• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

* పాఠశాల గ్రంథాలయంలో శతక పద్యాలున్న పుస్తకాలు తీసుకొని చదవండి. వాటిలో ఏవైనా అయిదు శతక పద్యాలను, వాటి భావాలను రాసి ప్రదర్శించండి.
 

శతక పద్యాలు

1. వేమన శతకం
ఆ.వె. పట్టుబట్టరాదు పట్టి విడువరాదు
         పట్టెనేని బిగియఁ బట్టవలయు
         బట్టివిడుటకన్న బరగఁజచ్చుట మేలు
         విశ్వదాభిరామ వినురవేమ!
భావం:  ఏ పనైనా చేయాలని ఆలోచనవస్తే అది పూర్తయ్యే వరకు వదలకూడదు. పట్టిన పట్టు వదలడం కంటే ప్రాణం వదలడం మేలు.

2. సుమతీ శతకం
ఆ. స్త్రీలయెడ వాదులాడకు,
     బాలురతోఁ జెలిమిజేసి భాషింపకుమీ,
     మేలైన గుణము విడువకు
     ఏలినపతి నింద సేయకెన్నడు సుమతీ!
భావం: స్త్రీలతో మాట్లాడుతూ గొడవలకు దిగకూడదు. తెలిసీ తెలియని వయసున్న వారితో స్నేహం చేసి అన్ని విషయాల గురించి చర్చించరాదు. స్వచ్ఛమైన గుణాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. యజమాని గురించి ఏ సమయంలోనూ చెడుగా మాట్లాడొద్దు.

 

3. భర్తృహరి నీతి శతకం
కం. కందుకమువోలె సుజనుఁడు
      గ్రిందం బడి మగుడ మీఁదికిన్నెగయుఁ జుమీ
      మందుఁడు మృత్పిండమువలెఁ
      గ్రిందం బడి యడంగి యుండుఁగృపణత్వమునన్.
భావం: బంతి కింద పడి మళ్లీ పైకెగిరిన విధంగానే దైవాన్ని నమ్మినవాడు హీనస్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నతస్థితికి చేరుకుంటాడు. కానీ దైవాన్ని నమ్మనివాడు మట్టిముద్దలా కిందపడి హీనస్థితిలోనే ఉంటాడు.

 

4. భాస్కర శతకం
ఉ. దానము చేయగోరిన వదాన్యున కీయగ శక్తి లేనిచో
     నైన పరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
     బూనును, మేఘడంబుధికి పోయి జలంబులదెచ్చియీయడే
     వాన, సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కరా!
భావం: ఓ సూర్యుడా! దానగుణం కలవాడు తన దగ్గర సొమ్ము లేకపోయినా దానం చేయడానికి ఎక్కడి నుంచైనా తెచ్చి దానం చేస్తాడు. సముద్రం వద్దకు వెళ్లి, మేఘుడు నీటిని తెచ్చి జీవరాశికి వానగా ఇవ్వడం లేదా!

 

5. కుమార శతకం
క. ఆచార్యున కెదిరింపకు
    బ్రోచిన దొర నింద సేయ బోకుము కార్యా
    లోచనము లొంటిఁజేయకు
    మాచారము విడువఁబోకుమయ్య కుమారా!
భావం: ఓ కుమారా! చదువు చెప్పే గురువు మాటకు ఎదురు చెప్పకు. పోషించే యజమానిని నిందించకు. ఒంటరిగా అనేక విధాలుగా ఆలోచనలు చేయకు. మంచి నడవడికను వదిలిపెట్టకు. ఇలా చేయడం వల్ల నీకు ఎంతో మేలు జరుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌