• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జానపదుని జాబు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఆలోచించండి - చెప్పండి 

1. లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు? ఎందుకు?
జ: యోగక్షేమాలు తెలుసుకునేందుకు లేఖలు రాస్తారు. ఒక తండ్రి దూరప్రాంతంలో ఉండే తన కుమారుడికి, కుమారుడు తన తండ్రికి రాసుకుంటారు. స్నేహితులు క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి లేఖలు రాసుకుంటారు. సౌకర్యాల లేమి కారణంగా తమ ప్రాంత సమస్యలను తెలుపుతూ ప్రజలు పత్రికలకు లేఖ రాయవచ్చు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు వ్యాపారుల మధ్య 'లేఖ'లు నడుస్తాయి. దూరప్రాంతంలోని బంధువులను ముఖాముఖిగా కలవాలంటే వ్యయప్రయాసలు ఉంటాయి. అందుకే వారు తమ మనసులోని భావాలను తెలియజేయడానికి లేఖలను ఆశ్రయిస్తారు. దీంతో వారి సమయం కూడా మిగులుతుంది.

 

2. 'అస్థిర భావం' అంటే మీకేం అర్థమైంది?
జ: అస్థిర భావం అంటే నిలకడలేని విధానం. గ్రామాల్లో ఇది బాగా ఉంటుందని నాకు అర్థమైంది. 'ఈవేళలో ఈ పని చేయాలి' అని కార్యక్రమం తయారుచేసుకునే పరిస్థితులు అక్కడ ఉండవు. కొన్నిసార్లు తీరికలేని పని ఉంటే, మరోసారి తక్కువ ఉంటుంది. ఒక్కోసారి అసలే ఉండదు. కాలం విలువైంది కాబట్టి గ్రామాల్లో ఈ అస్థిర స్వభావం తొలగించాలి

 

3. మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగపడతాయని భావిస్తున్నారా? ఎలా?
జ: మన చదువులు దైనందిన జీవితానికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను. సమాజంలో ఇతరులతో ఎలా వ్యవహరించాలో ఇది తెలుపుతుంది. ఒక సమస్యకు పరిష్కరాన్ని వివిధ కోణాల్లో తెలియజేస్తుంది. వివిధ పాఠ్యాంశాల్లోని 'విలువలు' బతకడాన్ని నేర్పుతున్నాయి. దారి తప్పకుండా సన్మార్గం వైపు పయనించేందుకు చదువులు సహకరిస్తున్నాయి. మన చదువులతో దైనందిన జీవితం సుఖమయం, శుభప్రదం అవుతుందని భావిస్తున్నాను.

 

4. మీరు చదువు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు?
జ: నేను చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాను. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్థిక, విద్యాశాఖల్లో ఏదైనా ఒక విభాగంలో ఉద్యోగం చేస్తాను. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. గ్రామ ప్రజలను చైతన్యవంతులను చేస్తాను. వారికి ఉపాధి మార్గాలను చూపిస్తాను. పట్టణాలు గ్రామాలవైపు చూసేలా ప్రయత్నిస్తాను. వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి గ్రామస్థులను కార్యోన్ముఖులను చేస్తాను.

 

5. ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం ఎందుకు పెరుగుతోంది?
జ: ఆత్మీయ అనుబంధాలు లోపించడం వల్ల మనుషుల్లో స్వార్థం పుట్టుకొస్తుంది. డబ్బుతో హోదా వస్తుంది అనే దురాలోచనతో, అన్నీ తనకే ఉండాలన్న కాంక్ష బలంగా ఉండటం వల్ల మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది. కొంత మంది స్వార్థపరుల ప్రభావం వల్ల మిగిలినవారు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు.  స్వార్థపరులు ఎవరి గురించీ ఆలోచించరు. వారికి ఎవరూ అండగా ఉండరు. 'స్వార్థపరమైన జీవితం సర్వ ఆపదలకు మూలం' అనే మాటలోని అంతరార్థాన్ని అందరూ గమనించాలి.

6. పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది. దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జ: 'పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది'. అక్కడి జీవనం ప్రశాంత వాతావరణంలో గడుస్తుంది. అక్కడి చెట్లు, పక్షులు, పశువులు, పంట పొలాలు చూడముచ్చటగా ఉంటాయి. కలుషితం లేని పర్యావరణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వివిధ రకాల కులవృత్తులవారు ఉంటారు. ఇంటిముందు విశాల స్థలాలు దర్శనమిస్తాయి. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి అందరూ ముందుకొస్తారు. కలిసికట్టుగా పని చేసుకుంటారు. పలకరింపులో ఆప్యాయత ఉంటుంది.

 

7. ''కష్టం వొకళ్ళది, ఫలితం మరొకళ్ళది" అంటే మీకేమి అర్థమైంది? దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జ: ''కష్టం వొకళ్ళది, ఫలితం మరొకళ్ళది" అంటే కష్టపడేవారు ఒకరు దాని లాభం తీసుకునేవారు మరొకరు అని అర్థం. దీని ద్వారా ''గ్రామాల్లో రైతులు పంట పండించేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత ఫలితాన్ని ఇనాందారుల చేతిలో పెట్టాల్సి వస్తుంది' అనే విషయం అర్థమైంది. 'కష్టం వొకళ్లది, ఫలితం మరొకళ్ళది' అనే వాక్యాన్ని శ్రమ దోపిడీ గురించి చెప్పేటప్పుడు, బానిసల గురించి ప్రస్తావించేటప్పుడు, కష్టపడినవారికి కాకుండా మరొకరికి ఫలితం దక్కుతుందని గ్రహించిన సందర్భంలో వినియోగిస్తాం.

 

8. చలిమంటలు వేసుకుంటూ, రైతులు కబుర్లు చెప్పుకుంటారు కదా! వారు ఏయే విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారో ఊహించండి?
జ: చలిమంటలు వేసుకుంటూ రైతులు కబుర్లు చెప్పుకుంటారు. ఆ సమయంలో వారు సాధారణంగా కింది విషయాలు మాట్లాడతారు.
* వర్షాల గురించి
* చుట్టుపక్కలవారు ఏయే పంటలు వేశారు?
* పంటకు వచ్చే తెగుళ్లు, నాణ్యమైన విత్తనాలు
* గతేడాది పంటకు, ఈ ఏడాది పంటకు తేడా
* కుటుంబ విషయాలు
* ఏ బ్యాంకు ఎంత అప్పు ఇస్తుంది, వాటి వడ్డీలు
* తనకున్న అప్పులు
* ప్రభుత్వం ఎవరికెంత రుణమాఫీ చేసింది?
* పంటకు నీటిపారుదల ఎలా చేస్తే బాగుంటుంది?
* పంటను తినే చిలుకలు, ఎలుకలను ఎలా అదుపుచేయాలి?
* స్థానిక రాజకీయాలు

 

ఇవి చేయండి

 అవగాహన - ప్రతిస్పందన 

1. పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు? ఎందుకు?
జ: అ) 'పల్లె గొప్పది' అని నేను సమర్థిస్తాను. పల్లెలో ఆత్మీయత, అనుబంధాలు చాలా ఎక్కువ. పల్లెల్లో ఎటుచూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కాలుష్యం లేని జీవనం పల్లెలో కనిపిస్తుంది. ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారిపోయాయి. పాఠశాల, సిమెంట్ రోడ్లు, తాగునీరు లాంటి కనీస వసతులు వచ్చాయి. ఆరోగ్య ఉపకేంద్రాలు వెలిశాయి. కులవృత్తులవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. వినియోగ వస్తువులు చౌకగా లభిస్తాయి. సహజసిద్ధ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తారు. పల్లెలో ఖర్చు తక్కువ. విశాలమైన ఇళ్లు, చక్కని పరిసరాలు పల్లెకు అందాన్ని ఇస్తాయి. పల్లె ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అక్కడి ప్రజల్లో 'మనం' అనే భావన ఉంటుంది.

 

ఆ) 'పట్నం గొప్పది' అని సమర్థిస్తాను. పల్లె కంటే పట్నంలో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాలమైన రోడ్లు ఉంటాయి. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. పట్టణాల్లో సినిమా థియేటర్లు, పిల్లల పార్కులు ఉంటాయి. ఎల్లప్పుడూ పని దొరుకుతుంది. ఖాళీగా ఉండే పరిస్థితి రాదు. అన్ని పనులు సజావుగా జరిగిపోతాయి. అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. నాణ్యమైన వైద్యం అందుతుంది. అన్ని రకాల వినియోగ వస్తువులు దొరుకుతాయి. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు.
గమనిక: పై రెండింటిలో ఏదైనా ఒక విషయం గురించి రాయాల్సి ఉంటుంది.

 

2. గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? తెలుసుకుని చర్చలో పాల్గొనండి.
జ: వ్యవసాయదారులు క్రమేపీ తమ వృత్తి నుంచి నిష్క్రమిస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా స్వీకరించిన రైతుల సంఖ్య తగ్గడం మనం చూస్తున్నాం.
దీనికి కారణాలు:
* ప్రకృతిలో వైపరిత్యాలు (అతివృష్టి, అనావృష్టి).
* ఎరువుల ధరలు పెరగడం
* పంటకు వివిధ రకాల రోగాలు రావడం
* విత్తనాల కొరత
* కాలానుగుణంగా కొంతమందిలో ఆసక్తి తగ్గడం
* వ్యవసాయ ఖర్చులు పెరగడం
* పెట్టుబడులు కూడా రాని సందర్భాలను తలచుకోవడం
* పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం
* అప్పులను తీర్చడానికి నిత్యం పని ఉండే నగరాలకు వలస వెళ్లడం
* వ్యవసాయ యంత్రాలపై వెచ్చించే ఖర్చులు అధికమవడం

 

3. కింది వాక్యాలు చదవండి. వీటిని ఏ సందర్భంలో ఎవరు అన్నారు?
 

అ) అన్నోయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా!
జ: తన మిత్రుడికి లేఖ రాసేందుకు కూర్చున్న రచయితను వాళ్ల అమ్మ ''కిరసనాయిలు పొగ కళ్ళలో పడుతుంది. కళ్ళు జబ్బు చేస్తాయి" అని అంది. అలాగే రచయిత మామయ్య ''పొద్దస్తమానమూ పని చేశావు. పడుకోకూడదా!" అని అన్న సందర్భంలో రచయిత చెల్లెలు ''అన్నోయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా!" అని రచయితతో అంది.

 

ఆ) ''అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చేయి"
జ: రచయిత తన చెల్లితో 'రూపాయలను అణాలు చేయాలంటే ఏమి చేయాలి?' అని అడిగాడు.
''దుకాణం మీదికి తీసుకువెళ్లి మార్చాలి" అని అన్నాడు రచయిత తమ్ముడు. 'కాదు పదహారు పెట్టి గుణించాలి' అన్నది రచయిత చెల్లెలు. ఆ సందర్భంలో రచయిత అమ్మ అతడి చెల్లెలు దగ్గరకు ఒక రూపాయిని దొర్లిస్తూ ''అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చేయి" అని రచయిత చెల్లెలితో చెప్పిన వాక్యం.

 

ఇ) ''వరిచేలో నీరుపడ్డది, నీవు రావాలి"
జ: రచయిత తన మిత్రుడికి లేఖ రాస్తున్నాడు. ఆ లేఖలో ''గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసుకుంటే పని కాదు. ఉపన్యాసాలిస్తే, కార్లలో నాలుగుసార్లు తిరిగితే పని కాదు. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు" అని రాశాడు. అప్పుడే రైతు కోటయ్య వచ్చి రచయితతో ''వరిచేలో నీరు పడ్డది నీవు రావాలి" అని అన్నాడు.

4. బోయి భీమన్న రాసిన 'ధర్మం కోసం పోరాటం'లోని కింది పేరాను చదవండి. పేరాలోని కీలకమైన అయిదు పదాలను గుర్తించండి.
పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే, పని మరింత చక్కగా సాగుతుంది. అప్పుడు అనుభవానికి మరింత పదునూ, కాంతి లభిస్తుంది. వాస్తవజ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. వాస్తవ జ్ఞానమే సరియైన జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. వాస్తవ జ్ఞానం దేశ, కాల ప్రాంతానుగుణంగా ఉంటుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలనా విధానాలు ఈ విధంగా విభిన్న విషయాలను తీసుకుని మనం పరిశీలించినా, ఈ సత్యం కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధివిధానాలు అన్నీ దేశ, కాల ప్రాంతానుగుణంగా ఎలా మారుతున్నాయో స్పష్టమవుతుంది. మార్పునకు  అతీతమైంది ఏదీ ఈ లోకంలో లేదు.
జ: పై పేరాలో కీలకమైన అయిదు పదాలు
       1) అనుభవం        2) ఆచరణ        3) వాస్తవ జ్ఞానం        4) పరిశీలన        5) మార్పు
*  పై పేరా ఆధారంగా కింది వాక్యాల్లో ఏవి సరైనవో (
  ద్వారా) గుర్తించండి.
అ) అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. (
 )
ఆ) 'జ్ఞానం' అనేది చదివితే, వింటే లభించేది. (
 )
ఇ) వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతుంటుంది. (
 )
ఈ) అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం సిద్ధిస్తుంది. (
 )
ఉ) మన ఆచార వ్యవహారాలు, విధివిధానాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. (
 )

5. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 
 

అ) జానపదుని లేఖలో కవి ఏయే విషయాల గురించి రాశాడు? 
జ: జానపదుని లేఖలో కవి గ్రామాల్లో ఉన్న అస్థిరభావం గురించి రాశాడు. కవి చెల్లెలు లెక్కలు చెప్పమని అడిగినప్పుడు కవి తమ్ముడు, అమ్మ మాట్లాడిన మాటలను, తల్లులు బిడ్డల సాన్నిధ్యాన్ని అనుభవించే ఆనందాన్ని గురించి ప్రస్తావించాడు. అభ్యసించే విద్యకు, జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం చెప్పాడు. సమాజం ఏమైనా సరే, దేశం దీనస్థితికి చేజారిపోతున్నా సరే బతికి స్వార్థాన్ని నింపుకోవడం గురించి చర్చించాడు. అందరి కాళ్లూ పట్టుకుని ఉద్యోగం సంపాదించేవారి గురించి చెప్పాడు.
     చదువుకున్నవారు పట్టణాల్లో సుఖాలు అనుభవిస్తూ ఉండటం చూసి, గ్రామోద్ధరణ లేదని పల్లె కన్నీరు పెడుతున్న విషయం గురించి రాశాడు. కోటయ్య వరి కుప్పచేలో నీళ్లు రావడం; కవి, కోటయ్య కలిసి వెళ్లడం గురించి చెప్పాడు. తొలకరి నుంచి ధాన్యాన్ని ఇనాందారుడికి ఇచ్చి వట్టి చేతులతో వెళ్లే రైతుల దీనస్థితి గురించి లేఖలో రాశాడు. క్రిస్మస్, సంక్రాంతికి సెలవులు కలిపి ఇస్తారని; తన దగ్గర డబ్బు లేక చదువు ఆగిపోయిందన్నాడు. స్నేహంపై ప్రపంచ స్వభావం గురించి తెలుపుతూ మిత్రుడిని తమ గ్రామానికి తప్పకుండా రమ్మని లేఖ రాశాడు.

 

ఆ) వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించాడు?
జ: వ్యవసాయదారుడి కష్టాలు - కవి వివరణ:
 తొలకరి జల్లుకై కళ్లు విప్పి కనిపెట్టుకుని ఉండటం.
 నీరు కాలువకు ఎప్పుడు వస్తుందా అని రాత్రింబవళ్లు గుర్తు చేసుకోవడం.
 విత్తనాలు చల్లి నీటి కోసం, కూలీల కోసం ఇతరులతో పోటీ పడటం. 

 ఆకుమళ్లను పశువులు తొక్కి తినేయకుండా రాత్రింబవళ్లు పొలాల్లోనే నేలపై పడుకుని కాపలా కాయడం.
 జెర్రులు, తేళ్లు, పాములకు తమ శరీరాన్ని అప్పజెప్పడం.
 విసుగు, విరామం లేకుండా పొలాలకు నీరు పెట్టడం, దున్నడం, ఊడ్చడం.
 ఎండా, వాన అనక పైరును ప్రతిరోజూ కాపలా కాయడం.
 ఎరువులు వేసి కలుపులు తీయడం. పంట పండించడం.
 పంటను ఎలుకలు, పక్షులు తినకుండా కాపాడటం.
 ధాన్యాన్ని తూర్పారబట్టి యజమానికి అప్పగించడానికి సిద్ధం చేయడం.
 ఇనాందారులకు ఫలితం అప్పగించి వట్టి చేతులతో ఇంటికిపోయి పస్తులు ఉండటం.

 

ఇ) చదువుకున్నవాళ్ల గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించాడు?
జ: చదువుకున్నవాళ్ల గురించి, పట్టణవాసుల గురించి కవి ప్రస్తావించిన అంశాలు:
చదువుకున్నవాళ్లు పట్టణాల్లో ఒక రూపాయిని రెండు పైసల నాణెంలా ఖర్చు పెడతారు. చదువుకున్న తర్వాత ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. బతకడానికి, తమ స్వార్థం కోసం అందరి కాళ్లూ పట్టుకుంటారు.
సంఘం ఏమైనా, దేశం అధోగతి పాలవుతున్నా సరే వారికి చీమ కుట్టినట్లయినా ఉండదు. వాళ్ల ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం మునిగిపోతున్నా లెక్క చేయరు. చదువుకున్నవారంతా తమ కష్ట ఫలాన్ని తింటూ పట్టణాల్లో సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. గ్రామోద్ధరణను పట్టించుకోరు. ఇది చూసి పల్లెటూళ్లు కన్నీరు పెడుతున్నాయని కవి ప్రస్తావించాడు.

ఈ) జానపదుడు తన పట్టణ మిత్రుడిని పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?
జ: జానపదుడు ఈ ఏడాది చదువు కొనసాగిస్తే పట్టణ మిత్రుడిని తన ఊరికి తీసుకురావాలనుకున్నాడు. కానీ డబ్బులేని కారణంగా చదువు కొనసాగలేదు. క్రిస్మస్‌కు, సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు కాబట్టి పట్టణ మిత్రుడిని రమ్మని జానపదుడు లేఖ రాశాడు.  ముఖ్యంగా జానపదుడి మిత్రుడు ఆర్ద్ర హృదయుడు. పల్లెటూరికి వచ్చి ఇక్కడి ప్రజలు పడే కష్టాలను తెలుసుకోవాలి. కష్టాలు తొలగిపోతే పల్లెటూర్లు సమాజానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈ విషయాలు తెలియజేస్తూ తన ఊరికి రమ్మన్నాడు.

 

ఉ) బోయి భీమన్న గురించి సొంత మాటల్లో రాయండి.
జ: బోయి భీమన్న 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. వారిది పేద దళిత కుటుంబం. అస్పృశ్యత బాగా ఉన్న కాలంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకుని చదువుకున్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితులయ్యారు. అస్పృశ్యతను తన రచనల ద్వారా రూపుమాపాలనుకున్న మేధావి. 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు. జర్నలిస్టు, ఉపాధ్యాయుడిగా పని చేశారు.  11 సంవత్సరాల వయసు నుంచే రచనలు చేశారు. 'పాలేరు' నాటకంతో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలలో చేర్చారు. ఆ నాటకం స్ఫూర్తితో విద్యనభ్యసించి ఉన్నత పదవులు అధిష్టించిన పేదలు, దళితులు ఎంతోమంది ఉన్నారు.
గుడిసెలు కాలిపోతున్నాయ్, ఉశారులు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు.  'గుడిసెలు కాలిపోతున్నాయ్' రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదును ఇచ్చి గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. భారత ప్రభుత్వం 'పద్మశ్రీ', 'పద్మభూషణ్‌'లతో సన్మానించింది. ''ప్రస్తుతం సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా" అని ధైర్యంగా తన మనసులోని మాటను తన కలం, గళం ద్వారా వినిపించిన కవి బోయి భీమన్న. తనదైన శైలిలో, అనేక ప్రక్రియల్లో బడుగులు, దళితుల జీవితాల గురించి రచనలు చేసిన చైతన్యశీలి.

 

 వ్యక్తీకరణ - సృజనాత్మకత 

1. కింది ప్రశ్నలకు ఆలోచించి అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
    అ) ''ఏమీ పనిలేకపోవడమే బద్ధకానికి కారణం" దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
   జ: పని లేకపోతే బద్ధకం వస్తుంది. మనిషికి రోజూ పని ఉంటే పనిలో నిమగ్నమై ఎక్కడా తన వేగాన్ని తగ్గించకుండా త్వరగా పని పూర్తి చేస్తాడు. బద్ధకం ఉంటే చిన్న చిన్న పనులు కూడా చేయకుండా సమయాన్ని వృథా       చేస్తాడు.  'పని' ఎంతటివారినైనా ప్రభావితం చేస్తుంది. 'పని' కావలసినంత దొరికితే మనిషికి బద్ధకం దూరమవుతుంది. బద్ధకం మనిషికి బద్ధ శత్రువు. పనిలేకుండా ఎక్కువ కాలం ఉండకూడదు. అది బద్ధకానికి దారితీస్తుంది. అందువల్ల నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి.

 

ఆ) ''కాలం చాలా విలువైంది" ఎందుకు?
జ: కాలం చాలా విలువైంది. ఎందుకంటే గడిచిన సమయం తిరిగి రాదు. కాలం విలువ తెలుసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. కాలం విలువను గుర్తించినవారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఒక్క క్షణం వృథా చేస్తే ఆ క్షణంలో మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలను కోల్పోతాం.
కాలం ద్వారా మనిషికి విజ్ఞానం వస్తుంది. అన్నింటిలోనూ విజయం సాధిస్తాడు. ఉదాహరణకు పరీక్షలకు ముందే రోజూ చదవడం వల్ల విషయావగాహన ఏర్పడుతుంది. పరీక్షల సమయంలోనే చదువుకుందాం అనుకుంటే విజయం సాధించలేం.
     విజయాన్ని నిర్ణయించేది కాలమే. ఏ పనీ చేయకుండా సమయాన్ని వృథా చేస్తే ఆ సమయంలో మనం చేయాల్సిన ఆ పని ద్వారా పొందే ఫలితం వాయిదా పడినట్లే. కాలాన్ని సక్రమంగా వినియోగించినప్పుడు మనిషి ఎదుగుదల కనిపిస్తుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు.

 

ఇ) చదువుకున్నవాళ్లంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జ: చదువుకున్నవాళ్లంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే చదువుకున్నవారు తమకున్న యోగ్యతలను బట్టి వివిధ హోదాల్లో పట్టణాల్లో స్థిరపడుతున్నారు. అధిక మొత్తంలో జీతాలు తీసుకుని సుఖపడుతున్నారు. కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. భవనాలను నిర్మించుకుంటున్నారు. తమ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ధనాపేక్ష, అన్నీ అనుభవించాలనే కోరిక వల్లే ఇలా జరుగుతుంది. చదువుకున్నవాళ్లు తమ కష్టఫలాన్ని తమ స్వార్థానికే వినియోగిస్తున్నారు. సమాజ అవగాహన లేకపోవడం, 'మనం' అన్న భావన మరచిపోవడం, సుఖాలకు అలవాటు పడటం దీనికి కారణాలుగా చెప్పొచ్చు.

 

ఈ) ''కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది" అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది?
జ: కష్టపడేవారు ఒకరైతే దాని లాభం తీసుకునేవారు మరొకరని రచయిత అన్నారు. ఎందుకంటే రైతు పంట పండించడానికి తొలకరి జల్లు కోసం, కాలువ నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాడు. కూలీల కోసం ఇతరులతో పోటీపడతాడు. జెర్రులకు, తేళ్లకు, పాములకు తన శరీరాన్ని అప్పచెబుతాడు. పంటను నిత్యం చూస్తూ ఎరువులు చల్లుతాడు. కలుపు తీస్తాడు. పంటను ఎలుకలు, పక్షులు తినకుండా కాపాడి ధాన్యాన్ని రాశులుగా పోసి ఇనాందారులకు ఫలితం అప్పగిస్తాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ''కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది" అని అన్నాడు. 'కష్టపడేవాడికి ఫలితం దక్కడం లేదు. ఫలితం దక్కే స్థితికి సమాజం చేరాలి. సమాజం మార్పు చెందాలి. కష్టపడ్డవాడికి కన్నీళ్లు మిగలొద్దు' అనేది రచయిత ఉద్దేశమై ఉంటుంది.

 

ఉ) ''పల్లెటూళ్ళు మానవ సంఘానికి ఈయగల ఆనందాన్ని చూసే తెలుసుకోవాలి" అని ఎందుకన్నారు?
జ: పల్లెటూళ్లు మానవ సమాజానికి ఇచ్చే ఆనందాన్ని అక్కడికి వెళ్లే తెలుసుకోవాలి. ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి. పల్లెల్లో ఆత్మీయ అనురాగాలు ఉంటాయి. వివిధ వృత్తులవారు ఉంటారు. వారు తయారుచేసే వస్తువులను అందరూ వినియోగిస్తారు. సమాజానికి అవసరమయ్యే వివిధ రకాల తిండిగింజలు (బియ్యం, మొక్కజొన్న, పెసలు, మినుములు, చెరకు లాంటివి), కూరగాయలు పల్లెల నుంచే లభ్యమవుతున్నాయి.
 పల్లెటూళ్లలో ప్రశాంత వాతావరణం, పాడి పరిశ్రమ, జానపద కళారూపాలు ఎంతో అందంగా ఉంటాయి. ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేనంతగా ఉంటాయి. వారి కష్టాలు అనేకం. అవి తొలగిపోతే సంతోషిస్తారు. మనకు రెట్టింపు ఆనందాన్ని అందిస్తారు.

 

ఊ) ''పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి" దీన్ని వివరిస్తూ రాయండి.
జ: చదువుకున్నవారు పట్టణాల్లో రూపాయిని ఒక దమ్మిడీలా ఖర్చు పెడతారు. చదువుకున్నవారు రైతులు కష్టపడి పండించిన పంటను తింటున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా ఉంటున్నారు. ఈ చదువుకున్న వారికి తమ స్వార్థం తప్ప తక్కిన ప్రపంచం మునిగిపోతున్నా లెక్క లేదు.
     చదువుకున్నవారంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. పల్లెల్లో లేని సౌకర్యాల గురించి పట్టించుకునేవారే లేరు. తమ కష్ట ఫలితాలను అనుభవిస్తున్న పట్నం వాసులు తమను పట్టించుకోవడం లేదని పల్లెటూళ్లు కన్నీళ్లు పెడుతున్నాయి.

 

2. అ) పల్లెటూళ్లు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్లు రోజురోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? అవి కళ కళ లాడాలంటే మనం ఏం చేయాలి?
జ: పల్లెటూళ్లు దేశానికి అక్షయపాత్ర లాంటివి. ఇవి సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పల్లెటూళ్లు ప్రశాంతతకు నిలయాలు, ఆత్మీయతకు ఆలయాలు. అవి రోజురోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి.
దీనికి కారణాలు:
* ఉన్నత విద్యలకు నిలయాలుగా పట్టణాలు మారడం.
* గ్రామాల్లో సౌకర్యాలు లేకపోవడం.
* అతివృష్టి, అనావృష్టి వల్ల వ్యవసాయం నష్టపోవడం.
* పల్లెవాసుల్లో చదువుకున్నవారు పట్టణాల్లో నివసించడం.
* గ్రామాల్లో నిత్యం పని దొరక్కపోవడం.
* టీవీలు, సినిమాల ప్రభావం జానపద కళలకు విఘాతం కలిగించడం.
* వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల ధరలు పెరగడం, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.
* సోమరితనం పెరగడం.
* ఇళ్ల నిర్మాణం, వివాహాలకు చేసిన మితిమీరిన అప్పులను తీర్చడానికి పల్లె ప్రజలు నిత్యం పని దొరికే పట్టణాలకు వెళ్లడం.
* పల్లెలు కళ కళలాడాలంటే మనం చేయాల్సినవి:
* ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా అనువైన పంటలు వేసేలా రైతులకు సలహాలు ఇవ్వాలి.
* ప్రభుత్వం సహాయం చేసే విధంగా ప్రయత్నించాలి. వాటిలో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయ రుణాలు, మంచినీరు మొదలైన వాటిని ఇచ్చే విధంగా కృషి చేయాలి.
* పల్లెటూళ్లలో నివాసం ఉండి, అందరూ వలసలు వెళ్లకుండా తగిన సలహాలు ఇవ్వాలి. 
* సంపాదించిన దాంతోనే తృప్తి పడేవిధంగా, మితిమీరిన అప్పులు చేయకుండా చైతన్యం తీసుకురావాలి.
* జానపద కళారూపాలను ప్రదర్శించేవారికి ప్రభుత్వ సాయం అందేలా చేయాలి.
* స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలి.
* రాజకీయ నాయకుల్లో చైతన్యం తీసుకురావాలి.
* యవజన సంఘాలు పల్లె ప్రగతికి పాటుపడాలి.

 

ఆ) ''పల్లెటూళ్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్లు". దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
జ: ''పల్లెటూళ్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్లు" ఇది వాస్తవం. పల్లెటూళ్లలో ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి రమణీయత బాగుంటుంది. కాలుష్యం లేని జీవనం ఉంటుంది. మనుషుల మనసులు కలుషితంగా ఉండవు. ఎక్కువ ఖర్చు లేకుండా జీవనం గడుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. పచ్చని పొలాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. పని చేస్తున్నామనే భావన రానీయకుండా పాటలు పాడుకుంటూ పనులు చేస్తారు. పనిలో సౌందర్యాన్ని వెతుక్కోవడం పల్లె ప్రత్యేకత.
   అన్ని మతాల పండగలను అందరూ కలిసి జరుపుకుంటారు. ఒకరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ పనిచేస్తారు. మనమందరం మనకోసం అనే ఆలోచనా దృక్పథం పల్లెలో కనిపిస్తుంది.
మానసిక ఒత్తిడి, అనారోగ్యాలు లేకుండా ప్రశాంత జీవితాన్ని సుఖమయం చేసుకునే పుట్టిళ్లు పల్లెటూళ్లు.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మిత్రుడికి లేఖ రాయండి.
జ: 


                                                                                                                                                   మెదక్,
                                                                                                                              తేది: 03-03-2015.

 

ప్రియమైన స్నేహితుడు నాగరాజుకు,
        నీ ప్రియమిత్రుడు సుధాకర్ రాయునది ఏమనగా నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. నీవక్కడ క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. నేను సంక్రాంతి సెలవుల్లో మా చిన్నాన్న ఊరు పాపన్నపేట మండలం 'ఎల్లాపూర్' అనే పల్లెటూరుకు వెళ్లాను. అక్కడి మానవ సంబంధాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. అందరూ ఒకరినొకరు 'అన్నా', 'తమ్మీ', 'మామా', 'అక్కా', 'బావా' అని పిలుచుకోవడం చూశాను. పరస్పరం సహాయం చేసుకోవడం గమనించాను.
       ఆ పల్లెటూరు మంజీరా నది ఒడ్డున ఉంది. ఎటుచూసినా పంటపొలాలే కనిపిస్తాయి. చల్లని పైరుగాలి, చెరువు కట్టపై ఉన్న చింత చెట్లు ఎంతో హాయిని ఇచ్చాయి. గలగల పారే మంజీరా జలాలు మహాఅద్భుతంగా ఉంటాయి. ఆ పల్లెలో పచ్చని చెట్లు నీడను పరిచినట్లుగా ఉన్నాయి. లేగ దూడల విన్యాసాలు, పక్షుల కిలకిలరావాలు లాంటి దృశ్యాలు మనసుకు ఆనందాన్ని ఇచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడి మనుషుల మధ్య సంబంధాలు, ప్రకృతి దృశ్యాలు చాలా ఎక్కువవుతాయి.
       నీ క్షేమ సమాచారం తెలియజేయగలవు. వేసవి సెలవుల్లో వస్తావు కదూ! నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి 'ఎల్లాపూర్' వెళ్లి వద్దాం. నీ లేఖ కోసం ఎదురుచూస్తుంటాను.
                                                                                                             

నీ ప్రియమిత్రుడు
                                                                                                                   సుధాకర్

 

చిరునామా: బి.నాగరాజు,
                  10వ తరగతి,
                  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కామారెడ్డి, 
                  నిజామాబాద్ జిల్లా.

 

ఆ) ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి.
జ: పాఠం ఆధారంగా నినాదాలు:
     1) ప్రగతికి బాటలు వేయాలంటే పచ్చని పల్లే దిక్కు.
     2) నిలయాలు నిలయాలు - ప్రశాంతతకు పల్లెలే నిలయాలు.
     3) వెలుగునిచ్చిన పల్లెను - వంచన చేస్తావెందుకు?
     4) ఏడ్చే పల్లెను ఓదార్చు - కళకళలన్నీ సమకూర్చు
     5) సుఖసంతోషాలు కావాలంటే - పల్లె తల్లిని చేరాలోయ్
     6) రైతుల దీనగతి మరిచావో - అవుతావు నీవు అధోగతి
     7) కాలం విలువ తెలుసుకో - కలకాలం మంచిగా మసులుకో!
     8) పల్లె కష్టం - పట్టించుకోకపోతే నష్టం.
సూక్తులు:
     1) స్వార్థాన్ని విడనాడి సంఘాన్ని బాగుచేయాలి.
     2) ఇతరుల కష్టంతో సర్వభోగాలు అనుభవిస్తే సర్వరోగాలు దరిచేరుతాయి.
     3) పనిలేనితనాన్ని పల్లె నుంచి పారదోలు.
    4) పల్లెటూరు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు.
    5) పల్లెను నువ్వు కాపాడితే - పల్లె నిన్ను కాపాడుతుంది.
    6) డబ్బులేని చదువు ఇబ్బందులకు చేటు.
    7) కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి.


 

 

రచయిత: అంజాగౌడ్ 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం