• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్నలు - జవాబులు

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహరణ సహితంగా వివరించండి.

జ: అలైంగిక ప్రత్యుత్పత్తి: సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

ఇందులోని రకాలు:

1) విచ్ఛిత్తి (Fission)

2) కోరకీభవనం (Budding)

3) ముక్కలవడం (Fragmentation)

4) విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలాలు (Parthenogenesis)

5) పునరుత్పత్తి (Regeneration)
విచ్ఛిత్తి: ఒక జీవి కణ విభజన ద్వారా రెండుగా విడిపోవడాన్ని ద్విధావిచ్ఛిత్తి అంటారు. అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే బహుధావిచ్ఛిత్తి అంటారు.
ఉదా: పారామీషియం, బ్యాక్టీరియా.
కోరకీభవనం: జనక జీవి శరీరం నుంచి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది జనక జీవి నుంచి విడిపోయి స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ ప్రక్రియను కోరకీభవనం అంటారు.
ఉదా: ఈస్ట్.

ముక్కలవడం:  కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుంచి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా, మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది.
ఉదా: చదును పురుగులు, లైకెన్లు, స్పైరోగైరా, మోల్డులు.
విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలాలు: అండం క్షయకరణ విభజన, ఫలదీకరణం చెందకుండానే సంయుక్తబీజంగా అభివృద్ధి చెందే విధానాన్ని పార్థినోజెనిసిస్ అంటారు. ఈ విధానంలో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడతాయి.

ఉదా: అరటి, ద్రాక్ష.
ఈ విధానం (పార్థినోజెనిసిస్)లో జంతువుల్లో క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా, జరగకపోయినా అండం అభివృద్ధి చెందుతుంది. ఏకస్థితిక జీవులైతే మగజీవులుగా, ద్వయస్థితిలో ఉంటే ఆడజీవులుగా అభివృద్ధి చెందుతాయి.
ఉదా: తేనెటీగలు, చీమలు, కందిరీగలు.

పునరుత్పత్తి: పూర్తిగా విభేదనం చెందిన జీవులు తమ శరీర ఖండాల నుంచి కొత్త జీవిని ఏర్పరిచే సామర్థ్యాన్ని పునరుత్పత్తి అంటారు.
ఉదా:  ప్లనేరియా.

2. శాఖీయ వ్యాప్తి విధానాల గురించి వివరించండి.
జ: ఉన్నతస్థాయి మొక్కల్లో సహజంగా లేదా కృత్రిమంగా శాఖీయ పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
సహజ శాఖీయోత్పత్తి: ఈ విధానంలో పత్రాలు, కాండాలు, వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది.

పత్రాలు: కొన్ని మొక్కల ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
ఉదా: రణపాల
కాండాలు: రన్నర్లు, స్టోలన్ల లాంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకితే అక్కడ నుంచి పీచు వేర్లు
అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుంచి ఈ భాగం విడిపోయినట్లయితే అప్పటికే ఏర్పడిన వేర్ల ద్వారా కొత్త మొక్కలుగా పెరుగుతాయి.
ఉదా: స్టోలన్లు - వాలిస్‌నేరియా, స్ట్రాబెర్రీ
లశునాలు - ఉల్లి
కొమ్ములు - పసుపు
దుంప - బంగాళాదుంప

వేర్లు: డాలియా, ముల్లంగి, క్యారట్‌పై చిన్న చిన్న మొగ్గలు, పత్రాలున్న కాండ భాగాలుగా పెరుగుతాయి.
కృత్రిమ శాఖీయోత్పత్తి: ఈ విధానంలో ఛేదనం, అంటుతొక్కడం, అంటుకట్టడం ఉంటాయి.
ఛేదనం (Cutting): జనక మొక్క నుంచి కోరకం ఉన్న మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదనభాగం నుంచి కొత్త మొక్క పెరుగుతుంది. ఆ ఛేదన భాగాన్ని తడి నేలలో నాటాలి. కొద్దిరోజుల్లో వేర్లు ఏర్పడి, మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా: బంతి, గులాబి
అంటు తొక్కడం (Layering): మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేలా మట్టితో కప్పాలి.
కొంతకాలం తర్వాత కప్పి ఉంచిన భాగం నుంచి కొత్త వేర్లు వస్తాయి. అప్పుడు ఈ కొమ్మను జనక మొక్క నుంచి వేరు చేయాలి. వేళ్లు వచ్చిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది.

ఉదా: మల్లె, గన్నేరు.
అంటు కట్టడం(Grfting): వేర్వేరు మొక్కల భాగాలను కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను 'అంటుకట్టడం' అంటారు. ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. నేలలో పెరుగుతున్న మొక్కను 'స్టాక్', వేర్లు లేని వేరే మొక్క భాగాన్ని 'సయాన్' అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి పురిదారంతో కట్టాలి. వాంఛనీయ లక్షణాలున్న మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు.

3.  సమవిభజన, క్షయకరణ విభజన మధ్య భేదాలను రాయండి. 

జ:

 

4. పురుష సంయోగబీజం - స్త్రీ సంయోగబీజాల మధ్య ఉన్న భేదాలు రాయండి.  

జ:
   

5. మొక్కల్లోని ఫలదీకరణ ప్రక్రియను వివరించండి.


జ: ¤ * ఫలదీకరణం జరగడానికి ముందు పరాగరేణువులు కీలాగ్రం పైకిచేరతాయి. అవి అంకురించి పరాగనాళాలను ఇస్తాయి. అందులో ఒక్క పరాగనాళం మాత్రమే పిండకోశాన్ని చేరుకోగలుగుతుంది.
¤ * పరాగనాళంలో 2 పురుష సంయోగ బీజాలుంటాయి.
¤* సాధారణంగా అండం ద్వారా పరాగనాళిక అండంలోకి చేరుతుంది. దానిలో ఉన్న రెండు పురుషసంయోగ బీజాలను, ఆ నాళిక అండకోశంలోకి విడుదల చేస్తుంది.
¤ * ఈ రెండింటిలో ఒక పురుష సంయోగ బీజం, స్త్రీ బీజకణం వైపు సమీపించి దాంతో సంయోగం జరిపి ద్వయస్థితిలో ఉండే సంయుక్తబీజాన్ని ఏర్పరుస్తుంది. ఇది మొదటి ఫలదీకరణం అవుతుంది.


¤ * రెండో పురుష సంయోగ బీజం, '2n' స్థితిలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది '3n' స్థితిలో ఉండే అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇది పిండకోశంలో జరిగే రెండో ఫలదీకరణం.

¤ * మొదటి ఫలదీకరణం వల్ల ఏర్పడిన సంయుక్తబీజం పెరిగి పిండంగా అభివృద్ధి చెందుతుంది. సంయుక్తబీజ కేంద్రం పలుమార్లు విభజన చెంది హృదయాకార నిర్మాణంగా మారి అండం లోపలి స్థలాన్ని ఆక్రమించుకుంటుంది.
¤ * బాగా ఎదిగిన పిండంలో ప్రథమ కాండం, ప్రథమ మూలం, బీజదళాలు ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు రెండు బీజదళాలు; ఏకదళ బీజ మొక్కలు ఒకే బీజదళంతో ఉంటాయి.

6. లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తితో విభేదిస్తుంది? కారణాలు తెలపండి.  

జ:
 

7. పుష్ప నిర్మాణాన్ని వర్ణించండి.
జ: పుష్పానికి ఉండే కాడను పుష్పవృంతం అంటారు. ఉబ్బి ఉండే దీని చివరి భాగాన్ని పుష్పాసనం అంటారు. దీనిపై సాధారణంగా రక్షక పత్రాలు, ఆకర్షక ప్రతాలు, కేసరావళి, అండకోశం అనే పుష్ప భాగాలు వివిధ వలయాల్లో అమరి ఉంటాయి.


రక్షక పత్రాలు:  మొదటి వలయంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఇవి మొగ్గదశలో, పుష్పంలోపలి భాగాలను కప్పి ఉంచి రక్షణ కల్పిస్తాయి.
ఆకర్షక పత్రాలు: పుష్పం రెండో వలయంలో ఉంటాయి. ఇవి వివిధ వర్ణాలు, సువాసనలతో కీటకాలను పరాగ సంపర్కం కోసం ఆకర్షించడానికి సహాయపడతాయి.
కేసరావళి:  పుష్పం మూడో వలయంలో ఉంటుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి అవయవం. కేసరావళిలో కేసర దండం, పరాగకోశ భాగాలు ఉంటాయి. పరాగకోశాల్లో పరాగరేణువులు తయారవుతాయి.
అండకోశం: ఇది పుష్పాసనం నాలుగో వలయంలో ఉంటుంది. దీనిలో అండాశయం, కీలం, కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి. అండాశయంలో అండాలు అండన్యాస స్థానం వద్ద అమరి ఉంటాయి.

8. రుతుస్రావ సమయాల్లో గర్భాశయ గోడల్లో జరిగే మార్పులేమిటి?
జ: ¤*  స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే మార్పుల వరుస క్రమాన్ని రుతుచక్రం అంటారు.
¤ * ఈ ప్రక్రియ చివరి దశలో రుతుస్రావం 3 నుంచి 5 రోజులు జరుగుతుంది.
¤ * స్త్రీ బీజకోశం నుంచి విడుదలైన అండం ఫలదీకరణం చెందకపోతే, గర్భాశయ కణాల నుంచి విడిపోతుంది.
¤ * ఫలదీకరణం చెందని అండం నశించి, గర్భాశయ లోపలి పొరలతో పాటుగా విసర్జన అవుతుంది. దీన్నే రుతుస్రావం అంటారు.
¤ * రుతుస్రావంలో నిర్జీవ అండం, గర్భాశయ పొరలు, కొంత రక్తంతో విసర్జన జరుగుతుంది.
¤ * ఈ ప్రక్రియలో గర్భాశయం లోపల ఏర్పడిన రక్తకణాల పొరలు వేరైపోతాయి.
¤ * గర్భాశయ కుడ్యానికి రక్తప్రసరణ తగ్గుతుంది.
¤ * గర్భాశయ కండరాలు సంకోచించి, లోపలి పొరలను విసర్జిస్తాయి.
¤ * ఈ మొత్తం ప్రక్రియలో ఈస్ట్రోజన్ హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది.
¤*  పిండ ప్రతిస్థాపనకు గర్భాశయం సిద్ధంగా ఉంటుంది.

9. మీకు దగ్గరలోని గ్రామాన్ని సందర్శించి పూలమొక్కలు, కూరగాయల సాగు గురించి అడిగి, ఎలా పండిస్తున్నారో తెలుసుకోండి. సేకరించిన సమాచారంతో తగిన నివేదిక తయారు చేసి తరగతిలో ప్రదర్శించండి.
జ: మా గ్రామంలోని రైతులను వివిధ పంటలను పండించే విధానాన్ని అడిగి తెలుసుకున్నాను. అవి..

చెరకు: చెరకును ముక్కలుగా చేసి భూమిలో ఏటవాలుగా పాతి పండిస్తున్నారు. ఈ ప్రక్రియను 'ఛేదనం' అంటారు. ఇది ఒక శాఖీయోత్పత్తి పద్ధతి. ఈ పద్ధతిలో కనీసం 2 కణుపులు ఉండే విధంగా ఛేదనాలు చేసి కణుపు భూమిలోకి దిగేలా పాతిపెడతారు.
చామంతి: దీన్ని శాఖీయవ్యాప్తి ద్వారా సాగు చేస్తున్నారు. ఈ మొక్క కాండం నుంచి కొన్ని శాఖలు భూమి ద్వారా ప్రయాణించి పైకి వస్తాయి. భూమిలో ఉన్న శాఖ నుంచి కొత్తవేర్లు పుడతాయి. తల్లి మొక్కతో సంబంధం ఉన్నప్పుడే వేర్లను కలిగిన శాఖలను అంట్లు అంటారు. (చామంతిలో ఈ అంట్లను పిలక మొక్కలు అంటారు) వీటిని తల్లి మొక్క నుంచి వేరు చేసి మరో ప్రాంతంలో పెంచుతారు.
బంగాళదుంప: భూగర్భ కాండం. ఇది ఆహారం నిల్వ చేయడం వల్ల లావుగా తయారవుతుంది. ఇందులో కణుపులు నొక్కులుగా ఉంటాయి. ఈ ప్రాంతాలను 'కన్నులు' అంటారు. ఛేదనం ద్వారా కన్ను ప్రాంతాన్ని వేరు చేసి కొత్త మొక్కలను పెంచుతారు.
దొండకాయ: ఈ మొక్కలను కొంచెం గట్టిదారు ఛేదనాలను ఉపయోగించి సాగు చేస్తున్నారు.

10. ఆర్థిక ప్రాముఖ్యం ఉన్న మొక్కల పెంపకాన్ని మీ జిల్లా, రాష్ట్రాల్లో ఏ విధంగా చేపడుతున్నారో తగిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం, ఇంటర్నెట్ నుంచి సేకరించండి. దాని ఆధారంగా ఒక నివేదికను తయారు చేయండి.

జ: మా ప్రాంతంలో ఆర్థిక ప్రాముఖ్యం ఉన్న మొక్కలను శాఖీయ పద్ధతిలోనే పెంచుతున్నారు. తోటల పెంపకంలో బిందు సేద్యం పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రతి పద్ధతిలో కూడా తల్లి మొక్కలో వాంఛిత లక్షణాలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించి శాఖీయోత్పత్తిని అభివృద్ధి చేస్తున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పత్తి, పొగాకు, మిరప పంటలను సాగు చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని వాలు భూములను తోటలుగా మలిచి బత్తాయి, నారింజ పండిస్తున్నారు.

2 మార్కుల ప్రశ్నలు

1. చేప, కప్ప లాంటి జీవులు అసంఖ్యాకమైన అండాలను విడుదల చేస్తాయి. కారణమేంటి?
జ: చేప, కప్ప లాంటి జీవుల్లో బాహ్యఫలదీకరణ జరుగుతుంది. స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంది. అదేవిధంగా పురుషజీవి మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. శుక్రకణాలు అండాలతో శరీరం బయట నీటిలో కలుస్తాయి. ఒక్కోసారి కొన్ని అండాలు, శుక్రకణాలు నీటిలో కొట్టుకుపోవచ్చు. కొన్ని శుక్రకణాలు అండాలను చేరకపోవచ్చు. ఫలదీకరణ చెందిన అండాలకు రక్షణ లేకపోవచ్చు లేదా ఎదుగుతున్న పిండాలను ఇతర జీవులు తినేయవచ్చు. కాబట్టి ఈ జీవులు అధిక సంఖ్యలో శుక్రకణాలను, అండాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అధికసంఖ్యలో జీవులు ఏర్పడి కొన్ని  నశించినా మిగిలినవి తమ జాతిని కొనసాగించగలుగుతాయి.

 

2. బహిర్గత ఫలదీకరణాన్ని ఉదాహరణతో వివరించండి.
జ: స్త్రీ, పురుష సంయోగబీజాల కలయికను ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం స్త్రీజీవి శరీరానికి బయట జరిగితే దాన్ని బాహ్యఫలదీకరణం లేదా బహిర్గత ఫలదీకరణం అంటారు. ఈ ప్రక్రియలో పురుషజీవి శుక్రకణాలను, స్త్రీ జీవి అండాలను తమ చుట్టూ ఉండే మాధ్యమం నీటిలోకి విడుదల చేస్తాయి. నీటిలో శుక్రకణాలు అండాలతో కలసి ఫలదీకరణం జరుగుతుంది.
ఉదా: చేపలు, కప్పలు.

 

3. శుక్రకణాలకు వాటి విధులను నిర్వహించడానికి ఎలాంటి అనుకూలనాలు ఉన్నాయి?
జ:¤ * ముష్కాలు శుక్రకణాలను మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి.   
¤ * శుక్రకణాలు పొడవైన తోక ఉండే కశాభయుత కణాలు. శుక్రకణం చలిస్తూ అండం వైపు పయనించడానికి ఈ తోక ఉపయోగపడుతుంది.   
¤ * ప్రతి శుక్రకణానికి తల, మధ్య భాగం, తోక ఉంటాయి.
¤ * తల నిర్మాణం గుండ్రంగా ఉండి, ముందు భాగమైన ఏక్రోసోమ్ మొనతేలి ఉండటం వల్ల అండంలోకి సులభంగా చొచ్చుకుపోతుంది.
¤ * మధ్యభాగంలోని మైటోకాండ్రియాలు చలనానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
¤ * తోక సహాయంతో శుక్రకణం చలిస్తూ, ఏక్రోసోమ్ ద్వారా అండానికి రంధ్రం చేసి ఫలదీకరణ జరుపుతుంది.

 

4. ఫలదీకరణ చెందిన అండాన్ని గర్భాశయంలో నిలపడం కోసం రుతుస్రావ చక్రం పనిచేస్తూ, పునరావృతమవుతూ ఉంటుంది. సాధారణంగా రుతుచక్రం ప్రారంభమై పూర్తవడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
జ: ¤ * స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పుల వరుస క్రమాన్ని ''రుతుచక్రం" అంటారు.
¤ * ఇది ప్రతి 28 రోజులకు ఒకసారి జరుగుతుంది.
¤ * దీని మొదటి దశను పెరుగుదల దశ అంటారు. ఇది 14 -16 రోజుల వరకు ఉంటుంది.
¤ * రెండో దశను స్రావక దశ అంటారు. ఇది 25వ రోజు వరకు ఉంటుంది.
¤ * రుతుస్రావం 25 -28 రోజుల మధ్య ఉంటుంది.

 

5. 'గర్భాశయంలో పెరుగుతున్న పిండానికి పోషణ అవసరం.' పిండానికి అవసరమైన పోషకాలు ఎలా అందుతాయి?
జ: ఎల్లంటోయిస్ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుంచి ఉద్భవిస్తుంది. సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్ని ''నాభి రజ్జువు" అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుంచి బిడ్డకు పోషకాలు అందుతాయి.

 

6. గర్భస్థ శిశువులోని ఏ పదార్థాలను తల్లి రక్తం సంగ్రహించి మావికి పంపుతుంది?
జ:¤ గర్భస్థ శిశువు తల్లి రక్తం నుంచి ఆహారాన్ని, ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ¤ పిండంలో ఏర్పడిన CO2, వ్యర్థ పదార్థాలు తల్లి రక్తంలో కలుస్తాయి. ఈ పదార్థాల మార్పిడిలో జరాయువు కీలకపాత్ర పోషిస్తుంది.  జరాయువులో తల్లి, బిడ్డ రక్త ప్రసరణ వ్యవస్థలను పలుచని త్వచం వేరు చేస్తుంది. దీని ద్వారా పదార్థాలు విసరణ ప్రక్రియలో రవాణా అవుతాయి.

 

7. గర్భాశయంలోని ఉమ్మనీటికోశం విధి ఏమిటి?
జ: ¤ పిండాన్ని చుడుతూ బయటివైపు పరాయువు, దాని కింద ఉల్బం పొర ఉంటాయి. ఉల్బం లోపలి కుహరంలో ఉల్బక ద్రవం పిండాన్ని ఆవరించి ఉంటుంది. ఈ ద్రవం ఎదుగుతున్న పిండానికి తేమతోపాటు చిన్న చిన్న యాంత్రిక అఘాతాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

 

8 . లైంగిక ప్రత్యుత్పత్తి లాభాలను వివరించండి.
జ:¤ * లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల కొత్త లక్షణాలున్న జీవులు ఏర్పడతాయి.
¤ * రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తర్వాతి తరానికి వస్తాయి.
¤ * పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఆ జీవులకు ఏర్పడుతుంది.
¤ * లైంగిక ప్రత్యుత్పత్తి  కొత్త జాతుల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

 

9. ఏక కణజీవులన్నీ అననుకూల (ప్రతికూల) పరిస్థితుల్లో సమవిభజన చెందుతాయి. ఈ వ్యాఖ్యను సమర్థిస్తారా?
జ: లేదు. ఈ వ్యాఖ్యను నేను సమర్థించను. అన్ని ఏకకణ జీవులు అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లోనూ సమవిభజన చెందుతాయి. అనుకూల పరిస్థితుల్లో విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరిపి పిల్ల జీవులను ఏర్పరుస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో తమ చుట్టూ కోశాన్ని ఏర్పరచుకుని అందులో సమవిభజన చెందుతాయి. కోశం విచ్ఛిన్నమై అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను బహుధావిచ్ఛిత్తి అంటారు.

 

10. విక్కీ వాళ్ల నాన్న రంగు రంగుల పూలు, పెద్ద ఫలాలు ఉన్న ఒక మొక్కను పెంచాలనుకున్నాడు. మీరు అతడికి సూచించే పద్ధతి ఏమిటి? ఎందుకు?
జ: ¤ దీనికి నేను అంటుకట్టే విధానాన్ని సూచిస్తాను. ఈ ప్రక్రియలో కోరుకున్న లక్షణాలున్న మొక్కలను పొందే అవకాశం ఉంది. 
ఈ పద్ధతిలో రెండు మొక్కల్లోని విభిన్న వాంఛిత లక్షణాలను కలిపేందుకు అవకాశం ఉంది. రంగు రంగుల పూలు, పెద్దకాయలు కాసే రెండు మొక్కల కొమ్మలను అంటుకట్టడం ద్వారా ఆ రెండు లక్షణాలున్న కొత్త మొక్కను సృష్టించవచ్చు. అంటుకట్టడం ద్వారా లేత ''సయాన్" చాలా త్వరగా పూలు, పండ్లను ఉత్పత్తి చేస్తుంది.  నూతనత్వం కోసం ఒకే మొక్కపై వివిధ రకాల మొక్కలను పెంచడానికి ఇది మంచి ప్రక్రియ.
 

11.  ఒకవేళ జీవుల్లో క్షయకరణ విభజన జరగకపోతే ఎదురయ్యే పరిణామాలేమిటి?
జ:¤ * ఒకవేళ జీవుల్లో క్షయకరణ విభజన జరగకపోతే, తరం మారే కొద్దీ క్రోమోజోమ్‌ల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంటుంది.
¤ * క్రోమోజోమ్‌ల సంఖ్యలో మార్పులు వస్తే జీవుల లక్షణాలు పూర్తిగా మారిపోతాయి.
¤ * తరతరానికి క్రోమోజోమ్‌ల సంఖ్య రెట్టింపు అయ్యేకొద్దీ జీవుల్లో విపరీత లక్షణాలు వస్తాయి. తరానికి, తరానికి మధ్య పోలికలు లేకుండా జీవజాతిలో అనర్థాలు జరుగుతాయి.
¤ * ప్రత్యుత్పత్తి విధాన ప్రధాన లక్ష్యం నెరవేరదు.

 

12. జీవం శాశ్వతత్వానికి తోడ్పడుతున్న కణ విభజనను మీరు ఏవిధంగా అభినందిస్తారు?
జ: ¤ కణ విభజన వల్ల కణాల సంఖ్య పెరుగుతుంది. దాంతో జీవి అభివృద్ధి చెంది జీవక్రియలను నిర్వహించగలుగుతుంది.  ప్రాథమిక జీవుల్లో కణవిభజన ప్రత్యుత్పత్తి విధానంగా పనిచేస్తుంది. దీన్నే విచ్ఛిత్తి అంటారు.  గాయాలు మానడానికి, మృతకణాల స్థానంలో కొత్త కణాలను భర్తీ చేయడంలో కణవిభజన కీలకపాత్ర పోషిస్తుంది. ¤ కణ విభజన వల్ల ప్రత్యుత్పత్తి జరిగి జీవులు తమ జాతిని నిలబెట్టుకుంటున్నాయి.  భూమి మీద జీవం ఏర్పడటం ఒక అద్భుత విషయమైతే ఆ జీవం కొనసాగడానికి అవసరమైన కణవిభజన ప్రక్రియ మరో అద్భుతం.  జీవరాశి మనుగడకు, వంశాభివృద్ధికి కణవిభజన కీలకమని నేను భావిస్తున్నాను.

ఒక మార్కు ప్రశ్నలు

1. ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి?
జ: జీవులు తమ జీవితకాలంలో తమను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అంటారు.

2.  ద్విధావిచ్ఛిత్తి అంటే ఏమిటి?
జ: ఏకకణ జీవులు రెండుగా విడిపోయే ప్రక్రియను ద్విధావిచ్ఛిత్తి అంటారు. సాధారణంగా ఇది సౌష్ఠంగా జరుగుతుంది.
ఉదా: పారామీషియం

 

3. బహుధా విచ్ఛిత్తి అంటే ఏమిటి?
జ: ఏకకణ జీవులు అనేక భాగాలుగా విడిపోయి, అవి జీవులుగా రూపొందే ప్రక్రియను బహుధా విచ్ఛిత్తి అంటారు. సాధారణంగా ఇది ప్రతికూల పరిస్థితుల్లో జరుగుతుంది.
ఉదా: పారామీషియం, బ్యాక్టీరియా.

 

4.  అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి?
జ: సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

 

5. అనిషేక జననం అంటే ఏమిటి?"
జ: ఫలదీకరణం జరగకపోయినా అండం అభివృద్ధి చెంది పిల్లజీవులుగా ఏర్పడే ప్రక్రియను అనిషేక జననం అంటారు.

 

6. పునరుత్పత్తి అంటే ఏమిటి?
జ: పూర్తిగా విభజన చెందిన కొన్నిజీవులు తమ శరీర ఖండాల నుంచి కొత్త జీవిని ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియను పునరుత్పత్తి అంటారు.
ఉదా: ప్లనేరియా

 

7. శాఖీయ వ్యాప్తి ఎన్ని రకాలు? అవి ఏవి?
జ: శాఖీయ వ్యాప్తి 2 రకాలు.
సహజ శాఖీయోత్పత్తి: వేర్లు, కాండాలు, పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది.
కృత్రిమ శాఖీయోత్పత్తి: కృత్రిమ శాఖీయోత్పత్తి 3 రకాలుగా జరుగుతుంది.
1) ఛేదనం                  2) అంటుతొక్కుట                       3) అంటు కట్టుట

 

8. కాండాల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకాలను తెలపండి.
జ: కాండాల ద్వారా జరిగే శాఖీయోత్పత్తిలో రకాలు:
1) స్టోలన్లు - ఉదా: వాలిస్‌నేరియా, స్ట్రాబెర్రీ
2) లశునాలు - ఉదా: ఉల్లి
3) కొమ్ములు - ఉదా: పసుపు
4) దుంప - ఉదా: బంగాళాదుంప

 

9. కణజాలవర్ధనం అంటే ఏమిటి
జ: మొక్కల్లోని కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలున్న వర్థన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ ప్రక్రియను కణజాలవర్ధనం అంటారు. ఈ పద్ధతిలో తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను పెంచవచ్చు.

10. సిద్ధబీజాశయ పత్రాలు అంటే ఏమిటి?
జ: ఫెర్న్ మొక్క అడుగుభాగాన బూడిద రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలు ఉండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు అంటారు.

 

11. బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటి?
జ: స్త్రీ జీవి శరీరానికి బయట జరిగే ఫలదీకరణను 'బాహ్యఫలదీకణం అంటారు.
ఉదా: చేపలు, కప్పలు

 

12.  అంతర ఫలదీకరణం అంటే ఏమిటి?
జ: స్త్రీ జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు.
ఉదా: పక్షులు, క్షీరదాలు

 

13. మానవుడిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఏవి?
 
జ: ముష్కాలు, ఎపిడిడిమిస్, ప్రసేకం, మేహనం, పౌరుష గ్రంథి, శుక్ర గ్రాహిక, శుక్ర వాహికలు మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

 

14.  స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఏవి?
జ: గర్భాశయం, గ్రీవం, యోని, ఫాలోపియన్ నాళాలు, స్త్రీ బీజ కోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

 

15.  అండోత్సర్గం అంటే ఏమిటి?
జ: గ్రాఫియన్ పుటిక నుంచి అండం విడుదలవడాన్ని అండోత్సర్గం అంటారు.

 

16.  పురుష, స్త్రీ బీజకణాలను ఏమంటారు? ఇవి ఏ అవయవాల్లో ఏర్పడతాయి?
జ: పురుష బీజకణాలను శుక్రకణాలు అంటారు. ఇవి ముష్కాల నుంచి ఏర్పడతాయి. స్త్రీ బీజకణాలను అండాలు అంటారు. ఇవి స్త్రీ బీజకోశాల నుంచి ఏర్పడతాయి.

 

17.   సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది?
జ: శుక్రకణం అండంతో సంయోగం చెంది ఫలదీకరణం జరగడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది.

 

18.  ఫలదీకరణం అంటే ఏమిటి?
జ: స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు.

 

19. పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏవి?
జ: పిండాన్ని ఆవరించి పరాయువు, ఉల్బం, ఎల్లంటోయిస్ అనే పొరలు ఉంటాయి.

 

20.  తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
జ: తల్లి, పిండాల మధ్య పదార్థాల రవాణా నాభిరజ్జువు ద్వారా జరుగుతుంది.

 

21.  గర్భావధి కాలం అంటే ఏమిటి?
జ: పిండం పూర్తిగా ఎదగడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీన్నే గర్భావధి కాలం అంటారు.

 

22.  జననాంతరం అంటే ఏమిటి?
జ: శిశు జననం తర్వాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే జననాంతరం అంటారు.    

 

టి. శాంతా దేవి

Posted Date : 18-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

జీవశాస్త్రం

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌