• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నియంత్రణ - సమన్వయ వ్యవస్థ

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు

1. మొక్కలు ఉద్దీపనలకు ఏవిధంగా ప్రతిస్పందిస్తాయో ఉదాహరణలివ్వండి.  (లేదా)  మొక్కల్లోని నాస్టిక్ చలనాలను వివరించండి.
జ:  మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి చలనాలను 'అనువర్తన చలనాలు' అంటారు.
 కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలో కాంతి సోకే దిశలో పెరుగుదల ఉంటుంది. ఈ విధంగా మొక్కలు కాంతికి ప్రతిస్పందించే ప్రక్రియను 'కాంతి అనువర్తనం' అంటారు.
 మొక్కలు గురుత్వాకర్షణకు ప్రతిస్పందిస్తూ పెరుగుదలను చూపుతాయి. ఈ చలనాన్ని 'గురుత్వానువర్తనం' అంటారు.
 రాళ్లను, గోడలను అంటిపెట్టుకుని పెరిగే మొక్కల్లోని వేర్లు వాటి (రాయి, గోడల) నుంచి దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఇలాంటి ప్రతిస్పందనను 'నీటి అనువర్తనం' అంటారు.
ఎగబాకే మొక్కల్లో నులితీగలు ఏదైనా ఆధారంవైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. స్పర్శ లేదా తాకడం వల్ల కలిగే ప్రతిస్పందనలను 'స్పర్శానువర్తనం' అంటారు.
 మొక్కలు రసాయనిక పదార్థాలకు కూడా ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు పక్వం చెందిన కీలాగ్రం తియ్యని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగరేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఈ ఉద్దీపనలకు పరాగరేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగరేణువు నుంచి పరాగనాళం బయలుదేరి ఫలదీకరణం కోసం అండాన్ని చేరుతుంది. ఇలాంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను 'రసాయనిక అనువర్తనం' అంటారు.

 

2. నిర్మాణరీత్యా నాడీకణం, సాధారణ కణం కంటే ఏ విధంగా భిన్నమైంది? వివరించండి.

జ:


3. మానవుడు తెలివైన జంతువు. ఈ విధమైన నిర్ణయానికి రావడానికి కారణాలను చర్చించండి.
జ:  జంతువులన్నింటిలో మానవుడు చాలా తెలివైన జంతువు. దీనికి కారణం మానవుడు అత్యద్భుతమైన మెదడు నిర్మాణం కలిగి ఉండటం.
 ఒక సమస్యను విశ్లేషించి దానికి పరిష్కారాన్ని కనుక్కునే గొప్పశక్తి మానవ మెదడులో కనిపిస్తుంది.
 కవిత్వం, సంగీతం, చిత్ర లేఖనం, శిల్పకళను, అందమైన వస్తువులను, ప్రకృతిని చూసి ఆనందించే సౌందర్యోపాసన శక్తి మానవ మెదడుకు ఉంది.
 భాషతో భావాలను ప్రకటించే శక్తి, శబ్దాల ద్వారా ఇతరులకు సమాచారాన్ని ప్రసారంచేసే శక్తి మానవ మెదడు సొంతం.
 మానవుడు తన మెదడు ద్వారా అక్షరాలను కనిపెట్టి, తాను సేకరించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా తర్వాతి తరాలకు అందించగలిగాడు.
 అద్భుతమైన జ్ఞాపకశక్తి మానవ మెదడుకు మేధస్సును అందజేసింది. దీనివల్ల మానవుడి ప్రవర్తనలో నిరంతర అభివృద్ధి జరిగి, అనేక అద్భుత విషయాలను కనుక్కోగలిగాడు.

4. మొక్కల అగ్రభాగంలో ఉత్పత్తయ్యే హార్మోన్ల గురించి అధ్యయనం చేయడానికి ఏ పద్ధతిని వాడతారు?  (లేదా)  ఎఫ్.డబ్ల్యూ. వెంట్ ప్రయోగాన్ని వివరించండి.
జ: 

మొక్క అగ్రభాగంలో ఉత్పత్తయ్యే హార్మోన్లను అధ్యయనం చేయడానికి కింది విధానాన్ని అనుసరిస్తారు.
ప్రయోగం:
 ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకుర కవచాన్ని కత్తిరించాలి.
 కాండం కొనపై అగార్ అగార్ ముక్కను పెట్టి గంటసేపు అలాగే ఉంచాలి.
తర్వాత అగార్ అగార్‌ను చిన్న చిన్న ముక్కలుగా లేదా పెట్టెలుగా కత్తిరించాలి.
 ప్రతి అగార్ అగార్ పెట్టెను, తొడుగు కత్తిరించిన మొక్క కాండంపై ఒకవైపు ఉండేలా పెట్టాలి. తర్వాత వాటిని చీకటి గదిలో ఉంచాలి.
 గంట తర్వాత ప్రాంకురంలో అగార్ పెట్టిన భాగానికి రెండో వైపున నిర్దిష్టమైన వంపు కనిపిస్తుంది.

పరిశీలన: ప్రాంకుర కవచంతో సంబంధంలేని అగార్ కాండం కొనభాగం ఎలాంటి వంపును ప్రదర్శించలేదు. అగార్ ముక్కను ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనిపిస్తుంది.
నిర్ధారణ: ప్రాంకుర కవచం కొనభాగంలో మార్పు రసాయనిక ఉద్దీపన వల్ల జరిగింది. ఈ రసాయనిక ఉద్దీపనలకు 'ఆక్సిన్లు' అని పేరు పెట్టారు. వీటిని ఎఫ్.డబ్ల్యూ. వెంట్ కనుక్కున్నాడు.
 

5. తంత్రికాక్షం - డెండ్రైట్, డెండ్రైట్‌ల మధ్య అనుసంధానం చేసే పటాన్ని గీయండి. ఇవి ఈ విధంగా ఎందుకు అనుసంధానమై ఉంటాయో తెలపండి.
జ:  * ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరో కణంలోని డెండ్రైట్ లేదా ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని నాడీకణసంధి లేదా సినాప్స్ అంటారు. 
  * నాడీ కణసంధి ఒక నాడీకణం నుంచి మరో నాడీకణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. 
  * ఈ నాడీ కణసంధి వద్ద రెండు నాడీకణాల మధ్య ఏ విధమైన జీవపదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ, రసాయనాలు లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా లేదా రెండింటి ద్వారా సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి ప్రసారమవుతుంది. 
 * నాడీ కణసంధులు మెదడు, వెన్నుపాముపై, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.
 * మెదడు, వెన్నపాము నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తంత్రికాక్షాలు తీసుకెళతాయి.

 

6. మెదడు ఏ విధంగా రక్షణ పొందుతుందో వివరించండి.
జ: శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. దీన్ని రక్షిస్తూ మూడు భాగాలు ఉంటాయి.
అవి:      1) కపాలం               2) మెనింజెస్ పొర                3) మస్తిష్క మేరుద్రవం

కపాలం: కపాలం అనే గట్టి ఎముకల పెట్టెలో మెదడు ఉంటుంది.
మెనింజెస్ పొర: మెదడును కప్పి ఉంచుతూ మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఇవి వెన్నపామును కూడా కప్పి ఉంచుతాయి.
మస్తిష్క మేరుద్రవం: మెనింజెస్ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలం, మెనింజెస్‌లతో కలిసి మెదడును అఘాతాల నుంచి కాపాడుతుంది. మస్తిష్క మేరుద్రవం మెదడు, వెన్నుపాముకు రక్షణ  ఇవ్వడమే కాకుండా వాటిలోని కణాలకు పోషకాలను అందిస్తుంది.

 

7. రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో మన శరీరంలోని అవయవాల మధ్య ఏవిధంగా సమన్వయం జరుగుతుంది. ఈ సందర్భాన్ని వివరించే రేఖాచిత్రాన్ని గీయండి.
జ: మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపిస్తే ఉలిక్కిపడి పక్కకు జరుగుతాం.

8. జట్టుగా పనిచేయడంవల్ల మన శరీరం వివిధ విధులను నిర్వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఉదాహరణలతో వివరించండి.
జ:  జట్టుగా పనిచేయడం వల్ల మన శరీరం వివిధ విధులను నిర్వర్తిస్తుంది.
ఉదా: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డును దాటాల్సి వస్తే, మన కళ్లు, కాళ్లు, చెవులు ఒకదానికొకటి సమన్వయ పరచుకోవాలి. లేదంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.
 కాళ్లు, చేతులు, నడుము లాంటి భాగాలు మెదడు ఆదేశాల మేరకు సమన్వయంగా పనిచేయడం వల్ల మనం రకరకాల ఆటలు ఆడగలుగుతున్నాం.
 పుస్తకంలోని వాక్యాలను కళ్లు గుర్తించి మెదడుకు సమాచారాన్ని  పంపుతాయి. మెదడు వాటిని నాలుకకు పంపడం వల్ల నోటితో మనం చదవగలుగుతున్నాం. ఈ ప్రక్రియలో కళ్లు, మెదడు, నోరు కలిసి పనిచేస్తున్నాయి.

 

9. మన శరీరం అంతస్రావ్య వ్యవస్థ, నాడీ వ్యవస్థలతో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణలివ్వండి.
జ: అధివృక్క గ్రంథి స్రవించే అడ్రినలిన్ హార్మోన్ మన శరీరం ఆపదలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో పనిచేయడానికి కావాల్సిన అదనపు శక్తిని అందజేస్తుంది.
ఉదా: * మనం బజారులో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కుక్క మనల్ని కరవడానికి పరుగెత్తుకొస్తే, వెంటనే మన నాడీవ్యవస్థ అధివృక్క గ్రంథిని ఉత్తేజపరచి, అధిక పరిమాణంలో అడ్రినలిన్ హార్మోన్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది.
     * అడ్రినలిన్ వెంటనే మన శరీరానికి కావాల్సిన అదనపు శక్తి నిమిత్తం శ్వాసక్రియా రేటును, హృదయ స్పందనను, కండరాలకు అధిక రక్త ప్రసరణను కలగజేస్తుంది.
     * ఈ చర్యల వల్ల శరీరానికి హఠాత్తుగా ఎక్కువ శక్తి లభించి కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి చాలా వేగంగా పరుగెత్తుతాం. సురక్షిత ప్రాంతానికి చేరిన తర్వాత మనకు ఇక అదనపు శక్తితో పని ఉండదు. అడ్రినలిన్ స్రావాన్ని ఆపమని మన నాడీవ్యవస్థ అధివృక్కగ్రంథికి ఆజ్ఞలను జారీ          చేస్తుంది. వెంటనే అడ్రినలిన్ హార్మోన్ విడుదల ఆగిపోయి కొంతసేపటికి శరీరం మామూలు స్థితికి వస్తుంది.
   * దీని ద్వారా అంతస్రావ్య వ్యవస్థ, నాడీ వ్యవస్థ సమన్వయంగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు.

 

10. 'హార్మోన్లు నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన పనిని నిర్వహించడానికి విడుదలవుతాయి'. దీన్ని వివరించండి.
జ: అడ్రినలిన్ హార్మోన్ ఉద్రేకాలను కలగజేస్తుంది. ఇది పోరాట, పలాయన సమయాల్లో విడుదలవుతుంది. రక్తంలో దీని స్థాయి పెరిగినప్పుడు హృదయ స్పందన రేటు, చక్కెరస్థాయి పెరుగుతాయి. అందువల్ల మనిషికి కోపం, ఉద్రేకం, పోరాట లక్షణాలు పెరుగుతాయి. దీని స్థాయి తగ్గినప్పుడు జీవక్రియా రేటు తగ్గి మనిషి సాధారణ స్థితికి వస్తాడు.

ఉదా:  కుక్క తరుముతున్నప్పుడు ఆ ప్రదేశం నుంచి పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం.
          పామును చూసినప్పుడు అక్కడి నుంచి వేగంగా పారిపోవడం లేదా పాము నుంచి రక్షణ కోసం దూరంగా వెళ్లడం లేదా పామును చూసి భయపడటం తద్వారా హృదయస్పందన రేటు పెరగడం, చెమటలు పట్టడం లాంటివి జరగుతుంటాయి.

2 మార్కుల ప్రశ్నలు

1. మొక్కల్లో కాంతి అనువర్తనం ఏవిధంగా జరుగుతుంది?
జ: ¤ మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని 'కాంతి అనువర్తనం' అంటారు.
¤ మొక్కల్లో కాండం కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది.
¤ కాంతిసోకే కాండభాగంపైకి ఎక్కువ ఆక్సిన్లు చేరడం వల్ల ఆ భాగంలో కణాలు వేగంగా పెరుగుతాయి. దాని వ్యతిరేక భాగంలో కణాలు నెమ్మదిగా పెరగడం వల్ల కాండం వంగుతుంది.

 

2. సినాప్స్ అంటే ఏమిటి? సమాచార ప్రసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జ: ¤ * ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరొక నాడీకణంలోని డెండ్రైట్లతో లేదా, ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని 'సినాప్స్' లేదా 'నాడీకణ సంధి' అంటారు.
* నాడీకణ సంధి ఒక నాడీకణం నుంచి మరొక నాడీకణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం.  
¤* ఈ నాడీకణ సంధి వద్ద రెండు నాడీకణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకున్నా రసాయనాల ద్వారా లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా లేదా రెండింటి ద్వారా సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి ప్రసారమవుతుంది.
¤* నాడీకణ సంధులు మెదడు, వెన్నుపాము, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.
¤ * తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాము నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి.

 

3. మొక్కల వేర్లు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయని చూపే ఒక ప్రయోగాన్ని వివరించండి.
జ: ¤ * గాజు జాడీని తీసుకొని మట్టితో నింపాలి.   
¤ * ఆ జాడీ గోడ అంచు వెంబడి ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటాలి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం, కాండం, వేర్ల పెరుగుదలను చూడగలం.
¤ * 4 నుంచి 5 రోజుల్లో విత్తనం మొలకెత్తడం గమనిస్తాం. 


*¤ జాడీని సూర్యరశ్మిలో ఉంచి పరిశీలిస్తే కాండం కాంతి దిశలో, వేర్లు దానికి వ్యతిరేక దిశలో పెరగడం గమనిస్తాం.

* మొక్కకు 4 నుంచి 5 ఆకులు వచ్చాక దీన్ని అడ్డంగా, క్షితిజ సమాంతరంగా ఉంచి వారం రోజుల పాటు కాండం, వేర్ల పెరుగుదలను పరిశీలిస్తే కాండం కాంతి దిశలో, వేరు కాంతికి వ్యతిరేక దిశలో పెరగడాన్ని గమనించవచ్చు.
 

4. శరీరంలోని హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే మార్పులకు ఉదాహరణలివ్వండి.
జ: ¤ * శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే మార్పులను ముఖ్యంగా అడ్రినలిన్ హార్మోన్ స్రవించినప్పుడు స్పష్టంగా గమనించవచ్చు.
¤ * సాధారణంగా కోపం, ఉద్వేగం, భయం లాంటివి కలిగినప్పుడు అడ్రినలిన్ గ్రంథి అడ్రినలిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంది.
¤ * భయం వల్ల హృదయ స్పందన పెరుగుతుంది. శ్వాసక్రియా రేటు, రక్తపీడనం కూడా పెరుగుతాయి. మన శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.
¤ * కొన్ని శారీరక మార్పులను మనం గమనించలేం. అలాంటి మార్పులు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. కంటిపాప విస్తరిస్తుంది. చర్మం చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. మూత్ర, మలవిసర్జన కూడా జరగవచ్చు.
¤ * సురక్షిత ప్రాంతానికి చేరిన తర్వాతనే మనం సాధారణ స్థితికి వస్తాం. అప్పుడు అడ్రినలిన్ స్థాయి తగ్గిపోతుంది.

5. నాడీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి అనువుగా ఉందా? విశ్లేషించండి.
జ: ¤ * నాడీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి ఎంతో అనువుగా ఉంటుంది. శరీర కణజాలంలో నాడీకణం పొడవైన కణం కావడం వల్ల నాడీ ప్రచోదనాలను ఎక్కువ దూరం రవాణా చేయవచ్చు.
¤ * కణదేహంపై శాఖల్లాంటి నిర్మాణాలైన డెండ్రైట్లు మరోకణంతో సంబంధం కలిగి వల లాంటి నిర్మాణాలుగా మారతాయి. దీనివల్ల ప్రచోదనాలు అన్ని భాగాలకు రవాణా అవుతాయి.
¤ * విద్యుత్ ప్రచోదనాలు కణదేహం, ఆక్సాన్‌ల ద్వారా ప్రయాణిస్తాయి.
¤ * ఆక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు రసాయనాలను విడుదల చేస్తాయి.
¤ * రసాయనాలు నాడీకణ సంధిని దాటి తర్వాత నాడీకణాన్ని చేరతాయి. ఈ విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక నాడీకణాలను దాటతాయి.
¤ * చివరగా నాడీకణం నుంచి విడుదలైన ప్రచోదనం కండరాలను చేరడం ద్వారా ప్రతిస్పందన మొదలవుతుంది.

 

6. 'చేతిలో ఉండే నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కంటే చిన్నది'. వివరించండి.
జ: ¤ * నాడీకణంలోని పొడవైన నిర్మాణాన్ని ఆక్సాన్ అంటారు. కొన్ని ఆక్సాన్లు కలిసి నాడులను ఏర్పరుస్తాయి.
¤ * ఇవి చాలా పొడవుగా విస్తరించి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి.
¤ * కాలివేళ్ల చివరిభాగం నుంచి ఉద్దీపనలను, మెదడుకు వార్తలను చేరవేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి సహజంగా ఎంతో పొడవైన నాడీగా అనేక ఆక్సాన్లతో కలసి ఏర్పడతాయి.
 * వీటితో పోల్చినప్పుడు చేతుల నుంచి మెదడుకు ప్రయాణించే నాడులు చిన్నవిగా ఉంటాయి.

 

7. అనేక ప్రచోదనాలకు సెకనులో పదో వంతులోనే ప్రతీకార చర్యలను చూపించే నియంత్రిత వ్యవస్థ గురించి తెలపండి.
జ: * మన శరీరం ప్రచోదనాలకు సెకనులో  పదోవంతులోనే  ప్రతిచర్యలను  చూపగలగడం  ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.
* గ్రాహకాలు, ఉద్దీపనలకు ప్రచోదనాలను ఉత్పత్తి చేయడం, అవి మెదడును చేరి విశ్లేషించడం, మెదడు ఆజ్ఞలు తిరిగి నిర్వాహక అంగాలు నిర్వహించడం లాంటి పనులన్నీ సెకన్లలో జరగడం అద్భుతంగా అనిపిస్తుంది.
* నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
* ఉదాహరణకు ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినపుడు అనేక ప్రతీకార చర్యా చాపాలు ఒకేసారి పనిచేసి, కండరాలు వేగంగా కాలిని వెనక్కు తీసుకునేటట్లు చేస్తాయి.
* ఈ నిర్ణయం సెకనులో పదోవంతు కాలంలోనే జరిగిపోతుంది. అంత వేగంగా మన మెదడు ప్రతిస్పందించకుంటే శరీరం అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
* మన మెదడు చురుకుదనం, పనితీరు, విశ్లేషణావేగం అద్భుతంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ సమర్థమైన పనితీరుకు నిదర్శనం.

 

8. కిందివాటిలో నియంత్రిత, ప్రతీకార చర్య, అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి.
ఎ) కళ్లు ఆర్పడం
బి) టేబుల్ తుడవడం
సి) కీ బోర్డు వాయించడం
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరడం
ఇ) విపరీతమైన శబ్దం విన్నప్పుడు చెవులు మూసుకోవడం

జ: ఎ) కళ్లు ఆర్పడం: ఇది మన ప్రమేయం లేకుండా నిరంతరంగా జరిగే స్వతంత్ర ప్రక్రియ. ఇది ఒక ప్రతీకార చర్య.
బి) టేబుల్ తుడవడం: మన ఆదీనంలో జరిగే ఒక నియంత్రిత చర్య.
సి) కీ బోర్డు వాయించడం: మెదడు ఆదేశాలను అనుసరించి జరిగే నియంత్రిత చర్య లేదా అభ్యసిత ప్రతీకార చర్య.
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరడం: ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్య.
ఇ) విపరీతమైన శబ్దం విన్నప్పుడు చెవులు మూసుకోవడం: ఇది ఒక ప్రతీకార చర్య.

 

9. ఒక కుండీలోని మొక్కను మీ గది కిటికీ పక్కన ఉంచితే ఏం జరుగుతుంది?
జ: * కుండీలోని మొక్కను గదిలో కిటికీ పక్క ఉంచితే మొక్క కాండం కాంతి ప్రసరించే దిశవైపు వంగుతుంది లేదా పెరుగుతుంది.
* ఇలా మొక్క కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని 'కాంతి అనువర్తనం' అంటారు.
* కాండం అగ్రభాగంలో ఆక్సిన్లు ఏర్పడటం వల్ల మొక్కలు కాంతి అనువర్తిత చలనాన్ని చూపిస్తాయి కాబట్టి కుండీలో మొక్క కిటికీ నుంచి బయటకు కాంతివైపు పెరుగుతుంది.

 

10. మన శరీరంలోని చర్యలన్నింటినీ మెదడు నియంత్రిస్తే ఏం జరుగుతుంది?
జ: * మెదడు నియంత్రించే ప్రతిచర్యల్లో ప్రచోదనం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల హఠాత్తుగా జరిగే అపాయాల నుంచి మెదడు శరీరానికి రక్షణ కల్పించలేదు.
* అకస్మాత్తుగా జరిగే సంఘటనలను మెదడు గుర్తించి ప్రతిస్పందించేందుకు సమయం పడుతుంది. దాంతో ప్రమాదాలు జరుగుతాయి.
* మన శరీరంలోని అసంకల్పిత ప్రతీకార చర్యావ్యవస్థ మెదడుతో ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. ఇది హఠాత్తుగా జరిగే ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అన్ని క్రియలను మెదడు నియంత్రించలేదు.

 

11. డాక్టర్‌ను కలిసినప్పుడు క్లోమగ్రంథి గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జ: * క్లోమగ్రంథి మన శరీరంలో ఎక్కడ ఉంది?
     * క్లోమగ్రంథిని మిశ్రమగ్రంథి అని ఎందుకు అంటారు?
     * మన శరీరంలో క్లోమం చేసే విధులను వివరించండి.
     * క్లోమంలో ఉండే వివిధ భాగాలు ఏవి?
     * క్లోమగ్రంథి నాళ, వినాళ గ్రంథిగా ఎలా పనిచేస్తుంది?
     * క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏవి?
     *  జీర్ణ వ్యవస్థలో క్లోమగ్రంథి ఎంత వరకు ఉపయోగపడుతుంది?
     *  క్లోమం నిరంతరం ఎలా పనిచేస్తుంది?
     *  క్లోమగ్రంథి పాడైతే మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు వస్తుంది?

 

12. కుండీలో ఉన్న మొక్క మూలంలో మట్టి పడకుండా ఏర్పాటుచేసి దాన్ని తలకిందులుగా వేలాడదీయండి. మీ పరిశీలనల ద్వారా ఫోటోట్రాపిజమ్‌ను వివరించండి

జ: ప్రయోగం:

* కుండీలో పెరుగుతున్న మొక్కను దాని మూలంలో మట్టి పడకుండా గట్టిగా తాళ్ల సహాయంతో కట్టాలి.
* దీన్ని ఆరుబయట తలకిందులుగా వేలాడదీయాలి.
* రెండు వారాల తర్వాత మొక్కలోని మార్పులను గమనించాలి.

పరిశీలనలు:
* వేలాడుతున్న మొక్క కాండం నేరుగా కిందికి పెరగకుండా వంపు తిరిగి సూర్యకాంతి వైపునకు పెరగడం గమనించవచ్చు.
* వేర్లు సూర్యకాంతికి వ్యతిరేక దిశలో, గురుత్వాకర్షణ దిశలో వంపు తిరిగి ఉండటం చూడవచ్చు.
           దీన్నిబట్టి మొక్కల్లో కాండం కాంతికి అనుకూలంగా ప్రతిస్పందిస్తుందని, వేర్లు గురుత్వానువర్తనం కలిగి ఉంటాయని నిర్ధారించవచ్చు.

 

13. మీ శరీరంలోని వివిధ భాగాలను పక్షి ఈకతో తాకండి. శరీరంలో అత్యంత సున్నితమైన భాగాన్ని గుర్తించండి. నిద్రించే సమయంలో కూడా ఇదే విధంగా ఉంటుందా?
జ: కోడి ఈకతో శరీరంలోని వివిధ భాగాలను తాకినప్పుడు
    * శరీర ఇతర భాగాల కంటే ముఖం ఎక్కువ సున్నితమైంది.
    * ముక్కు కొన, చెవి లోపలి భాగాలు, పెదవులు అధిక స్పర్శజ్ఞానం కలిగి ఉన్నాయి.
    * నిద్రించేటప్పుడు కూడా ఫలితాలు ఇదేవిధంగా ఉన్నాయి.

 

14. వెన్నుపాము నియంత్రించే చర్యల గురించి మీ పాఠశాల గ్రంథాలయం నుంచి వివరాలు సేకరించండి?
జ: * వెన్నుపాము శరీర భాగాల నుంచి వచ్చే సమాచారాన్ని మెదడుకు పంపుతుంది.
* మెదడు ఇచ్చే ఆదేశాలు వెన్నుపాము ద్వారానే నాడులకు చేరతాయి.
* అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
* నాడీ ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థ నుంచి క్రియాస్థలానికి, అక్కడి నుంచి కేంద్ర నాడీవ్యవస్థకు వార్తలను అందిస్తుంది.
* అసంకల్పిత ప్రతీకార చర్యలు వెన్నుపాము ఆధీనంలో ఉండటంవల్ల ప్రతిచర్యామార్గం ప్రయాణం తగ్గి, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

ఉదా: * వేడిగా ఉన్న వస్తువులను తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం.
          * కళ్ల మీద ఎక్కువ కాంతి పడినప్పుడు కళ్లు మూసుకోవడం.
          * ముక్కులోకి ధూళి ప్రవేశిస్తే తుమ్మడం.

 

15. మీ పాఠశాల గ్రంథాలయం నుంచి లేదా అంతర్జాలం నుంచి కపాలనాడులు, వెన్ననాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి.
జ: కపాలనాడులు: మానవ శరీరంలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. ఇవి మెదడులోని వివిధ భాగాల నుంచి ఉద్భవిస్తాయి. వీటిలో కొన్ని జ్ఞాననాడులుగా, చాలకనాడులుగా, మిశ్రమనాడులుగా పనిచేస్తాయి.

 నాడులు నేత్రపటలం, చెవి, ముక్కు, ముఖం, మెడ, గ్రసని, నాలుక, కంటి కండరాలు, కండరాలు లాంటి భాగాల్లో వ్యాపించి ఉంటాయి. 12 జతల కపాలనాడుల్లో వేగస్ నాడి (పదోజత కపాలనాడి) ముఖ్యమైంది.
వెన్నునాడులు: వెన్నుపాము నుంచి ఏర్పడే నాడులను వెన్నునాడులు అంటారు. మానవ శరీరంలో 31 జతల వెన్నునాడులు ఉంటాయి. వెన్నునాడులన్నీ మిశ్రమనాడులు. వెన్నునాడిలో జ్ఞాననాడీ తంతువు వెన్నుపాము పృష్ఠశృంగం నుంచి, చాలకనాడీ తంతువు వెన్నుపాము ఉదర శృంగం నుంచి ఉద్భవిస్తాయి. ఇవి కండరాల కదలికకు అవసరమైన సమాచారాన్ని ప్రసారం చేస్తాయి.

 

16. కింది వాక్యాలను చదవండి. వినాళ గ్రంథుల పనులతో పోల్చండి.
ఎ) జీవులు 'ఫెరమోన్లు' అనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి.
బి) వినాళ గ్రంథుల నుంచి స్రావాలు వెలువడటానికి ఫెరమోన్లు సంకేతాలుగా పనిచేస్తాయి.
సి) కొన్ని జాతుల్లో ఇవి రసాయన వార్తాహరులు.
డి) తేనెటీగలు ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమోన్లను ఉపయోగిస్తారు.

జ: ఎ) జీవులు ఫెరమోన్లు అనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి:
           వివిధ రకాల కీటకాలు రకరకాల ఫెరమోన్లను విడుదల చేస్తాయి. ఉన్నతస్థాయి జీవుల్లో కొన్నిరకాల వినాళగ్రంథులు సంపర్కం కోసం హార్మోన్లను స్రవించినట్లే, ఆడ కీటకాలు లైంగిక సంపర్కానికి సిద్ధపడినప్పుడు గాలిలోకి ఫెరమోన్లను విడుదల చేస్తాయి.
బి) వినాళగ్రంథుల నుంచి స్రావాలు వెలువడటానికి ఫెరమోన్లు సంకేతాలుగా పనిచేస్తాయి:
         జంతువుల్లో ముష్కాలు, బీజకోశాలు లైంగిక హార్మోన్లను స్రవించినట్లే, కీటకాల్లో ఫెరమోన్లు వాటి సంపర్కానికి అవసరమైన హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడతాయి.
సి) కొన్ని జాతుల్లో ఫెరమోన్లు రసాయన వార్తాహరులు:
           ఆడ కీటకాలు విడుదల చేసే ఫెరమోన్లు ఎంతోదూరంలో ఉన్న మగ కీటకాలకు సమాచారాన్ని అందించే వార్తాహరులుగా పనిచేస్తాయి. ఉన్నత జీవుల శరీరంలో స్రవించే హార్మోన్లు కూడా అనేక సందర్భాల్లో వార్తాహరులుగా సహాయపడతాయి.
డి) తేనెటీగల ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమోన్లను ఉపయోగిస్తారు:
          జంతువుల్లో పీయూషగ్రంథి స్రవించే హార్మోన్ల సాయంతో పెరుగుదల సాధ్యమై పరిపక్వత వచ్చి లైంగిక సంపర్కానికి ఆకర్షించబడతాయి. అలాగే ఫెరమోన్ల సాయంతో తేనెటీగలను ఆకర్షించేలా చేస్తారు.

 

17.  నాడీకణం నమూనాను సరైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయండి.
జ: కావాల్సిన సామగ్రి:  చిన్న గాజు, మట్టిగాజు ముక్కలు, నూలు దారం ముక్కలు, పొడవైన దారం, నీలిరంగు చెంకీలు, గుండ్రని గింజలు, చార్టు, జిగురు, స్ట్రా.
చేసేవిధానం:  ¤ * మొదట చార్టుపై నాడీకణం బొమ్మ గీయాలి.
       ¤ * కణదేహంపై మట్టిగాజు ముక్కలను అతికించాలి.
       ¤ * కణదేహంపై నుంచి కొన్ని గాజు ముక్కలను డెండ్రైట్లుగా అతికించాలి.
       ¤ * పొడవైన స్ట్రా లేదా నూలుదారాన్ని ఆక్సాన్‌గా అతికించాలి.
       ¤ * నీలిరంగు చెంకీలు లేదా రంగులను జీవపదార్థంగా కణదేహంలో నింపాలి.
       ¤ * నిస్సల్ కణికలుగా గుండ్రటి గింజలను అతికించాలి.
       ¤* నాడీ అంత్యాలుగా దారపు ముక్కల్ని అతికించాలి.
       ¤* బాగా ఆరిన తర్వాత ప్రదర్శనలో పెట్టాలి.

 

18. నులితీగలు ఆధారానికి చుట్టుకుని తీగ పైకి పాకుతాయి. ఈ దృగ్విషయం నుంచి మనం ఏమి గమనిస్తాం?
జ: * దోస, కాకర లాంటి మొక్కల్లో నులితీగల చలనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
   ¤* ఈ మొక్కల్లో కాండం బలహీనంగా ఉండటం వల్ల అవి పైకి ఎగబాకలేవు.
   * అవి పైకి ఎగబాకడానికి నులితీగలు తోడ్పడుతాయి.
   * నులితీగలు ఆధారం దొరికినప్పుడు వేగంగా పెరిగి చుట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది.
¤   * మెత్తగా ఉండే నులితీగలు కాండం భారం మోయడం కూడా అద్భుతంగా ఉంటుంది. వాటిని లాగినప్పుడు తెగిపోతాయి తప్ప ఊడిరావు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
¤   *  మొక్క నిలువుగా పెరగడానికి దోహదం చేసే ఈ నులితీగలు స్పర్శానువర్తనాన్ని ప్రదర్శిస్తాయి.

 

19. మెదడు ఏవిధంగా రక్షణ పొందుతుంది?
జ:¤ * ఇతర జంతువులతో పోల్చినప్పుడు మానవ మెదడు చాలా పెద్దది. ఇది ఎముకలతో తయారుచేసిన గట్టి పెట్టె లాంటి నిర్మాణంలో భద్రపరిచి ఉంటుంది. ఈ నిర్మాణాన్ని 'కపాలం' అంటారు.
¤  * మెదడును ఆవరించి 3 త్వచాలు ఉంటాయి. వీటిని 'మెనెంజస్' అంటారు. ఈ త్వచాలు మెదడుతో పాటుగా వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి.
¤   * వెలుపలి, మధ్యత్వచాల మధ్య 'మస్తిష్క మేరుద్రవం' ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుంచి కాపాడి రక్షణనిస్తుంది.

 

20. తరగతిగదిలో మీ తోటి విద్యార్థి చేసే పనులను 45 నిముషాలు గమనించండి. ఆ పనుల్లో నియంత్రిత, అనియంత్రిత చర్యలను గుర్తించండి.
జ: నియంత్రిత చర్యలు: పాఠం చదవడం, పాట పాడటం, నిలబడటం, కూర్చోవడం, కదలడం, చప్పట్లు కొట్టడం, రాయడం, మాట్లాడటం మొదలైనవి.
అనియంత్రిత చర్యలు: కళ్లు ఆర్పడం, ఆవలించడం, తుమ్మడం, శ్వాస పీల్చడం, వినడం, మింగడం.

 

ఒక మార్కు ప్రశ్నలు

1. ఉద్దీపనలు లేదా ప్రచోదనాలు అంటే ఏమిటి?
జ: జీవుల బాహ్య లేదా అంతర పరిసరాల్లోని నిర్దిష్ట మార్పులను 'ఉద్దీపనలు' అంటారు.
                                               లేదా
     జీవుల్లో ప్రతిస్పందనను కలిగించే మార్పులను ఉద్దీపనలు లేదా ప్రచోదనాలు అంటారు.

 

2. ప్రతిస్పందనలు అంటే ఏమిటి?
జ: ఉద్దీపనలకు జీవులు చూపించే ప్రతిచర్యలను 'ప్రతిస్పందనలు' అంటారు.

 

3. నాడీకణంలోని ప్రధాన భాగాలేవి?
జ:  నాడీకణంలోని ప్రధాన భాగాలు కణదేహం, తంత్రికాక్షం (ఆక్సాన్లు), డెండ్రైట్లు.

 

4.. నాడీకణ తంత్రికాక్షం దేంతో కప్పి ఉంటుంది?
జ: నాడీకణ తంత్రికాక్షం మయలిన్ తొడుగుతో కప్పి ఉంటుంది.

 

5. నాడీకణదేహం నుంచి బయలుదేరిన చిన్న నిర్మాణాలను ఏమంటారు?
జ: నాడీకణదేహం నుంచి బయలుదేరిన చిన్న నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు.

 

6. నాడీకణదేహం నుంచి బయలుదేరిన పొడవైన నిర్మాణాన్ని ఏమంటారు?
జ: నాడీకణ దేహం నుంచి బయలుదేరిన పొడవైన నిర్మాణాన్ని ఆక్సాన్ లేదా తంత్రికాక్షం అంటారు.

7. మయలిన్ తొడుగులోని ఖాళీలను ఏమంటారు?
జ: మలియన్ తొడుగులోని ఖాళీలను రాన్వియర్ కణుపులు అంటారు.

 

8. మయలిన్ తొడుగు ఉన్న నాడీకణాలను ఏమంటారు?
జ: మయలిన్ తొడుగు ఉన్న నాడీకణాలను మయలిన్ సహిత నాడీకణాలు అంటారు.

 

9. మయలిన్ రహిత నాడీకణాలు అంటే ఏమిటి?
జ: మయలిన్ తొడుగు లేని నాడీకణాలను మయలిన్ రహిత నాడీకణాలు అంటారు.

 

10. ఆక్సాన్, డెండ్రైట్‌లను ఎలా గుర్తుపడతారు?
జ: ఆక్సాన్ (తంత్రికాక్షం) చాలా పొడువుగా ఉండి నాడీకణానికి ఒకటి మాత్రమే ఉంటుంది. డెండ్రైట్లు నాడీకణానికి ఎక్కువ సంఖ్యలో చిన్నగా, పొట్టిగా ఉండే నిర్మాణాలు.

 

11.  మయలిన్ తొడుగు అంటే ఏమిటి? ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది?
జ: ఆక్సాన్‌ను ఆవరించి, కొవ్వు పదార్థాలతో కూడి ఉన్న తొడుగును మయలిన్ తొడుగు అంటారు. ఇది కొన్ని నాడీకణాల ఆక్సాన్‌లలో కనిపిస్తుంది.

 

12. పొడవును ఆధారంగా చేసుకుని మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్, డెండ్రైట్లను గుర్తుపట్టగలమా?
జ: పొడవును ఆధారం చేసుకుని మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్లు, డెండ్రైట్లను గుర్తుపట్టలేం. వాటిని కప్పుతూ ఉండే మయలిన్ తొడుగు ఆధారంగా గుర్తుపట్టవచ్చు. మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్ల చుట్టూ మయలిన్ తొడుగు ఉండదు.

 

13. ఒక ఆక్సాన్‌ను మరో ఆక్సాన్ నుంచి వేరు చేసేది ఏది?
జ: మయలిన్ తొడుగు ఒక ఆక్సాన్‌ను మరో ఆక్సాన్ నుంచి వేరు చేస్తుంది.

 

14. నాడీకణంలో కణదేహం ఎక్కడ విస్తరించి ఉంటుంది?
జ: నాడీకణదేహం మెదడులో గానీ, వెన్నుపాములో గానీ లేదా వెన్నుపాము నుంచి బయలుదేరే పృష్ఠ, ఉదర నాడీ సంధుల్లో ఉంటుంది.

 

15. నాడీకణంలో డెండ్రైట్లు, ఆక్సాన్ భాగం ఎక్కడ విస్తరించి ఉంటుంది?
జ: నాడీకణంలో డెండ్రైట్లు, ఆక్సాన్ భాగం కణజాలాల్లోకి విస్తరించి ఉంటుంది.

 

16. నాడీవ్యవస్థ మౌలిక ప్రమాణం ఏది?
జ: నాడీవ్యవస్థ మౌలిక ప్రమాణం నాడీకణం.

 

17. మానవ నాడీవ్యవస్థలో సుమారు ఎన్ని నాడీకణాలు ఉంటాయి?
జ: మానవ నాడీవ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీకణాలు ఉంటాయి.

 

18. నాడీకణ సంధి (సైనాప్స్) అంటే ఏమిటి?
జ: ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరో కణంలోని డెండ్రైట్లతో లేదా ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి అంటారు.

 

19. నాడీకణ సంధి పని ఏమిటి?
జ: నాడీకణ సంధి ఒక నాడీకణం నుంచి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేస్తుంది.

 

20. నాడీకణ సంధులు ఎక్కడ ఉంటాయి?
జ: నాడీకణ సంధులు మెదడు, వెన్నుపాముపై, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.

 

21. తంత్రికాక్షం (ఆక్సాన్) చేసే పని ఏమిటి?
జ: తంత్రికాక్షం(ఆక్సాన్) మెదడు, వెన్నుపాముల   నుంచి   శరీరంలోని    వివిధ    భాగాలకు   ప్రచోదనాలను తీసుకెళతాయి.

 

22.  నాడీకణ సంధి వద్ద రెండు నాడీకణాల మధ్య సమాచారం వేటి ద్వారా ప్రసారమవుతుంది?
                                                 లేదా
      సైనాప్స్‌లో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది?

జ: నాడీకణ సంధి (సైనాప్స్) వద్ద రెండు నాడీకణాల మధ్య సమాచారం రసాయనాలు లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా ప్రసారమవుతుంది.

 

23. నాడీవ్యవస్థ మీద మొదట కీలక పరిశోధనలు చేసిన గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త ఎవరు?
జ: గ్రీకు శాస్త్రవేత్త గాలన్ మొదటగా నాడీ వ్యవస్థపై కీలక పరిశోధనలు చేశారు.

 

24. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
జ: సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను మూడు రకాలుగా విభజించవచ్చు.

 

25.  అభివాహి నాడులు అంటే ఏమిటి?
జ: దేహంలోని వివిధ భాగాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడీవ్యవస్థకు తీసుకెళ్లే నాడులను అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు అంటారు.

26.  అపవాహి నాడులు అంటే ఏమిటి?
జ: కేంద్రనాడీవ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు తీసుకెళ్లే నాడులను అపవాహి నాడులు లేదా చాలక నాడులు అంటారు.

 

27.  సహసంబంధ నాడులు అంటే ఏమిటి?
జ: అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు.

 

28.  ప్రతీకార చర్యలు అంటే ఏమిటి?
జ: కొన్ని సందర్భాల్లో మన శరీరం మన నియంత్రణ లేని ప్రతిక్రియలను చూపాల్సిన అవసరముంటుంది. ఈ విధమైన ప్రతిస్పందనలను ప్రతీకార చర్యలు అంటారు.

 

29.  అనియంత్రిత చర్యలు అంటే ఏమిటి?
జ: మనం పూర్తి చేతనావస్థలో ఉన్నప్పటికీ కొన్ని చర్యలను ఆపలేం. అలాంటి చర్యలను అనియంత్రిత చర్యలు అంటారు.

 

30.  ప్రతీకార చర్యాచాపం అంటే ఏమిటి?
జ: జ్ఞాన అవయవాల నుంచి వెన్నుపాముకు, అక్కడ నుంచి ప్రభావకాంగాలకు సమాచారం ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీన్ని ప్రతీకార చర్యాచాపం అంటారు.

                                                                                                                                                                                                                                              

 

 

 


రచయిత: టి. శాంతాదేవి

Posted Date : 06-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

జీవశాస్త్రం

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌