• facebook
  • whatsapp
  • telegram

మితవాద యుగం (1885-1905)

జన చైతన్యం.. ఘన విజయం!

 

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించారు. దాన్ని వ్యక్తం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆందోళనలు జరిపి అభిప్రాయాలను పాలకులకు చేరవేశారు. ఈ ప్రక్రియలో జన చైతన్యాన్ని సాధించి, జాతీయ భావాన్ని పెంపొందించడంలో తొలితరం కాంగ్రెస్‌ నాయకులు ఘన విజయం సాధించారు. పోరాటాల్లో భాగంగా రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రార్థించారు. పాలనా సంస్కరణల కోసం విజ్ఞప్తులు చేశారు. ఆర్థిక దోపిడీ విధానాలను నిరసించారు. తర్వాతి తరాలు జరిపిన స్వాతంత్య్ర సమరానికి పటిష్ఠ పునాదులు వేశారు. 


భారతీయుల్లో అంతకంతకూ పెరుగుతోన్న అసంతృప్తిని, జాతీయభావాలను సమన్వయపరచి, సక్రమ మార్గంలో నడిపిస్తూ ప్రజాభిప్రాయాన్ని బ్రిటిష్‌ పాలకులకు తెలియజేసేందుకు జాతీయస్థాయిలో ఒక రాజకీయ సంస్థ అవసరమని ఆనాటి నాయకులు భావించారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌షా మెహతా, ఆనందమోహన్‌ బోస్‌ లాంటి వారు ఇందుకోసం నడుం బిగించారు. వీరి ఆలోచనలకు బ్రిటిష్‌ ప్రభుత్వ మాజీ ఐసీఎస్‌ అధికారి ఏ.ఓ.హ్యూమ్‌ సహాయ సహకారాలు అందించి, కీలక పాత్ర పోషించాడు. వీరందరి కృషి ఫలితంగా 1885, డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఏర్పడింది. కాంగ్రెస్‌ మొదటి సమావేశం బొంబాయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో ఉమేష్‌ చంద్ర బెనర్జీ అధ్యక్షతన 72 మంది సభ్యులతో జరిగింది. ఇదే సమావేశంలో కాంగ్రెస్‌ తన లక్ష్యాలను ప్రకటించింది. అనతి కాలంలోనే కాంగ్రెస్‌ సభ్యత్వం గణనీయంగా పెరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపించినప్పటి నుంచి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే వరకు ప్రజల ఆకాంక్షల మేరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసింది. ఆ సంఘటనలను మూడు దశలుగా విభజించారు. అవి 1) మితవాద దశ (1885-1905)  2) అతివాద దశ (1905-1919) 3) గాంధీయుగం (1919-1947).

 

ఎవరీ మితవాదులు?

దాదాభాయ్‌ నౌరోజీ, మహాదేవ్‌ గోవింద్‌ రనడే, మదన్‌మోహన్‌ మాలవ్య, పి.ఆనందాచార్యులు, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌ షా మెహతా, రమేష్‌ చంద్ర దత్త, సురేంద్రనాథ్‌ బెనర్జీ, జి.సుబ్రమణ్య అయ్యర్‌ తదితరులు కాంగ్రెస్‌ మొదటి తరం నాయకులు. వీరిలో ఎక్కువ మంది ఆంగ్ల విద్యనభ్యసించిన మధ్యతరగతి మేధావి వర్గం వారు. బ్రిటిష్‌ పాలన వల్లే భారతదేశం రాజకీయ ఐక్యత సాధించి, ఒక భౌగోళిక స్వరూపం పొందిందని వీరి అభిప్రాయం. బ్రిటన్‌లోని ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థలపై విశ్వాసం ఉన్నవారు. ఆంగ్లేయులు వారి దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను ఇక్కడ కూడా నెలకొల్పుతారని, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం నుంచి భారతీయులను ఉద్ధరిస్తారని ఆశించేవారు. దేశ పురోగతికి తెల్లవారి పాలన అవసరమని భావించారు. అందుకు అగుణంగానే రాజ్యాంగబద్ధమైన ఆందోళన జరపడాన్ని మితవాదులు రాజకీయ పద్ధతిగా ఎంచుకున్నారు. మొదటి రెండు దశాబ్దాల పాటు వారి డిమాండ్లను స్థూలంగా రాజకీయ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలుగా వర్గీకరించవచ్చు.

రాజకీయ సంస్కరణలు: అమెరికా స్వాతంత్య్ర సమరంలో ఆ దేశ ప్రజలు తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే పన్నులు చెల్లించేది లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. అదేవిధంగా తొలితరం కాంగ్రెస్‌ నాయకులు ‘ప్రాతినిధ్యం లేకపోతే పన్ను కట్టేది లేదు’ అనే అమెరికన్ల నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర కౌన్సిళ్లలో సభ్యుల సంఖ్యను, అనధికార సభ్యుల సంఖ్యను పెంచాలని, ప్రజాస్వామ్య విధానాలు ప్రవేశపెట్టాలని కోరారు. రాజ్యాంగ సంస్కరణల రీత్యా దేశ పాలనలో తమ భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాల అమలును మితవాదులు ఆకాంక్షించారు.

పాలనా సంస్కరణలు: పరిపాలనలో ఉన్నత పరిపాలనా సర్వీసులను భారతీయులకు కేటాయించాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రధానంగా కోరారు. ఐసీఎస్‌ లాంటి పరీక్షలకు మన వాళ్లకు గరిష్ఠ వయసు పెంచమని అడిగారు. ఇంగ్లండ్, ఇండియాల్లో ఏకకాలంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. భారతీయులను పౌర పాలనలో, సైన్యంలో ఉన్నత ఉద్యోగులుగా నియమించాలని విన్నవించారు. ప్రాథమిక విద్యాలయాలను స్థాపించి విద్యాభివృద్ధికి తోడ్పాడాలని, ప్రజారోగ్యం కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. వ్యవసాయ పరపతి బ్యాంకుల స్థాపన ద్వారా రైతులకు రుణసదుపాయం కల్పించి, అన్నదాతలను వడ్డీ వ్యాపారుల కోరల నుంచి తప్పించాలని కోరారు. పోలీస్‌ వ్యవస్థను సంస్కరించాలని, ఆయుధ చట్టం రద్దు చేసి, కార్యనిర్వాహక అధికారాల నుంచి న్యాయాధికారాలు వేరుచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక సంస్కరణలు: దేశంలో పెరుగుతున్న పేదరికానికి, ఆర్థిక వెనుకబాటుతనానికి, కుటీర పరిశ్రమలు నాశనమవడానికి, వ్యవసాయం అభివృద్ధి చెందకపోవడానికి బ్రిటిష్‌ విధానాలే కారణమని మితవాదులు విమర్శించారు. భారతదేశ సంపదను బ్రిటన్‌కు తరలించవద్దని ఆందోళనలు చేశారు. వ్యాపారంలో వివక్షాపూరిత విధానాలు విడనాడాలని, అనుచితమైన పన్నుల అమలును నిలిపేయాలని సూచించారు. పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగావకాశాలు పెంచాలని, ఉప్పుపై పన్ను రద్దు చేయాలని, భూమి శిస్తు తగ్గించాలని కోరారు. మితిమీరిన ప్రభుత్వ నిర్వహణ వ్యయం, సైనిక వ్యయం తగ్గించాలని అభ్యర్థించారు. అటవీ శాఖ అధికారుల వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేశారు. విదేశాల్లోని భారతీయ కూలీల సమస్యల పట్ల కూడా స్పందించారు.

కార్యకలాపాలు: ఏటా మూడు రోజుల పాటు కాంగ్రెస్‌ సమావేశాలు జరిగేవి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేవారు. ఆర్థిక, రాజకీయ పాలనాపరమైన అంశాలపై సమావేశాల్లో చర్చించి తీర్మానాలు చేసేవారు. తర్వాత ఒక బృందం గవర్నర్‌ జనరల్‌ వద్దకు వెళ్లి తమ డిమాండ్లను నెరవేర్చమంటూ అభ్యర్థనా పత్రాన్ని సమర్పిచేది. తమ డిమాండ్ల సాధనకు మితవాదులు ‘ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన’ విధానాలను అవలంబించారు. జాతీయోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి వారు ఆసక్తి చూపలేదు. రాజకీయ హక్కులు, స్వయంపాలన దశలవారీగా సంపాదించాలని ఆశించారు. ఒకేసారి స్వాతంత్య్రం కోసం ఉద్యమించలేదు.

 

విజయాలు

* తొలితరం కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లో తాము ఒక దేశానికి చెందినవారమనే భావన కల్పించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, ప్రజలను ఆకర్షించి, రాజకీయ చైతన్యాన్ని కలిగించారు. రాజకీయ కార్యకలాపాలు, నిర్వహణలో శిక్షణ ఇచ్చారు.

* మధ్యతరగతి మేధావి వర్గానికి చెందిన కాంగ్రెస్‌ వాదులు ప్రజాస్వామ్యం, జాతీయవాదం, స్వయంపాలన లాంటి భావాలను వ్యాప్తి చేశారు.

* కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ తీరుని శాస్త్రీయంగా అధ్యయనం చేసి తమ రచనల్లో తీవ్రంగా విమర్శించారు. దాదాభాయ్‌ నౌరోజీ ‘పావర్టీ-అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో తెల్లవాళ్లు భారతదేశ సంపదను బ్రిటన్‌కు తరలించే విధానాలను శాస్త్రీయంగా నిరూపించాడు. రమేష్‌చంద్ర దత్తా ‘యాన్‌ ఎకనామిక్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా’లో, ఎంజీ రనడే తన వ్యాసాలతో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద ఆర్థికతత్వాన్ని వలసవాద స్వభావాన్ని ప్రజలు గుర్తించే విధంగా ఎండగట్టారు.

* భారతదేశ రాజకీయ ఉద్యమానికి పటిష్ఠమైన పునాది వేశారు. ఆ పునాది పైనే తర్వాతి తరం నాయకులు ఉమ్మడి రాజకీయ, ఆర్థిక కార్యక్రమాలు రూపొందించి గొప్ప జాతీయోద్యమాలను నిర్వహించారు.

* 1892 ఇండియా కౌన్సిళ్ల చట్టాన్ని బ్రిటిషర్లు తీసుకురావడంలో కాంగ్రెస్‌ మితవాదులు ముఖ్యభూమిక పోషించారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. 

 

విమర్శలు: కాంగ్రెస్‌ మితవాదం లక్ష్యాల పరంగా కాకుండా అందుకు అనుసరించిన పద్ధతులు, పనివిధానం వల్ల విమర్శలకు గురైంది. ఏడాదికి ఒకసారి సమావేశాలు జరపడం, ఉపన్యాసాలు ఇవ్వడం, తీర్మానాలు చేయడం బ్రిటిషర్లను ఆశించిన రీతిలో కదిలించలేకపోయింది. మితవాదులు కోరుకున్న ప్రజోపయోగ సంస్కరణలు తీసుకురాలేక పోయారని, చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమైంది. వారు ఎంచుకున్న పోరాట విధానం నిష్ప్రయోజనమైనదని, వారిది ‘రాజకీయ భిక్షాటన’ అనే విమర్శలు ఎదురయ్యాయి. కానీ కాంగ్రెస్‌ ఈ దశలో ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. ప్రజాస్వామ్యం, జాతీయభావాలను ప్రజలకు పరిచయం చేసింది. ఆంగ్లేయులు భారతదేశంలో సాగిస్తున్న ఆర్థిక దోపిడీపై సైద్ధాంతిక గ్రంథాలు రాసి ప్రజలకు తెలియజెప్పింది. భారత స్వాతంత్య్ర పోరాటానికి పరోక్షంగా పటిష్ఠమైన పునాదులు వేసింది.


రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ భారతదేశంలో ఆంగ్లేయుల ఆక్రమణ క్రమం

‣ సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

‣ రాబర్ట్‌ క్లైవ్‌ తర్వాత పరిస్థితులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌