• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిత్రగ్రీవం

భాషా కార్యకలాపాలు/ప్రాజెక్టుపని 


 

1. ధనగోపాల్ ముఖర్జీ రాసిన 'చిత్రగ్రీవం ఓ పావురం కథ' అనే పుస్తకాన్ని (లేదా) పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుంచి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి (లేదా) అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి రాసి ప్రదర్శించండి.
జ: పక్షుల గురించి
   కొన్ని రకాల పక్షులు తమాషా చేస్తుంటాయి. వాటిలో మనం ఎంతో ఇష్టపడే 'కోకిలమ్మ' తన గూడు కట్టుకునే విషయంలో మాత్రం బద్ధకిస్తుంది. అందుకే తన గుడ్లను కాకి గూట్లో పెడుతుంది. అలాగని నిర్లక్ష్యం చేయదు. రోజూ ఆ  గుడ్లు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటుంది. ఉన్నాయా! సరే... ఒకవేళ కాకికి తెలిసిపోయి ఆ గుడ్లను కిందికి తోసేస్తే మాత్రం కోకిలకు మహాకోపం వచ్చేస్తుంది. అసూయతో కాకి గూటిని నాశనం చేస్తుంది. టైలర్ బర్డ్ భలే కళాకారిణి. ఆకులను పుల్లలతో కుట్టి అందమైన గూడు కట్టుకోవడం దాని నైపుణ్యం. దాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఈజిప్టు రాబందుకు అయితే ఆస్ట్రిచ్ పక్షి గుడ్లు తినడం చాలా ఇష్టం. కాని అంత పెద్ద గుడ్డును పగలకొట్టే శక్తి దానికి ఉండదు. అందుకే అది ముక్కుతో రాళ్లను తెచ్చి గుడ్డు మీద వేసి కొడుతుంది. అది పగలగానే లోపలిదంతా తినేసి వెళ్లిపోతుంది.  పక్షులు ఉష్ణ రక్త జీవులు, వాటి దేహం ఈకలతో కప్పి ఉంటుంది. ఈ ఈకలే వాటిని పొడిగా, వెచ్చగా ఉంచుతాయి. ప్రపంచంలో 8,600 రకాల పక్షులు ఉన్నాయి. రెక్కలు ఉన్నా అన్నీ ఎగరలేవు. పక్షులు అన్నీ గుడ్లు పెడతాయి. గుడ్డు లోపల పక్షిపిల్ల పెరుగుతుంది. అది గుడ్డు పట్టలేనంతగా
పెరిగిపోయినప్పుడు గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది.
   పక్షులు ఎగరగలుగుతాయి కాబట్టి వాటి దేహాలు సాధ్యమైనంత తేలికగా ఉంటాయి. ఈకలు చాలా తక్కువ బరువు ఉంటాయి. పక్షి పిల్లలకు పళ్లు ఉండవు. వాటి ముక్కులు కొమ్ముతో రూపొందుతాయి. వాటి ఎముకలు గుల్లగా, అతి తేలికగా ఉన్నా దృఢంగా ఉంటాయి. దృఢమైన చేతుల్లా ఉండే రెక్కలు పక్షిని గాలిలోకి లేపి గాలిలోంచి ముందుకు దూసుకెళ్లేలా చేయగలవు.  పక్షుల్లో కొన్ని ఎగరలేవు. ఆస్ట్రిచ్, ఇము, కాపోకరి, పెంగ్విన్ లాంటి అతిపెద్ద పక్షులు వాటిలో ఉన్నాయి.

2. 'చిత్రగ్రీవం' అనే పక్షి పేరు పంచతంత్ర కథల్లో కూడా ఉంది. పంచతంత్ర కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథను గురించి రాసి ప్రదర్శించండి.
జ: పంచతంత్ర కథల పుస్తకంలో నేను చదివిన కథ ''చిలుక - కాకి"
 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కొండల మధ్యన ఉన్న ఒక చెట్టుపైన ఒక కాకి, ఒక చిలుక కాలం గడిపేవి. అవి రెండు ఎంతో స్నేహంగా కలిసుండేవి. ఒకరోజు అవి రెండూ హాయిగా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాయి.  మాటల మధ్యలో చిలుక కాకితో ''మిత్రమా! నీవు నల్లగా అందవికారంగా ఉన్నావు. నాకైతే నిన్ను చూస్తేనే ఎంతో జాలేస్తుంది" అంది. దానికి కాకి ''ఏం ఫరవాలేదు నేస్తమా!     అందానిదేముంది?" అంది. దానికి చిలుక 'అందం చాలా గొప్పది. చూడు నేను పచ్చగా అందంగా ఉన్నాను. నా ముక్కు ఎర్రగా ఉంది. నా రెక్కలు కూడా పెద్దవి, నువ్వే ఇలా ఉన్నావు మరెందుకో పాపం?" అంది గర్వంగా.  అప్పుడు కాకి ''సరే! మిత్రమా నువ్వే చాలా అందంగా ఉన్నావు, సరేనా" అంది. ఇవి రెండు మాట్లాడుకుంటూ ఉండగా, అక్కడికి వచ్చిన వేటగాడు ఈ పక్షులను చూసి ''హమ్మయ్య ఒకచోట రెండు పక్షులున్నాయి. ఇవాళ నా పంట పండింది" అని ఆనందపడి ఆ  పక్షులపైకి వల విసిరాడు. వలలో చిక్కుకున్న చిలుకని తీసి, పంజరంలో వేశాడు. కాకిని చూసి ''అయ్యో! కాకిని నేనేం చేసుకోవాలి?" అనుకుని దాన్ని విడిచిపెట్టి చిలుకని పట్టుకుపోయాడు. తన స్నేహితుడిని కోల్పోయానని కాకి బాధపడి, తన తోటి కాకుల గుంపులో కలిసి ఎగిరిపోయింది. ''అయ్యో! బడాయికి పోయి ఇలా బందీనైపోయానే" అని చిలుక బాధపడి పంజరంలోనే ఉండిపోయింది.
అందుకే 'అహంకారం ఉండకూడదు, అది మనకు ఎప్పటికైనా ముప్పుతెస్తుంది'.


 

రచయిత: అంజాగౌడ్


 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌