇద్దరి బరువుతో ఆ చెట్టు కొమ్మ వంగుతూ లేస్తూ గాలితీరుతో అటుఇటు కదులుతూ ఉంటే అదొక చిత్రమైన అనుభూతి. ఆయన జీవితానుభవాలను వింటూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని రచయిత ఆశించాడు. ఆయన గుండెల్లో రచయిత చోటు సంపాదించుకున్నాడు.

వృద్ధుడు కుర్రవాడిని ఆశీర్వదించే సమయంలో రచయిత వెళ్లాడు. అతడి ఎదురుగా నిలబడ్డాడు. నాలుగైదు నిమిషాలు పూర్తి అయ్యాయి. రచయిత ఓ పొడి దగ్గు దగ్గాడు. అప్పుడు ఆ వృద్ధుడు రచయితను 'ఎప్పుడు వచ్చావు బాబూ!' అని అడిగాడు. అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు వచ్చాను అన్నాడు రచయిత. ''కూర్చో బాబూ! కూర్చో ఆ అదృష్టవంతుడి కథ చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎందుకో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విను" అని అన్నాడు. కథ చెప్పడానికి తలపండిన తాతయ్యను తలపింపజేస్తున్నాడు.

పడమటి దిక్కున సూర్యుడు బంతిలా వెలుగుతున్నాడు. అప్పుడప్పుడే పక్షులు చెట్ల మీదికి చేరుతూ అరుస్తున్నాయి. ప్రార్థనాలయంలో తంబుర శృతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది. ఆ వృద్ధుడు చెబుతున్నాడు. రచయిత వింటున్నాడు.

'బాబూ! ఇరవై ఏళ్ల కిందటి మాట. రైల్లో రెండు రోజులు ప్రయాణిస్తూ ఇంటికి వస్తున్నాను. రైలులో పుస్తకాలే నేస్తాలు. ఏమంటావు?' అన్నాడు వృద్ధుడు. అనడానికి ఎందుకని వినడానికే సిద్ధపడ్డాడు రచయిత. బాగా నవ్వాడు వృద్ధుడు. రచయిత నివ్వెరపోయి చూశాడు. 'తెలుగువాళ్లు మనసులో మెదిలారు అందుకే నవ్వాను' అన్నాడు వృద్ధుడు.

'తెలుగువాళ్లకు తెలుగంటే బోలెడంత అభిమానం బాబూ!' అంటూ మళ్లీ కాసేపు విరగబడి నవ్వాడు. వృద్ధుడు నవ్వు ఆపగానే ''ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది గదండీ! అందులో తప్పు కూడా లేదు" అన్నాడు రచయిత.

వృద్ధుడు 'అదే బాబూ అదే? నేననేదీ అదే! - ఆ తెలుగు మీది అభిమానం ఉంది చూశావా? పక్కనున్న వాడి చేతిలో తెలుగు పుస్తకం లేదా ఓ వార్తాపత్రిక, కంటపడితే చాలు! ఆ అభిమానం ఎక్కువైపోతుంది' అన్నాడు.

మళ్లీ ఇలా అన్నాడు వృద్ధుడు. 'నేను కూడా తెలుగువాడినే కదా బాబూ'! పక్కనున్న ప్రయాణికుడి చేతిలో ఓ పత్రిక కంటపడేసరికి మొదట ఒంగి చూశాను. అది తెలుగు పత్రిక అవునో కాదో అని, తెలుగు వార పత్రిక అని తెలిసి పేజీల్లోకి చూశాను. నా అవస్థ గమనించిన ఆ పెద్దమనిషి అదోరకమైన చూపును విసిరే సరికి పరధ్యానంగా ఎటో చూస్తూన్నట్లు కాసేపు నటించాను. తిరిగి నా చూపులు పత్రికవైపు మళ్లాయి. ఇదంతా గమనించిన పెద్దమనిషి ఆ వారపత్రికను చేతికి అందించి పడుకున్నాడు. నేను ఆ పత్రికను ఆప్యాయంగా అందుకున్నాను - ఎంతైనా తెలుగువాడిని కదా బాబూ అన్నాడు వృద్ధుడు. ఆ సమయంలో ఓ నడివయస్సు మనిషి ఒక లావైన పుస్తకాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆ వృద్ధుడు 'రావయ్యా! రా?' అన్నాడు. అతడు చూపినచోట వృద్ధుడు సంతకాలు పెడుతూ అతడితో పెట్టమన్న చోటంతా కళ్లు మూసుకుని సంతకాలు పెడుతున్నాను. అనాథలైన పిల్లలు, వాళ్ల అథోగతికి దారితీస్తే పుట్టగతులు ఉండవు. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి! అని అన్నాడు. మళ్లీ రచయిత వైపు తిరిగి 'ఆ వారపత్రికను పేజీలు తిప్పుతూ ఆగిపోయాను' అన్నాడు.

వృద్ధుడి దగ్గరకు నలుగురైదుగురు పిల్లలు వచ్చారు. ఆయనను దీనంగా చూస్తున్నారు. ఆయన లేచి వారి దగ్గరకు వెళ్లాడు. వారేదో చెప్పారు. ఆయన వారికేదో చెబుతూ భుజంతట్టి, బుగ్గగిల్లి, తలనిమిరి వారిని పంపించేశాడు. వెళుతున్న వారిని అలాగే చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ వచ్చి ఉయ్యాల పీట మీద కూర్చున్నాడు.

మళ్లీ 'బాబూ! ఒకప్పటితో పోల్చి చూస్తే తెలుగులో చాలా పత్రికలు వస్తున్నాయి. వాటిలో ప్రచురించిన ప్రతి కథకు ఓ బొమ్మను కూడా వేస్తున్నారు. అయితే బొమ్మను చూసి కథను చదవాలన్న కోరిక కలిగే తీరులో బొమ్మలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఏమంటావ్?' అన్నాడు వృద్ధుడు. 'నిజమేనండీ!' అన్నాడు రచయిత.

వృద్ధుడు 'బాబూ! ఆ వార పత్రికలో పేజీలు తిప్పుతూ ఒక చోట ఆగిపోయాను. ఆ పత్రికలో అలాంటి బొమ్మ కంటపడింది. అందుకే ఆగిపోయాను. అది ఓ రైలు పెట్టె. ఆ పెట్టెలో ఓ కుర్రవాడు అడుక్కుంటున్నాడు. వాడు చేయి చాపి నిలబడిన తీరు... వాడి చూపుల్లో కొట్టొచ్చినట్లున్న జోరు... నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే కథ చదివాను' అన్నాడు.

వృద్ధుడు ఆ కథను క్లుప్తంగా చెప్పాడు. ఆ కథలో పదేళ్ల బాలుడు రైలులో పెట్టెను తుడుస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరి ముందు చేయిచాపి, డబ్బులు ఇచ్చిన వారికి నమస్కారం పెడతాడు. లేదన్న వారి వైపు దీనంగా చూస్తూ... ఓ వ్యక్తి ముందు నిలబడతాడు. నిలబడి మామూలుగా చేయి చాపుతాడు. ఆ వ్యక్తి ఆ బాలుడిని దగ్గరికి పిలుస్తాడు. ఆ పిలుపులోని ఆప్యాయతతో దగ్గరికి వెళ్లాడు. 'నీ పేరేమిటి అని ఆరంభిస్తాడు ఆ వ్యక్తి. పైసలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ బాలుడు నిర్లక్ష్యమైన చూపుతో 'నా పేరు దొరైరాజ్!' అని అంటూ చేతిలోని పైసలు ఎగరేసుకుంటూ దర్జాగా వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతున్న కుర్రవాడి ధోరణికి మొదట ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి!' ఇదీ కథ.

'బాబూ! నేను కూడా ఆలోచనలో పడ్డాను. నిజమే గదా? ఎందరో ఆ అబ్బాయి ఈడు పిల్లలు జేబులు కొడుతున్నారు. ప్రయాణాల్లో ఏమరుపాటుగా ఉంటే సామాను ఎత్తుకెళ్లడం చేస్తున్నారు. మరికొంతమంది వేరేవారి కింద పనిచేసే తోలుబొమ్మలు అవుతున్నారు. ఇంకొంతమంది ఇళ్ల ముందు నిల్చొని కడుపు మంటల్ని కంటి చూపుల్లో నిలుపుతున్నారు. అలాంటప్పుడు అంతో ఇంతో పని చేసి పొట్టగడుపుకోవాలని అనుకోవడం గొప్ప సంగతే కదా బాబూ? - నిజంగా వాడు దొరైరాజే! బాబూ! నా ఆలోచనల్లో నేనుంటే సరిగ్గా ఇలాంటి సంఘటనే రైలులో నా కంట పడింది' అన్నాడు వృద్ధుడు.

రచయితలో ఈ కథ మీద కథను వినాలన్న కోరిక పెరిగింది. బాబూ! అందీ అందని నెక్కరుతో, నలుపు తెలుపు కలిసిన బూడిద రంగున్న ఒంటితో, ఆశచావని కళ్లతో, పనిమీద శ్రద్ధ తగ్గని పదేళ్లు అయినా నిండని వాడి వైపు చూశాను. ఆ తర్వాత చూపు మరల్చుకున్నాను. అయినా వాడు కళ్లల్లోనే మెదలుతున్నాడు. చదివిన కథ మనస్సును తొలుస్తూ ఉంది. ఓ ఆలోచన వచ్చింది. ఆలోచనను ఆచరణలో పెట్టాలన్న తలంపుతో పడకమీద పడుకున్నాను. మరో నాలుగైదు నిమిషాల్లో నేను పడుకుని ఉన్నచోటు వరకు ఊడ్చుకుంటూ వచ్చాడు. నన్ను లేపడానికి తట్టాడు. నేను లేచి కుర్రవాడిని చూశాను. వినయంగా నిలబడి నేను కావాలని వదిలేసిన అయిదు రూపాయల నోటును తీసుకోకుండా నాకే ఇచ్చాడు. వాడి చేతిలో ఓ పావలా పెట్టాను. ఆ పావలా డబ్బులు తీసుకుని రెండు చేతులు జోడించి నమస్కరించాడు. తిరిగి పనిలో లీనమయ్యాడు. 'బాబూ' అని పిలవగానే లేచి నిలబడ్డాడు. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివి. ఈ పని చేసి బతకగలుగుతావు. బాగానే ఉంది. పెద్దయ్యాక అప్పుడు ఈ పని చేయలేవు. చేసినా నిన్ను తప్పు పడతారు.

అప్పుడు ఎలా బతుకుతావు? అందుకే బాబు ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు అన్నాను. ఈ లోకంలో నన్ను చదివించే వాళ్లు ఎవరు ఉన్నారు? అన్నట్టుగా ముఖం కనిపించింది. అందుకే నాతో వస్తావా బాబూ అన్నాను. తలవంచాడు. తీర్చిదిద్దితే 'ఆ అదృష్టవంతుడు అయ్యాడు' అని చెప్పాడు వృద్ధుడు. ఇది విన్న రచయిత కదలకుండా కూర్చున్నాడు.

ఆ వృద్ధుడు చేరదీసిన కుర్రవాడు పదిమందిలో ఒకడయ్యాడు. పట్టుదలతో చదువుకున్నాడు. కృషికి తగిన ఫలితం దొరికింది. మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో ఊరు విడిచివెళుతూ తాను విద్యానగరంలో అడుగుపెట్టిన రోజునే తన పుట్టినరోజుగా భావించిన కుర్రవాడు ఆ మహామనిషి పాదాలకు నమస్కరించేందుకు వచ్చాడు. తనను ఆశీర్వదించమని ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ వృద్ధుడి కళ్లల్లో నీళ్లు నిలిచాయి. ఎందుకు అని అడిగితే..?

బాబూ! ఇది వేపచెట్టు. సహజంగా 'వేపచెట్టు' అని చెవిన పడటంతో 'చేదు' అనే భావన మన మనసులో మెదులుతుంది. అయితే ఆ వేప చెట్టును ఆశ్రయిస్తే- నీడనిస్తుంది. ప్రతిరోజూ ఓ కాయ నమిలి మింగ గలిగితే దీర్ఘవ్యాధులను నయం చేస్తుంది. పంటిపుల్లగా నోటి జబ్బులను పోగొడుతుంది. అలాగే బాబూ! 'అడుక్కు తినేవాళ్లు అని' పట్టించుకోకోపోతే ఆ బతుక్కే అంకితమైపోయి అనామకులైపోతారు. ఒక విధంగా చెప్పాలంటే వారు కొడిగట్టిన దీపాలు. కాస్తంత సానుభూతి, ఓపికను రంగరించి, కొడినలా తట్టేసి, తగినంత చమురుపోసి ఒత్తిని ఎగదోస్తే- అవి గోరంత దీపాలే కావచ్చు. అవి ఏనాటికైనా కొండంత వెలుగునిస్తాయి అన్నాడు.

ఒకే ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మహాసంస్థ ఎన్ని దీపాలకు ఆశ్రయం ఇచ్చింది? ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించే స్థితికి సమాజం ఎదిగేది ఎప్పుడు? సమాధానం దొరకని ప్రశ్న రచయితను సతమతం చేసింది. చేదు నిజాన్ని తియ్యగా పలికిస్తుంటే మనసుకు చేతులు వస్తే నమస్కరించేది ఆ మహామనిషికి.

రచయిత: అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం