• facebook
  • whatsapp
  • telegram

ద్వీపకల్ప నదులు

గ‌ల‌గ‌లా గోదారి... బిర‌బిరా కృష్ణ‌మ్మ‌!

  నాగరికతల అభివృద్ధికి, ప్రాంతాల ప్రగతికి ప్రధాన ఆధారాలైన నదులు మన దేశమంతా ప్రవహిస్తున్నాయి. ఎన్నో ప్రముఖ పట్టణాలు, ప్రాజెక్టులు వీటిపై వెలిశాయి. దేశ ఉత్తర భాగాన గంగ, దక్షిణంలో గోదావరి పెద్ద నదులుగా నిలిచాయి. మానవాళికి విస్తృత ప్రయోజనాలు అందిస్తున్న ఆ ద్వీపకల్ప నదుల జన్మస్థలాలు, వాటి ఉపనదులతోపాటు ఇంకా ఇతర ముఖ్యమైన వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

  

భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు. ఇవి రుతుపవన వర్షాలపై ఆధారపడి ప్రవహిస్తాయి. ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పునకు వాలి ఉంటుంది. అందువల్ల దాదాపు 90 శాతం నదులు పశ్చిమాన జన్మించి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. 10 శాతం నదులు పడమటి దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి.

తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు: గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా, వంశధార, నాగావళి, మాచ్‌ఖండ్, వైతరణి, సువర్ణరేఖ, బ్రహ్మణీ, థమ్రభరణి, పాలార్, వైగై, స్వర్ణముఖి.

పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు: నర్మద, తపతి, సబర్మతి, మహి, భద్రా (గుజరాత్‌), శరావతి, పెరియార్, పంభ‌. 

 

ముఖ్యమైనవి కొన్ని 

 

గోదావరి: ఈ నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, భారతదేశ రైన్‌ నది అని పిలుస్తారు. ద్వీపకల్ప నదులన్నింటిలో పెద్దది. దేశంలో ఉత్తరాన గంగానది తర్వాత దక్షిణాన రెండో అతిపెద్ద నది. ఇది నాసిక్‌ (మహారాష్ట్ర)లోని త్రయంబకేశ్వర్‌ వద్ద పశ్చిమ కనుమల్లో జన్మించి నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల మీదుగా ప్రవహించి, భద్రాచలం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు 1465 కి.మీ. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఈ నది ధ]వళేశ్వరం వద్ద రెండు పాయలుగా విడిపోతుంది. తర్వాత బంగాళాఖాతంలో కలవడానికి ముందు ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ.  

 

ఎడమవైపున ఉన్న ఉపనదులు: ప్రాణహిత, ఇంద్రావతి, పూర్ణ, కడెం, శబరి, సీలేరు.

 

కుడివైపున ఉన్న ఉపనదులు: మంజీరా, మూల, మానేరు, కిన్నెరసాని, ప్రవర, ప్రాణహిత (పెన్‌గంగా, వైన్‌ గంగా, వార్థా న‌దుల క‌ల‌యిక‌).

 

కృష్ణా నది: ద్వీపకల్ప నదుల్లో రెండో పెద్ద నది. మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి కొండల్లో మహాబలేశ్వర్‌ దగ్గర జన్మిస్తుంది. దీని పొడవు 1440 కి.మీ. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 

 

ఎడమవైపు కలిసే నదులు: భీమా, డిండి, పెద్దవాగు, హాలియ‌, మూసి, పాలేరు, మున్నేరు.

 

కుడివైపు కలిసే నదులు: కోయన, వర్ణ, పెన్‌గంగా, దూద్‌ గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. కృష్ణా నది ఉపనదుల్లో పొడవైనది భీమా కాగా అతిపెద్దది తుంగభద్ర.

 

కావేరి నది: ఈ నది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూర్గ్‌ జిల్లా, బ్రహ్మగిరి కొండల్లో తలకావేరి వద్ద జన్మిస్తుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 805 కి.మీ. ప్రయాణించి కావేరి పట్నం/పూంపుహర్‌(తమిళనాడు) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 

 

కుడివైపు ఉపనదులు: సువర్ణవతి, కబని, లక్ష్మణతీర్థ, భవాని, నోయ్యల్, అమరావతి. 

 

ఎడమవైపు ఉపనదులు: హేమవతి, హరంగి, షింస, ఆర్కావతి. ఈ నదిపై శివసముద్రమనే జలపాతం ఉంది. 

 

పెన్నా నది: కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నంది దుర్గ కొండల్లో జన్మిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ని అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు 597 కి.మీ. పినాకిని నది అని కూడా పిలుస్తారు. ఇది వర్షచ్ఛాయ ప్రాంతంలో ప్రవహిస్తుంది. కడప జిల్లా గండికోట దగ్గర లోతుగా, ఇరుకుగా ఉన్న వాగు (గార్జ్‌) ఈ నది వల్ల ఏర్పడింది. దీనిపై సోమశిల ప్రాజెక్ట్‌ నిర్మించారు.

 

ఎడమవైపు ఉపనదులు: జయమంగళ, కుందేరు, సగిరేరు. 

 

కుడివైపు ఉపనదులు: చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు. 

 

మహానది: ఈ నది ఛత్తీస్‌గఢ్‌లోని అమర్‌కంఠక్‌ పీఠభూమి రాయ్‌పుర్‌ జిల్లా సిహవా దగ్గర జన్మిస్తుంది. దీని పొడవు 851 కి.మీ.ఈ నది పరీవాహక ప్రాంతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంది. ఇది కటక్‌ జిల్లాలో డెల్టాను ఏర్పరుస్తుంది. కేంద్రపర జిల్లా ఫాల్స్‌పాయింట్‌ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై హీరాకుడ్‌ డ్యామ్‌ ఉంది. ఈ నదిని ‘ఒరిస్సా దుఃఖదాయిని’ అని పిలుస్తారు.

 

కుడివైపు ఉపనదులు: ఒంగ్, తెల్, జోంక్‌. 

 

ఎడమవైపు ఉపనదులు: శివనాథ్, హస్‌దో, మాండ్, ఇబ్‌. 

 

నర్మద: ఈ నది వింధ్య, సాత్పుర పర్వతాల మధ్య నుంచి పగులులోయ ద్వారా ప్రవహిస్తుంది. పశ్చిమానికి ప్రవహించే నదుల్లోకెల్లా పెద్దది. దీని పొడవు 1312 కి.మీ. ఈ నది అమర్‌కంఠక్‌ పీఠభూమిలో జన్మించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా ప్రవహించి కాంబే సింధుశాఖలో బ్రోచ్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికి కుడివైపున హిరన్, కోలర్, బర్సాంగ్, బార్న, ఎడమ వైపున షక్కర్, తవ, బంజర్, కావేరి ఉన్నాయి. ఈ నదిపై సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును నిర్మించారు. 

 

తపతి: పశ్చిమానికి ప్రవహించే నదుల్లో రెండో పెద్ద నది. ఇవి గావిల్‌గర్‌ కొండల్లో బేతుల్‌ పీఠభూమిలోని ముల్తాయ్‌ వద్ద జన్మిస్తుంది. ఈ నదికి వ్యతిరేక దిశలో వార్థానది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున సూరత్‌ నగరం ఉంది. కాక్రపార్, ఉకాయ్‌ డ్యామ్‌లు దీనిపై నిర్మించారు. 

 

ఉపనదులు: వాఘర్, గోమయ్, పూర్ణ, బోరి, గిర్నా, బురే, పంజా, అరుణవతి.

 

సబర్మతి: ఈ నది ఆరావళి పర్వతాల్లో ఉదయ్‌పూర్‌ జిల్లా మేవార్‌ వద్ద దేబార్‌ సరస్సులో జన్మించింది. దీని పొడవు 371 కి.మీ. ఇది కాంబట్‌ సింధుశాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. అహ్మదాబాద్, గాంధీనగర్‌ పట్టణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి. నర్మదా నది నీటిని సర్ధార్‌ సరోవర్‌ కాలువ ద్వారా సబర్మతి నదిలోకి వెళ్లేలా చేశారు. ఈ నది ఎడమవైపున హర్నవ్, నేష్వా, వాకల్, హత్మ్‌తి, కుడివైపున సేయ్‌ నదులున్నాయి.

 

మహీనది: ఈ నది వింధ్య పర్వతాల్లో సర్థార్‌పుర్‌కు దక్షిణాన పుట్టి మధ్యప్రదేశ్‌లో ఉత్తర వాయవ్యాన ప్రవహించి, గుజరాత్‌ మీదుగా కాంబే సింధుశాఖ వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నదిపై మహిబజాజ్‌ సాగర్, కదన, వనక్‌బోరి ఆనకట్టలు నిర్మించారు. దీని ఒడ్డున వడోదరా పట్టణం ఉంది. 

 

ఉపనదులు: సోమ్, అనాస్, జఖమ్, మోరన్, భదర్‌.

 

ఇవి కాకుండా ఇంకా భద్రానది గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలోని వడ్డి దగ్గర జన్మించి, పోరుబందరు జిల్లా నావియో భందర్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. శరావతి నది కర్ణాటకలోని అంబుతీర్థం వద్ద జన్మించి కర్కి వద్ద సముద్రంలో కలుస్తుంది. నేత్రావతి కర్ణాటకలోని బంగ్రాబలిగా లోయలో పుట్టి, న్యూమంగుళూరు వద్ద కడలిలో కలుస్తుంది. జువారీ నది హెమర్‌-బర్సెం దగ్గర పుట్టి అరేబియా అఖాతంలో కలుస్తుంది. గోవా పట్టణం జువారీ నది ముఖద్వారం దగ్గర ఉంది. మాండోవి నది బెలగావి (కర్ణాటక) జిల్లాలో బీమ్‌గడ్‌ దగ్గర జన్మించి, అరేబియా సాగరంలో కలుస్తుంది. భరతపూడ నది జన్మస్థలం అన్నామలై కొండ. పెరియార్‌ నది పశ్చిమ కనుమల్లో శివగిరి శిఖరం దగ్గర ప్రారంభమవుతుంది. కేరళలోని అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రం ఈ నదిపై ఉంది. పంబా నది కేరళలోని పులాచిమలై కొండల్లో పుట్టి 177 కి.మీ. ప్రవహించి వెంబనాడ్‌ వద్ద అరేబియాలో కలుస్తుంది.

 

వంశధార: ఈ నది తూర్పు కనుమల్లో తౌముల్‌ రాంపూర్‌లో జన్మిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగావళి నది ఒడిశాలోని కలహండి వద్ద జన్మించి, శ్రీకాకుళం జిల్లా మోఫస్‌ బందర్‌ వద్ద సముద్రంలో కలుస్తుంది.

 

* మాచ్‌ఖండ్‌ నది తూర్పుకనుమల్లోని మాడుగుల కొండల్లో జన్మించి, సీలేరు నదిలో కలుస్తుంది. డుడుమా జలపాతం దీనిపైనే ఉంది.

 

* బ్రహ్మణి నది సౌత్‌కోయిల్, సంఖ్‌ నదుల కలయిక వల్ల ఏర్పడగా ధమ్రా(ఒడిశా) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

 

* సువర్ణరేఖ నది చోటానాగపూర్‌ పీఠభూమి, రాంచి దగ్గర జన్మించి సువర్ణరేఖ పోర్టు వద్ద సముద్రంలో కలుస్తుంది.

 

అంతర్భూభాగ నదీ వ్యవస్థ: ఇవి జన్మించిన ప్రాంతం నుంచి కొంత దూరం ప్రవహించి సముద్రంలో కలవక ముందే భూభాగంలోనే అంతరించిపోతాయి. 

 

లూనీ నది: ఈ నది వాయవ్య భారత్‌లో పెద్దది. ఇది ఆరావళి పర్వతాల్లో అజ్మీర్‌ సమీపంలోని పుష్కర్‌ వద్ద జన్మించి 511 కి.మీ.. ప్రవహించి రాణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద ఇంకిపోతుంది. సరస్వతి, సబర్మతి నదుల రెండు శాఖలు గోవింద్‌ఘర్‌ (రాజస్థాన్‌) వద్ద కలుస్తాయి. దీన్ని లూనీ నదిగా పిలుస్తారు. 

 

ఘగ్గర్‌ నది: దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది. శివాలిక్‌ కొండల్లో (హిమాచల్‌ ప్రదేశ్‌)లో పుట్టి పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లో ప్రవహించి ఇసుక నేలల్లో ఇంకిపోతుంది.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భారతదేశం - వ్యవసాయ విధానం  

‣ సమాచార సేవలు

 గంగా, సింధూ మైదానం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌