• facebook
  • whatsapp
  • telegram

బక్సర్‌ యుద్ధం

ఆ యుద్ధంతో ఆంగ్లేయుల ఆధిప‌త్యం సుస్థిరం

  భారత్‌లో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపనకు ప్లాసీ యుద్ధం పునాది వేయగా.. బక్సర్‌ యుద్ధం వారి ఆధిపత్యాన్ని మరింత బలపడేలా చేసింది.  బెంగాల్‌లో నాటి నవాబులు అవలంబించిన సంస్కరణలు..బక్సర్‌ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, యుద్ధ ఫలితాలు, అలహాబాద్‌ సంధి విశేషాలు తదితరాలను పోటీపరీక్షల్లో భాగంగా అభ్యర్థులు అధ్యయనం చేయాలి.

  క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధం బెంగాల్‌లో బ్రిటిషర్ల ఆదిపత్యానికి పునాదివేయగా 1764లో జరిగిన బక్సర్‌ యుద్ధం వారి రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది. ప్లాసీ యుద్ధానంతర పరిణామాల్లో ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ నవాబు సిరాజ్‌-ఉద్‌-దౌలాకు వ్యతిరేకంగా పన్నిన కుట్రకు సహకరించిన మీర్‌ జాఫర్‌ను కంపెనీ బెంగాల్‌ నవాబుగా నియమించింది. ప్లాసీ యుద్ధ విజయానికి ప్రముఖపాత్ర పోషించిన రాబర్ట్‌ క్లైవ్‌ ఆ తర్వాత బెంగాల్‌ గవర్నర్‌ అయ్యాడు (1757 - 60). కొత్త నవాబు మీర్‌ జాఫర్‌ కంపెనీకి 24 పరగణాలు దానం చేయ‌డ‌మే కాకుండా రాబర్ట్‌ క్లైవ్‌కు, కంపెనీ ఉద్యోగులకు విలువైన కానుకలు ఇచ్చాడు. క్లైవ్‌ బడేరా యుద్ధంలో (1759) డచ్చివారిని ఓడించి వారి స్థావరమైన చిన్సూరాను ఆక్రమించి వారిని పూర్తిగా పతనం చేశాడు. 1760లో ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన క్లైవ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రశంసించి ‘సర్‌’ అనే బిరుదును ప్రదానం చేసింది.

 

యుద్ధానికి దారితీసిన పరిస్థితులు

  కొత్త నవాబు మీర్‌ జాఫర్‌ కంపెనీ అధికారుల భారీ ఆర్థిక డిమాండ్‌లు తీర్చడంలో విఫలమయ్యాడు.  ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. అయినా అధికారులకు సంతృప్తి లేదు. వారి కోరికలు తీర్చడం మీర్‌ జాఫర్‌కు అసాధ్యమైంది. కంపెనీ అతడిని అసమర్థుడు అని ముద్రవేసి అధికారం నుంచి తొలగించి మీర్‌ ఖాసింను బెంగాల్‌ నవాబుగా చేసింది.

 

మీర్‌ ఖాసిం

  మీర్‌ ఖాసిం యువకుడు, ఉత్సాహవంతుడు, స్వతంత్రభావాలు గల వ్యక్తి, పరిపాలనదక్షుడు. ఆయన బెంగాల్‌ నవాబు పదవిని అధిష్టించగానే కంపెనీకి బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్‌ ప్రాంతాలను ధారాద‌త్తం చేశాడు. ఉద్యోగులకు విలువైన బహుమానాలు ఇచ్చాడు. అతడు అనతి కాలంలోనే బ్రిటిషర్ల దురాశను, దస్తక్‌ల దుర్వినియోగాన్ని, దానివల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని గ్రహించి పాలనా సంస్కరణలకు పూనుకున్నాడు.

 

సంస్కరణలు

  బెంగాల్‌ నవాబు ఖాసిం రోజువారీ అధికార కార్యకలాపాల్లో కంపెనీ జోక్యాన్ని తగ్గించడానికి రాజధాని ముర్షిదాబాద్‌ను కలకత్తాకు దూరంగా ఉన్న మాంగీర్‌కు మార్చాడు. ఫ్రెంచ్‌వారి సహాయంతో పాశ్చాత్య విధానంలో సైన్యాన్ని ఆధునికీకరణ చేయడం, తర్ఫీదు ఇప్పించడం ప్రారంభించాడు. 

  కంపెనీ కోసం ఉద్దేశించిన సుంకం చెల్లించాల్సిన అవసరం లేని వ్యాపార పాసులను (దస్తక్‌లు) కంపెనీ ఉద్యోగులు తమ సొంత వ్యాపారానికి ఉపయోగించుకొని దుర్వినియోగం చేయ‌డ‌మే కాకుండా ఆ పాసులను తోటి వర్తకులకు అమ్మడం ప్రారంభించారు. వీటి ఫలితంగా నవాబు కోశాగారానికి తీవ్ర నష్టం ఏర్పడటంతో ఖాసిం దీన్ని నిరోధించడానికి ప్రయత్నించాడు. స్వదేశీ వర్తకులను విదేశీ వర్తకులతో సమస్థాయిలో ఉంచేందుకు అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులు రద్దు చేశాడు. ఈ తీవ్రమైన చర్యను కంపెనీ ప్రతిఘటించింది. స్వదేశీ వ్యాపారస్థులపై సుంకం విధించాలని డిమాండ్‌ చేసింది. కానీ నవాబు దీనికి అంగీకరించలేదు.

  నవాబు స్వతంత్ర భావాలు, చర్యలు ఇంగ్లిష్‌ కంపెనీకి మింగుడు పడలేదు. బ్రిటిష్‌వారు బెంగాల్‌ సంపదను లంచాలు, విలువైన కానుకలు, లాభాల రూపంలో ఇంగ్లండ్‌కు తరలించడానికి అలవాటు పడ్డారు. దీనికోసం నవాబు తమ చేతిలో కీలుబొమ్మలా ఉండాలని, బెంగాల్‌పై బ్రిటిషర్ల ఆధిపత్యమే కొనసాగాలని కంపెనీ భావించింది. ఇది ఇరువురి మధ్య సంఘర్షణకు దారి తీసింది. క్రీ.శ.1763లో జరిగిన చిన్న చిన్న యుద్ధాల్లో బ్రిటిష్‌ సైన్యం మీర్‌ ఖాసింను వెంటాడి ఓడించింది. ఆ తర్వాత అతడు అవద్‌ (అయోధ్య)కి పారిపోయాడు. మీర్‌ ఖాసింను బెంగాల్‌ నుంచి తరిమివేసిన తర్వాత మీర్‌ జాఫర్‌ తిరిగి బెంగాల్‌ నవాబు అయ్యాడు. పర్యవసానంగా బెంగాల్‌ సంపదను యథేచ్ఛగా ఇంగ్లండ్‌కు (డ్రెయిన్‌ ఆఫ్‌ వెల్త్‌) తరలించారు. 

 

బక్సర్‌ యుద్ధం (1764) 

  అవద్‌ చేరిన మీర్‌ ఖాసిం అవద్‌ నవాబు షుజా-ఉద్‌-దౌలా, మొగల్‌ చక్రవర్తి షా ఆలం - II ల‌తో క‌లిసి కూటమిని ఏర్పరిచాడు. ఇది భారతదేశ గడ్డపై విదేశీయులను ఎదిరించడానికి ఏర్పడిన స్వదేశీ రాజుల మొదటి సమాఖ్య అని చెప్పవచ్చు. ఇరు సైన్యాలు బక్సర్‌ (ప్రస్తుత బిహార్‌) వద్ద యుద్ధానికి తలపడగా హెక్టర్‌ మన్రో నాయకత్వంలోని కంపెనీ సైన్యం స్వదేశీ రాజుల సమాఖ్యను 1764 అక్టోబరు 22న ఓడించింది.

 

ఫలితాలు 

  బెంగాల్‌లో ఏర్పడిన రాజకీయ కల్లోల పరిస్థితిని చక్కదిద్దడానికి, బక్సర్‌ యుద్ధ విజయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బ్రిటిష్‌వారు రాబర్ట్‌ క్లైవ్‌ను రెండోసారి బెంగాల్‌ గవర్నర్‌గా పంపారు. అతడు షా ఆలం - II, షుజా-ఉద్‌-దౌలాతో విడివిడిగా సంధి కుదుర్చుకున్నాడు.

 

అలహాబాద్‌ సంధి (1765)

  అవధ్‌ న‌వాబు షుజా-ఉద్‌-దౌలా త‌న రాజ్యంలోని అలహాబాద్, కారా జిల్లాలను మొగల్‌ చ‌క్ర‌వ‌ర్తి షా ఆలం - II కి ఇచ్చాడు. ఇతడు కంపెనీకి బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని అంటే దివాని అధికారాన్ని ఇచ్చాడు. కంపెనీ షా ఆలం - II కు సాలీన 26 లక్షల భరణం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అవద్‌ నవాబు యుద్ధ ఖర్చుల కింద రూ.50 లక్షల నష్టపరిహారం కంపెనీకి చెల్లించాలి. కంపెనీకి తన రాజ్యంలో సుంకం చెల్లించకుండానే వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాడు.   

  నిజామత్‌ అధికారులు అంటే న్యాయం, సంక్షేమం, శాంతిభద్రతలు లాంటి విధులను నిర్వహించడానికి ఏటా కొంత గ్రాంటు బెంగాల్‌ నవాబుకు ఇవ్వడానికి నిర్ణయించారు. బెంగాల్‌ నవాబు నామమాత్రపు నిజామత్‌ విధులతో పూర్తిగా కంపెనీ వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడ్డాడు. ఈ విధంగా ప్లాసీ యుద్ధం ప్రారంభమైన బ్రిటిషర్ల ఆధిపత్యం బక్సర్‌ యుద్ధంతో బలపడింది. బెంగాల్, బిహార్, ఒడిశాలకు బ్రిటిష్‌వారు మకుటంలేని మహారాజులుగా మారారు. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు... మీ కోసం!

ఢిల్లీ సుల్తానుల యుగ విశేషాలు

మహ్మదీయ దండయాత్రలు

మొగల్‌ యుగ విశేషాలు

Posted Date : 19-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌