• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జానపదుని జాబు 

కవి పరిచయం 

'జానపదుని జాబు' పాఠ్యాంశ కవి - బోయి భీమన్న.

బోయి భీమన్న 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలోని పేద దళిత కుటుంబంలో జన్మించారు.

అస్పృశ్యత ప్రబలంగా ఉన్న కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసలతో విద్యను అభ్యసించారు. తన పదకొండో ఏట నుంచే రచనలు చేయడం ప్రారంభించారు.

మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడై 'అస్పృశ్యత'ను తన కలం ద్వారా రూపుమాపాలనుకున్న మేధావి.

స్వాతంత్య్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు.

కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940 - 45 మధ్య కాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 1978 నుంచి 1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొనసాగారు.

బోయి భీమన్న రాసిన 'పాలేరు' నాటకం ఎంతో మంది పేదలు, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది.  దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరు పని మాన్పించి పాఠశాలల్లో చేర్చారు. ఆ నాటకం స్ఫూర్తితో విద్యనభ్యసించి ఉన్నత పదవులు అధిష్టించిన పేదలు, దళితులు ఎంతో మంది ఉన్నారు.

గుడిసెలు కాలిపోతున్నాయ్, ఉశారులు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు.

బోయి భీమన్న 'గుడిసెలు కాలిపోతున్నాయ్' రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు 'కళాప్రపూర్ణ' బిరుదునిచ్చి గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. భారత ప్రభుత్వం 1973లో 'పద్మశ్రీ', 2001లో 'పద్మభూషణ్‌'లతో సన్మానించింది.

''ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు'

ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా' అని ధైర్యంగా తన మనసులోని మాటను కలం, గళం ద్వారా వెలిబుచ్చిన కవి బోయి భీమన్న. తనదైన శైలితో, వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగు, దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి బోయి భీమన్న. ఆయన 2005లో మరణించారు.

పాఠ్యభాగ వివరాలు 

ప్రస్తుత పాఠ్యాంశం 'లేఖా' రూపంలో ఉంది. ఈ పాఠ్యభాగాన్ని 'జానపదుని జాబులు' పేరుతో డాక్టర్ బోయి భీమన్న రాసిన 'లేఖల సంపుటి' నుంచి తీసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ 'లేఖా రచన' సాగుతుంది.

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం 

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అందువల్లే భారతదేశం గ్రామాల్లో నివసిస్తోంది అంటారు. ''గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి, అభివృద్ధి చెందితేనే మనదేశం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉంటుంది" అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను వివరిస్తూ గ్రామాల్లోని దళితులు, పేదల జీవితాలను చిత్రిస్తూ 'పల్లెటూరి లేఖలు' అనే పేరుతో 1932లో 'జనవాణి' పత్రికలోనూ; 1933లో 'జానపదుని జాబులు' అనే పేరుతో 'ప్రజామిత్ర'లోనూ బోయి భీమన్న ప్రచురించారు. పేదరికం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం వెళ్లి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన 'జానపదుడు' పట్నంలోని శ్రీమంతుడైన మిత్రుడికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను 'లేఖల' రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితుల గురించి చెప్పడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

ప్రవేశిక 

పంటను కౌలు చేసి, ధాన్యం రాశులుగా పోసి, తమ కడుపులు కాలుతున్నా, కన్నీళ్లు కారుతున్నా, వచ్చిన ఫలితాన్నంతా ఇనాందారులకు అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ, ఇళ్లకుపోయి పస్తులుండే రైతుల దీనగతి ఎవరి హృదయాన్ని కరిగించదు?

ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? ఏ సందర్భంలో చెబుతున్నారో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి ....

పాఠ్యభాగ సారాంశం 

మిత్రమా! క్షమిస్తావని అనుకుంటున్నాను. లేఖ ఆలస్యమైంది. కానీ దానికి కారణం ఉంది. మీ పట్నంలో లాగా మా పల్లెల్లో కాలం సక్రమంగా నడవదు. ఒక రోజు పని ఉంటే, మరో రోజు తక్కువగా ఉంటుంది. ఒక్కో రోజు పనే ఉండదు. అందువల్ల స్థిరంగా ఈవేళ ఇది చేయాలి, ఆవేళ అది చేయాలి అని కార్యక్రమం తయారుచేసుకోవడానికి అవకాశం ఉండదు.

గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిరభావమే నీకు లేఖ ఆలస్యంగా రాయడానికి కారణం. కాలం చాలా విలువైంది. దీన్ని గ్రహించాలంటే గ్రామాల్లోని అస్థిర స్వభావం పోవాలి.

మొన్ననే లేఖ రాయాలనుకున్నాను. కానీ పని వల్ల తీరిక లేక రాయలేదు. ఆ రాత్రి రాయాలని కలం, కాగితం తీసుకుని దీపం దగ్గర కూర్చున్నాను. కిరోసిన్ పొగ కళ్లలో పడుతుంది, ఆ పొగ వల్ల కళ్లకు జబ్బు వస్తుందని అమ్మ అంది. దినమంతా పని చేశావు పడుకోకూడదా! అని మామయ్య అన్నాడు. మా చెల్లెలు పలక తెచ్చి 'లెక్క చెప్పి పడుకో అన్నా' అంది. అది రూపాయల గుణకారం లెక్క. ఆ లెక్క చెప్పేటప్పుడు రూపాయలను అణాలు చేయాలంటే ఏం చేయాలి? అని అన్నాను. మా చెల్లెలు ఆలోచిస్తోంది. ఇంతలో మా తమ్ముడు అన్నాడు 'దుకాణానికి తీసుకు వెళ్లి మార్చాలి' (అంటే రూపాయిని చిల్లరగా మార్చడం) అని, పదహారు పెట్టి గుణించాలి అంది మా చెల్లెలు. మా అమ్మ తమ్ముడు చెప్పిందే నిజమని 'రూపాయిని గుణించి అణాలు చేయి' అంటూ మా అమ్మ ఒక రూపాయిని చెల్లెలు దగ్గరికి దొర్లించింది. నాకు ఆశ్చర్యమేసింది. అక్కడ జరిగిన చమత్కారానికి కాదు ఇలాంటివి ఎన్నో ప్రతిదినం గ్రామాల్లో చూస్తూ ఉంటాం.

నాకు ఆశ్చర్యమేసింది మా అమ్మ, తమ్ముడి పక్షాన మాట్లాడిందని కాదు. వినోదం కోసం, బిడ్డల ఎదుట తల్లులు పొందే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో మాట్లాడింది.

మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చిందని కాదు నాకు ఆశ్చర్యం కలిగింది. పది రోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలీ ఆ రూపాయి. రూపాయి కంటికి కనిపిస్తే ఎంతో ఆనందం. అందుకే చిల్లర తీసుకోకుండా రూపాయి తీసుకున్నాడు మా అయ్య. ఆ రూపాయిని అందరూ తలా కొద్దిసేపు దగ్గర పెట్టుకుని ఆడుకున్నారు.

నాకు ఆశ్చర్యం కలిగించింది మరో విషయం. మనం అభ్యసించే విద్యకు, జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం హఠాత్తుగా నా మనసుకు తట్టింది. మనం నేర్చుకున్నది, నేర్చుకుంటున్నది రూపాయిని పదహారుతో గుణించి అణాలు చేయడం. కానీ చేయాల్సిన పని రూపాయిని దుకాణానికి తీసుకెళ్లి మోగించి చూపి పదహారు అణాలను లెక్కపెట్టుకుని ఇంటికి రావడం. అంత ఉంది అంతరం. చూశావా? చదువులు చదువుతున్నాం, చదువు పూర్తికాగానే ఉద్యోగం కోసం వెతుకులాట. అందరి కాళ్లూ పట్టుకుంటాం. మిత్రమా! ఇన్ని తిప్పలు ఎందుకు బతకడానికి! బతికి ఎందుకు? మన స్వార్థం కోసమా అంతేగా? సమాజం ఏమైపోయినా సరే మనకు చీమ కుట్టినట్లయినా ఉండదు. మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం మునిగిపోతున్నా సరే మనం లెక్క చేయం. మిత్రమా! చదువుకున్న వాళ్లంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సుఖాలు అనుభవించడం చూసి పల్లెటూళ్లు కన్నీరు పెడుతున్నాయి.

గ్రామాన్ని ఉద్దరించడం గురించి పత్రికలు రాసినా, ఎవరైనా ఉపన్యాసాలు ఇచ్చినా, రోడ్ల మీద కార్లలో నాలుగుసార్లు తిరిగి నాలుగువందల జీతాలు తీసుకున్నంత మాత్రాన పని కాదు. అవన్నీ రూపాయిని పదహారుతో గుణించినట్లే వ్యర్థమైనవి. కాగితం మీద కోట్లు కోట్లు సంఖ్య వేసుకుని 'ఇంత ధనం ఉంది నాకు' అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే అవుతాయి. ఈ ఊహ ఆ క్షణంలో వచ్చి నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రజలంతా ప్రత్యక్షంగా లాభం కోరుకోవడం ఆడంబరం కాదు. ఒక రైతు కోటయ్య వచ్చి ''వరి కుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి అన్నాడు". ఆ సమయాన నీకు లేఖ రాయడానికి వీలుకాలేదు.

పొలంలో రాత్రంతా జాగారం చేశాం. కోతలు అయ్యాయి, కొందరు కోతలు కోయగానే నూర్చి (కొయ్య నుంచి ధాన్యాన్ని వేరుచేసుకోవడం) వేసుకుంటారు. కొందరు కుప్పలు వేసి ఎండాకాలం మొదలవ్వగానే నూర్చుకుంటారు. కుప్పలు చేలలోనే వేస్తారు. కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతుంటాయి. నీరు పారే కాలువ పక్కనే ఉన్న చేనులో కోటయ్య కుప్ప వేశాడు. కాలువ ఎండిపోలేదు. కాలువ నుంచి చేనులోకి నీరు తెచ్చుకునే రంధ్రం తెగి చేనులోకి నీరు వచ్చింది. ఆ రంధ్రాన్ని మూసి నీరు పోయేలా చిన్న చిన్న కాలువలు తీసి నేను, కోటయ్య ఇద్దరం కూర్చున్నాం.

ఆ సమయంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. పైరు చల్లటి గాలికి జోరుమనే శబ్దాన్ని ఇస్తూ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. పల్లె జీవితం ఎంతో మనోహరమైంది అనుకున్నాను. కానీ 'ఉపవాసాలు ఉండాలి, కష్టాలను ఓర్చుకోవాలి' ఈ రెండు తప్పితే ప్రశాంత జీవితానికి పల్లెలే పుట్టిల్లు. 'కుప్ప పల్లం భాగంలో పడింది. దాన్ని ఆ మెరక చేనులో వేద్దం అనుకున్నాను' అన్నాడు కోటయ్య. తొందరేమొచ్చింది? సంవత్సరాదికి నూర్చుకోవచ్చు అన్నాను. ''అబ్బే, పన్నులు వచ్చి తలమీద తన్నుతాయి. అమ్మడానికి ఇంట్లో ఒక పింగాణీ చిప్ప అయినా లేదు. అన్నీ మట్టి మూకుళ్లే" అన్నాడు.

మిత్రమా! కష్టం ఒకరిది ఫలితం మరొకరిది. పేదవారు ఏమీ తినకుండా కడుపులు మాడ్చుకుని ఉన్నదంతా తీసుకుపోయి బ్యాంకుల్లోనూ, ఇనుప పెట్టెల్లోనూ కుప్పలుగా పోసుకొని కూర్చునే వారికి ఇచ్చేస్తారు.

ఎప్పుడు వర్షాలు వస్తాయా అని ఎదురుచూస్తూ, ఎప్పుడు కాలువలకు నీరు వస్తుందా అని గుర్తు చేసుకుంటూ మందులు, విత్తనాలను చల్లి; నీళ్లు, కూలీల కోసం అందరితో పోటీపడి, పశువులతో సహా తినకుండా రాత్రి, పగలు పొలాల్లో నేల మీదనే పడుకుంటాడు. పశువులకు కాపలా కాసి, కుట్టే జెర్రి, పొడిచే తేళ్లకూ, కరిచే పాములకూ శరీరాన్ని త్యాగం చేస్తాడు. విసుగు, విరామం లేక పొలాలకు నీరు పెట్టి, దున్ని, నాటేసి పైరును ప్రతిరోజు చూస్తుంటాడు. కలుపు మొక్కలను తీసివేస్తూ, కాపాడి పంట పండించి, పంటను ఎలుకలు, పక్షులు  తినకుండా జాగ్రత్తగా ధాన్యాన్ని సిద్ధం చేస్తాడు. ధాన్యాన్ని రాశులుగా పోసి, తమ కడుపు కాలుతున్నా, కన్నీళ్లు కారుతున్నా - మిత్రమా! ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇంటికి పోయి పస్తులు ఉంటాడు. ఈ విధంగా ఉండే రైతుల దీనస్థితికి ఎవరి హృదయం చలించదు!

ఈ ఊహలోనే కాలం గడిచిపోయింది. కోటయ్య ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. మంచు వల్ల మా తలలు నానిపోయాయి. కోటయ్య పోదాం పద అని లేచాడు. నిద్ర పట్టలేదు. పైగా చలి ఎక్కువ. కబుర్లు చెప్పుకుంటూ చలిమంట వేసుకుని రాత్రి గడిపాం. ఆ మరుసటి రోజు నిద్ర బద్ధకం వల్ల లేఖ రాయలేకపోయాను. ఆ రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయానట. అమ్మ ఎంత లేపినా అన్నం తినేందుకు లేవలేదట. రేపు అయితే పని ఉంది. మెరక ప్రాంతంలో దున్నాలి, తోటలో నాగలి కట్టాలి. మూర్తిగారి ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నాను ఎలా ఉంటుందో. లేఖలో ఇప్పటివరకు ఎందుకు ఆలస్యమైందో రాశాను. నీకు రాయాలన్న సంగతి రాయనే లేదు.

క్రిస్మస్ వస్తోంది. క్రిస్మస్‌కు, సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు. ఈ ఏడాది నేను 'చదివుంటే' మా ఊరికి నిన్ను తీసుకుని రావాలని అనుకున్నాను. కానీ మధ్యలో చదువు ఆగిపోయింది. డబ్బులేని చదువు ఇబ్బందులకు చేటు. వచ్చే ఏడాదైనా చదువుతానో చదవనో తెలియదు. కాలం గడిచిన కొద్దీ స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావం. కాబట్టి ఈ సెలవుల్లో మా ఊరికి వస్తావని అనుకుంటాను.

నీలాంటి ఆర్ద్రహృదయుడు పల్లెటూళ్లకు వచ్చి ఇక్కడి ప్రజలు పడే కష్టాలను తెలుసుకోవాలి. కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్లు మానవ సమాజానికి ఇచ్చే ఆనందాన్ని చూడటం ఎప్పటికైనా మంచిది. ఏ విషయం తెలపగలవు. నారింజ, వెలగ ఫలాలు, కొబ్బరి బొండాలు తీసి ఉంచుతాను. తప్పకుండా రావాలి. సెలవు.

రచయిత: అంజాగౌడ్ 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌