• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రామాయ‌ణం

ప్రశ్నలు - జవాబులు

1. పాత్రల స్వభావాలు (రామాయణంలో మీకు నచ్చిన పాత్ర)

జ:

I. రాముడు

రాముడు గుణవంతుడు. ధర్మం తెలిసినవాడు. తండ్రి మాటకు గౌరవం ఇచ్చి దానికి కట్టుబడి ఉండే ఉత్తముడు. ఆపదలకు తొణకనివాడు. మాటతప్పనివాడు. అందరికీ మేలు చేసేవాడు. స్నేహశీలి. అన్ని రకాల విద్యల్లో ఆరితేరినవాడు. శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడటం బట్టి వీరుడిగా, ధీరుడిగా వెలిగాడు. గురుభక్తి మెండుగా ఉన్నవాడు. సీతను రావణుడు అపహరించినప్పుడు సహనంతో, నేర్పుతో సీతను దక్కించుకున్నాడు. తన తమ్ముళ్లపై అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నవాడు. శౌర్యపరాక్రమవంతుడిగా రాక్షసులను అంతమొందించాడు. యుద్ధనీతి తెలిసినవాడు. సీతను తనకు అప్పగించమని యుద్ధానికి ముందే రావణుడికి రాయబారం పంపిన దయార్ద్ర హృదయుడు రాముడు. ప్రజానురంజకంగా పరిపాలన చేసిన సుపరిపాలకుడు. ప్రజలను కన్నబిడ్డలుగా, ఎలాంటి బాధలు లేకుండా, ధర్మబద్ధంగా పరిపాలించాడు. యజ్ఞయాగాలను కొనసాగించిన పవిత్రమూర్తి. వియనశీలి. నిశ్చలభక్తి ఉన్నవాడు.

II. సీత

తండ్రి జనకుడి మాటకు ('శివ ధనుస్సును విరిచిన వ్యక్తితోనే వివాహం') కట్టుబడిన మహాసాధ్వి సీత. వనవాసానికి రాముడితోపాటే వెళ్లాలని నిశ్చయించుకున్న పతి భక్తిపరురాలు. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం అని తెలిసిన సుగుణరాశి. నారచీరలు ధరించి వనవాస నియమాలు పాటించింది. ప్రకృతి ప్రేమికురాలు. తన ఆశ్రమంలో, అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారమవుతుందని 'జింకను తేవాలని కోరిన జంతుకరుణ ఉన్నది. యతి రూపంలో వచ్చిన రావణుడికి సముచితంగా చేసిన మర్యాదను బట్టి అతిథులను సేవించడంలో ఘనమైన తల్లి. రావణుడు అపహరించుకుని వెళుతుండగా తన ఆభరణాలను కొంగులో కట్టి వానరుల మధ్య పారేసిన దాన్నిబట్టి దూరాలోచన ఉన్న మహనీయురాలు. లంకలోని సీతను తీసుకు వెళతానన్న హనుమంతుడితో 'పరపురుషుడిని తాకనని, శ్రీరాముడే రావణుడిని చంపి తనను తీసుకుపోవాలన్న' సత్యధీరురాలు. రావణుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తలొగ్గక శ్రీరాముడికి దూరమై బతకడం కంటే మరణించడమే మేలనుకున్న పతివ్రత. తన ప్రవర్తన గురించి సందేహముందన్న రాముడి మాట ప్రకారం 'అగ్ని ప్రవేశం' చేసి తన గొప్పదనాన్ని చూపిన పరమ పవిత్రురాలు.

III. లక్ష్మణుడు

దశరథ మహారాజు - సుమిత్రల పుత్రుడు. వేదశాస్త్ర అధ్యయనం చేసినవాడు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించినవాడు. చిన్ననాటి నుంచే అన్న రాముడి సేవలోనే ఉండేవాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞం కోసం రాముడితో కలిసి రాక్షసులను సంహరించాడు. జనకుడి కుమార్తె ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. తన తల్లి సుమిత్ర దీవెనలు పొంది రాముడితో కలిసి వనవాసానికి వెళ్లిన సౌశీల్యుడు.

అన్న శ్రీరాముడి ఆదేశం ప్రకారం చిత్రకూట పర్వతంపై నేరేడు కర్రలతో కుటీరాన్ని తయారు చేసినవాడు.   శూర్పణఖ ముక్కు చెవులు తీసేసినవాడు. సీత 'తనకు కావాలని' కోరిన జింకను మాయామృగమని చెప్పిన పరిజ్ఞాని. లోకాలను ధ్వంసం చేయాలని సిద్ధపడిన రాముడికి ఓదార్పు మాటలను పలికిన శాంతమూర్తి. నిర్లక్ష్యంతో ఉన్నాడన్న సుగ్రీవుడితో మాట్లాడేందుకు కోపంగా వచ్చిన లక్ష్మణుడికి 'తార' ఎదురైన సందర్భంలో స్త్రీల పట్ల కోపం ప్రదర్శించరాదనే భావనను బట్టి లక్ష్మణుడికి స్త్రీలంటే గౌరవం అని తెలుస్తుంది. శ్రీరాముడికి సహాయకుడిగా, సీతాన్వేషణలో 'తన ప్రాణాలు పోయినా' సరే అని అనుకుని పోరాడిన విశ్వసనీయుడు. యువరాజుగా ఉండమని రాముడు కోరినా వద్దని వారించిన రాజ్యకాంక్షలేని నిస్వార్థపరుడు లక్ష్మణుడు.

IV. హనుమంతుడు

సుగ్రీవుడి మంత్రి. వాయుపుత్రుడు. అతి బలవంతుడు. ఎక్కడికైనా వెళ్లగల శక్తిమంతుడు. మాటల నేర్పరి. సీతాన్వేషణ కార్యభారాన్ని మరిచిన సుగ్రీవుడికి కర్తవ్యం గుర్తుచేసినవాడు. సుగ్రీవుడు వానరులను రమ్మని అన్న వార్తను అన్ని దిక్కులకు వేగంగా చేరవేశాడు. సీతాన్వేషణలో దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో వెళ్లినవాడు. నమ్మకంతో జాడను కనిపెడతాడని రామముద్రికను గ్రహించినవాడు. తనకు జాంబవంతుడు తెలిపిన శక్తియుక్తులకు ప్రేరణ పొంది మహా సముద్రాలను అవలీలగా దాటగలనని ప్రకటించినవాడు. లంకలో సీతమ్మను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళతానని పలికినవాడు. సూక్ష్మబుద్ధి, సమయస్ఫూర్తి ఉన్నవాడు. లంకలో సీత కోసం అణువణువు వెతికినవాడు.

అక్కడే ఉన్న సీత కోసం రామకథను గానం చేసినవాడు. రావణుడు పంపిన 80 వేల మంది రాక్షసులను చంపిన యోధుడు. 'చూసి రమ్మంటే కాల్చివచ్చాడు' అనే సామెత పుట్టేందుకు కారణమైన కార్యశీలి. ఇచ్చిన పనిని సాధించడమే కాదు, దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించే ఉత్తమ సేవకుడు. శ్రీరాముడి ఆదరాభిమానాలు పొందినవాడు. రావణుడి 'శక్తి' ఆయుధానికి పడిపోయిన లక్ష్మణుడి కోసం సంజీవనీ (ఔషధ) పర్వతాన్నే తెచ్చినవాడు.

V. దశరథుడు

కోసల దేశ రాజు. సూర్యవంశానికి చెందినవాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేసినవాడు.ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఇతడి పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. 'పుత్రకామేష్టి' యాగాన్ని ప్రారంభించాడు. అతిథులను దేవుడితో సమానంగా భావించేవాడు. దశరథుడి వినయానికి విశ్వామిత్రుడంతటి వాడే మురిసిపోయాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేతత్వం ఉన్నవాడు. పుత్రులపై ఎంతో ప్రేమ ఉన్నవాడు. జటాయువును ఆత్మీయుడైన స్నేహితుడిగా గలవాడు. తాను గతంలో ముని బాలకుడిని పొరపాటుగా చంపిన సంఘటనను, అతడి తల్లిదండ్రులు ఇచ్చిన శాపం తన పుత్ర వియోగానికి కారణమయ్యిందని గ్రహించినవాడు. శ్రీరాముడి ఎడబాటుకు మనసు కకావికలమై, దుఃఖాగ్నికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన త్యాగశీలి.

VI. సుగ్రీవుడు

కిష్కింధ రాజుగా, వానర రాజుగా ఉన్న మహావీరుడు. రాముడితో అగ్నిసాక్షిగా మిత్రుడైనవాడు. తన అన్న వాలి కిష్కింధకు రాజుగా ఉన్నప్పుడు 'మాయావి' యుద్ధానికి వస్తే అన్న మాట ప్రకారం భూగృహ ద్వారం వద్దే ఉన్నాడు. వాలి సుగ్రీవుడిని రాజుగా చూసి కోపంతో రాజ్యభ్రష్టుడిని చేశాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో రుష్యమూక పర్వతంపై బతికాడు.

శ్రీరాముడి సహాయంతో తన భార్యను అపహరించిన తన అన్న వాలిని చంపించినవాడు. సీతాన్వేషణ కోసం వానర వీరులను అన్ని దిక్కులకు పంపినవాడు. దుఃఖంతో పొంగిపోతున్న రాముడిని ''దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుంది. అది క్రోధం చూపాల్సిన సమయం" అని ఊరడించిన స్నేహశీలి. సీతాదేవి రాముడి వద్దకు చేరే వరకు తన వంతు పాత్రను పోషించిన ఘనుడు. రావణుడిని ముప్పుతిప్పలు పెట్టిన యోధుడు. హనుమంతుడు మంత్రిగా ఉన్నవాడు. స్నేహం విలువ తెలిసిన మహోన్నతుడు.

2. వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి కారణాలు విశ్లేషించండి.

జ: మునిశ్రేష్ఠుడు వాల్మీకి

నారదుడు ఒక రోజు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.

వాల్మీకి నారదుడిని 'మంచి గుణాలు ఉన్నవాడు, ధర్మం తెలిసినవాడు, మాట తప్పనివాడు, వీరుడు, ధీరుడు ఈ లోకంలో ఉన్నాడా' అని అడిగాడు.

నారదుడు 'శ్రీరాముడు' అని తెలిపాడు. రామకథను తెలియపరిచాడు.

రామకథ విని స్నానానికి తమసా నదికి వాల్మీకి వెళ్లాడు.

అక్కడ ఒక వేటగాడు పక్షుల జంటలో ఒకదాన్ని చంపాడు. వెంటనే వాల్మీకి నోటివెంట 'శ్లోకం' వచ్చింది.

ఒకరోజు బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు మళ్లీ అదే శ్లోకం (మా నిషాద) వచ్చింది.

అన్నీ తెలిసిన బ్రహ్మ అది తన సంకల్పమే అని చెప్పి 'శ్రీరామచరిత్ర' రాయమని ఆదేశించాడు.

''ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథను జనులు కీర్తిస్తుంటార"ని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించాడు.

వాల్మీకి మహర్షి బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

3. 'బాలకాండం' నుంచి ముఖ్య విషయాలు రాయండి.

జ:  దశరథ మహారాజు సంతానం కోసం అశ్వమేధయాగం, పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. దాని ఫలితంగా శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

విశ్వామిత్రుడు చేసే యజ్ఞ రక్షణ కోసం రామ, లక్ష్మణులు వెళ్లి మారీచ, సుబాహు అనే రాక్షసులను చంపారు.

మిథిలా నగరంలోకి రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్లే సమయంలో సమీపాన ఉన్న గౌతమాశ్రమంలో రాముడు అహల్య శాపవిమోచన చేశాడు.

శివ ధనస్సును ఎక్కుపెట్టి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు.

అయోధ్యకు బయలుదేరిన రాముడికి పరశురాముడు తన దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టమని అడగడం - రాముడు ఎక్కుపెట్టింది చూసి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్లడం.

4. 'రామాయణం' నుంచి మీరు గ్రహించిన అనుసరణీయ మార్గాలు రాయండి.

జ:  'రామాయణం'లో దశరథుడి ద్వారా అతిథిని దేవుడుగా భావించడం. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవడం.

రాముడి ద్వారా పితృవాక్య పరిపాలనాసక్తి, గర్వం లేకపోవడం, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండటం; అసూయ, మాత్సర్యం లేకుండా ఉండటం

సీతాదేవి ద్వారా భర్తపట్ల ప్రేమ, అనురాగం, సహనం కలిగి ఉండటం, మనసు మారకుండా ఉండటం. తప్పు చేయడం కంటే ప్రాణం పోవడం మంచిదని ఆమె చాటింది.

లక్ష్మణుడి ద్వారా అన్న పట్ల ప్రేమభావం, అన్న ఆజ్ఞను గౌరవించడం అనుసరణీయ మార్గం.

సుగ్రీవుడి ద్వారా స్నేహం కోసం ఎంతటి పనినైనా చేయడం గ్రహించవచ్చు.

హనుమంతుడి ద్వారా మాటలతో మెప్పించడం, అనుకున్నది ఏదైనా చేసేయడం. 'చూసి రమ్మంటే కాల్చిరావడం' అనే సామెతకు పరాకాష్ఠ హనుమంతుడిని ఉదాహరణగా చెప్పొచు. ప్రేరణ పొందితే శక్తి బయటకు వస్తుంది అనేది ఈయన ద్వారా గ్రహించవచ్చు.

విభీషణుడి ద్వారా ధర్మం వైపు ప్రయాణించాలని, ధర్మం మనల్ని రక్షిస్తుందని గ్రహించవచ్చు.

మంచితనంగా ఉండటం, చెడు మార్గాల వైపు ప్రయాణిస్తే నశించడం, సమూహంగా ఉంటే దేనినైనా తేలికగా సాధించవచ్చు.

వినయం కలిగి ఉండటం, సజ్జనులతో వివిధ విషయాలు చర్చించడం, సోమరితనం లేకుండటం. దీనులను ఆదుకోవడం, మృదువుగా మాట్లాడటం రామాయణం నుంచి గ్రహించాల్సిసిన అనుసరణీయ  మార్గాలు.

5. రాముడు శివధనుస్సు విరిచి సీతను వివాహమాడిన తీరును వివరించండి.

జ: మిథిలా నగరానికి వెళ్లిన విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను జనకుడు సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు వారి దగ్గర ఉన్న ధనస్సును రామలక్ష్మణులకు చూపించమన్నాడు. జనకుడు 'శివధనుస్సు' చరిత్ర వివరించాడు. తన కుమార్తె సీతను పరాక్రమవంతుడికి ఇవ్వాలనుకున్నాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే సీతనిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. 'గతంలో చాలామంది రాజులు దాన్ని ఎక్కుపెట్టలేకపోగా కనీసం కదిలించలేకపోయారు' అని అన్నాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. దాన్ని 5 వేల మంది తీసుకువచ్చారు. రాముడు అవలీలగా పట్టుకునే లోపే అది వంగిపోయింది. వింటినారిని సంధించి అల్లెతాడును లాగగానే పిడుగులా భయంకర శబ్దం చేస్తూ విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్చపోయారు. జనకుడు ఇచ్చిన మాట ప్రకారం సీతారాముల వివాహానికి సిద్ధం అయ్యాడు. దశరథ మహారాజుకు ఈ విషయం తెలియజేశాడు. అయోధ్య నుంచి అందరూ వచ్చారు. అంగరంగ వైభవంగా, శోభాయమానంగా సీతారాముల వివాహం జరిగింది.

6. రాముడు అయోధ్య నుంచి దండకారణ్యంలోకి ప్రవేశించిన విధానాన్ని తెలియజేయండి.

జ: రాముడు వనవాసానికి అయోధ్య నుంచి రథంపై బయలుదేరాడు. రథం తమసా నదీ తీరానికి చేరింది. అక్కడ రాత్రి సేదతీరి తెల్లవారి వేదశ్రుతి, గోమతి, సనందికా నదులను దాటుతూ కోసల దేశపు పొలిమేర దాటి అయోధ్యకు నమస్కరించాడు.

ముందుకు సాగుతూ గంగా తీరంలోని 'శృంగిబేరిపురం' చేరి గుహుని ఆతిథ్యం తీసుకుని పడవ ఎక్కి యమునా సంగమ ప్రదేశంలోని భరద్వాజ ఆశ్రమానికి చేరారు. రాముడు కోరినట్లుగా భరద్వాజ మహర్షి ఆశ్రమ వాసానికి అనువైన 'చిత్రకూట' పర్వతాన్ని సూచించాడు. రాముడు చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడే దశరథుడు మరణించాడు. తనను తీసుకెళ్లడానికి వచ్చిన భరతుడితో రాముడు తండ్రిమాటే శిరోధార్యమని తాను వనవాసం పూర్తయిన తర్వాతే వస్తానని చెప్పాడు.

శ్రీరాముడు సీత, లక్ష్మణుడితో కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించారు. అక్కడ అనసూయదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. అత్రి మహర్షి, అనసూయల ఆశీస్సులు తీసుకుని సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి వెళ్లారు.

7. రామాయణం ఆధారంగా 'స్నేహానికి ఉన్న గొప్పతనం' గురించి రాయండి.

జ: రామాయణంలో స్నేహానికి ఉన్నత స్థానం ఉంది. రాముడు పంచవటికి చేరిన తర్వాత సీత రక్షణ బాధ్యతను 'జటాయువు'కు అప్పగించాడు. దానికి కారణం జటాయువు తన తండ్రి అయిన దశరథ మహారాజుకు ఆత్మీయ మిత్రుడు. సీతను రావణుడు అపహరించిన తర్వాత 'కబంధుడు' సుగ్రీవుడి మైత్రి గురించి రాముడికి చెప్పాడు. సీతను కాపాడుకోవడం కోసం శ్రీరాముడు సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మిత్రుడు అయ్యాడు.

'ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడు, వాలిని తప్పక చంపుతాను' అని శ్రీరాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. సీతా వియోగంతో బాధపడుతున్న రాముడితో సుగ్రీవుడు ఇలా అన్నాడు.

'నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలు, సుఖాలు, చివరకు తన ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధపడతాడు, ప్రాణ స్నేహితులమైన మనం స్నేహ ధర్మాన్ని పాటిద్దాం' అని చెప్పాడు. దీన్నిబట్టి స్నేహం విలువ ఉన్నతమైందని అని తెలుస్తుంది.

స్నేహం కోసం రాముడు సుగ్రీవుడి అన్న వాలిని చంపాడు. సుగ్రీవుడు సీత అన్వేషణ కోసం సైన్యాలను సమాయత్తం చేసి సమర్థులకు నాయకత్వాన్ని అప్పగించి, సీతను రాముడు కాపాడుకోవడంలో కీలక భూమిక పోషించాడు. స్నేహానికి మారుపేరుగా నిలిచాడు.
 రావణుడు రాముడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఒకసారి అంతఃపురానికి వెళ్లిన రావణుడు కుంభకర్ణుడిని సమీపించి లేపాడు. కానీ అతడు లేవలేదు. ఇంతలో రావణుడు 'ఆపదల పాలైన వారిని ఆదుకునేవాడు నిజమైన మిత్రుడు, తప్పుదారి పట్టి కష్టాల్లో పడినవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడు ' అని అన్నాడు. స్నేహ వచనాలు విన్న కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.

8. రామాయణంలో ఉన్న అన్నదమ్ములను బట్టి గ్రహించాల్సిన విషయాలు రాయండి.

జ: లక్ష్మణుడు అన్న సేవే మిన్నగా భావించేవాడు. దీన్నిబట్టిరామలక్ష్మణుల మధ్య ప్రేమాభిమానాలను గ్రహించవచ్చు.

అన్న రాముడి ఆజ్ఞను తప్పక పాటించేవాడు లక్ష్మణుడు.

చిత్రకూటంలో రాముడు ఆదేశం ప్రకారం నేరేడు కర్రలతో కుటీరం నిర్మించాడు.

అన్న ఆజ్ఞ ప్రకారం 'శూర్పణఖ, ముక్కుచెవులు కోశాడు.

పంచవటిలో పర్ణశాల నిర్మించాడు.

లంక రాజుగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.

వాలి, సుగ్రీవులను బట్టి...

రాజ్యకాంక్ష కోసం వాలి తమ్ముడిని సంహరించాలని చూశాడు, తమ్ముడి భార్యను అపహరించాడు. ఇది చాలా తప్పు అని మనం గ్రహించాలి.

తన తప్పు తెలుసుకున్న వాలి చనిపోయేముందు తన భార్య, కుమారుడి బాధ్యతను సుగ్రీవుడికి అప్పజెప్పి, తన మెడలోని దివ్యమైన శక్తిగల సువర్ణమాలను తమ్ముడికి ఇచ్చాడు. ఎంత పగలూ

ప్రతీకారాలు ఉన్నా చివరికి మిగిలేది అన్నదమ్ముల అనుబంధం అని తెలుసుకోవచ్చు.

రావణుడు - విభీషుణులను బట్టి...

 విభీషణుడు తన అన్న రావణుడిని తండ్రితో సమానంగా భావించాడు. రావణుడు చేసిన తీవ్ర నిందలను సహించాడు. అన్నతో విభేదించినప్పటికీ, రావణుడి మరణానంతరం అతడికి ఉత్తరక్రియలను నిర్వహించాడు.

రామాయణాన్ని బట్టి రాముడు - భరతుడి మధ్య ఉన్న అన్యోన్య అన్నదమ్ముల అనుబంధం కళ్లముందు కనిపిస్తుంది. వనవాసం చేస్తున్న అన్న రాముడి పాదుకలతో రాజ్యపాలన చేస్తాననడం, వనవాసం పూర్తయిన తర్వాత రాముడి దర్శనం కాకుంటే - అగ్నిప్రవేశం చేస్తాననడం - ఆదర్శ సోదర భావానికి ప్రతీక.

9. రామాయణంలోని ఉత్తమ ఆదర్శాలను రాయండి. (నీతి)

జ:  తల్లిదండ్రులపట్ల ప్రేమ, మమకారాన్ని కలిగి ఉండటం. వారి మాటలను పాటించడం.

గురువుల పట్ల భక్తి, గౌరవం ఉండటం.

ఆపదలో ఆదుకోవడం

ఇచ్చిన మాట తప్పకపోవడం

మృదువుగా మాట్లాడటం

శరణన్నవారిని ఆదుకోవడం

ధైర్యాన్ని కలిగి ఉండటం

స్నేహం కోసం సంపదలు, సుఖాలను వదిలిపెట్టడం

స్త్రీలను గౌరవించడం

ధర్మానుసారంగా జీవించడం

పట్టుదలతో ప్రయత్నించి దేనినైనా సాధించడం

పవిత్రమైన జీవన విధానం కలిగి ఉండటం

ఇచ్చిన పనిని సాధించడమే కాకుండా, దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలు సాధించడం

ఒకరినొకరు గౌరవించుకోవడం

శీలం గొప్పతనం తెలుసుకోవడం

అందరిపట్ల వాత్సల్యం కలిగి ఉండటం

కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులు, సజ్జనులతో వివిధ విషయాలు చర్చించడం.

ఎలాంటి ఆపద వచ్చినా తొణకకుండా ఉండటం

ప్రకృతిని ప్రేమించడం

ఆశ్రయించిన వారిని ఓదార్చి, వారికి సహాయం చేయడం

అసూయ లేకుండా ఉండటం

10. 'అయోధ్యకాండ'లో ముఖ్య విషయాలు వివరించండి. దీని ద్వారా మీరేం గ్రహించారు?

జ:  శ్రీరాముడిని రాజుగా చేయాలని ప్రముఖులతో చర్చించి దశరథుడు పట్టాభిషేక ఏర్పాట్లు చేయడం.

'రాముడికి పట్టాభిషేకం చేస్తే దాసిగా మారతావు' అని మంధర కైకేయికి చెప్పడం.

కైకేయి దశరథుడితో తన రెండు వరాలను కోరడం.

దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం

    1) భరతుడి పట్టాభిషేకం

    2) రాముడికి 14 ఏళ్ల వనవాసం

రాముడు వనవాసానికి సీతాలక్ష్మణ సహితం బయలుదేరడం

దశరథుడు కుమారుడి ఎడబాటుతో మరణించడం.

భరతుడు తాను రాజుగా ఉండలేనని అన్నగారి పాదుకలతోనే పాలన చేస్తాననడం.

సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి వెళ్లడం.

కుమారుడిపై తండ్రికి ఉండే మమకారాన్ని ఈ కాండలో చూడొచ్చు. రాముడి ఎడబాటుతో దశరథుడు మరణిస్తాడు. దీన్ని బట్టి తండ్రిప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది.

సంతోషమైనా, దుఃఖమైనా సమానంగా స్వీకరించాలనేది రాముడు ద్వారా గ్రహించవచ్చు.

అన్నదమ్ముల అనుబంధానికి భరతుడి నిర్ణయాన్ని గ్రహించవచ్చు.

మనిషిలో అసూయవల్ల అనర్థం వాటిల్లుతుందని మంధర - కైకేయిల ద్వారా తెలుస్తుంది.

11. 'అరణ్యకాండ'లోని విషయాలను విశ్లేషించండి.

జ:  సీతారామ, లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించడం.

రాముడి వల్ల 'విరాధుడు' శాపవిముక్తి పొందడం.

అగస్త్యుడు శ్రీరాముడికి దివ్యధనుస్సు - అక్షయతూణీరాలు, ఖడ్గం ఇవ్వడం.

అగస్త్యుడు సూచించిన ప్రకారం 'పంచవటి'లో పర్ణశాల ఏర్పాటు చేసుకోవడం.

'శూర్పణఖ' ముక్కు, చెవులను లక్ష్మణుడు కత్తిరించడం.

మారీచుడు లేడిగా మారి రావడం, సీతాదేవి దాన్ని కావాలని కోరడం, రాముడు వెళ్లి వచ్చినంతలో 'రావణుడు' సీతను అపహరించడం.

రామలక్ష్మణులు సీతను వెతకడం మొదలు పెట్టడం, 'కబంధుడి' సీతాదేవి దొరికే ఉపాయం చెప్పడం.

శబరి ఆశ్రమానికి వెళ్లి, రామలక్ష్మణులు రుష్యమూక పర్వతానికి ప్రయాణమవ్వడం.

వెళ్లేదారిలో పంపా సరోవరాన్ని దర్శించడం.

రాముడు దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడి రమణీయ ప్రకృతి ప్రదేశంలో 'పర్ణశాల' ఏర్పాటు సాధారణ జీవనానికి గీటురాయిగా చెప్పవచ్చు.

'శూర్పణక' అసూయవల్ల 'సీత' అపహరణకు గురైంది.

సహాయం పొంది, సహాయం చేయడం కబంధుడిలో గ్రహించవచ్చు.

12. 'సుందరకాండ'లోని సుందరమైన విషయాలు - మీరేమి గ్రహించారు?

జ:  హనుమంతుడు సీతామాతను తీసుకువస్తానని ఆకాశంలోకి ఎగిరివెళ్లడం.

హనుమంతుడి సమయస్ఫూర్తికి 'సురస' అనే నాగమాత మెచ్చి, ఆశీర్వదించడం.

హనుమంతుడు 'పిల్లి ' ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని 'లంక'లోకి వెళ్ళడం.

హనుమంతుడు 'రామకథాగానం' చేయడం

సీత హనుమంతుడికి దివ్య చూడామణిని ఇవ్వడం.

హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం.

సీతమ్మను తాను చూశానని, దివ్య చూడామణిని రాముడికి ఇవ్వడం.

సీత అన్వేషణ వృత్తాంతాన్ని రాముడికి హనుమంతుడు వివరించడం.

హనుమంతుడిలోని శక్తియుక్తులు.

హనుమంతుడి సమయస్ఫూర్తి.

హనుమంతుడి కృత్యాల ద్వారా 'చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని' అనే సామెత పుట్టిందని గ్రహించవచ్చు.

ఆనందానికి నిలయమైన కాండం - 'సుందరకాండ'

సాహసం, ఉపాయం, విజ్ఞత, సంతోషం - ఇవన్నీ సుందరకాండలో నిరూపితాలు.

Posted Date : 08-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం