• facebook
  • whatsapp
  • telegram

  ఆంగ్లో-మరాఠా యుద్ధాలు

చిచ్చుపెట్టి.. విడగొట్టి.. ఒక్కొక్కరినీ ఓడించి!

  చరిత్రలో మహా వీరులుగా పేరుపొందిన మరాఠాల మధ్య చిచ్చుపెట్టి, విడగొట్టి, ఒక్కొక్కరినీ ఓడించి వారి రాజ్యాలను ఆంగ్లేయులు ఆక్రమించారు. పటిష్ఠ కూటమిగా ఉండి ఒక దశలో బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణకు సవాలుగా నిలిచిన పీష్వాలు, సింధియాలు, హోల్కర్లు, గైక్వాడ్‌లు అనైక్యతతో, అంతర్గత కలహాలతో ఈస్టిండియా కంపెనీ కంబంధ హస్తాల్లోకి వెళ్లిపోయారు. దేశం దిశను మార్చిన ఈ ఆంగ్లో-మరాఠా యుద్ధాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  ఛత్రపతి శివాజీ మరాఠాలను తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొందించాడు. పీష్వా అంటే ఛత్రపతికి ప్రధానమంత్రి. కాలక్రమంలో ఛత్రపతులు తమ పాలనా దక్షతను కోల్పోయి నామమాత్రపు పాలకులుగా మారారు. ఛత్రపతి సాహూ కాలం నుంచి పాలనలో పీష్వాల ప్రాబల్యం పెరిగింది. 18వ శతాబ్దం రెండో దశకం నుంచి మరాఠాల చరిత్రలో పీష్వాల యుగం ప్రారంభమైంది (1713 - 1818). బాలాజీ విశ్వనాథ్‌ (1713 - 20) మొదటి పీష్వా. ఆ తర్వాత మొదటి బాజీరావు (1720 - 40), బాలాజీ బాజీరావు (1740 - 61), మాధవరావు (1761 - 72) లు పీష్వాలుగా చేశారు. వీరు మ‌రాఠా సామ్రాజ్య పూర్వ వైభవ పునరుద్ధరణకు, రాజ్యాభివృద్ధికి కృషి చేశారు. మరాఠాలది గ్వాలియర్‌ రాజైన సింధియా, ఇండోర్‌ రాజైన హోల్కర్, బరోడా రాజైన గైక్వాడ్, మధ్యభారతంలో నాగపూర్‌ పాలకుడు భోంస్లేలతో కూడిన పటిష్ఠ కూటమి. వీరి నాయ‌కుడైన‌ పీష్వాకు కప్పం చెల్లిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు సైనిక సహాయం చేసేవాడు. నేటి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కొంత మేర ఒరిస్సా ప్రాంతాలు విశాల మరాఠా సామ్రాజ్యంలో అంతర్భాగాలు.

  క్రీ.శ.1764లో బక్సర్‌ యుద్ధం తర్వాత రాజ్యాధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న ఇంగ్లిష్‌ ఈస్టిండియా కంపెనీ దృష్టి మరాఠాలపై పడింది. కానీ ఆంగ్లేయులకు మరాఠాల బలసంపత్తి తెలుసు. భారతదేశంలో సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకునే వారి ఆకాంక్షకు మరాఠాలు పెద్ద అవరోధమనే నిర్ణయానికి వచ్చి, ఆ శక్తిని విచ్ఛిన్నం చేయడానికి సరైన అవకాశం కోసం వేచి చూశారు. మరాఠా కూటమిలోని అనైక్యత, స్వార్థం, అంతర్గత కలహాలు, దూరదృష్టి లేమి ఆంగ్లేయ కంపెనీకి వరంగా మారాయి.

 

మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం (1775 - 82)

  బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వారన్‌ హేస్టింగ్స్‌ పదవిలో ఉన్నప్పుడు ఈ యుద్ధం జరిగింది. 1772లో పీష్వా మాధవరావు మరణించాడు. అతడి తమ్ముడు నారాయణ రావు పీష్వా అయ్యాడు. అతడి పినతండ్రి రఘునాథరావుకు అది ఇష్టం లేదు. దాంతో  నారాయణ రావును హత్య చేయించి తానే పీష్వా పదవిని చేపట్టాడు. ఈ దుశ్చర్యను గర్హించిన మరాఠా సర్దారులు నానాఫడ్నవిస్‌ నాయకత్వంలో ఏకమై నారాయణరావు  మరణానంతరం ఆయన కుమారుడు రెండో మాధవరావును పీష్వాగా ప్రకటించారు. ఇది సహించని రఘునాథరావు బొంబాయి చేరి ఆంగ్లేయ కంపెనీతో సూరత్‌ సంధి (1775) చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం కంపెనీ రఘునాథరావును పీష్వాగా నియమించాలి. దీనికి బదులుగా అతడు సాల్సెట్టి, బేసిన్‌ ప్రాంతాలను కంపెనీకి ఇవ్వాలి. మద్రాసు, బెంగాల్‌లో మాదిరి ఇక్కడ కూడా చరిత్ర పునరావృతం అవుతుందని, మరాఠాల నుంచి సంపద కొల్లగొట్టవచ్చని ఆంగ్లేయులు ఆశించారు. తర్వాత పరిణామాలు మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి (1775 - 82) దారితీశాయి.

  మరాఠా సర్దారులు పీష్వాను బలపరిచే వారి నాయకుడు నానాఫడ్నవిస్‌ నాయకత్వంలో ఏకమై ఆంగ్లేయులను ఎదిరించారు. తదనంతర పరిణామాల్లో మరాఠాల వ్యూహాలు ఈస్టిండియా కంపెనీకి అంతుపట్టలేదు. చివరకు యుద్ధంలో ఏ పక్షానికి విజయం దక్కలేదు. ఫలితంగా ఇరుపక్షాలు 1782లో సాల్బాయ్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరుపక్షాల వారు  తాము జయించిన ప్రాంతాలు తిరిగి ఇచ్చివేయాలి. రఘునాథరావును పీష్వా చేసే ఆలోచనను బ్రిటిష్‌ కంపెనీ విరమించుకుంది. అతడికి పెన్షన్‌ మంజూరు చేసింది. రెండో మాధవరావును పీష్వాగా గుర్తించింది. యుద్ధానంతరం పూర్వస్థితి నెలకొంది. ఈ సంధి వల్ల సాల్సెట్టి కంపెనీకి సంక్రమించింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రాజ్యాధికారం కోసం మరాఠాల అంతర్గత కలహాలకు, ఆంగ్లేయుల జోక్యానికి అవకాశం కల్పించింది.

 

రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం (1803 - 06)

  ఐరోపా ఖండంలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ దేశాల మధ్య జీవన్మరణ యుద్ధాలు సాగుతూ ఫ్రెంచి ప్రాబల్యం పెరుగుతున్న సమయంలో (1798) వెల్లస్లీ భారతదేశానికి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వచ్చాడు. భారత్‌పై ఫ్రెంచి ప్రభావం లేకుండా చేయడానికి వీలైనన్ని భారతదేశ సంస్థానాలను కంపెనీ ఆధిపత్యం కిందకు తీసుకురావాలని పాలనా లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు దేశంలో కంపెనీ రాజ్య విస్తరణకు బ్రిటిష్‌ పారిశ్రామిక వర్గాల మద్దతు కూడా ఉంది.

వెల్లస్లీ స్వదేశీ సంస్థానాల మిత్రత్వంతో బ్రిటిష్‌ సార్వభౌమాధికారం నెలకొల్పాలని, స్వదేశీ సంస్థానాధీశులను సైనిక పరంగా కంపెనీపై ఆధారపడేలా చేసి వారిని నిర్వీర్యం చేయాలని 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. 

సైన్య సహకార పద్ధతి షరతులు: * ఈ పద్ధతిని అంగీకరించిన స్వదేశీ రాజు తన సొంత సైన్యాన్ని తొలగించి కంపెనీ సైన్యాన్ని కొలువులో ఉంచుకోవాలి.

* సైన్యానికి అయ్యే జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు ఆ సంస్థానాధీశుడే భరించాలి. 

* ఆంగ్లేయేతరులైన విదేశీయులను కొలువులో ఉంచకూడదు. 

* స్వదేశీ, విదేశీ రాజులతో మంతనాలు చేయకూడదు. 

* ఈ పద్ధతికి అంగీకరించిన స్వదేశీ రాజు రక్షణ బాధ్యతను కంపెనీ తీసుకుంటుంది. 

నిజానికి ఈ పద్ధతిని అంగీకరించిన స్వదేశీ రాజు తన స్వాతంత్య్రాన్ని తాకట్టు పెట్టినట్లే. 

  ఇదేకాలంలో మరాఠాల ఐక్యతకు పాటుపడిన మహద్జి సింధియా, తుకోజీ హోల్కర్, నానాఫడ్నవిస్‌ లాంటి విశిష్ట నాయకులు మరణించడంతో మరాఠాలు బలహీనులయ్యారు. మరాఠా సర్దారులు పూనాలోని పీష్వా, బరోడాలోని గైక్వాడ్, గ్వాలియర్‌లోని సింధియా, ఇండోర్‌లోని హోల్కర్లు, నాగపూర్‌లోని భోంస్లేల మధ్య ఐక్యత లోపించింది. కూటమి విచ్ఛిన్నమైంది. అంతర్గత కలహాల్లో నిమగ్నమైన వీరు ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి పొంచి ఉన్న ముప్పును పసిగట్టలేకపోయారు. 

  పీష్వా రెండో బాజీరావు అసమర్థుడు. ఇతడి అధికారాన్ని మరాఠా నాయకులైన సింధియా, హోల్కర్‌లు ధిక్కరించారు. సింధియాతో పీష్వా రెండో బాజీరావు చేతులు కలిపాడు. ఇది గిట్టని హోల్కర్‌ వారిద్దరినీ ఓడించాడు. రెండో బాజీరావు ఆంగ్లేయులను ఆశ్రయించి 1802లో బేసిన్‌ సంధి (సైన్య సహకార పద్ధతి) కుదుర్చుకున్నాడు. ఈ విధంగా తన సొంత రక్షణ కోసం పీష్వా, మరాఠాల స్వాతంత్య్రాన్ని ఆంగ్లేయులకు తాకట్టు పెట్టి బ్రిటిష్‌ కంపెనీ వలలో పడ్డాడు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరాఠా నాయకులు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కంపెనీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. కానీ ఒక్కొక్కరుగా యుద్ధం చేసి ఓడిపోయారు. సింధియా - సుర్జి అంజనగావ్‌ సంధి, భోంస్లే - దేవగావ్‌ సంధి చేసుకొని సైన్య సహకార పద్ధతికి అంగీకరించారు. భోంస్లే కటక్‌ జిల్లా, వార్దా నదికి పశ్చిమంగా ఉన్న ప్రాంతాలు, అహ్మద్‌ నగర్, బ్రోచ్, గంగా - యమునా అంతర్వేదిలను కంపెనీకి స్వాధీన పరిచాడు. బ్రిటిష్‌ రెసిడెంట్‌ అధికారులను వారి కొలువుల్లో నియమించారు. హోల్కర్‌ కూడా యుద్ధరంగంలోకి దూకాడు. తర్వాత కంపెనీ హోల్కర్‌తో రాజపూర్‌ ఘాట్‌ సంధి (1805) చేసుకుంది. దీని ప్రకారం హోల్కర్‌ చంబల్‌ నదికి ఉత్తర భాగాల మీద హక్కు వదులుకున్నాడు. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం వల్ల మరాఠాలు తమ స్వాతంత్య్రాన్ని ఆంగ్లేయులకు తాకట్టు పెట్టారు. వారి కూటమి విచ్ఛిన్నమైంది. కంపెనీ భారతదేశంలో సర్వాధిపత్య శక్తిగా ఎదిగింది.

 

మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం (1817 - 18)

రెండో మరాఠా యుద్ధంతో మరాఠాల స్వేచ్ఛను హరించుకుపోయింది. వారి ప్రతిష్ఠ మసకబారింది. మరాఠా సర్దారులు వారు కోల్పోయిన పరువు ప్రతిష్ఠలు తిరిగి పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పీష్వా పూనాలోని రెసిడెంట్‌ అధికారిపై దాడి చేసి ఆంగ్లేయులను తరిమేశాడు. అప్పటి గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ మరాఠా నాయకులపై యుద్ధం ప్రకటించాడు. కిర్కీ, కోరేగావ్‌ యుద్ధాల్లో పీష్వాను: సీతల్‌ బర్డీ వద్ద భోంస్లేను: మహాదీపూర్‌ వద్ద హోల్కర్‌ను ఓడించారు. తర్వాత జరిగిన ఒప్పందాల ఫలితంగా మరాఠా రాజ్యాలు స్వాతంత్య్రం కోల్పోయి కంపెనీ రక్షణలోకి వెళ్లాయి. వారి రాజ్య భాగాలు చాలా వరకు బ్రిటిషర్ల వశమయ్యాయి. పీష్వా పదవిని రద్దు చేసి అతడికి భరణం మంజూరు చేశారు. మరాఠా కూటమి రద్దయింది. చిన్న సతారా రాజ్యాన్ని సృష్టించి శివాజీ వారసుడిని రాజుగా నియమించారు. పీష్వాను కాన్పూర్‌ వద్ద ఉన్న బిత్తూర్‌కు పంపారు. 1818 నాటికి పంజాబ్, సింధ్‌ మినహా మిగిలిన భారత ఉపఖండమంతా బ్రిటిషర్ల రాజకీయ ఆధిపత్యం కిందకు వచ్చింది. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 ఢిల్లీ సుల్తానులు

 భ‌క్తి, సూఫీ ఉద్య‌మాలు

  మహ్మదీయ దండయాత్రలు

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌