• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిత్రగ్రీవం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

 'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. కోల్‌కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జ: సుమారు పది లక్షల జనాభా ఉందని మనం అనుకునే కోల్‌కతా మహానగరంలో కనీసం ఇరవై లక్షల పావురాలు ఉంటాయి. ప్రతి మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరికీల పావురాలు, పిగిలి పిట్టలూ, బంతి పావురాలు ఉంటాయి. దీన్నిబట్టి కోల్‌కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పవచ్చు.

 

2. మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటికోసం మీరేం చేస్తున్నారు?
జ: మా ప్రాంతంలో పిట్టలు, కాకులు, కోళ్లు ఎక్కువగా ఉంటాయి. పిట్టలు, కాకుల కోసం వేసవి కాలంలో కొబ్బరి చిప్పల్లో నీళ్లుపోసి చెట్టుకు కడతాను. అవి వచ్చి నీళ్లుతాగి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. కోళ్ల కోసమైతే ప్రతిరోజు ఉదయం లేవగానే వాటిని గూడులో నుంచి వదిలి వాటికి గింజలు పోస్తా. మట్టిపాత్రలో నీళ్లు పోసి ఉంచుతా. పిట్ట గూళ్లను కాపాడతాను.

3. పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అలాగే మిగతా పక్షుల్లో ఆశ్చ్యర్యం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా?
జ: కోడి తన పిల్లలను ఎవరైనా ముట్టుకున్నట్లు అనిపిస్తే మీదికెగిరి పొడుస్తుంది. తన పిల్ల ఏదైనా మురికి కాలువలో పడితే అనేకసార్లు ముందుకు వెనక్కు అరుస్తూ తిరుగుతుంది. కుక్క, పిల్లి లాంటివి దగ్గరికి వస్తే బెదిరిపోయి అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.
   పిచ్చుక తుమ్మచెట్టుపై గూడు కట్టుకుంటుంది. ఈ గూడు అల్లిక విధానం సుందరంగా ఉంటుంది. గూడు నిర్మాణంలో ఆ పిచ్చుక పడే శ్రమ ఔరా అనిపిస్తుంది.

 

4. విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జ: మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రేమను తెలియజేసేలా ప్రవర్తించడం లేదా బహిర్గతం చేయడాన్నే 'విశ్వాసం ప్రదర్శించడం' అంటారు. మనమీద పెట్టుకున్న విశ్వాసాన్ని మాట రూపంలో అనుకోవడం కాకుండా ప్రదర్శిస్తాం. విశ్వాస ప్రదర్శన ఏరకంగానైనా ఉంటుంది.

 

5. అంతఃప్రేరణాబలం అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జ: హృదయంలో పదునైన ఉత్తేజం రావడమే అంతఃప్రేరణా బలంగా చెప్పవచ్చు. లోపల కలిగిన ప్రేరణ ఎంతటి పనినైనా చేయిస్తుంది. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అవుతుంది. అంతఃప్రేరణాబలం శారీరక, మానసికమైన పనులను సైతం చేసేందుకు చేయూతను ఇస్తుంది. మనం దేనినైనా సమయానుకూలంగా పూర్తిచేయవచ్చు.

6. మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జ: జిల్లాస్థాయి పాటల పోటీలో వందల మందిలో నేను పాడిన పాటకు ప్రథమ బహుమతి వచ్చిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే ఆ బహుమతి తీసుకున్న రోజు నుంచి నేనే అన్ని స్థాయుల్లో పాటల పోటీల్లో ముందుంటున్నాను.

 

7. తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జ: తెలివిని ఉపయోగించకుండా చేసే పనులను తెలివిమాలిన పనులు అంటారు. తెలివితో పనిచేస్తే పనులు సక్రమంగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీతెలియక పనులు చేసేటప్పుడు తప్పిదాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో 'తెలివిమాలిన పనులు' అనే మాటను వాడతారు.

 

8. మీమీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జ: మా తెలుగు మాస్టారు క్విజ్ పోటి పెట్టినప్పుడు చివరి రౌండ్‌లో ఒక్క ప్రశ్నకు జవాబు చెబితే నా జట్టుకే మొదటి బహుమతి వచ్చేది. కానీ తొందరగా జవాబు గుర్తురాకపోవడంతో బహుమతి వేరే జట్టుకు వచ్చింది. సరైన సమయంలో జవాబు చెప్పలేకపోయినందుకు నా మీద నాకే కోపం వచ్చింది.

 

9. పావురం గూడు ఎలా ఉందో తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జ: నాకు తెలిసిన పక్షి గూళ్లు - కాకి గూడు. ఇది చెట్టుపై కట్టెలు, గడ్డితో గుండ్రంగా కట్టి ఉంటుంది. పిచ్చుక గూడు అయితే తుమ్మచెట్టుకు వేలాడుతూ ఉంటుంది. ఇది సన్నగా, మెత్తగా ఉంటుంది. ఆ నిర్మాణం దానికి ప్రత్యేకం. పిట్ట గూడు గడ్డితో గుండ్రంగా కడుతుంది. పక్షుల గూళ్లన్నీ ఒకేలా ఉండవు.

 

10. దివ్యసంకల్పం చోటుచేసుకోవడం అంటే ఏమిటి?
జ: అనుకోకుండా మంచి పనులు మొదలుపెట్టి విజయవంతంగా ముగించడాన్ని 'దివ్యసంకల్పం చోటు చేసుకోవడం' అంటారు. దివ్య సంకల్పం చోటుచేసుకున్నప్పుడు సమయం, సందర్భం ఉండదు. ఎలాంటి స్థాయిలోనైనా జరుగుతుంది.

 

11. పిల్లపక్షిని దాని తల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా? మరి మిమ్మల్ని ఎవరు? ఎలా పెంచారో చెప్పండి.
జ: నన్ను మా అమ్మ చాలా అల్లారుముద్దుగా పెంచింది. నేను ఏది అడిగినా ఇప్పటికీ కాదనదు. అడిగినవన్నీ సమకూరుస్తుంది. బట్టలు, బొమ్మలు.. ఇలా సమస్తం కొనిపెడుతుంది. మంచి మంచి కథలు చెబుతుంది. పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పింది.

 

12. 'ఘనకార్యం చేయడం' అనే వాక్యం నుంచి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏయే సందర్భాల్లో వాడతారు?
జ: 'ఘనకార్యం చేయడం' అనే వాక్యాన్ని ఏదైనా తప్పు పని జరిగినప్పుడు వాడతారని తెలుసుకున్నాను. తెలియక ఒక పని చేసినప్పుడు దానివల్ల ఇబ్బంది ఎదురు అవుతుంది. నష్టం జరుగుతుంది. ఆ సందర్భంలో 'ఘనకార్యం చేశావు' అని మనల్ని హేళన చేయడం పరిపాటి. అంతేకాకుండా గొప్ప పనులు చేసిన సందర్భంలో కూడా ఈ వాక్యాన్ని వాడతారు.

 

13. 'ఏ మాటకు ఆ మాటే' అనే వాక్యాన్ని ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జ: ఉన్న విషయంలోని నిజాన్ని, అబద్ధాన్ని వేరు చేసి చూపే సందర్భంలో వాడతారు.
   వాస్తవాన్ని అంగీకరించే సందర్భంలో వాడతారు. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఒక విషయంపై మాట్లాడుతున్నప్పుడు మరో విషయం చెప్పే సందర్భంలో 'ఏ మాటకామాటే' చెప్పాలి వేరే విషయాలు ఎందుకు అని ప్రశ్నించడం గమనించవచ్చు.

14. పావురం కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువులు/ పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జ: కప్పలు ఒక కాలంలోనే కనిపించి తర్వాత కొంతకాలంపాటు నిద్రావస్థలో ఉంటాయి. బల్లి తన జిగురు నాలుకతో పురుగులను అందుకుంటుంది. తేనెటీగలు తేనెను చెట్లపై పెట్టి కొంతకాలం వరకు దాని మీదనే ఆధారపడతాయి. పిచ్చుకలా గూటి నిర్మాణం ఎవరితరమూ కాదు. నీటికాకులు నీళ్లలోని చేపలను పైనుంచి చూసి అందుకుంటాయి.

 

15. 'నిమ్మకు నీరెత్తడం' అని ఏయే సందర్భాల్లో వాడతారు?
జ:  ఏం పట్టించుకోని సందర్భంలో 'నిమ్మకు నీరెత్తడం' అనే పదాన్ని వాడతారు. విషయం తెలిసి ఉన్నా ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు తన గురించి తానే తప్ప ఇతరులకు సంబంధించిన వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సందర్భంలో వాడతారు.

 

16. 'మహత్తర ఘట్టానికి చేరుకోవడం' అంటే ఏమిటి? దీనికి కొన్ని ఉదాహరణలు తెలపండి.
జ: ఒక పని విజయవంతంగా పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని 'మహత్తర ఘట్టానికి చేరుకోవడం' అంటారు. పనిలోని ఫలితం పొందేస్థితిని పైవిధంగా పిలుస్తారు.
ఉదా: 1) గ్రామానికి కావాల్సిన మంచినీటి కోసం నిర్మించే వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయిన సందర్భంలో 'మహత్తర ఘట్టానికి చేరుకుంది' అని అంటారు.
   2) సుమారు రెండు సంవత్సరాలపాటు రాసిన పుస్తకం అచ్చయి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మహత్తర ఘట్టానికి చేరుకుంది అని అంటారు.

   

17. మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకున్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జ: చలికాలంలో వాతావరణం ఉదయం మంచుతో నిండి ఉంటుంది. నిండా దుప్పట్లు కప్పుకొని చలికి గజగజ వణుకుతూ సూర్యుడి కోసం ఎదురు చూస్తాం. మరికొందరు 'మంటలు' వేసుకుని దాని చుట్టూ కూర్చుంటారు. అందరూ రాత్రివేళ తొందరగా తలుపులు బిగించి పొద్దు ఎక్కువయ్యాక లేస్తారు. ఉదయం, రాత్రి వేళలో ప్రయాణాలు చేయరు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం వేళలో నిండా దుస్తులు ధరించి, స్వెట్టర్లు వేసుకుని నడకను కొనసాగించేవారున్నారు.

 

18. చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రి పక్షి ఏం చేసింది? తల్లి పక్షి ఏం చేసింది? అట్లాగే చిన్నపిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి?
జ: చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రి తనని జరిపేకొద్దీ పిట్టగోడ అంచుకు చేరింది. మరింతగా తన భారాన్ని తండ్రి పక్షి వేసింది. చిత్రగ్రీవం దాంతో గోడమీద నుంచి జారనే జారింది. స్వీయరక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలోకి ఎగిరింది. అలా చిత్రగ్రీవం గాలిలో ఎగురుతున్న సమయంలో తల్లి పక్షి మేడమీదికి చేరుకుని సహాయంగా ఎగరసాగింది. ఆ రెండూ పదినిమిషాలపాటు ఎగిరాయి.
   చిన్న పిల్లలు నడక నేర్చుకునేముందు మెల్లిగా గోడలు పట్టుకుని లేవడం మొదలు పెడతారు. అలా చేసిన కొన్ని రోజులకు మెల్లిగా అడుగు వేయడం చేస్తారు. తర్వాత కొన్ని రోజులకు వేలు పట్టుకుంటే అడుగులు వేస్తూ నడుస్తారు. ఆ తర్వాత సొంతంగా లేవడం, నడవడం చేస్తారు.

ఇవి చేయండి 
 

 I. అవగాహన - ప్రతిస్పందన


1. ''మనుషుల్లాగే పక్షులు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు". దీనిమీద మీ అభిప్రాయాన్ని తెలపండి. కారణాలను వివరిస్తూ రాయండి.
జ: మనుషుల్లాగే పక్షులు, జంతువులకు తమ పిల్లలను పెంచడం తెలుసు.
ఎలా అంటే...
* పక్షులు వాటి పిల్లలను గూళ్లలో ఉంచి కాపాడతాయి.
* ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తెచ్చి పిల్ల పక్షులకు తినిపిస్తాయి.
* మెల్లిమెల్లిగా నడకను, ఎగరడాన్ని నేర్పిస్తాయి.
* పిల్లులైతే నోటితో ఆహారాన్ని పట్టుకొచ్చి పిల్లికూనల ముందు ఉంచుతాయి. పాలిచ్చి పెంచుతాయి. ప్రేమగా చూసుకుంటాయి.
* జంతువులు, పక్షులు తమ పిల్లల్ని ఎవరైనా ముట్టునట్లయితే వాటిని కాపాడుకునేందుకు ముట్టుకున్నవారి వెంటబడతాయి, వారిని పొడుస్తాయి.
* తమ వెంట పిల్లలు లేనప్పుడు తల్లులు (పక్షులు, జంతువులు) వివిధ రకాలుగా అరుస్తాయి. శబ్దాలు వినిపింపజేస్తాయి. కన్నవాటికి తమ పిల్లలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. రక్త సంబంధం హృదయాంతరాల్లో బలమైన అనుబంధంగా ఉంటుంది. సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతిజీవికి తన పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది.

2. పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
 

అ) చిత్రగ్రీవం ఏ వయసులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జ: * చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుంచే తన తల్లి/తండ్రి వచ్చిన ప్రతిసారి తన ముక్కు తెరచి తన గులాబీరంగు ఒంటిని బంతిలా ఉబ్బించింది.
* మూడు వారాల వయసులో తన గూటిలోకి వచ్చిన చీమను తినే వస్తువు అనుకుని ముక్కుతో పొడిచి చంపింది.
* అయిదో వారం వరకు తను పుట్టిన గూటి నుంచి బయటకు గెంతి పావురాళ్ల గూళ్ల దగ్గర ఉంచిన మట్టి మూకుళ్లలోంచి మంచినీళ్లు తాగే స్థాయికి చేరుకుంది.
* అయిదో వారం తర్వాత రచయిత అరచేతిలోని గింజలను ఒక్కోటిగా పొడుచుకు తినేది.
* రోజు రోజుకు పెరిగి పెద్దవుతున్న క్రమంలో కళ్ల మీదకు సన్నపాటి చర్మపు పొర సాగి వచ్చింది. అది గాలి దుమారాల్లో, తిన్నగా సూర్యుడి దిశగా వెళ్లేటప్పుడు ఇబ్బంది లేకుండా చూస్తుంది.
* సన్నపాటి చర్మపు పొర వచ్చిన మరో రెండు వారాల కల్లా (7వ వారం) చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకుంది.

ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లి పక్షి, తండ్రి పక్షి నుంచి ఏమేం సంక్రమించాయి?
జ: చిత్రగ్రీవానికి దాని తల్లి పక్షి ద్వారా తెలివితేటలు, తండ్రి పక్షి నుంచి వేగం, చురుకుదనం, సాహసం సంక్రమించాయి. తల్లిదండ్రుల నుంచి యుద్ధ రంగాల్లో, శాంతి సమయాల్లో అమోఘంగా పని చేయగల వార్తాహరిగా తయారైంది.

ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ 'అది సుందరమైంది, మందకొడిది, ఏపుగా పెరిగింది' అని రచయిత ఎందుకన్నాడు?
జ: చిత్రగ్రీవాన్ని రచయిత 'హరివిల్లు మెడగాడు' అనేవాడు. చిత్రగ్రీవం పుట్టిన తర్వాత రోజులు, వారాలు గడిచేకొద్ది దానికి ఈకలు పెరిగాయి. మూడోనెల వచ్చాక ఆ ఈకలకు అతి సుందరమైన రంగులు వచ్చాయి. ఇలా అన్ని రంగులతో ఉండే పావురాలు వేరేవి లేవు అందుకే రచయిత  చిత్రగ్రీవాన్ని అతి సుందరమైందని అన్నాడు.
   చిత్రగ్రీవం ఆహారం కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడేది. శక్తి యుక్తులు పెంపొందించుకోవడంలో తన దగ్గర ఉన్న అన్ని పావురాల్లో ఇదే మందకొడిదని రచయిత అభిప్రాయం.
   చిత్రగ్రీవం బాగోగులను తల్లి పక్షి, తండ్రి పక్షి ఎవరో ఒకరు దగ్గర ఉండి చూసుకునేవి. మరొక పక్షి ఆహార సేకరణలో నిమగ్నమయ్యేది. తల్లిదండ్రుల పుణ్యమా అని చిత్రగ్రీవం ఏపుగా పెరిగిందని రచయిత అన్నాడు.

ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? 'తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి ఆయన చెప్పాడు?
జ:  'చిత్రగ్రీవం' అనే పావురం గురించి మనకు వివరిస్తోంది రచయిత ధనగోపాల్ ముఖర్జీ. గుడ్డులో ఉన్నప్పుడు చిత్రగ్రీవం ఓ ప్రమాదంలో నుంచి తృటిలో తప్పించుకున్న విషయం రచయిత చెప్పాడు. ఇతడి మేడ మీద పావురాల గూళ్లు ఉండేవి. రచయిత గూటిని శుభ్రం చేస్తున్న సందర్భంలో గుడ్లను తీసి మళ్లీ పెట్టే సమయాన తండ్రి పావురం రెక్కలతో ఆయన ముఖాన్ని తాకించి, గోళ్లతో ముక్కుమీద గీరింది. ఆ నొప్పి వల్ల రెండో గుడ్డును రచయిత శుభ్రపరచిన గూటిలో పెట్టే సమయంలో జారిపోయింది. పొదుగుల కాలంలో గూళ్లను శుభ్రపరచేటప్పుడు దాడిని ఊహించ లేకపోయినందుకు 'తాను చేసిన పనిని పనికిమాలిన పని' అని రచయిత అన్నాడు. తాను పగల గొట్టిన ఆ రెండో గుడ్డులో ప్రపంచంలో కెల్లా అతి విశిష్టమైన పావురం ఉండేదేమో అని రచయిత బాధపడ్డాడు.

 

ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లి పక్షి ఏం చేసింది?
జ:  పిల్లపక్షి ఎగరడం కోసం తండ్రి పక్షి పిట్టగోడ అంచునకు తీసుకొచ్చి తన భారాన్నంతా వేసింది. పిల్లపక్షి గోడ మీద నుంచి జారింది. ఒక అడుగు జారగానే స్వీయరక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలోకి ఎగిరింది. కింది అంతస్తులో జలకాలాడుతున్న తల్లి పక్షి మెట్ల మీదుగా మేడమీదకు చేరుకుని పిల్లపక్షికి సాయంగా ఎగిరింది.
   తల్లి పక్షి, పిల్ల పక్షి రెండూ పది నిమిషాలపాటు ఎగిరాయి. ఆకాశంలో గిరికీలు కొట్టి వచ్చి కింద వాలాయి. వాలేటప్పుడు పిల్లపక్షి నానాపాట్లు పడి వణికింది. గాభరాపడింది. వాలే క్షణంలో కాళ్లు నేలను రాసుకుంటూపోయాయి. రెక్కలను కంగారుగా టపటపలాడిస్తూ కష్టంతో ముందుకు సాగి ఆగింది. ఆ సమయంలో తల్లిపక్షి దాని పక్కకు చేరి ముక్కుతో నిమిరింది. దాని రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిలా లాలించింది.

ఊ) ధనగోపాల్ ముఖర్జీ చేసిన సాహితీసేవ ఏమిటి?
జ:  రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం రచయిత ధనగోపాల్ ముఖర్జీ ముఖ్య వ్యాపకాలు. ఆయన రాసిన విలక్షణ పుస్తకం - చిత్రగ్రీవం. దీనికి 'అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్' ఇచ్చే విశిష్ట పురస్కారం 'న్యూబెరీమెడల్' వచ్చింది. ఈ బహుమతి అందుకున్న ఒకే ఒక భారతీయ రచయిత - ధనగోపాల్ ముఖర్జీ.
   జంతువులకు సంబంధించిన పిల్లల పుస్తకాలను తొమ్మిదింటిని ఆయన రాశారు. వీటిలో 1922లో రాసిన 'కరి ది ఎలిఫెంట్', 1924లో రాసిన ''హరిశా ది జంగిల్ ల్యాడ్", 1928లో రాసిన 'గోండ్ ది హంటర్' పుస్తకాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ భారత దేశం, ఇక్కడి కథల గురించి కూడా రచనలు చేశారు. బాలసాహిత్యానికి విశేష కృషి చేశారు.

4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.
చాతక పక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమ వైపునకు వచ్చే చాతక పక్షుల బారి నుంచి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతక పక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులు ఎత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ల నిర్మాణంలో గడ్డీ-గాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు... లాంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్లు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్లున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్లల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం లాంటి పనులు చెయ్యలేవు. అయితే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ల పుణ్యమా అని అవి తమ గోళ్లతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి లాంటి నున్నటి గోడలు, ప్రదేశాలను పట్టుకుని వెళ్లగలవు. తమ గూళ్లలను నిర్మించుకోవడానికి ఇళ్ల చూర్ల కింద గోడల్లోని తొర్రలను ఎన్నుకుంటాయి. రాలిన ఆకులు, గాలిలో ఎగరాడే గడ్డిపోచలను ముక్కున కరచుకుని గూట్లోకి చేరుస్తాయి. వాటికి తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇది చాతక పక్షుల వాస్తుకళా నైపుణ్యం.
 

అ) చాతక పక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్లను నిర్మించుకుంటాయి ఎందుకంటే .....
జ: చాతక పక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్లను నిర్మించుకుంటాయి ఎందుకంటే అవి పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.

ఆ) చాతక పక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు ఎందుకంటే .....
జ: చాతక పక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు ఎందుకంటే వాటి కాళ్లు పొట్టిగా ఉంటాయి. చురుకుదనం కాళ్లలో కనిపించదు.

 

ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతక పక్షులు జారకుండా ఉండటానికి కారణం .....
జ: నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతక పక్షులు జారకుండా ఉండటానికి కారణం కొక్కేల్లాంటి కాలివేళ్లు. ఇవి తమ గోళ్లతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోతాయి.

 

ఈ) చాతక పక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే .....
జ: చాతక పక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే అది ఎండిపోయి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.

 

ఉ) వాస్తు కళానైపుణ్యం అంటే .....
జ: వాస్తు కళానైపుణ్యం అంటే ఇంటిని నిర్మించుకునే విధానంలో తెలివిని ప్రదర్శించడం.

 

I. వ్యక్తీకరణ - సృజనాత్మకత


1. కింది ప్రశ్నలకు ఆలోచించి అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ) చిత్రగ్రీవం గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జ: రచయిత ఊరిలో ఉన్న దాదాపు నలభై వేల పావురాల్లో 'చిత్రగ్రీవం' అతి సుందరమైంది. ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది.
మూడువారాల వయసులో 'చిత్రగ్రీవం' తన గూటిలోని 'చీమను ఒక్కసారిగా పొడిచి తునకలుగా చేయడం.
తండ్రి పక్షి పిట్టగోడపై నుంచి కిందకు జారవిడిచినప్పుడు స్వీయ రక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు గాలిలో విప్పడం.

 

ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జ: మానవులు పావురాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. పెంపుడు పావురాల కోసం సాయంత్రం తమ డాబా ఇళ్ల మీద నిలబడతారు. పావురాలు యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శిస్తాయి. రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ గగన సీమల్లో ఎగిరినా చివరికి అవి తమ అద్భుతమైన అంతఃప్రేరణాబలంతో మానవుడి పంచకు చేరుకుంటాయి. పావురాలు యజమానులంటే ప్రాణం ఇస్తాయి. ఇవి రచయితతో అతి సన్నిహితంగా ఉన్నాయి. అందువల్ల మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని అన్నాడు.

ఇ) చిత్రగ్రీవం తండ్రి పక్షి గురించి రాయండి.
జ: చిత్రగ్రీవం తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తండ్రిపక్షి వేగం, చురుకుదనం, సాహసం కలిగింది. గుడ్డును పొదగడంలో సహాయం చేసేది. తల్లిపక్షితో సమానంగా చిత్రగ్రీవం బాగోగులను సరిచూడటంలో, ఆహారం అందించడంలో పాలు పంచుకుంది. తల్లిదండ్రుల శ్రమా, శ్రద్దా పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా ఎదిగింది.
   చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడంలో భాగంగా తండ్రి పక్షి గోడమీద నుంచి చిత్రగ్రీవాన్ని జరిపి జరిపి తన భారాన్ని అంతా దాని మీద వేసి అది కిందకి జారేలా చేసింది. అప్పుడు స్వీయరక్షణ కోసం చిత్రగ్రీవం అసంకల్పితంగా రెక్కలు విచ్చుకుంది.

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జ: రచయిత పెంపుడు పావురం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం అంటే 'ఉల్లాసభరితమైన రంగులతో నిండిన కంఠం కలిగింది అని అర్థం.
   చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుంచే తన తల్లి/ తండ్రి గూటికి వచ్చిన ప్రతిసారి తన ముక్కు తెరిచి తన గులాబీరంగు ఒంటిని బంతిలా ఉబ్బించేది. తల్లిదండ్రులు బాగోగులు చూస్తూ, ఆహారం అందించడంతో అది మహా ఏపుగా ఎదిగింది. ఈకలు తెలుపు రంగుగా మారి తర్వాత ముళ్ల లాంటి ఈకలు వచ్చి, కళ్ల దగ్గర, నోటి దగ్గర వేలాడుతున్న పచ్చని చర్మం రాలిపోయింది. పొడవైన, గట్టి, సూదిలాంటి ముక్కు రూపుదిద్దుకుంది.  చిత్రగ్రీవం పుట్టిన అయిదో వారానికల్లా మట్టి మూకుళ్లలోంచి మంచినీళ్లు తాగేస్థాయికి చేరింది. శక్తియుక్తులు పెంపొందించుకోవడంలో మాత్రం అది మందకొడిగా ఉండేది. 
చిత్రగ్రీవం మెడ సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులుగా శోభిల్లుతుంది. తండ్రి పక్షి ఎగరడం నేర్పింది. ఎగిరిన చిత్రగ్రీవానికి సహాయంగా తల్లి పక్షి కూడా ఎగిరింది.
   చిత్రగ్రీవం అతిసుందరమైంది. మందకొడిగా ఉండేది. ఏపుగా పెరిగింది. రచయిత చేతిలోని గింజలను ఒక్కోటి పొడుచుకు తినేది. మొత్తంగా చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంగా సాగింది. చిన్న పిల్లలను ఎత్తుకుని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయి సౌఖ్యం లభిస్తాయో తన తండ్రి పక్షి, తల్లి పక్షుల నుంచి అలాంటి వెచ్చదనం చిత్రగ్రీవానికి లభించింది.

ఆ) శిశువుల పెంపకంలో పక్షులు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
జ: శిశువుల పెంపకంలో పక్షులు, మానవులకు తేడాలు ఎక్కువగా ఉండవు. మనం గమనిస్తే తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంది. అదేవిధంగా పక్షులు నోటి ద్వారా ఆహారాన్ని ఇస్తాయి. మానవులు శిశువుల పట్ల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగానే, తమ పిల్లలకు పక్షులు మెత్తటి గూడును తమ పిల్లల కోసం ఏర్పాటు చేస్తాయి. శిశువులకు తల్లి ఉడకబెట్టిన ఆహారాన్ని ఎలా అందిస్తుందో అలాగే పక్షులు తమ నోట్లో నానబెట్టిన పదార్థాలను ఆహారంగా ఇస్తాయి. తల్లి తన బిడ్డ ఏడిస్తే దగ్గరికి చేరినట్లుగానే పక్షులు తమ పిల్లలు చప్పుడు చేయగానే దగ్గరికి చేరతాయి.  మానవులు శిశువులకు పాకడం, నడవడం పక్కన ఉండి నేర్పిస్తారు. అలాగే పక్షులు తమ సంతానానికి దగ్గర ఉండి ఎగరడం నేర్పిస్తాయి.  తల్లిని శిశువు తన ఏడుపుతో దరి చేరుతాడు. పక్షులు అరుపులతో కలుస్తాయి. శిశువులను ఎవరైనా బెదిరిస్తే తల్లిదండ్రులు వారిని వారిస్తారు. కోపగించుకుంటారు కూడా. అలాగే పక్షులు తమ సంతానాన్ని ఎవరైన తాకినా, భయపెట్టినా అవి దాడికి దిగుతాయి.
శిశువు ఏడిస్తే లాలిస్తుంది తల్లి. అదే విధంగా పక్షులు తమ సంతానాన్ని ఊరడిస్తాయి.

 

3. సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) 'చిత్రగ్రీవం' అనే పావురం పిల్ల ఎలా పుట్టిందీ? ఎలా ఎగరడం నేర్చుకొన్నది...! తెలుసుకున్నారు కదా. అలాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి.
జ: మా ఇంట్లో 'జాకీ అనే పిల్లి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని ఒకరోజు ఇంటి మూలన శబ్దం చేస్తూ కనిపించింది. మా అమ్మ పాలు పోసింది. దాంతో రోజూ ఎక్కడ తిరిగినా ఆ సమయాన్ని బట్టి వచ్చేది. ఇలా రోజులు గడిచేకొద్ది ఇంట్లో అందరికి దగ్గరైంది. దాని 'మ్యావ్' అనే శబ్దానికి కోళ్లు భయపడి బెదిరేవి. ఇంట్లోని ఎలుకలు తమ తిరగడాలను తగ్గించుకున్నాయి. ఎక్కడైనా శబ్దం వస్తే చెవులను రిక్కించి వేటాడేది. మాంసాహారం దానికి ప్రీతిపాత్రమైంది. 
   పెరిగి పెద్దగా అవుతున్న కొద్ది తెలివిగా ప్రవర్తించేది. కొన్నాళ్లకు గర్భం దాల్చింది. నడకలో నెమ్మది, లావెక్కిన పొట్టతో నిదానంగా ఉండటం గమనించాం. ఒకరోజు తెల్లవారేసరికి నాలుగు పిల్లలను కన్నది. ఆ పిల్లి కూనలు కళ్లు తెరవలేదు. ఆ తల్లి పిల్లలను తన నాలుకతో నాకుతూ శుభ్రపరిచింది. దానికి పాలు పెట్టాం. అది రోజు అంతా పిల్లల దగ్గరే ఉంది. అమ్మ పెట్టిన పెరుగన్నం తింటుండేది. పిల్లలను నోట్లో పెట్టుకుని పక్క ఇంట్లోకి పట్టుకుని పోయేది. కంటికి రెప్పలా కాపాడేది. అందరి ఇళ్లలోకి తీసుకుని వెళ్లేది. మళ్లీ కొన్ని రోజులకే మా ఇంటికి చేరింది. తన పిల్లల కోసం నోటిలో మాంసాహారాలను పట్టుకుని వచ్చేది. దాన్ని పిల్లిపిల్లలు తినేవి. ఎలుకల కోసం ముఖ్యంగా కనిపెడుతుండేది.
అన్ని పక్షులు కలిసి: మానవులందరూ కలిసి పక్షిజాతిని పట్టించుకోవడం లేదు. అనాలోచితంగా తమ సౌకర్యాల కోసం సెల్‌టవర్లు వాడుతున్నారు. వాటివల్ల పక్షులు అంతరిస్తున్నాయి.
పిల్లలు: అయితే సెల్‌ఫోన్ల వినియోగం తగ్గించాలన్నమాట.
గువ్వలు: అవును మరి.
పాలపిట్ట: అంతేకాదు, మానవుడు చెట్లను పెంచలేకపోవడం వల్ల వాతావరణంలో వేడి ఎక్కువైంది. మాకు కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు.
రామచిలుక: మీరైనా కాపాడండి.
దర్శన్: అయితే మేమేం చేయాలి.
రామచిలుక: ప్రజలను చైతన్య పరచండి. పక్షి జాతి అంతరించి పోయే ప్రమాదం ఉందని వారికి తెలియజేయండి. చెట్లను కాపాడండి. మొక్కలను నాటండి.
మిగిలిన పక్షులు: మమ్మల్ని మీరే రక్షించాలి.
పిల్లలు: అయితే ఇప్పుడే వెళ్లి అందరికి తెలియజేస్తాం.


 

రచయిత: అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం