• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాతృభావన

కవిపరిచయం:

డా|| గడియారం వేంకటశేష శాస్త్రి కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా, నెమ్మళ్లదిన్నె గ్రామంలో 1901లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్య.

గడియారం వేంకటశేష శాస్త్రి పేరు చెప్పగానే గుర్తొచ్చే కావ్యం 'శ్రీశివ భారతము'.

శ్రీశివ భారతము పారతంత్య్రాన్ని నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా నింపిన మహాకావ్యం.

శాస్త్రి రచనలు - మురారి, పుష్పబాణ విలాసము, రఘనాథీయము, మల్లికామారుతము.

అముద్రిత వచన రచన - వాస్తుజంత్రి.

విమర్శగా రాసిన రచన - శ్రీనాథ కవితా సామ్రాజ్యము.

శతావధానిగా పేరుగాంచిన గడియారం వేంకటశేష శాస్త్రి దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి కావ్య నాటకాలు రాశారు.

'కవితావతంస', 'కవిసింహ', 'అవధాన పంచానన' అనేవి ఈయన బిరుదులు.

పాఠ్యభాగ వివరాలు

ప్రక్రియ: చారిత్రక కావ్యం

చరిత్ర ఆధారంగా రచించిన కావ్యాన్ని 'చారిత్రక కావ్యం' అంటారు.

డా|| గడియారం వేంకటశేషశాస్త్రి రచించిన 'శ్రీశివ భారతము' తృతీయ శ్వాసం నుంచి 'మాతృభావన' పాఠ్యాంశాన్ని తీసుకున్నారు.

నేపథ్యం

అబ్బాజీ సోన్‌దేవుడు మొదటి దండయాత్రలో 'కళ్యాణి' దుర్గం జయించిన తర్వాత విజయోత్సాహంతో 'శివాజీ' వద్దకు వస్తాడు. సోన్‌దేవుడు శివాజీతో ''దేవా! మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్నీ, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను" అని మనవి చేస్తాడు. ఇది విన్న శివాజీ 'పరస్త్రీలు తల్లులతో సమానం' అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ, ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం.

ప్రవేశిక

జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని కల్పించింది. పరస్త్రీలను తల్లులుగా, పరధనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పింది. అలాంటి ఉదాత్తమైన భావనలను తన జీవనశైలిగా మలచుకుని పరిపాలన సాగించిన ధీరోదాత్తుడు శివాజీ.
శివాజీ జీవితంలోని ఒక సంఘటన 'మాతృభావన'కు అద్దం పడుతుంది. ఆ 'మాతృభావన'ను గడియారం వేంకటశేష శాస్త్రి తీర్చిదిద్దారు. ఆయన రాసిన తీరు ప్రశంసనీయం. సహృదయతకు, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో చదువుకుందాం.

1వ పద్యం

శా. ''ఆ-యేమీ? యొక రాణివాసమును బుణ్యావాసమున్ దెచ్చినా

వా? యేహైందవుఁడైన నీ గతి నమర్యాదన్ బ్రవర్తించునే?

మా యాజ్ఞన్ గమనింపవో? జయ మదోన్మాదంబునన్ రేఁగి, నీ

యాయుస్సూత్రము లీవ త్రుంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ"

ప్రతిపదార్థం:

ఆ-యేమీ = ఆ ఏమిటి? (ఆశ్చర్యం, కోపంతో కలిపి)
పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమైన
ఒక = ఒక
రాణివాసమును = రాణివాసాన్ని
తెచ్చినావా = పట్టుకుని బందీగా తెచ్చావా
ఏ హైందవుడైనన్ = ఏ హైందవుడైనా
ఈ గతిన్ = ఈ తీరు (నువ్వు చేసినట్లుగా)
అమర్యాదన్ = మర్యాద లేకుండా
ప్రవర్తించునే = ప్రవర్తిస్తాడా?
మా యాజ్ఞన్ = నా యొక్క ఆజ్ఞను
గమనింపవో  = గమనించలేదా?
జయ మదోన్మాదంబునన్ = విజయం పొందిన గర్వపు మత్తులో
రేగి = అతిశయించి (మునిగి)
నీ = నీ యొక్క
ఆయు + సూత్రములు = ప్రాణాలనే నూలు పోగులను
ఈవ = నీవే
త్రుంచుకొనెదో = తెంచేసుకుంటావా?
ఔద్ధత్యము = ఈ పొగరు తత్వాన్ని
ఓర్వన్‌జుమీ = సహించను సుమా!

తాత్పర్యం:

ఆ... ఏమిటి? పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా? ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను నువ్వు గమనించలేదా? విజయగర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నువ్వే ఆపద తెచ్చుకుంటావా? నువ్వు చేసిన ఈ పనిని నేను సహించను.

2వ పద్యం (కంఠస్తం చేయాల్సింది).

మ. అనుచున్ జేవుఱుమీఱు కన్నుఁగవతో నాస్పందదోష్ఠంబుతో

ఘన హుంకారముతో నటద్భ్రుకుటితో గర్జిల్లు నా భోన్‌సలే

శునిఁ జూడన్ బుయిలోడెఁ గొల్వు; శివుఁడీసున్ గుత్తుకన్ మ్రింగి, బో

రన నవ్వారల బంధ మూడ్చి గొనితేరన్ బంచె సోన్‌దేవునిన్

ప్రతిపదార్థం:

అనుచున్ = శివాజీ ఆ విధంగా అంటూ
జేవుఱుమీఱు = ఎక్కువగా ఎరుపైన
కన్నుగవతో = కన్నులతో
ఆస్పంద = అదిరిపడే
ఓష్ఠంబుతో = పైపెదవితో
ఘన = గొప్ప
హుంకారముతో = హుంకార శబ్దంతో
నటత్ = కదలాడే
భ్రుకుటితో = కనుబొమ్మముడితో
గర్జిల్లు = గర్జిస్తున్న
ఆ బోన్‌సల + ఈశుని = ఆ భోంసలేశుని (శివాజీని)
చూడన్ = చూసేందుకు
కొల్వు = సభ
పుయిలోడె = నిశ్చేష్టితమైంది
శివుడు = శివాజీ
ఈసున్ = కోపాన్ని అంతా
గుత్తుకన్ = గొంతులో
మ్రింగి = దిగమింగి
పోరన = వెళ్లి
ఆవారల = వారి యొక్క
బంధమూడ్చి = బంధనాలు తొలగించి
కొనితేరన్ = ఇక్కడకు తీసుకొని రమ్మని
పంచె = పంపించాడు (సోన్‌దేవుని)

తాత్పర్యం:

ఎరుపైన కన్నులతో, అదిరిపడే పైపెదవితో, గొప్ప హుంకారంతో, కనుబొమ్మముడితో గర్జిస్తున్న శివాజీని చూసేందుకు సభ నిశ్చేష్టితమైంది. శివాజీ తన కోపాన్నంతా దిగమింగి, 'వెళ్లి వారి బంధనాలు తొలగించి ఇక్కడకు తీసుకురండి' అని సోన్‌దేవుడిని పంపించాడు.

3వ పద్యం

మ. త్వరితుండై యతఁ డట్టులే సలిపి ''దేవా! నన్ను మన్నింపు; మీ

సరదారున్ గొని తెచ్చుచో సరభసోత్సాహంబు కన్గప్పె; దు

శ్చరితాలోచన లేదు, లేదు భవదాజ్ఞా లంఘనోద్వృత్తి; మీ

చరణద్వంద్వము లాన" యంచు వినిపించన్, సుంత శాంతించుచున్

ప్రతిపదార్థం:

అతడు = ఆ సోన్‌దేవుడు
త్వరితుండై = త్వరపడుతూ
అట్టులే = అలాగే అని
సలిపి = చెప్పి
దేవా = ఓ ప్రభూ
నన్ను = నన్ను
మన్నింపు = క్షమించు
ఈ సరదారున్ = ఈ సర్దారును
కొని తెచ్చుచో = పట్టి తెచ్చే
సరభస + ఉత్సాహంబు = ఎక్కువైన ఉత్సాహం
కన్గప్పె = నా కళ్లను కప్పేసింది
దుశ్చరిత = చెడుతో కూడిన
ఆలోచనలేదు = ఆలోచన నాకు లేదు
భవత్ = నీ యొక్క
ఆజ్ఞ = ఆజ్ఞను
ఉల్లంఘన = అతిక్రమించే
వృత్తి = ఉద్దేశం
లేదు = లేదు
మీ చరణ ద్వంద్వము లాన          
(మీ చరణ ద్వంద్వములు + ఆన)
= మీ పాదాలపై ఒట్టు
యంచు = అనుచు
వినిపించన్ = చెప్పగా (చెప్పినప్పుడు)
సుంత = కొంత
శాంతించుచున్ = శివాజీ శాంతించుచూ

తాత్పర్యం:

సోన్‌దేవుడు త్వరత్వరగా శివాజీ ఆజ్ఞను పాటించి 'దేవా! నన్ను మన్నించండి. ఈ సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహ తీవ్రత నా కళ్లను కప్పేసింది. అంతేగాని ఇందులో ఎలాంటి చెడు ఆలోచన నాకు లేదు. మీ ఆజ్ఞను మీరి ప్రవర్తించాలనే ఉద్దేశం కూడా లేదు. మీ పాదాల మీద ఒట్టు' అని మనవి చేయగా, శివాజీ కొంత శాంతిస్తూ.

4వ పద్యం (కంఠస్తం చేయాల్సింది)

మ. శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో - స్నిగ్ధాంబుదచ్ఛాయలో

నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ

రవముల్ వాఱఁగఁ జూచి పల్కె 'వనితారత్నంబు లీ భవ్యహైం

దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ!'

ప్రతిపదార్థం:

శివరాజు = శివాజీ రాజు
అంతట = అంతలోనే
మేల్ముసుంగు = మేలి ముసుగు
తెరలో = తెర లోపల
స్నిగ్ధ = దట్టమైన
అంబుద = నీలిమేఘం యొక్క
ఛాయలో = మాటున ఉన్న (నీడలో)
నవ = కొత్త
సౌదామిని పోలు = మెరుపుతీగ లాంటి
ఆ యవన కాంత రత్నమున్ = రత్నము లాంటి యవన స్త్రీని
భక్తి గౌరముల్ = భక్తి గౌరవాలు
వాఱగ = కలిగేలా
చూచి = చూసి
పల్కె = ఈ విధంగా పలికాడు
వనితారత్నంబులు = రత్నము లాంటి స్త్రీలు
ఈ భవ్య = శుభప్రదమైన
హైందవ భూ = హైందవ భూమిపై
జంగమ = సంచరించే
పుణ్యదేవతలు = పుణ్యదేవతలు
మాతా = అమ్మా
తప్పు = ఈ తప్పును
సైరింపుమీ = మన్నించు

తాత్పర్యం:

అంతలోనే మేలిముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటున ఉన్న మెరుపుతీగ లాంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ శివాజీ ఇలా అన్నాడు. 'స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు. అమ్మా ఈ తప్పును మన్నించు'.

5వ పద్యం

సీ. హరి హర బ్రహ్మలఁ బురిటిబిడ్డలఁ జేసి

జోలఁబాడిన పురంధ్రీలలామ,

యమధర్మరాజుపాశముఁ ద్రుంచి యదలించి

పతిభిక్ష గొన్న పావనచరిత్ర,

ధగధగ ద్గహనమధ్యము పూలరాసిగా

విహరించియున్న సాధ్వీమతల్లి,

పతి నిమిత్తము సూర్యభగవానును దయంబు

నరికట్టి నిలుపు పుణ్యముల పంట,

తే. అట్టి యెందఱో భరతాంబ యాఁడుబిడ్డ

లమల పతిదేవతాత్వ భాగ్యములు వోసి

పుట్టినిలు మెట్టినిలుఁ బెంచు పుణ్యసతులు

గలరు, భారతావని భాగ్యకల్పలతలు

ప్రతిపదార్థం:

హరిహర బ్రహ్మలన్ = త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు)
బురిటి బిడ్డలన్ = చంటి బిడ్డలుగా
జేసి = చేసి
జోల పాడిన = వారికి జోలపాట పాడిన
పురంధ్రీలలామ = మహనీయురాలు (అనసూయ)
యమధర్మరాజు పాశమున్ = యమధర్మరాజు పాశాన్ని
ద్రుంచి = తుంచేసి
యదలించి = ఎదిరించి
పతిభిక్షగొన్న = తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న
పావన చరిత్ర = పవిత్రమైన చరిత (సావిత్రి)
ధగ ధగ ద్గహన = భగ భగ మండే అగ్ని
మధ్యము = మధ్యలో
పూలరాసిగా = పువ్వుల రాశిగా
విహరించియున్న = తిరిగినట్లు తిరుగాడిన
సాధ్వీమ తల్లి = పతివ్రత (సీత)
పతి నిమిత్తము = భర్త కోసం
సూర్య భగవాను = సూర్య భగవానుడిని
నుదయంబు = ఉదయించడాన్ని
నరికట్టి = అడ్డగించి
నిలుపు = నిలిపిన
పుణ్యముల పంట = పుణ్య స్త్రీ (సుమతి)
అట్టియెందరో = అలాంటి ఎందరో
భరతాంబ = భరతమాత
ఆడు బిడ్డలు = ఆడ బిడ్డలు
అమల = స్వచ్ఛమైన
పతిదేవతాత్వ = పాతివ్రత్యంతో
భాగ్యములు = సంపదలు (కీర్తి)
పుట్టినిలు = పుట్టినింటికి
మెట్టినిలు = మెట్టినింటికి
పెంచు = పెంచిన
పుణ్యసతులు = పుణ్యస్త్రీలు
భారతావని = భారతదేశానికి
భాగ్య కల్పలతలు = అదృష్ట కల్పలతలు
గలరు = కలరు (ఉన్నారు)

తాత్పర్యం:

త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) తన పాతివ్రత్యంతో చంటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహనీయురాలు (అనసూయ). యమధర్మరాజు పాశాన్ని ఎదురించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న పావన చరిత (సావిత్రి). భగ భగ మండే అగ్ని గుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరుగాడి బయటకు వచ్చిన పతివ్రత (సీత). భర్త కోసం సూర్య భగవానుడిని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ (సుమతి). ఇలా భారతీయ స్త్రీలు ఎందరో తమ పాతివ్రత్యంతో పుట్టినింటికీ, మెట్టినింటికీ కీర్తిని పెంచిన వారున్నారు. వారు భారత దేశానికి అదృష్ట కల్పలతలు.

6వ పద్యం (కంఠస్తం చేయాల్సింది)

మ. అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై డాయు భూ

జనులెల్లన్ నిజసంపదల్ దొఱఁగి యస్తధ్వస్తులై పోరె? వి

త్తనమే నిల్చునె? ము న్నెఱుంగమె పులస్త్యబ్రహ్మసంతాన? మో

జననీ! హైందవ భూమి నీ పగిది దుశ్చారిత్రముల్ సాగునే?

ప్రతిపదార్థం:  

ఓ జననీ = ఓ తల్లీ!
అనల జ్యోతులన్ = అగ్నిజ్వాలల లాంటి
ఈ పతివ్రతలన్ = పతివ్రతల పట్ల
అపాచారులై = అపచారం చేసేవారై
డాయు = సమీపించే
భూ జనులెల్లన్ = భూమిపై ఉన్న ప్రజలందరు
నిజసంపదల్ = తమ సంపదలు
దొఱగి = కోల్పోయి
యస్తధ్వస్తులైపోరె = నాశనమై పోరా?
విత్తనమే = అసలు వంశం
నిల్చునే = నిలుస్తుందా?
పులస్త్యబ్రహ్మ సంతానం = పులస్త్యబ్రహ్మ సంతానమైన రావణుడి గురించి
మున్ను = ఇంతకుముందు
ఎఱుంగమె = తెలియదా?
హైందవభూమిని = భారతభూమిపై
ఈపగిది = ఇలాంటి
దుశ్చారిత్రముల్ = దుశ్చర్యలు
సాగునే = సాగుతాయా? (సాగవు)

తాత్పర్యం:

ఓ తల్లీ! అగ్నిజ్వాలల లాంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ సంపదలు కోల్పోయి నాశనమై పోరా? అసలు వంశం నిలుస్తుందా? పులస్త్య బ్రహ్మ సంతానమైన రావణాసురుడి పతనం గురించి మనకు తెలియదా? భారతభూమిపై ఇలాంటి దుశ్చర్యలు సాగుతాయా? సాగవు.

7వ పద్యం

తే. యవన పుణ్యాంగనామణి వగుదుగాక

హైందవులపూజ తల్లియట్లందరాదె?

నీదురూపము నాయందు లేద యైనఁ

గనని తల్లివిగా నిన్ను గారవింతు

ప్రతిపదార్థం:

యవన = యవన దేశానికి చెందిన
పుణ్య + అంగనామణివి = పుణ్యస్త్రీవి
అగదుగాక = కావచ్చు
హైందవుల పూజ = హిందువుల పూజను
తల్లియట్ల = తల్లిలా
అందరాదె = స్వీకరించరాదా?
నీదు రూపము = నీ రూపం
నా యందు = నాలో
లేదయైన = లేకపోయినా
కనని = జన్మ ఇవ్వని
తల్లివిగా = అమ్మగా
నిన్ను గారవింతు = నిన్ను గౌరవిస్తాను

తాత్పర్యం:

నీవు యవన దేశ పుణ్యస్త్రీవి కావచ్చు. అయినా హైందవుల పూజను స్వీకరించు. నీ రూపం నాలో లేకపోయినా నన్ను కనని తల్లివి నీవు. నిన్ను నా తల్లిగానే గౌరవిస్తాను.

8వ పద్యం (కంఠస్తం చేయాల్సింది)

శా. ''మా సర్దారుఁడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయె, నీ

దోసంబున్ గని నొచ్చుకోకు, నినుఁ జేర్తున్ నీ గృహం బిప్పుడే,

 నా సైన్యంబును దోడుగాఁ బనిచెదన్, నాతల్లిగాఁ దోడుగా

దోసిళ్లన్ నడిపింతు; నీ కనులయందున్ దాల్మి సారింపుమీ!"

ప్రతిపదార్థం:

మా సర్దారుండు = మా సర్దారు
తొందరన్ బడి = తొందర పడి
అసన్మార్గంబునన్ = మంచి మార్గం కాని పద్ధతిలో
బోయెన్ = వెళ్లాడు
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
గని = తెలుసుకున్న నువ్వు
నొచ్చుకోకు = బాధపడకు
నినున్ = నిన్ను
ఇప్పుడే = ఇప్పుడే
నీ గృహంబు = నీ ఇంటికి
చేర్తున్ = చేరుస్తాను
నా సైన్యంబును = నా సైన్యాన్ని
దోడుగాన్ = తోడుగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా తల్లిలా
దోడుగా = భావించి
దోసిళ్ళన్ = దోసిళ్లపై
నడిపింతు = నడిపిస్తాను
నీ కనులయందున్ = నీ కన్నుల్లో
దాల్మి = సహనం
సారింపుమీ = చూపించు

తాత్పర్యం:

మా సర్దారు తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు. నిన్ను ఇప్పుడే మీ ఇంటికి చేరుస్తాను. నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను. నా తల్లిగా భావించి నిన్ను దోసిళ్లపై నడిపిస్తాను. నీ కన్నుల్లో సహనం చూపించు.

9వ పద్యం

మ. అని కొండాడి, పతివ్రతా హిత సపర్యాధుర్యుఁడాతండు యా

వన కాంతామణి కర్హసత్కృతు లొనర్పన్ జేసి, చేసేతఁ జి

క్కిన సర్దారుని గారవించి హితసూక్తిన్ బల్కి, బీజాపురం

బునకున్ బోవిడె - వారితోఁ ధనబలంబుల్ గొన్ని తోడంపుచున్

ప్రతిపదార్థం:

అని కొండాడి = పైవిధంగా స్తుతించి
పతివ్రతా = పతివ్రతలైన స్త్రీలకు
హిత = మంచి
సపర్యాధరుండు = సేవలు చేయడంలో గొప్పవాడైన శివాజీ
యవన కాంతామణికి = యవన స్త్రీ రత్నానికి
అర్హ = తగిన
సత్కృతుల్ = సత్కారాలు
ఒనర్పక జేసి = జరిపించి
చేసెతఁజిక్కిన = తనచేతికి చిక్కిన
సర్దారుని = సర్దారును
గారవించి = గౌరవించి
హితసూక్తిన్ = మంచి మాటలను
పల్కి = పలికి
వారితో = వారికి
తోడంపుచున్ = తోడుగా
తన బలంబుల్ = తన బలగాలను
కొన్ని = కొన్నింటిని
బీజాపురంబునకున్ = బీజాపురానికి
పొవిడె = పంపించాడు

తాత్పర్యం:

అని స్తుతించి పతివ్రతా స్త్రీల మంచిని కోరుకునే శివాజీ యవన స్త్రీకి తగిన సత్కారాలు జరిపించి, తన చేతికి చిక్కిన సర్దారును గౌరవించి, వారితో మంచి మాటలు పలికి, వారికి తోడుగా తన బలగాలను బీజాపురానికి పంపించాడు.

10వ పద్యం

మ. శివరా జంతట సోనదేవుమొగమై ''స్త్రీరత్నముల్ పూజ్య, లే

యవమానంబు ఘటింపరా, దిది మదీయాదర్శ మస్మచ్చమూ

ధవు లీయాజ్ఞ నవశ్య మోమవలె; నీతాత్పర్యమున్ జూచి, లో

కువ చేకూరమి నెంచి, నీయెడ దొసంగు ల్లేమి భావించితిన్" (అని వాక్రుచ్చెను)

ప్రతిపదార్థం:

అంతట = తర్వాత
శివరాజు = శివాజీ
సోన్‌దేవుమొగమై = సోన్‌దేవుడి వైపు తిరిగి
స్త్రీ రత్నముల్ = స్త్రీ రత్నాలు
పూజ్యులు = పూజింపదగినవారు
ఏ అవమానంబు = ఎలాంటి అవమానం
ఘటింపరాదు = చేయకూడదు
ఇది = ఇది
మదీయ = నా యొక్క
ఆదర్శము = ఆదర్శం
అస్మత్ = నా యొక్క
చమూధవులు = సైన్యాధిపతులందరూ
ఈ ఆజ్ఞన్ = ఈ ఆజ్ఞను
అవశ్యము = తప్పనిసరిగా
ఓమవలె = ఆచరించాలి
నీ తాత్పర్యమున్ = నీ ఉద్దేశం
జూచి = చూసి
లోకువ = లోపం
చేకూరమి = లేదని
ఎంచి = తలచి
నీ యెడ = నీ యందు
దొసంగుల్లేమి = తప్పులేదని
భావించితిన్ = భావించాను.

తాత్పర్యం:

తర్వాత శివాజీ సోన్‌దేవుడి వైపు తిరిగి 'స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఏ అవమానం చేయకూడదు. ఇది నా ఆదర్శం. నా సైన్యాధిపతులందరూ ఈ ఆజ్ఞను తప్పనిసరిగా ఆచరించాలి. నీ ఉద్దేశం చూసి, లోపం లేదని తలచి నీ తప్పేమీ లేదని భావించాను.' అని అన్నాడు.

(రచయిత : అంజాగౌడ్)

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం