• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నియంత్రణ - సమన్వయ వ్యవస్థ

నియంత్రణ - సమన్వయ వ్యవస్థ

4 మార్కుల ప్రశ్నలు

1. మొక్కలు ఉద్దీపనలకు ఏవిధంగా ప్రతిస్పందిస్తాయో ఉదాహరణలివ్వండి.
                                                    (లేదా)
     మొక్కల్లోని నాస్టిక్ చలనాలను వివరించండి.
జ:  మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి చలనాలను 'అనువర్తన చలనాలు' అంటారు.
 కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలో కాంతి సోకే దిశలో పెరుగుదల ఉంటుంది. ఈ విధంగా మొక్కలు కాంతికి ప్రతిస్పందించే ప్రక్రియను 'కాంతి అనువర్తనం' అంటారు.
 మొక్కలు గురుత్వాకర్షణకు ప్రతిస్పందిస్తూ పెరుగుదలను చూపుతాయి. ఈ చలనాన్ని 'గురుత్వానువర్తనం' అంటారు.
 రాళ్లను, గోడలను అంటిపెట్టుకుని పెరిగే మొక్కల్లోని వేర్లు వాటి (రాయి, గోడల) నుంచి దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఇలాంటి ప్రతిస్పందనను 'నీటి అనువర్తనం' అంటారు.
ఎగబాకే మొక్కల్లో నులితీగలు ఏదైనా ఆధారంవైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. స్పర్శ లేదా తాకడం వల్ల కలిగే ప్రతిస్పందనలను 'స్పర్శానువర్తనం' అంటారు.
 మొక్కలు రసాయనిక పదార్థాలకు కూడా ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు పక్వం చెందిన కీలాగ్రం తియ్యని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగరేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఈ ఉద్దీపనలకు పరాగరేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగరేణువు నుంచి పరాగనాళం బయలుదేరి ఫలదీకరణం కోసం అండాన్ని చేరుతుంది. ఇలాంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను 'రసాయనిక అనువర్తనం' అంటారు.
2. నిర్మాణరీత్యా నాడీకణం, సాధారణ కణం కంటే ఏ విధంగా భిన్నమైంది? వివరించండి.
జ:
నాడీకణం

సాధారణ కణం

1) నాడీకణాలు నాడీవ్యవస్థలో మాత్రమే కనిపించే ప్రత్యేక కణాలు.

1) సాధారణ కణాలు ఒక్క నాడీవ్యవస్థలో తప్ప మిగతా అన్ని శరీర భాగాల్లో ఉంటాయి.

2) నాడీకణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి.

అవి: కణదేహం, డెండ్రైట్లు, తంత్రికాక్షం

2) సాధారణ కణంలో నిర్దిష్ట
నాడీకణం

సాధారణ కణం

3) కణదేహం (సైటాన్) బూడిద రంగులో, ఆక్సాన్ తెలుపు రంగులో ఉంటాయి.

3) వివిధ కణజాలాల్లో ఉన్న సాధారణ కణాలు వేర్వేరు రంగులతో ఉంటాయి.

4) ఇవి నాడీ ప్రచోదనాలను మెదడు, వెన్నుపాముకు చేరవేస్తాయి.

4) వివిధ అవయవ వ్యవస్థల్లో ఉన్న అవయవాల పనితీరుకు ఇవి సహకరిస్తాయి.

5) ఒకసారి నాడీకణం దెబ్బతింటే, దాని ప్రదేశంలో మరో నాడీకణం ఉద్భవించదు.

5) ఈ కణాలు దెబ్బతిన్నా, అరిగిపోయినా వాటి స్థానంలో కొత్త కణాలు ఉద్భవిస్తాయి.

6) ప్రతి నాడీకణం చివరన నాడీ అంత్యాలు ఉంటాయి. ఇవి ఒక నాడీకణాన్ని మరొక నాడీకణంతో కలుపుతాయి.

6) కణాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలు వివిధ కణజాలాల్లో విభిన్నంగా ఉంటాయి.

7) నాడీకణాల్లో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది.

7) కణాలు నిర్వర్తించే విధులు, వాటి స్థానం, పెరుగుదల ఆధారంగా కేంద్రకం ఉంటుంది.
3. మానవుడు తెలివైన జంతువు. ఈ విధమైన నిర్ణయానికి రావడానికి కారణాలను చర్చించండి.
జ:  జంతువులన్నింటిలో మానవుడు చాలా తెలివైన జంతువు. దీనికి కారణం మానవుడు అత్యద్భుతమైన మెదడు నిర్మాణం కలిగి ఉండటం.
 ఒక సమస్యను విశ్లేషించి దానికి పరిష్కారాన్ని కనుక్కునే గొప్పశక్తి మానవ మెదడులో కనిపిస్తుంది.
 కవిత్వం, సంగీతం, చిత్ర లేఖనం, శిల్పకళను, అందమైన వస్తువులను, ప్రకృతిని చూసి ఆనందించే సౌందర్యోపాసన శక్తి మానవ మెదడుకు ఉంది.
 భాషతో భావాలను ప్రకటించే శక్తి, శబ్దాల ద్వారా ఇతరులకు సమాచారాన్ని ప్రసారంచేసే శక్తి మానవ మెదడు సొంతం.
 మానవుడు తన మెదడు ద్వారా అక్షరాలను కనిపెట్టి, తాను సేకరించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా తర్వాతి తరాలకు అందించగలిగాడు.
 అద్భుతమైన జ్ఞాపకశక్తి మానవ మెదడుకు మేధస్సును అందజేసింది. దీనివల్ల మానవుడి ప్రవర్తనలో నిరంతర అభివృద్ధి జరిగి, అనేక అద్భుత విషయాలను కనుక్కోగలిగాడు.

4. మొక్కల అగ్రభాగంలో ఉత్పత్తయ్యే హార్మోన్ల గురించి అధ్యయనం చేయడానికి ఏ పద్ధతిని వాడతారు?
                                                              లేదా
     ఎఫ్.డబ్ల్యూ. వెంట్ ప్రయోగాన్ని వివరించండి.
జ:


         మొక్క అగ్రభాగంలో ఉత్పత్తయ్యే హార్మోన్లను అధ్యయనం చేయడానికి కింది విధానాన్ని అనుసరిస్తారు.
ప్రయోగం:
 ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకుర కవచాన్ని కత్తిరించాలి.
 కాండం కొనపై అగార్ అగార్ ముక్కను పెట్టి గంటసేపు అలాగే ఉంచాలి.
తర్వాత అగార్ అగార్‌ను చిన్న చిన్న ముక్కలుగా లేదా పెట్టెలుగా కత్తిరించాలి.
 ప్రతి అగార్ అగార్ పెట్టెను, తొడుగు కత్తిరించిన మొక్క కాండంపై ఒకవైపు ఉండేలా పెట్టాలి. తర్వాత వాటిని చీకటి గదిలో ఉంచాలి.
 గంట తర్వాత ప్రాంకురంలో అగార్ పెట్టిన భాగానికి రెండో వైపున నిర్దిష్టమైన వంపు కనిపిస్తుంది.
పరిశీలన: ప్రాంకుర కవచంతో సంబంధంలేని అగార్ కాండం కొనభాగం ఎలాంటి వంపును ప్రదర్శించలేదు. అగార్ ముక్కను ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనిపిస్తుంది.
నిర్ధారణ: ప్రాంకుర కవచం కొనభాగంలో మార్పు రసాయనిక ఉద్దీపన వల్ల జరిగింది. ఈ రసాయనిక ఉద్దీపనలకు 'ఆక్సిన్లు' అని పేరు పెట్టారు. వీటిని ఎఫ్.డబ్ల్యూ. వెంట్ కనుక్కున్నాడు.
5. తంత్రికాక్షం - డెండ్రైట్, డెండ్రైట్‌ల మధ్య అనుసంధానం చేసే పటాన్ని గీయండి. ఇవి ఈ విధంగా ఎందుకు అనుసంధానమై ఉంటాయో తెలపండి.
జ:  ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరో కణంలోని డెండ్రైట్ లేదా ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని నాడీకణసంధి లేదా సినాప్స్ అంటారు.
 నాడీ కణసంధి ఒక నాడీకణం నుంచి మరో నాడీకణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం.
 ఈ నాడీ కణసంధి వద్ద రెండు నాడీకణాల మధ్య ఏ విధమైన జీవపదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ, రసాయనాలు లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా లేదా రెండింటి ద్వారా సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి ప్రసారమవుతుంది.
నాడీ కణసంధులు మెదడు, వెన్నుపాముపై, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.
 మెదడు, వెన్నపాము నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తంత్రికాక్షాలు తీసుకెళతాయి.
6. మెదడు ఏ విధంగా రక్షణ పొందుతుందో వివరించండి.
జ: శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. దీన్ని రక్షిస్తూ మూడు భాగాలు ఉంటాయి.
అవి:      1) కపాలం               2) మెనింజెస్ పొర                3) మస్తిష్క మేరుద్రవం
కపాలం: కపాలం అనే గట్టి ఎముకల పెట్టెలో మెదడు ఉంటుంది.
మెనింజెస్ పొర: మెదడును కప్పి ఉంచుతూ మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఇవి వెన్నపామును కూడా కప్పి ఉంచుతాయి.
మస్తిష్క మేరుద్రవం: మెనింజెస్ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలం, మెనింజెస్‌లతో కలిసి మెదడును అఘాతాల నుంచి కాపాడుతుంది. మస్తిష్క మేరుద్రవం మెదడు, వెన్నుపాముకు రక్షణ  ఇవ్వడమే కాకుండా వాటిలోని కణాలకు పోషకాలను అందిస్తుంది.
7. రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో మన శరీరంలోని అవయవాల మధ్య ఏవిధంగా సమన్వయం జరుగుతుంది. ఈ సందర్భాన్ని వివరించే రేఖాచిత్రాన్ని గీయండి.
జ: మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపిస్తే ఉలిక్కిపడి పక్కకు జరుగుతాం.

8. జట్టుగా పనిచేయడంవల్ల మన శరీరం వివిధ విధులను నిర్వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఉదాహరణలతో వివరించండి.
జ:  జట్టుగా పనిచేయడం వల్ల మన శరీరం వివిధ విధులను నిర్వర్తిస్తుంది.
ఉదా: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డును దాటాల్సి వస్తే, మన కళ్లు, కాళ్లు, చెవులు ఒకదానికొకటి సమన్వయ పరచుకోవాలి. లేదంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.
 కాళ్లు, చేతులు, నడుము లాంటి భాగాలు మెదడు ఆదేశాల మేరకు సమన్వయంగా పనిచేయడం వల్ల మనం రకరకాల ఆటలు ఆడగలుగుతున్నాం.
 పుస్తకంలోని వాక్యాలను కళ్లు గుర్తించి మెదడుకు సమాచారాన్ని  పంపుతాయి. మెదడు వాటిని నాలుకకు పంపడం వల్ల నోటితో మనం చదవగలుగుతున్నాం. ఈ ప్రక్రియలో కళ్లు, మెదడు, నోరు కలిసి పనిచేస్తున్నాయి.
9. మన శరీరం అంతస్రావ్య వ్యవస్థ, నాడీ వ్యవస్థలతో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణలివ్వండి.
జ: అధివృక్క గ్రంథి స్రవించే అడ్రినలిన్ హార్మోన్ మన శరీరం ఆపదలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో పనిచేయడానికి కావాల్సిన అదనపు శక్తిని అందజేస్తుంది.
ఉదా: మనం బజారులో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కుక్క మనల్ని కరవడానికి పరుగెత్తుకొస్తే, వెంటనే మన నాడీవ్యవస్థ అధివృక్క గ్రంథిని ఉత్తేజపరచి, అధిక పరిమాణంలో అడ్రినలిన్ హార్మోన్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది.
అడ్రినలిన్ వెంటనే మన శరీరానికి కావాల్సిన అదనపు శక్తి నిమిత్తం శ్వాసక్రియా రేటును, హృదయ స్పందనను, కండరాలకు అధిక రక్త ప్రసరణను కలగజేస్తుంది.
 ఈ చర్యల వల్ల శరీరానికి హఠాత్తుగా ఎక్కువ శక్తి లభించి కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి చాలా వేగంగా పరుగెత్తుతాం. సురక్షిత ప్రాంతానికి చేరిన తర్వాత మనకు ఇక అదనపు శక్తితో పని ఉండదు. అడ్రినలిన్ స్రావాన్ని ఆపమని మన నాడీవ్యవస్థ అధివృక్కగ్రంథికి ఆజ్ఞలను జారీ చేస్తుంది. వెంటనే అడ్రినలిన్ హార్మోన్ విడుదల ఆగిపోయి కొంతసేపటికి శరీరం మామూలు స్థితికి వస్తుంది.
 దీని ద్వారా అంతస్రావ్య వ్యవస్థ, నాడీ వ్యవస్థ సమన్వయంగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు.
10. 'హార్మోన్లు నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన పనిని నిర్వహించడానికి విడుదలవుతాయి'. దీన్ని వివరించండి.
జ: అడ్రినలిన్ హార్మోన్ ఉద్రేకాలను కలగజేస్తుంది. ఇది పోరాట, పలాయన సమయాల్లో విడుదలవుతుంది. రక్తంలో దీని స్థాయి పెరిగినప్పుడు హృదయ స్పందన రేటు, చక్కెరస్థాయి పెరుగుతాయి. అందువల్ల మనిషికి కోపం, ఉద్రేకం, పోరాట లక్షణాలు పెరుగుతాయి. దీని స్థాయి తగ్గినప్పుడు జీవక్రియా రేటు తగ్గి మనిషి సాధారణ స్థితికి వస్తాడు.

ఉదా:  కుక్క తరుముతున్నప్పుడు ఆ ప్రదేశం నుంచి పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం.
          పామును చూసినప్పుడు అక్కడి నుంచి వేగంగా పారిపోవడం లేదా పాము నుంచి రక్షణ కోసం దూరంగా వెళ్లడం లేదా పామును చూసి భయపడటం తద్వారా హృదయస్పందన రేటు పెరగడం, చెమటలు పట్టడం లాంటివి జరగుతుంటాయి.

2 మార్కుల ప్రశ్నలు

1. మొక్కల్లో కాంతి అనువర్తనం ఏవిధంగా జరుగుతుంది?
జ: ¤ మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని 'కాంతి అనువర్తనం' అంటారు.
¤ మొక్కల్లో కాండం కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది.
¤ కాంతిసోకే కాండభాగంపైకి ఎక్కువ ఆక్సిన్లు చేరడం వల్ల ఆ భాగంలో కణాలు వేగంగా పెరుగుతాయి. దాని వ్యతిరేక భాగంలో కణాలు నెమ్మదిగా పెరగడం వల్ల కాండం వంగుతుంది.
2. సినాప్స్ అంటే ఏమిటి? సమాచార ప్రసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జ: ¤ ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరొక నాడీకణంలోని డెండ్రైట్లతో లేదా, ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని 'సినాప్స్' లేదా 'నాడీకణ సంధి' అంటారు.
నాడీకణ సంధి ఒక నాడీకణం నుంచి మరొక నాడీకణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం.
¤ ఈ నాడీకణ సంధి వద్ద రెండు నాడీకణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకున్నా రసాయనాల ద్వారా లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా లేదా రెండింటి ద్వారా సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి ప్రసారమవుతుంది.
¤ నాడీకణ సంధులు మెదడు, వెన్నుపాము, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.
¤ తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాము నుంచి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి.
3. మొక్కల వేర్లు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయని చూపే ఒక ప్రయోగాన్ని వివరించండి.
జ: ¤ గాజు జాడీని తీసుకొని మట్టితో నింపాలి.
¤ ఆ జాడీ గోడ అంచు వెంబడి ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటాలి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం, కాండం, వేర్ల పెరుగుదలను చూడగలం.
¤ 4 నుంచి 5 రోజుల్లో విత్తనం మొలకెత్తడం గమనిస్తాం.
¤ జాడీని సూర్యరశ్మిలో ఉంచి పరిశీలిస్తే కాండం కాంతి దిశలో, వేర్లు దానికి వ్యతిరేక దిశలో పెరగడం గమనిస్తాం.

మొక్కకు 4 నుంచి 5 ఆకులు వచ్చాక దీన్ని అడ్డంగా, క్షితిజ సమాంతరంగా ఉంచి వారం రోజుల పాటు కాండం, వేర్ల పెరుగుదలను పరిశీలిస్తే కాండం కాంతి దిశలో, వేరు కాంతికి వ్యతిరేక దిశలో పెరగడాన్ని గమనించవచ్చు.
4. శరీరంలోని హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే మార్పులకు ఉదాహరణలివ్వండి.
జ: ¤ శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే మార్పులను ముఖ్యంగా అడ్రినలిన్ హార్మోన్ స్రవించినప్పుడు స్పష్టంగా గమనించవచ్చు.
¤ సాధారణంగా కోపం, ఉద్వేగం, భయం లాంటివి కలిగినప్పుడు అడ్రినలిన్ గ్రంథి అడ్రినలిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంది.
¤ భయం వల్ల హృదయ స్పందన పెరుగుతుంది. శ్వాసక్రియా రేటు, రక్తపీడనం కూడా పెరుగుతాయి. మన శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.
¤ కొన్ని శారీరక మార్పులను మనం గమనించలేం. అలాంటి మార్పులు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. కంటిపాప విస్తరిస్తుంది. చర్మం చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. మూత్ర, మలవిసర్జన కూడా జరగవచ్చు.
¤ సురక్షిత ప్రాంతానికి చేరిన తర్వాతనే మనం సాధారణ స్థితికి వస్తాం. అప్పుడు అడ్రినలిన్ స్థాయి తగ్గిపోతుంది.

5. నాడీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి అనువుగా ఉందా? విశ్లేషించండి.
జ: ¤ నాడీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి ఎంతో అనువుగా ఉంటుంది. శరీర కణజాలంలో నాడీకణం పొడవైన కణం కావడం వల్ల నాడీ ప్రచోదనాలను ఎక్కువ దూరం రవాణా చేయవచ్చు.
¤ కణదేహంపై శాఖల్లాంటి నిర్మాణాలైన డెండ్రైట్లు మరోకణంతో సంబంధం కలిగి వల లాంటి నిర్మాణాలుగా మారతాయి. దీనివల్ల ప్రచోదనాలు అన్ని భాగాలకు రవాణా అవుతాయి.
¤ విద్యుత్ ప్రచోదనాలు కణదేహం, ఆక్సాన్‌ల ద్వారా ప్రయాణిస్తాయి.
¤ ఆక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు రసాయనాలను విడుదల చేస్తాయి.
¤ రసాయనాలు నాడీకణ సంధిని దాటి తర్వాత నాడీకణాన్ని చేరతాయి. ఈ విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక నాడీకణాలను దాటతాయి.
¤ చివరగా నాడీకణం నుంచి విడుదలైన ప్రచోదనం కండరాలను చేరడం ద్వారా ప్రతిస్పందన మొదలవుతుంది.
6. 'చేతిలో ఉండే నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కంటే చిన్నది'. వివరించండి.
జ: ¤ నాడీకణంలోని పొడవైన నిర్మాణాన్ని ఆక్సాన్ అంటారు. కొన్ని ఆక్సాన్లు కలిసి నాడులను ఏర్పరుస్తాయి.
¤ ఇవి చాలా పొడవుగా విస్తరించి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి.
¤ కాలివేళ్ల చివరిభాగం నుంచి ఉద్దీపనలను, మెదడుకు వార్తలను చేరవేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి సహజంగా ఎంతో పొడవైన నాడీగా అనేక ఆక్సాన్లతో కలసి ఏర్పడతాయి.
వీటితో పోల్చినప్పుడు చేతుల నుంచి మెదడుకు ప్రయాణించే నాడులు చిన్నవిగా ఉంటాయి.
7. అనేక ప్రచోదనాలకు సెకనులో పదో వంతులోనే ప్రతీకార చర్యలను చూపించే నియంత్రిత వ్యవస్థ గురించి తెలపండి.
జ: మన శరీరం ప్రచోదనాలకు సెకనులో  పదోవంతులోనే  ప్రతిచర్యలను  చూపగలగడం  ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.
* గ్రాహకాలు, ఉద్దీపనలకు ప్రచోదనాలను ఉత్పత్తి చేయడం, అవి మెదడును చేరి విశ్లేషించడం, మెదడు ఆజ్ఞలు తిరిగి నిర్వాహక అంగాలు నిర్వహించడం లాంటి పనులన్నీ సెకన్లలో జరగడం అద్భుతంగా అనిపిస్తుంది.
* నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
* ఉదాహరణకు ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినపుడు అనేక ప్రతీకార చర్యా చాపాలు ఒకేసారి పనిచేసి, కండరాలు వేగంగా కాలిని వెనక్కు తీసుకునేటట్లు చేస్తాయి.
* ఈ నిర్ణయం సెకనులో పదోవంతు కాలంలోనే జరిగిపోతుంది. అంత వేగంగా మన మెదడు ప్రతిస్పందించకుంటే శరీరం అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
* మన మెదడు చురుకుదనం, పనితీరు, విశ్లేషణావేగం అద్భుతంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ సమర్థమైన పనితీరుకు నిదర్శనం.
8. కిందివాటిలో నియంత్రిత, ప్రతీకార చర్య, అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి.
ఎ) కళ్లు ఆర్పడం
బి) టేబుల్ తుడవడం
సి) కీ బోర్డు వాయించడం
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరడం
ఇ) విపరీతమైన శబ్దం విన్నప్పుడు చెవులు మూసుకోవడం
జ: ఎ) కళ్లు ఆర్పడం: ఇది మన ప్రమేయం లేకుండా నిరంతరంగా జరిగే స్వతంత్ర ప్రక్రియ. ఇది ఒక ప్రతీకార చర్య.
బి) టేబుల్ తుడవడం: మన ఆదీనంలో జరిగే ఒక నియంత్రిత చర్య.
సి) కీ బోర్డు వాయించడం: మెదడు ఆదేశాలను అనుసరించి జరిగే నియంత్రిత చర్య లేదా అభ్యసిత ప్రతీకార చర్య.
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరడం: ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్య.
ఇ) విపరీతమైన శబ్దం విన్నప్పుడు చెవులు మూసుకోవడం: ఇది ఒక ప్రతీకార చర్య.
9. ఒక కుండీలోని మొక్కను మీ గది కిటికీ పక్కన ఉంచితే ఏం జరుగుతుంది?
జ: * కుండీలోని మొక్కను గదిలో కిటికీ పక్క ఉంచితే మొక్క కాండం కాంతి ప్రసరించే దిశవైపు వంగుతుంది లేదా పెరుగుతుంది.
* ఇలా మొక్క కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని 'కాంతి అనువర్తనం' అంటారు.
* కాండం అగ్రభాగంలో ఆక్సిన్లు ఏర్పడటం వల్ల మొక్కలు కాంతి అనువర్తిత చలనాన్ని చూపిస్తాయి కాబట్టి కుండీలో మొక్క కిటికీ నుంచి బయటకు కాంతివైపు పెరుగుతుంది.
10. మన శరీరంలోని చర్యలన్నింటినీ మెదడు నియంత్రిస్తే ఏం జరుగుతుంది?
జ: * మెదడు నియంత్రించే ప్రతిచర్యల్లో ప్రచోదనం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల హఠాత్తుగా జరిగే అపాయాల నుంచి మెదడు శరీరానికి రక్షణ కల్పించలేదు.
* అకస్మాత్తుగా జరిగే సంఘటనలను మెదడు గుర్తించి ప్రతిస్పందించేందుకు సమయం పడుతుంది. దాంతో ప్రమాదాలు జరుగుతాయి.
* మన శరీరంలోని అసంకల్పిత ప్రతీకార చర్యావ్యవస్థ మెదడుతో ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. ఇది హఠాత్తుగా జరిగే ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అన్ని క్రియలను మెదడు నియంత్రించలేదు.
11. డాక్టర్‌ను కలిసినప్పుడు క్లోమగ్రంథి గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జ: * క్లోమగ్రంథి మన శరీరంలో ఎక్కడ ఉంది?
     * క్లోమగ్రంథిని మిశ్రమగ్రంథి అని ఎందుకు అంటారు?
     * మన శరీరంలో క్లోమం చేసే విధులను వివరించండి.
     * క్లోమంలో ఉండే వివిధ భాగాలు ఏవి?
     * క్లోమగ్రంథి నాళ, వినాళ గ్రంథిగా ఎలా పనిచేస్తుంది?
     * క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏవి?
     *  జీర్ణ వ్యవస్థలో క్లోమగ్రంథి ఎంత వరకు ఉపయోగపడుతుంది?
     *  క్లోమం నిరంతరం ఎలా పనిచేస్తుంది?
*  క్లోమగ్రంథి పాడైతే మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు వస్తుంది?
12. కుండీలో ఉన్న మొక్క మూలంలో మట్టి పడకుండా ఏర్పాటుచేసి దాన్ని తలకిందులుగా వేలాడదీయండి. మీ పరిశీలనల ద్వారా ఫోటోట్రాపిజమ్‌ను వివరించండి

జ: ప్రయోగం:
* కుండీలో పెరుగుతున్న మొక్కను దాని మూలంలో మట్టి పడకుండా గట్టిగా తాళ్ల సహాయంతో కట్టాలి.
* దీన్ని ఆరుబయట తలకిందులుగా వేలాడదీయాలి.
* రెండు వారాల తర్వాత మొక్కలోని మార్పులను గమనించాలి.
పరిశీలనలు:
* వేలాడుతున్న మొక్క కాండం నేరుగా కిందికి పెరగకుండా వంపు తిరిగి సూర్యకాంతి వైపునకు పెరగడం గమనించవచ్చు.
* వేర్లు సూర్యకాంతికి వ్యతిరేక దిశలో, గురుత్వాకర్షణ దిశలో వంపు తిరిగి ఉండటం చూడవచ్చు.
           దీన్నిబట్టి మొక్కల్లో కాండం కాంతికి అనుకూలంగా ప్రతిస్పందిస్తుందని, వేర్లు గురుత్వానువర్తనం కలిగి ఉంటాయని నిర్ధారించవచ్చు.
13. మీ శరీరంలోని వివిధ భాగాలను పక్షి ఈకతో తాకండి. శరీరంలో అత్యంత సున్నితమైన భాగాన్ని గుర్తించండి. నిద్రించే సమయంలో కూడా ఇదే విధంగా ఉంటుందా?
జ: కోడి ఈకతో శరీరంలోని వివిధ భాగాలను తాకినప్పుడు
    * శరీర ఇతర భాగాల కంటే ముఖం ఎక్కువ సున్నితమైంది.
    * ముక్కు కొన, చెవి లోపలి భాగాలు, పెదవులు అధిక స్పర్శజ్ఞానం కలిగి ఉన్నాయి.
    * నిద్రించేటప్పుడు కూడా ఫలితాలు ఇదేవిధంగా ఉన్నాయి.
14. వెన్నుపాము నియంత్రించే చర్యల గురించి మీ పాఠశాల గ్రంథాలయం నుంచి వివరాలు సేకరించండి?
జ: * వెన్నుపాము శరీర భాగాల నుంచి వచ్చే సమాచారాన్ని మెదడుకు పంపుతుంది.
* మెదడు ఇచ్చే ఆదేశాలు వెన్నుపాము ద్వారానే నాడులకు చేరతాయి.
* అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
* నాడీ ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థ నుంచి క్రియాస్థలానికి, అక్కడి నుంచి కేంద్ర నాడీవ్యవస్థకు వార్తలను అందిస్తుంది.
* అసంకల్పిత ప్రతీకార చర్యలు వెన్నుపాము ఆధీనంలో ఉండటంవల్ల ప్రతిచర్యామార్గం ప్రయాణం తగ్గి, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
ఉదా: * వేడిగా ఉన్న వస్తువులను తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం.
          * కళ్ల మీద ఎక్కువ కాంతి పడినప్పుడు కళ్లు మూసుకోవడం.
          * ముక్కులోకి ధూళి ప్రవేశిస్తే తుమ్మడం.
15. మీ పాఠశాల గ్రంథాలయం నుంచి లేదా అంతర్జాలం నుంచి కపాలనాడులు, వెన్ననాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి.
జ: కపాలనాడులు: మానవ శరీరంలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. ఇవి మెదడులోని వివిధ భాగాల నుంచి ఉద్భవిస్తాయి. వీటిలో కొన్ని జ్ఞాననాడులుగా, చాలకనాడులుగా, మిశ్రమనాడులుగా పనిచేస్తాయి.

 నాడులు నేత్రపటలం, చెవి, ముక్కు, ముఖం, మెడ, గ్రసని, నాలుక, కంటి కండరాలు, కండరాలు లాంటి భాగాల్లో వ్యాపించి ఉంటాయి. 12 జతల కపాలనాడుల్లో వేగస్ నాడి (పదోజత కపాలనాడి) ముఖ్యమైంది.
వెన్నునాడులు: వెన్నుపాము నుంచి ఏర్పడే నాడులను వెన్నునాడులు అంటారు. మానవ శరీరంలో 31 జతల వెన్నునాడులు ఉంటాయి. వెన్నునాడులన్నీ మిశ్రమనాడులు. వెన్నునాడిలో జ్ఞాననాడీ తంతువు వెన్నుపాము పృష్ఠశృంగం నుంచి, చాలకనాడీ తంతువు వెన్నుపాము ఉదర శృంగం నుంచి ఉద్భవిస్తాయి. ఇవి కండరాల కదలికకు అవసరమైన సమాచారాన్ని ప్రసారం చేస్తాయి.
16. కింది వాక్యాలను చదవండి. వినాళ గ్రంథుల పనులతో పోల్చండి.
ఎ) జీవులు 'ఫెరమోన్లు' అనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి.
బి) వినాళ గ్రంథుల నుంచి స్రావాలు వెలువడటానికి ఫెరమోన్లు సంకేతాలుగా పనిచేస్తాయి.
సి) కొన్ని జాతుల్లో ఇవి రసాయన వార్తాహరులు.
డి) తేనెటీగలు ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమోన్లను ఉపయోగిస్తారు.
జ: ఎ) జీవులు ఫెరమోన్లు అనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి:
           వివిధ రకాల కీటకాలు రకరకాల ఫెరమోన్లను విడుదల చేస్తాయి. ఉన్నతస్థాయి జీవుల్లో కొన్నిరకాల వినాళగ్రంథులు సంపర్కం కోసం హార్మోన్లను స్రవించినట్లే, ఆడ కీటకాలు లైంగిక సంపర్కానికి సిద్ధపడినప్పుడు గాలిలోకి ఫెరమోన్లను విడుదల చేస్తాయి.
బి) వినాళగ్రంథుల నుంచి స్రావాలు వెలువడటానికి ఫెరమోన్లు సంకేతాలుగా పనిచేస్తాయి:
         జంతువుల్లో ముష్కాలు, బీజకోశాలు లైంగిక హార్మోన్లను స్రవించినట్లే, కీటకాల్లో ఫెరమోన్లు వాటి సంపర్కానికి అవసరమైన హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడతాయి.
సి) కొన్ని జాతుల్లో ఫెరమోన్లు రసాయన వార్తాహరులు:
           ఆడ కీటకాలు విడుదల చేసే ఫెరమోన్లు ఎంతోదూరంలో ఉన్న మగ కీటకాలకు సమాచారాన్ని అందించే వార్తాహరులుగా పనిచేస్తాయి. ఉన్నత జీవుల శరీరంలో స్రవించే హార్మోన్లు కూడా అనేక సందర్భాల్లో వార్తాహరులుగా సహాయపడతాయి.
డి) తేనెటీగల ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమోన్లను ఉపయోగిస్తారు:
          జంతువుల్లో పీయూషగ్రంథి స్రవించే హార్మోన్ల సాయంతో పెరుగుదల సాధ్యమై పరిపక్వత వచ్చి లైంగిక సంపర్కానికి ఆకర్షించబడతాయి. అలాగే ఫెరమోన్ల సాయంతో తేనెటీగలను ఆకర్షించేలా చేస్తారు.
17. నాడీకణం నమూనాను సరైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయండి.
జ: కావాల్సిన సామగ్రి:
          చిన్న గాజు, మట్టిగాజు ముక్కలు, నూలు దారం ముక్కలు, పొడవైన దారం, నీలిరంగు చెంకీలు, గుండ్రని గింజలు, చార్టు, జిగురు, స్ట్రా.
చేసేవిధానం:
       ¤ మొదట చార్టుపై నాడీకణం బొమ్మ గీయాలి.
       ¤ కణదేహంపై మట్టిగాజు ముక్కలను అతికించాలి.
       ¤ కణదేహంపై నుంచి కొన్ని గాజు ముక్కలను డెండ్రైట్లుగా అతికించాలి.
       ¤  పొడవైన స్ట్రా లేదా నూలుదారాన్ని ఆక్సాన్‌గా అతికించాలి.
       ¤ నీలిరంగు చెంకీలు లేదా రంగులను జీవపదార్థంగా కణదేహంలో నింపాలి.
       ¤ నిస్సల్ కణికలుగా గుండ్రటి గింజలను అతికించాలి.
       ¤నాడీ అంత్యాలుగా దారపు ముక్కల్ని అతికించాలి.
       ¤ బాగా ఆరిన తర్వాత ప్రదర్శనలో పెట్టాలి.
18. నులితీగలు ఆధారానికి చుట్టుకుని తీగ పైకి పాకుతాయి. ఈ దృగ్విషయం నుంచి మనం ఏమి గమనిస్తాం?
జ: ¤ దోస, కాకర లాంటి మొక్కల్లో నులితీగల చలనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
     ¤ ఈ మొక్కల్లో కాండం బలహీనంగా ఉండటం వల్ల అవి పైకి ఎగబాకలేవు.
     ¤ అవి పైకి ఎగబాకడానికి నులితీగలు తోడ్పడుతాయి.
     ¤ నులితీగలు ఆధారం దొరికినప్పుడు వేగంగా పెరిగి చుట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది.
¤ మెత్తగా ఉండే నులితీగలు కాండం భారం మోయడం కూడా అద్భుతంగా ఉంటుంది. వాటిని లాగినప్పుడు తెగిపోతాయి తప్ప ఊడిరావు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
¤ మొక్క నిలువుగా పెరగడానికి దోహదం చేసే ఈ నులితీగలు స్పర్శానువర్తనాన్ని ప్రదర్శిస్తాయి.
19. మెదడు ఏ విధంగా రక్షణ పొందుతుంది?
జ: ¤ ఇతర జంతువులతో పోల్చినప్పుడు మానవ మెదడు చాలా పెద్దది. ఇది ఎముకలతో తయారుచేసిన గట్టి పెట్టె లాంటి నిర్మాణంలో భద్రపరిచి ఉంటుంది. ఈ నిర్మాణాన్ని 'కపాలం' అంటారు.
¤ మెదడును ఆవరించి 3 త్వచాలు ఉంటాయి. వీటిని 'మెనెంజస్' అంటారు. ఈ త్వచాలు మెదడుతో పాటుగా వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి.
¤ వెలుపలి, మధ్యత్వచాల మధ్య 'మస్తిష్క మేరుద్రవం' ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుంచి కాపాడి రక్షణనిస్తుంది.
20. తరగతిగదిలో మీ తోటి విద్యార్థి చేసే పనులను 45 నిముషాలు గమనించండి. ఆ పనుల్లో నియంత్రిత, అనియంత్రిత చర్యలను గుర్తించండి.
జ: నియంత్రిత చర్యలు: పాఠం చదవడం, పాట పాడటం, నిలబడటం, కూర్చోవడం, కదలడం, చప్పట్లు కొట్టడం, రాయడం, మాట్లాడటం మొదలైనవి.
అనియంత్రిత చర్యలు: కళ్లు ఆర్పడం, ఆవలించడం, తుమ్మడం, శ్వాస పీల్చడం, వినడం, మింగడం.
21. ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య తేడాలను రాయండి?
జ:
ఉద్దీపన

ప్రతిస్పందన

1.జీవుల్లో ప్రతిస్పందనను కలిగించే కారకాలను ఉద్దీపనాలు అంటారు.

2. ఉద్దీపన ప్రతిస్పందన కారకం.

3. ఉద్దీపనలన్నీ ప్రతిస్పందనను కలిగిస్తాయి.

4. ఉదా: గిచ్చడం

1. ఉద్దీపనాలకు జీవులు చూపించే ప్రతిచర్యలను ప్రతిస్పందనలు అంటారు.

2. ఉద్దీపన ఫలితం ప్రతిస్పందన.

3. అన్ని ఉద్దీపనలకు ప్రతిస్పందన ఒకే విధంగా ఉండదు.

4. ఉదా: కోప్పడటం, పక్కకు జరగడం, తిరిగి గిచ్చడం


22. అభివాహక, అపవాహక నాడుల మధ్య తేడాలేమిటి?
అభివాహక నాడులు

అపవాహక నాడులు

3. ఇవి జ్ఞానేంద్రియాల నుంచి ప్రారంభం అవుతాయి.

4. కేంద్ర నాడీ వ్యవస్థకు చేరతాయి.

3.ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతాయి.

4. నిర్వాహక అంగాలకు చేరతాయి.


23. కేంద్రీయ నాడీవ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థల మధ్య తేడాలేమిటి?
జ:
కేంద్రీయ నాడీ వ్యవస్థ

పరిధీయ నాడీ వ్యవస్థ

1. మెదడు, వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు.

2. ఇవి శరీరంలో మధ్య ప్రాంతంలో అమరి ఉంటాయి.

3. ఇవి నాడీ వ్యవస్థలో కీలకమైనవి, ప్రధాన పాత్ర పోషిస్తాయి.

4. సమాచార విశ్లేషణకు, ప్రతిచర్యల ఆదేశాలకు ప్రాధాన్యతనిస్తాయి.

1. కపాల నాడులు, వెన్ను నాడులను కలిపి పరిధీయ నాడీ వ్యవస్థ అంటారు.

2. ఇవి శరీర మధ్య ప్రాంతం నుంచి పక్కలకు విస్తరిస్తాయి.

3. కేంద్రీయ నాడీ వ్యవస్థకు అనుబంధంగా, సహాయకంగా పనిచేస్తాయి.

4. సమాచార రవాణాలో ప్రధానంగా పాల్గొంటాయి.
24. గ్రాహకం, ప్రభావకాల మధ్య తేడాలేమిటి?
జ:
గ్రాహకం

ప్రభావకం

1. శరీరం లోపల, బయట జరిగే మార్పులను గ్రహించే కణాలను గ్రాహకాలు అంటారు.

2. ఇవి మార్పులను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.

3. జ్ఞాననాడులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.

4. జ్ఞానేంద్రియాలు, గ్రాహక కణాలతో ఉంటాయి.

5. ఉదా: కన్ను, చెవి

1. మెదడు పంపిన ఆదేశాలను నిర్వహించే అవయవాలు లేదా కణజాలాన్ని ప్రభావకం లేదా నిర్వాహక కణజాలం అంటారు.

2. మెదడు నుంచి వచ్చిన ఆదేశాలను అమలు పరుస్తుంది.

3. చాలక నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.

4. శరీరంలోని కండర కణజాలం, అవయవాలు ప్రభావకాలుగా వ్యవహరిస్తాయి.

5. ఉదా: కాళ్లు, చేతులు
25. మీరు చెత్త పోగు చేసే ప్రదేశం నుంచి వెళ్తున్నారనుకోండి. మీరు వెంటనే ముక్కు మూసుకుంటారు. ఈ క్రియలో సంఘటనలను 1 నుంచి 5 వరకు అవి జరిగే క్రమంలో అమర్చండి.
ఎ) ఆక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు, రసాయనాలను విడుదల చేస్తాయి.
బి) డెండ్రైట్ కణాలపై చేరిన ఉద్దీపనాలు, రసాయనిక చర్యలు విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.
సి) డెండ్రైట్‌లు విద్యుత్ ప్రచోదనాలను కణదేహం, ఆక్సాన్ ద్వారా పంపిస్తాయి.
డి) రసాయనాలు సైనాప్స్‌ను దాటిన తర్వాత న్యూరాన్‌కు చేరతాయి. అదేవిధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక న్యూరాన్లను దాటతాయి.
ఈ) చివరగా న్యూరాన్ నుంచి విడుదలైన ప్రచోదనం గ్రంథి వైపు చేరడం వల్ల చెడు వాసనను గుర్తించడానికి, కండర కణాలు ముక్కును మూసుకోవడానికి ఉపయోగపడతాయి.
జ: పై వాక్యాలను 'బి, సి, ఎ, డి, ఈ' క్రమంలో అమర్చాలి.
26. నిత్యజీవితంలో 'ఫైటో హార్మోన్ల' ప్రయోజనం ఏమిటి?
జ: ¤ ఫలాలు పక్వానికి రావడానికి ఇథిలీన్
     ¤ ఆకులు తాజాగా ఉండేందుకు సైటోకైనిన్
     ¤ వేర్ల ఉత్పత్తికి ఆక్సిన్లు
     ¤ ఆకులు, ఫలాలు పెరిగేందుకు జిబ్బరెల్లిన్లు
     ¤ విత్తన సుప్తావస్థ పొడిగించడానికి అబ్‌సైసిక్ ఆమ్లాన్ని వాడతారు.

27. మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గాలన్ అభిప్రాయానికి రావడానికి కారణం ఏమిటి?
జ: మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు. కానీ అతడి చేతి కదలికలు సాధారణంగానే ఉన్నాయి. దీన్నిబట్టి మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని, వాటిలో ఒకటి జ్ఞానానికి, రెండోది చర్యకు సంబంధించిందని గాలన్ నిర్ణయానికి వచ్చాడు. ఈ రోగి విషయంలో జ్ఞాననాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు సాధారణంగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
28. వెన్నుపాము నిర్వహించే విధులేవి?
జ: ¤ వెన్నుపాము వార్తలను మెదడుకు చేరవేస్తుంది.
     ¤ మెదడు నుంచి ఆదేశాలను నిర్వాహక అంగాలకు చేరవేస్తుంది.
     ¤ అసంకల్పిత ప్రతీకారచర్యలో కీలకపాత్ర వహిస్తుంది.
29. కోపం ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుంది?
జ:  రక్తంలో అడ్రినలిన్ ఎక్కువగా విడుదలైనప్పుడు, కోపం ఎక్కువవుతుంది. ఈ స్థాయి కొనసాగితే జీవక్రియలపై ప్రభావం ఉంటుంది. గుండె పనితీరు, కండర వ్యవస్థ దెబ్బతింటాయి. కాబట్టి శరీరంలో పునశ్చరణ యాంత్రికంగా పనిచేసి అడ్రినలిన్ స్థాయిని సాధారణ స్థితికి తెస్తుంది.
30. అడ్రినలిన్ హార్మోన్‌ను ఉద్వేగాలు కలగజేసే హార్మోన్ లేదా పోరాట పలాయన హార్మోన్ అని ఎందుకు అంటారు?
జ: ¤ రక్తంలో అడ్రినలిన్ స్రావం పెరిగినప్పుడు హృదయ స్పందన రేటు, చక్కెరస్థాయి పెరుగుతాయి.

¤ అందువల్ల జీవికి కోపం, ఉద్రేకం, పోరాట లక్షణాలు పెరుగుతాయి.
     ¤ దీనిస్థాయి తగ్గినప్పుడు జీవక్రియారేటు తగ్గుతుంది.
     ¤ మానసిక ఉద్వేగాలను కలగజేయడం, పోరాటం నుంచి పలాయనం చెందడం లాంటివి ఈ హార్మోన్ విడుదల చేసే స్రావం స్థాయిని బట్టి హెచ్చుతగ్గులుంటాయి.
     ¤ అందుకే అడ్రినలిన్ హార్మోన్‌ను ఉద్వేగాలు కలుగజేసే హార్మోన్ లేదా పోరాట పలాయన హార్మోన్ అని అంటారు.
31. ఆక్సాన్, డెండ్రైట్ల మధ్య భేదాలను రాయండి.
జ:
ఆక్సాన్

డెండ్రైట్లు

1. ప్రతి నాడీకణానికి ఒకే ఆక్సాన్ ఉంటుంది.

2. ఇది పొడవుగా ఉంటుంది.

3. ఇందులో శాఖలు ఉండవు.

4. కొన్ని ఆక్సాన్లు మైలిన్ తొడుగుతో  ఉంటాయి.

1. నాడీకణం నుంచి ఏర్పడే డెండ్రైట్ల సంఖ్య ఒకటి నుంచి అనేక వేలు ఉంటాయి.

2. డెండ్రైట్లు పొట్టిగా ఉంటాయి.

3. ఇందులో శాఖలు ఉంటాయి.

4. డెండ్రైట్‌లలో మైలీన్ తొడుగు ఉండదు.

ఒక మార్కు ప్రశ్నలు

1. ఉద్దీపనలు లేదా ప్రచోదనాలు అంటే ఏమిటి?
జ: జీవుల బాహ్య లేదా అంతర పరిసరాల్లోని నిర్దిష్ట మార్పులను 'ఉద్దీపనలు' అంటారు.
                                               లేదా
     జీవుల్లో ప్రతిస్పందనను కలిగించే మార్పులను ఉద్దీపనలు లేదా ప్రచోదనాలు అంటారు.
2. ప్రతిస్పందనలు అంటే ఏమిటి?
జ: ఉద్దీపనలకు జీవులు చూపించే ప్రతిచర్యలను 'ప్రతిస్పందనలు' అంటారు.
3. నాడీకణంలోని ప్రధాన భాగాలేవి?
జ: నాడీకణంలోని ప్రధాన భాగాలు కణదేహం, తంత్రికాక్షం (ఆక్సాన్లు), డెండ్రైట్లు.
4. నాడీకణ తంత్రికాక్షం దేంతో కప్పి ఉంటుంది?
జ: నాడీకణ తంత్రికాక్షం మయలిన్ తొడుగుతో కప్పి ఉంటుంది.
5. నాడీకణదేహం నుంచి బయలుదేరిన చిన్న నిర్మాణాలను ఏమంటారు?
జ: నాడీకణదేహం నుంచి బయలుదేరిన చిన్న నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు.
6. నాడీకణదేహం నుంచి బయలుదేరిన పొడవైన నిర్మాణాన్ని ఏమంటారు?
జ: నాడీకణ దేహం నుంచి బయలుదేరిన పొడవైన నిర్మాణాన్ని ఆక్సాన్ లేదా తంత్రికాక్షం అంటారు.

7. మయలిన్ తొడుగులోని ఖాళీలను ఏమంటారు?
జ: మలియన్ తొడుగులోని ఖాళీలను రాన్వియర్ కణుపులు అంటారు.
8. మయలిన్ తొడుగు ఉన్న నాడీకణాలను ఏమంటారు?
జ: మయలిన్ తొడుగు ఉన్న నాడీకణాలను మయలిన్ సహిత నాడీకణాలు అంటారు.
9. మయలిన్ రహిత నాడీకణాలు అంటే ఏమిటి?
జ: మయలిన్ తొడుగు లేని నాడీకణాలను మయలిన్ రహిత నాడీకణాలు అంటారు.
10. ఆక్సాన్, డెండ్రైట్‌లను ఎలా గుర్తుపడతారు?
జ: ఆక్సాన్ (తంత్రికాక్షం) చాలా పొడువుగా ఉండి నాడీకణానికి ఒకటి మాత్రమే ఉంటుంది. డెండ్రైట్లు నాడీకణానికి ఎక్కువ సంఖ్యలో చిన్నగా, పొట్టిగా ఉండే నిర్మాణాలు.
11. మయలిన్ తొడుగు అంటే ఏమిటి? ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది?
జ: ఆక్సాన్‌ను ఆవరించి, కొవ్వు పదార్థాలతో కూడి ఉన్న తొడుగును మయలిన్ తొడుగు అంటారు. ఇది కొన్ని నాడీకణాల ఆక్సాన్‌లలో కనిపిస్తుంది.
12. పొడవును ఆధారంగా చేసుకుని మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్, డెండ్రైట్లను గుర్తుపట్టగలమా?
జ: పొడవును ఆధారం చేసుకుని మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్లు, డెండ్రైట్లను గుర్తుపట్టలేం. వాటిని కప్పుతూ ఉండే మయలిన్ తొడుగు ఆధారంగా గుర్తుపట్టవచ్చు. మెదడు, వెన్నుపాముల్లోని ఆక్సాన్ల చుట్టూ మయలిన్ తొడుగు ఉండదు.
13. ఒక ఆక్సాన్‌ను మరో ఆక్సాన్ నుంచి వేరు చేసేది ఏది?
జ: మయలిన్ తొడుగు ఒక ఆక్సాన్‌ను మరో ఆక్సాన్ నుంచి వేరు చేస్తుంది.
14. నాడీకణంలో కణదేహం ఎక్కడ విస్తరించి ఉంటుంది?
జ: నాడీకణదేహం మెదడులో గానీ, వెన్నుపాములో గానీ లేదా వెన్నుపాము నుంచి బయలుదేరే పృష్ఠ, ఉదర నాడీ సంధుల్లో ఉంటుంది.
15. నాడీకణంలో డెండ్రైట్లు, ఆక్సాన్ భాగం ఎక్కడ విస్తరించి ఉంటుంది?
జ: నాడీకణంలో డెండ్రైట్లు, ఆక్సాన్ భాగం కణజాలాల్లోకి విస్తరించి ఉంటుంది.
16. నాడీవ్యవస్థ మౌలిక ప్రమాణం ఏది?
జ: నాడీవ్యవస్థ మౌలిక ప్రమాణం నాడీకణం.
17. మానవ నాడీవ్యవస్థలో సుమారు ఎన్ని నాడీకణాలు ఉంటాయి?
జ: మానవ నాడీవ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీకణాలు ఉంటాయి.
18. నాడీకణ సంధి (సైనాప్స్) అంటే ఏమిటి?
జ: ఒక నాడీకణంలోని డెండ్రైట్లు మరో కణంలోని డెండ్రైట్లతో లేదా ఆక్సాన్‌తో కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి అంటారు.
19. నాడీకణ సంధి పని ఏమిటి?
జ: నాడీకణ సంధి ఒక నాడీకణం నుంచి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేస్తుంది.
20. నాడీకణ సంధులు ఎక్కడ ఉంటాయి?
జ: నాడీకణ సంధులు మెదడు, వెన్నుపాముపై, వెన్నుపాము చుట్టూ ఉంటాయి.
21. తంత్రికాక్షం (ఆక్సాన్) చేసే పని ఏమిటి?
జ: తంత్రికాక్షం(ఆక్సాన్) మెదడు, వెన్నుపాముల   నుంచి   శరీరంలోని    వివిధ    భాగాలకు   ప్రచోదనాలను తీసుకెళతాయి.
22. నాడీకణ సంధి వద్ద రెండు నాడీకణాల మధ్య సమాచారం వేటి ద్వారా ప్రసారమవుతుంది?
                                                 లేదా
      సైనాప్స్‌లో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది?
జ: నాడీకణ సంధి (సైనాప్స్) వద్ద రెండు నాడీకణాల మధ్య సమాచారం రసాయనాలు లేదా విద్యుత్ ప్రచోదనాల ద్వారా ప్రసారమవుతుంది.
23. నాడీవ్యవస్థ మీద మొదట కీలక పరిశోధనలు చేసిన గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త ఎవరు?
జ: గ్రీకు శాస్త్రవేత్త గాలన్ మొదటగా నాడీ వ్యవస్థపై కీలక పరిశోధనలు చేశారు.
24. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
జ: సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను మూడు రకాలుగా విభజించవచ్చు.
25. అభివాహి నాడులు అంటే ఏమిటి?
జ: దేహంలోని వివిధ భాగాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడీవ్యవస్థకు తీసుకెళ్లే నాడులను అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు అంటారు.

26. అపవాహి నాడులు అంటే ఏమిటి?
జ: కేంద్రనాడీవ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు తీసుకెళ్లే నాడులను అపవాహి నాడులు లేదా చాలక నాడులు అంటారు.
27. సహసంబంధ నాడులు అంటే ఏమిటి?
జ: అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు.
28. ప్రతీకార చర్యలు అంటే ఏమిటి?
జ: కొన్ని సందర్భాల్లో మన శరీరం మన నియంత్రణ లేని ప్రతిక్రియలను చూపాల్సిన అవసరముంటుంది. ఈ విధమైన ప్రతిస్పందనలను ప్రతీకార చర్యలు అంటారు.
29. అనియంత్రిత చర్యలు అంటే ఏమిటి?
జ: మనం పూర్తి చేతనావస్థలో ఉన్నప్పటికీ కొన్ని చర్యలను ఆపలేం. అలాంటి చర్యలను అనియంత్రిత చర్యలు అంటారు.
30. ప్రతీకార చర్యాచాపం అంటే ఏమిటి?
జ: జ్ఞాన అవయవాల నుంచి వెన్నుపాముకు, అక్కడ నుంచి ప్రభావకాంగాలకు సమాచారం ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీన్ని ప్రతీకార చర్యాచాపం అంటారు.
31. నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన విభాగాలు ఎన్ని? అవి ఏవి?
జ: నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన విభాగాలు రెండు. అవి: కేంద్ర నాడీవ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ.

32. కేంద్ర నాడీవ్యవస్థ అంటే ఏమిటి?
జ: మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్ర నాడీవ్యవస్థ అంటారు.
33. కేంద్ర నాడీవ్యవస్థ పని ఏమిటి?
జ: కేంద్ర నాడీవ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది.
34. మెదడు ఎందులో అమరి ఉంటుంది?
జ: మెదడు కపాలం అనే అస్థితో నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది.
35. మెనింజస్ గురించి రాయండి.
జ: మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్ అనే మూడు పొరలుంటాయి. ఇవి వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది.
36. మెదడును రక్షించే నిర్మాణాలేవి?
జ: మెదడును రక్షించే నిర్మాణాలు మూడు. అవి: కపాలం, మెనింజస్ పొరలు, మస్తిష్క మేరుద్రవం.
37. బూడిద రంగు ప్రాంతం అంటే ఏమిటి?
జ: మెదడులో బయటివైపునకు నాడీకణాల దేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం లేదా గ్రేమేటర్స్ అంటారు.

38. తెలుపు రంగు ప్రాంతం అంటే ఏమిటి?
జ: మెదడు లోపలివైపు కణదేహాల ఆక్సాన్లు ఉంటాయి. ఈ ఆక్సాన్లు మయలిన్ తొడుగుతో ఉంటాయి. ఇవి తెల్లగా ఉండటం వల్ల ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు.
39. మెదడులోని ప్రధాన భాగాలెన్ని? అవి ఏవి?
జ: మెదడులోని ప్రధాన భాగాలు మూడు. అవి: ¤ ముందు మెదడు
                                                                     ¤ మధ్య మెదడు
                                                                     ¤ వెనుక మెదడు
40. మానవ మెదడు బరువు ఎంత? ఇది శరీర బరువులో ఎంత శాతం?
జ: మానవ మెదడు బరువు 1400 గ్రాములు (అప్పుడే పుట్టిన శిశువులో 400 గ్రాములు). ఇది మొత్తం శరీర బరువులో 2% ఉంటుంది.
41. మెదడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత?
జ: శరీరంలో ఉత్పన్నమయ్యే మొత్తం శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది.
42. కపాలనాడులు అంటే ఏమిటి? వీటి సంఖ్య ఎంత?
జ: మెదడు నుంచి బయలు దేరే నాడులను కపాల నాడులు అంటారు. ఇవి 12 జతలుగా ఉంటాయి.
43. వెన్నునాడులు అంటే ఏమిటి? వీటి సంఖ్య ఎంత?
జ: వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులను వెన్నునాడులు అంటారు. ఇవి 31 జతలు.

44. రెండో మెదడు లేదా జీర్ణనాడీవ్యవస్థ అంటే ఏమిటి?
జ: మన శరీరంలో కేంద్రీయ నాడీవ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థలతో పాటు జీర్ణనాళంలో మరో నాడీవ్యవస్థ ఉంది. ఇది కేంద్ర, పరిధీయ నాడీ వ్యవస్థలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుంది. దీన్ని రెండో మెదడు లేదా జీర్ణనాడీవ్యవస్థ అని పిలుస్తారు.
45. వినాళ గ్రంథులు అంటే ఏమిటి?
జ: నాళాలు లేని గ్రంథులను వినాళ గ్రంథులు లేదా అంతస్రావీ గ్రంథులు అంటారు. ఇవి స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి.
46. హార్మోన్లు అంటే ఏమిటి?
జ: వినాళ గ్రంథులు స్రవించే రసాయనాలను లేదా స్రావాలను హార్మోన్లు అంటారు. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి.
47. స్వయం చోదిత నాడీవ్యవస్థ అంటే ఏమిటి?
జ: శరీరంలో అనేక అవయవాలు వాటి విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీవ్యవస్థను 'స్వయం చోదిత నాడీవ్యవస్థ' అంటారు.
48. ఫైటోహార్మోన్లు అంటే ఏమిటి? వాటి పని ఏమిటి?
జ: మొక్కల్లోని హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు. మొక్కలు కాంతి, నీరు, ఉష్ణం, స్పర్శ, ఒత్తిడి, గురుత్వాకర్షణ, రసాయనాలు లాంటి ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఫైటోహార్మోన్లు ఈ ఉద్దీపనల ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి.

49. అనువర్తన చలనాలు అంటే ఏమిటి?
జ: మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి చలనాలను అనువర్తన చలనాలు అంటారు.
50. నాస్టిక్ చలనాలు అంటే ఏమిటి?
జ: కొన్ని సందర్భాల్లో ఉద్దీపనలదిశ చలనదిశను నిర్ధారిస్తుంది. మరికొన్ని సమయాల్లో చలనదిశ ఉద్దీపనల దిశను నిర్ధారించదు. ఇలాంటి ప్రతిస్పందనలను 'నాస్టిక్ చలనాలు' అంటారు.
51. కాంతి అనువర్తనం అంటే ఏమిటి? ఒక ఉదాహరణనివ్వండి.
జ: మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని 'కాంతి అనువర్తనం' అంటారు.
ఉదా: కిటికీ వద్ద పెరుగుతున్న మొక్క కాంతి వైపునకు పెరగడం.
52. గురుత్వానువర్తనం అంటే ఏమిటి?
జ: మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపుగా ప్రతిస్పందించడాన్ని 'గురుత్వానువర్తనం' అంటారు.
53. నీటి అనువర్తనం అంటే ఏమిటి?
జ: రాళ్లను, గోడలను అంటిపెట్టుకుని పెరిగే మొక్కల వేర్లు దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఇలాంటి ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు.
54. స్పర్శానువర్తనం అంటే ఏమిటి?
జ: స్పర్శ లేదా తాకడం వల్ల మొక్కలు చూపే ప్రతిస్పందనలను స్పర్శానువర్తనం అంటారు.
55. రసాయనికానువర్తనం అంటే ఏమిటి?
జ: మొక్కలు రసాయనిక పదార్థాలకు చూపే ప్రతిస్పందనను 'రసాయనికానువర్తనం' అంటారు.
56. ఫైటోహార్మోన్లను తెలపండి?
జ: అబ్‌సైసిక్ ఆమ్లం, ఆక్సిన్లు, సైటోకైనిన్లు, ఇథిలీన్, జిబ్బరెల్లిన్లు.
57. కింది ఖాళీల్లో సరైన సమాచారాన్ని రాయండి?
58. పిల్లిని చూసిన ఎలుక పరిగెత్తింది. ఇందులో ఉద్దీపన, ప్రతిస్పందనలేమిటి?
జ: పిల్లి - ఉద్దీపన, ఎలుక పరుగెత్తడం - ప్రతిస్పందన
59. నిజ జీవితంలో ఉద్దీపన ప్రతిస్పందనలకు రెండు ఉదాహరణలివ్వండి.
జ:         ఉద్దీపన                              ప్రతిస్పందన
      1. వేడిగా ఉంది            -            ఫ్యాన్ వేశాను
      2. దాహంగా ఉంది       -            నీరు తాగాను
60. క్రికెట్ ఆటలో బౌలర్ ముందుకు పరుగుతీసి వేగంగా బంతి విసిరాడు. ఈ సందర్భంలో ఏయే అవయవాలు సమన్వయంగా పనిచేస్తాయి?
జ: కళ్లు, మెదడు, కాళ్లు, చేతులు
61. చక్కెర వ్యాధి అంటే ఏమిటి? దానికి కారణం ఏమిటి?
జ: రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉండటాన్ని చక్కెర వ్యాధి అంటారు. క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సరైన మోతాదులో లేకపోవడమే ఈ వ్యాధికి కారణం.
62. ప్రచోదనాలకు ప్రతిస్పందన చూపించడానికి సహాయం చేసేది ఏది?
జ: ప్రచోదనాలను గ్రహించి ప్రతిస్పందన చూపించడంలో మెదడు కీలకపాత్ర వహిస్తుంది.

63. కోపం ఎందుకు తగ్గుతుంది?
జ: రక్తంలో అడ్రినల్ స్థాయి తగ్గడం వల్ల కోపం తగ్గుతుంది. దీనికి శరీరంలోని పునశ్చరణ యంత్రాంగం తోడ్పడుతుంది.
64. వాసోమోటార్ అంటే ఏమిటి?
జ: రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారడాన్ని వాసోమోటార్ అంటారు.
65. పరిధీయ నాడీవ్యవస్థ అంటే ఏమిటి?
జ: కపాలనాడులు, కశేరు నాడులను కలిపి పరిధీయ నాడీవ్యసవ్థ అంటారు.
66. పునశ్చరణ యంత్రాంగం అంటే ఏమిటి?
జ: శరీరంలో హార్మోన్ల చర్యను నియంత్రించే యంత్రాంగాన్ని పునశ్చరణ యంత్రాంగం అంటారు.
(రచయిత: టి. శాంతాదేవి)


 

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

జీవశాస్త్రం

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌