• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

భాషాంశాలు

పదజాలం
1.
కింది పదాలకు అర్ధాలు రాసి, సొంత వాక్యాలు రాయండి.
ఉదా: బుధుడు = పండితుడు
బుధులతో కలిసి ఉండటం వల్ల జ్ఞానం పెరుగుతుంది.

 

అ) అనయం = ఎప్పుడూ
ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని అనయం విడవరాదు.

 

ఆ) శమం = అంతర్ ఇంద్రియ నిగ్రహం
ప్రతి ఒక్కరూ శమంను కలిగి ఉండాలి.
ఇ) మైత్రి = స్నేహం
సజ్జనులతో మైత్రి చేస్తే సత్ఫలితాలు దక్కుతాయి.

 

ఈ) సౌజన్యం = దయ
మా గురువు గారికి ఎంతో సౌజన్యం ఉంది.

 

2. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి.
 

అ) విశ్వనాథుడు
జ: విశ్వనాథుడు = ప్రపంచానికి నాథుడు (శివుడు)

 

ఆ) శివుడు
జ: శివుడు = సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)

 

ఇ) శ్రియ:పతి
జ: శ్రియ:పతి = లక్ష్మీదేవికి భర్త (విష్ణువు)

 

3. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
ఉదా:
గంగ - భాగీరథి, జాహ్నవి
భాగీరథి తీరంలో రుషులు తపస్సు చేస్తున్నారు. పరమ పావనిగా జాహ్నవి పేరుగాంచింది.

 

అ) శివుడు - శంకరుడు, రుద్రుడు
వాక్యాలు:
1) శంకరుడి భార్య పార్వతి.
2) రుద్రుడు మూడు కన్నులు గలవాడు.

 

ఆ) మైత్రి - స్నేహం, నెయ్యం
వాక్యాలు:
1) మంచివారితో స్నేహం చేయాలి.
2) మా తరగతిలో అంజన్, నాగరాజుల నెయ్యం బాగుంటుంది.

 

ఇ) కాంత - మహిళ, స్త్రీ, వనిత
వాక్యాలు:
1) మహిళలు చైతన్యంతో ముందుకు సాగుతున్నారు.
2) స్త్రీలు రాజకీయంగా పరిణతి సాధించారు.
3) ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనిత.

 

ఈ) గుడి - దేవాలయం, కోవెల
వాక్యాలు:
1) మనసు ప్రశాంతంగా ఉండాలంటే దేవాలయానికి వెళ్లాలి.
2) మా ఊరిలో సాయిబాబా కోవెల ఉంది.

 

4. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించి పట్టికగా రాయండి.
అ) భారతీయ ధర్మం సర్వోత్కృష్టమైంది. బుద్ధుడు దమ్మాన్ని బోధించాడు.
ఆ) ఓ సామి! కుడివైపుగా వెళ్తే స్వామి వారి గుడి వస్తుందా?
ఇ) సిరిని కురిపించి లక్ష్మీదేవి శ్రీ మంతులను చేస్తుంది.
ఈ) ఆలోచనలు స్థిరంగా ఉండాలి. తిరమైన బుద్ధి వివేకుల లక్షణం.

 వ్యాకరణాంశాలు

1. కింది సందర్భాల్లో పునరుక్తమైన హల్లులను పరిశీలించండి. అవి వృత్యానుప్రాస అలంకారాలు అవునో కాదో చర్చించండి.
అ)
నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
ఆ) అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయాడుగున్.

ఇ) మకరంద బిందు బృంద రస స్యందన మందరమగు మాతృభాషయే.
ఈ) చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్.
జ: వృత్యానుప్రాస అలంకారం: ఒకటి లేదా రెండు, మూడు హల్లులు వేరుగానైనా, కలివిడిగానైనా, మళ్లీ మళ్లీ వచ్చినట్లయితే దాన్ని 'వృత్యానుప్రాస' అలంకారం అంటారు.

జ: పైన తెలిపిన సందర్భంలో 'క్ష' అనే హల్లు మూడు సార్లు వచ్చింది కాబట్టి 'వృత్యానుప్రాస' అలంకారం అవుతుంది.

జ: పైన తెలిపిన సందర్భంలో పునరుక్తమైన హల్లు 'డ'. ఇది తొమ్మిది సార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది.

జ: పైన తెలిపిన సందర్భంలో 'ద' అనే హల్లు అయిదు సార్లు పునరుక్తమైంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం.

జ: పైన తెలిపిన సందర్భంలో 'ర' అనే హల్లు ఏడుసార్లు వచ్చింది. 'ర' అనే హల్లు మళ్లీ మళ్లీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం.
 

2. విసర్గ సంధి
సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరుచూ సంధి జరుగుతూ ఉంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం. కింది ఉదాహరణలను విడదీసి చూడండి.
అ) నమోనమ:
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

పై పదాలను విడదీస్తే:
అ) నమ: + నమ: = నమోనమ:
ఆ) మన: + హరం = మనోహరం
ఆ) పయ: + నిధి = పయోనిధి
ఈ) వచ: + నిచయం = వచోనిచయం
మార్పులు:
అకారాంత పదాల విసర్గకు 'శ, ష, స' లు వర్గప్రథమ, ద్వితీయాక్షరాలు (క, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫ) కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, 'అ'కారం, 'ఓ' కారంగా మారింది.
వివరణ:
పై పదాల్లోని పూర్వపదంలో విసర్గకు ముందు 'అ' వచ్చింది. ఉత్తరపదం మొదట 'శ, ష, స, క, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫ' లు కాకుండా మిగతా అక్షరాలు రావాలి. పైన పదాలను చూస్తే ఉత్తరపదం మొదట వరుసగా ''న, హ, ని, ని" లు వచ్చాయి. కలిసి రాసిన పదాలతో విసర్గ లోపించి, 'అ' పోయి 'ఓ' వచ్చింది. ''నమో, మనో, పయో, వచో" - గా గమనించవచ్చు.
కింది పదాలను కలిపి మార్పును గమనించండి.
అ) మనః + శాంతి = మనశ్శాంతి
ఆ) చతుః + షష్ఠి = చతుష్షష్ఠి  
ఇ) నభః + సుమం = నభస్సుమం
 పై పదాల కలయికను గమనిస్తే పూర్వపదంలోని విసర్గపోయి ఉత్తరపదం మొదట ఉన్న 'శా, ష, సు' లు ద్విత్వాలు (శ్శా, ష్ష, స్సు) గా మారాయి.

కింది పదాలను విడదీయండి.
అ)
 ప్రాత్ స్ + కాలము = ప్రాత:కాలము
ఆ) తపస్ + కాలము = తప:కాలము
'స' కారం (స్) ను విసర్గ రూపంలో ప్రయోగించారు.
నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలైన పదాల్లో 'స' కారం విసర్గగా మారదు. మార్పు ఉండదు గమనించండి.
నమస్ + కారము = నమస్కారము
శ్రేయస్ + కారము = శ్రేయస్కరము
వనస్ + పతి = వనస్పతి

కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
ఉదా:
అంత: + ఆత్మ = అంతరాత్మ
అ) దు: + అభిమానం = దురభిమానం
ఆ) చతు: + దిశలు = చతుర్దిశలు
ఇ) ఆశీ: + వాదము = ఆశీర్వాదము
ఈ) పున: + ఆగమనం = పునరాగమనం
ఉ) అంత: + మధనం = అంతర్మధనం

మార్పులు:
అంత:, దు:, చతు:, ఆశీ:, పున:, మొదలైన పదాలకు వర్గ ప్రథమ, ద్వితీయాక్షరాలు, 'శ, ష, స' లు కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ 'ర్' గా మారుతుంది.
వివరణ:
పూర్వపదంలోని అంతః, దుః, చతుః, ఆశీ:, పునః పదాలకు పరపదంలో (ఉత్తర పదం) 'శ, ష, స, క, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫ' లుకాకుండా మిగతా అక్షరాలు రావాలి. పై పదాలను చూస్తే వరుసగా 'ఆ, ది, వా, ఆ, మ' లు వచ్చాయి.
అలా వచ్చినప్పుడు విసర్గ: 'ర్‌'గా మారింది.
దు: + అభిమానం = దురభిమానం (ర్)
చతు: + దిశలు = చతుర్దిశలు (ర్)
ఆశీ: + వాదము = ఆశీర్వాదము (ర్)
పున: + ఆగమనం = పునరాగమనం (ర్)
అంత: + మధనం = అంతర్మధనం (ర్)

 

కింది పదాలు విడదీయండి.
ఉదా:
ధనుష్కోటి = ధను: + కోటి (ధనుస్ + కోటి)
అ) నిష్ఫలము = ని: + ఫలము (నిస్ + ఫలము)
ఆ) దుష్కరము = దు: + కరము (దుస్ + కరము)
మార్పులు:
ఇస్ (ఇ:), ఉస్ (ఉ:) ల విసర్గకు 'క, ఖ, ప, ఫ'లు పరమైతే విసర్గ (స్) - 'ష' గా మారుతుంది.
వివరణ:
1) ధనుస్ + కోటి = ధనుష్కోటి
పై పదం పూర్వపదంలోని 'ఉస్‌'లో 'స్ - 'ష'గా మారింది.
2) నిస్ + ఫలము - నిష్ఫలము
పూర్వపదంలో 'ఇస్‌'లోని 'స్' (:) - 'ష'గా మారింది.
3) దుస్ + కారము - దుష్కారం
పూర్వపదంలోని 'ఉస్' లోని 'స్' (:) - 'ష'గా మారింది.
 ఇక్కడ 'స్' విసర్గ (:) తో సమానం.

కింది పదాలు విడదీయండి.
ఉదా: నిస్తేజము = ని: + తేజము
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము
ఆ) ధనుష్టంకారము = ధనుః + టంకారము
ఇ) మనస్తాపము = మనః + తాపము
* విసర్గకు 'చ, ఛ' లు పరమైతే 'శ' కారం; 'ట, ఠ',లు పరమైతే 'ష' కారం; 'త, థ'లు పరమైతే 'స'కారం వస్తాయి.
వివరణ:
1) విసర్గకు(:) + చ, ఛ, - శ
దుః + చేష్టితము = దుశ్చేష్టితము
2) విసర్గకు(:) + ట, ఠ - స
ధనుః + టంకారము = ధనుష్టంకారము
3) విసర్గకు(:) + త, థ - స
మనః + తాపము = మనస్తాపము
 పై వాటన్నింటినీ పరిశీలించిన మీదట 'విసర్గ సంధి' ఆరు విధాలుగా ఏర్పడుతుందని తెలుస్తోంది.
1) అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు (క, చ, ట, త, ప; ఖ, ఛ, ఠ, థ, ఫ) 'శ, ష, స' లుగాక మిగిలిన అక్షరాలు పరమైతే విసర్గ లోపించి 'అ'కారం 'ఓ' కారంగా మారుతుంది.
2) విసర్గకు 'శ, ష, స'లు పరమైతే 'శ, ష, స'లు దిత్వాలుగా మారతాయి.
3) విసర్గ మీద 'క, ఖ, ప, ఫ' లు వస్తే మార్పురాదు (సంధి ఏర్పడదు)
4) అంత:, ద:, చతు:, ఆశీ:, పున: మొదలైన పదాల విసర్గ రేఫ(ర్) గా మారుతుంది.
5) ఇస్, ఉస్‌ల విసర్గకు 'క, ఖ; ప, ఫ'లు పరమైతే విసర్గ 'ష' కారంగా మారుతుంది.
6) విసర్గకు 'చ, ఛ' లు పరమైతే 'శ' కారం; 'ట, ఠ',లు పరమైతే 'ష' కారం; 'త, థ'లు పరమైతే 'స'కారం వస్తాయి.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌