• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన బంధం

       జహంగీర్ హోమీబాబా 1909, అక్టోబరు 30న జన్మించారు. ఆటలంటే ఆసక్తిలేని బాబా చదువులో మాత్రం ముందుండేవారు. పదహారేళ్ల వయసులో ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం చదివేశారు. ఆనాటికి ఆ సిద్ధాంతం ఎవరికి అర్థం కాలేదట. ఒకసారి బాబా, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కలిసి సముద్రయానం చేశారు. ఆ పరిచయం ఫలితంగా ట్రాంబేలో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్ 1954లో మొదలైంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ నిర్మాత కూడా ఇతడే. 57 ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో బాబా మరణించారు.

కీలక పదాలు 

* ఎలక్ట్రాన్‌లు                                    * ఆనయాన్

* జడవాయువులు                               * స్థిర విద్యుదాకర్షణ బలం

* లూయిస్ చుక్కల నిర్మాణాలు                   * ఎలక్ట్రోవలెంట్

* అష్టక నియమం                               * ధ్రువద్రావణి

* రసాయన బంధం                              * అధ్రువద్రావణి

* అయానిక బంధం                              * అణువులు

* సంయోజనీయ బంధం                         * అయానిక పదార్థాలు

* కేటయాన్                                     * సంయోజనీయ పదార్థాలు

* ధన విద్యుదాత్మక ధర్మం                        * ఒంటరి ఎలక్ట్రాన్ జంట

* బంధ ఎలక్ట్రాన్ జంట                            * బంధ దూరం

* రుణ విద్యుదాత్మక ధర్మం                       * చతుర్ముఖీయం

ధ్రువ బంధాలు                                 * అణువు ఆకృతి

బంధ శక్తి                                      * రేఖీయం

* అయానిక పదార్థాలు                             * సంయోజనీయ పదార్థాలు

కీలక పదాలు - వివరణలు 

ఎలక్ట్రాన్‌లు: పరమాణువులో ఉండే రుణావేశిత కణాలు.


జడవాయువులు: 'O' గ్రూపు మూలకాలను (వాయువులను) జడవాయువులు అంటారు. హీలియం తప్ప మిగతా జడవాయువుల చివరి కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.


లూయిస్ చుక్కల నిర్మాణాలు: మూలక పరమాణువును, దానిలోని వేలన్సీ ఎలక్ట్రాన్‌లను పటరూపంలో చూపించే పద్ధతిని లూయిస్ గుర్తు లేదా లూయిస్ చుక్కల నిర్మాణం అంటారు.


అష్టక నియమం: మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీన్నే అష్టక నియమం అంటారు.


రసాయన బంధం: రెండు పరమాణువుల మధ్య లేదా పరమాణువుల సమూహాల మధ్య పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడటానికి దారితీస్తే దాన్ని రసాయన బంధం అంటారు.
 

అయానిక బంధం: రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.


సంయోజనీయ బంధం: రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్‌లను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు.


కేటయాన్: ధన విద్యుదావేశం ఉండే అయాన్‌లను కేటయాన్‌లు అంటారు. తటస్థ పరమాణువులు ఎలక్ట్రాన్‌ను కోల్పోవడం వల్ల కేటయాన్‌లు ఏర్పడతాయి.


ఆనయాన్: రుణ విద్యుదావేశం ఉన్న అయాన్‌లను ఆనయాన్‌లు అంటారు. తటస్థ పరమాణువులు ఎలక్ట్రాన్‌ను గ్రహించడం వల్ల ఆనయాన్ ఏర్పడుతుంది.


స్థిర విద్యుదాకర్షణ బలం: విజాతి విద్యుదావేశాల మధ్య ఉండే ఆకర్షణ బలం లేదా సజాతి విద్యుదావేశాల మధ్య ఉండే వికర్షణ బలాలను స్థిర విద్యుదాకర్షణ బలం అంటారు.


ఎలక్ట్రోవలెంట్: వేలన్సీ భావనను ఎలక్ట్రాన్‌ల పరంగా వివరించారు కాబట్టి అయానిక బంధాన్ని కూడా ఎలక్ట్రోవలెంట్ బంధం అంటారు.


ధ్రువద్రావణి: అయానిక సమ్మేళనాల ద్రావణాలను ధ్రువద్రావణులు అంటారు. అయాన్‌ల కారణంగా వీటికి ధ్రువ స్వభావం ఉంటుంది. ఈ ద్రావణుల్లో అయానిక సమ్మేళనాలు, అయనీకరణం చెందే సంయోజనీయ సమ్మేళనాలు కరుగుతాయి. ఉదా: నీరు, ద్రవ అమ్మోనియా.
 

అధ్రువ ద్రావణి: అధ్రువ స్వభావం ఉన్న ద్రావణాలను అధ్రువ ద్రావణులు అంటారు. ఈథేన్, బెంజిన్‌లు అధ్రువ ద్రావణులకు ఉదాహరణలు. వీటిలో అయానిక సమ్మేళనాలు కరగవు. అధ్రువ సంయోజనీయ సమ్మేళనాలు కరుగుతాయి.
 

అణువులు: పరమాణువులు ఎలక్ట్రాన్‌ల బదిలీ లేదా ఎలక్ట్రాన్‌లను పంచుకోవడం వల్ల అవి కలిసి అణువులు ఏర్పడతాయి.


అయానిక పదార్థాలు: అయానిక బంధం వల్ల ఏర్పడే సమ్మేళన పదార్థాలను అయానిక పదార్థాలు అంటారు.


సంయోజనీయ పదార్థాలు: రెండు పరమాణువుల మధ్య వేలన్సీ ఎలక్ట్రాన్‌లను పంచుకోవడం వల్ల రెండు పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో అష్టక విన్యాసం లేదా రెండు ఎలక్ట్రాన్ విన్యాసం పొందడం ద్వారా ఏర్పడిన రసాయన బంధాన్ని సంయోజనీయ బంధం (Covalent bond)) అంటారు. ఈ విధంగా ఏర్పడిన సమ్మేళన పదార్థాలను సంయోజనీయ పదార్థాలు అంటారు.


ధన విద్యుదాత్మక ధర్మం: పరమాణువులు తమ బాహ్య కక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌లను కోల్పోయే స్వభావాన్ని ధన విద్యుదాత్మక ధర్మం అంటారు.


రుణ విద్యుదాత్మక ధర్మం: పరమాణువులు ఎలక్ట్రాన్‌లను గ్రహించే స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత ధర్మం అంటారు.


ధ్రువ బంధాలు: రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్‌లను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని ధ్రువ బంధం అంటారు.

బంధ ఎలక్ట్రాన్ జంట: సంయోజనీయ బంధంలోని పరమాణువుల మధ్య పంచుకోబడే ఎలక్ట్రాన్ జంటను బంధ ఎలక్ట్రాన్ జంట అంటారు.


ఒంటరి ఎలక్ట్రాన్ జంట: ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు అంటే బంధంలో పాల్గొనని లేదా పంచుకోబడని ఎలక్ట్రాన్ జంటలు.


బంధ దూరం: సంయోజనీయ బంధంతో కలిపిన రెండు పరమాణువు కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద ఉన్న దూరాన్నే బంధ దూరం అంటారు.


బంధ శక్తి: అణువులోని బంధాలను వేరు చేసేందుకు అవసరమైన శక్తి.


అణువు ఆకృతి: అణువులోని పరమాణువుల కేంద్రకాల ద్వారా వెళ్లే ఊహారేఖల ఆకారాలు.


రేఖీయం: సంయోజనీయ బంధంలో మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ వేలన్సీ కక్ష్యలో రెండు బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నట్లయితే వాటి మధ్య వికర్షణ బలాన్ని తగ్గించడానికి వాటిని 180° కోణంలో వేరు చేయాలి. అలా చేయడం వల్ల అణువు రేఖీయాకృతిలో ఉంటుంది. ఉదా: BeCl2.


చతుర్ముఖీయం: మీథేన్ - CH4 - అణువు ఆకృతి.


అయానిక పదార్థాలు: ఇవి సాధారణంగా స్ఫటిక రూప ఘన పదార్థాలు. వీటికి అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఉంటాయి. ఇవి ధ్రువద్రావణిలో మాత్రమే కరుగుతాయి. ఈ పదార్థాల మధ్య చర్యలు చాలా వేగంగా జరుగుతాయి.


సంయోజనీయ పదార్థాలు: సంయోజనీయ అణువుల్లో ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి. అందువల్లే ఈ పదార్థాలు తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి. ఇవి అధ్రువ ద్రావణిలో కరుగుతాయి. ఈ పదార్థాల మధ్య చర్యలు చాలా నెమ్మదిగా మిత వేగంతో జరుగుతాయి.

సారాంశ సంగ్రహం

* మూలకాల వర్గీకరణ, ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక, రసాయన బంధం గురించి ఒకకొత్త ఆలోచనకు అవకాశం వచ్చింది.
మూలక పరమాణువును, దానిలోని వేలన్సీ ఎలక్ట్రాన్‌లను పటరూపంలో చూపించే పద్ధతిని లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటారు.
* రసాయన చర్యల్లో పాల్గొనే మూలకాలు అష్టక విన్యాసం లేదా ns2 np6 విన్యాసం పొందుతాయి. ఇలా చేయడం వల్ల ఆ మూలకాలు రసాయనికంగా జడత్వం, స్థిరత్వాలను పొందుతాయి.
* అష్టక విన్యాసం ఇప్పటికే ఒక సాధారణీకరణమేగానీ అది ఒక నియమం కాదు. ఎందుకంటే దీనికి కొన్ని పరిమితులున్నాయి.
* కోసెల్, లూయి అనే శాస్త్రవేత్తలు 1916లో ఎలక్ట్రాన్‌ల పరంగా పరమాణువుల మధ్య రసాయన బంధం వివరించడానికి సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. ఎలక్ట్రాన్‌ల ఆధారంగా వేలన్సీని నిర్వచించడమే వీరి సిద్ధాంతానికి మూలాధారం.
* ప్రధాన గ్రూపుల్లోని మూలక పరమాణువులను రసాయనిక చర్యల్లో పాల్గొన్నప్పుడు గమనిస్తే అవి అన్నీ కూడా జడవాయువులు లేదా అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ప్రయత్నం చేస్తాయి.

* గ్రూప్ IA మూలకాలు వాటి పరమాణు బాహ్య కక్ష్య నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి దానికి సంబంధించిన ఏకమాత్ర ధనాత్మక అయాన్‌ను ఏర్పరుస్తాయి. దీని ద్వారా తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.
* గ్రూప్ IIA మూలకాల పరమాణువులు రసాయనిక చర్యలో పాల్గొనేటప్పుడు తమ బాహ్య కక్ష్య నుంచి రెండు వేలన్సీ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ద్విమాత్రక ధనాత్మక అయాన్‌గా ఏర్పడతాయి. దీని ద్వారా తమ బాహ్యకక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.
* అదేవిధంగా IIIA గ్రూప్ మూలకాలు వాటి మూడు వేలన్సీ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి వాటికి సంబంధించిన అయాన్‌లా ఏర్పడటానికి ప్రయత్నిస్తాయి.
* VIA గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయన మార్పునకు లోనయ్యేటప్పుడు రెండు ఎలక్ట్రాన్‌లను గ్రహించి వాటికి సంబంధించిన 'ఆనయాన్‌లు'గా ఏర్పడతాయి. ఈ విధంగా వాటి బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందుతాయి.
* గ్రూప్ VIIA మూలకాల పరమాణువులు రసాయన మార్పునకు లోనయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించి, వాటికి సంబంధించిన 'ఆనయాన్‌లు'గా ఏర్పడటం ద్వారా వాటి బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందుతాయి.
* VIIIA గ్రూప్ మూలకాలు సాధారణంగా ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం లేదా గ్రహించడానికి ప్రయత్నించవు.

* మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి దీన్నే అష్టక నియమం అంటారు.
* రెండు పరమాణువుల మధ్య లేదా పరమాణువుల సమూహాల మధ్య పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడటానికి దారి తీస్తే దాన్ని రసాయన బంధం అంటారు.
* కొశ్మల్ అనే శాస్త్రవేత్త కొన్ని అంశాలను ఆధారం చేసుకుని అయానిక బంధాన్ని ప్రతిపాదించాడు.
* రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
* లోహ పరమాణువుల నుంచి అలోహ పరమాణువులకు ఎలక్ట్రాన్‌ల బదలయింపు వల్ల ఏర్పడిన ధనాత్మక అయాన్‌లు (కేటయాన్‌లు), రుణాత్మక అయాన్‌ల (ఆనయాన్‌లు) మధ్య స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల అవి ఆకర్షణకు గురై రసాయన బంధం ఏర్పడుతుంది.
* ఈ బంధం రెండు ఆవేశపూరిత కణాలైన అయాన్‌ల మధ్య ఏర్పడటంవల్ల దీన్ని అయానిక బంధం అంటారు.
* ఆనయాన్‌ల మధ్య పనిచేస్తున్న బలాలు, స్థిర విద్యుదాకర్షణ బలాలు కావడంతో ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం అని కూడా అంటారు.

* వేలన్సీ భావనను ఎలక్ట్రాన్‌ల పరంగా వివరించారు. కాబట్టి దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని కూడా అంటారు.


* NaCl ఏర్పడటం: సోడియం పరమాణువు తన బాహ్య కక్ష్యలో అష్టకం పొందడానికి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి Na+ అయాన్‌గా ఏర్పడటం ద్వారా నియాన్ (Ne) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది.
ఎలక్ట్రాన్ విన్యాసం:       11Na(g) 

 11Na+(g) + e-
                       2, 8, 1          2, 8 (కేటయాన్)
                                (లేదా)
                      [Ne] 3s1          [Ne]
* క్లోరిన్ పరమాణువుకు దాని చివరి కక్ష్యలో అష్టకం పొందడానికి ఒక ఎలక్ట్రాన్ అవసరం. కాబట్టి సోడియం కోల్పోయిన ఆ ఎలక్ట్రాన్‌ను క్లోరిన్ గ్రహించి (Cl-) ఆనయాన్‌గా ఏర్పడటం ద్వారా ఆర్గాన్ (Ar) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది.


ఎలక్ట్రాన్ విన్యాసం:        17Cl(g) + e-    Cl-(g)
                         2, 8, 7                 2, 8, 8
                                         (లేదా)
                         [Ne] 3s2 3p5            [Ne] 3s2 3p(లేదా) [Ar]
అయాన్‌ల నుంచి NaCl ఏర్పడటం:
              Na+(g) + Cl-(g)  Na+ Cl-(s) (లేదా) NaCl

* సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ప్రతి సోడియం అయాన్ (Na+) చుట్టూ 6 క్లోరిన్ అయాన్‌లు, అదేవిధంగా ప్రతి క్లోరిన్ అయాన్ చుట్టూ ఆరు సోడియం అయాన్‌లు ఉంటాయి.
* ఒక నిర్దిష్ట ఆవేశంగా అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం ఉన్న అయాన్‌లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను ఆ అయాన్ సమన్వయ సంఖ్య
 (Co - ordination number)  అంటారు.
* సాధారణంగా లోహ మూలకాలు తమ బాహ్య కక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌లను కోల్పోయి అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధమైన స్వభావాన్నే లోహధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
* అలోహ మూలకాలైన ఆక్సిజన్ (O2), ఫ్లోరిన్ (9F), క్లోరిన్ (17Cl) లు ఎలక్ట్రాన్‌లను గ్రహించడం ద్వారా అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ స్వభావాన్నే రుణ విద్యుదాత్మకత అంటారు.
* ఎలక్ట్రాన్‌లను కోల్పోయి కేటయాన్‌గా మారే స్వభావం లేదా ఎలక్ట్రాన్‌లను గ్రహించి ఆనయాన్‌గా మారే స్వభావం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
       a) పరమాణు పరిమాణం               b) అయనీకరణ శక్మం
       c) ఎలక్ట్రాన్ ఎఫినిటీ                       d) రుణ విద్యుదాత్మకత
* 1916లో జి.ఎన్.లూయిస్ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌ల మార్పిడి జరగకుండానే వాటి బాహ్య కక్ష్యలో అష్టక విన్యాసం పొందుతాయని ప్రతిపాదించాడు.

* రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినపుడు అవి ఎలక్ట్రాన్‌లను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే సంయోజనీయ బంధం.
* సంయోజనీయ బంధంలో అణువుల మధ్య మూలకాలను బట్టి ఏక, ద్వి, త్రి, చతుః బంధాలు ఏర్పడుతూ ఉంటాయి.
* రెండు పరమాణువుల మధ్య పంచుకోబడే ప్రతి ఎలక్ట్రాన్ జంట ఒక సంయోజనీయ బంధాన్ని సూచిస్తుంది.
* సంయోజనీయ బంధంతో కలుపబడిన రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద ఉండే దూరాన్నే బంధ దూరం లేదా బంధ దైర్ఘ్యం అంటారు.
* 1 ఆంగ్‌స్ట్రామ్
= 10-10 మీ. (లేదా) 100 పికో మీటర్లు
* ఈ వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలో లోపాలున్నాయి.
* మూడు, అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన అణువుల్లో అన్ని పరమాణువులు ఒకే కేంద్రక పరమాణువుతో సమయోజనీయ బంధంతో బంధితమై ఉన్నప్పుడు వాటి మధ్య బంధకోణాలు వివరించడానికి
VSEPRT (Valence Shell Electron Pair Repulsion Theory) సిద్ధాంతాన్ని సిట్జివిక్, పావెల్‌లు 1940లో ప్రతిపాదించారు.
* VSEPRT ప్రకారం సంయోజనీయ బంధాల్లో వేలన్సీ కక్ష్యలోని ఎలక్ట్రాన్‌లు, బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు సాధ్యమైనంత వరకు ఒకదానికొకటి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. అందువల్లే అణువులకు ప్రత్యేక ఆకారాలు వస్తాయి.

* సంయోజనీయ బంధంలో మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ వేలన్సీ కక్ష్యలో రెండు బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నట్లయితే, వాటి మధ్య వికర్షణ బలాన్ని తగ్గించడానికి వాటిని 180° కోణంలో వేరు చేయాలి. అలా చేయడం వల్ల అణువు రేఖీయాకృతిలో ఉంటుంది.
* వెస్పర్ట్
(VSEPRT) సిద్ధాంతం ప్రధానంగా బంధ శక్తులను వివరించడంలో విఫలమైంది.
* సంయోజనీయ బంధాన్ని వివరించడానికి లైనస్ పౌలింగ్ (1954) వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
* వేలన్సీ కక్ష్యలో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్‌లను కలిగి ఉన్న రెండు పరమాణువులు దగ్గరగా చేరినప్పుడు, ఆ రెండు పరమాణువుల్లో వ్యతిరేక స్పిన్ కలిగి ఉన్న జతకూడని ఎలక్ట్రాన్‌లను కలసి పంచుకోవడం వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది.
రెండు పరమాణువుల యొక్క అతివ్యాప్తం చెందిన ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్‌లను రెండు కేంద్రకాలు కలసి పంచుకోవడం వల్ల రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుంది.
* పరమాణువుల చివరి కక్ష్యలో ఉండే దాదాపు సమానశక్తి ఉన్న పరమాణు ఆర్బిటాళ్లు పరస్వరం కలిసిపోయి, పునర్ వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం లాంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచే దృగ్విషయాన్ని సంకరీకరణం
(Hybridisation) అంటారు. వేలన్సీ బంధ సిద్ధాంతం - సంకరీకరణం ద్వారా లైనస్ పౌలింగ్ (1931) అనే శాస్త్రవేత్త 'పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణం' అనే దృగ్విషయాన్ని పైవిధంగా ప్రతిపాదించాడు.
* అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణాల్లో (ఉదా: నీరు) కరుగుతాయి. అధ్రువ ద్రావణాల్లో కరగవు. ధ్రువ ద్రావణాల్లో అధిక చర్యా శీలత కలిగి ఉంటాయి. చర్యలు అతివేగంగా జరుగుతాయి.
* సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. కాని నీరు లాంటి ధ్రువద్రావణాల్లో కరగవు. రసాయనిక చర్యలు గది ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా లేదా అతి నెమ్మదిగా జరుగుతాయి.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం