• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష యాత్రలు

మన చంద్రమంగళ విజయాలు!

 విశ్వ రహస్యాలను కనిపెట్టడానికి, మన భూగోళాన్ని కాపాడుకోడానికి, పర్యావరణ పరిరక్షణకు ఇంకా అనేక రకాల ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలు అంతరిక్షాన్ని శోధిస్తుంటాయి. ఇందుకోసం ఎంతో టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంతరిక్ష యాత్రలు, అందులో వినియోగించిన టెక్నాలజీ, సాధించిన విజయాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

  ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక విజయాలను నమోదు చేస్తోంది. చంద్రుడి మీదకు ఉపగ్రహాలను ప్రయోగించి ఎన్నో విషయాలను సేకరించింది. మంగళ్‌యాన్‌ నిర్వహించి అంగారకుడిపై పరిశోధనలు చేసింది. 

 

చంద్రయాన్‌-1

చంద్రయాన్‌ - 1ను భారతదేశ మొదటి చంద్ర మండల యాత్ర అంటారు. ఇది ఒక ఆధునిక రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా చంద్రుడికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి, గ్రహ విజ్ఞానం (Planetary Science) కోసం దీన్ని ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ11 ద్వారా 2008 అక్టోబరు 22న దీన్ని చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహ సహాయంతో అనేక విషయాలను సేకరించిన తర్వాత 2009 మేలో ఈ ఉపగ్రహ కక్ష్యను 100 నుంచి 200 కి.మీ.కు పెంచారు. ఉపగ్రహ జీవితకాలం 2 సంవత్సరాలు అనుకున్నప్పటికీ 2009, ఆగస్టు 29న ఈ ఉపగ్రహంతో సమాచార బంధం తెగిపోయింది. 

ఉపగ్రహ వివరాలు: దీని బరువు 1380 కి.గ్రా. దీనిలో 11 పరికరాలు ఉంటాయి. వీటిలో 5 భారతదేశానికి చెందినవి కాగా మిగతా 6 అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జర్మనీ, స్వీడన్, బల్గేరియా దేశాలకు చెందినవి. 

 

ఉపగ్రహంలో భారతదేశానికి సంబంధించిన పరికరాలు

* టెర్రెయిన్‌ మ్యాపింగ్‌ కెమెరా (TMC) 

* హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజర్‌ (HYSI) 

* లూనార్‌ లేజర్‌ రేంజింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (LLRI) 

* హై ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (HEX)  

* మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ (MIP)  

 

ఇతర దేశాలకు చెందిన పరికరాలు

* చంద్రయాన్‌-1 ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (CIXS) 

* నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోమీటర్‌ (SIR-2)  

* సబ్‌కేవ్‌ ఆటమ్‌ రిఫ్లెక్టింగ్‌ అనలైజర్‌ (SARA)  

* మినియేచర్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (MiniSAR)   

* మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ (M3) 

* రేడియేషన్‌ డోస్‌ మానిటర్‌ (RADOM)  

 

లక్ష్యాలు: * చంద్రుడి 3డీ అట్లాస్‌ను రూపొందించడం.

* చంద్రుడి ఉపరితల రసాయనిక విశ్లేషణ.

* చంద్రుడి మట్టిలో ఉండే మూలకాలను కనుక్కోవడం.

* చంద్రుడిపై నీరు/మంచు ఉందని నిర్ధారించడం.

* విశ్వం, చంద్రుడి పుట్టుక, పరిణామం గురించి తెలుసుకోవడం.

* హీలియం - 3 ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించడం.

* భవిష్యత్‌ చంద్రమండల యాత్రకు చంద్రుడిపై సరైన ప్రదేశాన్ని వెతకడం.

* చంద్రుడి గురుత్వాకర్షణను కచ్చితంగా నిర్ధారించడం.

 

విజయాలు: * ఈ ఉపగ్రహం కక్ష్యలో చంద్రుడి చుట్టూ 3400 సార్లు తిరిగింది. 

* చంద్రుడిపై హైడ్రాక్సైల్‌ (OH), నీటి అణువులను గుర్తించింది. 

* చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికా, కాల్షియం లాంటి మూలకాలను గుర్తించింది. 

* దీని ద్వారా శాస్త్రవేత్తలకు ఉపగ్రహ టెక్నాలజీ, అంతరిక్ష శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెరిగింది.

 

చంద్రయాన్‌ - 2 

చంద్రయాన్‌ - 2లో భాగంగా ఆర్బిటర్, లాండర్, రోవర్‌లను జీఎస్‌ఎల్వీ-ఎంకే-III-ఎం1 అనే వాహక నౌక ద్వారా 2019 జులై 22న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. ఆర్బిటర్‌ అనేది రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. ఆర్బిటర్‌ (ఉపగ్రహం) 2019 ఆగస్టు 20న చంద్రుడి 100 కి.మీ. కక్ష్యలోకి చేరింది. ఇది చంద్రుడి 100 కి.మీ. కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి గురించి అనేక విషయాలను సేకరించింది. 

ఆర్బిటర్‌లో ఉండే పేలోడ్‌లు: * టెర్రెయిన్‌ మ్యాపింగ్‌ కెమెరా - 2 (TMC-2) 

* చంద్రయాన్‌ - 2 లార్జ్‌ ఏరియా సాఫ్ట్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (CLASS)  

* సోలార్‌ ఎక్స్‌రే మానిటర్‌ (XSM)

* ఆర్బిటర్‌ హై రెజల్యూషన్‌ కెమెరా (OHRC)  

* ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ (IIRS)  

* డ్యుయల్‌ ఫ్రీక్వెన్సీ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (DFSAR)  

* చంద్రయాన్‌-2 అట్మాస్ఫియరిక్‌ కాంపోజిషనల్‌ ఎక్స్‌ప్లోరర్‌ 2 (CHACE 2)     

* డ్యుయల్‌ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్‌ (DFRS) ఎక్స్‌పరిమెంట్‌

 

రోవర్‌ 

  దీన్ని ప్రగ్యాన్‌ (Pragyan) పేరుతో పిలుస్తున్నారు. ఇది ఆరు చక్రాలు కలిగిన రోబోటిక్‌ వాహనం. రోవర్‌ చంద్రుడిపై తిరుగుతూ అక్కడి మట్టిని తవ్వి రసాయనిక విశ్లేషణ చేసి సమాచారాన్ని పంపుతుంది. దీని బరువు 27 కిలోలు, జీవితకాలం చంద్రుడిపై ఒక రోజు (ఇది భూమి మీద 14 రోజులతో సమానం) అంటే చంద్రుడిపై సూర్యకిరణాలు పడేకాలం. ప్రగ్యాన్‌లో ఉన్న పేలోడ్‌లు (పరికరాలు) ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (APXS), లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (LIBS).

 

ల్యాండర్‌ 

దీన్ని విక్రమ్‌ అనే పేరుతో పిలుస్తున్నారు. దీనిలో రోవర్‌ ఉంటుంది. ల్యాండర్‌ ఆర్బిటర్‌ నుంచి విడిపోయి చంద్రుడిపై దిగుతుంది. ఈ ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. 


ల్యాండర్‌లోని పరికరాలు: * రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌ సెన్సిటివ్‌ అయనోస్ఫియర్‌ అండ్‌ అట్మాస్ఫియర్‌ (RAMBHA)

 

* చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మోఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ (ChaSTE)


* ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సెసిమిక్‌ యాక్టివిటీ (ILSA)

 

లక్ష్యాలు: * చంద్రుడిపై ఇప్పటివరకు పరిశోధించని దక్షిణ ధ్రువ ప్రాంతాలను శోధించి సమాచారాన్ని తెలుసుకోవడం.

* చంద్రుడి ఉపరితలం గురించి పరిశోధన, చంద్రుడిపై ఉన్న మట్టిలోని మూలకాలను గుర్తించడం, ఉపరితల మట్టిని రసాయనిక విశ్లేషణ చేయడం. 

  2019 సెప్టెంబరు 2న కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో చంద్రుడికి 2.1 కి.మీ. పైన ఉండగా ల్యాండర్‌కు భూమితో సంబంధాలు తెగిపోయాయి. ల్యాండర్‌ 2019 సెప్టెంబరు 7న చంద్రుడిపై కూలిపోయింది. చంద్రయాన్‌ - 2 పాక్షికంగా విజయవంతమైందని చెప్పవచ్చు.

 

భారత అంగారక గ్రహయాత్ర

దీన్ని మంగళ్‌యాన్‌ లేదా మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (MOM) అంటారు. ఇది భారతదేశం మొదటిసారి గ్రహాల మధ్య జరిపిన యాత్ర. మంగళ్‌యాన్‌ అనేది రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. దీన్ని 2013 నవంబరు 5న పీఎస్‌ఎల్వీ-సీ25 ద్వారా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. ఇది 2014 సెప్టెంబరు 24న అంగారక గ్రహ కక్ష్యలోకి చేరింది. భారతదేశం ఈ యాత్రను అతి తక్కువ ఖర్చుతో (రూ.450 కోట్లు) నిర్వహించింది. ఇలాంటి అంగారక గ్రహ యాత్రను భారతదేశానికి ముందు అమెరికా, రష్యా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు మాత్రమే నిర్వహించాయి. ఈ ఘనత సాధించిన నాలుగో దేశం భారత్‌. 

 

ఉపగ్రహంలోని పరికరాలు: * లైమాన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (LAP) - ఇది డ్యుటీరియం, హైడ్రోజన్‌ను కొలుస్తుంది. 

 

* మీథేన్‌ సెన్సార్‌ ఫర్‌ మార్స్‌ (MSM) - ఇది మీథేన్‌ వాయువు ఉనికిని గుర్తిస్తుంది. 

 

* మార్స్‌ ఎక్సోస్ఫియరిక్‌ న్యూట్రల్‌ కాంపోజిషన్‌ అనలైజర్‌ (MENCA) -  ఇది అంగారకుడిపై ఉన్న రేణువుల గురించి పరిశోధిస్తుంది. 

 

* మార్స్‌ కలర్‌ కెమెరా (MCC) - అంగారక ఉపరితల చిత్రాలను తీస్తుంది.

 

* థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ (TIS) - ఇది అంగారక గ్రహంపైన ఉన్న మట్టి, ఖనిజ లవణాల థర్మల్‌ ఎమిషన్స్‌ను (ఉష్ణం విడుదల) గుర్తిస్తుంది. 

 

లక్ష్యాలు: * గ్రహాంతర యాత్రకు సంబంధించిన సాంకేతికతను పెంపొందించడం.

* సుదూర అంతరిక్ష సమాచార నావిగేషన్‌ సాంకేతిక వృద్ధి, అనుభవాన్ని సంపాదించడం.

* అంగారక గ్రహ ఉపరితలం, ఖనిజాల గురించి పరిశోధన. 

* అంగారకుడిపై మీథేన్‌ వాయువును గుర్తించడం.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 కృత్రిమ మేధ

  పునరుత్పాదక శక్తి వనరులు

 అంతరిక్ష పరిజ్ఞానం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 05-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌