• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవుడి కన్ను -  రంగుల ప్రపంచం

  1571, డిసెంబరు 21న జోహాన్ కెప్లర్ జన్మించారు. 59 ఏళ్లు బతికిన కెప్లర్ నిరుపేదగానే మరణించారు. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని వివరించారు. కుజగ్రహంపై జరిపిన పరిశోధనలతో సూర్యుడి చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాయని తెలిపారు. కెప్లర్ సూత్రాలను ప్రతిపాదించారు. జూపిటర్, మెర్క్యురీ గ్రహాలను పరిశోధించాలని 1612లో ప్రయత్నించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.


కీలక పదాలు

* స్పష్టదృష్టి కనిష్ఠ మార్గం   
* కటక సర్దుబాటు
*  దీర్ఘదృష్టి
* కటక సామర్థ్యం
* పట్టక కోణం లేదా పట్టక వక్రీభవన కోణం
*  కనిష్ఠ విచలన కోణం
* పరిక్షేపణం
* కాంతి తీవ్రత
* గరిష్ఠ దూర బిందువు
*  దృష్టి కోణం
* హ్రస్వదృష్టి
* చత్వారం
* పట్టకం
* విక్షేపణం
* పట్టక పదార్థ వక్రీభవన గుణకం
* కంటి కటకం
* కనిష్ఠ దూర బిందువు

కీలక పదాలు - వివరణలు
స్పష్టదృష్టి కనిష్ఠ దూరం: మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ. దూరంలో ఉండాలి. ఈ దూరాన్ని 'స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం' అంటారు.
దృష్టి కోణం: ఏ గరిష్ఠ కోణం వద్ద మనం వస్తువులను పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని 'దృష్టి కోణం' అంటారు. ఆరోగ్యవంతుడి దృష్టికోణం సుమారుగా 60 ఉంటుంది.
కటక సర్దుబాటు: కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని 'కటక సర్దుబాటు సామర్థ్యం' అంటారు.
హ్రస్వదృష్టి: కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. కానీ దూరంలోని వస్తువులను చూడలేరు. ఈ దృష్టి దోషాన్ని 'హ్రస్వదృష్టి' అంటారు.
దీర్ఘదృష్టి: దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తి దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడగలరు కానీ దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు.
చత్వారం: సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ దృష్టి దోషాన్ని 'చత్వారం' అంటారు.
కటక సామర్థ్యం: ఒక కటకం, కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని ఆ కటక సామర్థ్యంగా వ్యక్తపరుస్తాం

* కటక నాభ్యంతర విలోమ విలువను కటక సామర్థ్యం అంటారు.

* కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Diopter). దీన్ని Dతో సూచిస్తారు.


పట్టకం: ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని 'పట్టకం' అంటారు.
* పట్టకంలోని ఒక సమతలంపై కాంతి పతనం చెంది అది పట్టకం ద్వారా ప్రయాణించి రెండో సమతలం ద్వారా బయటకు వస్తుంది.
పట్టక కోణం (A) లేదా పట్టక వక్రీభవన కోణం: ఒక పట్టకం రెండు వక్రీభవన తలాల మధ్య కోణం పట్టక కోణం లేదా పట్టక వక్రీభవన కోణం.
కనిష్ఠ విచలన కోణం: పట్టకంపై పతనం చెందిన పతన కిరణానికి పట్టకం నుంచి బహిర్గతమైన బహిర్గత కిరణానికి మధ్య ఉండే కోణాన్ని విచలన కోణం (angle of deviation) అంటారు.


విక్షేపణం: తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని 'కాంతి విక్షేపణం' అంటారు.
పరిక్షేపణం: ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని 'కాంతి పరిక్షేపణం' అంటారు.

కాంతి తీవ్రత: కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం ఉన్న తలం ద్వారా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని 'కాంతి తీవ్రత' అంటారు.
కంటి కటకం: కంటిలోని కటకం మధ్య భాగంలో దృఢంగానూ, అంచువైపు వెళుతున్న కొద్దీ మృదువుగా ఉంటుంది. కంటిలోకి ప్రవేశించిన కాంతి కనుగుడ్డు వెనుక వైపు ఉన్న రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
గరిష్ఠ దూర బిందువు (Farpoint): ఏ గరిష్ఠ దూరం వద్ద ఉన్న బిందువుకు లోపల ఉన్న వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును 'గరిష్ఠ దూర బిందువు' అంటారు.
కనిష్ఠ దూర బిందువు (Nearpoint)ఏ కనిష్ఠ దూరం వద్ద ఉన్న బిందువుకు, అవతల ఉండే వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.

సారాంశ సంగ్రహం
*
 మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ. దూరంలో ఉండాలి. ఈ దూరాన్ని 'స్పష్టదృష్టి కనిష్ఠ దూరం' అంటారు.
*  వస్తువు చివరి బిందువుల నుంచి వచ్చే కిరణాలు కంటి వద్ద కొంత కోణాన్ని చేస్తాయి. ఈ కోణం 60º కంటే తక్కువగా ఉంటే, ఆ వస్తువును మొత్తం మనం చూడగలం. ఈ కోణం 60º కంటే ఎక్కువగా ఉంటే, ఆ వస్తువులో కొంతభాగం మాత్రమే చూడగలం.
*  స్పష్టదృష్టి కనీస దూరం, దృష్టి కోణం విలువలు వ్యక్తి వ్యక్తికీ వయసును బట్టి మారుతూ ఉంటాయి.
* జ్ఞానేంద్రియాల్లో కన్ను ఒక ప్రధానమైన అవయవం. ఇది మన చుట్టూ ఉండే వివిధ వస్తువులు, రంగులను చూడటానికి ఉపయోగపడుతుంది.
* మానవ నేత్రంలో కనుగుడ్డు, కార్నియా, నేత్రోదక ద్రవం (aqueous humour), ఐరిస్, కనుపాప, సిలియరి కండరాలు, రెటీనా ముఖ్యమైనవి.
*  కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతిని ఐరిస్ అదుపు చేస్తుంది.
* కంటిలోని కటకం మధ్యభాగంలో దృఢంగా, అంచుల వైపు వెళుతున్న కొద్దీ మృదువుగా ఉంటుంది.
*  కంటిలోకి ప్రవేశించిన కాంతి కనుగుడ్డుకు వెనుక వైపు ఉండే రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
*  కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్యదూరం దాదాపు 2.5 సెం.మీ. ఉంటుంది.

* కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.
* దూరంలోని వస్తువును మన కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠం అవుతుంది. అంటే కటకం నుంచి రెటీనాకు ఉండే దూరానికి నాభ్యంతరం విలువ సమానం అవుతుంది.
* దగ్గరగా ఉన్న వస్తువును మన కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటికటక నాభ్యంతరం తగ్గుతుంది.
* రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరీ కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి. ఇలా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే పద్ధతిని 'సర్దుబాటు' (accommodation) అంటారు.
* కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలకిందులుగా ఏర్పరుస్తుంది.
* రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు (rods), శంకువులు (cones) అనే గ్రాహకాలు (receptors) ఉంటాయి. వీటి సంఖ్య దాదాపు 125 మిలియన్లు. దండాలు రంగును, శంకువులు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
* ఈ సంకేతాలు దాదాపు ఒక మిలియన్ దృక్‌నాడులు (optic nerve fibres) ద్వారా మెదడుకు చేరుతాయి. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం, రంగులను మనం గుర్తించగలుగుతాం.

సాధారణంగా దృష్టి దోషాలు మూడు రకాలు. అవి:
a) హ్రస్వదృష్టి (Myopia)
b) దీర్ఘదృష్టి (Hypermetropia)
c) చత్వారం (Presbyopia)
* కొందరు దగ్గరగా ఉండే వస్తువులను చూడగలరు. కానీ, దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఈ దృష్టి దోషాన్ని 'హ్రస్వదృష్టి' అంటారు.
* పుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వదృష్టిని సవరించవచ్చు.
*  దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తి దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడగలడు కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
* దీర్ఘదృష్టిని సవరించడానికి తగిన నాభ్యంతరం ఉన్న ద్వికుంభాకార కటకం ఉపయోగిస్తారు.
* సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ దృష్టి దోషాన్ని చత్వారం అంటారు.
*  సిలియరీ కండరాలు క్రమంగా బలహీనపడి కంటి కటక స్థితిస్థాపక లక్షణం క్రమంగా తగ్గిపోవడంతో ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు వయసు పెరగడం వల్ల ఒక వ్యక్తికి హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి లోపాలు రెండూ కలగవచ్చు.
*  ఈ చత్వారం దోషాన్ని సవరించడానికి ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగిస్తారు. ఈ కటకం పై భాగంలో పుటాకార కటకం, కింది భాగంలో కుంభాకార కటకం ఉంటాయి.
*  ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని 'కటక సామర్థ్యం'గా వ్యక్తపరుస్తారు.

*  కటక నాభ్యంతరం విలోమ విలువను 'కటక సామర్థ్యం' అంటారు.
*  ఒక కటక నాభ్యంతరం f అనుకుంటే కటక సామర్థ్యం

* కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Diopter), దీన్ని Dతో సూచిస్తారు.
* ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని 'పట్టకం' అంటారు.
*  కనిష్ఠ విచలన కోణం (D) వద్ద పతన, బహిర్గత కోణాల విలువలు సమానంగా ఉంటాయి.

* తెల్లటి కాంతి వివిధ రంగులు (VIBGYOR)గా విడిపోవడాన్ని 'కాంతి విక్షేపణం' అంటారు.
*  కాంతి తరంగ వేగం (V), తరంగ దైర్ఘ్యం (λ), పౌనంపున్యం (f)ల మధ్య సంబంధం V = fλ
*  తరంగదైర్ఘ్యం పెరిగితే కాంతి వేగం పెరుగుతుంది. తరంగదైర్ఘ్యం తగ్గితే కాంతి వేగం తగ్గుతుంది.
* ఇంద్రధనస్సు అనేది కాంతి విక్షేపణానికి మంచి ఉదాహరణ.
*   అనేక లక్షల నీటి బిందువులతో కాంతి విక్షేపణం చెందడం వల్ల మనం చూసే అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
* ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతల్లో విడుదల చేయడాన్ని 'కాంతి పరిక్షేపణం' అంటారు.
*  కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
* వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలి రంగుకు కారణం
* సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. మధ్యాహ్న వేళల్లో అయితే తెల్లగా అగుపిస్తాడు. 

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం