• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణ శాస్రం 

ప్రఫుల్ల చంద్ర రే ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కాటిపరాలో 1861, ఆగస్టు 2న జన్మించారు. 1888లో విదేశాల నుంచి భారతదేశం వచ్చిన 'రే' ఖద్దరు ధరించి, భారత్‌ను పారిశ్రామిక దేశంగా రూపొందించేందుకు కంకణం కట్టుకున్నారు. అతడు ఆశించిన విధంగా సల్ఫ్యూరికామ్లం భారీగా ఉత్పత్తి చేసే ప్రయత్నంలో విజయం సాధించారు. వివాహం చేసుకోకుండా పరిశోధనలతో జీవితాన్ని గడిపారు. 1944లో మరణించారు.

కీలక పదాలు

* లోహ శాస్త్రం              * లోహ ఖనిజాలు

* ధాతువులు                * ముడిఖనిజ సాంద్రీకరణ

* చర్యాశీలత శ్రేణి            * ప్లవన ప్రక్రియ

* థర్మైట్ చర్య              * లోహ శుద్ధి

* స్వేదనం                  * పోలింగ్

* గలనం చేయడం           * విద్యుత్ శోధనం

* లోహక్షయం               * ప్రగలనం

* భర్జనం                   * భస్మీకరణం

* కొలిమి                   * బ్లాస్ట్ కొలిమి

* రివర్బరేటరీ కొలిమి        * ద్రవకారి

కీలక పదాలు - వివరణలు

లోహశాస్త్రం(Metallurgy): ప్రకృతిలో లభించే ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని 'లోహశాస్త్రం' అంటారు.

లోహ ఖనిజాలు(Minerals): ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను లోహ ఖనిజాలు అంటారు.

ధాతువులు(Ores): లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ధాతువులు అంటారు.

ముడి ఖనిజ సాంద్రీకరణ(Concentration or Dressing of the ore): ఖనిజ మాలిన్యం అధిక పరిమాణం లో ఉన్న ధాతువు నుంచి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా ముందుగా వేరు చేస్తారు. ఇలా పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుంచి వేరు చేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటారు.

చర్యాశీలత శ్రేణి(Activity Series): లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని 'చర్యాశీలత శ్రేణి' అని పిలుస్తారు.

ప్లవన ప్రక్రియ (Froth flotation): ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తగా చూర్ణం చేసి, నీటితో ఉన్న తొట్టెలో ఉంచుతారు. గాలిని ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి నీటిలో నురగ వచ్చేలా చేస్తారు. ఏర్పడిన నురగ ఖనిజ కణాలను పైతలానికి తీసుకుపోతుంది. తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి. నురగ తేలికగా ఉండటం వల్ల తెట్టులా ఏర్పడుతుంది. అలా ఏర్పడినదాన్ని వేరుచేసి ఆరబెట్టి ధాతుకణాలను పొందుతారు.

థర్మైట్ చర్య(Thermite reaction): థర్మైట్ ప్రక్రియలో లోహపు ఆక్సైడ్‌లు, అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది. అధిక చర్యాశీలత గల సోడియం, కాల్షియం, అల్యూమినియం వంటి లోహాలను తక్కువ చర్యాశీలత గల లోహాలు, వాటి ధాతువుల నుంచి స్థానభ్రంశం చేయడానికి క్షయకారిణులుగా ఉపయోగిస్తారు. ఈ స్థానభ్రంశ చర్యలు సాధారణంగా అతి ఉష్ణమోచక చర్యలుగా ఉంటాయి.

లోహశుద్ధి(Refining of metal): అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధ లోహం పొందే ప్రక్రియను లోహ శోధనం లేదా లోహశుద్ధి అంటారు.

స్వేదనం(Distillation): జింక్, పాదరసం లాంటి అల్ప బాష్పశీల లోహాలు (Low boiling metals), అధిక బాష్పశీల లోహాలను (high boling metals) మలినాలుగా కలిగి ఉంటే అలాంటి లోహల శుద్ధిలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ద్రవ (molten) స్థితిలో ఉన్న నిష్కరించబడిన లోహలను స్వేదనం చేసి శుద్ధ లోహాన్ని పొందుతారు.

పోలింగ్(Poling): ద్రవ స్థితిలో లోహాన్ని పచ్చికర్రలతో (Logs of green wood) బాగా కలుపుతారు. ఇలా చేయడం ద్వారా మలినాలు వాయు రూపంలో వేరు పడతాయి. లేదా చిక్కని నురగ (Slag) లా ద్రవ రూప లోహ ఉపరితలంపై తేలుతాయి.

గలనం చేయడం(Liquation): ఈ పద్ధతిలో అల్ప ద్రవీభవన స్థానాలున్న (Low melting) లోహాలను వేడిచేసి వాలుగా ఉన్న తలంపై జారేటట్లు చేస్తారు. అప్పుడు లోహం కరిగి కిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరవుతాయి.

విద్యుత్ శోధనం(Electrolytic refining): ఈ పద్ధతిలో అపరిశుద్ధ లోహాన్ని (Impure metal) ఆనోడ్‌గా, శుద్ధ లోహాన్ని కాథోడ్‌గా ఉపయోగిస్తారు. విద్యుత్ విశ్లేషణ తొట్టెలో అదే లోహానికి చెందిన ద్రవస్థితి గల లోహ లవణాన్ని విద్యుద్విశ్లేష్యంగా తీసుకుంటారు. మనకు కావలసిన లోహం కాథోడ్ వద్ద శుద్ధస్థితిలో నిక్షిప్తమవుతుంది. మలినాలు ఆనోడ్‌మడ్ గా ఆనోడ్ వద్ద అడుగుకు చేరతాయి.

లోహక్షయం(Corrosion): ఒక లోహం, దాని చుట్టూ ఉన్న పరిసరాలతో చర్య జరపడం వల్ల తుప్పు పట్టడం, కాంతి విహీనం కావడం (వెండి వస్తువులు), రాగి వంటి వాటిపై పచ్చని పొర ఏర్పడటం వంటి మార్పులకు లోను కావడాన్ని లోహక్షయం అంటారు.

ప్రగలనం(Smelting): ప్రగలనం ఉష్ణరసాయన ప్రక్రియ (Pyrochemical process). ఇందులో ధాతువును ద్రవకారి (flux) తో కలిపి, ఇంధనంతో బాగా వేడిచేస్తారు.

భర్జనం(Roasting): భర్జనం ఉష్ణరసాయన ప్రక్రియ. ఇందులో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత (లోహ ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత) వద్ద వేడిచేస్తారు.

భస్మీకరణం(Calcination): భస్మీకరణం ఉష్ణరసాయన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటులో లేకుండా వేడిచేస్తారు. దీంతో అది విఘటనం చెందుతుంది.

కొలిమి(Furnace): లోహ నిష్కర్షణలో ఉష్ణరసాయన ప్రక్రియలను చేయడానికి వాడేదే కొలిమి.

బ్లాస్ట్ కొలిమి(Blast furnace): బ్లాస్ట్ కొలిమిలో అగ్గి గది (Fire box), హార్త్ (Hearth) రెండూ ఒకే పెద్ద ఛాంబర్‌లో కలసి ఉంటాయి. ఈ ఛాంబర్‌లో ధాతువు, ఇంధనం రెండింటినీ ఉంచడానికి వీలుగా ఉంటుంది.

రివర్బరేటరీ కొలిమి(Reverberatory furnace): ఇందులో అగ్గి గది, హార్త్‌లు విడిగా ఏర్పాటై ఉంటాయి. కాని ఇంధనాన్ని మండించినప్పుడు వెలువడిన బాష్పాలు (మంట) హార్త్‌లో ఉన్న ధాతువును వేడిచేస్తాయి.

ద్రవకారి(Flux): ధాతువులోని మలినాలను (గాంగ్) తొలగించడానికి ధాతువుకు బయట నుంచి కలిపిన పదార్థాన్ని ద్రవకారి అంటారు.

సారాంశ సంగ్రహం 

* ప్రకృతిలో లభించే ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహశాస్త్రం అంటారు.

* మానవ చరిత్రలో మానవుడు ఉపయోగించే పదార్థాలపరంగా కంచుయుగం (Bronze age), లోహయుగం (Iron age) వంటివి ఉన్నాయి.

* లోహాల ప్రధాన వనరు భూపటలం, (earth's crust). సముద్రజలంలో కూడా కొన్ని సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ లాంటి కరిగే లవణాలు ఉన్నాయి. బంగారం (Au), వెండి (Ag), రాగి (Cu) వంటి కొన్ని లోహాల చర్యాశీలత తక్కువ కాబట్టి అవి ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమవుతాయి.

* ప్రకృతిలో లభించే లోహమూలకాలు లేదా సమ్మేళనాలను లోహ ఖనిజాలు అంటారు.

* కొన్ని ప్రాంతాల్లో ఈ ఖనిజాలు చాలా ఎక్కువ శాతం లోహాన్ని కలిగి ఉంటాయి. వాటినుంచి లాభదాయకంగా లోహాన్ని రాబట్టవచ్చు. లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ధాతువులు (Ores) అంటారు.

* సాధారణంగా అల్యూమినియం నిష్కర్షణకు అత్యంత లాభదాయకమైన ఖనిజం బాక్సైట్. (Al2O3 .2H2O)

* జింక్ బ్లెండ్ (ZnS) ధాతువు నుంచి జింక్ లోహాన్ని సంగ్రహిస్తారు.

* ఎప్సమ్ లవణం (MgSO4.7H2O) నుంచి మెగ్నీషియం (Mg) సంగ్రహిస్తారు.

* సిల్వర్ లోహాన్ని హారన్‌సిల్వర్ (AgCl) ధాతువు నుంచి రాబడతారు.

* పైరోల్యూసైట్(MnO2) ధాతువు నుంచి లాభదాయకంగా మాంగనీస్(Mn) లోహాన్ని సంగ్రహిస్తారు.

* జిప్సం (CaSO4 .2H2O)లో కాల్షియం (Ca) లభిస్తుంది.

* క్రియాశీలత ఆధారంగా లోహాలను కింది విధంగా అవరోహణ క్రమంలో అమర్చుతారు.

    

* లోహాలను, వాటి ధాతువుల నుంచి సంగ్రహించి, వేరుచేయడంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి. అవి

     1) ముడి ఖనిజ సాంద్రీకరణ (Concentration of ores)

     2) ముడిలోహ నిష్కర్షణ (Extraction of crude metal)

     3) లోహాన్ని శుద్ధి చేయడం (Refining or purification)

* ముడిఖనిజ సాంద్రీకరణ: ఖనిజ మాలిన్యం అధిక పరిమాణంలో ఉన్న ధాతువు నుంచి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో, కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా ముందుగా వేరుచేస్తారు. ఈ విధంగా ధాతువు నుంచి పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని వేరుచేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణం అంటారు.

* ధాతువు, ఖనిజ మాలిన్యాల మధ్య భౌతిక ధర్మాల్లో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతులను ధాతువును సాంద్రీకరణం చేయడానికి అవలంబిస్తారు.

* చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి వంటివి సాంద్రీకరణం చేయడానికి అవలంబించే కొన్ని పద్ధతులు.

* లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని చర్యాశీలత శ్రేణి (activity series) అని పిలుస్తారు.

* ఒక లోహధాతువును క్షయకరణం చేసి లోహంగా మార్చడానికి ఉపయోగించే పద్ధతి చర్యాశీలత శ్రేణిలో ఆ లోహం స్థానంపై ఆధారపడి ఉంటుంది.

* K, Na, Ca, Mg, Al వంటి లోహాల లోహ ధాతువులను C, COలతో వేడిమి చర్య వంటి సాధారణ క్షయకరణ పద్ధతులను వాడి లోహ నిష్కర్షణ చేయలేం.

* ఈ చర్యకు కావలసిన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ, ఖర్చుతో కూడుకున్నది.

* ఖర్చును తగ్గించడానికి విద్యుద్విశ్లేషణ పద్ధతులు అవలంబిస్తారు.

* ఈ లోహాలను సంగ్రహకరణం చేయడానికి అనువైన పద్ధతి వాటి ద్రవరూప సమ్మేళనాలను విద్యుత్ విశ్లేషణ చేయడం. ఇలా విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ధాతువును ద్రవ (Molten) స్థితిలో ఉంచడానికి అధిక పరిమాణంలో విద్యుత్ అవసరం.

* ధాతువు ద్రవీభవన స్థానం తగ్గించడానికి సరైన మలినాలు దానికి కలుపుతారు.

* అధిక పరిమాణంగల గాలిలో సల్ఫైడ్ ధాతువులను బాగా వేడిచేయడం ద్వారా ఆక్సైడ్‌లుగా మారుస్తారు. ఈ పద్ధతిని భర్జనం (Roasting) అంటారు.

థర్మైట్ అనే ప్రక్రియలో ఆక్సైడ్‌లు, అల్యూమినియం మధ్య చర్య జరుగుతుంది. అధిక చర్యాశీలతగల సోడియం, కాల్షియం, అల్యూమినియంలతోపాటు తక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి ధాతువుల నుంచి స్థానభ్రంశం చేయడానికి క్షయకారిణులుగా ఉపయోగిస్తారు.

* ఈ స్థానభ్రంశ చర్యలు సాధారణంగా అతిఉష్ణమోచక చర్యలు (exothermic)గా ఉంటాయి. ఈ చర్యలో ఎంత ఎక్కువగా ఉష్ణం విడుదలవుతుందంటే, ఏర్పడిన లోహాలు ద్రవస్థితిలో ఉంటాయి.

* ఐరన్ (III) ఆక్సైడ్ (Fe2O3) అల్యూమినియంతో చర్య పొందినపుడు ఏర్పడిన ద్రవ (molten) ఇనుమును విరిగిన రైలు కమ్మీలు, పగిలిన యంత్రపరికరాలు అతికించడానికి ఉపయోగిస్తారు. దీన్నే థర్మిట్ చర్య అంటారు.

       Fe2O3 + 2 A 2Fe + Al2O3 + ఉష్ణశక్తి

       Cr2O3 + 2 A

 2Cr + Al2O3 + ఉష్ణశక్తి

నిష్కర్షణ: చర్యాశీలత శ్రేణిలో దిగువన ఉన్న లోహాలు (Ag, Hg మొదలైనవి) స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి. వీటి చర్యాశీలత ఇతర పరమాణువులతో చాలా తక్కువ. ఇలాంటి లోహాలను వేడిమిచర్యతో క్షయీకరించడం ద్వారా లేదా వాటి జల ద్రావణాల నుంచి స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు.

లోహశుద్ధి: ధాతువును క్షయకరణం చేయడం ద్వారా వచ్చిన లోహం సాధారణంగా ధాతువులో మార్పు చెందని మలినాలు, ఇతర అలోహ, లోహ అయాన్లు వంటి మలినాలు కలిగి ఉంటుంది.

* అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధలోహాలను పొందే ప్రక్రియను లోహశోధనం లేదా లోహశుద్ధి (Refine) అంటారు. లోహశుద్ధిని చేసే కొన్ని పద్ధతులు

     a) స్వేదనం (Distillation)                b) పోలింగ్ (poling)

     c) గలనం చేయడం (liquation)         d) విద్యుత్ విశ్లేషణం

స్వేదనం: జింక్, పాదరసం వంటి అల్పబాష్పశీల లోహాలు (Low boiling metals) అధిక బాష్పశీల లోహాలను (high boiling metals) మలినాలుగా కలిగి ఉంటే అలాంటి లోహాల శుద్ధిలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

* పోలింగ్‌లో ద్రవస్థితిలో లోహాన్ని పచ్చికర్రలతో బాగా కలుపుతారు. ఇలా చేయడం ద్వారా మలినాలు వాయురూపంలో వేరుపడటం లేదా చిక్కని నురగ (Slag)లా ద్రవరూప లోహ ఉపరితలంపై ఏర్పడతాయి. కాపర్‌ను (Blister Copper) ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు.

* గలనం చేయడం ద్వారా అల్ప ద్రవీభవన స్థానాలున్న (Low melting) లోహాలను వేడిచేసి వాలుగా ఉన్న తలంపై జారేలా చేస్తారు. అప్పుడు లోహం కరిగి కిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరవుతాయి.

* విద్యుత్ శోధనం (Electrolytic refining) పద్ధతిలో అపరిశుద్ధ లోహం (impure metal)ను ఆనోడ్‌గాను, శుద్ధలోహాన్ని కాథోడ్‌గాను ఉపయోగిస్తారు. విద్యుత్ విశ్లేషణ తొట్టెలో అదే లోహానికి చెందిన ద్రవస్థితిగల లోహ లవణాన్ని విద్యుద్విశ్లేష్యంగా తీసుకుంటారు. మనకు కావలసిన లోహం కాథోడ్ వద్ద శుద్ధస్థితిలో నిక్షిప్తమవుతుంది. మలినాలు ఆనోడ్ మడ్‌గా ఆనోడ్ వద్ద అడుగున చేరతాయి.

* ఇనుము తుప్పు పట్టడం (ఐరన్ ఆక్సైడ్), వెండి వస్తువులు కాంతివిహీనం కావడం (సిల్వర్ సల్ఫైడ్), రాగి, కంచు వస్తువులపై పచ్చని పొర ఏర్పడటం (కాపర్ కార్బొనేట్) వంటివి లోహక్షయానికి కొన్ని ఉదాహరణలు.

* లోహక్షయంలో సాధారణంగా ఆక్సిజన్ ఎలక్ట్రాన్‌ను కోల్పోవడం వల్ల ఆక్సైడ్‌లు ఏర్పడటం ద్వారా లోహం ఆక్సీకరణం చెందుతుంది.

* ఇనుప లోహం క్షయం (తుప్పు పట్టడం) నీరు, గాలి వల్ల జరుగుతుంది.

* లోహ క్షయం నివారించడం చాలా ముఖ్యం. ఇది ధన వ్యయాన్ని తగ్గించడమేగాక, వంతెనలు కూలిపోవడం వంటి ప్రమాదాలను నివారిస్తుంది.

* లోహ వస్తువుల ఉపరితలం వాతావరణంతో స్పర్శ లేకుండా నివారించడమనేది లోహక్షయం నివారణ సాధారణ పద్ధతుల్లో ఒకటి.

* లోహ ఉపరితలాన్ని రంగు లేదా కొన్ని రసాయనాలతో కప్పి క్షయాన్ని నివారించవచ్చు.

ఉదా: బైస్పినాల్

లోహ సంగ్రహణంలో వాడే కొన్ని ముఖ్యమైన పద్ధతులు:

   1) ప్రగలనం (Smelting)       2) భర్జనం (Roasting)        3) భస్మీకరణం (Calcination)

ప్రగలనం(Smelting): ఇదొక ఉష్ణ రసాయన ప్రక్రియ (Pyro chemical process). ఈ ప్రక్రియలో ఒక ధాతువును ద్రవకారి (flux)తో కలిపి, ఇంధనంతో బాగా వేడిచేస్తారు.

* ఉష్ణశక్తి చాలా తీవ్రంగా ఉండటంవల్ల ధాతువు లోహంగా క్షయీకరింపబడుతుంది. లోహాన్ని ద్రవస్థితిలో పొందవచ్చు.

* ప్రగలన ప్రక్రియ బ్లాస్ట్ కొలిమి (Blast furnace) అనే ప్రత్యేకంగా నిర్మించిన కొలిమిలో చేస్తారు.

* భర్జనం ఉష్ణ రసాయన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద (లోహ ద్రవీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత) వేడిచేస్తారు.

* ఈ ప్రక్రియలో పొందిన ఉత్పన్నాలు ఘనస్థితిలో ఉంటాయి. సాధారణంగా భర్జన ప్రక్రియకు రివర్బరేటరీ కొలిమిని వాడుతారు.

* భస్మీకరణం ఉష్ణ రసాయన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటులో లేకుండా వేడి చేస్తారు. దీంతో అది విఘటనం చెందుతుంది.

ఉదా: MgCO3 (ఘ)  MgO (ఘ) + CO2 (వా)

         CaCO3 (ఘ)  CaO (ఘ) + CO2 (వా)

ద్రవకారి (Flux): ధాతువులోని మలినాలను (గాంగ్) తొలగించడానికి ధాతువుకు బయట నుంచి కలిపిన పదార్థాన్ని ద్రవకారి అంటారు.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం