• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాతృభావన

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు 

ఇవి చేయండి 

I. అవగాహన - ప్రతిస్పందన

1. కింది అంశాలను చర్చించండి.

అ) 'ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు - నివారణోపాయాలు'.

జ: సభ్య సమాజం తలదించుకునే స్థితిలో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. పసిపాప మొదలుకుని వృద్దాప్యంలో ఉన్న స్త్రీ వరకు ఏదోరకంగా నష్టపోవాల్సిన పరిస్థితి నేడు కనిపిస్తుంది. చిన్నపిల్లల చెవి పోగుల కోసం ఆరాటపడి హత్య చేయడం, యువతులపై ప్రేమోన్మాదంతో పాశవిక చర్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, ఎక్కువ అయ్యాయి. మహిళలకు భద్రత కరవైంది.

దాడులకు కారణాలు

* స్త్రీ అంటే చులకన భావం ఉండటం

* ధనంపై ఆశ ఎక్కువ కావడం

* ప్రేమోన్మాదం

* సినిమాలు, టీవీల్లో చూపించే కొన్ని అభ్యంతరకర దృశ్యాలు, కార్యక్రమాలు

* చెడు స్నేహాలు

* మనిషిలోని రాక్షసానందం

నివారణోపాయాలు

* చట్టాల రూపకల్పన జరగాలి. అవి కచ్చితంగా అమలయ్యేలా చూడాలి.

* మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలి.

* దాడులు జరిపిన, ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలి.

* మహిళా చైతన్య సదస్సులను నిర్వహించాలి.

* మహిళ గొప్పతనం తెలిసేలా వివిధ స్థాయిల్లో పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి.

* ఆత్మరక్షణ కోసం ఉపాయాలను బాలికలు, యువతులు ఇలా స్త్రీలందరికీ 'కరాటే, కుంగ్‌ఫూ' లాంటి విద్యలను నేర్పాలి.

* నిర్భయ చట్టాన్ని అమలు చేస్తూ, దాని ప్రాముఖ్యాన్ని తెలియజేయాలి.

ఆ) కుటుంబం - సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర.

జ: మంచి కుటుంబాలు మంచి సమాజాన్ని తయారు చేస్తాయి. కుటుంబంలోని తల్లి సంతానానికి మార్గదర్శకురాలిగా ఉంటుంది. చిన్నారికి మొదటి గురువు అమ్మే కాబట్టి ఆమె నుంచి అన్ని రకాల విషయాలు అవగాహన చేసుకుంటారు.

కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర: కుటుంబంలోని ప్రతి స్త్రీ ఏదో రకంగా కుటుంబ అభివృద్ధికి సహాయపడుతుంది. కొంత మంది స్త్రీలు ఉద్యోగం చేసి, స్వయంఉపాధితో డబ్బు సంపాదిస్తుంటారు. మరికొందరు గృహిణిగా ఇంట్లో పనులు చేస్తూ, పిల్లలను చదివిస్తూ, భర్తకు సహయకారిగా ఉంటూ పరోక్షంగా కుటుంబ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. స్త్రీ తన సహజ గుణాలైన ఓపిక, కరుణ, వాత్సల్యాలతో అన్నీ తానై భరించి కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తుంది. కుటుంబం బాగుండాటానికి అన్ని పనులు సకాలంలో, సక్రమంగా జరుగుతున్నాయంటే దానికి కారణం స్త్రీయే.

సమాజం అభివృద్ధిలో స్త్రీ పాత్ర: సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైంది. స్త్రీలు సంపూర్ణ అక్షరాస్యులుగా మారితే సమాజ స్థితిగతులు అర్థమవుతాయి. నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారు. దురాచారాలు, మూఢనమ్మకాలపై పోరాటం చేస్తున్నారు. స్త్రీలు తమ సంతానాన్ని చదివించి, ప్రయోజకులను చేసి, సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పని చేస్తున్నారు. వరకట్నం లేని సమాజ నిర్మాణానికి ప్రతి 'స్త్రీ' పాటుపడాలి. స్త్రీ కుటుంబానికి, సమాజానికి వారధి లాంటిది. కుటుంబ జీవనం సరిగా ఉంటేనే సమాజ నిర్మాణం బాగుంటుంది.

2. కింది పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

జ:           . అనుచున్ జేవుఱుమీఱు కన్నుఁగవతో నాస్పందదోష్ఠంబుతో

                     ఘన హుంకారముతో నటద్భ్రుకుటితో గర్జిల్లు నా భోన్‌సలే

                     శునిఁ జూడన్ బుయిలోడెఁ గొల్వు; శివుఁడీసున్ గుత్తుకన్ మ్రింగి, బో

                     రన నవ్వారల బంధ మూడ్చి గొనితేరన్ బంచె సోన్‌దేవునిన్

ప్రతిపదార్థం:
   

అనుచున్ =    శివాజీ ఆ విధంగా అంటూ
జేవుఱుమీఱు =    ఎక్కువగా ఎరుపైన
కన్నుగవతో =     కన్నులతో
ఆస్పంద =    అదిరిపడే
ఓష్ఠంబుతో =     పైపెదవితో
ఘన =       గొప్ప
హుంకారముతో =      హుంకార శబ్దంతో
నటత్ =      కదలాడే
భ్రుకుటితో =     కనుబొమ్మముడితో
గర్జిల్లు =    గర్జిస్తున్న
ఆ బోన్‌సల + ఈశుని =    ఆ భోంసలేశుని (శివాజీని)
చూడన్ =    చూసేందుకు
కొల్వు =    సభ
పుయిలోడె =    నిశ్చేష్టితమైంది
శివుడు =    శివాజీ
ఈసున్ =     కోపాన్ని అంతా
గుత్తుకన్ =     గొంతులో
మ్రింగి =    దిగమింగి
పోరన =    వెళ్లి
ఆవారల =    వారి యొక్క
బంధమూడ్చి =    బంధనాలు తొలగించి
కొనితేరన్ =   ఇక్కడకు తీసుకొని రమ్మని
పంచె

=    పంపించాడు (సోన్‌దేవుని)

తాత్పర్యం: ఎరుపైన కన్నులతో, అదిరిపడే పైపెదవితో, గొప్ప హుంకారంతో, కనుబొమ్మముడితో గర్జిస్తున్న శివాజీని చూసేందుకు సభ నిశ్చేష్టితమైంది. శివాజీ తన కోపాన్నంతా దిగమింగి, 'వెళ్లి వారి బంధనాలు తొలగించి ఇక్కడకు తీసుకురండి' అని సోన్‌దేవుడిని పంపించాడు.

                   మ. శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో - స్నిగ్ధాంబుదచ్ఛాయలో

                    నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ

                    రవముల్ వాఱఁగఁ జూచి పల్కె 'వనితారత్నంబు లీ భవ్యహైం

                    దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ!'

ప్రతిపదార్థం:
 

శివరాజు =              శివాజీ రాజు
అంతట =               అంతలోనే
మేల్ముసుంగు =           మేలి ముసుగు
తెరలో =           తెర లోపల
స్నిగ్ధ =           దట్టమైన
అంబుద =  నీలిమేఘం యొక్క
ఛాయలో =  మాటున ఉన్న (నీడలో)
నవ =               కొత్త
సౌదామిని పోలు =         మెరుపుతీగ లాంటి
ఆ యవన కాంత రత్నమున్ =    రత్నము లాంటి యవన స్త్రీని
భక్తి గౌరముల్ =     భక్తి గౌరవాలు
వాఱగ =     కలిగేలా
చూచి =     చూసి
పల్కె =     ఈ విధంగా పలికాడు
వనితారత్నంబులు =     రత్నము లాంటి స్త్రీలు
ఈ భవ్య =     శుభప్రదమైన
హైందవ భూ =     హైందవ భూమిపై
జంగమ =    సంచరించే
పుణ్యదేవతలు =    పుణ్యదేవతలు
మాతా =     అమ్మా
తప్పు =      ఈ తప్పును
సైరింపుమీ =     మన్నించు

తాత్పర్యం:  అంతలోనే మేలిముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటున ఉన్న మెరుపుతీగ లాంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ శివాజీ ఇలా అన్నాడు. 'స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు. అమ్మా ఈ తప్పును మన్నించు'.

                     మ. అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై డాయు భూ

                      జనులెల్లన్ నిజసంపదల్ దొఱఁగి యస్తధ్వస్తులై పోరె? వి

                      త్తనమే నిల్చునె? ము న్నెఱుంగమె పులస్త్యబ్రహ్మసంతాన? మో

                      జననీ! హైందవ భూమి నీ పగిది దుశ్చారిత్రముల్ సాగునే?

ప్రతిపదార్థం:        

ఓ జననీ = ఓ తల్లీ!
అనల జ్యోతులన్ = అగ్నిజ్వాలల లాంటి
ఈ పతివ్రతలన్ = పతివ్రతల పట్ల
అపాచారులై = అపచారం చేసేవారై
డాయు = సమీపించే
భూ జనులెల్లన్ = భూమిపై ఉన్న ప్రజలందరు
నిజసంపదల్ = తమ సంపదలు
దొఱగి = కోల్పోయి
యస్తధ్వస్తులైపోరె = నాశనమై పోరా?
విత్తనమే = అసలు వంశం
నిల్చునే = నిలుస్తుందా?
పులస్త్యబ్రహ్మ సంతానం = పులస్త్యబ్రహ్మ సంతానమైన రావణుడి
   గురించి
మున్ను = ఇంతకుముందు
ఎఱుంగమె = తెలియదా?
హైందవభూమిని = భారతభూమిపై
ఈపగిది = ఇలాంటి
దుశ్చారిత్రముల్ = దుశ్చర్యలు
సాగునే = సాగుతాయా? (సాగవు)

 తాత్పర్యం:  ఓ తల్లీ! అగ్నిజ్వాలల లాంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ సంపదలు కోల్పోయినాశనమై పోరా? అసలు వంశం నిలుస్తుందా? పులస్త్య బ్రహ్మా సంతానమైన రావణాసురుడి పతనం గురించి మనకు తెలియదా? భారతభూమిపై ఇలాంటి దుశ్చర్యలు సాగుతాయా? సాగవు.

శా. ''మా సర్దారుఁడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయె, నీ

                   దోసంబున్ గని నొచ్చుకోకు, నినుఁ జేర్తున్ నీ గృహం బిప్పుడే,

                   నా సైన్యంబును దోడుగాఁ బనిచెదన్, నాతల్లిగాఁ దోడుగా

                   దోసిళ్లన్ నడిపింతు; నీ కనులయందున్ దాల్మి సారింపుమీ!"

ప్రతిపదార్థం:
 

మా సర్దారుండు = మా సర్దారు
తొందరన్ బడి = తొందర పడి
అసన్మార్గంబునన్ = మంచి మార్గం కాని పద్ధతిలో
బోయెన్ = వెళ్లాడు
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
గని = తెలుసుకున్న నువ్వు
నొచ్చుకోకు = బాధపడకు
నినున్ = నిన్ను
ఇప్పుడే = ఇప్పుడే
నీ గృహంబు = నీ ఇంటికి
చేర్తున్ = చేరుస్తాను
నా సైన్యంబును = నా సైన్యాన్ని
దోడుగాన్ = తోడుగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా తల్లిలా
దోడుగా = భావించి
దోసిళ్ళన్ = దోసిళ్లపై
నడిపింతు = నడిపిస్తాను
నీ కనులయందున్ = నీ కన్నుల్లో
దాల్మి = సహనం
సారింపుమీ = చూపించు

                                      
తాత్పర్యం:  మా సర్దారు తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు. నిన్ను ఇప్పుడే మీ ఇంటికి చేరుస్తాను. నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను. నా తల్లిగా భావించి నిన్ను దోసిళ్లపై నడిపిస్తాను. నీ కన్నుల్లో సహనం చూపించు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులవడానికి కారణం ఏమిటి?

జ: శివాజీ సైన్యాధిపతి సోన్‌దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి రాణివాస స్త్రీలను, సర్దారులను బంధించి తెచ్చాడు. శివాజీ దాన్ని సహింపక ''ఏమిటి? పుణ్యానికి నిలయమైన రాణివాసాన్ని బందీగా తెచ్చావా! ఏ హిందువైనా ఇలా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను నువ్వు గమనించలేదా! విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా?" అంటూ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప హుంకారం చేస్తూ, కదలాడే కనుబొమ్మ ముడితో గర్జించాడు. అది విని శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులయ్యారు.

ఆ) సోన్‌దేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు?

జ: సోన్‌దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి రాణివాస స్త్రీలను, సర్దారులను పట్టి బంధించి తెచ్చినందుకు శివాజీ ఆగ్రహానికి గురయ్యాడు. శివాజీ ఆజ్ఞానుసారం సోన్‌దేవుడు వారి బంధనాలు తొలగించి తీసుకువచ్చాడు. సోన్‌దేవుడు శివాజీతో 'దేవా! నన్ను క్షమించండి. ఈ సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహ తీవ్రత నా కళ్లను కప్పేసింది. అంతేగాని ఇందులో ఎలాంటి చెడు ఆలోచన నాకు లేదు. మీ ఆజ్ఞను మీరి ప్రవర్తించాలనే ఉద్దేశం కూడా లేదు మీ పాదాల మీద ఒట్టు'. అని మనవి చేసి శివాజీని శాంతపరిచాడు.

ఇ) భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని, ఎలా కీర్తించాడు?

జ: త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ, యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న పావన చరిత సావిత్రి, భగ భగ మండే అగ్నిగుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరిగి బయటకు వచ్చిన పతివ్రత సీత, భర్త కోసం సూర్యభగవానుడిని ఉదయించకుండా నిలిపిన పుణ్య స్త్రీ సుమతి. ఇలా ఎందరో స్త్రీలు తమ పాతివ్రత్యంతో పుట్టింటికీ, మెట్టింటికీ గౌరవాన్ని పెంచారని, వారు భారతదేశానికి అదృష్ట కల్పలతలని శివాజీ కీర్తించాడు.

ఈ) శివాజీ యవన కాంత పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎలాంటివి?

జ: సైన్యాధిపతి సోన్‌దేవుడు బంధించి తెచ్చిన యవనకాంతను చూసి చలించిపోయిన, శివాజీ అతడిని ఆగ్రహించాడు. భక్తి, గౌరవాలతో ఆమెను చూస్తూ స్త్రీలు పుణ్యదేవతలని, తప్పును మన్నించమని అన్నాడు.  మళ్లీ ''ఓ తల్లీ! అగ్నిజ్వాల లాంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు సంపదలు కోల్పోయి నాశనమైపోరా? అలాంటి వారి వంశం నిలుస్తుందా? రావణుడి పతనం గురించి మనకు తెలియదా? భారత భూమిపై ఇలాంటి దుశ్చర్యలు సాగుతాయా? సాగవు. నువ్వు యవన దేశ పుణ్య స్త్రీవైనా హైందవుల పూజను స్వీకరించు. నీ రూపం నాలో లేకపోయినా నన్ను కనని తల్లివి. నిన్ను నా తల్లిగానే గౌరవిస్తాను.  మా సర్దారు తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు. నిన్ను ఇప్పుడే ఇంటికి చేరుస్తాను. నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను" అని అన్నాడు.  శివాజీకి స్త్రీలు అంటే గౌరవం ఎక్కువ. ఆదరించే స్వభావం, అభిమానించే నైజం అతడికి ఎంతో ఉంది.

I. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సోన్‌దేవుడి మనస్తత్వాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి.

జ: సోన్‌దేవుడి మనస్తత్వం:  సోన్‌దేవుడు విజయాన్ని అందించే సైన్యాధిపతి, సైన్యాన్ని సమర్ధంగా నడిపించగలవాడు. విజయ గర్వం ఉన్న వ్యక్తి కాబట్టి రాణివాసాన్ని బందీగా తెచ్చాడు. శివాజీ అంతరంగాన్ని గుర్తించలేకపోయాడు. శివాజీ గర్జిస్తున్నప్పుడు మిన్నకుండా ఉండిపోయాడు. రాజాజ్ఞను పాటించే తత్వం ఉన్నవాడు. తాను చేసిన తప్పును తెలుసుకుని, క్షమించమని వేడుకునే మనసున్నవాడు. తెలియక చేసిన తప్పును గ్రహించుకున్నవాడు. చెడు ఆలోచన లేనివాడు.

ఆ) శివాజీ రాజై ఉండీ తన వద్దకు బందీగా తెచ్చిన యవన కాంతతో 'మాతా! తప్పు సైరింపుమీ!' అన్నాడు. దీని మీద మీ అభిప్రాయాలేమిటి?

జ: శివాజీ రాజుగా ఉండి అలా అన్నాడంటే అతడికి స్త్రీలంటే చాలా గౌరవం ఉందని తెలుస్తోంది. పరస్త్రీలో తన తల్లిని చూసుకునే మాతృప్రేమికుడిగా గోచరిస్తున్నాడు. తప్పు చేసింది తన సైన్యాధిపతి అయినా తలదించుకుని క్షమించమన్నాడు. స్త్రీలలో పుణ్య దేవతలను దర్శించేవాడని తెలుస్తుంది.  భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చే దృశ్యం కన్నుల ముందు కదలాడింది. ప్రతి వ్యక్తి స్త్రీల పట్ల గౌరవ భావంతో ఉండాలని, స్త్రీలు పూజింపదగిన వారని, వారిని అవమానిస్తే సమాజానికే మంచిది కాదని నా అభిప్రాయం.

ఇ) 'శివాజీ ఆదర్శం'లోని గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి.

జ: శివాజీ ఆదర్శంలోని గొప్పదనం: స్త్రీల పట్ల భక్తి, గౌరవాలతో ఉండటం ఆయన ఆదర్శంలోని గొప్పదనం. సోన్‌దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి రాణివాసాన్ని బంధించి తెచ్చినప్పుడు సహించలేదు. వారి బంధనాలు చేయమన్నాడు. రాజుగా ఉన్న శివాజీ తప్పును మన్నించమని కోరాడు. భారతీయ స్త్రీలలోని పాతివ్రత్యాన్ని గుర్తించాడు. యవన దేశ పుణ్యస్త్రీని తల్లిగా గౌరవించాడు. ఆదరణ, అభిమానం చూపడం ఆయన గొప్పదనం.  తన చేతికి చిక్కిన సర్దారును కూడా గౌరవించాడు. స్త్రీల మంచిని కోరుకునేవాడు శివాజీ. అందుకే యవన స్త్రీకి సత్కారాలు జరిపించి, సైన్యాన్ని తోడుగా పంపి బీజాపురానికి సాగనంపాడు. సోన్‌దేవుడు చేసిన తప్పిదాన్ని ఆయనకు గుర్తుచేసి అతడిని క్షమించడంలో శివాజీ గొప్పదనం కనిపిస్తుంది. శివాజీ పతివ్రతలను అదృష్ట కల్పలతలుగా అనడంలో ఆయనకు భారతీయ స్త్రీ పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది.

ఈ) మీ తోటి బాలికలను మీరెలా గౌరవిస్తారు?

జ: మా తోటి బాలికలను శివాజీ భావించిన విధంగానే మేము కూడా ఆదరిస్తాం. అన్ని విషయాల్లో వారికి సాయపడతాం. మా సోదరీమణుల్లా చూసుకుంటాం. వారితో మర్యాదగా నడుచుకుంటాం. మా తోటి బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారికి ఉపాధ్యాయులతో మార్గదర్శనం చేయిస్తాం. బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే వివిధ రకాల కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తాం. ఏ విషయంలోనైనా వారికే మొదటి ప్రాధాన్యాన్ని ఇస్తాం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మీ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.

జ: శివాజీ వ్యక్తిత్వం:

* స్త్రీలను అవమానించరాదని తన సైన్యాధిపతులను ఆజ్ఞాపించాడు.

* సోన్‌దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి రాణివాసాన్ని బంధించి తేవడాన్ని సహించనివాడు.

* సోన్‌దేవుడు తాను చేసిన తప్పును క్షమించమని అడిగినప్పుడు మన్నించిన శాంత స్వభావి.

* సోన్‌దేవుడు చేసిన తప్పును మన్నించమని యవన స్త్రీని కోరడంలో ఆయనకు స్త్రీల పట్ల ఎంత భక్తిభావం ఉందో తెలుస్తుంది.

* శివాజీ భారతీయ స్త్రీల పాతివ్రత్యాన్ని తెలియజేసిన విధం, వారిని అదృష్ట కల్పలతలని సంభోదించినదాన్ని బట్టి ఆయన స్త్రీల గొప్పదనాన్ని గుర్తుంచుకుని ఇతరులకు తెలియజేసే సంస్కృతీ పరిరక్షకుడుగా కనిపిస్తాడు.

* హైందవ ధర్మాలను ఆచరించే అమృత మూర్తిగా కనిపిస్తాడు.

* యవన స్త్రీని తల్లిగా భావించి తన సైన్యాన్ని ఇచ్చి ఇంటికి పంపిస్తానని అనడంతో ఆ స్త్రీ మనోవేదనను తగ్గించడం కనిపిస్తుంది.

* సోన్‌దేవుడితో శివాజీ ''స్త్రీలు పూజింపదగినవారు", వారికి ఏ అవమానం చేయరాదు ఇది నా ఆదర్శం, సైన్యాధిపతులు ఈ ఆజ్ఞను తప్పనిసరిగా పాటించాలి. నీ ఉద్దేశం చూసి, నీ తప్పేమి లేదని భావించాను. 'చేసిన తప్పులను తిరిగి చేయరాదు' అని చెప్పడంలో ఆయన క్షమాగుణం కనిపిస్తుంది.

* శివాజీ ఆదర్శ జీవనంలోని ప్రతి సంఘటన అతడి ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది.

* ధర్మతేజుడు, సహృదయుడు, నేర్పరి, విలువల విశిష్టుడిగా శివాజీ గోచరిస్తాడు.

ఆ) 'స్త్రీ రత్నములు పూజ్యులు' అనే శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి.

జ: 'స్త్రీ రత్నములు పూజ్యులు' అనే మాటలు సోన్‌దేవుడితో శివాజీ అన్నాడు. దీని అర్థం 'స్త్రీలు పూజింపదగినవారు'.

నా సొంత అనుభవాలు

1) నేను బస్సులో ప్రయాణిస్తున్నాను. సీటులో కూర్చొని ఉన్నాను. బస్సులో జనం ఎక్కువగా ఉన్నారు. బస్సులో గర్భిణి కూడా ఉంది. ఆమె ఆయాస పడటం చూసి వెంటనే లేచి నేను కూర్చున్న సీటులో ఆమెను కూర్చోమన్నాను. 100 కిలోమీటర్ల దూరంపాటు మా ప్రయాణం సాగింది. నాకెంతో సంతోషమనిపించింది.

2) కళ్లు లేని ఒక స్త్రీ కేవలం కర్ర సహాయంతో నేలను ఆనిస్తూ నడుస్తుంది. ఈ సంఘటన నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు జరిగింది. ఆ సమయంలో ఆమె ఎక్కడ పడుతుందో అనే భయంతో వెంటనే వెళ్లి ఆమెను పట్టుకుని తన ఇంటికి చేర్చాను. ఎవరి సహాయం లేకుండా బయటకు రావద్దని చెప్పాను.

3) ఒక ఆకతాయి మా ఇంటి పక్క అమ్మాయికి ఫోన్ చేసి నానా విధాలుగా ఏడిపించేవాడు. నేను కొన్ని రోజులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆకతాయిని అరెస్ట్ చేయించాను. వాడికి కౌన్సెలింగ్ ఇప్పించి, స్త్రీలు పూజనీయులు అనే విషయాన్ని గుర్తు చేశాను.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.

అ) పాఠ్యాంశాన్ని 'ఏకాంకిక' రూపంలో రాసి ప్రదర్శించండి.

 జ: శివాజీ సభ

      పాత్రలు

      1) శివాజీ

      2) సోన్‌దేవుడు

      3) యవన దేశ స్త్రీ

శివాజీ : సోన్‌దేవా! ఏమిటి! పుణ్యానికి నిలయమైన రాణివాసాన్ని బందీగా తెచ్చావా? ఏ హైందవుడైనా ఇలా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను గమనించలేదా? విజయ గర్వం మత్తులో నీ ప్రాణాలకు ఆపద తెచ్చుకుంటావా? వెంటనే వెళ్లి వారి బంధనాలు తొలగించి ఇక్కడకు తీసుకురా.
      (యవన దేశ స్త్రీని తీసుకువచ్చిన తర్వాత)

సోన్‌దేవుడు : 'దేవా! నన్ను మన్నించండి. ఈ సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహం నా కళ్లను కప్పేసింది. మీ ఆజ్ఞను మీరి ప్రవర్తించాలనే ఉద్దేశం లేదు మీ పాదాలపై ఒట్టు'.
(శివాజీ శాంతిస్తూ)

శివాజీ : అమ్మా! స్త్రీలు ఈ హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు. ఈ తప్పును క్షమించు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి లాంటి ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో పుట్టింటికి, మెట్టింటికి కీర్తిని పెంచారు. అలాంటి వారికి అపచారం చేస్తే సంపదలు కోల్పోయి నాశనమవుతారు. వారి వంశం నిలవదు. రావణుడి పతనం గురించి మనకు తెలియదా? నువ్వు మా పూజను స్వీకరించు. నిన్ను నా తల్లిగా గౌరవిస్తాను. నా సైన్యాన్ని తోడుగా పంపించి మీ ఇంటికి చేరుస్తాను.

(సత్కారాలు జరిపి, పంపించడం)

శివాజీ : 'స్త్రీలు పూజింపదగినవారు'. వారిని అవమానించవద్దు. ఇది నా ఆదర్శం. సైన్యాధిపతులందరూ దీన్ని ఆచరించాలి. సోన్‌దేవా నీ ఉద్దేశం విన్న తర్వాత నీ తప్పు లేదని అర్థమైంది. ఇక వెళ్లండి.

(అందరూ వెళ్లిపోతారు)

ఆ) ఈ పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు/ సూక్తులు రాయండి.

జ: నినాదాలు

    *  స్త్రీకి అపచారం చేసి, అపకీర్తిని తెచ్చుకోవద్దు

    *  స్త్రీని పూజిస్తే, పుణ్యం దక్కుతుంది

    *  స్త్రీని గౌరవిస్తే, పతనం పరుగులు తీస్తుంది

    *  మహికే వెలుగు మహిళ - అది తెలుసుకుని బతికితే భళా!

    *  సకల పుణ్యాలు పొందాలంటే - స్త్రీకి సహాయం చేయాలి

    *  స్త్రీలను గౌరవించు - భారతావని కీర్తిని పెంచు

    *  మహిళకు అండగా నిలుద్దాం - ఆత్మ రక్షణను నేర్పుదాం

     సూక్తులు

    *  మహిళ లేని జగతి అవుతుంది అథోగతి

    *  మేలు కోరే మహిళలకు హాని చేస్తే అపాయం కలుగుతుంది

    *  స్త్రీలను పూజించే చోట దేవతలు ఆనందిస్తారు

    *  మహిళలను మనం రక్షిస్తే దైవం మనల్ని రక్షిస్తుంది

    *  కన్నతల్లిలోని కమనీయం ప్రతి తల్లిలో వీక్షించు

    *  భూమాతకున్న సహనం భువిపై మహిళకే ఉంది

రచయిత : అంజాగౌడ్


 

Posted Date : 30-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌