• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జానపదుని జాబు

భాషాంశాలు 

పదజాలం
 

1. కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి.
     ఉదా: రైల్వేస్టేషను, -----, -----, చేరుకోవడం.
జ: రైల్వేస్టేషను, టికెట్టు, ప్రయాణం, చేరుకోవడం.
     అ) వర్షాకాలం, -----, -----, ధాన్యం.
     జ: వర్షాకాలం, వర్షాలు, పండించడం, ధాన్యం.
     ఆ) మడి దున్నడం, -----, -----, పంట.
     జ: మడి దున్నడం, నాట్లు వేయడం, కాపాడటం, పంట.
     ఇ) పాఠశాల, -----, -----, జీవితంలో స్థిరపడటం.
     జ: పాఠశాల, చదవడం, కొనసాగించడం, జీవితంలో స్థిరపడటం.
     ఈ) లేఖ, -----, -----, చేరడం.
     జ: లేఖ, రాయడం, పోస్టు చేయడం, చేరడం.
     ఉ) పనిచేయడం, -----, -----, ఆనందంగా జీవించడం.
     జ: పనిచేయడం, కష్టపడటం, ఫలితం రావడం, ఆనందంగా జీవించడం.

 

2. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
    అ) పొద్దస్తమానం
     జ: పొద్దస్తమానం = దినమంతా
    మా చెల్లెలు పొద్దస్తమానం చదువుతూ ఉంటుంది.
    ఆ) చమత్కారం
    జ: చమత్కారం = నేర్పు
    మా అమ్మ చమత్కారంగా మాట్లాడుతుంది.
    ఇ) సాన్నిధ్యం
    జ: సాన్నిధ్యం = సమీపం (దగ్గర)
    భగవంతుడి సాన్నిధ్యం ప్రశాంతతను ఇస్తుంది.
    ఈ) కష్టఫలం
    జ: కష్టఫలం = శ్రమ ఫలితం
    దేశ స్వాతంత్య్రం ఎందరో మహనీయుల కష్టఫలం
    ఉ) కడుపులు మాడ్చుకొను
    జ: కడుపులు మాడ్చుకొను = ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో
    దేశంలో కడుపులు మాడ్చుకొని జీవించేవారిని ప్రభుత్వం ఆదుకోవాలి.
   ఊ) అడుగున పడిపోవు
    జ: అడుగున పడిపోవు = కనుమరుగు కావడం
    సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు అడుగున పడిపోతున్నాయి.

3. కింది పదాలు/ వాక్యాలను వివరించి రాయండి.

 

అ) పురిటిలోనే సంధి కొట్టడం:
   పని మొదలుపెట్టగానే ఆ పనికి ఏదో ఆటంకం కలిగి ఆగిపోవడం జరిగినప్పుడు 'పురిటిలోనే సంధికొట్టడం'ను వాడతారు.
   బిడ్డ పుట్టిన కొన్ని రోజుల్లోనే 'సంధి కొట్టడం' (సన్నిపాత రోగం) వల్ల మరణించడం.

 

ఆ) కలుపు తీయడం: రైతు నాట్లు వేసిన తర్వాత నారు ఏపుగా పెరిగేటప్పుడు 'నారు' మధ్యలో పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి. వాటిని తీసేస్తారు. కలుపు అంటే పనికిరాని మొక్కలు, తీయడం అంటే తీసిపారేయడం. పనికిరాని మొక్కలను తీసిపారేయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది.
 

ఇ) గ్రామోద్ధరణం: గ్రామాలను ఉద్ధరించడం గ్రామోద్ధరణం. ఉద్ధరించడం అంటే అభివృద్ధి చేయడం. గ్రామాల్లో మంచి నీటి సరఫరా, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల కల్పన, రైతులకు రుణ సదుపాయం, విత్తనాల సరఫరా, గిట్టుబాటు ధరలు కల్పించడం లాంటి పనులన్నీ 'గ్రామోద్ధరణం' కిందకు వస్తాయి.
 

ఈ) ఉన్నదంతా ఊడ్చుకుపోవడం: ఉన్నదంతా ఏదో ఒకరూపంలో వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది.  వర్షాలు, వరదల వల్ల పంటంతా పోవడం, డబ్బును పెట్టుబడిగా పెట్టినప్పుడు పూర్తిగా నష్టపోవడం లాంటివి జరిగినప్పుడు ఈ వాక్యాన్ని వాడతారు.

వ్యాకరణాంశాలు 

1. కింది వాక్యాల్లోని సంధులను విడదీసి, సంధి సూత్రంతో సమన్వయం చేయండి.
 

అ) ఆహాహా! ఎంత వైపరీత్యము!
జ: ఆహా + ఆహా = ఆహాహా - ఆమ్రేడిత సంధి
ఆమ్రేడిత సంధి సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది.
సమన్వయం: ఆహాహాను రెండుగా విడదీస్తే ఒకే పదం రెండుసార్లు ఆహా + ఆహాగా వచ్చింది. రెండోసారి వచ్చిన 'ఆహా' ఆమ్రేడితం. మొదటి పదం 'ఆహా'లోని 'ఆ'కు ఆమ్రేడితమైన 'ఆహా' పరమైంది. కాబట్టి ఆమ్రేడిత సంధి.

 

ఆ) జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు?
జ: ఏమి + ఏమి = ఏమేమి - ఆమ్రేడిత సంధి.
ఆమ్రేడిత సంధి సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది.
సమన్వయం: 'ఏమేమి'ని రెండుగా విడదీస్తే ఒకే పదం రెండుసార్లు ఏమి + ఏమిగా వచ్చింది. ఒకేపదం రెండుసార్లు వస్తే రెండోసారి పలికిన 'ఏమి'ని ఆమ్రేడితం అంటారు. పూర్వపదం 'ఏమి'లోని 'ఇ' అనే అచ్చుకు 'ఏమి' అనే ఆమ్రేడితం పరమైంది. కాబట్టి ఆమ్రేడిత సంధి.

 

ఇ) అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
జ: అక్కడ + అక్కడ = అక్కడక్కడ - ఆమ్రేడిత సంధి 

అమ్రేడిత సంధి సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా వస్తుంది.
సమన్వయం: ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్ఛరిస్తే రెండోసారి ఉచ్ఛరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. పూర్వపదం 'అక్కడ'లోని 'అ' అనే అచ్చుకు రెండోసారి వచ్చిన 'అక్కడ' అనే ఆమ్రేడితం పరమైంది. కాబట్టి 'అక్కడక్కడ' అనే పదం ఆమ్రేడిత సంధికి సంబంధించింది.

 

ఈ) వెన్నెల పట్టపగలును తలపిస్తుంది.
జ: పగలు + పగలు = పట్టపగలు - ఆమ్రేడిత సంధి
ఆమ్రేడిత సంధి సూత్రం: ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల (కడాదులు = కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, నడుమ, పగలు, బయలు, మొదలు, పిడుగు మొదలైనవి) తొలి అచ్చుమీది వర్ణాలకు అన్నింటికీ అదంతంబగు ద్విరుక్తటకారం వస్తుంది.
సమన్వయం: ఆమ్రేడితం అంటే పై పదాల్లో రెండోసారి వచ్చిన 'పగలు'కు పూర్వపదంలోని 'పగలు'లో 'గలు' అనే హల్లులు పోయి 'ట్ట' వస్తుంది. అందువల్ల పట్టపగలు అయ్యింది.

 

2. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి.
 

అ) రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
జ: రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.
ఆ) వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
జ: వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.
ఇ) అక్క టీవీ చూస్తోంది. అక్క నృత్యం చేస్తోంది.
జ: అక్క టీవీ చూస్తూ, నృత్యం చేస్తోంది.

3. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
 

అ) రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
జ: రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు.

ఆ) సీత సంగీతం నేర్చుకుంటోంది. సీత నృత్యం నేర్చుకుంటోంది.
జ: సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటోంది.
ఇ) రంగారావుకు పాడటమంటే ఆసక్తి. రంగారావుకు వినడమంటే విరక్తి.
జ: రంగారావుకు పాడటమంటే ఆసక్తి, వినడమంటే విరక్తి.
ఈ) శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
జ: శ్రీను, జాన్ రెడ్డి, హస్మత్ బడికి వచ్చారు.

 

4. కింద గీతగీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.

 
సంధి జరిగిన తీరును గమనించండి.
పూవు + రెమ్మ - పూరెమ్మ
పూవు + తోట - పూదోట
మీదు + కడ - మీగడ
కెంపు + తామరలు - కెందామరలు
* పై నాలుగు సందర్భాల్లోనూ మొదటి పదంలోని మొదటి అచ్చు తర్వాత ఉన్న అక్షరాలు లోపించాయి కదా!
ప్రాతాది సంధి సూత్రం: ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు. ప్రాతాదులు అంటే ప్రాత, లేత, క్రొత్త, క్రింద, కెంపు, చెన్ను మొదలైనవి.
పూ + తోట - పూఁదోట
మీ + కడ - మీఁగడ
కె + తామరలు - కెందామరలు
* పై మూడు సరళాదేశ సంధి సూత్రం అనుసరించి (క, చ, ట, త, ప అనే పరుషాలు వరుసగా గ, జ, డ, ద, బ అనే సరళాలుగా మారడం) మారాయి.

ప్రాతాది సంధికి, సరళాదేశ సంధికి తేడాలు
 

1) పూవు + తోట - పూఁదోట
పరుషం 'త', 'ద'గా మారింది. పూర్వపదంలోని చివర వర్ణం లోపించింది. (ప్రాతాది సంధి)
2) రాన్ + కలదు - రాగలదు
పరుషం 'క', 'గ'గా మారింది. పూర్వపదంలోని ద్రుతం (న్) లోపించింది. (సరళాదేశ సంధి)


 

రచయిత: అంజాగౌడ్ 


 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం