• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విసర్జన - వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 

ప్రశ్నలు  - జవాబులు 

1. విసర్జన అంటే ఏమిటి?
: జీవక్రియల్లో ఏర్పడే పదార్థాల్లో హానికర పదార్థాలను వేరుచేసి బయటకు పంపడాన్ని విసర్జన అంటారు.
 

2. మానవుడిలో వివిధ విసర్జక అవయవాలు ఏవి?
జ: మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్దపేగు.
 

3. ద్రవాభిసరణం అంటే ఏమిటి?
జ: అధిక గాఢత ఉన్న ప్రదేశం నుంచి అల్ప గాఢత ఉన్న ప్రదేశానికి అణువులు విచక్షణాస్తరం ద్వారా రవాణా చెంది, రెండువైపులా గాఢతను సమం చేయడాన్ని ద్రవాభిసరణం అంటారు.
 

4. సమతుల్యత అంటే ఏమిటి? మన శరీరం సమతుల్యతను ఏవిధంగా సాధిస్తుంది.
జ: శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు. ద్రవాభిసరణం ద్వారా ఈ ద్రవాల సమతుల్యత సాధ్యమవుతుంది. ద్రవాభిసరణ ప్రక్రియ వల్ల గాఢతలు సమానమవుతాయి. దీనివల్ల శరీర ద్రవాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది.
 

5. శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపకపోతే ఏమవుతుంది?
జ: జీవక్రియల ద్వారా ఏర్పడే వ్యర్థాలను శరీరం బయటకు పంపకపోతే వాటి పరిమాణం పెరిగిపోయి శరీర ద్రవాల తులాస్థితిలో మార్పు వస్తుంది. బయటకు వెళ్లని వ్యర్థాలు విష పదార్థాలుగా మారి జీవక్రియలను ఆటంక పరుస్తాయి. ఒక్కోసారి మరణానికి దారితీస్తాయి.
 

6. మూత్రపిండ నిర్మాణాన్ని వర్ణించండి. (బాహ్య నిర్మాణం)
జ:  మూత్రపిండాలు ఉదర కుహరంలో పృష్ఠశరీర కుడ్యానికి అతుక్కుని వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి.
      చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపురంగులో ఉంటాయి.
      మూత్రపిండం వెలుపలి వైపు కుంభాకారంగా, లోపలివైపు పుటాకారంగా ఉంటుంది.
      పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలోని పల్లాన్ని హైలస్ అంటారు.
      హైలస్ ద్వారా వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది, వృక్కసిర బయటకు వస్తుంది.

 

7. మాల్ఫీజియన్ దేహం నిర్మాణాన్ని వర్ణించండి.
జ:  మూత్రపిండంలోని వృక్కాల్లో ఉండే ముఖ్యభాగం మాల్ఫీజియన్ దేహం.
      ఈ దేహంలో రెండు భాగాలుంటాయి. అవి: బౌమన్ గుళిక, రక్తకేశనాళికాగుచ్ఛం (గ్లోమరూలస్).
      వృక్కాల్లో (నెఫ్రాన్) ఒకవైపు వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణమే బౌమన్ గుళిక.
      బౌమన్ గుళికలో ఉండే రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశనాళికాగుచ్ఛం అంటారు.
      బౌమన్ గుళిక గోడల్లోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు.
      రక్తకేశనాళికా గుచ్ఛంలో రక్తంలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.

 

8. మూత్రం ఏర్పడే విధానాన్ని వివరించండి.
జ:  బౌమన్ గుళికలో మూత్రం ఏర్పడుతుంది.
      మూత్రం నాలుగు దశల్లో తయారవుతుంది. అవి:
   
 1. గుచ్ఛగాలనం
     
2. వరణాత్మక పునఃశోషణం
     
3. నాళికాస్రావం
   
 4. గాఢత అధికంగా ఉండే మూత్రం ఏర్పడటం
గుచ్ఛగాలనం: బౌమన్ గుళికలోని రక్తకేశనాళికాగుచ్ఛంలో ఉండే రక్తకేశనాళికల కుడ్య సూక్ష్మరంధ్రాల ద్వారా వ్యర్థపదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు వడపోతకు గురవుతాయి. దీన్నే గుచ్ఛగాలనం అంటారు.
వరణాత్మక పునఃశోషణం: గుచ్ఛగాలనంలో ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. దీని నుంచి శరీరానికి ఉపయోగపడే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్ - సి, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్, 75% నీరు సమీప సంవళిత నాళంలో పునఃశోషితమవుతాయి.

నాళికాస్రావం: సమీప సంవళిత నాళంలో పునఃశోషణ తర్వాత మూత్రం హెన్లీశిఖ్యం ద్వారా దూరస్థ సంవళితనాళంలోకి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం, క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్లు బాహ్య కేశనాళికా వల నుంచి దూరస్థ సంవళిత నాళంలోకి స్రావితమవుతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటిన్ కూడా స్రావితమవుతాయి.
గాఢత అధికంగా ఉండే మూత్రం ఏర్పడటం: సమీపస్థ సంవళితనాళం, హెన్లీశిఖ్యం ఈ రెండింటిలో 85% నీరు పునఃశోషణ చెందుతుంది. అధివృక్క గ్రంథి స్రవించే వాసోప్రెస్సిన్ హార్మోన్ సమక్షంలో సంగ్రహనాళంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అధిక గాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్ఠ స్థాయికి చేరిన ఈ ద్రవాన్ని మూత్రం అంటారు.
 

9. మూత్ర సంఘటనం ఏ విధంగా ఉంటుంది?
జ: మూత్రం లేత పసుపురంగు ద్రవం. యూరోక్రోమ్ అనే వర్ణకం ఈ పసుపు రంగుకు కారణం. మూత్రంలో 96% నీరు, 2.5% యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు, ఆక్సలేట్లు లాంటి కర్బన రసాయన పదార్థాలు; 1.5 సోడియం, క్లోరైడ్లు, ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాల్షియం, మెగ్నీషియం లాంటి అకర్బన పదార్థాలు ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి క్రమంగా క్షారయుతంగా మారుతుంది.
 

10. మూత్రపిండం నిలువుకోత పటం గీసి భాగాలు గుర్తించండి.  
జ: 

 


11. వృక్కనాళిక, నెఫ్రాన్ పటం గీసి భాగాలు గుర్తించండి. 
జ:
 
                    
12. డయాలసిస్‌ను వివరించండి.
జ: మూత్రపిండాలు పనిచేయనివారిలో యంత్రం సహాయంతో రక్తాన్ని వడగడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ఈ పద్ధతిని డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కంధనాన్ని నిరోధించే కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోకి పంపుతారు. ఈ యంత్రంలో రక్తం గొట్టాల లాంటి నాళికల ద్వారా ప్రవహిస్తుంది.
 ఈ నాళికలు డయాలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్ననిపొర నాళికలోని డయాలైజింగ్ ద్రావణాన్ని, రక్తాన్ని వేరు చేస్తుంది. డయాలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి అవుతుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు.

 

13. మొక్కల్లో విసర్జన ఏవిధంగా జరుగుతుంది?
జ:  వ్యర్థపదార్థాలు విచ్ఛిన్నం కావడమనే విధానం జంతువులతో పోలిస్తే మొక్కల్లో చాలా నెమ్మదిగా జరుగుతుంది.
 మొక్కల్లో తయారైన వ్యర్థాలను విసర్జించడానికి ప్రత్యేకంగా అవయవాలు లేవు.
 మొక్కల్లో వ్యర్థ పదార్థాల తయారీ కూడా అతి నెమ్మదిగా జరుగుతుంది.
 మొక్క దేహంలో పోగవడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది.
 ఆకుపచ్చని మొక్కలు రాత్రిపూట, హరిత పదార్థం లేని భాగాల్లో మొక్కలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్ డై ఆక్సైడ్, నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి.
 కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి అయి ఆకుల్లోని పత్రరంధ్రాలు, కాండంలోని లెంటిసెల్స్ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతుంది.

 

14. మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవ రసాయన పదార్థాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జ: మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయన పదార్థాలు రెండు రకాలు.
అవి:
1. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
   
    2. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు: పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు.
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు: మొక్కల సాధారణ పెరుగుదలకు, అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు.
ఉదా: ఆల్కలాయిడ్లు, లేటెక్స్‌లు, రెసిన్లు, టానిన్లు.

 

15. 'నెఫ్రాన్ - మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం'. వివరించండి.
జ: మూత్రపిండం సుమారు 1.3 నుంచి 1.8 మిలియన్ల నెఫ్రాన్లతో నిర్మితమవుతుంది. రక్తం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ మొత్తం నెఫ్రాన్‌లో జరుగుతుంది. అందువల్ల మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా నెఫ్రాన్‌ను పేర్కొంటారు.
 

16.  మూత్ర విసర్జనలో వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు. ఎందువల్ల?
జ: జీవక్రియలకు సరిపడినంత నీరు శరీరంలో లేనప్పుడు, అథివృక్క గ్రంథి నుంచి విడుదలయ్యే వాసోప్రెస్సిన్ నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువల్ల గాఢత చెందిన మూత్రం ఏర్పడుతుంది. నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో, శీతాకాలంలో శరీరం నుంచి నీటి నష్టం తక్కువగా ఉండి శరీరానికి తగినంత నీరు లభ్యమైనప్పుడు వాసోప్రెస్సిన్ విడుదల అవదు.
 

17. వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది. కారణం తెలపండి.
జ: వేసవిలో పరిసరాల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. ఆ విధంగా ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల తక్కువ మూత్రం ఏర్పడుతుంది. దీని ద్వారానే వ్యర్థాలన్నీ విసర్జితమవడం వల్ల మూత్రం చిక్కగా ఉంటుంది.
 

బిట్ బ్యాంక్ 

1. జీవక్రియలు ఎన్ని రకాలు?
జ: జీవక్రియలు రెండు రకాలు 
      అవి:
1. నిర్మాణాత్మక క్రియలు, 2. విచ్ఛిన్న క్రియలు
 

2. 'సమతుల్యత'అంటే ఏమిటి?
జ: శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని 'సమతుల్యత'అంటారు.
 

3. మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఏవి?
జ: కార్బన్ డై ఆక్సైడ్, నీరు, అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్యరస వర్ణకాలు, లవణాలు.
 

4. హైలస్ అంటే ఏమిటి?
జ: మూత్రపిండం లోపలి తలంలో ఉండే పుటాకార నొక్కును హైలస్ అంటారు.
 

5. నెఫ్రాన్‌లో ముఖ్యభాగాలు ఏవి?
జ: 1. మాల్ఫీజియన్ దేహం  2. వృక్కనాళిక.
 

6. మాల్ఫీజియన్ దేహంలో ఉండే భాగాలు ఏవి?
జ: 1. బౌమన్ గుళిక   2. రక్తకేశనాళికా గుచ్ఛం (గ్లోమరూలస్).
 

7. వృక్కనాళికలో ఏయే భాగాలు ఉంటాయి?
జ: 1. సమీపస్థ సంవళిత నాళం
   
2. హెన్లీశిఖ్యం
 
 3. దూరస్థ సంవళిత నాళం
 

8. మూత్రం ఏర్పడే విధానంలో ఉండే దశలు ఏవి?
జ:  1. గుచ్ఛగాలనం     2. వరణాత్మక పునఃశోషణం
   
3. నాళికా స్రావం    4. గాఢత అధికంగా ఉండే మూత్రం ఏర్పడటం
 

9. పోడోసైట్లు అంటే ఏమిటి?
జ: బౌమన్ గుళిక గోడల్లోని కణాల్లో ఉండే ఉపకళాకణజాలాన్ని పోడోసైట్లు అంటారు.
 

10. ప్రాథమిక మూత్రం అంటే ఏమిటి?
జ: గుచ్ఛగాలనంలో ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు.
 

11. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఏవి?
జ: ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, జిగురులు.
 

12. మూత్రపిండం మార్పిడి మొదటిసారి చేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ: ఛార్లెస్ హఫ్‌నగల్
 

13. సంకోచరిక్తికలు ఉన్న జీవులు ఏవి?
జ: అమీబా, పేరామీషియం.
 

14. మూత్రపిండాలు పనిచేయక శరీరంలో నీరు, వ్యర్థాలు నిండిపోవడాన్ని ఏమంటారు?
జ: యూరేమియా.
 

15. జీవ ఇంధనం (బయో డీజిల్)గా ఉపయోగపడే మొక్క ఏది?
జ: జట్రోపా
 

16. మూత్రానికి రంగును ఇచ్చే పదార్థం ఏది?
జ: యూరోక్రోమ్
 

17. వానపాములో విసర్జక అవయవాలు ఏవి?
జ:  వృక్కాలు
 

18. బొద్దింకలో విసర్జక అవయవాలు ఏవి?
జ: మాల్ఫీజియన్ నాళికలు
 

19. మూత్రపిండం అడ్డుకోతలోని ముదురు గోధుమ రంగు భాగాన్ని ఏమంటారు?
జ: వల్కలం
 

20. మలేరియా నివారణకు ఉపయోగపడే ఆల్కలాయిడ్ పేరు రాయండి.
జ: క్వినైన్
 

21. రబ్బరును లేటెక్స్‌గా స్రవించే మొక్క ఏది?
జ: హివియా బ్రెజిలియన్సిస్
 

22. మూత్రపిండం ప్రమాణం-
జ: నెఫ్రాన్
 

23. మూత్రంలోని ప్రధాన భాగం-
జ: నీరు
 

24. మూత్రవిసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న హార్మోన్ ఏది?
జ: వాసోప్రెస్సిన్
 

25. మూత్రం pH విలువ ఎంత?
జ: 6
 

26. అమీబాలో విసర్జక అవయవం
జ: సంకోచ రిక్తిక
 

27. మొలస్కాలో విసర్జక అవయవం ఏది?
జ: మెటానెఫ్రీడియా

 

28. చూయింగమ్‌ను ఏ మొక్క నుంచి తయారు చేస్తారు?
జ: చికిల్
 

29. జల ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవ వర్గం ఏది?
జ: ఇఖైనోడర్మేటా
 

30. నెఫ్రాన్‌లో గుచ్ఛగాలనం ఏ భాగంలో జరుగుతుంది?
జ: గ్లోమరూలస్
 

31. డయాలసిస్‌లో ఇమిడి ఉన్న సూత్రం
జ: ద్రవాభిసరణ క్రమత
 

32. చిన్న పిల్లల్లో మూత్ర విసర్జన ఎలాంటి చర్య?
జ: అనియంత్రత చర్య
 

33. ఏ మొక్క పుప్పొడి ఎలర్జీని కలిగిస్తుంది?
జ: పార్థీనీయం
 

34. మొక్క వేర్లు స్రవిస్తాయని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ:  బ్రుగ్‌మన్స్

 


రచయిత: రాపర్తి ప్రసాద్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం