• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక

1834, ఫిబ్రవరి 1న తూర్పు సైబీరియాలోని టోబోలస్కీలో మెండలీవ్ జన్మించారు. మాస్కో విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్ష రాసి కృతార్థుడు కాలేకపోయారు. ఊపిరితిత్తుల దోషం ఉన్న మెండలీవ్ ఆరునెలలకు మించి బతకడని అతడి ఇరవై ఒకటో ఏట హెచ్చరించారు. అయితే ఆయన 73 ఏళ్లు జీవించారు. ఆవర్తన పట్టికలో 101వ మూలకానికి మెండలీవ్ గౌరవార్థం 'మెండలీవియం అని పేరు పెట్టారు.

కీలక పదాలు

* త్రికం                                  * అష్టక నియమం
*ఆవర్తన నియమం                       ఆవర్తన పట్టిక
పీరియడ్‌లు                            గ్రూపులు
లాంథనైడ్‌లు                           ఆక్టినైడ్‌లు
మూలక కుటుంబం                     పాక్షిక లోహాలు
పరమాణు వ్యాసార్ధం                   అయనీకరణ శక్తి
ఎలక్ట్రాన్ ఎఫినిటి                       రుణవిద్యుదాత్మకత
ధన విద్యుదాత్మకత

కీలక పదాలు - వివరణలు

త్రికం: ఒకే రకమైన రసాయన ధర్మాలున్న మూడేసి మూలకాల సమూహాన్ని త్రికం అంటారు.


అష్టక నియమం: మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధుల్లో పునరావృతమవుతాయి. ఒక మూలకం నుంచి మొదలు పెడితే ప్రతి ఎనిమిదో మూలకం ధర్మాలు మొదటి మూలకం ధర్మాలను పోలి ఉంటాయి. దీన్నే న్యూలాండ్స్ అష్టక నియమం అంటారు.


ఆవర్తన నియమం: 'మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు'. దీన్నే మెండలీవ్ ఆవర్తన నియమం అంటారు.


ఆవర్తన పట్టిక: మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చిన అమరికను ఆవర్తన పట్టిక అంటారు.


పీరియడ్‌లు: మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్‌లు అంటారు.


గ్రూపులు: మెండలీవ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలున్నాయి. వీటిని గ్రూపులు అంటారు.


లాంథనైడ్‌లు: '4f' మూలకాలను లాంథనాయిడ్‌లు లేదా లాంథనైడ్‌లు అంటారు.


ఆక్టినైడ్‌లు: '5f' మూలకాలను ఆక్టినాయిడ్‌లు లేదా ఆక్టినైడ్‌లు అంటారు.


మూలక కుటుంబం: ఒకే గ్రూపులో ఉన్న మూలకాల సమూహాన్ని మూలక కుటుంబం లేదా రసాయనిక కుటుంబం అంటారు.

పాక్షిక లోహాలు: లోహాలు, అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా  ధర్మాలున్న మూలకాలను అర్ధలోహాలు (metalloids) అంటారు.


పరమాణు వ్యాసార్ధం: ఘనపదార్థంలోని రెండు పక్క పక్క పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్ధంగా లెక్కిస్తాం.


అయనీకరణ శక్తి: ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసి బాహ్య కక్ష్య నుంచి చివరి ఎలక్ట్రాన్‌ను పరమాణువు నుంచి పూర్తిగా విడదీయవచ్చు. ఇలా ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటారు.


ఎలక్ట్రాన్ ఎఫినిటీ: ఏదైనా ఒక మూలకపు పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.


రుణ విద్యుదాత్మకత: ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్‌లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణ విద్యుదాత్మకత అంటారు.


ధన విద్యుదాత్మకత: సమ్మేళనాల్లో ఉండే లోహాలు ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాన్ని తరచుగా ధన విద్యుదాత్మకత స్వభావం అంటారు.

సారాంశ సంగ్రహం
* రాబర్ట్ బాయిల్ కాలంలో (1661) సమయానికి కేవలం 13 మూలకాల గురించిన సమాచారం మాత్రమే తెలుసు.
* 18వ శతాబ్దం చివరి నాటికి లెవోయిజర్ కాలంలో మరో 11 మూలకాలను కనుక్కున్నారు.
* 1865 సమయానికి దాదాపు 63 మూలకాలను కనుక్కున్నారు.
* 1940 నాటికి సహజ వనరుల నుంచి 91 మూలకాలను ఆవిష్కరించగా, మరో 17 మూలకాలను కృత్రిమంగా తయారు చేశారు.
* ప్రస్తుతం 115కు పైగా మూలకాలను కనుక్కున్నారు.
* మూలకాలను శాస్త్రీయంగా వర్గీకరించాల్సిన అవసరం ఏర్పడింది.
* శాస్త్రవేత్తలు మూలకాలు, వాటి సమ్మేళనాలను భౌతిక, రసాయనిక ధర్మాల ఆధారంగా వర్గీకరించడానికి వివిధ మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టారు.
* 18వ శతాబ్దం ప్రారంభంలో జోసెఫ్ లూయీస్ ప్రాస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, మిగిలిన అన్ని మూలక పరమాణువులు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడతాయని తెలిపాడు.
* జోహాన్ వోల్ఫ్‌గాంగ్ డాబరీనర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఒకేరకమైన రసాయన ధర్మాలున్న మూడేసి మూలకాల సమూహాలను గుర్తించి, వాటిని త్రికాలు (Triads) అని పేర్కొన్నాడు.

'ప్రతి త్రికంలో మధ్య మూలక పరమాణు భారం, మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది' అని డాబరీనర్ ప్రతిపాదించాడు. దీన్నే డాబరీనర్ త్రిక సిద్ధాంతం అని పిలుస్తారు.
ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులున్న మూలకాలకు వర్తించదు.
జాన్ న్యూలాండ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుక్కున్నాడు. ఇలా ఏర్పడిన గ్రూపుల్లో ఉండే మూలకాలు ఒకేవిధమైన రసాయన ధర్మాలను కలిగి ఉంటాయని గమనించాడు. దీని ఆధారంగా అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు.
''మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధుల్లో పునరావృతమవుతాయి. ఒక మూలకం నుంచి మొదలు పెడితే ప్రతి ఎనిమిదో మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటాయి". దీన్నే న్యూలాండ్స్ అష్టక నియమం
(Law of Octaves) అంటారు.
*న్యూలాండ్స్ పట్టిక 56 మూలకాలకు మాత్రమే పరిమితమైంది. కొత్తగా కనిపెట్టబోయే మూలకాలకు ఎలాంటి ఖాళీలు విడిచి పెట్టలేదు.
తర్వాతి కాలంలో కనుక్కున్న మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా న్యూలాండ్స్ పట్టికలో అమర్చడానికి వీలు కలగలేదు.
* దిమిత్రీ ఇవనోవిచ్ మెండలీవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక చార్టు రూపంలో తయారు చేశాడు.

చార్టును 8 నిలువు వరుసలుగా విభజించాడు. వాటిని గ్రూపులు అంటారు. వీటిలో ప్రతి గ్రూపును తిరిగి A, B ఉప గ్రూపులుగా విభజించాడు. ఇవి రసాయనిక ధర్మాల్లో సారూప్యత ఉన్న మూలకాలను కలిగి ఉంటాయి.
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు.
* 'మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు'. దీన్నే మెండలీవ్ ఆవర్తన నియమం అంటారు.
ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెండలీవ్ కొన్ని మూలకాలు లభ్యం కావడం లేదని గుర్తించాడు. వాటి కోసం పట్టికలో నిర్దిష్ట స్థానాల్లో ఖాళీ గదులను విడిచిపెట్టాడు.
మెండలీవ్ రూపొందించిన పట్టిక ఆధారంగానే ఆ కొత్త మూలకాల ధర్మాలను ముందుగానే ఊహించాడు. అతడు ఊహించిన ధర్మాలు ఆ తర్వాత కాలంలో కొత్తగా కనుక్కున్న మూలకాల ధర్మాలు ఒకేలా ఉన్నాయి.
భవిష్యత్‌లో కనుక్కోబోయే మూలకాలకు అతడు తాత్కాలికంగా పేర్లు నిర్దారించాడు. ఉదాహరణకు ఎకా - బోరాన్, ఎకా - అల్యూమినియం, ఎకా - సిలికాన్. భవిష్యత్తులో కనుక్కోబోయే మూలకానికి ముందున్న మూలకానికి eka అనే పదాన్ని పూర్వ పదంగా చేర్చి పేరు నిర్ణయించాడు.
ఈ మూలకాల గురించి మెండలీవ్ ఊహించిన ధర్మాలు, ఆ తర్వాత కనుక్కున్న గాలియం, స్కాండియం, జెర్మేనియంల ధర్మాలు ఒకేవిధంగా ఉన్నాయి.
మెండలీవ్ ఆవర్తన పట్టికకు పరిమితులు ఉన్నాయి. అసంగత మూలకాల జతలు అధిక పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలు, అల్ప ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు ముందున్నాయి.

సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం.
మూలకాలను అధిక శక్తి ఉండే ఎలక్ట్రాన్‌లతో తాడనం చెందించినప్పుడు ప్రతీ మూలకం ఒక స్వాభావిక పౌనఃపున్య అమరిక ఉన్న X - కిరణాలను విడుదల చేస్తుందని మోస్లే అనే బ్రిటిష్ శాస్త్రవేత్త (1913) కనుక్కున్నాడు.
ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశిత కణాల సంఖ్య (ప్రోటాన్ల సంఖ్య)ను ఆ మూలకం పరమాణు సంఖ్య అంటారు.
ఆవర్తన నియమాన్ని 'పరమాణు భారం' అనే భావన నుంచి 'పరమాణు సంఖ్య'కు మార్చి, నవీన ఆవర్తన నియమంగా పిలుస్తున్నారు.
నవీన ఆవర్తన నియమాన్ని ఇలా నిర్వచించవచ్చు. 'మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు'.
నవీన ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉంటాయి.
మూలకం పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్
(Differentiating Electron) ఏ ఉప కక్ష్యలో చేరుతుందో దాన్ని ఆధారం చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు.
ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్ష్యలున్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్‌కు చెందుతుందనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
హైడ్రోజన్, హీలియం పరమాణువుల్లో ఒకే ఒక ప్రధాన కక్ష్య (K) ఉంటుంది. కాబట్టి ఇవి ఒకటో పీరియడ్‌కు చెందుతాయి.
* అదేవిధంగా Li, Be, B, C, N, O, F, Ne మూలకాలు రెండు ప్రధాన కక్ష్యల్లో (K, L) ఉంటాయి. కాబట్టి ఇవి రెండో పీరియడ్‌కు చెందుతాయి.
మూడో పీరియడ్ మూడో ప్రధాన కక్ష్య (M) తో మొదలవుతుంది. ఈ కక్ష్య '3s', '3p', '3d' లనే ఉప కక్ష్యలతో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్‌లు నిండుతున్నప్పుడు '4s' నిండిన తర్వాతే '3d' నిండుతుంది. అందువల్ల 3వ పీరియడ్ 8 మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది.
నాలుగో పీరియడ్ 4వ ప్రధాన కక్ష్య (N)తో మొదలవుతుంది. ఈ కక్ష్యలో 4s, 4p, 4d, 4f ఉప కక్ష్యలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్‌లు నిండుతున్నప్పుడు 4s, 3d, 4p క్రమాన్ని పాటిస్తాయి. దీని కారణంగా నాలుగో పీరియడ్‌లో 18 మూలకాలు ఉంటాయి.
ఇదే విధంగా 5వ పీరియడ్‌లో 18 మూలకాలు ఉంటాయి.
6వ పీరియడ్‌లో 32 మూలకాలు ఉంటాయి. 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంది.
4f మూలకాలను లాంథనాయిడ్‌లు లేదా లాంథనైడ్‌లు, 5f మూలకాలను ఆక్టినాయిడ్‌లు లేదా ఆక్టినైడ్‌లు అంటారు. వీటిని ఆవర్తన పట్టికకు అడుగు భాగాన అమర్చారు.
బాహ్య కక్ష్యలో మూడు లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్‌లున్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తారు.
బాహ్య కక్ష్యలో అయిదు లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లున్న మూలకాలను అలోహాలుగా పరిగణిస్తారు.
'd' బ్లాక్ మూలకాల్లో 3వ గ్రూపు నుంచి 12వ గ్రూపు వరకు ఉండే లోహాలను పరివర్తన మూలకాలు అంటారు.

లాంథనైడ్‌లు, ఆక్టినైడ్‌లు III B గ్రూపునకు చెందుతాయి. ఇవి పరివర్తన లోహాల సమూహానికి చెందినవిగానే ఉండటం వల్ల వీటిని అంతర పరివర్తన మూలకాలు అంటారు.
లోహ, అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలను కలిగి ఉండే మూలకాలను అర్ధ లోహాలు (metalloids) అంటారు. ఇవి సాధారణంగా అర్ధవాహకాలుగా పనిచేస్తాయి.
ఉదా: B, Si, As, Ge.
ఆవర్తన పట్టికలో మీరు మెట్ల లాంటి రేఖలను గమనించవచ్చు. ఈ రేఖకు ఎడమ వైపు ఉన్న మూలకాలు లోహాలు, కుడివైపు ఉన్న మూలకాలు అలోహాలు. ఈ రేఖపై లేదా ఈ రేఖకు దగ్గరగా ఉన్న B, Si, As, Ge లు అర్ధ లోహాలు.


* సంయోజకత: ఒక మూలకం సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటారు. దీన్ని హైడ్రోజన్, ఆక్సిజన్ మొదలైన మూలకాల పరంగా వివరిస్తారు.
ఏదైనా ఒక మూలక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్య లేదా ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలక పరమాణువు సంయోజకతగా చెప్పవచ్చు.
సాధారణంగా హైడ్రోజన్ పరంగా మూలకం సంయోజకత, దాని సంప్రదాయ గ్రూపు సంఖ్యను తెలియజేస్తుంది. మూలకం ఉండే గ్రూపు సంఖ్య V లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మూలక సంయోజకతను లెక్కించడానికి 8 నుంచి గ్రూపు సంఖ్యను తీసివేయాలి.
ఉదాహరణకు ఏడో గ్రూప్ మూలకమైన క్లోరిన్ సంయోజకత 8 - 7 = 1 అవుతుంది.

సాధారణంగా ప్రతి పీరియడ్ సంయోజకత 1 ప్రారంభమై 0 తో అంతమవుతుంది.
* ఘన పదార్థంలోని రెండు పక్క పక్క పరమాణువుల కేంద్రకాల మధ్య దూరాన్ని కనుక్కోవచ్చు. ఈ దూరంలో సగాన్ని మనం పరమాణు వ్యాసార్ధంగా లెక్కిస్తాం.
* సమయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్ధంగా తీసుకుంటారు. దీన్నే సమయోజనీయ వ్యాసార్ధం అని కూడా అంటారు.
పరమాణు వ్యాసార్ధాన్ని Pm (పీకోమీటర్)లలో కొలుస్తారు.
1 Pm = 10-12 m.
ఆవర్తన పట్టికలోని గ్రూప్‌లలో పై నుంచి కిందికి వెళ్లేకొద్దీ మూలకాల పరమాణు వ్యాసార్ధం పెరుగుతూ ఉంటుంది.
మూలకాల పరమాణు వ్యాసార్ధం పీరియడ్‌లలో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ తగ్గుతుంది.
ఏదైనా ఒక మూలకపు పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసి బాహ్యకక్ష్యలో నుంచి చివరి ఎలక్ట్రాన్‌ను పూర్తిగా విడదీయవచ్చు. దీనివల్ల ధనావేశిత అయాన్ ఏర్పడుతుంది. ఇలా ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటారు.
    1) కేంద్రక ఆవేశం
    2) స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం
    3) ఆర్బిటాళ్ల చొచ్చుకుపోయే స్వభావం
    4) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం... వీటన్నింటిపై అయనీకరణ శక్తి ఆధారపడి ఉంటుంది.
పరమాణు వ్యాసార్ధం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
ఏదైనా మూలకపు పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ
(Electron Affinity) అంటారు.
గ్రూపుల్లో పై నుంచి కింది వెళ్లేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి.
లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి.
క్షారమృత్తిక లోహాలు కొంతవరకు ధనాత్మక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలతో ఉంటాయి. ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుందని అర్థం.
అయనీకరణ శక్తిపై ప్రభావం చూపే అంశాలన్నీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీపై కూడా ప్రభావం చూపుతాయి.
అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు ఒంటరి తటస్థ పరమాణువుకు సంబంధించిన ధర్మాలు. మూలక పరమాణువులు సంయోగం చెందినప్పుడు ఆ మూలకాలు ఎలక్ట్రాన్లను ఆకర్షించే సామర్థ్యాన్ని పోల్చడానికి ఒక మాపనం అవసరం. దీని కారణంగానే రుణ విద్యుదాత్మకత అనే భావనను ప్రవేశపెట్టారు.
ఒక మూలకపు పరమాణువు వేరే మూలకపు పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్‌లను తనవైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణవిద్యుదాత్మకత
(Electronegativity) అంటారు.

మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త ఇలా ప్రతిపాదించాడు.
     
*
 లైనస్ పౌలింగ్, రుణ విద్యుదాత్మకత విలువను బంధశక్తుల ఆధారంగా లెక్కగట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు.
హైడ్రోజన్ రుణ విద్యుదాత్మకత విలువను 2.20గా తీసుకుని, దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలను నిర్ణయించారు.
లోహాలకు సాధారణంగా అల్ప రుణ విద్యుదాత్మకత ఉంటుంది. సమ్మేళనాల్లో ఉండే లోహాలు ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాన్ని తరచుగా ధన విద్యుదాత్మకత స్వభావం అంటారు.
లోహాలను ధన విద్యుదాత్మకత ఉండే మూలకాలుగా గుర్తించవచ్చు.
అలోహాల పరమాణు వ్యాసార్ధాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అవి సాధారణంగా అధిక రుణ విద్యుదాత్మకత విలువలను కలిగి ఉంటాయి.
కార్బన్ అలోహం. Si, Ge లు అర్ధ లోహాలు. దీన్ని బట్టి ఆవర్తన పట్టికలో ఏదైనా గ్రూపులో పైన అలోహాలు, కింద లోహాలు ఉంటాయని అర్థమవుతోంది.

Posted Date : 24-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం