• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవుడి కన్ను - రంగుల ప్రపంచం

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1.  హ్రస్వదృష్టి లోపాన్ని మీరెలా సవరిస్తారు?    (4 మార్కులు)


* కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు కానీ దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఈ దృష్టి దోషాన్ని హ్రస్వదృష్టి అంటారు.
* ఈ దోషం ఉన్న వ్యక్తులకు కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కంటే తక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో, దూరంలోని వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెందాక (ఎ), (బి) పటాల్లో చూపినట్లు రెటీనాకు ముందు కొంత దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
* వస్తువు M వద్ద లేదా Mకు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L)కు మధ్య ఏదైనా ప్రదేశంలో ఉంటే కంటి కటకం ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుంది.
* M ను గరిష్ఠ దూర బిందువు (Far point ) అంటారు. ఒక వ్యక్తి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోయే దోషాన్ని హ్రస్వదృష్టి అంటారు.మైండ్ మ్యాపింగ్ గరిష్ఠ దూర బిందువుకు, స్పష్టదృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు. కాబట్టి ఒక కటకాన్ని ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు అవతల ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు (M), స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L)ల మధ్యకు తేగలిగితే, ఆ ప్రతిబంబం కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది. 

                          
* ద్విపుటాకార కటకం వాడటం వల్ల ఈ పని సాధ్యమవుతుంది. హ్రస్వ దృష్టిని సవరించడానికి ఉపయోగించాల్సిన ద్విపుటాకార కటకం నాభ్యంతరం కనుక్కోవడం

i) వస్తు దూరం u =  (అనంతం)

ii) ప్రతిబింబ దూరం v = - D (గరిష్ఠ దూర బిందువుకు కంటికి ఉన్న దూరం)
iii) ద్విపుటాకార కటక నాభ్యంతరం  f = ? 

vi ) నాభ్యంతరం -D, రుణ విలువ పుటాకార కటకం అని తెలియజేస్తుంది.

2. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని వివరించండి.   (4 మార్కులు) (A.S.-1)
జ: దీర్ఘదృష్టి (Hypermetropia)

* దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తి దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడగలడు కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
* దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తులకు కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇలాంటి సందర్భంలో దగ్గరలోని వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెందాక, ప్రతిబింబం పటం (ఎ)లో చూపినట్లు రెటీనాకు అవతల ఏర్పడుతుంది.
* వస్తువు H బిందువు వద్ద లేదా దానికి అవతల ఉంటేనే దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తి దాన్ని చూడగలడనుకుందాం. అంటే వస్తువు H  వద్ద లేదా దానికి ఆవల ఉన్నప్పుడు అతడి కంటి కటకం ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరచగలదు.
* H, స్పష్టదృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L)కు మధ్య వస్తువు ఉంటే రెటీనాపై ప్రతిబింబం ఏర్పడదు. (పటం - ఎ చూడండి). H బిందువునే దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తి కనిష్ఠ దూర బిందువు (Near point) అంటారు.


దీర్ఘ దృష్టిని సవరించడం:

* వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే, కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు. కాబట్టి కనిష్ఠ దూర బిందువు (H)కు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L)కు మధ్య ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని, కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఏర్పరచగలిగే కటకాన్ని మనం ఉపయోగించాలి. ద్వికుంభాకార కటకాన్ని వాడటం వల్ల ఇది సాధ్యపడుతుంది. 

ద్వికుంభాకార కటక నాభ్యంతరం కనుక్కోవడం:


వస్తు దూరం u = - 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం v = -d (కంటికి, కనిష్ఠ దూర బిందువుకు మధ్య దూరం)
నాభ్యంతరం f = ?

d > 25 అని మనకు తెలుసు, కాబట్టి f = +Ve
అంటే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి దీర్ఘదృష్టిని సవరించవచ్చు.

3. పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుక్కుంటారు? (4 మార్కులు)


జ: ఉద్దేశం: పట్టక వక్రీభవన గుణాకాన్ని కనుక్కోవడం

కావాల్సిన వస్తువులు: పట్టకం, తెల్లటి డ్రాయింగ్ చార్టు (20 × 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు, స్కేలు, కోణమాని.

నిర్వహణ పద్ధతి:

* ఒక పట్టకాన్ని తీసుకుని, దాని త్రిభుజాకార ఆధారం డ్రాయింగ్ చార్టుపై ఉండే విధంగా అమర్చండి. పట్టక ఆధారం చుట్టూ పెన్సిల్‌తో గీతగీసి, పట్టకాన్ని తీసివేయండి.
* అదొక త్రిభుజం. ఆ త్రిభుజ శీర్షాలకు P, Q, R అని పేర్లు పెట్టండి. (సాధారణంగా ఇది సమబాహు త్రిభుజమై ఉంటుంది) పట్టక వక్రీభవన తలాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.
* PQ, PRల మధ్య కోణాన్ని కొలవండి. ఇది పట్టక వక్రీభవన కోణం (A).
* త్రిభుజ భుజం PQపై ఒక బిందువు Mను గుర్తించండి. Mవద్ద PQకు లంబాన్ని గీయండి. కోణమాని కేంద్రం Mతో ఏకీభవించేలా లంబం వెంట కోణమానిని అమర్చండి. 30o కోణాన్ని గుర్తించి, M వరకు రేఖను గీయండి. ఈ రేఖ పతన కిరణాన్ని సూచిస్తుంది. ఈ కోణాన్ని పతన కోణం అంటారు.
* పతన కోణం విలువను పట్టికలో నమోదు చేయండి. 

* పటం - ఎ లో చూపినట్లు పతన కిరణంపై ఒక బాణం గుర్తు గీయండి.

* పట్టకాన్ని తిరిగి దాని స్థానం (త్రిభుజం)లో ఉంచండి. పటం -ఎలో చూపినట్లు పతన కిరణంపై A, B బిందువుల వద్ద రెండు గుండు సూదులను నిలువుగా గుచ్చండి. పట్టకం రెండోవైపు (PR తలంవైపు) నుంచి గుండుసూదుల ప్రతిబింబాలను చూడండి. ఇప్పుడు ఆ రెండు గుండుసూదుల ప్రతిబింబాలతో ఒకే సరళరేఖలో కనిపించే విధంగా C, D బిందువుల వద్ద మరో రెండు గుండుసూదులను గుచ్చండి. 

* ఇప్పుడు పట్టకాన్ని, గుండుసూదులను తీసివేయండి. రెండోసారి గుచ్చిన రెండు గుండుసూదుల గుర్తులను (రంధ్రాలను) కలుపుతూ PR తలాన్ని తాకేవరకు ఒక రేఖను గీయండి. ఈ రేఖ PR తలంపై ఉన్న N బిందువు ద్వారా వచ్చే బహిర్గత కిరణాన్ని తెలుపుతుంది.
* N వద్ద గీసిన లంబంతో, బహిర్గత కిరణం చేసే కోణం బహిర్గత కోణం అవుతుంది. ఈ కోణాన్ని కొలిచి పట్టికలో నమోదు చేయండి.
* M, N బిందువులను కలుపుతూ ఒక సరళ రేఖను గీయండి. A, B, M, N, C, Dల ద్వారా వెళ్లేరేఖ, పట్టకం ద్వారా ప్రయాణంచి వక్రీభవనం చెందిన కాంతి మార్గాన్ని తెలుపుతుంది.
* పతన, బహిర్గత కిరణాలను O బిందువు వద్ద కలుసుకునే వరకు పొడిగించండి. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని కొలవండి. ఈ కోణాన్ని విచలన కోణం (d) అంటారు. విచలన కోణం విలువను పట్టికలో నమోదు చేయండి.
* 40
, 50 పతన కోణాలతో ఈ ప్రయోగాన్ని మళ్లీ చేయండి. ఆయా పతన కోణాలకు సంబంధించిన బహిర్గత కోణాలు, విచలన కోణాలను కనుక్కోండి. పట్టికలో నమోదు చేయండి.
* పతన కోణాన్ని X-అక్షం, విచలన కోణాన్ని Y-అక్షం వెంట తీసుకోండి. తగిన స్కేలును నిర్ణయించుకుని ప్రతి పతన కోణానికి సంబంధించిన విచనల కోణంతో గ్రాఫ్ పేపరుపై బిందువులను గుర్తించండి.
* అన్ని బిందువులను కలిపితే గ్రాఫ్ (సున్నిత వక్రం) ఏర్పడుతుంది. మీ గ్రాఫ్‌ను పటం బిలో చూపిన గ్రాఫ్‌తో పోల్చి చూసుకోండి.

* X - అక్షానికి సమాంతరంగా, గ్రాఫ్ కింది భాగాన్ని తెలియజేసే బిందువు వద్ద ఒక స్పర్శరేఖను గీయండి. ఈ స్పర్శరేఖ Y - అక్షాన్ని తాకే బిందువు విలువ కనిష్ఠ విచలన కోణాన్ని తెలుపుతుంది. దీన్ని D తో సూచిస్తారు.
* స్పర్శరేఖ గ్రాఫ్‌ను తాకే బిందువు ద్వారా Y- అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీయండి. ఈ రేఖ X - అక్షాన్ని తాకే బిందువు విలువ కనిష్ఠ విచలన కోణానికి సంబంధించిన పతన కోణాన్ని తెలియజేస్తుంది.
* ఈ పతన కోణంతో మీరు పై ప్రయోగాన్ని చేస్తే బహిర్గత కోణం విలువ పతన కోణానికి సమానంగా  ఉండటాన్ని గుర్తించవచ్చు.

4. ఇంద్రధనస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి.  (4 మార్కులు)
జ: ఇంద్రధనస్సు ఏర్పడే విధానం


* అనేక లక్షల నీటి బిందువులతో కాంతి విక్షేపణం చెందడం వల్ల అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
* ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ఒక నీటి బిందువును పరిగణనలోకి తీసుకుందాం.  
* పటాన్ని పరిశీలించండి. నీటి బిందువు పైప్రాంతం నుంచి సూర్యుడి కాంతికిరణం లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లటి కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందుతుంది. ఎరుపు రంగు కాంతి తక్కువ విచలనాన్ని, ఊదా రంగు కాంతి ఎక్కువ విచలనాన్ని పొందుతాయి.
* అన్ని రంగులూ నీటి బిందువు రెండో వైపునకు చేరాక, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటిబిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి. ఫలితంగా నీటి బిందువు మొదటి ఉపరితలాన్ని చేరాక, ప్రతీరంగు, మళ్లీ గాలిలోకి వక్రీభవనం చెందుతుంది.
* మొదటి వక్రీభవనంతో పోలిస్తే రెండో వక్రీభవనంలో ఎరుపు, ఊదా రంగుల కాంతికిరణాల మధ్యకోణం ఇంకా పెరుగుతుంది.
* నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్లే కిరణాల మధ్యకోణం 0
o నుంచి 42o మధ్య ఎంతైనా ఉండవచ్చు. అయితే ఆ కోణం 42o కు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశమంత ఇంద్రధనస్సును మనం చూడగలుగుతాం.


5. ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణాలు క్లుప్తంగా వివరించండి.      (2 మార్కులు)
జ: * సూర్యకిరణాల దిశకు లంబ దిశలో మనం ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది. కారణం పరిక్షేపణం. కాంతి తీవ్రత పరిక్షేపణ కోణాన్ని బట్టి మారుతుంది. పరిక్షేపణ కోణం 900 ఉన్నప్పుడు కాంతి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. 
* మన భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో వివిధ రకాల అణువులు, పరమాణువులు ఉంటాయి.
* వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలిరంగుకు కారణం.
* ఈ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది.
 * ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.


6. కృత్రిమ ఇంద్రధనస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి. (4 మార్కులు)


జ: కృత్యం - 1: 

* ఒక లోహపు పళ్లాన్ని (ట్రే) తీసుకుని, దాన్ని నీటితో నింపండి. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా నీటిలో ఒక సమతల దర్పణాన్ని (అద్దాన్ని) ఉంచండి.
* పటంలో చూపినట్లు నీటి ద్వారా అద్దంపై తెల్లటి కాంతిని ప్రసరింపజేయండి.
* ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లటి కార్డుబోర్డును ఉంచి రంగుల ప్రతిబింబాన్ని పొందే ప్రయత్నం చేయండి.
* కార్డు బోర్డుపై VIBGYOR ఏడు రంగుల వర్ణపటాన్ని చూస్తాం.


కృత్యం - 2:

* ఒక తెల్లటి గోడను ఎంచుకోండి. దానిపై సూర్యకాంతి పడుతుండాలి.
* గోడకు అభిముఖంగా (సూర్యకాంతి మీ వీపుపై పడే విధంగా) నిల్చొండి.
* నీరు ప్రహించే ఒక పైపు తీసుకుని, పైపు చివర మీ వేలుని అడ్డంగా ఉంచండి.
* మీ వేలుకు, పైపునకు మధ్య సందుల ద్వారా నీరు ఫౌంటెన్‌లా బయటకు చిమ్ముతుంది.
* ఇలా నీరు చిమ్మేటప్పుడు గోడపై రంగుల పట్టిక VIBGYOR ఏర్పడుతుంది. ఈ రంగులు ఇంద్రధనస్సులోని రంగులను పోలి ఉంటాయి.

7. 1 తరంగధైర్ఘం ఉన్నకాంతి n1 వక్రీభవన గుణకం ఉన్న యానకం నుంచి n2 వక్రీభవన గుణకం ఉన్న యానకంలోకి ప్రవేశిస్తుంది. రెండో యానకంలో ఆ కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?  (2 మార్కులు)
జ: మొదటి యానకంలో కాంతి తరంగధైర్ఘ్యం = 1
మొదటి యానకం వక్రీభవన గుణకం = n1
 రెండో యానకంలో కాంతి తరంగధైర్ఘ్యం =
2 = ?
రెండో యానకం వక్రీభవన గుణకం = n2

గమనిక:  8, 9 ప్రశ్నల కోసం కింది వాక్యాలు ఇచ్చారు. ప్రశ్నలో ఇచ్చిన అంశం, దానికి సంబంధించిన కారణాన్ని బట్టి కింది వాక్యాల్లో ఏది సరైందో తెలిపి, వివరించండి.

a. A, R రెండూ సరైనవి. A కు R సరైన వివరణ.
b. A, R రెండూ సరైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c. A సరైంది. కానీ R సరైంది కాదు.
d. A, R సరైనవి కావు.
e. A సరైంది కాదు కానీ R సరైంది.


8. అంశం (A): పట్టక వక్రీభవన గుణకం ఆ పట్టక తయారీకి వాడిన గాజు రకం, కాంతి రంగుపై మాత్రమే ఆధారపడుతుంది.
కారణం (R): పట్టక వక్రీభవన గుణకం అనేది పట్టక వక్రీభవన కోణం, కనిష్ఠ విచలన కోణాలపై ఆధారపడుతుంది.  (AS - 2) (2మార్కులు)

జ: b.
A, R రెండూ సరైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు. 

9. అంశం (A): కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.
కారణం (R): తెల్లటి కాంతిలోని వివిధ కాంతుల్లో నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యం తక్కువ (AS - 2) (2 మార్కులు)

జ:  c
A సరైంది. కానీ R సరైంది కాదు.

10. తరగతి గదిలో ఇంద్రధనస్సును ఏర్పరిచేందుకు ఒక ప్రయోగాన్ని తెలపండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. (4 మార్కులు)


జ: కృత్యం - 3:

* తెల్లటి గోడకు దగ్గరగా ఒక టేబుల్‌ను ఉంచండి. ఒక కార్డ్‌బోర్డు షీట్‌కు మధ్యలో సన్నటి రంధ్రం చేసి, దాన్ని టేబుల్‌పై నిలువుగా అమర్చండి.
* కార్డ్‌బోర్డుకు, గోడకు మధ్యలో ఒక పట్టకాన్ని ఉంచండి. తెలుపు రంగు కాంతినిచ్చే కాంతి జనకాన్ని కార్డ్‌బోర్డుకు దగ్గరగా ఉంచి, దాని రంధ్రం ద్వారా కాంతిని ప్రసరింపజేయండి.
* రంధ్రం నుంచి వెలువడే కాంతి సన్నటి కాంతి పుంజాన్ని తలపిస్తుంది. ఈ కాంతి పట్టకం ఏదో ఒక దీర్ఘచతురస్రాకార తలంపై పడే విధంగా, పట్టకాన్ని పట్టుకోండి.
* పట్టక బహిర్గత కిరణాల్లో వచ్చే మార్పులను గమనించండి. పట్టకాన్ని మెల్లగా తిప్పుతూ గోడమీద ప్రతిబింబం ఏర్పడే విధంగా చేయండి.
* గోడ మీద వివిధ వర్ణాలతో కూడిన పట్టక వర్ణపటం కనిపిస్తుంది.
* దీనిలోని రంగులు ఇంద్రధనస్సులో కనిపించే రంగులను (VIBGYOR) పోలి ఉంటాయి.

11. కొన్ని బైనాక్యూలర్స్‌లో పట్టకాలు వినియోగిస్తారు. వీటిలో పట్టకాలు ఎందుకు వినియోగిస్తారో తెలియజేసే సమాచారాన్ని సేకరించండి. (2 మార్కులు)
జ: * దూరపు వస్తువులు దగ్గరగా ఉన్నట్లు కనిపించడానికి బైనాక్యులర్స్ ఉపయోగిస్తారు.
* సాధారణంగా దీనిలో సమాంతరంగా కదిలే రెండు కటకాలు అమరి ఉంటాయి.
* బైనాక్యులర్స్‌లో మరిన్ని కాంతి పరావర్తనాలు జరిగేందుకు పట్టకాలను ఉపయోగిస్తారు.
* పట్టకాలు బైనాక్యులర్స్‌లో వినియోగించడం వల్ల బైనాక్యులర్స్ పరిమాణం తగ్గిపోతుంది.
* బైనాక్యులర్స్‌లో పట్టకాలు వినియోగించడం వల్ల ప్రతిబింబ పరిమాణం పెరగడమే కాకుండా ప్రతిబింబ కాంతి త్రీవత కూడా పెరుగుతుంది.
* బైనాక్యులర్స్‌లో పట్టకాలు వాడటం వల్ల దాని పరావర్తన సామర్థ్యం 95 శాతం పెంచవచ్చు. 

12. పటంలో పట్టక తలం ABపై పడిన పతన కిరణాన్ని, పట్టక తలం AC నుంచి వచ్చే బహిర్గత కిరణాన్ని చూపారు. పటంలో లోపించిన వాటిని గీయండి. (2 మార్కులు)
జ: AB, BC వక్రీభవన తలాలు.
 BC పరావర్తన తలం
 i1 పతనకోణం
 i2 బహిర్గత కోణం

θ , θ పతన, పరావర్తన కోణాలు
 N1, N2, N3 లంబాలు.θ

13. ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు? (2 మార్కులు)
జ: * కాంతి పరిక్షేపణం వల్లే ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
* వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలి రంగుకు కారణం.
* ఈ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది.
* ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
* వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువుల పాత్ర ఆకాశం నీలంగా చూపించడంలో మెచ్చదగింది. ప్రకృతిలోని ఈ అందాలను నేను చూసి అభినందిస్తాను. ఆనందిస్తాను.


14. కంటిలోని సిలియరి కండరాల పనితీరును మీరెలా అభినందిస్తారు? (2 మార్కులు)
జ: * కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు (Ciliary Muscles) కటక వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోగలుగుతుంది.
* దూరంలో ఉన్న వస్తువును కన్ను చూసినప్పుడు, సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠం అవుతుంది. అంటే కటకం నుంచి రెటీనాకు ఉన్న దూరానికి, నాభ్యంతరం విలువ సమానం అవుతుంది.
* అప్పుడు కంటిలోకి వచ్చే సమాంతర కిరణాలు రెటీనాపై కేంద్రీకృతమవడం వల్ల వస్తువును మనం చూడగలుగుతాం.
* దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
* రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరీ కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి.
* ఇలా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే పద్ధతిని 'సర్దుబాటు' అంటారు.
* సిలియరి కండరాల పనితీరు కారణంగా ఈ సర్దుబాటు సాధ్యమవుతోంది. అందుకే ఈ కండరాల పనితీరును నేను అభినందిస్తున్నాను.
* మనిషికి ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని మరే ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా ఎవరూ సమకూర్చలేరు.

 


15. కొన్ని సందర్భాల్లో ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకు? (4 మార్కులు)
జ: * వాతావరణంలో వివిధ పరిమాణాల్లో కణాలుంటాయి. వాటి పరిమాణాలకు అనుగుణంగా అవి వివిధ తరంగదైర్ఘ్యాలున్న కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
* ఉదాహరణకు N2, O2 అణువుల కంటే నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగు కాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలున్న (ఎక్కువ తరంగధైర్ఘ్యాలు) కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
* వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది. దాంతో వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి.
* ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలిరంగు కానివి) ఉండే కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
* N2, O2 పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగు కాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనిపిస్తుంది.


16. గాజు పారదర్శక పదార్థం. ఒక తలం గరుకుగా తయారు చేసిన గాజు పాక్షిక పారదర్శకంగా, తెలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకు?    (2 మార్కులు)
జ: * గాజు పారదర్శక పదార్థం. అందువల్ల అది కాంతి కిరణాలను తన ద్వారా ప్రసరింపజేస్తుంది.
* ఒక తలం గరుకుగా తయారు చేసిన గాజు ఆ వైపు తలం ఎగుడు దిగుడుగా ఉంటుంది. అందువల్ల ఇది అసమతలంగా ఉంటుంది.
* గాజు ఈ అసమతలంపై పతనం చెందిన కాంతిని అక్రమ పరావర్తనానికి గురి చేస్తుంది.
* ఈ విధంగా ఈ గరుకు తలం కాంతి పాక్షిక నిరోధక తలంగా పనిచేస్తుంది. తన ద్వారా కాంతి కిరణాలను పూర్తిగా ప్రసారం కానివ్వదు.
* అందుకే గరుకు గాజుతలం పాక్షిక పారదర్శకంగా, తెలుపు రంగులో కనిపిస్తుంది.


17. తెల్ల కాగితానికి నూనె పూస్తే, అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకు? (2 మార్కులు)
జ: * తెల్ల కాగితం కాంతినిరోధక పదార్థం. ఇది ఒక ఘన పదార్థం. ఆపైన శోషిణి.
* తెల్లటి కాగితాన్ని నీటితో తడిపితే దానిలోని నీరు పూర్తిగా ఆవిరి అయ్యే వరకు అది పాక్షిక పారదర్శకంగా ఉంటుంది.
* తెల్లటి కాగితం నూనెను పీల్చుకుంటుంది. నీటిలా నూనె త్వరగా ఆవిరి కాదు. అందుకే నూనెతో తడిపిన కాగితం అందులోని నూనె ఆవిరైపోయే వరకు పాక్షిక పారదర్శకంగా ఉంటుంది.

సమస్యలు

1. పట్టకానికి చెందిన ఒక తలంపై 4 కోణంతో పతనమైన కాంతి కిరణం 30 కనిష్ఠ విచలనాన్ని పొందింది. అయితే పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుక్కోండి.  (4 మార్కులు)
జ: * ఇచ్చినవి: పతనకోణం
 i = 40
కనిష్ఠ విచలన కోణం D = 30
పట్టక కోణం A= ?
వక్రీభవన కోణం r = ?

2. 'దీర్ఘదృష్టి' ఉన్న ఒక వ్యక్తికి 100 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కటకాన్ని వాడమని డాక్టరు సలహా ఇచ్చారు. కనిష్ఠ దూరబిందువు దూరాన్ని, కటక సామర్థ్యాన్ని కనుక్కోండి.  (4 మార్కులు)
జ: వస్తుదూరం
u = - 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం v = కనిష్ఠ దూరబిందువు దూరం = -d
నాభ్యంతరం f = 100 సెం.మీ.

3. ఒక వ్యక్తి దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నాడు. అతడి కంటి ముందు కేంద్రీకరణ కటకం ఉంచితే అతడికి వస్తువు పెద్దదిగా కనిపిస్తుందా? కారణాన్ని తెలపండి. (2 మార్కులు)
జ: దూరంలో ఉన్న వస్తువును చూస్తున్న ఒక వ్యక్తి కంటి ముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచితే అతడికి వస్తువు పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. అంటే వస్తువు పెద్దదిగా కనిపిస్తుంది.
 వస్తువు కటకం నాభి, దృక్ కేంద్రాల నడుమ ఉన్నప్పుడు దాని ప్రతిబింబం ఏర్పడుతుంది.
 అందువల్ల మిథ్యాప్రతిబింబం నిటారుగా, పెద్దదిగా ఏర్పడుతుంది.

ప్రశ్నలు - జవాబులు (పాఠంలో ఇచ్చినవి)

1. స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టి కోణం విలువలు వ్యక్తులు, వయసులను బట్టి ఎందుకు మారతాయి?  (AS - 1)  (2 Marks)
జ:* కటక నాభ్యంతరం అనేది కటకం తయారైన పదార్థ స్వభావం, దాని వక్రతా వ్యాసార్ధంపైన ఆధారపడుతుంది.
* కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరీ కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడుతుంది.
* దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వల్ల కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది. అంటే కటకం నుంచి రెటీనాకు మధ్య ఉన్న దూరానికి, నాభ్యంతరం విలువ సమానమవుతుంది.

* సిలియరీ కండరాల పనితీరు సామర్థ్యం వ్యక్తి, వ్యక్తికి మారుతూ ఉంటుంది. వయసుతోపాటు కూడా మారిపోతూ ఉంటుంది.
*  అందుకే స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం కూడా వ్యక్తి వ్యక్తికి మారిపోతూ ఉంటాయి.


2. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండటం ఎలా సాధ్యం?    (AS - 1) (1 Mark)
జ: * వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే, కటక నాభ్యంతరం విలువ మారాల్సి ఉంటుంది
* కంటి కటక నాభ్యంతరం వస్తుదూరాన్ని బట్టి మారేందుకు సిలియరీ కండరాలు సహకరిస్తాయి.


3. కటకాల ద్వారా వక్రీభవనం గురించి మీకున్న అవగాహనతో పై ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? (AS - 1) (1 Mark)
జ: *కటక నాభ్యంతరం అనేది కటకం తయారైన పదార్థ స్వభావం, దాని వక్రతా వ్యాసార్ధంపై ఆధారపడుతుంది.
*కంటి నాభ్యంతరం మారితే వివిధ దూరాల్లో ఉన్న వస్తువులకు ప్రతిబింబ దూరం ఒకేవిధంగా ఉండే అవకాశం ఉంది.
* వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబదూరం ఉండేందుకు కటక నాభ్యంతరం మారుతూ ఉండాలి.


4. కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది? (AS- 1, 1 Mark )
జ: కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరీ కండరాలు కంటి కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి

 

5. కనుగుడ్డులో పై మార్పు ఎలా జరుగుతుంది?(2 మార్కులు) (AS- 1, 2 Marks )
జ: *దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది.
అంటే కటకం నుంచి రెటీనాకు ఉన్న దూరానికి, నాభ్యంతరం విలువ సమానమవుతుంది.
* అప్పుడు కంటిలోకి వచ్చే సమాంతర కిరణాలు రెటీనాపై కేంద్రీకృతమవడం వల్ల వస్తువును మనం చూడగలుగుతాం.


6. కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?(AS- 1, 1 Mark )
జ: కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలకిందులుగా ఏర్పరుస్తుంది.


7. వస్తువు ఆకారం, పరిమాణం, రంగుల్లో ఏ మార్పు లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? (AS- 1, 4 Marks)
జ: * రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు (rods), శంకువులనే (cones) దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలు (receptors) ఉంటాయి.
* ఇవి కాంతి సంకేతాలను (signals) గ్రహిస్తాయి. దండాలు రంగును గుర్తిస్తాయి.
శంకువులు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్‌నాడుల (optic-nerve fibers) ద్వారా మెదడుకు చేరతాయి.
* వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం, రంగులను మనం గుర్తిస్తాం.

 

8. కంటి కటక నాభ్యంతరం మార్పునకు ఏదైనా హద్దు (limit) ఉందా? (AS- 1, 2 Marks )
జ: వస్తువు అనంతర దూరంలో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెంది రెటీనాపై బిందు రూపంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
* ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్ఠంగా ఉంటుంది. ఇదే దీని హద్దు.


9. కంటి కటకం కనిష్ఠ, గరిష్ఠ నాభ్యంతరాలు ఎంత? వాటిని మనం ఎలా కనుక్కుంటాం?(AS- 1, 4 Marks )
జ: వస్తువు అనంతదూరంలో ఉన్నప్పుడు కంటి కటకానికి గరిష్ఠ నాభ్యంతరం ఉంటుంది.
వస్తువు దూరం
u = ∞ (అనంత దూరం)
ప్రతిబింబ దూరం v = 2.5 సెం.మీ.
ఈ ప్రతిబింబ దూరం కంటి కటకానికి, రెటీనాకు మధ్య ఉండే దూరానికి సమానం.
నాభ్యంతరం f = ?

* గరిష్ఠ నాభ్యంతరం f గరిష్ఠ = 2.5 సెం.మీ.
* వస్తువును మన కంటికి స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉంచినప్పుడు కంటి నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
*  వస్తు దూరం u = - 25 సెం.మీ.
ప్రతిబింబ దూరంv = 2.5 సెం.మీ. (కటకం, రెటీనాల మధ్య దూరం)
కనిష్ఠ నాభ్యంతరం fకనిష్ఠ = ?

10. కంటి కటకం తన నాభ్యంతరం మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది?(AS - 1, 1 Mark )
జ: కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే సదరు వ్యక్తి వస్తువును సులభంగా, స్పష్టంగా చూడలేడు.


11. కంటి కటక నాభ్యంతరం 2.27 - 2.5 సెం.మీ.లకు మధ్యస్తంగా లేకపోతే ఏమవుతుంది? (AS - 1, 1 Mark )
జ: కంటి కటక దోషంవల్ల చూపు మసకబారినట్లు అవుతుంది.


12. హ్రస్వదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?(AS - 1, 1 Mark )  
జ: హ్రస్వదృష్టిని సవరించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగించాలి.


13. హ్రస్వదృష్టిని సవరించడానికి వాడాల్సిన పుటాకార కటకం నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తారు?(AS - 1, 1 Mark )
జ: వస్తు దూరం
 u = - ∞
ప్రతిబింబ దూరం v = గరిష్ఠ దూర బిందువుకు కంటికి ఉండే దూరం = -D
ద్విపుటాకార కటక నాభ్యంతరం f = ?

ద్విపుటాకార కటక నాభ్యంతరం f = -Dసెం.మీ. f కు రుణ విలువ రావడమనేది పుటాకార కటకాన్ని సూచిస్తుంది.

14. కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది? (AS- 1, 1 Mark )
జ: ఇలాంటి సందర్భాల్లో దగ్గరలోని వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెందాక, ప్రతిబింబం రెటీనాకు అవతల పడుతుంది.


15. దీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చెయ్యాలి? (AS- 1, 1 Mark )
జ: * వస్తువు కనిష్ఠ దూర బిందువుకు అవతల ఉంటే, కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు. కాబట్టి కనిష్ఠ దూర బిందువు (L)కు స్పష్టదృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (H)కు మధ్య ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని కనిష్ఠ దూర బిందువుకు అవతల ఏర్పరచగలిగే కటకాన్ని మనం ఉపయోగించాలి.
* ద్వికుంభాకార కటకాన్ని వాడటంవల్ల ఇది సాధ్యపడుతుంది.


16. దీర్ఘదృష్టిని నివారించడానికి వాడాల్సిన కుంభాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తారు? (AS - 1, 2Marks)
జ: వస్తు దూరం u = - 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం v = కనిష్ఠ దూర బిందువు దూరం = -d
ద్వికుంభాకార కటక నాభ్యంతరం f = ?

 d > 25 అని మనకు తెలుసు. కాబట్టి f ధనాత్మకం.
అంటే దీర్ఘదృష్టిని సవరించేందుకు ద్వికుంభాకార కటకం వాడాలి.

 

17. కంటి వైద్యుడు రాసే ప్రిస్క్రిప్షన్‌లోని వివరాలను మీరెప్పుడైనా పరిశీలించారా? (AS- 1, 1 Mark )
జ: కంటి వైద్యుడు రాసిన ప్రిస్క్రిప్షన్‌లో వ్యక్తికి ఉండే కంటి దోషం, దాని సవరణకు ఆ వ్యక్తి ఉపయోగించాల్సిన కటకాల వివరాలు, వాటి సామర్థ్యం రాసి ఉంటాయి.


18. సైట్ పెరగడం లేదా తగ్గడం అంటే ఏమిటి? (AS- 1, 1 Mark )
జ: వ్యక్తి కంటి చూపు సామర్థ్యం పెరగడం, తగ్గడాలను సైట్ పెరగడం లేదా తగ్గడం అంటారు.


19. కటక సామర్థ్యం అంటే ఏమిటి? (AS- 1, 2 Marks )
జ:* ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యంగా వ్యక్తపరుస్తారు.
*  కటక నాభ్యంతరం విలోమ విలువను కటక సామర్థ్యం అంటారు.
*  ఒక కటక నాభ్యంతరం f అనుకుంటే

* కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Dioptre). దీన్ని D సూచిస్తారు.

 

20. తెల్లటి రంగులో ఉండే సూర్యకాంతి ఇంద్రధనస్సులోని రంగులను ఎలా ఇవ్వగలుగుతోంది?(AS - 1, 2 Marks)
జ: * అన్ని రంగుల కాంతి వేగాలు శూన్యంలో ఒకేవిధంగా ఉన్నప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వేగం దాని తరంగధైర్ఘ్యంపై ఆధారపడుతుది. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.
*  తెల్లనికాంతి ఒక యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు, అందులోని ప్రతిరంగూ అది తక్కువ సమయం ప్రయాణించే మార్గాన్ని ఎన్నుకుంటుంది. దీనివల్ల వివిధ రంగుల వక్రీభవనం వివిధ విచలనాలతో ఉంటుంది. ఫలితంగా తెల్లని కాంతిలోని రంగులు వేరవుతాయి.
*  ఈవిధంగానే తెల్లని కాంతి వర్షపు బిందువుల ద్వారా వక్రీభవనం చెందినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.


21. పట్టకం అంటే ఏమిటి? (AS - 1, 1 Mark)
జ: ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుచేసిన పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు.


22. ఒకదానికొకటి కొంత కోణం చేసే సమతలాలున్న పారదర్శక యానకం ద్వారా కాంతి కిరణం ప్రసరించినప్పుడు ఏం జరుగుతుంది? (AS - 1, 1 Mark)
జ: ఒక సమతలంపై పతనం చెందిన కాంతి కిరణం రెండో సమతలం ద్వారా వక్రీభవనం తర్వాత బహిర్గతమవుతుంది.


23. పట్టకానికి గీసిన ఆధార సరిహద్దు (outline) ఏ ఆకారంలో ఉంటుంది. (AS - 1, 1 Mark)
జ: త్రిభుజ ఆకారంలో ఉంటుంది.

24. విచలన కోణాన్ని ఎలా కనుక్కుంటారు? (AS - 1, 1 Mark )
జ: పతన, బహిర్గత కిరణాలను పొడిగించి వాటిమధ్య కోణాన్ని కొలుస్తారు. ఇదే విచలన కోణం d.


25. వివిధ విచలన కోణాలను పరిశీలించి మీరు ఏం తెలుసుకున్నారు? (AS - 1, 1 Mark )
జ: పతన కోణం పెరుగుతున్నకొద్దీ కొంతమేర విచలన కోణం తగ్గి తర్వాత పతనకోణంతోపాటు పెరగడం గమనిస్తాం.


26. పతన, విచలన కోణాల విలువలతో గ్రాఫ్ గీయగలరా? (AS - 1, 1 Mark )
జ: పతన కోణాన్ని X -  అక్షం మీద, విచలన కోణాన్ని Y-  అక్షం మీద తీసుకుని తగిన స్కేలు ఆధారంగా గ్రాఫ్ గీయవచ్చు.


27. గ్రాఫ్ ద్వారా విచలన కోణాల్లో కనిష్ఠ విలువను చెప్పగలరా? (AS - 1, 2Marks )
జ:

* X- అక్షానికి సమాంతరంగా, గ్రాఫ్ కింది భాగాన్ని తెలియజేసే బిందువు వద్ద ఒక స్పర్శ రేఖను గీయండి.
* ఈ స్పర్శ రేఖ Y- అక్షాన్ని తాకే బిందువు విలువ కనిష్ఠ విచలన కోణాన్ని తెలుపుతుంది. దీన్ని D తో సూచిస్తారు.
స్పర్శ రేఖ గ్రాఫ్‌ను తాకే బిందువు ద్వారా Y - అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీయండి.
* ఈ రేఖ X - అక్షాన్ని తాకే బిందువు విలువ కనిష్ఠ విచలన కోణానికి సంబంధించిన పతన కోణాన్ని తెలియజేస్తుంది.


28. పతన, బహిర్గత, విచలన కోణాల మధ్య ఏదైనా సంబంధం ఉందా? (AS - 1, 1 Mark )
జ: 
A + d = (i+ i2)
ఇక్కడ A: పట్టక కోణం, d: విచలన కోణం.
i1: పతన కోణం, i: బహిర్గత కోణం


29. తెల్లటి కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలరా?(AS - 1, 1 Mark )
జ: తెల్లటి కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేం.


30. కృత్యం - 3 లో కాంతి వివిధ మార్గాల ద్వారా ప్రయాణిస్తుందని తెలుస్తుంది. దీన్నిబట్టి పట్టక వక్రీభవన గుణకం వివిధ రంగులను బట్టి మారుతుందని భావిద్దామా? (AS - 1, 1 Mark )
జ: పట్టక పదార్థ వక్రీభవన గుణకం రంగు, రంగుకు మారుతుంది.

 

31. వివిధ రంగులున్న కాంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయా? (AS- 1, 1 Mark )
జ: అన్నిరంగుల కాంతి వేగాలు శూన్యంలో ఒకేవిధంగా ఉంటాయి.
* ఒక యానకంలో ప్రయాణించినప్పుడు వివిధ రంగులున్న కాంతి వేగాలు వేర్వేరుగా ఉంటాయి.


32. పట్టకం ద్వారా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో మీరు ఊహించగలరా? (AS- 1, 1 Mark )
జ: గాజు పట్టకం ద్వారా తెల్లటి కాంతి ప్రసరించినప్పుడు అది వేర్వేరు రంగుల కాంతిగా విడిపోతుంది. ఎందుకంటే...
ఎ) కాంతి విక్షేపణం
బి) ఒక యానకంలో వేర్వేరు రంగుల కాంతి వేగాలు వేర్వేరుగా ఉంటాయి.


33. పట్టకం ద్వారా తెలుపు రంగు కాంతిని పంపిస్తే ఏడు రంగులుగా విడిపోతుంది అని మనకు తెలుసు. పట్టకం ద్వారా ఒకే రంగు కాంతిని పంపించామనుకుందాం. అది మరికొన్ని రంగులుగా విడిపోతుందా? ఎందుకని?(AS - 1)  (2 Marks)
జ: కాంతిజనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను పౌనఃపున్యం (frequency) అంటారు.
* కాంతి పౌనఃపున్యం అనేది కాంతిజనకం లక్షణం. ఇది ఏ యానకం వల్ల కూడా మారదు. అంటే వక్రీభవనంలో కూడా పౌనఃపున్యం మారదు. అందువల్ల పారదర్శక పదార్థం ద్వారా ప్రయాణించే 'రంగు కాంతి' రంగు మారదు.

 

34. కృత్యం - 3లో చూసినట్లు ప్రకృతిలో మీరు రంగులు చూడగలిగిన సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా?  (AS - 1)  (2 Marks)

జ: ప్రకృతిలో కనిపించే ఉదాహరణ ఇంద్రధనుస్సు


35. ఆకాశంలో ఇంద్రధనుస్సును మీరు ఎప్పుడు చూశారు?(AS - 1) (1 Mark)
జ: * వర్షం కురిసిన రోజున ఆకాశంలో ఇంద్రధనుస్సును చూశాను.
* అనేక లక్షల నీటి బిందువులతో కాంతి విక్షేపణం చెందడం వల్ల అందమైన ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది.


36. మనం ఇంద్రధనుస్సును కృత్రిమంగా ఏర్పరచగలమా? (AS - 1) (1 Mark)
జ: మనం ఇంధ్రధనుస్సును కృత్రిమంగా ఏర్పరచగలం.


37. వాననీటి బిందువుల్లో విక్షేపణం చెందిన కాంతి అర్ధ వలయాకారంలో ఎందుకు కనిపిస్తుంది?(AS - 1) (4 Marks)

ఇంద్రధనస్సు మనకి కనిపించే విధంగా పలుచని ద్విమితీయ చాపం (arc) కాదు.
* పటంలో చూపినట్లు ఇంద్రధనుస్సు అనేది మీ కంటి వద్ద తన కొనభాగాన్ని కలిగిన త్రిమితీయ శంకువు (three dimensional cone).
* మీ వైపుగా కాంతిని విక్షేపణం చేసే అన్ని నీటి బిందువులు, వివిధ పొరలున్న శంకువు ఆకారంలో అమరి ఉంటాయి. మీ కంటికి ఎరుపు రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు శంకువు బాహ్యపొరపై ఉంటాయి.
దాని కంటే కిందిపొరలో ఉన్న శంకువు ఉపరితలంపై నారింజ రంగు (orange) కాంతిని చేరవేసే నీటిబిందువులు ఉంటాయి.
* అదేవిధంగా పసుపు రంగును చేరవేసే శంకువు నారింజ రంగు కాంతిని చేరవేసే శంకువుకు కింది పొరలో ఉంటుంది. ఇలా ఈ క్రమంలో అన్నింటికంటే అంతరంలో ఉండే ఊదారంగును చేరవేసే శంకువు వరకు కొనసాగుతుంది. (పటం చూడండి)


38. ఆకాశం నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది? (AS - 1) (2 Marks)
జ: 
*ఆకాశం కాంతి పరిక్షేపణం వల్ల నీలిరంగులో కనిపిస్తుంది.
*  వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలిరంగుకు కారణాలు.
* ఈ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.

39. పరిక్షేపణం అంటే ఏమిటి? (AS - 1) (1 Mark)
జ: * ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.

 

40. స్వేచ్ఛా పరమాణువు లేదా అణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం ఉన్న కాంతి పతనం చెందితే ఏం జరుగుతుంది?(AS - 1) (2 Marks)
జ: * పరమణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినప్పుడు అవి కాంతి శక్తిని శోషించుకుని (emission) అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం (absorb) చేస్తాయి. ఇదే కాంతి పరిక్షేపణంలోని ప్రాథమిక నియమం.
* పరమాణువు లేదా అణువు పరిమాణాన్ని బట్టి వాటిపై కాంతి ప్రభావం ఆధారపడి ఉంటుంది.
*  కణం (పరమాణువు లేదా అణువు) పరిమాణం తక్కువగా ఉంటే, అది ఎక్కువ పౌనఃపున్యం (తక్కువ తరంగదైర్ఘ్యం) ఉన్న కాంతితో ప్రభావితమవుతుంది.
*  అలాగే ఎక్కువ పరిమాణం ఉన్న కణం తక్కువ పౌనఃపున్యం (ఎక్కువ తరంగదైర్ఘ్యం) ఉన్న కాంతితో ప్రభావితమవుతుంది.

41. వేసవి రోజుల్లో (ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో) ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకు? (AS - 1) (4 Marks)
జ: * వాతావరణంలో వివిధ పరిమాణాల్లో కణాలుంటాయి. వాటి పరిమాణాలకు అనుగుణంగా అవి వివిధ తరంగదైర్ఘ్యాలున్న కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
* ఉదాహరణకు N2, O2 అణువుల కంటే నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగు కాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలు (ఎక్కువ తరంగదైర్ఘ్యాలు) ఉన్న కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
* వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది. తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి. ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలున్న (నీలిరంగు కానివి) కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
* N2, O2 ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగు కాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనిపిస్తుంది.

 

42. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం మీకు తెలుసా?(AS - 1) (4 Marks)
జ: *వాతావరణంలో వివిధ పరిమాణాల్లో స్వేచ్ఛా అణువులు, పరమాణువులు ఉంటాయి. ఇవి వాటి పరిమాణాలకు అనుగుణంగా వివిధ తరంగదైర్ఘ్యాలున్న కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
* వాతావరణంలోని ఎరుపు రంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చగల పరిమాణం ఉండే అణువులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు కాంతి మిగతా రంగుల కంటే తక్కువగా పరిక్షేపణం చెందుతుంది.
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడి నుంచి వెలువడే కాంతి మన కంటికి చేరడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది కాంతి మన కంటిని చేరే లోపే ఆ రంగులన్నీ కనుమరుగవుతాయి.
* ఎరుపు రంగు కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అది మన కంటిని చేరుతుంది.
* ఫలితంగా సూర్యోదయం, సూర్యాస్త సమయాల్లో సూర్యుడు ఎరుపుగా కనిపిస్తాడు.

 

43. మధ్యాహ్న వేళల్లో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపించడో ఊహించగలరా? (AS - 1) (2 Marks)
జ: * ఉదయం, సాయంత్ర వేళల కంటే మధ్యాహ్న సమయంలో వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ.
* కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందకపోవడం వల్ల అన్ని రంగులు మనకంటిని చేరతాయి.
* కాబట్టి మధ్యాహ్నం వేళల్లో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు.


కృత్యాలు

1. స్పష్టదృష్టి కనిష్ఠ దూరం (Least distance of distinct Vision) కనుక్కోవడానికి ఒక కృత్యాన్ని వర్ణించండి. (AS - 1) (2 Marks)
జ: * ఒక పుస్తకాన్ని తెరచి మీ కంటి ముందు కొంత దూరంలో పట్టుకుని చదవడానికి ప్రయత్నించండి.
* నెమ్మదిగా ఆ పుస్తకాన్ని మీ కంటివైపుగా, కంటికి అతి దగ్గరగా చేరే వరకు కదిలించండి.
పుస్తకంలో అక్షరాలు మసకబారినట్లుగా అనిపిస్తాయి లేదా మీ కన్ను ఒత్తిడి (strain)కి గురైనట్లు అనిపించవచ్చు.
*పుస్తకంలోని అక్షరాలను మీ కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగలిగే స్థానం వరకు నెమ్మదిగా పుస్తకాన్ని వెనకకు జరపండి. ఇప్పుడు పుస్తకానికి మీ కంటికి ఉన్న దూరాన్ని కొలవమని మీ స్నేహితురాలికి చెప్పండి. ఈ విలువను నోట్‌బుక్‌లో రాసి ఉంచండి. ఇదే కృత్యాన్ని మీ స్నేహితులతో చేయండి.
* ప్రతి ఒక్కరూ పుస్తకం ఎంత దూరంలో ఉన్నప్పుడు అక్షరాలను స్పష్టంగా చూడగలిగారో కొలవండి.
* మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ. దూరంలో ఉండాలని ఈ కృత్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
* ఈ దూరాన్ని 'స్పష్ట దృష్టి కనీస దూరం' అంటారు. ఇది వ్యక్తి వ్యక్తికీ, వయసును బట్టి మారుతుంది.

2. మీ కంటికి 25 సెం.మీ. దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్నా దాన్ని పైనుంచి కింది వరకు మీరు చూడగలరా? ఏదైనా ఒక కృత్యం ద్వారా దృష్టి కోణం విలువ ఎంత ఉంటుందో తెలుసుకునే విధానాన్ని వివరించండి. (AS - 3) (4 Marks)
జ:  బట్టల దుకాణంలో బట్ట చుట్టలకు వచ్చే కర్రలు లేదా ఎలక్ట్రిక్ వైరింగ్ కోసం వాడే PVC పైపులను సేకరించండి. వాటిని 20 సెం.మీ., 30 సెం.మీ., 35 సెం.మీ., 40 సెం.మీ., 50 సెం.మీ. పొడవు ఉన్న ముక్కలుగా కత్తిరించండి.
* ఒక రిటార్ట్ స్టాండ్‌ను బల్లపై ఉంచి పటంలో చూపినట్లు రిటార్ట్ స్టాండ్ నిలువు కడ్డీ (Vertical rod) పక్కన మీ తల ఉండే విధంగా బల్ల దగ్గర నిల్చొండి. మీ కంటి నుంచి 25 సెం.మీ. దూరంలో రిటార్డ్ స్టాండ్ అడ్డుకడ్డీకి
(Horizontal rod) క్లాంప్‌ను బిగించండి.
* ఆ క్లాంప్‌ను పటంలో చూపినట్లు 30 సెం.మీ. పొడవున్న కర్రను కట్టమని మీ స్నేహితురాలికి చెప్పండి. ఇప్పుడు అడ్డుకడ్డీ వెంబడి మీ దృష్టి సారిస్తూ, కర్రముక్క (30 సెం.మీ. కర్ర)ను పైఅంచు నుంచి కింది అంచు వరకు మొత్తంగా చూడటానికి ప్రయత్నించండి.
* స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెం.మీ. అని తెలుస్తుంది.
* కర్రముక్క 25 సెం.మీ. దూరంలో ఉన్నప్పుడు దాని రెండు చివరలను మీరు స్పష్టంగా చూడలేకపోతే, అడ్డుకడ్డీ వెంబడి కర్రముక్కను వెనుకకు జరపండి. ఏ కనీస దూరం వద్ద మీరు దాన్ని పూర్తిగా చూడగలరో అక్కడ దాన్ని అడ్డుకడ్డీకి క్లాంప్ సహాయంతో బిగించండి.
* అడ్డుకడ్డీపై క్లాంప్ స్థానం మారకుండా 30 సెం.మీ. కర్రస్థానంలో మిగిలిన కర్రలను (మీరు కత్తిరించిన వివిధ పొడవున్న కర్రలను) ఒక్కొక్కటిగా ఉంచుతూ కనుగుడ్డును పైకి - కిందికి లేదా పక్కలకు కదల్చకుండా ఆ కర్రముక్కలను పైనుంచి కిందివరకూ ఏకకాలంలో చూడటానికి ప్రయత్నించండి.
* పటం - బి ను పరిశీలించండి. స్పష్ట దృష్టి కనీస దూరంలో (25 సెం.మీ. దూరంలో) ఉన్న వస్తువు AB ని మీరు పూర్తిగా చూడగలరు. ఎందుకంటే వస్తువు A, B స్థానాల నుంచి వచ్చే కాంతి కిరణాలు మీ కంటిలోకి చేరతాయి.
* అదేవిధంగా CD అనే వస్తువును కూడా పూర్తిగా చూడగలరు. పటం - బి లో చూపినట్లు AB వస్తువు మీ కంటికి దగ్గరగా A', B' స్థానం వరకు జరిగిందనుకుందాం.
* పటం - బి ను పరిశీలిస్తే A', B' స్థానంలో ఉంచిన వస్తువులో కొంతభాగం (EF) మాత్రమే మీరు చూడగలరని తెలుస్తుంది. ఎందుకంటే E, F ల నుంచి వచ్చే కాంతి కిరణాలు మీ కంటిలోకి చేరతాయి. కానీ A', B' బిందువుల నుంచి వచ్చే కాంతికిరణాలు మీ కంటిలోకి చేరవు.
* వస్తువు చివరి బిందువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తాయి. ఈ కోణం 60 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువును మొత్తం మనం చూడగలం. ఈ కోణం 60 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువులో కొంత భాగం మాత్రమే మనం చూడగలం.
* ఏ గరిష్ఠ కోణం వద్ద మనం వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని 'దృష్టి కోణం'
(angle of vision ) అంటారు. ఆరోగ్యవంతుడి దృష్టికోణం సుమారుగా 60 డిగ్రీలు ఉంటుంది. ఇది వ్యక్తి వ్యక్తికీ వయసును బట్టి మారుతుంది.
 

3. కాంతి విక్షేపణం ప్రక్రియను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జ: * ఈ కృత్యాన్ని చీకటి గదిలో (వెలుగు తక్కువగా ఉన్న గదిలో) నిర్వహించాలి. తెల్లటి గోడకు దగ్గరగా ఒక టేబుల్‌ను ఉంచాలి.
ఒక కార్డ్‌బోర్డు షీట్‌కు మధ్యలో సన్నని రంధ్రం చేసి, దాన్ని టేబుల్‌పై నిలువుగా అమర్చాలి. కార్డ్‌బోర్డుకు, గోడకు మధ్యలో ఒక పట్టకాన్ని ఉంచాలి.
తెలుపు రంగు కాంతినిచ్చే కాంతిజనకాన్ని కార్డ్‌బోర్డుకు దగ్గరగా ఉంచి దాని రంధ్రం ద్వారా కాంతిని ప్రసరింపజేయాలి. రంధ్రం నుంచి వెలువడే కాంతి సన్నటి కాంతి పుంజాన్ని తలపిస్తుంది.
ఈ కాంతి పట్టకం ఏదో ఒక దీర్ఘచతురస్రాకార తలంపై పడే విధంగా, పట్టకాన్ని పట్టుకోవాలి.
పట్టక బహిర్గత కిరణాల్లో వచ్చే మార్పులను గమనించాలి. పట్టకాన్ని మెల్లగా తిప్పుతూ గోడమీద ప్రతిబింబం ఏర్పడే విధంగా చేయాలి.
* గది గోడపై ఏడు రంగుల వర్ణ పటాన్ని గమనించవచ్చు.
* గాజు పట్టకం తెల్లటికాంతి కిరణాన్ని ఏడు రంగులుగా విడగొట్టింది. (VIBGYOR)
* తెల్లటి కాంతి వివిధ రంగులు (VIBGYOR)గా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు.
* వివిధ రంగులకు విచలన కోణాలు తేడాగా ఉంటాయి.
* ఊదారంగుకు విచలనం గరిష్ఠంగా, ఎరుపు రంగుకు కనిష్ఠంగా ఉంటుంది.

4. తరగతి గదిలో ఇంద్రధనుస్సును ఏర్పరిచేందుకు ఒక కృత్యాన్ని రాయండి.
               లేదా
తెల్లటి కాంతిని వివిధ రంగులుగా విడదీసే కృత్యాన్ని వర్ణించండి. (AS - 3) (2 Marks)
జ:

* ఒక లోహపు పళ్లాన్ని (ట్రే) తీసుకుని, దాన్ని నీటితో నింపాలి. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా నీటిలో ఒక సమతల దర్పణాన్ని  (అద్దాన్ని) ఉంచాలి.
*  పటంలో చూపినట్లు నీటి ద్వారా అద్దంపై తెల్లటి కాంతిని ప్రసరింపజేయండి. ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లటి కార్డు బోర్డును ఉంచి రంగుల ప్రతిబింబాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
*  తెల్లటి కార్డు బోర్డుపై రంగుల పట్టిక కనిపిస్తుంది. ఈ రంగులు ఇంద్రధనుస్సులోని రంగులుగానే ఉంటాయి.
*  'VIBGYOR' రంగులను పరిశీలిస్తాం.

5. ఒక తెల్లటి గోడపై సూర్యకాంతిలోని సప్తవర్ణాలను ఏర్పరిచే కృత్యం వర్ణించండి. (AS - 3) (2 Marks)
జ: * ఒక తెల్లటి గోడను ఎంచుకోవాలి. దానిపై సూర్యకాంతి పడుతుండాలి. గోడకు అభిముఖంగా (సూర్యకాంతి మీ వీపుపై పడేవిధంగా) నిల్చొండి.
*  నీరు ప్రవహించే ఒక పైపును తీసుకుని, పైపు చివర మీ వేలుని అడ్డుగా ఉంచండి.
*  మీ వేలుకు, పైపునకు మధ్య ఉన్న సందుల ద్వారా నీరు ఫౌంటెన్‌లా బయటకు చిమ్ముతుంది.
*  ఇలా నీరుపైకి చిమ్మేటప్పుడు గోడపై జరిగే మార్పులను గమనించండి.
*  గోడపై ఏడు రంగుల పట్టీని చూస్తాం. ఇదే VIBGYOR.

6. కాంతి పరిక్షేపణాన్ని ప్రయోగ పూర్వకంగా చూపే కృత్యాన్ని వర్ణించండి. (AS- 3) (4 Marks)
జ: * ఒక బీకరులో సోడియం థయోసల్ఫేట్ (హైపో), సల్ఫ్యూరిక్ ఆమ్లాల ద్రావణాన్ని తీసుకోవాలి. ఈ గాజు బీకరును ఆరుబయట సూర్యుడి వెలుగులో ఉంచాలి.
* బీకరులో సల్ఫర్ స్ఫటికాలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. బీకరులో జరిగే మార్పులను పరిశీలించాలి.
* రసాయన చర్య జరుగుతున్న కొద్దీ సల్ఫర్ అవక్షేపం
(Precipitation) ఏర్పడటం మీరు గమనించవచ్చు. ప్రారంభంలో సల్ఫర్ స్ఫటికాలు చాలా చిన్నవిగా ఉంటాయి.
* చర్య జరుగుతున్న కొద్దీ సల్ఫర్ అవక్షేపం ఏర్పడి స్ఫటికాల పరిమాణం పెరుగుతుంది.
* మొదట సల్ఫర్ స్ఫటికాలు నీలిరంగులో ఉండి, వాటి పరిమాణం పెరుగుతున్నకొద్దీ తెలుపు రంగులోకి మారుతాయి. దీనికి కారణం కాంతి పరిక్షేపణం.
* ప్రారంభంలో సల్ఫర్ స్ఫటికాల పరిమాణం చాలా తక్కువగా ఉండి, అది నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చడానికి వీలైందిగా ఉంటుంది.
* కాబట్టి అప్పుడు అవి నీలిరంగులో కనిపిస్తాయి. సల్ఫర్ స్ఫటికాల పరిమాణం పెరుగుతున్న కొద్దీ, వాటి పరిమాణం ఇతర రంగు కాంతుల తరంగదైర్ఘ్యాలతో పోల్చడానికి వీలయ్యేదిగా ఉంటుంది. అప్పుడు ఆ స్ఫటికాలు ఇతర రంగుల కాంతులకు పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ అన్ని రంగులూ కలిసి తెలుపు రంగులా కనిపిస్తుంది.

 

అదనపు ప్రశ్నలు - జవాబులు
I. విషయావగాహన

1. స్పష్టదృష్టి కనీస దూరం అంటే ఏమిటి? దాని విలువ ఎంత? (2 మార్కులు)
జ: మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ. దూరంలో ఉండాలి. ఈ దూరాన్ని స్పష్టదృష్టి కనీస దూరం అంటారు.
* స్పష్టదృష్టి కనీస దూరం దాదాపు 25 సెం.మీ.


2. 'దృష్టికోణం' అంటే ఏమిటి? దాని విలువ ఎంత? (2 మార్కులు)
జ: ఏ గరిష్ఠ కోణం వద్ద మనం వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని 'దృష్టి కోణం' అంటారు.
ఆరోగ్యవంతుడి దృష్టి కోణం సుమారుగా 60 డిగ్రీలు ఉంటుంది.


3. మానవుడి కంటిలోని ముఖ్య భాగాలను వర్ణించండి. (4 మార్కులు)
జ: మానవుడి కంటిలోని ముఖ్య భాగాల్లో ఒకటైన కనుగుడ్డు
(Eye Ball ) దాదాపు గోళాకారంగా ఉంటుంది.
* కనుగుడ్డు ముందుభాగం ఎక్కువ వక్రంగా ఉండి, కార్నియా
(cornea) అనే పారదర్శక రక్షణ పొరను (protective membrance) కలిగి ఉంటుంది. కంటిలో బయటకు కనిపించే భాగం ఇదే.
* కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం
(aqueous humour) ఉంటుంది. దీని వెనుక ప్రతిబింబ ఏర్పాటుకు ఉపయోగపడే కటకం (crystalline lens) ఉంటుంది.
* నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య నల్లగుడ్డు/ఐరిస్
(iris) అనే కండర పొర ఉంటుంది.
* ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప
(pupil) అంటారు. మనకు కంటిలో కనిపించే రంగు ప్రాంతమే ఐరిస్.

4. కంటిలోని ఐరిస్ పాత్రను వివరించండి. (2 మార్కులు)
జ:* కనుపాపపై పడిన కాంతి కంటిలోపలికి వెళ్లి దాదాపు ఎలాంటి మార్పు లేకుండా బయటకు వస్తుంది. అందువల్ల కనుపాప నలుపు రంగులో కనిపిస్తుంది.
* కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి
(amount of light ) ని ఐరిస్ అదుపు చేస్తుంది.
కాంతి ప్రకాశం తక్కువ ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దదిగా చేసి ఎక్కువ పరిమాణంలో కాంతి లోపలికి వెళ్లే విధంగా చేస్తుంది.
* కాంతి ప్రకాశమంతంగా ఉన్న సందర్భాల్లో ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి కాంతి ఎక్కువ పరిమాణంలో కంటిలోకి పోనివ్వకుండా అదుపు చేస్తుంది.
* ఈ విధంగా కంటిలోకి వెళ్లే కాంతిని నియంత్రించే ద్వారం
(varaible aperture) లా పనిచేయడానికి కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది.


5. కంటి కటకం తన ఆకారాన్ని ఎందుకు మార్చుకోవాలి? (2 మార్కులు)
జ: * వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే, నాభ్యంతరం విలువ మారాల్సి ఉంటుంది.
* అలాగే కటక నాభ్యంతరం అనేది కటకం తయారైన పదార్థ స్వభావంపై, దాని వక్రతా వ్యాసార్ధంపైన ఆధారపడుతుంది.
అంటే కంటి నాభ్యంతరం మారితేనే వివిధ దూరాల్లో ఉన్న వస్తువులకు ప్రతిబింబ దూరం ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది.
*  కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోగలిగితేనే ఇది సాధ్యపడుతుంది.
*  అందుకే కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.


6. వస్తువు ఆకారం, పరిమాణం, రంగుల్లో ఏ మార్పు లేకుండా వస్తువును మనం గుర్తించడంలో 'రెటీనా' పాత్రను వర్ణించండి. (2 మార్కులు)
జ: * కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలకిందులుగా ఏర్పరుస్తుంది. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
* రెటీనాలో దండాలు
(rods) , శంకువులు (cones) అనే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలు ( receptors) ఉంటాయి.
*  ఇవి కాంతి సంకేతాలను
(signals) గ్రహిస్తాయి.
*  దండాలు రంగును గుర్తిస్తాయి. శంకువులు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
* ఈ సంకేతాలు దాదాపు ఒక మిలియన్ దృక్‌నాడుల
(optic - nerve fibers) ద్వారా మెదడుకు చేరతాయి. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం, రంగులను మనం గుర్తిస్తాం.
* సిలియరీ కండరాల సహాయంతో కంటికటకం వస్తుదూరానికి అనుగుణంగా తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.

 

7. కంటికి సంబంధించిన 'సర్దుబాటు' (accommodation) అనే పదాన్ని వివరించండి.
జ: * దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరీ కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
*  రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరీ కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి.
*  ఇలా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే పద్ధతిని 'సర్దుబాటు'
(accommodation) అంటారు.


8. హ్రస్వదృష్టి అంటే ఏమిటి? దాన్ని సవరించడం ఎలా? (2 మార్కులు)
జ: *  కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఈ దృష్టి దోషాన్ని హ్రస్వదృష్టి అంటారు.
*  తగిన నాభ్యంతరం ఉన్న ద్విపుటాకార కటకం ఉపయోగించి హ్రస్వ దృష్టిని సవరించవచ్చు.


9. 'గరిష్ఠ దూరబిందువు' (far point) 'కనిష్ఠ దూరబిందువు' (near point) అంటే ఏమిటి? (2 మార్కులు)
జ: గరిష్ఠ బిందువు: ఏ గరిష్ఠ దూరం వద్ద ఉన్న బిందువుకు, లోపల ఉండే వస్తువులకు మాత్రమే కంటి కటకం 'రెటీనా'పై ప్రతిబింబం ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును గరిష్ఠ దూరబిందువు అంటారు.
కనిష్ఠ దూరబిందువు: ఏ కనిష్ఠ దూరం వద్ద ఉన్న బిందువుకు అవతల ఉన్న వస్తువులకు మాత్రమే కంటి కటకం 'రెటీనా' పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో, ఆ బిందువును కనిష్ఠ దూరబిందువు అంటారు.

 

10. దీర్ఘదృష్టి అంటే ఏమిటి? దీన్ని ఎలా సవరిస్తారు? (2 మార్కులు)
జ: దీర్ఘదృష్టి: దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తులు దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు కానీ దగ్గరి వస్తువులను చూడలేరు.
* తగిన నాభ్యంతరం ఉన్న ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి దీర్ఘదృష్టిని సవరించవచ్చు.


11. కాంతి తీవ్రతను నిర్వచించండి. (ఒక మార్కు)
జ: కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం ఉన్న తలం ద్వారా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని కాంతి తీవ్రత
(intensity of light) అంటారు.


12. మానవుడి కంటి నిర్మాణాన్ని చూపే పటం గీసి భాగాలు గుర్తించండి. (2 మార్కులు)
జ: మానవుడి కంటి నిర్మాణం

13. చత్వారం అంటే ఏమిటి? దాన్ని ఎలా సవరిస్తారు? (4 మార్కులు)
జ: చత్వారం
(Presbyopia)
* సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం (Power of accommodation) తగ్గిపోతుంది. ఈ దృష్టిదోషాన్ని చత్వారం అంటారు.
* వయసుతోపాటుగా చాలా మందికి కనిష్ఠ దూర బిందువు
(near point) క్రమంగా దూరమైపోతుంది. అప్పుడు వారు, దగ్గరలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు.
* సిలియరీ కండరాలు క్రమంగా బలహీనపడి కంటి కటక స్థితిస్థాపక లక్షణం క్రమంగా తగ్గిపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కొన్నిసార్లు వయసు పెరగడం వల్ల ఒక వ్యక్తికి హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి దోషాలు రెండూ కలగవచ్చు.
సవరణ: * ఇలాంటి సందర్భాల్లో దోషాన్ని సవరించడానికి ద్వినాభ్యంతర కటకాన్ని
(bi-focal lense) ఉపయోగించాలి.
* ఈ కటకం పైభాగంలో పుటాకార కటకం, కింది భాగంలో కుంభాకార కటకం ఉంటాయి.

 

14. వాతావరణం ఉపరితల భాగం నుంచి చూస్తే ఆకాశం నల్లగా కనిపిస్తుంది. ఎందుకు? (2 మార్కులు)
జ: *  వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులు సూర్యకాంతిని పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
*  వాతావరణం లేని ప్రాంతంలో సూర్యకాంతి ఎలాంటి పరిక్షేపణం చెందదు. అందువల్ల వాతావరణ ఉపరితలభాగం నుంచి ఆకాశాన్ని చూస్తే నల్లగా కనిపిస్తుంది.

 

15. కాంతి పరిక్షేపణం అంటే? కాంతి పరిక్షేపణ దృగ్విషయాన్ని వివరించండి. (4 మార్కులు)
జ: కాంతి పరిక్షేపణం: ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు


* పటంలో చూపినట్లు అంతరాళం (Space )లో ఒక స్వేచ్ఛా పరమాణువు లేదా అణువు ఉందనుకుందాం.
* ఆ కణంపై నిర్దిష్ట పౌనఃపున్యం ఉన్న కాంతి పతన చెందింది అనుకుందాం. ఆ కణం పరిమాణం పతనం చెందిన కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కాంతికి ఆ కణం స్పందిస్తుంది.
* ఈ నియమం పాటించినప్పుడు మాత్రమే ఆ కణం కాంతిని శోషించుకుని కంపనాలు చేస్తుంది. ఈ కంపనాల వల్ల ఆ కణం శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో తిరిగి ఉద్గారం చేస్తుంది.
* ఈ ఉద్గారాన్నే కాంతి పరిక్షేపణం అంటారు. ఉద్గారమైన కాంతిని పరిక్షేపణ కాంతి అంటారు.
*  ఉద్గారం చేసిన పరమాణువు లేదా అణువును పరిక్షేపణ కేంద్రం (Scattering centre) అంటారు.
 

16. ఒక గాజు పట్టకం తెల్లటి కాంతిని విక్షేపణం చెందిస్తుంది. ఇదే ప్రక్రియను ఒక గాజు దిమ్మె ఎందుకు చేయలేదు? (4 మార్కులు)
జ: * ఒక గాజు పట్టకంలో ఏటవాలుగా కొంత కోణంలో అమర్చిన రెండు సమతలాల వద్ద వక్రీభవనం జరుగుతుంది.
ఒక తలం వద్ద కాంతి విక్షేపణం జరిగి దానిలోని రంగులు భిన్నకోణాల్లో విచలనం చెందుతాయి.
* రెండో తలం వద్ద ఈ విభజన చెందిన రంగులు మళ్లీ వక్రీభవనం చెంది మరింతగా విడిపోతాయి.
* దీర్ఘచతురస్రాకారపు గాజుదిమ్మెలో వక్రీభవనం రెండు సమాంతర సమతలాల వద్ద జరుగుతుంది.
మొదటి తలం వద్ద తెల్లటి కాంతి వక్రీభవనం వల్ల భిన్న రంగులుగా విడిపోయినా, ఈ విడిపోయిన రంగులు రెండో తలం వద్ద తిరిగి వక్రీభవనం చెంది సమాంతర కిరణ పుంజాలుగా బహిర్గతమవుతాయి.
* ఈ సమాంతర కాంతిపుంజాలు కలిసి తిరిగి తెల్లటి కాంతిగా కనిపిస్తాయి.

17. వర్షం తరువాత ఇంద్రధనస్సు ఎందుకు ఏర్పడుతుంది? (2 మార్కులు)
జ: * వర్షం తరువాత సూర్యకాంతి యొక్క సహజ వర్ణపటం ఇంద్రధనస్సు.
* వాతావరణంలోని నీటి బిందువులపై సూర్యకాంతి పతనం చెంది పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం లాంటి ప్రక్రియల వల్ల ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.

 

18. ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలోనే ఎందుకు ఏర్పడుతుంది? (1 మార్కు)
జ: * ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలోనే ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే సూర్యకిరణాలు వర్షపు బిందువులపై పతనం చెందాలి. అప్పుడే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.


19. ఏకవర్ణ కాంతికిరణం గాజుపట్టకం ద్వారా ప్రయాణించినప్పుడు అది మరికొన్ని రంగులుగా విడిపోతుందా? మీ జవాబుకు కారణాలు రాయండి. (2 మార్కులు)
జ:* ఏకవర్ణ కాంతి అంటే ఒకే రంగు కాంతి. ఏ యానకం ఈ కాంతి పౌనఃపున్యాన్ని మార్చలేదు.
గాజు పట్టకం ద్వారా వక్రీభవనం చెందిన ఈ రంగు కాంతి పౌనఃపున్యంలో మార్పు ఉండదు.
అందువల్ల ఏకవర్ణ కాంతి గాజుపట్టకం ద్వారా వక్రీభవనం చెంది బహిర్గతమైతే అదే రంగు కాంతి వస్తుంది. కాంతి కిరణాలు ఎలాంటి రంగు మార్పిడికి లోనుకావు.


20. గాలిలో ఎగురుతున్న విమానంలోని పరిశీలకుడికి ఇంద్రధనస్సు ఎలా కనిపిస్తుంది? (2 మార్కులు)
జ:* గాలిలో ఎగురుతున్న పరిశీలకుడికి ఇంద్రధనస్సు పూర్తిగా వర్తులాకారంగా కనిపిస్తుంది.
* ఇంద్రధనస్సు అనేది త్రిమితీయ శంఖువు. తెల్లటి సూర్యకాంతిని విక్షేపణం చెందించడం వల్ల ఏర్పడిన ఈ శంఖువు ఆధారభాగం వృత్తాకారంగా ఉంటుంది.
ఈ వృత్తాకార భాగమే విమానంలోని పరిశీలకుడికి కనిపిస్తుంది.

 

21. వేరు వేరు ప్రాంతాల నుంచి పరిశీలిస్తున్న ఇద్దరు పరిశీలకులకు ఇంద్రధనస్సు ఒకే మాదిరిగా కనిపిస్తుందా? (2 మార్కులు)
జ: * తెల్లటి సూర్యకాంతిని నీటి బిందువులు విక్షేపణం చెందించడం వల్ల ఏర్పడిన ఇంద్రధనస్సు మనకు కనిపించే కోణం
40 నుంచి 42 మధ్యలో ఉన్నపుడే అన్నిరంగులు కనిపిస్తాయి.
* కోణం
40 ఉంటే మనకు ఉదా రంగు (Violet) కాంతి కనిపిస్తుంది. కోణం 42 ఉంటే మనకు ఎరుపురంగు (Red) కాంతి కనిపిస్తుంది. ఈ కోణాల మధ్య VIBGYORలోని అన్ని రంగులు కనిపిస్తాయి.
* పరిశీలకులు భిన్న ప్రాంతాల్లో ఉండటం వల్ల ఏర్పడిన ఇంద్రధనస్సును భిన్నకోణాల్లో చూస్తారు.
* ఇంద్రధనస్సు శిఖరం నుంచి పరిశీలిస్తారు కాబట్టి ఒక్కో పరిశీలకుడికి ఇది ఒక్కో రకంగా కనిపిస్తుంది.


22. వాన నీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి అర్ధవలయాకారంలో ఎందుకు కనిపిస్తుంది?(4 మార్కులు)
జ:

* పటంలో చూపినట్లు ఇంద్రధనస్సు మీ కంటి వద్ద తన కొనభాగాన్ని కలిగి ఉన్న త్రిమితీయ శంఖువు (Three dimensional coner). మీ వైపుగా కాంతిని విక్షేపణం చేసే అన్ని నీటి బిందువులు, వివిధ పొరలతో ఉన్న శంఖువు ఆకారంలో అమరి ఉంటాయి. మీ కంటికి ఎరుపు రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు శంఖువు బాహ్య పొరపై ఉంటాయి.
* దాని కిందిపొరలో ఉన్న శంఖువు ఉపరితలంపై నారింజరంగు (orange) కాంతిని చేరవేసే నీటి బిందువులు ఉంటాయి.
* అదేవిధంగా పసుపు రంగును చేరవేసే శంఖువు నారింజ రంగు కాంతిని చేరవేసే శంఖువుకు కింద ఉండే పొరలో ఉంటుంది. ఇలా ఈ క్రమం అన్నింటి కంటే అంతరంలో ఉండే ఉదారంగును చేరవేసే శంఖువు వరకు కొనసాగుతుంది.


23. పటం సహాయంతో పట్టకానికి సంబంధించిన కింది పదాలను నిర్వచించండి.
ఎ) పతన కిరణం, వక్రీభవన కిరణం, బహిర్గత కిరణం
బి) పతన కోణం, బహిర్గత కోణం
సి) విచలన కోణం
డి) లంబం

జ:

* పట్టకం ఆధార సరిహద్దు PQR త్రిభుజం.
ఎ) పతన కిరణం: ABకాంతి కిరణం PQ సమతలంపై పతనం చెందిన పతనకిరణం.
వక్రీభవణ కిరణం: పతన కిరణం పట్టకంలో MN వెంబడి వక్రీభవనం చెందింది. MN వక్రీభవనకిరణం. ఇది పట్టకంలో ప్రయాణించింది.
బహిర్గత కిరణం: వక్రీభవన కిరణంPR తలం నుంచిNCD వెంబడి బహిర్గతం అయ్యింది. అంటే CD బహిర్గత కిరణం.
బి) పతనకోణం: పట్టక తలం PQకు M వద్ద లంబాన్ని గీసారు. ఇది PQ తలానికి లంబం. పతనకిరణం ABకు M వద్ద గీసిన లంబానికి మధ్య ఉండే కోణం పతన కోణం (i1).
బహిర్గత కోణం: పట్టక PR తలానికి N వద్ద లంబాన్ని గీయాలి. ఇది PR తలానికి లంబం. బహిర్గత కిరణానికి వి వద్ద ఉండే లంబానికి మధ్య కోణం బహిర్గత కోణం (i2)
సి) విచలన కోణం: (d): పతన కిరణం, బహిర్గత కిరణాల మధ్య ఉండే కోణాన్ని విచలన కోణం అంటారు.
డి) లంబం: పట్టకం యొక్క ఏ తలానికైన ఏ బిందువు వద్ద లంబం గీసిన అది ఆ బిందువు వద్ద పట్టక ఆ తలానికి లంబం అవుతుంది.

24. పటం సహాయంతో పట్టకాన్ని వర్ణించండి. (4 మార్కులు)
జ: * ఒక పట్టకాన్ని తీసుకుని దాని త్రిభుజాకార ఆధారాన్ని డ్రాయింగ్ చార్టుపై ఉంచాలి. పట్టకం ఆధారం చుట్టూ పెన్సిల్‌తో గీత గీసి పట్టకాన్ని తీసివేయాలి.
* పట్టకం ఆధారహద్దు PQR త్రిభుజంగా వచ్చింది.
* ఒకదానికొకటి కొంతకోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుగా ఉన్న పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు.
* పట్టకంలో ఒక సమతలంపై కాంతి పతనం చెందితే, అది పట్టకం ద్వారా ప్రయాణించి రెండో సమతలం ద్వారా బయటకు వస్తుంది.
* తిభుజాకార గాజు పట్టకాన్ని పరిశీలిస్తే, దానికి రెండు త్రిభుజాకార ఆధారాలు
(Bases), మూడు దీర్ఘచతురస్రాకార వాలు సమతలాలు (Plane lateral surfaces) ఉంటాయి.
* ఈ మూడు వాలు తలాలు పరస్పరం కొంత కోణం చేసే విధంగా ఉంటాయి.


25. కంటిలోని సిలియరీ కండరాల పనితీరును మీరు ఎలా అభినందిస్తారు? (2 మార్కులు)
జ: * సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉంటే కంటి కటకం నాభ్యంతరం పెరగడం, సిలియరీ కండరాలు ఒత్తిడికి గురైతే కంటి కటకం నాభ్యంతరం తగ్గడం ఒక అద్భుతం.
* కంటిలోని ఈ 'సర్దుబాటు'
(accommdation) ప్రక్రియకు సిలియరీ కండరాలు సహకరించడం ఎంతో అభినందించ తగిన విషయం.
* ఈ 'సర్దుబాటు' కారణంగానే ప్రకృతి అందాలను మనిషి ఆస్వాదిస్తున్నాడు.
* ఈ 'సర్దుబాటు' లేకపోతే మన కంటికి ప్రతి వస్తువు అతుక్కుపోయినట్లు కనిపించడమే కాకుండా ప్రకృతి రమణీయతను ఎవరూ గుర్తించలేరు.
* ఈ కండరాల పనితీరు మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరంగా నేను భావిస్తున్నాను.


26. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ కనిపిస్తాయి. ఈ దృశ్యాన్ని మీరు ఎలా అభినందిస్తారు? అలా మినుకు, మినుకుమనడానికి కారణం ఏమిటి? (2 మార్కులు)
జ: పరిశీలకులకు ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమని కనిపించడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రకృతిలోని ఈ అందాన్ని నేను ఎంతో మెచ్చుకుంటాను, అభినందిస్తాను.
* నక్షత్రాలు మినుకు మినుకు మనడానికి కారణం వాతవరణం ఉష్ణోగ్రతలు పొరలు పొరలకు మారిపోతూ ఉండటమే. దీనివల్ల వాతావరణంలోని భిన్న పొరలకు వేరు వేరు సాంద్రతలు ఉంటాయి.
*
 వాతావరణంలో ఉష్ణోగ్రతలు, సాంద్రతలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఫలితంగా నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఈ వాతావరణ పొరల ద్వారా ప్రయాణించేటప్పుడు రకరకాల కోణాల్లో వక్రీభవనం చెందుతూ భిన్న దిశల్లోకి ప్రసారం అవుతూ ఉంటుంది.

* ఈ మార్పుల ఫలితంగా నక్షత్ర కాంతి ఒక సమయంలో పరిశీలకుడి దృష్టికి వచ్చి, మరో సమయంలో దృష్టి నుంచి తప్పించుకుంటుంది. ఈ విధంగా నక్షత్ర కాంతి పరిశీలకుడికి కనిపించి, కనిపించకపోవడం అనేది నిరంతరంగా జరుగుతూ ఉండటం వల్ల పరిశీలకుడికి నక్షత్రాలు మినుకు మినుకు మంటున్నట్లు అన్పిస్తుంది.


27. 'సూర్యాస్తమయం, సూర్యోదయం కనిపించే పద్ధతి మనకు ప్రకృతి ప్రసాదించినవరం'. దీన్ని ఎలా అభినందిస్తారు? వివరించండి.
జ: సూర్యోదయాన్ని సూర్యుడు ఉదయించడానికి రెండు నిముషాల ముందే మనం చూడగల్గుతున్నాం. సూర్యాస్తమయం అయిన రెండు నిమిషాల తరువాత కూడా మనం సూర్యుడిని చూడగల్గుతున్నాం.
* సూర్యుడు క్షితిజానికి పైకి రాగానే సూర్యోదయం అవుతుంది. అదే విధంగా సూర్యుడు క్షితిజానికి కిందికి దిగగానే సూర్యాస్తమయం అవుతుంది.
* వాతావరణంలో సూర్య కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల సూర్యుడు సూర్యోదయానికి రెండు నిమిషాలు ముందే మనకు కనిపిస్తాడు. అదే విధంగా సూర్యాస్తమయం అయిన రెండు నిముషాలు తరువాత కూడా సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు.
* ప్రకృతిలో కనిపించే ఒక అద్భుతం ఇది. దీనికి కారణం అయిన వాతావరణంలోని వక్రీభవనం నాకు ఎంతో నచ్చింది. నేను ఈ దృగ్విషయాన్ని అభినందిస్తాను.

 

28. 'హ్రస్వదృష్టి ఉన్నవారు కళ్లాద్దాలు లేకుండా పుస్తకాన్ని సులువుగా చదవగలరు'. ఈ వాక్యాన్ని సమర్థించండి. (2 మార్కులు)
జ:  హ్రస్వదృష్టి ఉన్నవారికి దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విధమైన కంటి దోషం ఉన్నవారు దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడలేరు. అందువల్ల హ్రస్వదృష్టి ఉన్నవారు కళ్లద్దాలు లేకుండా పుస్తకం చదవగలరు. ఎందుకంటే పుస్తకంలోని అక్షరాలు దగ్గరి వస్తువు మాదిరిగా కనిపిస్తాయి.


29. ఎరుపు రంగు కాంతిని మాత్రమే ప్రమాద సంకేతంగా ఎందుకు ఉపయోగిస్తారు? (2 మార్కులు)
జ:  దృశ్యకాంతిలోని రంగులన్నింటిలో ఎరుపు రంగు కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువ. వాతావరణం వల్ల లేదా పొగమంచు వల్ల ఎరుపు రంగు అతి తక్కువగా పరిక్షేపణం చెందుతుంది.
* అందువల్ల ఎరుపు రంగు కాంతి సులువుగా పొగ, పొగమంచు, ఇతర వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకు దూసుకుపోతుంది. ఏవిధమైన పరిక్షేపణానికి గురికాదు.
* వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా దూరం నుంచి ఎరుపు రంగును చూడటం వీలవుతుంది.
* ఎరుపు రంగును ప్రపంచవ్యాప్తంగా ప్రమాద కాంతి సంకేతంగా వినియోగిస్తున్నారు.

30. 'బొగ్గు పరిశ్రమల్లో పొగ గొట్టాల నుంచి వెలువడే పొగ, పొగమంచు రోజుల్లో నీలిరంగులో కనిపిస్తుంది'. ఎందుకు? కారణాలు వివరించండి. (2 మార్కులు)
జ: * పొగమంచు రోజుల్లో పొగ వెలువడే వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో నీటి అణువులు, దుమ్ము, కార్బన్ కణాలు ఉంటాయి.
* ఈ అణువుల కణాల ద్వారా తెల్లటి కాంతి ప్రసరించినప్పుడు దానిలోని నీలిరంగు కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది.
* పరిశీలకుడి కంటికి ఈ నీలిరంగు కనిపించడం వల్ల పొగ నీలిరంగులో ఉన్నట్లు భావిస్తాడు.


31. పొగమంచు రోజుల్లో నీలిరంగులో కనిపించే రెండు సందర్భాలను పేర్కొనండి. (2 మార్కులు)
జ: * దూరంగా ఉన్న కొండల మీద దట్టమైన చెట్లు పొగమంచు రోజుల్లో నీలిరంగులో కనిపిస్తాయి.
* పొగమంచు రోజుల్లో అగరబత్తి విడుదల చేసే పొగ నీలిరంగులో కనిపిస్తుంది.


32. తరచూ పొగమంచు, మంచు పట్టే ప్రదేశాల్లో తిరిగే వాహనాలకు నారింజ రంగు దీపాలు ఏర్పాటుచేస్తారు. ఎందుకు? (4 మార్కులు)
జ: * ఏ ప్రదేశాల్లో ఎక్కువగా పొగమంచు, మంచు పడుతుందో అక్కడి వాతావరణంలో నీటి బిందువులు ఎక్కువగా ఉంటాయి.
* ఆ ప్రాంతాల్లో వాహనాలకు తెలుపు రంగు కాంతిని విడుదల చేసే దీపాలు ఉంటే ఆ కాంతిని వాతావరణం పరిక్షేపణం చెందించడంతో వాహన చోదకుడికి మార్గం స్పష్టంగా కనిపించక వాహనాన్ని నడపడం కష్టం అవుతుంది.
* నారింజ రంగు కాంతి తరంగదైర్ఘ్యం సాపేక్షంగా ఎక్కువగా ఉండటం వల్ల ఆ కాంతి వాతావరణంలో చాలా తక్కువగా పరిక్షేపణం చెందుతుంది. ఫలితంగా వాహనం నడిపే వారికి ముందు మార్గం బాగా కనిపిస్తుంది.


33. దృష్టి దోషాలు సవరించేందుకు కటకాలను కళ్లద్దాలుగా వాడతారు. ఎందుకు? (2 మార్కులు)
జ: * సాధారణంగా దృష్టిదోషాలు 3 రకాలు. అవి
ఎ) హ్రస్వ దృష్టి           బి) దీర్ఘ దృష్టి             సి) చత్వారం
* కొన్ని సందర్భాల్లో కంటికి ఉండే 'సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా పై దృష్టి దోషాలు వస్తూ వుంటాయి.
* హస్వ దృష్టి సవరణకు ద్విపుటాకార కటకం, దీర్ఘదృష్టి సవరణకు ద్వికుంభాకార కటకం, చత్వారం సవరణకు ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగిస్తారు.
* ఈ కటకాలను కళ్లద్దాలుగా ఉపయోగించి దృష్టిదోషాలను సవరిస్తారు.

 

34. 2D కటకాన్ని వాడాలని డాక్టరు సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత? (2 మార్కులు)
జ: ఇచ్చినవి: కటక సామర్థ్యం f = 2D
                     కటక నాభ్యంతరం f = ?


35. 600 పట్టక కోణం ఉండే పట్టకం కనిష్ఠ విచలన కోణం (D) 30అయితే పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుక్కోండి. (4 మార్కులు)
జ: ఇచ్చినవి: పట్టక కోణం
A= 60
కనిష్ఠ విచలన కోణం D = 30
పట్టక పదార్థ వక్రీభవన గుణకం f = ?

Posted Date : 18-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం