• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. 'సంపద లేకున్నా పండితుడు శోభిస్తాడు' అని ఎలా చెప్పగలవు?
జ: సంపద లేకపోయినా పండితుడు శోభిల్లుతూ ఉంటాడు. దీన్ని ఎలా చెప్పగలనంటే పండితుడికి ఉన్న సుగుణాలు నశింపలేనివి. సంపద అస్థిరమైంది. శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడిగా, దానగుణం కలిగినవాడిగా, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడిగా, సత్యం  పలికేవాడిగా, భుజబలంతో విజయాలను పొందేవాడిగా, మనసునిండా దయగలవాడైన 'పండితుడు' సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు.

 

2. బీదలకు ఏం ఇవ్వాలి?
జ: బీదలకు అన్నం, వస్త్రాలను ప్రేమతో అధికంగా ఇవ్వాలి. వివేకులకు ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణం వారికి సంపదగా భాసిల్లుతుంది.

 

3. మంచి లక్షణాలు ఏవి?

జ: అబద్ధాలు మాట్లాడక పోవడం, పేదవారికి సహాయం చేయడం, అనవసర వాదన చేయకపోవడం, మర్యాదగా ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండటం, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడం, దానగుణం కలిగి ఉండటం, మనసు నిండా దయకలిగి ఉండటం అనేవి మంచి లక్షణాలు.

 

4. 'మైత్రి' అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి.
జ: స్నేహం, నెయ్యం, సాంగత్యం.

 

5. ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది? 
జ: అనాథలు, నిరుపేదలకు  ఆప్యాయతతో  అన్నం పెట్టి ఆదరించాలి. అలా అన్నం పెట్టే సహృదయుడిని సంపదకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది. అన్నదానం చేస్తే ఇంతటి ఫలం లభిస్తుంది.

 

6. మంచి పనులకు అవసరమైన బుద్ధి అంటే ఏమిటో వివరించండి.
జ: మంచి పనులు చేయాలంటే మంచి బుద్ధి అవసరం. ఎవరైనా తమ శరీరాన్ని, ఆత్మను ఎలా అభిమానిస్తారో అలాగే తమ దేశాన్ని, భాషను, మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించేలా వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులు చేయడానికి అవసరమైన బుద్ధి కలిగి ఉండాలి.

 

7. ఇతరుల్లో చూడవలసింది ఏమిటి?
జ: ఇతరుల్లో మంచిని  మాత్రమే చూడాలి. ఎప్పుడూ తప్పులు వెతకరాదు. 'సమ్యక్‌దృష్టి' అనే మంచి భావన అందరికీ అత్యంతావశ్యకం.

 

8. ఉత్పలవారు ఏం కోరుకుంటున్నారు?
జ: ఉత్పలవారు చెడును ఇతరుల్లో చూడరాదని, మంచిని దర్శించిన వాడికి 'గ్రహణశక్తి' పెరుగుతుందని,
గ్రహణశక్తి పెరగడానికి ఇతరుల్లో మంచిని చూడాలని కోరుకుంటున్నారు. అందరిలో మంచిని దర్శించే చూపు, మంచిగా మాట్లాడే నాలుక ఉండాలని కోరుకుంటున్నారు.

 

9. భారతదేశం గొప్పతనం ఏమిటి?
జ: భారతదేశం వేదాల శోభతో, ఇతిహాసపు అమృతంతో, సనాతన సంస్కృతి అనే జీవనది నీటితో, సాహిత్య స్వరానందంతో ఉంటుంది. ఇవన్నీ భారతదేశ గొప్పతనంలోని విషయాలు.

 

10. 'జాతీయతా వ్రతం' అంటే మీరేమనుకుంటున్నారు?
జ: 'జాతీయత' అనేది జాతికి సంబంధించింది. జాతి మంచి ఆలోచనలను ఆవాహన చేసుకోవడమే జాతీయతా వ్రతం.

 

11. 'సంస్కారం లేని చదువు' అంటే ఏమిటి?
జ: చదువు అందరినీ బాగుచేస్తుంది. మంచి బాటలో పయనింపజేస్తుంది. బాగుచేయని, మంచి మార్గం చూపని చదువు వ్యర్థం. సంస్కారం లేని చదువు ఎవరికీ ఉపయోగకరంగా ఉండదు.

 

12. 'ఇంటికి దీపం ఇల్లాలు' అని ఎందుకంటారు?
జ: ఇంటికీ దీపం ఎలా కాంతి ఇస్తుందో, అలాగే ఇంట్లో ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు కాంతిమంతంగా అలరారుతుంది. తన ఆలోచనలు, తనకున్న ఓర్పు, నేర్పుతో నిత్యం అన్నీ తానై చూసుకుంటుంది. ఇల్లును తన కాంతితో మురిపిస్తుంది.

 

13. 'వృథా' అని కవి వేటిని పేర్కొన్నాడు. దీనిపై మీ అభిప్రాయమేమిటి?
జ: మంచి స్వభావం లేకుండా ఎన్ని కార్యాలు చేసినా, సత్ప్రవర్తన లేకుండా ఆలయాలు తిరిగినా, సంస్కారం లేని చదువు, చాంచల్య మనసుతో చేసే శివపూజ, శాంతినివ్వని యోగసాధన, మంచిని పెంచని మతం, మేలుకోరని వ్రతం, చైతన్యం కలిగించని ఆచారాలు, లోక రక్షణ చేయని ధర్మం- ఇవన్నీ 'వృథా' అని కవి పేర్కొన్నాడు. పైవన్నింటినీ కలిగి ఉండాలి. అవి లేని జన్మ వ్యర్థమన్నది నా అభిప్రాయం.
ఇవి చేయండి.

I. అవగాహన - ప్రతిస్పందన 

1. కింది అంశాల గురించి మాట్లాడండి.

అ) సంస్కారం: సంస్కారం అంటే బాగుచేసేది, నడిపించేది. సంస్కృతి అందిస్తున్న గొప్ప సంపద సంస్కారం. మనిషి ఏ విషయంలో, ఏ సందర్భంలోనైనా ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో తెలియజేసేది సంస్కారం. ఇది తరతరాలు చూపించిన బాట. ఒక తరం మరొక తరానికి అందిస్తుంది. ఇలా వాటిని గుర్తుపెట్టుకుని ఆచరించి చూపించాలి.
ఉదా: గౌరవించడం, మంచితనంగా ఉండటం, నిజాయతీగా బతకడం.
ఆచారాలను పాటించడం, మన పెద్దలు చూపిన మార్గాల్లో నడవడం సంస్కారం. సంస్కారవంతులు ఉత్తములుగా కీర్తించబడతారు

 

ఆ) వ్రతాలు: 'వ్రతాలు' అంటే 'నోములు'. దేవతలకు నిలయమైన ఈ భూమిపై తాము ఇష్టదైవంగా కొలిచే వారిని నోచుకోవడాన్ని (పూజ చేయడం) 'నోములు' అంటారు. వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, ఉపవాసదీక్ష ఉండి ఆచరిస్తారు. శుభకార్యాలకు ముందు అంతా శుభమే జరగాలని, పుణ్యం దక్కాలని వ్రతాలను ఆచరిస్తారు. అందరూ కలిసి 'సామూహిక వ్రతాలు' కూడా నిర్వహిస్తారు.
ఈ వ్రతాలు ఫలాలను ఇచ్చేవి. వీటిని చేయడం ద్వారా మనిషికి సంపూర్ణ వికాసం దిశగా ప్రయాణించే భావాలు కలుగుతాయి.

 

ఇ) ఆచారాలు: ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ఇలాగే చేయాలి అని చూపేది 'ఆచారం'. ఇవి పెద్దలు చూపించినవి. ఒకరి నుంచి మరొకరికి అందిపుచ్చుకునేవిగా ఆచారాలు ఉంటాయి. భారతీయ ఆచారాలు అమోఘమైనవి. సంస్కృతిలో ఆచారాలు ఒక భాగం. ఇవి వివిధ రకాలుగా ఉంటాయి.
ఉదా: వివాహ పద్ధతులు, వేషధారణ, భోజన పద్ధతి, తీర్థయాత్రలు, కర్మకాండ సంస్కారాలు.
ఆచారాలు ఆచరణీయమైనవి. సమాజానికి ఆమోదయోగ్యమైన ఆచారాలను పాటించాలి. మనుషుల మధ్య, మనసుల మధ్య సత్సంబంధాలను తుంచే 'ఆచారాలు' తీవ్రమైన మనస్తాపానికి గురిచేస్తాయి. అలాంటి వాటిని త్యజించాలి.

 

ఈ) దానగుణం: శ్రేయస్కరమైన గుణాల్లో దానగుణం ఒకటి. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు తగిన విధంగా సహాయం చేయడం 'దానగుణం'. ఈ గుణం వల్ల ఇతరుల్లో సంతోషాన్ని చూడగలుగుతాం. దానగుణం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. 'మానవ సేవే మాధవసేవ' అన్నట్లుగా సాటి మనిషికి దానం చేయడం కూడా భగవంతుడిని సేవించినట్లే.
దానగుణం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయి. దానగుణాన్ని చిన్నతనం నుంచే అలవరచుకోవాలి.
దానాల్లో దశదానాలు, షోడశ మహాదానాలు అని చాలా రకాలు ఉన్నాయి. వీటిని ఆచరించాలి.

 

2. పాఠంలోని పద్యాల ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి.
అ) ఎల్లప్పుడూ ఇతరుల దోషాలను చూడటం.
జ: పై వాక్యం ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన ఉత్పలమాల శతకంలోని పద్యానికి సంబంధించింది.
పద్యపాదం: 'అనయము దోషమే పరులయందు కనుంగొని'

 

ఆ) పేదవారికి ఆహారం, బట్టలు దానం చేయడం.
జ: పై వాక్యం శ్రీపతి భాస్కరకవి - చిత్తశతకంలోని పద్యానికి సంబంధించింది.
పద్యపాదం: 'బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము'

 

ఇ) సంపద రహస్యంగా వచ్చి చేరుతుంది.
జ: పై వాక్యం తరిగొండ వెంగమాంబ - తరిగొండ నృసింహ శతకంలోని పద్యానికి సంబంధించింది.
పద్యపాదం: 'గుట్టుగ లక్ష్మిఁబొందుఁ'

 

3. కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి.
అ) ఇల్లాలింటికి... రామేశ్వరా!
జ: పై పద్యం 'నంబి శ్రీధరరావు' రాసిన 'శ్రీ లొంకరామేశ్వర శతకం'లోనిది.

పద్యపూరణం
శా. ఇల్లాలింటికి దీపమౌననగ హీహీయంచు మందుల్ మహా
భల్లూకాకృతి దోప నవ్వుదురు, దీవ్యద్వ్యోమగంగన్ జటా
పల్లిన్ నీవు ధరించుటన్ వినరో, యెవ్వారైన మర్యాద వ
ర్ధిల్లన్ కాంతల జూడకున్న హితమా? శ్రీ లొంక రామేశ్వరా?

 

ఆ) సిరిలేకైనా.... వాచస్పతీ!
జ: పై పద్యం ఎలకూచి బాలసరస్వతి - మల్లభూపాలీయం లోనిది.
పద్యపూరణం:
మ. సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతివాచస్పతీ!

 

4. కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకు(గలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి జేయు
సాధు సంగంబు సకలార్థ సాధకంబు

 ప్రశ్నలు

అ) సూక్తి అంటే ఏమిటి?
జ: సూక్తి అంటే మంచి మాట. సు + ఉక్తి = సూక్తి. దీనిలో 'సు' అంటే మంచి, ఉక్తి అంటే మాట అని అర్థం. ఇది అందరికీ అవసరమైంది. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది.

 

ఆ) కీర్తి ఎలా వస్తుంది?
జ: సత్పురుషులతో స్నేహం వల్ల 'కీర్తి' వస్తుంది. అహింసా మార్గాన్ని అవలంబిస్తూ అందరినీ గౌరవిస్తూ ఉంటే కీర్తి వస్తుంది.

 

ఇ) సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది?
జ: సాధుసంగం వల్ల మంచి మాటలు వింటారు, బుద్ధిమాంద్యం తొలగిపోతుంది, గౌరవం లభిస్తుంది, కీర్తి పెరగుతుంది, మనసు వికసిస్తుంది.

 

ఈ) ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జ: ఈ పద్యానికి శీర్షిక 'సజ్జనులతో ఉండటం'.

 

 II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) వివేకి లక్షణాలేవి?
జ: వివేకి లక్షణాలు:
1) పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం
2) నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకపోవడం
3) అనవసరంగా ఎవరితో వాదనకు దిగకపోవడం
4) మర్యాద మీరి, హద్దు మీరి ప్రవర్తించకపోవడం
5) అందరితో స్నేహంగా ఉండటం
6) తెలివి పెంచే వాటిపై దృష్టి పెట్టడం
7) సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడం
8) ఆదర్శనీయంగా బతికేందుకు అన్వేషించడం
9) ఆలోచించి మాట్లాడటం

 

ఆ) సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జ: అనాథలను, నిరుపేదలను ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెట్టేవాడికి సంపద  వచ్చి చేరుతుంది. అధిదేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి సహృదయుడిని   వరిస్తుంది. అన్నదానం, వస్త్రదానం అధికంగా చేస్తే సంపద వచ్చి చేరుతుంది.

 

ఇ) దేశ భాషల ఔన్నత్యాన్ని పెంచడమంటే ఏంటి?
జ: దేశ భాషల ఉన్నతిని పెంచేందుకు కృషిచేయాలి. వాటిని పెంచడం అంటే ముందుగా దేశాన్ని వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయాలి. ప్రజలందరికీ అందుబాటులో వైద్యం, అందరికీ చదువును కల్పించాలి. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉపాధి మార్గాలను కల్పిస్తూ, వ్యాపార సంబంధమైన వాటిలో రాయితీలను ఇవ్వాలి. రోడ్డు, రైలుమార్గాలను అభివృద్ధి పరచాలి. జాతీయస్థాయిలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలి.
భాషల ఔన్నత్యాన్ని పెంచాలంటే ఆయా భాషల అభివృద్ధికి భాషా మండల్లను ఏర్పాటు చేసి పరిశోధనలు చేయాలి. ఆయా భాషల సాహిత్యాలను అందరూ చదివేలా చూడాలి. నిఘంటువులను తయారు చేయాలి. మాతృభాష మాధ్యమంలో చదివిన వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా రచయితలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రభుత్వాలు అధికార భాషలో మాత్రమే తమ కార్యకలాపాలు నిర్వహించాలి.
దేశ భాషల గొప్పతనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి.

 

ఈ) ''ఇతిహాసామృత..." అనే పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జ: ధర్మాన్ని ఆచరించే రుషులను పరివారంగా ఉన్న ఓ విశ్వనాథేశ్వరా! భారతదేశం వేదాలు, ఇతిహాసాలతో వర్థిల్లుతోంది. సనాతన సంస్కృతి అనే జీవనదితో భారతదేశం పునీతమవుతోంది. పవిత్రమైన, గొప్పవైన ఆలోచనలను అర్థం చేసుకుని పాటించడమే ఈ దేశానికి మనం చేసే జాతీయతావ్రతం (నోము).

 

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)
సజ్జనుల లక్షణాలు పేర్కొనండి.
జ: సజ్జనుల లక్షణాలు:
* తల వంచి గురువు పాదాలకు నమస్కరించడం
* దానగుణం కలిగి ఉండటం
* అబద్ధాలు ఆడకుండా ఉండటం
* అనాథలు, నిరుపేదలను కసురుకోకుండా ఆప్యాయతతో అన్నం పెట్టడం
*
 ఇతరుల్లో మంచిని మాత్రమే గ్రహించడం
* మంచిగా మాట్లాడటం, మంచి స్వభావం కలిగి ఉండటం.
* పవిత్రమైన ఆలోచనలు ఉండటం
* అనవసర వాదనలు చేయకపోవడం
* దేశ, భాష, మత, ఆచారాల ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులు చేయడం
* అందరితో స్నేహంగా ఉండటం
* ధర్మాన్ని ఆచరించడం
* మనసు నిండా దయ కలిగి ఉండటం
* చంచలం లేని మనసుతో పూజచేయడం
* ఇతరులపట్ల గౌరవ భావాలను కలిగి ఉండటం
* చెప్పే విషయాలు శ్రద్ధగా వినడం

 

ఆ) నైతిక విలువలు అంటే ఏమిటి? మీరు గమనించిన విలువలను పేర్కొనండి.
జ: నైతిక విలువలు అంటే నీతిగా ఉండేందుకు ఆచరించాల్సిన పద్ధతులు. విలువలు ఉన్నతమైనవి వాటిని ఆచరిస్తే గౌరవం, కీర్తి వస్తాయి. 

నేను గమనించిన విలువలు:
* నిజాయితీగా జీవించడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం.
* ఆచరణలో చూపించడం, అబద్ధమాడకుండా ఉండటం, ధర్మాన్ని ఆచరించడం.

ఉదాహరణలు:
1)
మా స్నేహితుడికి పాఠశాలలో 100 రూపాయల నోటు దొరికింది. దాన్ని అతడు దాచుకోకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇచ్చాడు. ప్రధానోపాధ్యాయులు ప్రార్థనా సమయంలో అ నోటు ఎవరిది అని అడిగి పోగొట్టుకున్న విద్యార్థికి అందించారు.
* ఈ సంఘటనతో నేను మా స్నేహితుడిలో ధర్మగుణం చూశాను.
2) ఒక రోజు మా స్నేహితులందరూ ఈతకు వెళ్లారు. బడికి వెళ్లాక మా గురువుగారు అందర్నీ ఎందుకు రాలేదని అడిగారు. అందరూ తప్పుగా సమాధానం ఇచ్చారు. కానీ రాజేష్ ఉన్న విషయం చెప్పాడు. అబద్ధం చెప్పలేదు.
‣ నైతిక విలువలైన సత్యం, న్యాయం, ధర్మాలను స్వీకరించి గాంధీ స్వాతంత్య్ర సమరంలో విజయాన్ని సాధించారు.
‣ సత్యాన్ని నమ్ముకుని జీవించిన హరిశ్చంద్రుడు కీర్తిని పొందాడు.
‣ అనైతిక విలువలు పాటించిన రావణుడు క్షీణించాడు.
‣ మనకు కష్టనష్టాలు ఎదురైనా నైతిక విలువలను పాటించి ఆచరిస్తే ఆ విలువలే మనల్ని కాపాడతాయి.
‣ విలువలు కలిగినవారు ఉన్నతులుగా ఎదుగుతారు.
ఉదా: ఎ.పి.జె. అబ్దుల్ కలాం

3. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా, ప్రశంసిస్తూ రాయండి.
1.
ఎదుటివారిలో తప్పులు వెతకడం కంటే వారి నుంచి మంచిని స్వీకరించడమే మేలు అని తెలియజేస్తూ నీ మిత్రుడికి లేఖ రాయండి.
                                                                                                   

మిత్రుడికి లేఖ


కరీంనగర్,
తేదీ: 28-01-2015.


ప్రియమైన స్నేహితుడు విష్ణుకు రాయునది,
నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. నీవు క్షేమంగానే ఉన్నావని తలుస్తున్నాను. నాకు అందిన నీ లేఖను బట్టి నీవు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2ను బాగా రాశావని అర్థమైంది. నేను కూడా బాగానే రాశాను. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ''ఎదుటివారిలో తప్పులు వెతకడం కంటే వారి నుంచి మంచిని స్వీకరించడమే మేలు" అనే అంశంపై ఉపన్యాస పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి పొందాను. ఆ ఉపన్యాసంలోని విషయాలు నీతో పంచుకోవడానికి ఈ లేఖ రాస్తున్నాను.
మిత్రమా! మనం ఎప్పుడైనా ఎదుటివారిలో తప్పులు వెతికామనుకో అదే అలవాటై పదే పదే వేలెత్తి చూపుతాం. ఆలోచన అంతా తప్పుగానే ఉంటుంది. ఇతరుల్లో మంచిని వెతికి, స్వీకరిస్తే అది మనల్ని ప్రయోజకులను చేస్తుంది. దాంతో ఎదుటివారి నుంచి లాభం పొందిన వాళ్లం అవుతాం. మంచిని స్వీకరిస్తే ఆ 'మంచి' మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళుతుంది. ఎదుటివారిలోని తప్పులను సరిచేయడంలో తప్పులేదు కాని, ఎప్పుడూ తప్పులనే వెతకడం వల్ల అందరిలో మనం చులకనవుతాం. 'మంచిని స్వీకరించు - మంచితనంతో జీవించు' అనే భావనతో ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే వేసవిసెలవుల్లో నువ్వువస్తావని ఎదురు చూస్తూ ఉంటాను.


నీ ప్రియమిత్రుడు
ఆర్.మహేందర్,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ముస్తాబాద్


చిరునామా
యం.విష్ణు
10వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
నిర్మల్
ఆదిలాబాద్ జిల్లా

2. పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి విద్యార్ధులు వారిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జ: ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళి:
* శతకం అంటే ఏమిటి?
* శతకానికి ఉండే లక్షణాలు ఏమిటి?
* 'మకుటం' ప్రత్యేకత ఏమిటి?
* పద్యాలు ఎప్పటి నుంచి రాస్తున్నారు?
* మీరు రాసిన శతకాల గురించి చెప్పండి.
* ఎవరు రాసిన శతకం నుంచి ప్రేరణ పొందారు?
* కంద పద్యాలతో శతకం రాయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
* మీరు రాసిన శతకాల్లో మీకు నచ్చిన పద్యం చెప్పండి.
* విలువలను పెంచే 'శతకాలు' రాసేవారికి మీరిచ్చే సలహాలు ఏమిటి?
* శతకాలు లోకానికి ఏం ఇస్తాయి?
* ఏ రకమైన శతకాలను మీరు ఇష్టపడతారు?
* 'వేమన శతకం' గురించి చెప్పండి.
* శతక వాఙ్మయంలోని వివిధ దశలను వివరించండి.
* ప్రస్తుత శతక కవులు ఏయే విషయాలపై దృష్టి సారించాలి?
* మీరు ఒక శతకం రాయడానికి ఎంత సమయం పడుతుంది?
* 'కాళికాంబ సప్తశతి' శతకం గురించి రాయండి.
* తెలుగులో వచ్చిన మొదటి శతకం గురించి చెప్పండి.
* ఛందోబద్దంగా లేకుండా శతకాలు రాయవచ్చా?
* తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు ఉన్న ప్రాముఖ్యం ఏమిటి?
* విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌